ప్రథమ భాగము
గ్రీటింగ్ మరియు థాంక్స్ గివింగ్ (1–7)

1క్రీస్తు యేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును 2మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయు నది. 3మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. 4 ప్రభువైన యేసు ఎడల నీకున్న నమ్మకమును గూర్చియు, సమస్త పరిశుద్ధుల యెడల నీకున్న ప్రేమను గూర్చియు వింటు న్నాను. 5గనుక నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 6క్రీస్తును బట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. 7సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను.

క్రీస్తు యేసు ఖైదీ: పౌలు ఈ లేఖ రాసినప్పుడు రోమ్‌లో గృహనిర్బంధంలో ఉన్నాడు. అపొస్తుల కార్యములు 21-28 అధ్యయాలు పౌలు ఖైదుకు సంబంధించిన సంఘటనలను వివరిస్తూవున్నాయి; సువార్త పట్ల అతని విధేయత అతని అరెస్టుకు దారితీసింది. రోమ్‌లోని ప్రజలతో సువార్తను పంచుకోవడానికి పౌలు విచారణ కోసం వేచి ఉన్న సమయాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొన్నాడు (అపొ. కార్య. 28:30-31). సహోదరుడైన తిమోతియును: అనేక ఇతర క్రైస్తవులు (ఉదా. సౌలు, బర్నబా, అపొ. కార్య. 13:1-5) పౌలు మిషన్ పనిలో వివిధ సమయాల్లో అతనితో పాటు ఉన్నారు, కాని అతని జీవితంలోని చివరి సంవత్సరాల్లో తిమోతి బహుశా పౌలుకు సన్నిహిత సహోద్యోగి అయ్యాడు. ఫిలెమోను: కొలొస్సి లో నివసించిన ఒక క్రైస్తవుడు; అతడు బానిస ఒనేసిమును కలిగి ఉన్నాడు. ఫిలెమోన్ తన ఇంటిలో స్థానిక సంఘాన్ని నిర్వహించడం ద్వారా (2) చర్చి మరియు దాని పరిచర్యలకు మద్దతు ఇచ్చాడు. పౌలు ఫిలేమోనును “మా ప్రియుడును జతపనివాడు” అని పిలుస్తున్నాడు. ఫిలేమోనును “జతపనివాడు” అని పిలవడం ద్వారా పౌలు ఫిలేమోను తన విశ్వాసానికి రుజువునిచ్చిన విధానాన్ని, ప్రత్యేకించి తన తోటి విశ్వాసుల మధ్య మెచ్చుకొంటున్నాడు. చర్చి యొక్క చురుకైన లీడర్‌గా, సువార్త కారణంగా తన సామర్ధ్యము కొలది పని చేస్తున్న ఫిలేమోనును పౌలు గౌరవప్రదంగా సంభోదిస్తూవున్నాడు. ఇప్పటికీ, ఫిలేమోను వంటి విశ్వాసుల ప్రయత్నాలు దృశ్య క్రైస్తవ సంఘ మనుగడకు మరియు అభివృద్ధికి సహాయపడుతూవున్నాయి.

క్రీస్తు యేసు ఖైదీయైన పౌలును అని అపొస్తలుడు తన ఖైదును అవమానంగా కాకుండా గౌరవపు చిహ్నంగా పరిగణిస్తూ వున్నాడు, ఎందుకంటే అది ప్రభువుకు అతను చేసిన నమ్మకమైన సేవ ఫలితంగా వచ్చింది. ఈ ఖైదు, దాని తుది ఫలితం, తన చర్చి ప్రయోజనాల కోసం మొత్తం విశ్వాన్ని పరిపాలించే ప్రభువు చేతిలో ఉన్నాయని అతడు నమ్మకంగా ఉన్నాడు.

ఈ లేఖ యొక్క ప్రత్యేక అభ్యర్థన క్రీస్తుకు ఎంతగానో కట్టుబడి ఉన్న వ్యక్తి నుండి వస్తున్నదని, దాని కోసం అతడు తన స్వేచ్ఛను అప్పగించియున్నాడనే విషయాన్ని ఫిలేమోను తెలుసుకోవలసియున్నాడు.

మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, బహుశా అప్ఫియ ఫిలేమోన్ భార్య కావొచ్చు. తోడి యోధుడైన అర్ఖిప్పు ఫిలేమోను కొడుకు కావొచ్చు. ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి, అను కొలొస్సయులు 4:17ను బట్టి అర్ఖిప్పు పాస్టర్ గారు అని తెలుస్తుంది. కాబట్టే పౌలు అతనిని ఇక్కడ తోడి యోధునిగా సంబోధించాడు. నీ యింట ఉన్న సంఘమునకు ను: మొదటి మరియు రెండవ శతాబ్దాలలో, కొత్త నిబంధన చర్చిలు తరచుగా క్రైస్తవ గృహాలలో కలుసుకొనేవి (అపొ. కార్య. 12:12; 1 కొరింథీ. 16:19; కొలొస్సీ 4:15). వారికి చర్చి భవనాలు లేవు. వాళ్ళు ఆరాధనకు ఇండ్లలో కూడుకొనేవారు. పెద్ద ఇళ్లు ఉన్నవారు ఆరాధనకు తమ ఇండ్లలో స్థలమివ్వగా అక్కడ అందరూ కూడుకొని ఆరాధించుకొనే వారు. జాన్ మార్కు తల్లియైన మరియ యెరూషలేములో ఇలా చేసింది (అపొ. కార్య. 12:12); లిదియా ఫిలిప్పీలో చేసింది. ఫిలేమోనుకు ఒక పెద్ద ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది, దానిని అతడు కొలస్సిలోని విశ్వాసులకు ఆరాధనా స్థలంగా ఇచ్చాడు. ఫిలేమోను ప్రభువు పట్ల మరియు తన తోటి విశ్వాసుల పట్ల తనకున్న ప్రేమను స్పష్టంగా చూపించిన అనేక మార్గాలలో ఇది ఒకటి. పౌలు దీన్ని ఇక్కడ అంగీకరించి, ఫిలేమోను ఇంట్లో ఆరాధన కోసం కలుసుకొంటున్న వారందరికీ శుభములు తెలిపాడు.

ఫిలేమోనును ఉద్దేశిస్తూ ఈ లేఖ వ్రాయబడింది. కాని ఫిలేమోనుకు సన్నిహితంగా ఉన్నవారు కూడా ఈ లేఖను వినాలని పౌలు కోరుకొంటున్నాడు. తద్వారా వారందరూ దేవుణ్ణి సంతోషపెట్టే చర్యను నిర్ణయించుకునేలా ఫిలేమోనును ప్రోత్సహించ గలరు. అట్లే వారందరూ వారి క్షమాపణ స్ఫూర్తిని విస్తృతంగా అమలుచేయాలని కూడా పౌలు కోరుకుంటున్నాడు.

మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. పౌలు పేతురు ఇద్దరూ వారి అన్ని లేఖలలో ఉపయోగించిన ప్రారంభ గ్రీటింగ్ ఇది. ఈ గ్రీటింగ్స్ లో సాంప్రదాయ గ్రీకు పదమైన కృప (χάρις ) మరియు హీబ్రూ పదమైన సమాధానము (εἰρήνη) రెండూ మిళితమైయున్నాయి. వీటిని “కృప” ఏకైక నిజమైన మూలంతో స్పష్టంగా లింక్ చేస్తూవుంది. కృప (అనర్హులైన పాపుల పట్ల దేవుని ప్రేమ; క్రీస్తు రక్షణ కార్యము) మరియు సమాధానము (దేవుడు మాత్రమే అందించగల సంపూర్ణ శ్రేయస్సు మరియు భద్రత) ఆయనతో సమాధానముగా ఉన్నవారికి మాత్రమే ఆయన పూర్తిగా అందిస్తాడు; (రోమా 5:1, ఫిలిప్పీ 4:7; గలతీ 1:3; ఎఫెసీ 1:2; యోహాను 14:27; 20:29). ఈ సత్యాలు పౌలు పేతురు లేఖలలో ప్రతిధ్వనించాయి. ఇవి అపొస్టల్స్ ఆశీర్వాదం వలె రూపొందించబడ్డాయి.

ఫిలేమోనుకును అప్ఫియాకును తోడి యోధుడైన అర్ఖిప్పునకును, అతని యింట ఉన్న కొలొస్సియన్ సంఘమునకును పౌలు దేవుని క్షమించే ప్రేమను ప్రకటించాడు. చర్యలో ఉన్న దేవుని ప్రేమ, పాపుల ప్రపంచానికి క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ మరణం, పాపులకు సమాధానాన్ని కలిగిస్తుందని అతడు వారికి గుర్తు చేస్తున్నాడు. యేసు రక్తం ద్వారా మాత్రమే వారు దేవునితో సమాధానపడతారు. ఈ ప్రాథమిక మరియు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు తండ్రియైన దేవునిలో మరియు ప్రభువైన యేసులో వాటి మూలాన్ని కలిగి ఉన్నాయి. దేవుని కృప మరియు దేవుని క్షమించే ప్రేమ ఫిలేమోను హృదయాన్ని నింపిన సమాధానము పశ్చాత్తాపపడుతున్న ఒనేసిముపై అదే విధమైన క్షమించే ప్రేమను చూపించడానికి ఫిలేమోనును పురికొల్పుతుందని అపొస్తలుడు నమ్మకంగా ఉన్నాడు.

ప్రభువైన యేసుఎడల నీకున్న నమ్మకమును గూర్చియు, సమస్త పరిశుద్ధుల యెడల నీకున్న ప్రేమను గూర్చియు వింటు న్నాను. 5గనుక నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు, ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 6క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. దేవునికి కృతజ్జ్యతా స్తుతులను తెల్పుటకు పౌలుకున్న కారణాలను గమనించండి, క్రైస్తవులందరికీ ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. పౌలు ఫిలేమోనును గురించి ఆలోచించినప్పుడు లేదా తన ప్రార్థనలలో ఫిలేమోనును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, అతడు ఫిలేమోనును గురించి దేవునికి కృతజ్ఞతలు తెలుపకుండా ఉండలేకపోయాడు. గమనిక: చర్చి సభ్యులందరూ తమ పాస్టర్ల హృదయాలలో కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనలను ప్రేరేపించే జీవితాలను గడపడం ప్రశంసించ దగిన విషయం. అలాగే ఒక పాస్టర్ గారు తన చర్చి గురించి ప్రతిరోజూ దేవుని ఎదుట ప్రస్తావించడం ప్రశంసనీయమైన అతని బాధ్యత.

ఈ కృతజ్ఞతతో కూడిన ప్రార్థనకు కారణాన్ని పౌలు పేర్కొంటూ : ప్రభువైన యేసు ఎడలను మరియు పరిశుద్ధుల యెడలను నీకున్న ప్రేమ మరియు విశ్వాసం గురించి వినడం అని చెప్తూవున్నాడు. రోమ్‌లో పౌలుతో పాటు ఉన్న కొలొస్సియన్ సంఘ స్థాపకుడు ఎపఫ్రా, కొత్తగా మారిన ఒనేసిమస్‌తో సహా ఇతరులు ఫిలేమోను ఆదర్శప్రాయమైన విశ్వాసం మరియు క్రైస్తవ జీవితం గురించి పౌలుకు చెప్పి ఉండాలి. క్రీస్తు పట్ల ఫిలేమోను యొక్క నిబద్ధత మరియు ప్రభువు యొక్క ఉద్దేశ్యం కొరకు అతని పరిచర్య, తన తోటి క్రైస్తవుల పట్ల అతని ప్రేమ, కొలొస్సియన్ సంఘం లోపల బయట బాగా ప్రసిద్ధి చెందాయి. అతడు కొలొస్సిలోని క్రైస్తవ సమాజం యొక్క సంక్షేమానికి విలువైన భౌతిక ఆధ్యాత్మిక సహాయ సహకారాలు ఎంతగానో అందించాడు. ఈ ప్రేమ, విశ్వాసం యొక్క ఫలితం సువార్త ద్వారా అతని హృదయంలో ఏర్పడిన విశ్వాసానికి రుజువు. క్రైస్తవుని హృదయంలో నివసించే క్రీస్తు పట్ల అతనికున్న నమ్మకం, అతని జీవితంలో వ్యక్తీకరించబడే ప్రేమ దేవుని ద్వారా అతనిలో విశ్వాసం నింపబడిందని తనకును మరియు ఇతరులకును స్పష్టమైన రుజువు.

6క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. And I pray that the sharing of your faith may become effective for the full knowledge of every good thing that is in us for the sake of Christ. తన కృతజ్ఞతా స్తుతులకు కారణాన్ని చెప్పిన తరువాత, అపొస్తలుడు ఇప్పుడు తన ప్రార్థనలోని సారాంశాన్ని ఇలా పేర్కొన్నాడు: విశ్వాసము నందు మీతోడి మా సహవాసము మనము క్రీస్తునందు కలిగివున్న ప్రతి ఆశీర్వాదమును మరింత సుభోదక మొనర్చును గాక అని నా ప్రార్థన. (రోమన్ క్యాథెలిక్ వెర్షన్).

క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము: అంటే మీలో ఉన్న మంచి ప్రిన్సిపల్స్ మరియు మీ స్వభావంలో ఉన్న ప్రతి దయగల లక్షణం. అంటే, ఇతరులకు మేలు చేయడం ద్వారా క్రీస్తుపై మీ విశ్వాసం యొక్క సరైన బాహ్య వ్యక్తీకరణ. అనుభవపూర్వకముగా ఎరుగుటవలన: మీ హృదయంలో విశ్వాసం యొక్క ఉనికికి సరైన గుర్తింపును ఇతరుల నుండి పొందడం. మరో మాటలో చెప్పాలంటే, మీరు నిజంగా భక్తిపరులని ఇతరులు చూడగలగాలి మరియు మీకు ఎంతవరకు విశ్వాసం ఉందో అర్థం చేసుకోగలగాలి. సమర్థవంతమైన, సజీవ విశ్వాసం మంచిని మెచ్చుకోవడంలో మరియు మంచి క్రియలలో ప్రతిఫలిస్తుంది. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను: కొన్నిసార్లు మాటల ద్వారా మరికొన్నిసార్లు క్రియల ద్వారా, సాక్ష్యమివ్వడం ద్వారా విశ్వాసాన్ని పంచుకుంటాము. పౌలు ఫిలేమోనును ఇంకను ప్రత్యేక కనికరముతో జీవించమని, అతని విశ్వాసానికి సాక్ష్యమిస్తూ జీవించమని (వ. 4) తద్వారా ఇతరులను ప్రేరేపిస్తూ వారు కూడా ఆ విశ్వాసమునందు పాలిభాగస్తులయ్యేలా చేయుమని వేడుకొంటూవున్నాడు.

ఫిలేమోనులో నివసిస్తున్న విశ్వాసాన్ని గురించి, అతనిని గురించి విన్న, ఇతర క్రైస్తవులందరికీ తెలియజేయబడుతూ వుంది. ఈ కమ్యూనికేషన్ యొక్క ప్రభావం వారి పట్ల మంచిగా ఉన్నవన్నింటిని (క్రీస్తును మహిమపరచుట కొరకు వారి చుట్టూవున్న ప్రతి అవకాశాన్ని) అర్థం చేసుకోవడానికి ఉపయోగపడు తుంది లేదా సహాయం చేస్తుంది. క్రీస్తు మహిమపరచబడుట కొరకు దేవుడు సత్క్రియలను అనుగ్రహిస్తాడు. విశ్వాసులందరి హృదయాలలో ఉన్న యేసుక్రీస్తు నందలి విశ్వాసం మంచి చెయ్యడం కోసం మనకు ఇవ్వబడియున్న సామర్ధ్యములను చక్కగా అవగాహన చేసుకోవడం ద్వారా పని చేస్తూ తమలో నివసిస్తూవున్న విశ్వాసానికి బాహ్య రుజువుగా దానిని సంతోషము గా ప్రపంచానికి అందిస్తుంది.

ఫిలేమోను విశ్వాసానికి సంబంధించిన ఈ రుజువుల గురించి అపొస్తలుడు ప్రస్తావించటం ముఖస్తుతి కాదు. ఇది నిజాయితీతో కూడిన ప్రశంస. అది మరొక ప్రయోజనం కొరకు కూడా ఉద్దేశించబడింది. ఫిలేమోను అనేక రీతులలో చూపిస్తూ ఉన్న తన క్రైస్తవ విశ్వాసాన్ని ప్రేమను అపొస్తలుడు మెచ్చుకొంటూ, తన క్రైస్తవ స్నేహితుడిని తన అభ్యర్థన కొరకు సిద్ధం చేస్తూ, ఫిలేమోను తనకు చాలా తీవ్రంగా అన్యాయం చేసిన బానిసను క్షమించి స్వీకరించడం ద్వారా క్రైస్తవ ప్రేమను మునుపెన్నడూ లేనంతగా ముందుకు తీసుకెళ్లాలని వేడుకోవడం.

ఆ గొప్ప అభ్యర్థన కోసం పౌలు ఫిలేమోనును సిద్ధం చేశాడు. ప్రభువు అతని విశ్వాసాన్ని బలపరచడం ద్వారా, ఫిలేమోను ప్రేమను దాని మూలంలో బలపరచాలని మరియు ఆ విశ్వాసాన్ని పంచుకోవడానికి మరియు సాక్ష్యమివ్వడానికి అతనికి వీలు కల్పించాలని కూడా అతడు ప్రార్థిస్తున్నాడు. క్రైస్తవులు క్రీస్తులో సాటిలేని ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్నారు. వారు ఆ సంపదల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకొని, క్రీస్తులో తమకు చెందిన మంచి విషయాలను గుర్తిస్తే, వారు తమ విశ్వాసాన్ని ప్రోత్సహించడంలో, పంచుకోవడంలో మరియు ఇతరుల పట్ల ప్రేమపూర్వకమైన, క్షమించే వైఖరిని అవలంబించడం ద్వారా తమ జీవితాల్లో రక్షకుని ప్రేమను ప్రతిబింబించడంలో మరింత చురుకుగా ఉంటారు. ఫిలేమోను హృదయాన్ని విశ్వాసంతో నింపి, గతంలో ఆ విశ్వాసానికి సంబంధించిన అనేక ఆచరణాత్మక సాక్ష్యాలను అందించడానికి ఫిలేమోనును ఎనేబుల్ చేసిన పరిశుద్ధాత్మ, వాక్యం మరియు సంస్కారములు ద్వారా, ఆధ్యాత్మిక అవగాహనలో ఇంకను పరిణితిని అనుగ్రహించమని, పౌలు ప్రార్థన. అలాంటి ఎదుగుదల, ఫిలేమోను జీవితంలో విశ్వాసం, ప్రేమ యొక్క గొప్ప రుజువులకు దారి తీస్తుంది మరియు పౌలు అతనిని అభ్యర్థించబోతున్న ప్రత్యేక ప్రేమ చర్యను నిర్వహించేలా చేస్తుంది.

అపొస్తలుడు తన ప్రార్థనలో తన కృతజ్ఞతా వైఖరికి మరో కారణం కూడా చెప్తూ : సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను అని చెప్తున్నాడు. విశ్వాసం యొక్క ప్రథమ ఫలానికి ఫిలేమోను కొత్తవాడు కాదు. గతంలో, ఫిలేమోను ప్రేమ తన అలసిపోయిన తోటి విశ్వాసులకు తరచుగా రిఫ్రెష్‌ని ఇచ్చిందని పౌలు చెప్పాడు. అతని ప్రేమ గురించిన నివేదికలు తరచుగా అపొస్తలుని హృదయాన్ని ప్రోత్సాహంతో మరియు సంతోషంతో నింపాయి. ఇప్పుడు పౌలు తన తోటి విశ్వాసులను మరోసారి రిఫ్రెష్ చేయమని మరియు పారిపోయిన దాసునిపై తన పరిణతి చెందిన క్రైస్తవ ప్రేమ యొక్క పూర్తి స్థాయిని అందించడం ద్వారా ఖైదు చేయబడిన అపొస్తలుడి హృదయానికి ఆనందాన్ని ఇమ్మని ప్రభువైన యేసులో తాను నిజమైన సోదరునిగా పరిగణించే వ్యక్తికి విజ్ఞప్తి చెయ్యబోతున్నాడు.

ప్రేరేపిత అపొస్తలుడు తన ప్రత్యేక అభ్యర్థన కోసం ఫిలేమోనును సిద్ధం చేస్తున్నప్పుడు చూపించిన దానికంటే క్రైస్తవ యుక్తికి గొప్ప ఉదాహరణను మనం ఊహించలేము. అపొస్తలుడి మాటలు మనందరికీ రిమైండర్ గా వున్నాయి. క్రైస్తవులుగా మన జీవితాలు కూడా విశ్వాసం మరియు తదనంతర ప్రేమలో నిరంతరం వృద్ధి చెందుతూ ఉండాలి, అది మనం ఒకరితో ఒకరం మరియు మనం మన తోటి మానవులందరితో వ్యవహరించేటప్పుడు ప్రేమలో మరింత గొప్పగా అడుగులు వేయడానికి వీలు కల్పిస్తుంది.

పౌలు తన స్నేహితుడైన ఫిలిమోను యొక్క ప్రేమను బట్టి, విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు తెలిపాడు. స్పష్టంగా, అవి నిజమైనవి ప్రదర్శన కోసం కాదు అని తెలుసుకోవటానికి అతడు అతనిని గురించి అనేకుల ద్వారా చాలా విన్నాడు. ప్రజలు మన జీవితంలో ఏమి చూస్తారు మరియు అది వారిని ఎలా ప్రభావితం చేస్తుందో మనం పరిగణించాలి. దేవుడు మన విశ్వాస జీవితాన్ని క్రీస్తు మహిమకు ప్రభావవంతమైన సాక్షిగా మార్చగలడు. సువార్త ద్వారా, ఆయన ఇప్పటికే మనలో సమర్థవంతం గా పనిచేస్తూవున్నాడు. ప్రభువా, నా చుట్టూ ఉన్నవారిని నేను రిఫ్రెష్ చేసేలా నన్ను నీ సాక్షిగా ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాను, ఆమెన్.

రెండవ భాగం
ఒనేసిము కోసం పౌలు విన్నపం (8–21)

 8-10 కావున యుక్తమైన దానిని గూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగియున్నను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదను కొని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. 11అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైన వాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయెను. 12నా ప్రాణము వంటి వాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను. 13నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొన వలెనని యుంటిని గాని 14నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండ వలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు. 15-16 అతడిక మీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను. 17కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. 18అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము; 19పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయు చున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల? 20అవును సహోదరుడా, ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము. 21నేను చెప్పిన దానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. 

8వ వచనం నుండి అపొస్తలుడు ఈ లేఖ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యాన్ని నేరుగా చర్చించడం ప్రారంభించాడు. ఒనేసిము తరపున ఫిలేమోనుకు అతడు చేసిన విజ్ఞప్తి ఒక నమూనా మధ్యవర్తిత్వం, ఇది కేవలం క్రైస్తవ ప్రేమపై ఆధారపడివుంది. మునుపటి వచనాలలో పౌలు ఫిలేమోనుకు విజ్ఞప్తి చేయడానికి పునాది వేశాడు. ఇప్పుడు అతడు నేరుగా సూటిగా ఆ విజ్ఞప్తిని చేస్తున్నాడు. పౌలు ప్రభువు అపొస్తలుడు. అపొస్తలుడిగా, పౌలు చర్చిలో ప్రత్యేక అధికారం కలిగి ఉన్నాడు. ఒకవేళ అతడు ఆ అధికారాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లయితే, తాను కోరబోయేది చేయమని అతడు ఫిలేమోనును ఆజ్ఞాపించివుండొచ్చు. అయితే, పౌలు అలా ఆజ్ఞాపించడానికి ఇష్టపడలేదు. అతడు ఈ అభ్యర్థనను ఫిలేమోనుపై ఒక బాధ్యతగా లేదా విధిగా ఉంచాలని అనుకోలేదు. ఇది ప్రేమకు సంబంధించిన అంశం కావాలనుకున్నాడు. కాబట్టే అతడు ఫిలేమోను ముందు అపొస్తలుడిగా కాకుండా ఫిలేమోను ప్రేమను ఆకర్షించే వృద్ధుడిగా మరియు యేసుక్రీస్తు ఖైదీగా ఉంచుకొన్నాడు. ఫిలేమోను ఆజ్ఞకు ప్రతిస్పందించడం కంటే పాఠాన్ని నేర్చుకోవాలని మరియు దాని ప్రకారము జీవించాలని పౌలు కోరుకున్నాడు.

నిజానికి, పౌలు వృద్దుడు కాదు. అతడు బహుశా 60 ఏళ్ల వయస్సులో ఉండివుండొచ్చు. మొదటి శతాబ్దంలో ఆయుర్దాయం ఇప్పుడున్నంత గొప్పగా లేదు. పౌలు తన సేవలో సువార్త కోసం అనుభవించిన అనేకమైన బాధలు, కష్టాలు, లేమి కారణంగా వృద్ధుడయ్యాడు. అతడు ఈ మాటలు వ్రాసినప్పుడు కూడా, పౌలు సువార్త కొరకు ఖైదు చేయబడియున్నాడు. ఫిలేమోను అపొస్తలుని ప్రేమించాడు, గౌరవించాడు. ఇతరులపై ప్రేమను చూపించే క్రైస్తవుడిగా, ఫిలేమోను ప్రియమైన అపొస్తలుడి నుండి ప్రేమ కోసం వచ్చిన ప్రత్యేక విజ్ఞప్తిని తిరస్కరించడం నిజంగా చాల చాల కష్టం.

21వ శతాబ్దపు క్రైస్తవులమైన మనం అపొస్తలుడు చేసిన విజ్ఞప్తి విధానం నుండి చాలా నేర్చుకోవచ్చు. విజ్ఞప్తుల కంటే డిమాండ్లు ఎక్కువగా ఉండే సమాజంలో మనం జీవిస్తున్నాం. దృఢ నిశ్చయం, వ్యూహం కాదు, కాని ఈ రోజు ప్రజలను జీవితంలో ముందుకు తీసుకు వెళ్ళేది అదే అని మనం చెప్తున్నాం. ఇక్కడ అపొస్తలుడు మనకు ఒక మంచి మార్గాన్ని చూపించాడు. భూమిపై అత్యంత శక్తివంతమైన ప్రేరేపక శక్తి భయపెట్టడం లేదా బెదిరించడం లేదా ఒకరి స్వంత హక్కులుగా భావించే వాటిని నొక్కి చెప్పడం కాదు, కాని ప్రేమే. ఇది నిజం, క్రైస్తవులలో ఇది మరింత నిజం. మన కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రేమలో క్రైస్తవుల ప్రేమ ప్రేరణను, ఉదాహరణను కనుగొంటుంది. ఆ ప్రేమ ఆధారంగా, యేసు నిరంతరం తండ్రికి మన కొరకు విజ్ఞాపన చేస్తూవున్నాడు. అత్యంత ప్రభావవంతమైన విజ్ఞప్తులు, క్రైస్తవుల నుండి క్రైస్తవేతరుల వరకు, ఈ ప్రేమపైనే ఆధారపడి వున్నాయి.

పౌలు తన మాటలను చాలా జాగ్రత్తగా ఎంచుకొన్నాడు. నమ్మకమైన మధ్యవర్తిగా, అతడు ఈ అభ్యర్థనను చేస్తున్నప్పుడు అతడు ఎవరి కోసం వేడుకుంటున్నాడో, ఎవరిని వేడుకుంటున్నాడో వారిరువురి మధ్యన తనను తాను ఉంచుకొంటూ, వాత్సల్యంతో, చాకచక్యంతో, పారిపోయిన దాసుణ్ణి “నా కుమారుడు” అని పిలుస్తూ, “నా బంధకములలో నేను కనిన నా కుమారుడు” అని అతనిని గురించి వివరణనిస్తూ పౌలు నేరుగా ఫిలేమోను ముందు ఒనేసిము విషయాన్ని తీసుకు వస్తున్నాడు. అట్లే తనను విశ్వాసానికి నడిపించిన వ్యక్తి (వ.19) సువార్త కారణంగా నిష్కారణముగా నిర్బంధించబడియుండ టాన్ని బట్టి ఫిలేమోను బాధపడటమే కాకుండా అతడు క్రీస్తులో తన కొత్త సోదరుడైన ఒనేసిమును (వ.16) బానిసత్వంలో ఉంచడం సరియైన విషయమా కదా అనే విషయాన్ని ఆలోచించుకోవడానికి పౌలు ముమ్మారు ఖైదు/బంధకము (1, 8-10,13) అనే మాటను వాడాడు.

ఒనేసిము, అను పేరుకు “లాభదాయకం” లేదా “ఉపయోగకరమైనది” అని అర్థం. మునుపు, ఒనేసిము తన పేరుకు తగ్గట్లుగా లేడు. అతడు పారిపోయిన వ్యక్తి, దొంగ, ముఖ్యంగా ఫిలేమోనుకు లాభదాయకం కాదు. బహుశా ఫిలేమోను ఒనేసిము అనే పేరును వినగానే క్రుంగిపోయి ఉండొచ్చు. అయితే పౌలు నేర్పుగా ఒనేసిము పేరుకున్న అర్ధాన్ని ఉపయోగించి, అతని హృదయంలో, జీవితంలో ప్రభువు తీసుకువచ్చిన అద్భుతమైన మార్పును గురించి చెప్తూ, అతడు మునుపు నీకు నిష్‌ప్రయో జనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడయ్యాడు. ఫిలేమోను నీవు అతనిని స్వీకరించు అతడు నీకు కూడా ఉపయోగకరంగా ఉంటాడు అని చెప్తూ, పౌలు తనకు ఒనేసిముకు మధ్య పెరిగిన లోతైన బంధాన్ని వివరిస్తూ, “నేను నా ప్రాణమైన అతనిని —నీ దగ్గరకు తిరిగి పంపుతున్నాను”, మీ ఇద్దరి మధ్య కూడా అలాంటి ఆప్యాయత త్వరగా పెరుగుతుందని నేను ఆశపడుతున్నానని హామీనిస్తూ వున్నాడు.

పౌలు ఒనేసిమును ఫిలేమోను దగ్గరకు తిరిగి పంపుతున్నాడు. ఒనేసిము తాను దొంగతనము చేసి పారిపోయిన యజమాని దగ్గరకు ఇష్టపూర్వకంగా తిరిగి వస్తున్నాడు. ఇది సరైన క్రైస్తవ చర్య అని ఒప్పింపబడ్డాడు. దయ చూపించే అవకాశాన్ని ఫిలెమోను గుర్తించకపోతే, ఒనేసిము బానిసగా తిరిగి సేవలోకి వెళ్తాడు. పారిపోవడం తప్పు కాబట్టి శిక్షను ఎదుర్కొనేందుకు తిరిగి రావడం క్రైస్తవుడిగా అతని విశ్వసనీయతను మరియు సాక్ష్యాన్ని బలపరుస్తూవుంది. ఒనేసిము క్రైస్తవుడు అయ్యిన తరువాత ఖైదు చేయబడియున్న అపొస్తలునికి నమ్మకమైన దూతగా, స్నేహితునిగా, వ్యక్తిగత సేవకునిగా మారిపోయాడు. ఒనేసిము నమ్మకత్వము పౌలును ఎంతగానో ఆకట్టుకొంది. ఒనేసిమును తనతో ఉంచుకోవాలనే ఆలోచన పౌలుకు వచ్చింది. పౌలు ఒనేసిమును తన దగ్గరే ఉంచుకొని ఉండొచ్చు.

కాని నీ ఉపకారము బలవంతముచేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయు టకు నాకిష్టము లేదు. అపొస్తలుడు ఖైదులో ఉన్న సమయంలో అతనికి సహాయపడటానికి ఏదైనా చెయ్యాలని ఫిలేమోను అనుకొన్నాడు కాని అతడు పౌలుకు ఎంతో దూరములో ఉండియుండుటను బట్టి ఏమి చెయ్యలేక పోయాడు. రోమ్‌లో పౌలుకు మద్దతు ఇవ్వడానికి ఫిలెమోను అక్కడ ఉండలేడు. కాబట్టి పౌలు ఒనేసిము విషయములో ఫిలేమోను పై వత్తిడి తెచ్చివుండొచ్చు. కాని బలవంతంగా నిర్ణయము తీసుకొనే పరిస్థితులలో ఫిలేమోనును ఉంచడం పౌలుకు ఇష్టము లేదు. కాబట్టి, పౌలుకు సంబంధించినంత వరకు, అతడు చేయవలసినది ఒక్కటే, అతడు ఒనేసిమును ఫిలేమోను వద్దకు తిరిగి పంపడం. ఒకవేళ ఫిలేమోను ఇంకేదైనా చేయాలనుకుంటే, బహుశా ఒనేసిమును అపొస్తలుడి వద్దకు “అప్పుగా” తిరిగి పంపితే, పౌలు తన చెర నుండి విడుదలయ్యే వరకు, ఆ నిర్ణయం పూర్తిగా ఫిలేమోనుదే అవుతుంది.

ఈ లేఖతో ఒనేసిము తిరిగి వచ్చియున్నందున ఇప్పుడు ఏమి చేయాలో ఫిలెమోను నిర్ణయించుకోవాలి. సత్క్రియలు ఇష్టపూర్వకంగా లేదా స్వచ్ఛంద స్ఫూర్తితో రావాలి. పౌలు ఒనేసిమును ఫిలేమోను వద్దకు తిరిగి పంపినప్పుడు, అతడు ప్రయోజనకరముగాలేని బానిస యొక్క గత ప్రవర్తనను క్షమించే ప్రయత్నం చేయలేదు. అట్లే అతడు ఫిలేమోనును క్షమించి, ఒనేసిమును స్వీకరించమని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఒనేసిము చేసిన తప్పును ప్రభువు ఏ విధముగా అధిగమించాడో మరియు దానిని మంచిగా చేసాడో గమనించమని మాత్రమే అపొస్తలుడు ఫిలేమోనును అడుగుతున్నాడు.

నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను: సువార్త వినడానికి ఒనేసిము తన వద్దకు రావడంలో పౌలు దేవుని హస్తాన్ని చూశాడు మరియు శాశ్వతమైన పరిణామాలను గమనించాడు. ఒనేసిము పౌలుకు పరిచయం అయ్యాడు క్రైస్తవ మతంలోకి మార్చబడ్డాడు. పౌలు తన పరిచర్యకు అంకితమైన క్రైస్తవ స్నేహితుడిని, సహాయకుడిని సంపాదించుకున్నాడు. చివరికి, ఈ మొత్తం వ్యవహారంలో ఫిలేమోనుకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. ఒనేసిము పారిపోయినప్పుడు, ఫిలేమోను ఆ బానిస సేవను కోల్పోయాడు. అతడు కొంతకాలం నష్టపోయాడు. ఇప్పుడు, అతడు ఒనేసిమును తిరిగి పొందినట్లయితే, ఫిలేమోను శాశ్వతంగా క్రొత్తదైన మంచి సంబంధములో అతనిని తిరిగి పొంద గలడు. ఒక క్రైస్తవ బానిసగా, ఒనేసిము ఫిలేమోనుకు మునుపెన్నడూ లేనంత ఆనందంగా సమర్ధవంతంగా సేవ చేస్తాడు. అతడు ఇప్పుడు ఫిలేమోను కోసం తన పనిని ప్రభువు కోసం చేస్తున్నట్లే చేస్తాడు.

శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను: ఒనేసిము బహుశా మానవ కోణంలో ఫిలేమోనుతో సంబంధం కలిగి ఉండకపోవచ్చు, కాని వారు ఇప్పుడు ఈ జీవితంలో (శరీరవిషయములో) మరియు శాశ్వతత్వంలో (ప్రభువు విషయములో) క్రీస్తులో సోదరులు. అదనంగా, ఫిలేమోను మరియు ఒనేసిము వారు ఇంతకు ముందు పంచుకోని విలువైన ఆధ్యాత్మిక బంధాన్ని, ఉమ్మడి విశ్వాసం యొక్క బంధాన్ని ఇప్పుడు పంచుకుంటారు. బానిస మరియు యజమాని యొక్క భౌతిక సంబంధానికి మించి, వారు క్రీస్తులో సోదరులుగా ఆధ్యాత్మిక సంబంధాన్ని పంచుకుంటారు. ఈ దీవెనకరమైన సహవాసం అన్ని భూసంబంధమైన మరియు సామాజిక అడ్డుగోడలను తొలగిస్తుంది మరియు శాశ్వతత్వం అంతటా కొనసాగుతుంది. అదే సమయంలో, ఇది అన్ని భూసంబంధమైన సంబంధాలను పవిత్రం చేస్తుంది మరియు మంచిగా మారుస్తుంది.

వీటన్నింటి ఆధారంగా, పౌలు “కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చు కొనుము” అను తన విన్నపాన్ని ఇలా క్లుప్తంగా చెప్పాడు. తాను ఫిలేమోను వద్దకు వస్తే, తన స్నేహితుడు సంతోషంతో, ఆతిథ్యంతో అతన్ని స్వీకరిస్తాడని పౌలుకు తెలుసు. విశ్వాసం ద్వారా పౌలు, ఒనేసిము మరియు ఫిలేమోను అందరూ ఇప్పుడు క్రీస్తులో సోదరులు. క్రీస్తులోని ఒక సహోదరుడు, నిజంగా క్రీస్తు ఆత్మను గ్రహించినట్లయితే, పశ్చాత్తాపంతో తన వద్దకు వచ్చి క్షమాపణ కోరిన మరొక సోదరుడిని ప్రేమగా స్వీకరించడంలో ఎలా విఫలమవుతాడు?

ఫిలేమోను ఒనేసిమును ఆప్యాయంగా స్వీకరించకుండా అడ్డుపడే అంశమొకటి వుంది. ఆ అంశాన్ని కూడా పౌలు ప్రస్తావించాడు. అది ఒనేసిము మునుపటి చర్యల ఫలితంగా ఫిలేమోనుకు కలిగిన ఆర్థిక నష్టం. ఒనేసిము రోమ్‌కు వెళ్లే ముందు తన యజమాని నుండి డబ్బు దొంగిలించి పారిపోయాడు. ఒనేసిము పారిపోయిన సమయంలో ఫిలేమోను ఒనేసిము సేవలను కోల్పోయాడు. కాబట్టి వారి మధ్యన ఈ అంశం సమస్యగా ఉండకూడదని పౌలు కోరుకొంటున్నాడు.

ఫిలేమోను అది ఒక సమస్యగా భావించినట్లయితే, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన యెడలను, నీకు ఏమైన ఋణమున్న యెడలను, అది నా లెక్కలో చేర్చుము, అది నేనే తీర్తును అని పౌలు చెప్తున్నాడు. పౌలు ఒనేసిముకు ఆధ్యాత్మిక తండ్రి అయ్యాడు, తండ్రిగా బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు తన ఆఫర్‌పై సీరియస్‌గా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. ఫిలేమోను ఒనేసిమును స్వీకరించడానికి, క్షమించడానికి ఏదీ అడ్డుగా ఉండకూడదని అతడు కోరుకొంటున్నాడు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను: ఇది వాగ్దానంపై సంతకం చేయడంతో సమానం.

అయినను నీ ఆత్మవిషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల? ఫిలేమోను ఇంకా ఒప్పించబడకపోతే, ఇది వాదనను సమర్థిస్తుంది. ఫిలేమోను తన ఆధ్యాత్మిక జీవితానికి పౌలుకు రుణపడి ఉన్నాడు. అపొస్తలుడి నుండి అతడు పొందిన ఆధ్యాత్మిక ప్రయోజనాల యొక్క విలువ, ఒనేసిము ద్వారా కలిగిన భౌతిక నష్టాల కంటే చాలా చాలా ఎక్కువ అని పౌలు యుక్తిగా సూచించాడు.

ఫిలేమోను తన విశ్వాసాన్ని మరియు ప్రేమను అసాధారణ రీతిలో ఆచరణలో పెట్టడం మరియు పౌలు యొక్క ఆత్మీయ కుమారులైన ఈ ఇద్దరు ఒకరితో ఒకరు రాజీపడడాన్ని చూడడం అపొస్తలుడికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని తెస్తుందని పౌలు చెప్తున్నాడు. అపొస్తలుడి అభ్యర్థనకు ఫిలేమోను సానుకూలంగా స్పందిస్తాడని పౌలు నమ్మకంగా ఉన్నాడు-ఫిలేమోను తన ప్రేమ ద్వారా ఎవరికి ఆధ్యాత్మిక సేదదీర్చాడో అది వారి ఆశీర్వాద సర్కిల్‌లోకి పౌలును కూడా తీసుకు వస్తుంది. క్రైస్తవులలో ఎప్పుడూ ఇలాగే ఉండాలి. క్రీస్తులో ప్రేమ మరియు క్షమాపణ గురించిన సువార్త ద్వారా రిఫ్రెష్ అయిన వారు తమ జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రేమపూర్వకమైన, క్షమించే స్ఫూర్తిని చూపించడం ద్వారా ఒకరినొకరు నిరంతరం రిఫ్రెష్ చేసుకుంటారు.

ఒక క్రైస్తవుని నుండి మరొక క్రైస్తవునికి ప్రేమపూర్వకమైన, యుక్తితో కూడిన విజ్ఞప్తిని అది మనకు అందించే అద్భుతమైన ఉదాహరణతో పాటు, ఈ వచనాలలో ఒనేసిము కోసం పౌలు అనర్గళంగా మధ్యవర్తిత్వం చేయడం కూడా మన రక్షకుని ప్రేమపూర్వక మధ్యవర్తిత్వానికి ప్రతిబింబంగా పరిగణించబడుతుంది. ఒనేసిములాగే, పాపులమైన మనమందరం అన్యాయం చేసి మన పరలోక యజమాని నుండి పారిపోయాము. ఆయన ఆగ్రహానికి, ఖండనకు తప్ప మనం దేనికీ అర్హులం కాదు. అయితే, పౌలు ఒనేసిమును కనుగొని రక్షించినట్లే, యేసు మనలను కనుగొని రక్షించాడు. ఆయన తండ్రికిని మరియు మనకును మధ్య నిలిచాడు. మన స్వభావాన్ని స్వీకరించడం ద్వారా మరియు మనకు ప్రత్యామ్నాయంగా మారడం ద్వారా ఆయన మనతో తనను తాను గుర్తించుకున్నాడు. ఆయన చెల్లించడానికి మాత్రమే కాకుండా, దైవిక న్యాయాన్ని సంతృప్తి పరచడానికి సిలువపై మన పాప-ఋణాన్ని చెల్లించాడు. ఇప్పుడు, మన గొప్ప ప్రధాన యాజకునిగా, మనం పాపం చేసినప్పుడల్లా ఆయన ప్రతిరోజూ మన కోసం విజ్ఞాపన చేస్తూవున్నాడు. తండ్రి తన కుమారుని మధ్యవర్తిత్వాన్ని వినడానికి తిరస్కరించలేడు లేదా విశ్వాసం ద్వారా క్రీస్తు సోదరులు మరియు సోదరీమణులు మరియు ఆయన స్వంత పిల్లలైన వారిని క్షమించడానికి నిరాకరించలేడు. “మనము క్రీస్తు ఒనేసిములం, మనం చేర్చుకోబడతాం” అని లూథర్ చెప్పాడు.

పౌలు ఒనేసిము యొక్క స్వేచ్ఛ కోసం ఒక అభ్యర్ధన చేసాడు. దయ, ప్రేమ మరియు స్నేహంపై దీనిని ఆధారం చేసుకున్నాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు మనకొరకు విజ్ఞాపన చేసినట్లే, పౌలు ఒనేసిము కొరకు మధ్యవర్తిత్వం వహించాడు. యేసు మనలను స్నేహితునిగా పిలిచాడు; మన స్నేహితుడు, ఆయన కృప, ప్రేమ మనకు రక్షణను మరియు నిత్యజీవం యొక్క నిరీక్షణను ఇస్తూ ఉంది. ప్రభువా, నా ప్రియమైన స్నేహితునిగా మరియు అవసరాలలో ఉన్న వారికి తోటి సేవకునిగా నా ప్రార్ధన ఆలకించుము. నన్ను ఇతరులకు బహుమతిగా చేయండి. ఆమెన్.

మూడవ భాగం
ఇతర సంబంధిత విషయాలు; వీడ్కోలు మరియు ఆశీర్వాదం (22–25)

22 అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధముచేయుము. 23-24 క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీయైన ఎపఫ్రా, నా జతపనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. 25మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక. అమేన్.

నేను చెప్పిన దానికంటె నీవు ఎక్కువగా చేతువని యెరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను. ఫిలేమోను తన అభ్యర్థనపై చర్య తీసుకుంటాడా లేదా అని వేచి ఉండాల్సిన అవసరం పౌలుకు లేదు. తన క్రైస్తవ స్నేహితుడు తన అభ్యర్ధనను మన్నిస్తాడని అతడు నమ్మకంగా ఉన్నాడు. ఫిలేమోను ప్రేమపూర్వక ముగా సరైయైన దానినే చేస్తాడని తాను అభ్యర్ధించిన దానికంటే ఎక్కువగానే చేస్తాడని అతడు విశ్వసిస్తు న్నాడు. కాబట్టి అపొస్తలుడికి సంబంధించినంతవరకు, ఈ లేఖ రాయడానికి ప్రేరేపించిన ప్రధాన విషయం పరిష్కరించబడింది మరియు మూసివేయబడింది.

పౌలు ఫిలేమోనుకు చెప్పాల్సిన మరొక మరో అభ్యర్థన కూడా ఉంది. ఫిలేమోను ఈ లేఖ యొక్క మధ్యవర్తిత్వాన్ని గౌరవిస్తాడని మరియు ఈ మొత్తం సంఘటన వారి స్నేహ బంధాలను మరింత సుస్థిరం చేయడంలో దారి తీస్తుందని అతను నిస్సందేహంగా చెప్పడం పౌలు యొక్క నమ్మకానికి మరొక నిదర్శనం. పౌలు సమీప భవిష్యత్తులో తన ఖైదు నుండి విడుదల అవుతాడని నిరీక్షిస్తూవున్నాడు. విడుదలైన తర్వాత, అతను కొలొస్సిని సందర్శించాలనుకుంటున్నాడు. ఆ సందర్శన సమయంలో అతడు మరియు అతనితో ప్రయాణించే వివిధ సహాయకులకు ఆతిధ్యము బస అవసరం. పౌలు ఫిలేమోనును ఆతిథ్యమివ్వమని అడిగాడు.

మొదటి శతాబ్దములో, బస చెయ్యడానికి హోటల్స్ ఏమీ లేవు. ఆతిథ్యం ఒక ప్రత్యేక ధర్మంగా పరిగణించ బడింది. ఫిలేమోను వంటి ధనవంతులైన క్రైస్తవులు తరచూ “పరిశుద్ధులకు ఆతిధ్యాన్ని బసను” (అపొస్తు లులకు, ట్రావెలింగ్ టీచర్స్ కు, తోటి విశ్వాసులకు) ఏర్పాటు చేసేవాళ్ళు (వచనం 7 పరిశుద్ధుల హృదయ ములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున).

చెరసాలలో నుండి తన విడుదల త్వరలో జరుగుతుందని అందుకై నిరీక్షించుచున్నానని పౌలు తెలియజేస్తూ, తన తోటి క్రైస్తవుల ప్రార్థనలకు క్రెడిట్ ఇస్తూవున్నాడు. దేవుని కృపను పంచుకునే వారు కృపా సింహాసనం ముందు ఒకరినొకరు క్రమం తప్పకుండా గుర్తుచేసుకోవాలి.

అపొస్తలుడు ఆశించిన విడుదల, దాని కోసం చాలా మంది క్రైస్తవులు చాలా తీవ్రముగా ప్రార్దిస్తూవున్నారు. విశ్వాసుల ప్రార్థన లను దేవుడు ఆలకిస్తాడు. పౌలు విడుదల అయ్యాడు. సువార్త తరపున మరిన్ని ప్రయాణాలు చేయడానికి అనుమతించబ డ్డాడు. అతడు ఫిలేమోను ఇంటిని దర్శించాడు అతడి ఆతిధ్యాన్ని స్వీకరించాడు.

కొలొస్సయులు 4:10-14లో పేర్కొన్న ఐదుగురు వ్యక్తుల నుండి పౌలు వందనాలను తెలియజేస్తూవున్నాడు. ఎపఫ్రాస్ మొదట ప్రస్తావించబడ్డాడు, బహుశా అతడు కొలొస్సిలో ఫిలేమోనుకు పాస్టర్‌గా ఉన్నాడు. కొలొస్సియన్లలో ప్రస్తావించబడిన యూస్తు అను యేసు గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు, కాబట్టి అతడు బహుశా ఫిలేమోనుకు వ్యక్తిగతంగా తెలియక పోవచ్చు.

ఈ సువార్త సేవకులు తమ శుభాకాంక్షలను పంపుటకు కారణం, ఈ విషయానికి సంబంధించిన ఫలితంపై వారికి కూడా ఎంతో ఆసక్తి ఉందని తెలియజేస్తూవుంది. ఫిలేమోను వలె, వారు సువార్త కొరకు అపొస్తలుడైన పౌలుతో కలిసి పని చేసేవారు. ఫిలేమోను ప్రేమతో తిరిగి వస్తున్న తన బానిస పట్ల క్షమించే ప్రేమను చూపించినట్లయితే, క్రీస్తు సువార్త అద్భుతంగా క్రియ చేస్తువుందని మరియు ప్రోత్సహించబడుతుందని అందరూ గట్టిగా నమ్మారు.

ఫిలేమోనుకును, అప్ఫియకును, అర్ఖిప్పునకును మరియు వారి ఇంటిలో ఆరాధన కోసం గుమిగూడిన వారందరిపై, కొలొస్సి యన్ విశ్వాసులందరిపై మరియు ఈ లేఖనాన్ని చదివే ప్రతి విశ్వాసిపై దేవుని అపొస్తలుడైన పౌలు, దేవుని కృపను ప్రకటిస్తూవున్నాడు. కృప అనేది, అయోగ్యులైన పాపుల పట్ల దేవునికున్న అపరిమితమైన ప్రేమ, పాపులకు ఆయన అత్యంత ముఖ్యమైన బహుమతి మరియు ఇది ప్రతి ఇతర ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి మూలమైయున్నది. ఇది సువార్త ద్వారా విశ్వాసుల హృదయాలను నింపినప్పుడు, అది మానవ అవగాహనకు మించిన సమాధానాన్ని దయచేస్తుంది మరియు ఆ ప్రేమకు రుజువునిచ్చే జీవితాలను జీవించడానికి ఇది విశ్వాసులకు శక్తినిస్తుంది.

మీ ఆత్మకు తోడై యుండును గాక: పౌలు చెప్పిన మరియు బోధించిన వాటితో మరియు ఒనేసిముకు సంబంధించిన తన నిర్ణయంతో ఫిలేమోను సమాధానముగా ఉండాలని పౌలు కోరుకున్నాడు.

ఈ పత్రికకు పోస్ట్‌స్క్రిప్ట్ జోడించబడలేదు. పౌలు విన్నపానికి ఫిలేమోను ప్రతిస్పందన గురించి మనకు తెలియదు. ఫిలేమోను తన అభ్యర్థనను గౌరవిస్తాడని పౌలుకు పూర్తి నమ్మకం ఉంటే, మనం ఎందుకు నమ్మకంగా ఉండకూడదు?

పౌలు తనతో పాటు సేవ చేసే లేదా సువార్త పరిచర్యలో మద్దతు ఇచ్చే ఐదుగురు స్నేహితులను పేర్కొన్నాడు. ఇది దేవుని ప్రజల నెట్‌వర్క్‌లో ఒక భాగం మాత్రమే, ఇందులో ఒనేసిము, ఫిలేమోను కూడా వున్నారు, ఇప్పుడు మనం ఉన్నాం. మనం సహవాసము మరియు మద్దతు యొక్క ఈ నెట్ వర్క్‌లో సంతోషించాలి తప్ప దీనిని గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. దేవుడు మనల్ని తన రాజ్యములోనికి పిలిచాడు మరియు తన కుటుంబములో భాగముగా చేసియున్నాడు ఇతరులకు సహాయపడులాగున మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకొనులాగున ఆయనే మనకు సహాయపడతాడు. ప్రభువా, నన్ను ఉపయోగకరమైన సేవకునిగా చేయుము. క్రీస్తులో నా స్థానిక సంఘమును బట్టి మరియు అదృశ్య సంఘమైన పరిశుద్దుల సహవాసమును బట్టి మీకు వందనములు. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.