1. దేవుడున్నాడని మనకు యెట్లు తెలియును?
 • హెబ్రీయులకు 3:3,4_ ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు (స్థాపించిన వాడు) దేవుడే.
 • కీర్తన 19:1-4_ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపు చున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి యందంతట వ్యాపించియున్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
 • కీర్తన 14:1_ దేవుడులేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

జవాబు: ఆయన సృజించిన వాటిని బట్టి దేవుడున్నాడని మనకు తెలియును.

2. ఆయన సృజించిన వాటిని బట్టి దేవునిని గూర్చి మనకేమి తెలియును?

 • అపొస్తులులకార్యములు 14:17_ అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంత ములైన రుతువులను దయచేయుచు ఆహారము ననుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.
 • కీర్తన 104_ దేవుడు సృజించిన అద్భుతమైన వాటన్నిటిని గూర్చి కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. ప్రత్యేక ముగా వ వచనమును గమనించుము: యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞ్యానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. 104వ కీర్తన సృష్టికర్త యొక్క జ్ఞానం మరియు ప్రేమను తెలియజేస్తూవుంది.
 • రోమీయులకు 1:20_ ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.

జవాబు: దేవుడు సృజించిన వాటిని బట్టి ఆయన దయగలవాడు, జ్ఞ్యాని, నిత్యుడు, సర్వశక్తిమంతుడు మరియు దైవత్వముగలవాడునై యున్నాడని మనకు తెలియును.  

దేవుని గూర్చిన జ్ఞానము విషయములో మనం ప్రకృతినుండి ఏయే విషయాలు తెలుసుకోగలం?

జవాబు:  దేవుని గూర్చిన జ్ఞానము శాశ్వతమైనది సర్వశక్తివంతమైనది జ్జ్యానవంతమైనది దైవికమైనది.

3. మన మనస్సాక్షిని బట్టి దేవునిని గురించి మనకేమి తెలియును?

 • రోమీయులకు 2:14,15_ ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయ బడినట్టు చూపుచున్నారు.
 • రోమీయులకు 1:32_ ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

జవాబు: మన మనసాక్షిని బట్టి దేవుడు మన పాపములను బట్టి మనలను శిక్షించునని మనకు తెలియును.

దేవుని గూర్చిన జ్ఞానము విషయములో మనం మనస్సాక్షిని బట్టి ఏయే విషయాలు తెలుసుకోగలం?

జవాబు:  దేవుడు శిక్షించునని మనకు తెలియును.

4. ఆయన సృష్టి లేక మనఃసాక్షిని బట్టి దేవునిని గూర్చి దేనిని మనమెన్నటికిని తెలుసుకోలేము?

 1. అపొస్తులుల కార్యములు 16:29,30_ అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు  పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.
 • 1 కొరింధీయులకు 2:9_ ఇందునుగూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయ బడియున్నది.

జవాబు: దేవుని సృష్టి లేక మన మనసాక్షిని బట్టి మనలను రక్షించుటకు దేవుడు ఏమి చేసియున్నాడను దానిని మనము ఎన్నటికిని తెలుసుకోలేము.

5. అప్పుడు బైబులు ఎందుకు అవసరము?

 • 2 కొరింథీయులకు 4:5,6_ అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమనుగూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. గనుక మేము మమ్మునుగూర్చి ప్రకటించు కొనుటలేదు గాని, క్రీస్తుయేసునుగూర్చి ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము.
 • 2 తిమోతికి 3:14,15_ క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసి కొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.
 • అపొస్తులుల కార్యములు 16:30-32_ వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి  అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.

జవాబు: మనలను రక్షించుటకు దేవుడు ఏమి చేసియున్నాడను దానిని మనకు బయలుపరచుటకు వెలుగుగా బైబులు మనకు అవసరము.