అపొస్తులుడైన పౌలు యొక్క 13 పత్రికలలో 4 మాత్రమే వ్యక్తులకు ఉద్దేశించబడ్డాయి (1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలేమోను). కాని ఈ నాలుగింటిలో, పౌలు పత్రికలన్నిటిలోను ఈ పత్రిక అతి చిన్నది. వ్యక్తిగతమైనది కూడా. ఫిలేమోనును మాత్రమే ఉద్దేశిస్తూ వ్రాయబడింది. ఈ లేఖలో ఫిలేమోను ఇంట్లో సంఘముగా కలుసుకునే విశ్వాసులందరికి గ్రీటింగ్స్ మాత్రమే చెప్పబడ్డాయి తప్ప చర్చికి సంబంధించిన ఇతర సాధారణ సూచనలు గాని లేదా సలహాలు గాని లేవు. పారిపోయిన బానిసను పౌలు రోమ్ నుండి కొలస్సికి తిరిగి పంపిస్తూ ఒనేసిమును ఒక స్నేహితునిగా విశ్వాసిగా చేర్చుకోమని పౌలు ఫిలొమోనుకు లేఖను రాస్తున్నాడు, అదే ఈ పత్రిక. ఈ పత్రిక యొక్క వ్యక్తిగత స్వభావమే దాని ప్రత్యేకత. క్రైస్తవులు అంతగా పట్టించుకోని ఈ పత్రిక కూడా దేవుని ప్రేరేపిత వాక్యమే. నిజానికి, ఈ 25 వచనాల పత్రికను చదివిన ఎవరైనా ఇంప్రెస్స్ అవుతారు మరియు కదిలింపబడతారు. ఈ లేఖ చిన్నదే కావొచ్చు కాని దీనిని శ్రద్ధగా చదవాల్సిన అర్హతను కలిగి వుంది.
ఫిలేమోను మరియు కొలొస్సయులకు వ్రాసిన పత్రికలు ఒకే సమయంలో వ్రాయబడ్డాయి ఒకే దూతతో ఒకే గమ్యస్థానానికి పంపబడ్డాయి. ఈ లేఖలోని వ్యక్తుల ప్రస్తావన కొలస్సి పత్రికలో కూడా కనిపిస్తుంది (కొలస్సి 4:7-9).
ఫిలేమోను గురించి మనకు కొంచెమే తెలుసు. పౌలు అతన్ని “ప్రియుడును జతపనివాడు” అని సంబోధించాడు (వచనం 1). ఫిలేమోను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పౌలు ద్వారా క్రైస్తవత్వములోనికి మార్చబడ్డాడు. ఫిలేమోను ఎఫెసులో అపొస్తలుడి నుండి వ్యక్తిగత ఉపదేశాన్ని పొంది ఉండవచ్చు (పౌలు మూడవ మిషనరీ జర్నీ లో) లేదా కొలస్సిలో సంఘాన్ని స్థాపించిన పౌలు శిష్యుడైన ఎపఫ్రాస్ (Epaphras) పరిచర్య ద్వారా కొలస్సిలో విశ్వాసములోనికి వచ్చిన వారిలో ఒకడు అయ్యుండొచ్చు. ఈ ఫిలేమోను కొలస్సి సంఘంలో చాలా ఆక్టివ్ మెంబెర్ గా ఉన్నాడు. సంపన్నుడైన ఫిలేమోను ఆరాధన కొరకు తన ఇంటిని ఇచ్చాడు. అతడు తన తోటి క్రైస్తవుల మధ్య ఉదారమైన ప్రేమగల వానిగా, ఆతిథ్యం ఇచ్చే విశ్వాసిగా మరియు ప్రభువు కోసం ఆయన చర్చి కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు.
ఫిలేమోనుకు పౌలు వ్రాసిన గ్రీటింగ్స్ లో ఫిలేమోను భార్యగా భావించబడే అప్ఫియ మరియు బహుశా ఫిలేమోను కుమారుడైన అర్ఖిప్పు పేర్లు కూడా ఉన్నాయి. ఈ పత్రిక వ్రాయబడిన సమయంలో కొలస్సి సంఘానికి పాస్టర్‌గా పనిచేస్తున్న అర్ఖిప్పు మరియు పత్రిక యొక్క అంశమైన ఒనేసిము ఇద్దరూ, కొలస్సి 4వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డారు. ఫిలేమోను గురించి మనకు తెలిసిన ప్రతిదీ ఈ పత్రికలోనే తెలుపబడి యున్నది.
పౌలు ఫిలేమోనుకు వ్యక్తిగతముగా లేఖ రాయడానికి కారణం ఒనేసిము అనే తన క్రైస్తవ స్నేహితుడి తరపున మధ్యవర్తిత్వం చేస్తూ ఈ లేఖను వ్రాసాడు. ఒనేసిము అను పేరునకు “సహాయకరమైన/ ప్రయోజనం” అని అర్ధం. గతంలో ఫిలేమోను ఇంటిలో ఒనేసిము బానిసగా ఉండేవాడు.
కొత్త నిబంధనలో, బానిస అనే గ్రీకు పదానికి చాలా విస్తృతమైన అర్ధం ఉంది. రోమన్ ప్రపంచంలో, బానిసలు వివిధ స్థానాల్లో (కూలీల నుండి వంట వరకు, క్షౌరశాల నుండి ప్రసూతి వైద్యుడి వరకు) సేవ చేయుటకు ఉపయోగించుకోబడ్డారు. రోమన్ బానిసలు బాధ్యతలనే కాదు ఆ బాధ్యతలను నిర్వర్తించుటకు తరచుగా అధికారాన్ని కూడా కలిగియుండేవాళ్లు. రోమన్ ప్రపంచంలో బానిసత్వం ఏ ప్రత్యేక జాతి అణచివేతకో సంబంధించినది కాదు. బానిసలు చాలా తరచుగా విదేశీ భూముల నుండి తీసుకున్న యుద్ధ ఖైదీలు లేదా రుణాన్ని తిరిగి చెల్లించడానికి వారి కుటుంబాలు విక్రయించిన రోమన్లు కాని వ్యక్తులు. సాధారణ రోమన్ బానిసలు 30 సంవత్సరాల వయస్సులో విడుదల చేయబడతారు. ఇది విడుదలయ్యే సాధారణ వయస్సు. వారి యజమానికి సేవలో ఉన్నప్పుడు, బానిసలు వేతనాలు సంపాదించవచ్చు, ఆస్తిని కొనుగోలు చేయొచ్చు మరియు అమ్మొచ్చు, ఒప్పందాలలోకి ప్రవేశించొచ్చు మరియు బానిసలను స్వంతం చేసుకోవచ్చు. అయితే తరచుగా, రోమన్లు కాని వ్యక్తులు అప్పులు చెల్లించడానికి లేదా రోమన్ పౌరసత్వాన్ని పొందేందుకు తమ్మును తాము బానిసలుగా అమ్ముకొనేవారు. పౌలు, తిమోతికి వ్రాసిన తన మొదటి పత్రికలో, “కిడ్నాప్” చేసిన వ్యక్తులను బానిసలుగా విక్రయించడాన్ని (మనుష్య చోరులను) ఖండించాడు (1తిమోతి 1:10).
ఈ లేఖలో బానిస ఒనేసిముకు తన యజమాని డబ్బును చూసే బాధ్యత అప్పగింపబడిన ఉన్నత స్థాయి వ్యక్తిగత సేవకుడిగా కనిపిస్తాడు. అయితే ఒనేసిము తన యజమాని నుండి డబ్బును దొంగిలించి ఆ డబ్బుతో పారిపోయాడు. తప్పించుకున్న అనేకమంది బానిసలు చేసినట్లుగానే, ఒనేసిము కూడా రోమ్‌కు వెళ్లాడు. అక్కడ, దైవిక జోక్యంతో, అపొస్తలుడైన పౌలుతో పరిచయం ఏర్పడింది. పౌలు, ఇంపీరియల్ కోర్టుకు అప్పీల్ చేసుకొని ఫలితం కోసం ఎదురుచూస్తూ, నగరంలో గృహనిర్బంధంలో ఉన్నాడు. అపొస్తలుడు, గృహనిర్బంధంలో ఉన్నప్పుడు, “తన వద్దకు వచ్చిన వారందరినీ అతడు స్వాగతించాడు”, అపొస్తలుల కార్యములు 28: 30,31, ఈ బానిసను కూడా స్వాగతించాడు. అతడు ఒనేసిముకు సువార్తను బోధించాడు. ఒనేసిము క్రైస్తవుడు అయ్యాడు. పౌలు ఒనేసిముల మధ్య ఒక వ్యక్తిగత బంధం ఏర్పడింది. కాబట్టే 10వ వచనంలో పౌలు “నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము” అని అతనిని గురించి చెప్తున్నాడు. ఒనేసిము యొక్క నూతనమైన విశ్వాసం మరియు అపొస్తలుని పట్ల రాజభక్తి అతని చర్యలలో త్వరగా స్పష్టమైంది. గతంలో ఒనేసిము నిష్‌ప్రయోజనమైన వాడుగా ఉన్నా ఇప్పుడు అతడు తన పేరుకు అనుగుణంగా ప్రయోజనకరమైన వాడుగా జీవించడం ప్రారంభించాడు. రోమ్‌లో ఖైదు చేయబడిన అపొస్తలునికి “కాళ్ళు” వలె అపొస్తలుని పట్ల కృతజ్ఞతతో, అంకితభావంతో చేసిన సేవ ద్వారా, ఒనేసిము పౌలుకు ప్రియమైన వాడయ్యాడు.
పౌలు నిస్సందేహంగా కొత్తగా ప్రయోజనాకారియైన ఒనేసిమును రోమ్‌లో తనతో ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టే, నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతనిని ఉంచుకొన వలెనని యుంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతి లేక యేమియు చేయుటకు నాకిష్టములేదు. పౌలుకు పదవ ఆజ్ఞ మరియు దాని అర్థమును గురించి బాగా తెలుసు (నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు). అతడు సమాజంలోని అన్ని సంబంధాలను గౌరవించాడు కాబట్టే అపొస్తలుడు తన నిర్ణయం కరెక్ట్ కాదని భావించాడు.
ఒనేసిమును స్వతంత్రునిగా చేయుమని పౌలు ఫిలేమోనుకు ఆజ్ఞాపించలేదు లేదా ఫిలేమోనును వేడు కోలేదు. సువార్త యొక్క ఉద్దేశ్యం సామాజిక క్రమాన్ని మార్చడం కాదు, మానవ హృదయాలను మార్చడం. యజమానులు మరియు బానిసలు ఇద్దరి హృదయాలలోని సువార్త బానిసత్వం యొక్క దుర్వినియోగాన్ని తొలగిస్తుందని, బానిసలు మరియు యజమానులకు ఒకరి పట్ల మరొకరికి క్రొత్తగా గౌరవాన్ని శ్రద్దాసక్తులను కలిగిస్తుందని పౌలు నమ్మకంగా ఉన్నాడు. బానిసలను పట్టుకునే వారిని బట్టి ఒనేసిము ఇబ్బంది పడకుండా పౌలు ఒనేసిముతో పాటు తుకికును కొలొస్సి కి పంపాలని నిర్ణయించుకొని (కొలొస్స 4:7-9; ఫిలేమోనుకు 12) ఇరువురిని ఫిలేమోను దగ్గరకు తిరిగి పంపించాడు. (తుకికు రోమ్‌లో పౌలుతో పాటు ఉన్నాడు. అక్కడ నుండి అపొస్తలుడు అతన్ని ఎఫెసుకు పంపాడు, బహుశా అక్కడ చర్చిని నిర్మించడం మరియు ప్రోత్సహించడం కోసం. కొత్త నిబంధనలో, తుకికు ఐదుసార్లు ప్రస్తావించబడ్డాడు (అపొ.కార్య. 20:4; ఎఫెసి 6:21-22; కొలొస్సి 4:7; తీతు 3:12; 2 తిమోతి 4:12). ఒనేసిము పౌలు మరొక సహోద్యోగియైన తుకికు రక్షణలో ఇష్టపూర్వకంగా తన యజమానుని దగ్గరకు తిరిగి వెళ్ళాడు.
ఆ కాలములో పారిపోయిన బానిస తిరిగి వస్తే యజమానుడు ఏవిధముగా ప్రవర్తించవొచ్చు? రోమన్ చట్టం ప్రకారం, పారిపోయిన బానిసకు తీవ్రమైన శిక్షను, మరణాన్ని కూడా విధించే హక్కు యజమానికి ఉంది. కాబట్టే పౌలు తుకికు, ఒనేసిము ద్వారా ఫిలేమోనుకు వ్యక్తిగత లేఖ పంపాడు. ఈ లేఖే ఫిలేమోనుకు రాసిన లేఖగా మనకు తెలుసు. ఈ లేఖలో అపొస్తలుడు యుక్తమైన దానినిగూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని ఒనేసిము తరపున ఫిలేమోనుతో మధ్యవర్తిత్వం చేస్తూ ఒనేసిము విషయములో కఠినంగా క్రూరత్వంతో వ్యవహరించవద్దని క్షమించుమని అతన్ని వేడుకున్నాడు. అపొస్తలుడు ఫిలేమోనుకు విజ్ఞప్తిని చేస్తూ, ఒనేసిమును నిష్‌ప్రయోజనమైన పారిపోయిన బానిసగా కాకుండా నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అని చెప్తూ, ఒనేసిము ఇక కేవలం బానిస కాదని అతడిక మీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను ఉన్నాడని, ఒనేసిము నమ్మకద్రోహం కారణంగా ఫిలేమోనుకు అతడు ఏదైనా నష్టాన్ని కలుగజేసిన యెడల, ఒకవేళ అతడు నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము అది నేనే తీర్తునని చెప్పటం గొప్ప విషయం. ఫిలేమోనే పౌలుకు అతడి ఆత్మవిషయములో ఋణపడియున్నాడని గుర్తుచేయడం అతడు పౌలు పరిచర్య ద్వారా క్రైస్తవుడిగా మారాడని తెలియజేస్తూ వున్నాయి.
అపొస్తలుని మాటలను బట్టి పౌలు ఫిలేమోనుల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మనం గుర్తించగలం. ఫిలేమోను అపొస్తలుని అభ్యర్థనను గౌరవించడం, పశ్చాత్తాపపడి పారిపోయిన ఒనేసిమును క్షమించడం అతనిని తిరిగి స్వాగతించడం కంటే తక్కువ ఏదైనా చేస్తాడని ఎవరూ ఊహించలేరు. ఈ లేఖనం ఇప్పటికీ ఉనికిలో ఉన్నదంటే అతడు పౌలు చెప్పిన దానికంటె ఎక్కువగానే చేశాడని అర్ధం.
ఈ చిన్న పత్రికలో గొప్ప సిద్ధాంతాలు ఏవీ లేవు. ఈ చిన్న పత్రికలోని 25 వచనాలు మనకు కొన్ని విలువైన ఆధ్యాత్మిక పాఠాలను అందిస్తున్నాయి. ఈ లేఖలో పౌలు యొక్క ఉద్దేశ్యము: సయోధ్య మరియు క్రైస్తవ ప్రేమ, క్షమాపణ. లక్ష్యం: క్రీస్తులోని తన సోదరుడితో (తన భూసంబంధమైన యజమానియైన వానితో) సరైన సంబంధానికి బానిసను పునరుద్ధరించడం.
ఒనేసిము కోసం పౌలు చేసిన విజ్ఞప్తి ఒక నమూనా క్రైస్తవ మధ్యవర్తిత్వం. అలాగే, ఇది మన కోసం క్రీస్తు మధ్యవర్తిత్వానికి అద్దం పడుతుంది. “మనం క్రీస్తు ఒనేసిములం” అని లూథర్ వ్యాఖ్యానించాడు, “మన సయోధ్య క్రీస్తు ద్వారా పునరుద్ధరించ బడింది, ఆయన తన హక్కులను వదులుకోవడం ద్వారా, తన కోపాన్ని పక్కన పెట్టమని తండ్రిని బలవంతం చేశాడు”. ఈ పత్రిక క్రైస్తవ వ్యూహానికి అద్భుతమైన ఉదాహరణ. దీని స్వరం మరియు నిర్మాణం ఫిలేమోను ఉదార స్వభావాన్ని ప్రోత్సహించడానికి మరియు అతని హృదయాన్ని తాకడానికి బాగా సరిపోతాయి. క్రైస్తవులు ఒకరితో ఒకరు వ్యవహరించే టప్పుడు మరియు వేరొకరిని గురించి విజ్జాపన చేస్తున్నప్పుడు అపొస్తలుడి మాదిరిని అనుకరించడం మంచిది.
ఆ కాలములో క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యం అంతటా వ్యాపిస్తూ, బానిసత్వం యొక్క ప్రాక్టీస్ ని బలహీనపరిచింది.
ఫిలేమోను రచయిత
నాల్గవ శతాబ్దం వరకు ఫిలేమోన్ యొక్క ప్రామాణికత ప్రశ్నించబడలేదు. కొంతమంది వేదాంతవేత్తలు ఫిలేమోనులో సిద్ధాంతపరమైన కంటెంట్ లేకపోవడం బట్టి ఈ లేఖ అపొస్తులుడైన పౌలుది కాకపోవచ్చని వాదించారు. కాని జెరోమ్ మరియు క్రిస్టమ్ వంటి వ్యక్తులు ఈ లేఖను సమర్థించారు. తిరిగి పంతొమ్మిదవ శతాబ్దం వరకు అది మళ్లీ సవాలు చేయబడ లేదు. కొంతమంది రాడికల్ విమర్శకులు కొలొస్సి ఫిలేమోను పత్రికల మధ్య సన్నిహిత సంబంధం కారణంగా ఫిలేమోను యొక్క పౌలిన్ రచయితత్వాన్ని బట్టి కొలొస్సియన్ల ప్రామాణికతను కూడా తిరస్కరించారు (ఉదా. ఒకే వ్యక్తులు రెండు పత్రికలలో పౌలుతో సంబంధం కలిగి ఉన్నారు: cf. కొలొస్సి 4:9,10,12 ,14 తో ఫిలెమోన్ 10,23,24). ఏదిఏమైనా, అధిక సంఖ్యాకుల యొక్క ఏకాభిప్రాయం ప్రకారం, ఫిలెమోనును పౌలు పత్రికగానే గుర్తించడం జరిగింది. ఇది స్థిరమైన సంప్రదాయం ద్వారా అపొస్తలుడైన పౌలు దీని రచయిత అను మద్దతును కలిగియున్నది మరియు అంతర్గతంగా (పౌలు గురించి మూడు కంటే తక్కువ సూచనల ద్వారా (వ.1,9,19) అపొస్తలుడైన పౌలు దీని రచయిత అను మద్దతును కలిగియున్నది.
ఫిలేమోను వ్రాయబడిన కాలము
ఫిలేమోను నాలుగు ప్రిజన్ ఎపిస్టల్స్‌లో ఒకటి. ఇది క్రీ.శ. 60 లేదా 61లో వ్రాయబడింది (పౌలు యొక్క మొదటి రోమన్ ఖైదు సమయంలో) (వ.1,9,10,13,23) కొలొస్సయులకువలె అదే సమయంలో పంపబడింది. ఫిలేమోను 22 విడుదలపై పౌలు యొక్క నమ్మకమైన ఆశను ప్రతిబింబిస్తుంది: అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము.
పత్రిక వ్రాయబడిన స్థలము: రోమ్
ఫిలేమోనులో క్రీస్తు
ఈ లేఖలో విశ్వాసి క్రీస్తులో కనుగొనే క్షమాపణను ఫిలిమోన్‌లోని సారూప్యత ద్వారా అందంగా చిత్రీకరించ బడివుంది. ఒనేసిము గొప్ప నేరానికి పాల్పడ్డాడు (వ 11,18), అతని తరపున మధ్యవర్తిత్వం వహించడానికి పౌలు ప్రేమతో ప్రేరేపించ బడ్డాడు (వ 10-17). పౌలు తన హక్కులను పక్కన పెట్టాడు (వ 8). అతని రుణాన్ని నేనే తీర్తును అనుట ద్వారా ఒనేసిముకు ప్రత్యామ్నాయంగా మారాడు (వ18,19). ఫిలేమోను యొక్క కనికరముతో కూడిన చర్య ద్వారా, ఒనేసిము పునరుద్ధరించ బడతాడు మరియు కొత్త సంబంధంలో ఉంచబడ్డాడు (వ15,16). ఈ సారూప్యతలో, మనం ఒనేసిములాగా ఉన్నాము. ఫిలెమోనుతో పౌలు మధ్యవర్తిత్వం అనేది తండ్రి ముందు క్రీస్తు మధ్యవర్తిత్వానికి సమాంతరంగా ఉంది. ఒనేసిము చట్టం ద్వారా ఖండింపబడియున్నవాడు కాని కనికరము ద్వారా రక్షించబడ్డాడు.
ఫిలేమోనులో ప్రాముఖ్యమైన మాట
బానిసత్వం నుండి క్షమాపణ.
ఫిలేమోనులో ప్రాముఖ్యమైన వచనము
15-17- అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము.
ఫిలేమోను యొక్క అవుట్ లైన్
థీమ్: ఒక మోడల్ మధ్యవర్తిత్వం
I. గ్రీటింగ్ మరియు థాంక్స్ గివింగ్ (1–7)
II. ఒనేసిము కోసం పౌలు విన్నపం (8–21)
III. ఇతర సంబంధిత విషయాలు; వీడ్కోలు మరియు ఆశీర్వాదం (22–25)
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.