ఆదికాండము 3వ అధ్యాయములో వివరించబడియున్న ప్రకారము, మొట్టమొదటి మానవుల పతనము ద్వారా పాపము ఈ లోకములోనికి వచ్చియున్నదని నేను నమ్ముతున్నాను. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. 1యోహాను 3:4 పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము హవ్వలు మొదటిగా పాపము చేసినపుడు వాళ్ళు దేవుని స్వరూపాన్ని కోల్పోయారు. ఈ పతనము ద్వారా వాళ్ళు మాత్రమే కాకుండా అతని సంతానము కూడా అసలైన జ్ఙానాన్ని నీతిని పరిశుద్ధతను పోగొట్టుకొనియున్నారు. అందువలననే మనుష్యులందరు పుట్టుకతోనే పాపులై యున్నారు, పాపములలో మరణిస్తూవున్నారు, సమస్త దుష్టత్వమునకు మొగ్గు చూపుతూవున్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులైయున్నారు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు కారణమయ్యిందని రోమా 5:12,18 మరియు మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, కీర్తనలు 51:5 నేను (ప్రతిఒక్కరు) పాపములో పుట్టినవాడను (సంక్రమింపబడిన పాపముతోనే పుడుతూవున్నామని ఆ సంక్రమింప బడిన) పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెనని కీర్తనకారుడు చెప్తూవున్నాడు. యోహాను 3:6 శరీర మూలముగా జన్మించినది శరీరమును రోమా 8:7,8 ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు.

ప్రజలు స్వాభావికమైన పాపమును బట్టి శరీరానుసారులై శరీర కార్యములను చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమని ఎఫెసీయులకు 2:1-3 చెప్తూవుంది. కాబట్టే మానవులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా లేక వారి సాంస్కృతిక మరియు విజ్ఙానశాస్త్రము యొక్క సహాయముతో, తమ్మునుతాము దేవునితో సమాధానపరచు కొనలేరని తత్ఫలితంగా మరణమును జయించుటకు మరియు నాశనమును తప్పించుకొనుటకు సామర్ధ్యమును కలిగిలేరని నేను నమ్ముతున్నాను.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.