సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ద్వితీయోపదేశ కాండము 30:11-14

లెంట్లో మొదటి రోజును భస్మ బుధవారము అని అంటారు. లెంట్ అనేది పశ్చాత్తాపపడు కాలము. బూడిదను ధరించడం బైబిల్ కాలాల్లో పశ్చాత్తాపానికి చిహ్నం. యోనా గ్రంధములో నీనెవె ప్రజలు గొనె బట్టలు కట్టుకొని బూడిదను చల్లుకొని పశ్చాత్తాపపడిరని తెలియజేయ బడియున్నది కదా దీనిని ఆధారము చేసుకొని కొన్ని సంఘాలు గత సంవత్సరంలో మట్టాలదివారమున మందిరానికి తీసుకొని రాబడిన మట్టలను దాచి ఈ భస్మబుధవారమున వాటిని కాల్చి ఆ బూడిదను విశ్వాసుల నుదిటిపై పశ్చాత్తాప కాలానికి చిహ్నముగా రాస్తూ వుంటారు, ఆచారంగా మాత్రమే. క్యాథలిక్ సంఘము ఈ ఆచారాన్ని ప్రారంభించి యున్నది. దీనిని బట్టే లెంట్ లోని మొదటిరోజుకు భస్మ బుధవారము అని పేరు వచ్చింది.

లెంట్ అనే మాట ఓల్డ్ ఇంగ్లీష్ పదమైన lengthen అనే మాట నుండి తీసుకోబడింది. ఇది వసంత ఋతువు ప్రారంభము. ఈ సీజన్లో పగలు ఎక్కువగ్గా ఉంటుంది.

మన పాపాలే యేసును సిలువకు పంపియున్నవని కాబట్టి మనమందరం పశ్చాత్తాపపడుతూ దేవునిని వేడుకోవాలని లెంట్ మనకు గుర్తుచేస్తూ ఉంది. లెంట్ అనేది నలభై రోజుల సీజన్- ఆదివారాలను లెక్కించము. అందుకే ఇది ఎప్పుడూ బుధవారం ప్రారంభమవుతూ ఉంటుంది. క్రీస్తు బాధలపై దృష్టి సారించే ఈ నిశ్శబ్ద కాలంలో కూడా, ఆదివారాలు క్రీస్తు పునరుత్థానాన్ని మరియు మరణం, అపవాదిపై ఆయన సాధించిన విజయాన్ని మరియు మనం నిజంగా క్షమించబడ్డామనే భరోసాకు గుర్తులుగానే వున్నాయనే విషయాన్ని మరచిపోకండి, అందుకనే లెంట్ లోని 40రోజులకు ఆదివారాలను కలిపి లెక్కించము.

పశ్చాత్తాపం మరియు యేసుక్రీస్తులో మనకు చూపబడిన ప్రేమ మరియు క్షమాపణను బట్టి, ఆ కాలములో సంఘానికి వచ్చే ప్రతిఒక్క కుటుంబము (కుటుంబములోని అందరూ) తప్పనిసరిగా మందిరానికి ప్రార్థనలకు రావాలనే ఉద్దేశ్యములో, ప్రతిఒక్కరు ఆత్మపరిశీలన మరియు పశ్చాత్తాపం, ప్రార్థన మరియు ఉపవాసం ద్వారా, ప్రేమతో కూడిన పనులను ఆచరించడం ద్వారా మరియు దేవుని పవిత్ర వాక్యాన్ని చదవడం మరియు ధ్యానించడం ద్వారా వాక్యప్రకారము జీవించడం ద్వారా పవిత్రమైన లెంట్ పాటించులాగున ఆనాటి సంఘము ఒక ఆచారంగా దీనిని సంఘములోనికి ప్రవేశపెట్టింది. ఆ కాలములో సంఘాన్ని సమకూర్చడంలో దానిని నడిపించడంలో ఆనాటి సంఘ కాపరులు, సంఘ పెద్దలు ఎంతగా శ్రమ పడియున్నారో గుర్తు చేసుకొని వారి ఆచారాలను అర్ధం చేసుకొని గౌరవించాలి తప్ప వారిని విమర్శిస్తూ మన అవివేకాన్ని బయటపెట్టుకోవడం, తర్కించడం ఎంత సబబో ఆలోచించండి.

ఆచారాలు మతంలో ముఖ్యమైన అంశం ఎందుకంటే అవి విశ్వాసులు తమ విశ్వాస వ్యవస్థలను వ్యక్తీకరించడానికి మరియు పునరుద్ఘాటించడానికి అనుమతిస్తాయి. ఆచారాల యొక్క ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి కమ్యూనికేషన్. ఆచారాలు కమ్యూనికేట్ చేస్తాయి. ఇతరులు లేదా దేవునితో కమ్యూనికేట్ చేయడానికి అవి ఉద్దేశించబడ్డాయి. ఆచారము యొక్క ముఖ్య ఉద్దేశ్యం -ఒకే సమూహంలో ఉన్న ఇతరులతో సన్నిహితంగా ఉండటానికి సమూహాలు తరచుగా ఆచారాలను ఉపయోగిస్తాయి. ఆచారాలు కలిసి నిర్వహించినప్పుడు, అవి సమాజ భావనను సృష్టించగలవు. ఐక్యత యొక్క భావాన్ని సృష్టించే ఈ సామర్థ్యం ఆచారం యొక్క అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. మతపరమైన ఆచారాల వల్ల కలిగే ప్రయోజనాలు -మతపరమైన ఆచారాల యొక్క వ్యక్తిగత ప్రయోజనాలలో ఎక్కువ ఆధ్యాత్మిక వృద్ధి, సంతోషకరమైన రోజువారీ జీవితం, ఆత్మీయమైన విషయాలలో మరింత దృష్టి మరియు దిశ మరియు మెరుగైన వ్యక్తిగత ప్రవర్తన ఉన్నాయి. క్రైస్తవ ఆచారాలు రోగులను బలపరుస్తాయి, పాపులను క్షమిస్తాయి, విరిగినవారిని నయం చేస్తాయి, అవి దయను ఇస్తాయి. నిస్వార్థ ప్రేమలో పరిపక్వతతో కూడిన జీవితానికి క్రైస్తవ నిబద్ధతతో వారు ఆచారాలను జరుపుకొనేవాళ్ళు తద్వారా సంఘాలను బలోపేతం చేసారు.

ఈ భస్మ బుధవారము కొరకు ద్వితీయోపదేశ కాండము 30:11-14 వచనాలు చదువుకొందాం: నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు; మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవనుకొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.

లోకములో దేవుడెక్కడ ఉన్నాడు అనే ప్రశ్న ఈ లోకాన్ని ఎంతగానో ఇబ్బంది పెడ్తువుంది. కొందరు దేవుడనే వాడుంటే ఈ కష్టాలు, కన్నీళ్లు తీసేయొచ్చు కదా అని అంటుంటారు. మరికొందరు మంచివాడు సర్వశక్తిమం తుడైన దేవుడు ఎందుకని కష్టాలను కన్నీళ్లను మనుష్యుల జీవితాలలోనికి అనుమతించుచున్నాడని ప్రశ్నిస్తూ ఉంటారు. జీవిత సమస్యలను పాప భారాన్ని మోస్తున్న వారు ఈ లోకములో దేవుడెక్కడ ఉన్నాడు, ఆయనను మన మెట్లు కలుసుకొంటాము అని ప్రశ్నిస్తూ ఉంటారు.

నిజానికి మనుష్యులెవరు ఎక్కువగా దేవునిని గూర్చి ఆలోచించరు. దేవుడనేవాడు మనుష్యుల జీవితాలలో ఒక non factor మాత్రమే. సంతోషముగా ఉన్నప్పుడు ఎవ్వరికీ దేవుడు గుర్తుకు రాడు.

కోట్లాదిమంది కష్టాలలో శిక్షిస్తున్న ఒకనిగా దేవునిని గూర్చి భావిస్తూ ఉన్నారు. మరికొందరు మనుష్యుల నిర్లక్ష్య నిర్లజ్జమైన జీవితాలలో కర్మఫలితాన్ని అనుభవించలేక కష్టపడుతున్నపుడు మనుష్యునికి దేవుడు అవసరం అని చెప్తున్నారు. ఇలాంటి స్వభావము చాలా ప్రమాదకరం. మరికొందరు కర్మ ఫలితాన్ని తప్పించేవాడు దేవుడు కాబట్టి ఈ జీవితములో ఆయనను మెప్పించవలసియున్నామని చెప్తుంటారు, స్వార్ధంగా. అలాగే  బుద్ధిహీనులు మాత్రమే దేవుడు లేడని అనుకొంటారని బైబులు చెప్తూవుంది.

దేవునిని కనుక్కోవడానికి మనుష్యులు పరలోకానికి ఎక్కి పోవలసిన అవసరం లేదు, సముద్రపు లోతులలోనికి దిగాల్సిన అవసరం లేదు. మరణము తరువాత దేవుని దగ్గరకు ఎక్కి పోవడం కంటే మానవులుగా మనము చేయగలిగినది కూడా ఏమి లేదు. అలాగే మనుష్యులు తమ స్వంత శక్తి ద్వారా దేవునిని మేము కలుసుకోగలం అని అనుకోవడం కూడా అతిశయపూర్వకం. ఎందుకంటే నిజానికి, దేవునికి మనుష్యునికి మధ్య గొప్ప అడ్డు ఉంది తెలుసుకదా: అది మనుష్యుడు తనకు తానుగా పాపము చేత నిర్మించుకొనిన గోడ. ఆ గోడ చాల ఎత్తుగా ఉండటమే కాదు చాల దృఢము కూడా. ఎటువంటి మానవ ప్రయత్నము దానిని పడగొట్టలేదు. అంటే స్వంత శక్తి ద్వారా, ప్రయత్నాల ద్వారా ఎవరు దేవునిని కలుసుకోలేరు. దేవునికి మనుష్యునికి మధ్యనున్న ఆ అడ్డుగోడను మనం పడగొట్టలేము కాబట్టే దేవుడే చొరవను తీసుకొని ఆ చర్యలో భాగముగా ఆయనే మనకు తనను తాను బయలు పరచుకొనియున్నాడు.       

ఈ పరిశుద్ధ లేఖనాలలో (బైబిలులో) తనను తాను బయలుపరచుకొని మనుష్యుల దగ్గరకు దిగి వచ్చిన దేవునిని మనం కలిగియున్నాం. ఇందులో దేవుడు తన చిత్తమేంటో మనుష్యులందరికి బయలుపరచియున్నాడు. తన ప్రణాలికను వెల్లడి చేసియున్నాడు. ఆయన మాటలు చాల స్పష్టంగా ఉన్నాయి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనుష్యుల అవగాహనకు మించినది కాదు. వెల్లడించబడిన దేవుని చిత్తము మనుష్యుల జీవితాలలో సజీవ వ్యక్తీకరణగా ఉండాలని దేవుడు కోరుకొంటూ ఉన్నాడు.

అలాగే మనుష్యులు తమకు తాముగా దేవుని యొద్దకు రాలేరు, కాబట్టే దేవుడే మన యొద్దకు వచ్చుచున్నాడు. సర్వసృష్టిని సృజించిన సృష్టికర్తయైన దేవుడు, భూమి మీదికి శరీరధారిగా యేసుగా దిగివచ్చియున్నాడు. యేసుగా ఆయన తన్ను తాను తగ్గించుకొని మన సమస్త దోషమును తీసుకొనియున్నాడు. అదే యేసును సిలువ మరణాన్ని తీసుకొనేటట్లు చేసింది. ఆయన మరణమును గెల్చి లేచి పునరుత్థానుడైయ్యాడు, పాపము యొక్క అడ్డుగోడను ఆయన శాశ్వతముగా తొలగించియున్నాడు. రక్షుకుడైన యేసు మన నుంచి ఏమి ఆశింపకయే మనలను రక్షించుటకు ఆయనకు మనుష్యుల పట్ల ఉన్న ప్రేమనుబట్టి ఆయన ఇదంతయు చేసాడు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై దేవుడు యేసుగా ఈ లోకము లోనికి వఛ్చియున్నాడు. ఈ దేవునినే మనం కలిగియున్నాం, నమ్ముతూవున్నాం.

దేవుని ధర్మశాస్త్రము మనుష్యులందరి హృదయాలలో లిఖించబడియున్నది, అట్లే రక్షకునిని గూర్చిన సువార్త మనుష్యులందరికి ప్రకటింపబడుతూనే ఉన్నది. కాని మనుష్యులే రక్షకుని నమ్మకున్నారు? 

ఎందుకంటే మనుష్యులు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడ కున్నారని బైబిలులో రోమీయులకు వ్రాసిన పత్రిక 10:3 చెప్తూవుంది. 

బైబిలులో సృష్టికర్తయిన దేవుడు తననుతాను యెహోవాగా బయలుపరచుకొని మనుష్యులందరి సంరక్షణ కర్తగా తన మంచితనము కృపను బట్టి మనుష్యులందరితో ఉన్నాడు. రక్షణకర్తగా బయలుపరచబడియున్న యేసు విమోచనను, క్షమాపణను గెల్చి మనుష్యులందరికి తోడుగా అందరితో ఉన్నాడు. పరిశుద్దాత్మగా బయలుపరచబడియున్న దేవుడు సువార్త ద్వారా మనుష్యులను పిలుస్తు తన వరముల చేత మనలనంద రిని వెలిగించుచున్నాడు, నూతన జన్మమును నీటి ద్వారా, ఆత్మ ద్వారా మనకిస్తూ మనలను తిరిగి జన్మిoప జేస్తూ ఈ త్రియేక దేవునిని నమ్మిన వారిని ఆయన తన బిడ్డలుగా ముద్రిస్తూ ఉన్నాడు. దేవుడు మనుష్యులం దరితో ఉన్నాడు. ఆయన దూరముగా లేడు. అందరికి ఆయన దగ్గరగానే ఉన్నాడు. కాని మనమే మనకున్న స్వంత కారణాలను బట్టి రక్షకుని తిరస్కరిస్తూ ఉన్నాం, కుయుక్తిగా లోకములో దేవుడెక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తువున్నాం.

ఈ భస్మబుధవారమున శ్రమలకాలము లోనికి ప్రవేశించుచున్న మీఅందరికి దేవుని ఉనికి అనేది ప్రశ్నే కాదు, దేవునితో సంబంధమును కలిగియుండుట అనేదే ప్రాముఖ్యం. ఎందుకంటే ఎక్కడైతే మనుష్యులు క్రీస్తుని గూర్చి ఆలకిస్తారో, క్రీస్తుని గూర్చి చదువుతారో, క్రీస్తుని గూర్చి అధ్యయనము చేస్తారో, క్రీస్తుని గూర్చి నేర్చుకుంటారో ఆయన ఏర్పరచిన సంస్కారములను క్రమము తప్పక పుచ్చుకొంటూ ఉంటారో అందేళ్లా రక్షకుడు తన క్షమాపణను అందరికి అందుబాటులో ఉంచియున్నాడు. కాబట్టి ఈ భస్మబుధవారమున మనమందరం  సంతోషించులాగున నిజదేవుడైన ఈ త్రియేకదేవుడు మనకందరకూ అవసరమైన పరిపూర్ణమైన విశ్వాసమును, ప్రేమను ఆయనే అనుగ్రహించి మనలను క్షమించి ఆదరించును గాక. ఆమేన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.