బైబులు అనగానేమి?

మార్కు 7:10-13 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లి కైనను వానిని ఏమియు చేయనియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు.

సమస్త లోక పాపములను మోసుకొనిపోయిన దేవుని గొర్రెపిల్ల, తనను విశ్వసించు వారందరికీ నిత్య జీవమును నిత్య రక్షణను ఇచ్చు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తానే లేఖనాలను దేవుని వాక్యములని (మాటలని) చెప్తూవున్నాడు.

మార్కు 7:1-13 సందర్భంలో, రెండవదిగా, దేవుని వాక్యమును ప్రజలు నిరర్థకము చేస్తూ ఉండుటను బట్టి వారిని గద్దిస్తూ, యేసు పరిసయ్యులతో శాస్త్రులతో వాస్తవికత లేని వారి సంప్రదాయాలను గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. పెద్దల ఆచార సంప్రదాయాల ప్రకారం శిష్యులు చేతులు ఎందుకు కడుక్కోరని పరిసయ్యులు అడిగారు (మార్కు 7:5). ఈ చేతులు కడుక్కోవడం అనేది ఈ రోజు మనం సబ్బు మరియు నీటితో చేతులు కడుక్కోవటం కాదు. ఇది శుభ్రత కోసం కాదు; బదులుగా, ఇది దైవభక్తి యొక్క ప్రదర్శనగా నిర్దేశించ బడిన ఒక ఆచారం.

పరిసయ్యులు శాస్త్రులు తాము ఏర్పరుచుకున్న సంప్రదాయాలపై ఎక్కువగా నమ్మకముంచారు. అది వారిని వేషధారులుగా దేవుని స్వంత వాక్యాన్ని పాడుచేసే వారిగా చేసింది. వారు లేఖనాల యొక్క శుద్ధికారణాచార సంబంధమైన ఆజ్ఞల వాస్తవికతను తగ్గించి, వారి స్వంత సంప్రదాయాలను అందరి ముందు చేయగలిగే బాహ్య క్రియలకు వాళ్ళు బహుగా ప్రాముఖ్యతను ఇచ్చారు. అందుకే యేసు యెషయా 29:13లోని మాటలను వారికి అన్వయిస్తూ, వేషధారులారా –ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని మత్తయి 15:7-9 వారిని హెచ్చరించాల్సి వచ్చింది.

దేవుని పాతనిబంధన ఆచారనియమాలు క్రీస్తుకు మార్గాన్ని సిద్ధంచేయడానికి ఉద్దేశించబడ్డాయని గుర్తుచేసు కున్నప్పుడు, వాటిని అర్ధం చేసుకోలేని అజ్ఞ్యానాన్ని బట్టి సిగ్గుపడవలసి ఉన్నాం. అధ్వాన్నమైన విషయం ఏమిటంటే, వారి బోధలు కొన్నిసార్లు వారికివ్వబడిన నీతి సంబంధమైన ధర్మశాస్త్రాన్ని కూడా బలహీన పరిచాయి. వారు నాల్గవ ఆజ్ఞను ఎలా ఉల్లంఘించారో క్రీస్తు ఇక్కడ ఎత్తి చూపాడు.

కొర్బాను అనేమాట మార్కు 7:11లో మాత్రమే ఉంది. ఈ మాటకు “దేవునికి బహుమతిగా అంకితం చేయబడింది”. దేవునికి సమర్పించాలని లేదా ఆలయంలోని పవిత్ర ఖజానాకు ఇవ్వమని ప్రజలను ప్రోత్సహించె క్రమములో  కొర్బాను అనే ఒక నియమాన్ని పెద్దలు ప్రవేశపెట్టారు. ఏదైనా “కొర్బాను” అయితే, అది దేవుని ఉపయోగం కోసం అంకితం చేయబడింది మరియు ప్రత్యేకించబడింది.

కాని దీనిని వాస్తవికతలో పరిసయ్యులు శాస్త్రులు వారి స్వప్రయోజనాల కోసం ఎలా మార్చుకొన్నారో ఇక్కడ చూడొచ్చు. మార్కు 7:11-13 కాబట్టే మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమియు చేయ నియ్యక మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు. ఇటు వంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను.

దేవుడు తన ప్రజలకు “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” అను ఆజ్జ్యను ఇచ్చాడు  (నిర్గమకాండము 20:12), వృద్ధాప్య తల్లి తండ్రులు వారి అవసరతలలో పిల్లలను డబ్బులు లేదా వారి అవసరార్ధమై వేటిననైనను అడిగినప్పుడు పిల్లలు తల్లితండ్రులకు డబ్బు లేదా వారు అడిగిన వాటిని వారికి ఇవ్వకుండా దానిని ఆలయ ఖజానాకు అంకితం చేయవచ్చని బోధించడం ద్వారా పరిసయ్యులు ఆ ఆజ్ఞకు మినహాయింపునిచ్చారు, అది దేవుని ఆజ్జ్యను తిరస్కరించడమే.

ఇది కొర్బాను (దేవార్పితమని) చెప్పడం ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల పట్ల అతని బాధ్యత నుండి మినహాయించటం కరెక్ట్ కాదు. మరో మాటలో చెప్పాలంటే, వారి తల్లిదండ్రులను మోసగించడానికి (మరియు తమను తాము సంపన్నం చేసుకోవడానికి) చట్టవిరుద్ధమైన మరియు మోసపూరితమైన మార్గంలో మందిరానికి అంకితం ఇవ్వబడిన డబ్బును పరిసయ్యులు (చట్టబద్ధమైన కొర్బాను అర్పణను) తీసుకున్నారు, ఉపయోగించుకొన్నారు. ఆ విధంగా, దేవుని వాక్యము నిరర్థకము చేయబడింది. ప్రతి ఒక్కరు వారి తలితండ్రుల పట్ల వారి ధర్మాన్ని నిర్వర్తించమని దేవుడు ఆజ్జ్యను ఇచ్చినప్పుడు, ఒకరి ధర్మాన్ని ఒకరు నిర్వర్తించకుండా చెయ్యడం దేవుని వాక్యమును  నిరర్థకము  చెయ్యడం కాదా అని యేసు పరిసయ్యులును ప్రశ్నించాడు.

వాస్తవికత లేని ఆచారాలు పరిసయ్యుల మతంలాంటివే. ఇవి బాహ్యముగా మేము సనాతులము అని చూపు కొనేందుకు మరియు స్వార్ధపూరితముగా సమాజములో వివక్షలను ఏర్పరచి కట్టుబాట్లు సంప్రదాయాలతో ప్రజలపై అధికారాన్ని నిలిపుకొనేందుకు మనుష్యులు కల్పించుకొన్న పద్ధతులు మాత్రమే. నిజమైన దేవునిని తెలుసుకోకుండా, నిజమైన దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా, తమ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాల వల్ల కలిగే ప్రయోజనమేమి ఏమీ లేదు. ఎందుకంటే అవి నిజమైన దేవునిని, ఆయన ప్రేమను, ఆదరణను, క్షమాపణను మనుష్యులకు దూరము చేస్తూ మనుష్యులు తమ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, సొంత సత్క్రియల ఆధారముగా దేవుని ఎదుట నిలబడుటకు ప్రోత్సహిస్తున్నాయి. మనుష్యులు వారి సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలతో దేవుని వాక్యం యొక్క అధికారాన్ని ఎన్నటికి స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించకూడదని యేసు గద్దిస్తూవున్నాడు.

1 థెస్సలొనీకయులకు 2:13 (థెస్సలొనీకయులలో దేవుని వాక్యం పనిచేసిన తీరును భయంకరమైన హింసను ఎదుర్కొన్న వారి విశ్వాసాన్ని బట్టి పౌలు ఈ లేఖను వ్రాస్తూ), ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

పౌలు థెస్సలొనీకయులకు దేవుని వాక్యాన్ని తీసుకువచ్చినప్పుడు, పౌలు దానిని ఏమీ మార్చలేదు దానికి ఏమి జోడించలేదు. దేవుడు తనకు ఇచ్చినట్లుగానే అతడు దానిని బోధించాడు. ఇందులో మానవ అభిప్రాయం లేదు మానవ తత్వశాస్త్రం లేదు. బదులుగా, థెస్సలొనీకయులు ఏమి అందుకున్నారో అది స్వచ్ఛమైన దేవుని స్వంత సందేశం. అది ఏ విధంగానైనా మానవుని మాటగా ఉండి ఉంటే, అది అద్భుతమైన విశ్వాసాన్ని ఎన్నటికీ ఉత్పత్తి చేయలేదు. వాళ్ళు విన్నది స్వచ్ఛమైన దేవుని వాక్యం కాబట్టే, హింసించేవారి చేతిలో నిరంతరం కష్టాలు పడినప్పటికి వారి విశ్వాసాన్ని నిలబెట్టు కోవడానికి అది ప్రభావవంతంగా నిరంతరం వారిలో కార్యసిద్ధి కలుగ జేసింది. ఎందుకంటే దేవుని వాక్యం రోమా 1:16 సువార్త నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగ జేయుటకు అది దేవుని శక్తియైయున్నది కాబట్టి. 1థెస్సలొనీకయులు 1:5 సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్నది కాబట్టి.

కాని ఎప్పుడైతే దేవుని స్వచ్ఛమైన వాక్యం మానవ అజ్ఞ్యానముతో తప్పిదంతో కల్తీ చేయబడుతుందో, అప్పుడు దేవుని వాక్యం యొక్క స్వచ్ఛత పోతుంది దాని ప్రభావం బాగా తగ్గిపోతుంది అది విశ్వాసి జీవితములో కార్యసిద్ధి కలుగజేయదు. దేవుని వాక్యం సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి రుజువు, థెస్సలొనీకలోని క్రైస్తవులపై యూదుల వ్యతిరేకత తీవ్రముగా ఉన్నప్పటికి థెస్సలొనీకయుల విశ్వాసమే అందుకు రుజువు.

1 పేతురు 1:22,23 మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు.

మనమందరం మర్త్యులైన తలితండ్రులకు జన్మించిన మర్త్యులైన పిల్లలముగా వున్నాము. కాని జీవముగల దేవుని వాక్యం మర్త్యులైన మన తలితండ్రులు మనకు ఇవ్వలేని దానిని ఇస్తూ ఉంది, అదే నిత్యత్వము, నాశనమేలేని శాశ్వతత్వము. ఈ విషయాన్నే అపోస్తులుడైన పేతురు ఇక్కడ తెలియజేస్తూ వున్నాడు (యెషయా 40:6-8 ఆలకించుడి, సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును, పువ్వువాడును. నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును). దేవుని యొక్క శక్తివంతమైన, సజీవమైన, శాశ్వతమైన మాటలు మాత్రమే ప్రజలకు శాశ్వత జీవితాన్ని ఇవ్వగలవు. బైబిలు ఎక్కడ చదివినా, ప్రకటించబడినా అదే శాశ్వతమైన, జీవాన్ని ఇచ్చే దేవుని మాటలు నేడును సజీవంగా ఉన్నాయి అనే విషయాన్ని మరచిపోకండి.

హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.  

దేవుని వాక్యము సజీవమైనది, క్రియాశీలమైనది. ఇది దేవుని యొక్క జీవశక్తితో నిండి ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుంది. అందువల్ల దీనిని ఎవ్వరు నాశనం చేయలేరు మరియు ఇది నాశనం చేయలేనిది. ఇది క్రియాశీలమైనది, దాని Activenessకి కారణాన్ని యెషయా 55:10,11లో దేవుడే చెప్తూ, వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును, అని సెలవిచ్చియున్నాడు. దేవుని వాక్యము  దేవుని నుండి వచ్చింది, దేవుని వాక్యానికి కర్త ఆయనే. దేవుడు అబద్ధం చెప్పడు. కాబట్టి ఆయన వాక్యం అబద్ధం కాదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి, 2 పేతురు 1:21. దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు, వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో దేవుని వాక్యం కూడా మనకు ప్రయోజనాన్ని చేకుర్చునని దేవుడు చెప్తూవున్నాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సజీవమై శక్తిగలిగిన తన వాక్యాన్ని ఆయనే మనకు ఇచ్చాడు. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను (దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనమును) ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైనవిగా, 2 తిమోతికి 3:15-17, మనలను నిర్దేశించుటకు మనకు ఇవ్వబడి యున్నవి.

దేవుని వాక్యం చాలా పదునైనది అది అవిభాజ్యమైన వాటిని కూడా విభజించగలదు. “ప్రాణము” మరియు “ఆత్మ” ల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అవి ఒకే మూలకం యొక్క విభిన్న విధులు. “ప్రాణం” అనేది మనిషి యొక్క అల్పమైన భౌతిక జీవితాన్ని దాని కోరికలు ఆసక్తులను ఎక్కువగా సూచిస్తుంది.  “ఆత్మ” అనేది దేవునితో సహవాసం అవసరంతో అతని ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కువగా సూచిస్తుంది. ప్రాణం, ఆత్మ ఎక్కడ కలిసివుంటాయో లేదా ఎక్కడ విడిపోతాయో ఎవరు చెప్పగలరు? కాని దేవుని మాటలు తేలికగా ఈ రెండింటిని ముక్కలు చేయగలదని బైబులు చెప్తూ వుంది. కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు అను మాటలకు, దేవుని మాటలు చాలా లోతుగా మనిషి యొక్క అంతర్భాగాలలోనికి చొచ్చుకు పోతాయని, అతని ప్రతి రహస్యాన్ని బహిర్గతము చేస్తాయని అర్ధం. పెంతెకొస్తు రోజున పేతురు చేసిన ప్రసంగాన్ని విన్న ప్రజలకు ఈ రెండంచుల కత్తి యొక్క చొచ్చుకుపోయే చర్య గురించి తెలుసు. అపొస్తలుల కార్యములు 2:37, మనకు ఇలా  చెబుతోంది, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని –సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడిగారు.

హెబ్రీయులకు 4:13 ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క యొప్పచెప్ప వలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనుష్యుల హృదయాల లోనికి చూసే దేవుని కన్ను దేవుని వాక్యమే. చొచ్చుకు పోగల శక్తితో అది గుండె యొక్క లోతైన అంతరాలలోకి చొచ్చుకు పోతుంది మరియు అక్కడ కనుగొనే ఆలోచనలు వైఖరులను సరిగ్గా అంచనా వేస్తుంది. అంతిమ దినమున ఆ వాక్యము తీర్పు తీరుస్తుంది. కాబట్టే యోహాను 12:48లో యేసు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొకడు కలడు; నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును, అని హెచ్చరించాడు. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినా లేదా తృణీకరించినా, సమస్తమును చూడగల దేవుని కండ్లలోనికి మనం చూసే ఒక రోజు వస్తుంది లేదా వుంది అనే ఈ ఆలోచన అవిశ్వాసికి ధర్మశాస్త్రము, అతడు దేవుణ్ణి మోసం చేయలేడని, దేవుడు వెక్కిరించబడడు అని అతనిని హెచ్చరిస్తుంది. విశ్వాసికి ఈ ఆలోచన సువార్త, దేవునికి మన బలహీనతలన్నీ తెలుసు అవసరమైనవన్నీ క్రీస్తులో అందించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడనే సువార్తతో ప్రతిఒక్కరిని ఆదరిస్తూవుంది.

బైబులు అనగానేమి అను ప్రశ్నకు జవాబు, బైబులు సజీవమై శక్తిగలిగిన దేవుని వాక్యమై యున్నది. “ఈ రోజు, మీరు ఆయన స్వరాన్ని వింటే గనుక, మీ హృదయాలను కఠినతరం చేసుకోకండి”. దేవుని వాక్యం మీకు జీవాన్ని పరలోకములో శాశ్వతత్వాన్ని ఇస్తుంది.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.