పరిచయము

మత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటి పుస్తకం. మత్తయి అనేకమైన పాత నిబంధన ప్రవచనాలను కోట్ చేస్తూ అవి యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడ్డాయో స్పష్టం చేస్తూ, క్రైస్తవత్వం అనేది జుడాయిజం స్థానంలో వచ్చిన క్రొత్తమతం కాదని, ఇది పాతనిబంధన వాగ్దానాలన్నింటికి నెరవేర్పని, యేసు అబ్రాహాము దావీదుల వంశం నుండి వచ్చిన వాగ్దానం చేయబడిన మెస్సీయ అని, దావీదు యొక్క చట్టబద్ధమైన వారసుడు ఈయనేనని సూచిస్తూ ఉన్నాడు. ఈ ఉద్దేశ్యం పుస్తకంలోని దాదాపు ప్రతి విభాగంలో సూచించబడింది. అతడు తన తోటి-దేశస్థుల కోసం వ్రాశాడు, హిబ్రూ లేదా అరామిక్ భాషలో కాదు, ఆ రోజుల్లో ఆసియా దేశాలు, ముఖ్యంగా తూర్పు ఆసియా యొక్క సాధారణ భాష అయిన గ్రీకులో. అతని లక్ష్యం పాత నిబంధనలో ఉన్న మెస్సయ్యను మరియు ప్రవచనముల యొక్క అద్భుతమైన పరాకాష్టను చూపించడం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, యెష్షయి మొద్దునుండి పుట్టిన చిగురని యెషయా 11:1, ఇతడే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఆయన జీవితం, అభిరుచి, మరణం మరియు పునరుత్థానం పాత ఒడంబడిక యొక్క నెరవేర్పని, యేసు దావీదు కుమారుడనే వాదనను స్థాపించే వంశపారంపర్య పట్టిక, పాత నిబంధన నిరంతర ప్రస్తావన, అందుకు సమృద్ధిగా సాక్ష్యాలను అందిస్తూ ఉంది.

గ్రంథకర్తను గురించి

మత్తయి అను మాటకు “యెహోవాయొక్క బహుమతి” అని అర్ధం. “లేవి” అనేది అతని క్రైస్తవ పేరు. అతనిని “అల్ఫయి కుమారుడగు లేవి” అని కూడా పిలిచెడి వారని మార్కు తెలియజేసియున్నాడు, మార్కు 2:14. అతడు హేరోదు ఆంటిపాస్ పాలిస్తున్న గలలియాలో రోమన్ ప్రభుత్వం కోసం పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చెయ్యటం అనేది ఆనాడు ప్రజాదరణ లేని ఒక ఉద్యోగం. పన్ను వసూలు చేసే వ్యక్తిగా అతనిని అతని తోటి యూదులు నిస్సందేహంగా ఇష్టపడలేదు. మత్తయి 9:9-13; మార్కు 2:14-17 ప్రకారం, యేసు ఆ మార్గమున వెళ్లుచు, (కపెర్నహూములో (నేటి ఇశ్రాయేలులో, గలిలీ సముద్రంకు అనుకొనియున్న, ఆధునిక అల్మాగోర్ సమీపంలో) సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి –నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను. అతని త్వరిత ప్రతిస్పందన అతడు యేసు బోధల ద్వారా అప్పటికే ప్రేరేపించబడి ఉండొచ్చని, దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మెస్సీయ ఈ యేసేనని అతడు విశ్వసించాడని తెలియజేస్తూ ఉంది. అతడు తన స్నేహితులు సహచరులు కూడా యేసుతో పరిచయం పెంచుకోవాలని ఆశపడ్డాడు. యేసు మత్తయిని శిష్యత్వానికి పిలిచినప్పుడు, మత్తయి “సమస్తమును విడిచి పెట్టి, లేచి, ఆయనను వెంబడించెననిలూకా 5:28లో చెప్తూ ఉన్నాడు.

మత్తయి వ్రాయబడిన కాలము

ఆదిమ సంఘ సంప్రదాయం ప్రకారం, 12 మంది అపొస్తులలో ఒకరైన పరిశుద్ధ మత్తయి దీని గ్రంధకర్త. కాని మత్తయి ఖచ్చితముగా ఎప్పుడు వ్రాయబడిందో చెప్పడం అంత సులభం కాదు. ఎందుకంటే, “నేటివరకు” (మత్తయి 27:8; 28:15) అనే ఈ రెండు వ్యక్తీకరణలు పుస్తకంలో వివరించిన సంఘటనలు జరిగి చాల కాలమయ్యిందని తెలియజేస్తూ ఉన్నాయి. అట్లే అవి క్రీ.శ 70లో యెరూషలేము రోమనులచే నాశనము కాకమునుపే వ్రాయబడి ఉండొచ్చని సూచిస్తూ ఉన్నాయి. ఈ సువార్త క్రీ.శ 50-60 మధ్యలో వ్రాయబడి ఉండొచ్చు.

మత్తయి సువార్తలోని యూదు స్వభావం అది పవిత్ర భూమిలో వ్రాయబడిందని సూచిస్తూ ఉంది. అంతియొకయలోని చర్చిలో గ్రీకు మాట్లాడే యూదుల జనాభా ఎక్కువగా ఉండటమే కాకుండా మత్తయి 28:18-20 ఉదేశ్యము ప్రకారము అన్యజనులకు సువార్తను చేర్చడంలో ఎంతో ముందంజలో ఉంది కాబట్టి ఇది సిరియన్ అంతియొకయలో ఉద్భవించిందని కొంతమంది భావిస్తున్నారు.

చాలామంది ఆధునిక పండితులు మత్తయి సువార్తను మొదటి శతాబ్దపు చివరి త్రైమాసికంలో ఒక యూదుడు అనామకంగా వ్రాసినట్లు చెప్తుంటారు, అది కరెక్ట్ కాదు. మరికొంతమంది బైబిల్ పండితులు మార్కు తన సువార్తను మొదటగా వ్రాసాడని అది మత్తయికి ప్రాథమిక మూలంగా పనిచేసిందని చెప్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మత్తయి 12 మంది శిష్యులలో ఒకడు, యేసు పరిచర్యకు చాలా వరకు ప్రత్యక్షసాక్షి. మరోవైపు, మార్కు తన సమాచారాన్ని చాలా వరకు ప్రధానంగా పేతురు నుండి అందుకున్నాడు. ఒక ప్రత్యక్షసాక్షి తన సమాచారాన్ని సెకండ్‌హ్యాండ్‌గా స్వీకరించిన రచయిత నుండి సెకండ్‌హ్యాండ్ సమాచారాన్ని ఎందుకు ఉపయోగించాలనుకొంటాడు? మత్తయి మొదట వ్రాసినట్లు అనిపిస్తుంది. పురాతన నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. మత్తయి యేసు పనులను శ్రద్ధగా గమనించేవాడని, ఆయన మాటలను శ్రద్ధగా వినేవాడని స్పష్టమవుతోంది. కపెర్నహూమ్‌లో పన్ను వసూలు చేసే వ్యక్తిగా, అతనికి ఖచ్చితమైన రికార్డులను మైంటైన్ చెయ్యడం అలవాటు. అతనికి హీబ్రూ, అరామిక్, గ్రీకు భాషలు బాగా తెలుసు. యేసు జీవితం, ఆయన బోధలు, ఆయన బాధలు, మరణం, మరియు ఆయన పునరుత్థానం గురించి మనకు ఖచ్చితమైన వృత్తాంతాన్ని అందించడానికి అతనికి అర్హత ఉంది.

ఈ సువార్త యొక్క ప్రామాణికతను ప్రశ్నించలేము. చారిత్రక మరియు వచన పరిశీలనలు మత్తయి యొక్క రచయితత్వాన్ని మాత్రమే కాకుండా, ఈ పుస్తకం పవిత్ర కానన్‌లో ఒక భాగమని మరియు బైబిల్ యొక్క ప్రేరేపిత రచనలకు చెందినదనే వాస్తవాన్ని స్థిరంగా సమర్దిస్తూ ఉన్నాయి. ప్రభువు యొక్క అపొస్తలులలో ఒకరైన మత్తయి వ్రాసిన సువార్త, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏ రూపంలో రాశాడో అదే రూపంలో ఈ రోజు మన వద్ద ఉందని మనం నిశ్చయముగా చెప్పొచ్చు.

మత్తయిలో క్రీస్తు

మత్తయి యేసును ఇశ్రాయేలు యొక్క మెస్సియానిక్ రాజుగా చూపాడు (1:23; 2:2, 6; 3:17; 4:15-17; 21:5,9; 22:44;,45; 26:64; 27:11, 27-37) “పరలోకరాజ్యం” అనే పదం మత్తయిలో 32 సార్లు కనిపిస్తుంది. మెస్సీయకు సంబంధించిన అర్హతలను యేసు నెరవేర్చాడని చూపించడానికి, మత్తయి 130 పాత నిబంధన కొటేషన్లను సూచనలను ఉపయోగించాడు. ఈ సువార్తలో తరచుగా “ప్రభువు తన ప్రవక్తద్వారా పలికినమాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను” అనే పదం మత్తయిలో 9 సార్లు కనిపిస్తుంది.

మత్తయిలో ప్రాముఖ్యమైన మాట: యేసే రాజు. మత్తయి పాత నిబంధన నుండి పదే పదే ఉటంకిస్తూ, ఇశ్రాయేలు యొక్క ప్రవచించబడిన మెస్సీయ ఈ క్రీస్తే అని చెప్తూ, యేసు సాక్ష్యాన్ని ధృవీకరిస్తూ, ఈ రాజును గూర్చిన ప్రతిది అద్వితీయము: ఆయన అద్భుతమైన జన్మము, ఆయన జన్మస్థలం, ఐగుప్తులోకి ఆయన పయనం, యోహాను ద్వారా ఆయనను గూర్చిన ప్రకటన, అరణ్యంలో సాతానుతో ఆయన యుద్ధం, ఆయన పరిచర్య, ఆయన మరణం ఇవన్నీ పాత నిబంధన ప్రవచనాలకు పరాకాష్ట అయిన ఈ యేసును గూర్చే చెప్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నాడు.

ప్రాముఖ్యమైన వచనాలు

మత్తయి 16:16-19_ 16 అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. 17 అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలు పరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు. 18 మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టు దును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

28:18-20_18 అయితే యేసు వారియొద్దకు వచ్చి–పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి యున్నది. 19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay no. is +91 9848365150