క్రొత్త నిబంధనలో, పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల గురించి మనం పదే పదే వింటూవుంటాము. పాత నిబంధన పుస్తకాలలో ఈ మతపరమైన పార్టీల గురించి మనం ఎప్పుడూ వినలేదు. కారణం ఏమిటంటే, ఈ మతపరమైన విభాగాలు మొదటగా ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో ఏర్పడ్డాయి.

హసిడిమ్: సెల్యూసిడ్ మరియు హస్మోనియన్ కాలంలో ఇశ్రాయేలులో నివసిస్తున్న యూదులను హెలెనైజ్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది పాలకులు యూదులను గ్రీకు సంస్కృతి దాని ఆచారాలను అవలంబించాలని యూదుల మత విశ్వాసాలను అనుసరించవద్దని బలవంతపెట్టారు. ఈ సమయంలో, వారి సాంప్రదాయాలు సంస్కృతికి మరియు మతానికి నమ్మకంగా ఉన్న యూదులలో కొందరు  కలిసికట్టుగా ఉండటం ప్రారంభించారు. వీళ్ళు యూదులను హెలెనైజ్ చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఈ సాంస్కృతిక సంప్రదాయవాద సమూహం హసిడిమ్ (అక్షరాలా, “సెపెరేటెడ్”) అని పిలువబడ్డారు.

హసిడిమ్‌లు దేవుని ధర్మశాస్త్రము మరియు ఇశ్రాయేలు యొక్క సాంస్కృతిక సంప్రదాయాలకు కట్టుబడి వాటిని కాపాడుకోవటం కోసం సెల్యూసిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతూవున్న మకాబీస్‌తో చేరి పవిత్ర యుద్ధంలో పోరాడుతున్నామని నమ్ముతూ పోరాడారు. ఆలయం విదేశీ జోక్యం నుండి విముక్తి పొందిన తర్వాత, వారు రాజకీయ స్వేచ్ఛ కోసం మరింత పోరాడటానికి నిరాకరించారు. జోనాథన్ ప్రధాన యాజకునిగా నియమించబడినప్పుడు, అతడు మళ్లీ హసిడిమ్ మద్దతును పొందగలిగాడు.

హసిడిమ్‌లు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు మరియు సంవత్సరాలుగా అందించబడిన అనేక మతపరమైన సంప్రదాయాలను అనుసరించాలని పట్టుబట్టారు. ఈ విధంగా, వారు పరిసయ్యులకు ముందున్నవారు.

ఒక వ్యక్తి గ్రీకు ఆచారాలలో దేనినైనా స్వీకరించి నమ్మకమైన యూదుడిగా ఉండగలడా లేదా అనే విషయంలో ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో ఇశ్రాయేలు మత పెద్దల మధ్య చీలిక వచ్చింది. ఇది జాన్ హిర్కనస్ పాలనలో జరిగినట్లు తెలుస్తోంది. అప్పటినుండి హాసిడిమ్ పరిసయ్యులుగా , సద్దుకయ్యులుగా మరియు యూదులలో ఇతర పార్టీలుగా చీలిపోయారు. ఈ పార్టీలకు అధికారిక సభ్యత్వ జాబితాలు లేనప్పటికీ, ప్రజలు తమ స్వంత రాజకీయ మరియు మత విశ్వాసాలకు అనుగుణముగా ఉండే పార్టీలకు మద్దతు ఇవ్వటం జరిగింది.

పరిసయ్యులు

ఈ మతశాఖ ఇశ్రాయేలులోని ఇతర మతపరమైన పార్టీలలో అతిపెద్దది అత్యంత ప్రభావవంతమైనది. దీని కారణంగా కొత్త నిబంధనలో మనం ఇతర గుంపుల కంటే పరిసయ్యుల గురించే ఎక్కువగా వింటూవుంటాం. పరిసయ్యుల విశ్వాసం మోషే ధర్మశాస్త్రము మరియు దాని నుండి ఉద్భవించిన అనేక సంప్రదాయాలపై కేంద్రీకృతమై ఉంది. వారు దేవాలయంలో ఆరాధించడం గురించిన అన్ని ఆజ్జాలను పాటించేవారు. అయితే యాజకులలో కొందరు మాత్రమే పరిసయ్యుల పార్టీకి చెందినవారు.

అయితే, ధర్మశాస్త్రం పై ఈ ప్రాధాన్యత కారణంగా, అనేకమంది ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యుల సిద్ధాంతాలకు అనుకూలంగా మారారు. పాత నిబంధనలో, ఈ ధర్మశాస్త్రోపదేశకులను “శాస్త్రులుగా” పిలిచేవారు. వారి ప్రధాన పని పాత నిబంధన కాపీలను తయారు చేయడం. ఇలా చేయడం ద్వారా, వారు పాత నిబంధన గ్రంధాలలో చాలా జ్ఞానవంతులయ్యారు. అందువలన, వారు క్రమంగా ధర్మశాస్త్రోపదేశకులుగా మరియు ధర్మశాస్త్రములో నిపుణులుగా పరిగణించబడ్డారు. కొత్త నిబంధన సమయానికి, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యుల మాదిరిగానే, ధర్మశాస్త్రానికి, పెద్దల సంప్రదాయాలకు గొప్ప రక్షకులుగా మారారు. క్రొత్త నిబంధనలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు యేసు మరియు ఆయన బోధనలను ఐక్యంగా వ్యతిరేకించడాన్ని చూడొచ్చు (మత్తయి12:38).

పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రం మరియు దానికి జోడించబడిన వందలాది సంప్రదాయాలు రెండింటినీ సంపూర్ణంగా పాటిస్తున్నారని నమ్మేవాళ్ళు (వారు లేఖనాలతో పాటు మౌఖిక తోరాను, సీనాయి దగ్గరనుండి వారు జీవించుచున్న కాలము వరకు ఉన్నటువంటి పెద్దల పరంపర్యాచారములను అంగీకరించారు). అనేక సందర్భాల్లో, వారు ధర్మశాస్త్రం యొక్క ప్రతి మాటను పాటిస్తున్నామని అనుకొన్నారు కాని దాని నిజమైన ఉద్దేశాన్ని వారు అర్థం చేసుకోలేదు లేదా అనుసరించలేదు. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో వారి అసమర్థతను సొంత పాపాన్ని చూచుటకు బదులుగా వారు చిన్న చిన్న నియమాలను పాటించడంలో తమ గొప్పతనాన్ని గురించి గర్వపడ్డారు (లూకా 18:10 ff).

దీనిలో ఆచారాలు వారసత్వంగా వచ్చిన యాజకత్వము ద్వారా గుత్తాధిపత్యం చేయబడవు, వయోజన యూదులందరూ వ్యక్తిగతంగా లేదా సామూహికంగా వాటిని పాటించవచ్చు. వీరి నాయకులు పుట్టుకతో నిర్ణయించబడరు కానీ కఠినముగా లేఖన శిక్షణ ద్వారా నిర్ణయించబడ్డారు. పరిసయ్యులు మరియు రబ్బీల పాఠశాలలు ఎంతో కఠినమైనవి పవిత్రమైనవి: వాటిలో తోరాను అధ్యయనం చేయడం మరియు మాస్టర్స్ ప్రవర్తనను అనుకరించడం ద్వారా పవిత్రతను సాధిస్తారు అని శిక్షణ పొందేవాళ్ళు శిక్షకులు నమ్మేవాళ్ళు. అలా చేయడం ద్వారా, వారు పరలోకపు మాదిరికి అనుగుణంగా ఉంటారని , దేవుడు “తన స్వరూపంలో” తోరాను సృష్టించియున్నాడని, సినాయ్ దగ్గర దానిని వారి గురువులకు అప్పగించాడని, గురువులు మరియు శిష్యులు మోషే యొక్క దైవిక బోధనను పాటిస్తే, అప్పుడు వారి సమాజం, పాఠశాల, భూమిపై పరలోకపు పాఠశాలను ప్రతిబింబిస్తుందని, శిష్యుడు మోషేయొక్క నమూనాను అనుసరించి పరలోకపు మాదిరికి అనుగుణముగా ఉంటాడని నమ్మేవాళ్ళు. ధర్మశాస్త్రము ద్వారా దైనందిన జీవితానికి మతాన్ని అనుసంధానించాలనే నిబద్ధతతో రెండవ ఆలయ యుగంలో ఇతర శాఖల కంటే పరిసయ్యులు ఎక్కువ చట్టబద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.

పరిసయ్యులు దైనందిన ప్రపంచాన్ని పవిత్రం చేయడానికి యూదుల ధర్మశాస్త్రాన్ని ప్రాపంచిక కార్యకలాపాలకు వర్తింపజేస్తూ, ఆలయానికి మించి విస్తరించిన జుడాయిజం యొక్క రూపాన్ని కొనసాగించారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అను నిర్గమకాండము 19:3–6 యొక్క విస్తృతమైన మరియు అక్షరార్థమైన వివరణను పరిసయ్యులు గట్టిగా నమ్మేవాళ్ళు. ఇశ్రాయేలీయులందరు యాజకులవలె ఉండాలనే ఆలోచనను పరిసయ్యులు విశ్వసించారు. ఆలయ అర్చకత్వం లేదా ఆలయాన్ని సందర్శించే యూదులు మాత్రమే కాకుండా వారి సాధారణ జీవితంలో యూదులందరూ శుద్ధీకరణకు సంబంధించిన నియమాలు మరియు ఆచారాలను తప్పనిసరిగా పాటించాలని పరిసయ్యులు నమ్మేవాళ్ళు.

పరిసయ్యులు దేవుని ధర్మశాస్త్రము యొక్క కఠినమైన బాహ్య ఆచారాలను పాటించడంలో  ప్రసిద్ధి చెందారు. పాత నిబంధన ప్రకారం, ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి దాని ప్రకారం తన జీవితాంతం జీవించాలి. పరిసయ్యులు ఈ సూచనలను అక్షరాలా పాటించారు. వారు లేఖనాల ముక్కలను తోలు పట్టీలకు కట్టి, ఆ పట్టీలను వారి చేతులకు మరియు ముందరి తలలకు కట్టుకున్నారు. వీటిని రక్షరేకులు అని పిలుస్తారు (మత్తయి 23:5). అదనంగా, పరిసయ్యులు దశమ భాగం (అంటే తమ ఆదాయంలో పదోవంతు ప్రభువుకు ఇవ్వండి) అనే ఆజ్ఞను కఠినంగా పాటించే వారు. వాళ్ళు తమ పెరటి తోట ఉత్పత్తి చేసిన చిన్న చిన్న వాటిని కూడా దశమ భాగంగా ఇచ్చేవారు (మత్తయి 23:23). వారు బాగా అలంకరించబడిన ప్రార్థన శాలువాలు ధరించే వారు. వారికి విందులు ప్రార్థనా మందిరాలలో గౌరవ సీట్లు కేటాయించబడేవి. (మత్తయి 23:6, 7). ధర్మశాస్త్రము పై వారికున్న జ్ఞానం కారణంగా, వారిని “రబ్బీ” లేదా “బోధకుడా” అని పిలిచేవారు. వారు అన్ని శుద్ధికారణాచారము లను పాటించడం గర్వంగా భావించారు (మత్తయి 23:25). పాత నిబంధన ప్రవక్తలకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు (మత్తయి 23:29). వారు విశ్రాంతి దినానికి సంబంధించిన అన్ని నియమాలను పాటించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు (మార్కు 2:23-3:6). అదనంగా, వారు యూదుడు కాని వారితో ఎటువంటి పరిచయాన్ని కలిగి ఉండేవారు కాదు, అలాంటి వ్యక్తులను అన్నివిధాలుగా “అపవిత్రులుగా” లేదా “అన్యజనులుగా” పరిగణించేవారు. ఇతరులను తమ పక్షాన ఉంచుకోవడానికి ప్రయత్నించేవారు.

పరిసయ్యులు వారి స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వారి సంప్రదాయాలను వాడుకోవడంలో మరియు దేవుని ధర్మశాస్త్రానికి వారి స్వంత వివరణలను జోడించడంలో సిద్ధహస్తులు.  ఉదాహరణకు, వారు వివాహం మరియు విడాకుల విషయంలో దేవుని ఉద్దేశాలను ఎలా వక్రీకరించారో (మార్కు 10:1ff) చూపిస్తుంది.

కొన్నిసార్లు వారు లేఖనాలను వక్రీకరించినా లేదా తప్పుగా చదివినా, పరిసయ్యులు తరచుగా బైబిల్ సత్యాలను బోధించారు. వారు బైబిల్ బోధలైన శరీరం యొక్క అంతిమ పునరుత్థానం మరియు నీతిమంతులకు బహుమతులు మరియు దుర్మార్గులకు శిక్షలు అను వాటిని సరిగ్గా నొక్కి చెప్పారు. వారు మెస్సీయ రాకడ కోసం ఎదురు చూశారు. అయితే వారు భూసంబంధమైన మరియు ఆధ్యాత్మిక రాజ్యాన్ని కలిగి ఉండే మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఇశ్రాయేలు  యొక్క భూసంబంధమైన వైభవాన్ని పునరుద్ధరింపబడాలని ఆకాంక్షించారు. ఇది రాబోయే క్రీస్తు మరియు ఆయన శాశ్వత రాజ్యం గురించిన వాగ్దానాల పై నుండి వారి దృష్టిని మరల్చి వేసింది.

యేసు కాలంలోని పరిసయ్యుల సంఖ్య మరియు వారికున్న ప్రజాదరణను గురించి పండితులు విభేదించి నప్పటికి, వారికి సమాజంలోని అన్ని తరగతుల నుండి మద్దతు ఉండేది (ధర్మశాస్త్రోపదేశకులు మరియు యూదు పాలక మండలి సన్హెడ్రిన్ నుండి కూడా). నీకొదేము (యోహాను 3:1-21) మరియు సౌలు (ఫిలిప్పీ 3:2-11) ప్రముఖ పరిసయ్యులైన వీరు ఇరువురూ నిజమైన మెస్సీయయైన క్రీస్తుకు అనుచరులుగా మారారు.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.