అందుకు బైబులు, 2వ పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అని చెప్తూవుంది.

ఇక్కడ అపోస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పటికింకా పూర్తిగా వ్రాసిన కొత్త నిబంధన లేదు. అతడు బహుశా తనకు తెలిసిన బైబిల్ గురించి, అంటే పాత నిబంధన పుస్తకాల గురించి ఆలోచిస్తున్నాడు. కాని ప్రవచనాత్మక రచనల మూలం మరియు విశ్వసనీయత గురించి 20 మరియు 21 వచనాలలో అతడు వ్రాసిన ఈ మాటలు (“ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించు కొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి”) అతని రెండు లేఖలకు, పౌలు, యోహాను, యాకోబు మరియు యూదా లేఖలకు, నాలుగు సువార్తలు మరియు అపొస్తలుల కార్యములకు, హెబ్రీయులకు మరియు ప్రకటనకు కూడా సమానముగా వర్తిస్తుంది. ఎందుకంటే ముందు తరాలలో, ఈ రచనలు కొత్త నిబంధనగా సేకరించబడతాయి.

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొన వలెను” అను వచనంలో “మొదట” అను మాట ప్రాముఖ్యమై యున్నది. ఎందుకంటే, మొదటిగా, తన సృష్టికర్తను గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా, దేవుడు ఏమి చెప్పాడు? ఏమి చేసాడు? నేను దానిని ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలను? అను సమాచారం యొక్క మూలం కోసం వెతకవలసి యున్నాడు అనే విషయాన్ని గురించి ఈ మాట తెలియజేస్తూవుంది.

ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్నిబట్టి లేఖనాలయొక్క పునాది దృఢమైనదనే విషయాన్ని తన పాఠకులు తెలుసు కోవాలని పేతురు ఆశపడుతూ వున్నాడు. దేవుని ఆత్మ ఈ లేఖనాలను తీసుకువచ్చింది. రచయితలు దేవునిచే సంకల్పించబడ్డారు; దేవుడు వారి కంటెంట్ను నిర్ణయించాడు; ఆత్మ రచయితలను వారు వ్రాయగల విధంగా వ్రాయడానికి ప్రేరేపించింది. లేఖనాల రచయితలు ఎవ్వరూ తమ సొంత మెటీరియల్‌తో రాలేదని దేవుడే ప్రవక్త యొక్క స్వంత ప్రత్యేక పదజాలాన్ని, శైలిని మరియు జీవిత పరిస్థితిని ఉపయోగించు కొంటూ కంటెంట్‌ను సరఫరా చేశాడు మరియు దానిని నియంత్రించాడు. ఈ ప్రక్రియను ప్రేరణ అంటారు. అంటే, పరిశుద్ధ త్రిత్వములోని పరిశుద్దాత్మ దేవుడు దేవుని చేత ఎంపిక చేయబడిన మనుష్యుని (ప్రవక్త) దగ్గరకు దేవుని నుండి సమాచారాన్ని తెచ్చి, ఆ మనుష్యుడు వాటిని వ్రాసేటట్లుగా ప్రేరేపిస్తూ దానిని పర్యవేక్షించాడు కాబట్టి తుది ఉత్పత్తిని దేవుని మాటలుగా పిలవవచ్చు. కాబట్టే పౌలు తిమోతికి వ్రాస్తూ, 2తిమోతికి 3:16లో ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది అని చెప్తూ వున్నాడు.

అపోస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఆసియా మైనర్లో ఉన్న సంఘాలలోనికి చొరబడిన అబద్ద బోధకులు దురాశ, అధికారము, ప్రజలపై నియంత్రణ, ప్రశంసలు లేదా ఇతరమైన వాటిచేత ప్రేరేపింపబడుతూ, “కల్పనావాక్యములు” అంటే వారు రూపొందించిన కథలతో (2:3) దేవుని వాక్యాన్ని తమ మాటతో, ఆయన అధికారాన్ని తమ అధికారంతో భర్తీ చేయాలని ఆశపడుతూవున్నారు. మానవ నిర్మిత ఆజ్ఞ్యలు బోధలు ప్రజల విశ్వాసానికి జీవితాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తూవుండడం సంఘ చరిత్రలో మనం చూస్తూవున్నాం. సొంతముగా రూపొందిన అభిప్రాయాలు ఎల్లప్పుడూ అపరిపక్వ సులభముగా అన్నింటిని నమ్మేసే క్రైస్తవులను క్రీస్తు నుండి దూరము చెయ్యడానికి ఉద్దేశించబడినవే. ఉదాహరణకు, జోసెఫ్ స్మిత్ 19వ శతాబ్దపు ప్రారంభంలో న్యూయార్క్‌లో ఒక విచిత్రమైన కలను కన్నాడు దాని ఫలితమే ఈనాటి మోర్మాన్ సంస్థ. అట్లే అనేకమైన డినామినేషన్స్కు కారణం వ్యక్తుల సొంత అభిప్రాయాలే. కొన్ని సంఘాలలో, స్వలింగ సంపర్క జీవనశైలిని చట్టబద్ధం చేయడం వంటి మానవ నిర్మిత ఆజ్ఞ్యలు బోధలు బాధాకరం. సంఘములోనే కాదండి ప్రతి సమాజములో ఇటువంటి వారు వున్నారు.

2 సమూయేలు 23:2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది అని దావీదు చెప్పియున్నాడు. క్రొత్తనిబంధనలో, పేతురు, దావీదు వ్రాతలను దైవావేశముచేత వ్రాయబడిన వ్రాతలుగా స్పష్టం చేస్తూ, అపొస్తలుల కార్యములు 1:15,16 లో పేతురు, ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా వారి మధ్య నిలిచి, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవచూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను. అట్లే పెంతెకొస్తు రోజున పేతురు తన ప్రసంగంలో, “సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయ బడెను; అతడు ప్రవక్తయైయుండెను గనుక అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుం డ బెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి” అని తెలియజేసి యున్నాడు (అపొస్తలుల కార్యములు 2:29, 30).

యోహాను 14:26, ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. యేసు తన శిష్యులకు లోతైన సత్యాలను చెప్పాడు. వీటన్నింటిని వారు ఎలా క్రమబద్ధీకరించుకోగలరు? ప్రతిదీ ఎలా గుర్తుంచుకోగలరు? ఆయన వారితో ఉన్న కొద్ది కాలంలోనే చాలా విషయాలు వారికి చెప్పవలసి వచ్చింది. జరగబోయే అనూహ్యమైన విచారణ ఆయన మరణము కొరకు ఆయన వారిని సిద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు వారు ప్రతిదీ అర్థం చేసుకోలేక పోయారు. కాని తండ్రి, యేసు నామంలో, వారికి ప్రతిదీ బోధించడానికి మరియు యేసు చెప్పినవన్నీ వారికి గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మను పంపునని యేసు చెప్తున్నాడు. పెంతెకొస్తు రోజున దేవుని నుండి ఆత్మ పంపబడడం ఆ ప్రత్యేక ఉద్దేశ్యాన్ని కలిగి ఉంది.

1 కొరింథీయులకు 2:12,13 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవునియొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబం ధమైన సంగతులను ఆత్మసంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.

మనం ఏమి ఆలోచిస్తున్నామో, మనం ఏమి గుర్తుంచుకున్నామో, మనకు ఏమి కావాలో, మనం ఏమి ఆశిస్తున్నామో మనకు మాత్రమే తెలుసు. మనలో ఉన్న మన స్వంత ఆత్మ మాత్రమే ఆ అంతరంగిక ఆలోచనలను ఇతరులకు వెల్లడించగలదు. దేవునిలో ఉన్న వాటిని దేవుని ఆత్మ మాత్రమే బయలు పరచగలదు.

లౌకికాత్మ” అనేది పతనమైన ఈ లోకము యొక్క నాగరీకమైన భావజాలం. అది ఈ జీవితానికి కట్టుబడి ఉంటుంది; అది రాబోయే జీవితం గురించి ఏమీ తెలుసుకోదు. ఇది ఈ లోక విషయాలకే పరిమితం చేయబడింది; అది పరలోక, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోదు. “లౌకికాత్మకు” మనిషే దాని ఏకైక దేవుడు. మనిషికి తెలిసినది కోరుకునేది అందజేయడమే దానికి తెలుసు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని గూర్చి (దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వాటిని గూర్చి) ఈ లోకపు ఆత్మ మనకు ఎప్పటికీ చెప్పదు. మానవుడు స్వభావరీత్యా- ఫిజికల్ మరియు మెటీరియల్ – ఈ లోక విషయాలపై శ్రద్ధ వహించేవాడు- దేవుని మార్గాలను అర్థం చేసుకోలేడు ఎందుకంటే ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ఆధ్యాత్మికత లేనివాడు. అతనికి  అర్ధంచేసుకొనే సామర్ధ్యము ఇచ్చే దేవుని ఆత్మ అతనిలో లేదు. కాబట్టే ఆత్మ సంబంధికి, ప్రకృతి సంబంధికి మధ్య అనంతమైన వ్యత్యాసం వుంది (అది పగలు రాత్రి మధ్య, జీవితం మరియు మరణం మధ్య ఉన్నంత వ్యత్యాసం వుంది).

కాబట్టి పాపులైన మానవాళి పట్ల దేవునికి ఉన్న దయగల ప్రేమను అర్థం చేసుకోవడానికి మనం జ్ఞానం కోసం దేవుని ఆత్మ వైపు చూడటంలో సిగ్గుపడనక్కర లేదు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఆయన కృపను అర్థం చేసుకోవడం ప్రారంభించగలము. ఆత్మ అపొస్తలులకు ప్రవక్తలకు సత్యాలను వెల్లడి చేసింది. ఆయన ప్రేరేపించిన అపొస్తలుల ప్రవక్తల మాటల ద్వారా ఆయన మనకు భోదిస్తూ ఉన్నాడు. ఆయన వెల్లడించే, బోధించే మాటల ద్వారా, ఆయన హృదయాలను వెలిగిస్తాడు, ప్రకాశింపజేస్తాడు, ఉత్తేజపరుస్తాడు, తద్వారా ఆయన మాటల్ని అర్థం చేసుకొంటాం, నిజదేవునిని అంగీకరిస్తాం, ఆయనను అంటి పెట్టుకుని ఉంటాం, పట్టుదలతో ఉంటాం.

అపొస్తలులు గాని ప్రవక్తలు గాని వారి స్వంత జ్ఞానం ఆధారంగా వారు వ్రాసిన వ్రాతలలోని పదాలను ఉపయోగించలేదు కాని పరిశుద్దాత్ముడు వారికి వెల్లడించిన బోధించిన పదాలనే వారి వ్రాతలలో ఉపయోగించారు. దీనినే అక్షరానుసారమైన ప్రేరణ అని అంటారు. లోకానికి దేవుని ప్రత్యక్షతను గూర్చి వ్రాసేటప్పుడు పవిత్ర గ్రంథకర్తలు ఉపయోగించిన పదాలను పరిశుద్ధాత్మ వారికి బోధించాడు. ఇది ఒక గొప్ప సిద్ధాంతం మాత్రమే కాదు, ఇది చాలా భరోసాని ఇస్తూ ఉంది. దేవుని సత్యం మనకు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో అలాగే మన దగ్గర ఉంది. దేవుడు చెప్పేది మనకు తెలుసు. లౌకికాత్మ కు బందీలుగా ఉన్న మనుష్యులు తమకు తెలుసని అనుకునే వాటిని బట్టి మనం మోసపోము (అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండము, ఎఫెసీయులు 4:14). ఆత్మ ఇచ్చిన జ్ఞానం లోకములోని మనిషికి అర్ధం కాదు.

ఆత్మ సంబంధి అతడు విషయాలను వేరే కోణంలో చూస్తాడు (విషయాలను నిజంగా ఉన్నట్లుగా చూస్తాడు). ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ఊహిస్తున్నట్లుగా కాదు. కాబట్టి అతనిని పకృతి సంబంధియైన మనుష్యులు తీర్పు తీర్చలేరు. పకృతి సంబంధియైన మనిషి ఆత్మ సంబంధికి ఉన్న అంతర్దృష్టిని అంచనా వేయలేడు. విషయాలు నిజంగా ఎలా ఉన్నాయో దేవుడు ఆత్మ సంబంధికి వెల్లడించాడు కాబట్టి ఆత్మ సంబంధికి ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుస్తుంది. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ఈ లోకము గురించి తనకు తెలుసని మాత్రమే అనుకోగలడు. ఉదాహరణకు, పాపం, అపరాధం అంటే ఏంటి ? మనిషి హృదయంలోని దుర్మార్గపు లోతు ఎంత? అనారోగ్యం బాధలకు సమాధానాలు ఏమిటి? ఎందుకు ఎల్లప్పుడూ నేరం యుద్ధం ఉంది? భూసంబంధమైన ఆస్తుల నిజమైన విలువ ఏమిటి? ఈ లోకము ఎందుకు న్యాయం మరియు సమానత్వం సాధించలేకపోతువుంది? మరణం ఎందుకు రాజ్యమేలుతుంది? విద్య యొక్క పరిమితులు ఏమిటి? పరలోకం అంటే ఏమిటి? దేవుడు అంటే ఎవరో? ప్రకృతి సంబంధికి తెలుసా? ఈ ప్రశ్నలకు ఆత్మ సంబంధి మరియు ప్రకృతి సంబంధి యొక్క జవాబులు చూసినట్లయితే అవి పగటికి రాత్రికి ఉన్నంత విభిన్నంగా ఉంటాయి. యెషయా ఈ వ్యత్యాసాన్ని గూర్చి తెలియజేస్తూ, యెషయా 40:13 యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? అని చెప్పి యున్నాడు. ప్రకృతి సంబంధికి దేవుని మనస్సులో ఏముందో తెలుసని లేదా నిజంగా విషయాలు ఎలా ఉంటాయో చెప్పగలడని అనుకోవడం అసంబద్ధం. దారి తెలియని వ్యక్తి మార్గమేమిటో చెప్పగలడా? దేవుడు తన మనసులో ఏముందో మానవాళికి బయలుపరచియున్నాడు.  

2తిమోతికి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయు టకును ప్రయోజనకరమై యున్నది.

పరిశుద్ధలేఖనములు రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగలవి గనుక మనము వాటిని తెలుసుకోవలసి యున్నాము. పవిత్ర లేఖనాలను చాలా ముఖ్యమైనదిగా చేసేది ఏమిటంటే, అవి మాత్రమే రక్షణ మార్గాన్ని బహిర్గతం చేస్తూవున్నాయి. “దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు” అని వ్రాయబడినట్లుగా, దేవుడు తన ఆత్మ ద్వారా వీటిని మనకు బయలుపరచియున్నాడు, (1 కొరింథీయులు 2:9, 10). పరిశుద్దాత్ముడు తన ప్రత్యక్షతను లేఖనాలలో, లేఖనాల ద్వారా బయలుపరుస్తూవున్నాడు. పవిత్ర లేఖనాలకు పరిశుద్ధాత్మకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. అన్ని లేఖనాలు దేవుని దైవావేశము వలన కలిగినవే. ఇదే లేఖనాలను ప్రత్యేకమైనదిగా చేస్తూవుంది.

లేఖనాలు ఇవ్వబడిన ఉద్దేశ్యము, దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. ఈ వచనాలలో పౌలు మొదటగా, “ఉపదేశించుటను” గురించి ప్రస్తావించాడు. “సమస్త జనులను శిష్యులనుగా చేయమని” యేసు తన శిష్యులకు గొప్ప ఆజ్ఞను ఇచ్చినప్పుడు, “వారికి బాప్తిస్మం ఇవ్వడం” ద్వారా మరియు “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని ఆయన చెప్పాడు (మత్తయి 28:19, 20). దేవుడు తన చిత్తాన్ని పరిశుద్ద్దగ్రంధములో తెలియజేసియున్నాడు. దానిని మాత్రమే ఉపదేశించవలసి యున్నాము. రెండవదిగా, పౌలు “ఖండించుటను” గురించి ప్రస్తావించాడు. అంటే, పాపాన్ని బహిర్గతం చేయడానికి, నిర్ధారించడానికి (XRAY ఏవిధముగా నష్టం జరిగిన భాగాన్ని బహిర్గతపర్చి సరిదిద్దుకోవడానికి అవకాశము కలిగిస్తుందో) ప్రయోజనకరముగా లేఖనాలు ఇవ్వబడియున్నాయి. పాపము మనలను ఎంతగా నష్టపరచియున్నదో తెలిస్తే గదా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించగలం. ఒప్పింపబడగలం ఆయన సహాయముతో స్థితిని మార్చుకోగలం. ఉదాహరణకు, పాపం అంటే? అబార్షన్ పాపమా? వివాహానికి వెలుపల సెక్స్ పాపమా? తాగుడు పాపమా? విడాకులు పాపమా? పన్నులు కట్టడంలో వైఫల్యం పాపమా? అని అడిగితే అందరూ ఒకే జవాబు చెప్పరు. అప్పుడు ఎవరు కరెక్ట్? కాబట్టే లేఖనాలలో, ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియజేసేందుకు దేవుడు లేఖనాలను ప్రామాణికంగా యిచ్చియున్నాడు. మూడవదిగా, పౌలు “తప్పు దిద్దుటను” గురించి ప్రస్తావించాడు. అంటే పడిపోయిన వారిని పునరుద్ధరించడానికి లేదా మెరుగుపరచడానికి ప్రయోజనకరముగా లేఖనాలు ఇవ్వబడియున్నాయి. పడిపోయిన వారి తప్పు దిద్ది వారిని తిరిగి సరియైన మార్గములోనికి తేవటం. ధర్మశాస్త్రము తప్పు దిద్దుతుంది, వారిని ఒప్పిస్తుంది. సువార్త హృదయాన్ని కదిలిస్తుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది, దిద్దుబాటు జరిగేలా ఉంచుతుంది, పాపిని పునరుద్ధరిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. పవిత్ర లేఖనాలు మాత్రమే మనలను క్రీస్తు దగ్గరకు నడిపించే రక్షణ సువార్తను ప్రకటిస్తూవున్నాయి, ఆయనకు వేరుగా ఉండి ఎవరును ఏమియు చేయలేరు (యోహాను 15:5). చివరగా, పౌలు “నీతియందు శిక్ష చేయుటను” గురించి ప్రస్తావించాడు. ”శిక్షణ” అంటే ఒక వ్యక్తి మంచి మర్యాదగల, ఉపయోగకరమైన పౌరుడిగా ఎదగడానికి అతనికి అవసరమైన క్రమశిక్షణను, సరిదిద్దుటను, మార్గనిర్ధేశకత్వమును ప్రోత్సాహమును ఇవ్వటాన్ని గురించి తెలియజేస్తూవుంది. సాతాను నిరంతరము శోధిస్తూనే ఉంటాడు ఒకడు శరీరము యొక్క ప్రలోభాలను నిరంతరము ప్రతిఘటిస్తూ ఉండాలి. కాబట్టి క్రైస్తవుడు భూమిపై తన జీవితకాలంలో క్రైస్తవుడిగా జీవించడంలో భాగమైన పరిశుధ్ధతను నిలుపుకునేందుకు నిరంతర శిక్షణ అవసరం. ఎందుకంటే అవి మనకు “నిత్యజీవాన్ని  తెచ్చే దేవుని కృపను” వెల్లడిస్తూ వున్నాయి మరియు “భక్తిహీనతకు, ఇహలోక సంబంధమైన దురాశలకు విసర్జించుటకు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుటకు (తీతు 2:11, 12) “నీతిలో శిక్షణ ఇచ్చేందుకు” ప్రయోజనకరముగా ఇవ్వబడివున్నాయి.

జవాబు: పరిశుద్దాత్ముడు బైబులును రచించిన వారికి తలంపులు కాక వారు వ్రాయ వలసిన మాటలను కూడా ఆయన వారికి తెలియజేసియున్నాడు గనుక బైబిలులోని మాటలన్నీ దేవుని మాటలై ఉన్నాయి. (అక్షరానుసారమైన ప్రేరణ)

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.