లూథర్ చిన్న ప్రశ్నోత్తరి

బాప్తిస్మము దాని అర్ధము

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.

బాప్తిస్మ నియమము 

మొదటిది: బాప్తిస్మము అనగానేమి?

బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, గాని దేవుని ఆజ్జ్య చేత వాడబడి దేవుని వాక్యంతో కలసిన నీరై యున్నది.

ఆ దైవ వాక్యమేది?

కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు”, అని మన ప్రభువైన క్రీస్తు మత్తయి 28:19 నందు చెప్పెను.

బాప్తిస్మపు దీవెనలు

రెండవది: బాప్తిస్మము మన కొరకేమి చేయును?

దేవుని వాక్య వాగ్దానముల ప్రకారము బాప్తిస్మము పాపపరిహారము కలిగించుచు, మరణము నుండియు, సాతాను నుండియు విడిపించుచు నమ్మువారందరకు నిత్య రక్షణను ఇచ్చుచున్నది.

దేవుడు ఇచ్చిన ఆ వాక్య వాగ్దానములు ఏవి?

నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును“, అని మన ప్రభువైన క్రీస్తు మార్కు 16:16 నందు చెప్పెను.

బాప్తిస్మము యొక్క శక్తి

మూడవది: ఇటువంటి ఘనమైన మేళ్లను నీళ్లు ఏలాగు కలుగజేయును?

నీళ్లతో మరియు నీళ్లలో వున్న దేవుని వాక్యము మరియు నీళ్లతో వాడబడిన ఈ వాక్యమును విశ్వసించు విశ్వాసము ఇటువంటి ఘనమైన మేళ్లను కలుగజేయును గాని వాస్తవముగా నీళ్లు ఇటువంటి మేళ్లను కలుగ చేయవు.

ఎట్లనగా దేవుని వాక్యము లేని నీళ్లు వట్టి నీళ్లు మాత్రమే గాని బాప్తిస్మము కాదు. ఆ నీళ్లు దేవుని వాక్యంతో చేర్చబడినప్పుడు బాప్తిస్మమైయున్నది అనగా, కృపగల జీవపు నీళ్లును మరియు పరిశుద్దాత్మ వలననైన పునర్జన్మమునై యున్నది.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడియున్నది?

మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను [దేవుడు] మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణనుబట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరిం చెను ఈ మాట నమ్మదగినది”, అని పరిశుద్ధ పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 3:5-8 చెప్పెను.

మన అనుదిన జీవితము కొరకు బాప్తిస్మము అర్ధమేమి?

నాల్గవది: నీళ్లతో బాప్తిస్మమిచ్చుట అనగా అర్ధమేమి?

బాప్తిస్మము అనగా మనలోనున్న పాత ఆదాము మనోదుఃఖము, పశ్చాత్తాపము చేత దాని దుష్టక్రియలు మరియు దూరేచ్ఛలతోను ప్రతిదినము మునిగి చావవలెను. దేవుని సముఖమందు నీతిమంతుడుగాను, పరిశుద్దుడుగాను ఎల్లప్పుడును జీవించుటకు క్రొత్త మనుష్యుడు ప్రతిదినము లేవవలెనని కూడా అర్ధమిచ్చుచున్నది.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడియున్నది? 

తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందిన వారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్ట బడితిమి“, అని పరిశుద్దుడైన పౌలు తాను రోమీయులకు వ్రాసిన పత్రికలో 6:4 చెప్పెను.  

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.