In Restoration creationism or Gap theory who is true, Science or our Logic or God? పునరుద్ధరణ సృష్టివాదం Restoration Creationism లేదా గ్యాప్ సృష్టివాదం Gap Creationism అంటే మీకు తెలుసా?

ఆదికాండము 1:1,2 వచనాలు మధ్య కోట్లసంవత్సరాల గ్యాప్ ఉందా?

పునరుద్ధరణ సృష్టివాదం అంటే ఏమిటి?

ఈ మధ్య కాలములో కొందరు ఆదికాండము 1:1,2 1ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధజలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అను వచనములను బట్టి కన్ఫ్యూజ్ అవుతూ కొన్ని ప్రశ్నలను వేస్తూ, వీటికి భిన్నమైన వ్యాకరణములను చెప్తూవున్నారు.

మొదటి ప్రశ్నగా, కొందరు ఈ రెండు వచనాలు వేరువేరని మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య ఎంతో టైం గ్యాప్ ఉందని ఇవి రెండు, రెండు విభిన్నమైన సృష్టి క్రమములని వీటి మధ్య కోట్లసంవత్సరాల గ్యాప్ ఉందని అంటున్నారు.

రెండవ ప్రశ్నగా, ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు కనుగొంటున్న శిలాజాలు అనేక భౌగోళికయుగాలను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ భౌగోళిక యుగాలు ఆదికాండము 1:1,2 వచనాల మధ్య ఉన్న కాలవ్యవధిలో జరిగి ఉండొచ్చా? ఎందుకు కాకూడదు? ఈ భౌగోళిక యుగాల ముగింపులో సాతాను తిరుగుబాటు చేయగా దేవుడు సాతానును పరలోకం నుండి వెళ్లగొట్టడమే కాకుండా భూమిని కూడా నాశనం చేసి ఉండొచ్చేమో? అందుకేనేమో భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటిగాను ఉంచబడియున్నదేమో? ఈ గ్యాప్ పీరియడ్ ముగిశాక దేవుడు మళ్లీ 6 రోజులలో విశ్వాన్ని సృష్టించి యున్నాడేమో కదా! బహుశా ఈ వచనాలు ఈ విషయాన్నే తెలియజేస్తూవున్నాయేమో? ఆలోచించండి అని ప్రశ్నిస్తారు.

మూడవ ప్రశ్నగా, వాళ్ళు, ద్వితీయోపదేశకాండము 32:4ని కోట్ చేస్తూ, ఆయన కార్యము సంపూర్ణము అని ఈ వచనము తెలియజేస్తూ వుంది కదా. దేవుడు సంపూర్ణుడు కాబట్టి, ఆయన చేసిన ప్రతి పని కూడా సంపూర్ణముగానే ఉంటుంది తప్ప నిరాకారముగా శూన్యముగా ఉండవు. అప్పుడు, ఆదియందు భూమి ఎందుకని నిరాకారముగా శూన్యముగా ఉంది? అని ప్రశ్నిస్తు వారి వ్యాఖ్యానానికి సమర్దనాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూవున్నారు.

నాల్గవ ప్రశ్నగా, యెషయా 45:18లో యెహోవా భూమిని నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు అని ఉంది కదా మరి ఇదేంటో వివరించండి, అని అడుగుతూవుంటారు.

ఐదవ ప్రశ్నగా, 1 యోహాను 1:5ను కోట్ చేస్తూ దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు కదా మరి చీకటి ఎలా వచ్చింది, వివరించండి అని అడుగుతూవుంటారు.

ఆరవ ప్రశ్నగా, మరొకరు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాటలను కోట్ చేస్తూ, నిరాకారముగా శూన్యముగా మారిన భూమిని దేవుని ఆత్మ పునరుద్ధరించుచున్నాడా? నవీకరిస్తూ ఉన్నాడా? వివరించండి అని అడుగుతూ ఉంటారు.

ఈ ప్రశ్నలకు జవాబులను తెలుసుకొందాం:

వాస్తవానికి, ఈ ప్రశ్నలు పునరుద్ధరణ సృష్టివాదం లేదా గ్యాప్ సృష్టివాదానికి సంబంధించినవి. అయితే, ఈ సిధ్ధాంతానికి బైబిల్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఈ ప్రశ్నల గురించి బైబిల్‌లో నిర్దిష్ట సమాచారం కూడా లేదు, అలాంటప్పుడు కొందరు ఈ విధముగా ఆలోచించడానికి కారణాలేంటో తెలుసుకొందాం.

మొదటి ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: (యూదుల హీబ్రూ బైబిల్‌లో) ఆదికాండము 1:1 చివరలో ఒక విరామ చిహ్నము ఉంది. “Disjunctive accent” వలె పనిచేసే ఈ చిన్న గుర్తు పాఠకుడు తదుపరి వచనానికి వెళ్లడానికి ముందు “పాజ్ చేయాలని” అంటే ఆగాలని సూచిస్తుందని కొందరు అనుకోవడమే కాకుండా ఈ గుర్తు మొదటి వచనానికి మరియు రెండవ వచనానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని చెప్తూ ఉందని చెప్పడమే సమస్యకు కారణం. అలాగే 2వ వచన ప్రారంభములో ఉన్న “మరియు” అనే మాటను “బట్” గా తర్జుమా చెయ్యడం కూడా సమస్యకు కారణం. వాస్తవానికి యూదుల హీబ్రూ బైబిల్‌లో ఆదికాండము 1:1 చివరిలో ఉన్న విరామ చిహ్నాన్ని “సోప్ పాస్క్” లేదా “సోప్ పసుక్” అని అంటారు. ఇది గాయకుని కోసం సంజ్ఞామానంగా ఉపయోగించబడిన ఒక విరామచిహ్నం తప్ప పాజ్ ని సూచిస్తున్న గుర్తు కాదు. పాత నిబంధనలో ఇవి వేలసార్లు ఉపయోగించబడ్డాయి.

నిజానికి ఈ గుర్తు వచనము యొక్క ముగింపును సూచిస్తూ ఉంది అంతే. అసలు హీబ్రూ బైబిల్లో మొదట్లో vowel pointing or punctuations చిహ్నాలు లేవండి. సౌలభ్యంగా చదువుకోవడం కోసం ఇవి చాలా కాలం తర్వాత బైబిల్లో జోడించబడ్డాయి. ఈ vowel pointing or punctuations చిహ్నాలను 5వ – 10వ శతాబ్దాల మధ్య యూదులు బైబిల్లో జోడించారు, ప్రతి ఒక్కరూ బైబులును అర్థం చేసుకోవడానికి మరియు బైబులును సరిగ్గా చదవడానికి సహాయపడేలా మార్గనిర్దేశం చేసేందుకు వీళ్ళు వీటిని బైబిల్లో జోడించారు. ఈ vowel pointing or punctuations చిహ్నాలు దేవుని వాక్యం కాదు. కేవలం ఒక సహాయంగా మాత్రమే ఇవి జోడించబడ్డాయని మనం అర్ధం చేసుకోవాలి తప్ప వీటికి అర్ధాలు చెప్పి లేఖనాలను వక్రీకరించకూడదు. లేఖనాలను తప్పుగా అర్ధం చేసుకోకూడదు అనేది ఈ ప్రశ్నకు జవాబు.

2వ ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: దేవుడు “భూమికి పునాదులు వేసినప్పుడు” దేవదూతలు అప్పటికే సృష్టించబడ్డారనే వాదనకు యోబు 38:4-7 మద్దతు ఇస్తుందని కొందరు అనుకుంటారు. యోబు 38:4-7, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్న యెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అను వచనాలలో భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయ ధ్వనులు చేసారని వుంది కదా అంటే ఆదికాండము 2వ వచనానికి ముందే అక్కడ దేవునిచే సృష్టింపబడినవి ఒక్కటైనా ఉంది అన్నది వారి వాదన. అదే సమస్య.

నిజానికి దేవదూతలు ఏ రోజున సృష్టించబడ్డారు? అనే ప్రశ్నకు ఆదికాండము 1వ అధ్యాయం జవాబు ఇవ్వడం లేదు, యోబు 38:7వ వచనం దేవుడు సృష్టి యొక్క 6 రోజులలో ఒకదానిలో, ఆయన దేవదూతలను సృష్టించాడని తెలియజేస్తూ వుంది కాని ఏ రోజున దేవదూతలు సృష్టింపబడియున్నారో మనకు ఖచ్చితంగా తెలియదు. దీని గురించి బైబులు ఏమి చెప్పటం లేదు. బైబులు మాట్లాడని వాటిని గురించి మనం మాట్లాడకూడదు.

3వ ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: కొంతమందికి రెండవ వచనములోని భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అను మాటలలో “ఉండెను” అనే క్రియ సమస్యగా ఉంది. హీబ్రూ బైబిల్లో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అను మాటలు “ది ఎర్త్ బికేం కేయోస్” అని ఉంది. బికేం అనే మాటను కొందరు ఎలా అర్ధం చేసుకుంటారంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను “ఆయెను” “turned” అని తర్జుమా చేస్తారు. ఇంకా స్పష్టముగా చెప్తాను, ఆదికాండము 19:26 వచనాన్ని చూడండి అక్కడ లోతు భార్య పారిపోతూ వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అని ఉంది కదా అక్కడ కూడా బికేం అనే మాట వాడబడింది. లోతు భార్య విషయములో అక్కడ జరిగిన కొన్ని సంగతులను బట్టి ఆమె అలా మారిపోయింది.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించాడు. కాని భూమి నిరాకారముగాను శూన్యముగాను అగుటకు లేదా ఉండుటకు కారణం లోతు భార్య విషయములో జరిగినట్లుగా అక్కడ ఏదో జరిగి ఉండాలి. కాబట్టే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఊహించి బైబులు చెప్పని వాటిపై, మాట్లాడని వాటిపై తర్కముతో జవాబును ఇవ్వటానికి చేసే ప్రయత్నములో లేఖనాలను వక్రీకరిస్తు లేఖనాలను తప్పుగా అర్ధం చేసుకొంటున్నారు, సమస్య అదే.

అలాగే రెండింటి contextలు కూడా వేరండి. ఆదికాండము 1:2లో వాడబడిన “బికేం” అనే హీబ్రూ పదం దేవుడు మొదటిగా సృజించిన పదార్ధము యొక్క మొదటి స్థితిని తెలియజేస్తూ మొదటిగా సృష్టింపబడిన ఆ పదార్ధము దాని లక్షణాలు లేదా సంబంధాలలో (మార్పులకు లోబడి) కొన్ని మార్పులకు గురి కాబడి ఉండెను అని చెప్తూవుంది తప్ప దేవుడు సృష్టించిన మొదటి సృష్టి నిరాకారమైనదిగా మరియు శూన్యంగా మార్చబడిందని చెప్పటం లేదు.

4వ ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: ఆదికాండము 1:1,2 వచనాలు దేవునిచే సృజింపబడిన పదార్థమును గురించి మాట్లాడుతున్నాయి. అలాగే యెషయా 45:18 భూగ్రహమైన ఈ భూమి నివాసయోగ్యముగా ఉండేందుకు సృజింపబడి యున్నదని తెలియజేస్తూ ఉంది. ఆదికాండము 1:1,2; యెషయా 45:18 ఈ రెండు వచనాల contextలు విభిన్నమండి. మనం తప్పుగా అర్ధం చేసుకొంటే ఎలా చెప్పండి.

5వ ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: అలాగే దేవుడు వెలుగైయున్నాడు; ఆయనయందు చీకటి ఎంత మాత్రమును లేదు అనే మాటలకూ దేవునిలో అసంపూర్ణమైనది ఏది లేదని ఆయన స్వభావము యొక్క స్వచ్ఛమైన వైభవాన్ని మసకబార్చేది గాని లేదా ఆయన స్వభావము యొక్క స్వచ్ఛమైన వైభవాన్ని మరుగు చేసేది గాని ఏది కూడా ఆయన యందు లేనే లేదని ఆయన సంపూర్ణముగా పరిపూర్ణుడని చెప్పడమే ఈ వ్యక్తీకరణ యొక్క ఉదేశ్యము తప్ప మరేమి కాదు. లేఖనాలను తప్పుగా అర్ధం చేసుకోవడం వాటిని తప్పుగా తర్జుమా చేయడం తప్పుడు భోధలకు ఆస్కారం కల్పిస్తుంది.

మరి చీకటి ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు, గమనించండి, చీకటి సృష్టింపబడిందని చెప్పబడలేదు. చీకటి స్పేస్ అంత ఉండెనని చెప్పబడింది. దీనిని బట్టి మనకు అర్ధమయ్యింది ఏమిటంటే మొదటి రోజున దేవుడు సృష్టిని సృజించుటకు సృష్టించిన పదార్ధము, ఎనర్జీ, స్పేస్, టైం కొన్ని లక్షణాలను ధర్మాలను కలిగి ఉన్నాయని. స్పేస్ అనేది అన్ని దిక్కులలో విస్తరించి ఉన్న కంటికి కనబడని అనంతమైన పొడవైన దుప్పటిగా చెప్పొచ్చు. స్పేస్ కు కొన్ని ప్రాథమిక లక్షణాలు వున్నాయి, స్పేస్ యొక్క రంగు నలుపు, చీకటి. స్పేస్ ని మనం ఒక సముద్రం అనుకుంటే దాని చివరను కనుక్కోవటం అసాధ్యం. చీకటి అగాధజలము పైన కమ్మియుండెను అనే ఈ మాటలు స్పేస్ అనేది కాంతి లేని సముద్రం వలె అనంతమైన చీకటిలో ఆవరించిన విస్తారమైన అగాధం అని తెలియజేస్తూవుంది. జలము అనేది ఎనర్జీ ని సూచిస్తూ వుంది. సృష్టిలోని ప్రతిదీ దేవుని ఖచ్చితమైన ప్రణాళికలో వ్యవస్థీకృతముగా సృష్టింపబడియున్నది అనే విషయాన్ని మరచిపోకండి. కాబట్టి చీకటితో నాకు ఎలాంటి సమస్య లేదు.

కొందరి సమస్య ఏమిటంటే దేవుడు మొదటి రోజున సృజించిన మేటర్ స్పేస్ ఎనర్జీ టైం వీటి లక్షణాలను వాటి ధర్మాలను అర్ధం చేసుకోలేక ఇబ్బందిపడుతూ ఉండటమే. నిజం చెప్పాలంటే సూపర్ సూపర్ సైంటిస్ట్ అయిన దేవునిని ఆయన చేతి పనులను అర్ధం చేసుకోవడంలో వచ్చిన తిప్పలే ఈ ప్రశ్నలన్నీ.

6వ ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం: దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అనే మాటలను కొందరు ఎలా అర్ధం చేసుకొంటారంటే అప్పటికే నిరాకారముగా శూన్యముగా మారిన భూమిని దేవుని ఆత్మ పునరుద్ధరిస్తూ ఉన్నాడని నవీకరిస్తూ ఉన్నాడనే భావములో అర్ధం చేసుకోవడమే. వాళ్ళు అలా అనుకోవడానికి కారణం కీర్తనలు 104:30 ని అర్థంచేసుకోవడంలో ఇబ్బంది పడటమే. 104:30, “నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచు చున్నావు” అనే వాక్య భాగాన్ని బట్టి వాళ్ళు confuse అవుతూ ఉండొచ్చు.

ఈ వచనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం 104వ కీర్తన యొక్క ముఖ్యాంశాన్ని తెలుసుకోవలసి యున్నాము.  ఒక తరము గతించుచుండగా మరొక తరానికి దేవుడు జీవాన్ని ఇస్తూ ఉన్నాడని, దేవుడే జీవాన్ని ఇచ్చే వాడని జీవాన్ని కాపాడేవాడనేదే 104వ కీర్తన యొక్క ముఖ్యాంశం. ఇప్పుడు మనం ఈ ముఖ్యాంశము యొక్క వెలుగులో అర్ధములో 30వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిధ్ధాం. “నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు” అనే మాటలు దేవుని ఆత్మ ద్వారా సృష్టి యొక్క పని నిరంతరం కొనసాగుతూ ఉందని దేవుని ఆత్మ ఒక తరం గడిచేకొద్దీ దాని స్థానంలో కొత్త తరాన్ని సృష్టించుచు భూతలమును నూతనపరచుచున్నాడని ఈ వచనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది తప్ప అప్పటికే నిరాకారముగా శూన్యముగా మారిన భూమిని దేవుని ఆత్మ నవీకరిస్తూ ఉన్నాడని ఈ వచనము చెప్పటం లేదు. ఇందులో కన్ఫ్యూషన్ ఏమి లేదు.

ముగింపుగా ఈ విశ్వం సుదీర్ఘ పరిణామ ప్రక్రియ ద్వారా గాని లేదా బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా గాని ఉనికిలోకి రాలేదని, బదులుగా, దేవుని పరిపూర్ణ రూపకల్పన ఫలితంగా ఉనికిలోనికి వచ్చియున్నదని దేవుడే తన సృష్టికి ప్రధాన వాస్తు శిల్పియని సృష్టికర్త అని మర్చిపోవద్దు. ఆయన సృష్టించిన వాటికి లక్షణాలు ఉద్దేశాలు ధర్మాలు సమయ పరిమితులు ఉన్నాయి. దేవుడే తన సృష్టికి పునాదులు వేసియున్నాడు దాని రూపురేఖలను నిర్ణయించియున్నాడు. దేవుడే దాని కొలతలను ఏర్పరచాడు మరియు వాటికి సరిహద్దులను, హద్దులను నిర్ణయించియున్నాడు.

అలాగే “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అను మాటలలో హీబ్రూ వెర్బ్ కున్న ప్రాముఖ్యతను ప్రత్యేకతను గురించి తెలుసుకొండి. 1. దేవుని కార్యకలాపానికి (దేవుని చేతిపనులకు) మాత్రమే ఈ వెర్బ్ ఉపయోగించ బడింది మరియు 2. ఈ వెర్బ్ ఎల్లప్పుడూ అసాధారణమైన, పూర్తిగా ప్రత్యేకమైన దాని యొక్క మూలాన్ని వ్యక్తపరుస్తూ దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నప్పుడు, పరిపూర్ణమైన శూన్యములోనుండి దేవునిచేత భూమ్యాకాశములు అంటే (మేటర్ టైం స్పేస్ ఎనర్జీ) సృష్టింపబడియుండుటను ఉనికిలోనికి వచ్చియుండుటను, దేవుడు ఒక్కడే శాశ్వతుడని; ఎవరూ, ఏదీ శాశ్వతం కాదని, మూలకాలు, మన విశ్వం ఏర్పడిన పదార్థాలు ఏవి శాశ్వతమైనవి కావని దేవుడు ఆదేశించినప్పుడే అవి ఉనికిలోకి వచ్చాయని ఈ వెర్బ్ చాల స్పష్టముగా తెలియజేస్తూవుంది.

అంతేకాదండి “భూమ్యాకాశములు”అనే వ్యక్తీకరణ విశ్వాన్ని దాని ప్రారంభ స్థితిలో సూచిస్తూ ఉంది. దేవుడు తన సంకల్ప చర్య ద్వారా, మేటర్ ఎనర్జీ స్పేస్ టైంతో సహా మనకు తెలిసినట్లుగా విశ్వాన్ని రూపొందించే అన్ని భాగాలను అంటే ఒక ఇంటిని నిర్మించేవాడు ఇంటిని నిర్మించడానికి ముందు నిర్మాణ సామగ్రిని ఒక స్థలంలో సమీకరించినట్లుగా ముడి పదార్థాలన్నింటినీ దేవుడు మొదటి రోజున సృష్టించాడని ఈ వచనము తెలియజేస్తూవుంది. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అను ఈ మాటలను మనతో చెప్పుచున్నది, దేవుడే. అంటే దేవుడే తన సృష్టిని గురించి మనతో చెప్తూవున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవరు నిజం సైన్స్ లేక మన తర్కమా లేక దేవుడా ఆలోచించండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.