జ్ఞానులు మెస్సీయను సందర్శించుట 1-12

1 రాజైన హేరోదు దినములయందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 2 యూదులరాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. 3 హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

  1. రాజైన హేరోదు దినములయందు, యూదయదేశపు రాజకీయ పరిస్థితు ఎలా ఉండేవి?
  2. రాజైన హేరోదు యూదయదేశము పై రాజుగా ఉండుటకు కారణమేమి?
  3. రాజైన హేరోదు స్వభావము?
  4. యూదయదేశపు బేత్లెహేము యొక్క ప్రాముఖ్యత ఏంటి?
  5. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎవరు?
  6. ఆ నక్షత్రము యేసుదేనని వాళ్ళు ఎలా గుర్తించారు? 
  7. తూర్పుదిక్కున వాళ్ళు చూసిన ఆయన నక్షత్రము ఏంటి?
  8. ఆయనను పూజించుటకు జ్ఞానులు ఎందుకని బయలుదేరి వచ్చారు?
  9. జ్ఞానులను నక్షత్రము యెరూషలేమునకు ఎందుకని నడిపింది? కారణాలు ఏమై ఉండొచ్చు? నక్షత్రము జ్ఞానులను బేత్లెహేముకు నడిపి ఉండొచ్చు కదా?
  10. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు ఎందుకని కలవరపడ్డాడు?
  11. యెరూషలేము వారందరు ఎందుకని కలవరపడ్డారు?

అగస్టస్ రోమా సామ్రాజ్యంనకు చక్రవర్తిగా ఉన్నాడు. ఆనాటి దేశాలన్నీ రోమన్ సామ్రాజ్యం క్రింద ఒకటిగా ఉండేవి. వివిధ దేశాల మధ్య ప్రయాణం సులభంగా సురక్షితంగా ఉండెడిది. రోమన్ సామ్రాజ్యమంతటా ఒకే రకమైన చట్టాలు ఉండేవి. అంతర్జాతీయంగా గ్రీకు భాష వాడకం సాధారణం. ప్రపంచం ప్రశాంతంగా ఉంది. మెస్సయ్యను పరిచయం చేయడానికి మరియు భూమిపై సువార్తను వ్యాప్తి చేయడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని దేశాలలో క్రైస్తవత్వం సులభంగా ప్రబలంగా వ్యాప్తి చెందడానికి దేశాలను ఈ పద్ధతిలో అమర్చడంలో దేవుని సంరక్షణ చాల గొప్పది.

యూదయ కూడా రోమన్ ప్రావిన్స్ క్రింద ఉండేది. హేరోదు ఏశావు వంశస్థుడు, ఎదోమీయుడు, ఇశ్రాయేలీయుడు కాడు. హేరోదు యూదయ యొక్క రోమన్ ప్రొక్యూరేటర్ యైన యాంటీపేటర్ కుమారుడు. అతనికి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో గలిలయ గవర్నర్ పదవి దక్కింది. తరువాత అతడు దక్షిణ సిరియా మరియు డెకాపోలిస్‌తో సహా లెబనాన్ మరియు యాంటీ లెబనాన్ పర్వత శ్రేణుల మధ్య సారవంతమైన లోయ అయిన కోయెల్-సిరియాకు గవర్నర్ అయ్యాడు. తరువాత రోమన్ ట్రయంవిర్ ఆంటోనీచే టెట్రార్క్‌గా నియమించబడ్డాడు. ప్రజలతో ఎల్లప్పుడూ అసురక్షితంగా ఉండే తన ప్రావిన్స్ నుండి మక్కాబియన్ ఆంటిగోనస్ చేత తరిమివేయబడి ఇతడు రోమ్‌కి పారిపోయాడు. ఆంటోనీ మరియు అగస్టస్‌ల సహాయం పొందాడు. తర్వాత రోమన్ సెనేట్ ద్వారా యూదయకు రాజుగా నియమింపబడ్డాడు. ఆయుధ బలంతో తనకు అప్పగింపబడిన ప్రాంతాన్ని గెల్చుకోవాల్సి వచ్చింది. దానిని స్వాధీనం చేసుకున్న తరువాత అతడు తన అధికారాన్ని క్రూరమైన నిర్ధాక్షిణ్యమైన పద్ధతిలో తన బలసంపదలను ప్రదర్శించడానికి ఉపయోగించాడు.

ఇతడు హేరోదులలో మొదటివాడు. ఎంతో తెలివైన సమర్థుడైన యోధుడు, వక్త మరియు దౌత్యవేత్త. 25 బి.సి లో వచ్చిన గొప్ప కరువు కాలములో, అతడు పేదలకు సహాయం చెయ్యడానికి తన కోటలోని కొన్ని బంగారు వస్తువులను కరిగించి వాటిని అమ్మి ప్రజలకు ఎంతో సహాయపడ్డాడు. అతడు ప్రజల వినోదం కోసం థియేటర్లు మరియు రేసు ట్రాక్‌లను నిర్మించాడు. 19 బి.సిలో యెరూషలేములోని ఆలయాన్ని పునర్నిర్మించడం ప్రారంభించాడు, ఓడరేవు నగరం సిజేరియా, మరియు మసాడా కోటను కూడా నిర్మించాడు. హేరోదు నిజంగా యూదుల చరిత్రలో గొప్ప బిల్డర్లలో ఒకడు, కాబట్టే ఇతనిని హేరోదు ది గ్రేట్ అని పిలుస్తారు. అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడం ద్వారా మతపరంగా ఎంతో ప్రభావవంతమైన పరిసయ్యుల పార్టీ మనస్సులను గెల్చుకొన్నాడు. తన రాజ్యములోని ఇతర అన్యమతస్థులను కూడా సంతోషపెట్టే క్రమములో అతడు గ్రీసియన్ ఆచారాలను ప్రవేశపెట్టడం ద్వారా రోమ్ యొక్క అభిమానాన్ని కూడా పొందాడు.

హేరోదు నిజానికి స్థిమితంలేని మనస్తత్వం కలవాడు అని చెప్పొచ్చు. అతడు చాల క్రూరుడు, కనికరం లేని వాడు, అసూయపరుడు, తన ప్రత్యర్ధ్ధులను ఎందరినో నిర్దాక్షణంగా చంపించాడు. హేరోదుకు 10మంది భార్యలు. అతడు తనపై కుట్ర పన్నారనే ఆరోపణతో తన 2వ భార్యయైన అస్మోనియన్ మరియమ్నేని ఉరితీశాడు. ఆమె ద్వారా తనకు కలిగిన ఇద్దరు కుమారులను, ఆమె తల్లిని, భార్య సహోదరుని చంపించాడు. బేత్లెహేములోను దాని చుట్టుప్రక్కల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరిని నిర్దాక్షణంగా చంపించినవాడు. ఇతని స్థిమితంలేని మనస్తత్వాన్నిబట్టి  ప్రజలు ఇతనిని ఎంతగానో అసహ్యించుకొన్నారు. అతడు తన మరణానికి ముందు, యెరూషలేములోని అత్యంత విశిష్టమైన నాయకులను, అధికారులను, పౌరులను జైలులో పెట్టించి తాను మరణించిన సమయంలోనే వారిని ఉరి తీయాలని ఆదేశాలు ఇచ్చాడు. తన మరణము ప్రజలకు సంతోషాన్ని కలుగజేస్తుందని అతనికి తెలుసు. ఆ విధంగా అతడు మరణించిన టైములో ప్రజలు సంతోషపడకుండా నగరమంతటా శోకం ఉండేలా చేసాడు.

బేత్లెహేము_ బేత్లెహేము యెరూషలేముకు దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరములో ఉన్న ఒక చిన్న గ్రామము. ఇది దావీదురాజు యొక్క స్వగ్రామము. బేత్లెహేము దాని సారవంతమైన భూములను బట్టి చాల చాల ప్రత్యేకమైనది. బేత్లెహేముకున్న మరొక ప్రాచీనమైన పేరు ఎఫ్రాతా (ఆదికాండము 35:19; రూతు 1:19; 1సమూయేలు 16:4; మీకా 5:2). బేత్లెహెం ఒక చిన్న, గుర్తింపులేని గ్రామమైనప్పటికి, దేవుడు తన కుమారుడైన మెస్సీయ జన్మించే ప్రదేశంగా దానిని ఎంచుకున్నాడు. యేసు బేత్లెహేములో జన్మించాలంటే యేసేపు మరియ దాదాపుగా 120 కిలోమీటర్ల ఉత్తరాన్న ఉన్న నజరేతు నుండి బేత్లెహేముకు ప్రయాణము చేసి వచ్చారు (లూకా 2:4).

జ్ఞానులు_ గొర్రెల కాపరులతో పాటు శిశువైన యేసును ఆరాధించినట్లు చిత్రకారులు గీసిన చిత్రములను మన మందరం చూసే ఉంటాం. అయితే నిజానికి జ్ఞానులు యేసు పుట్టిన చాల రోజుల తర్వాత బేత్లెహేముకు వచ్చారు. చెప్పాలంటే జ్ఞానులకు గొర్రెల కాపరులకు సంబంధమే లేదు. జ్ఞానుల పేర్లు బైబిలులో చెప్పబడ లేదు. కాని 6వ శతాబ్దంలో ఇటలీలోని రావెన్నలోని చర్చిలో దొరికిన వ్రాత ప్రతులలో మొదటిసారిగా జ్ఞానుల పేర్లు కనిపించాయి. Tradition వీరి పేర్లను కాస్పర్, బాల్తాజార్ మరియు మెల్చియోర్ అని చెప్తూవుంది.

వీళ్ళు బబులోనుకు చెందినవారని మరికొందరు ప్రాచీన పర్షియాకు చెందినవారని మరికొందరు అరేబియాకు చెందిన వారని అంటూ వుంటారు. బైబిలులో వారిని గురించి తూర్పుదేశపు జ్ఞానులు అని మాత్రమే చెప్పబడింది. ఆ కాలములో జ్ఞానులు_ a class of ప్రీస్ట్స్ అని చెప్పొచ్చు, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు, రాజుకు సలహాదారులు. వీళ్ళు ఎంత మంది? ఎక్కడ నుండి వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్రాంతం నుండి వచ్చారు అనేది బైబిలులో చెప్పబడలేదు. బబులోనీయులకు ఖగోళశాస్త్రం మరియు జ్యోతిష్యశాస్త్రం ఇష్టమైన ప్రవుత్తి కాబట్టి వీళ్ళు బబులోను ఉన్న భూభాగం నుండి వచ్చి ఉండొచ్చు.

బబులోను కరెక్ట్ జవాబు అయితే, ఈ మనుష్యులకు యూదుల రాజు గురించి ఎలా తెలుసు? అనే ప్రశ్నకు మనకొక క్లూ దొరికినట్లే. జ్ఞానులు యూదులు కాదు. వాళ్ళు యూదుల ద్వారా ఆ వాగ్దాన రాజు గురించి విని ఉండొచ్చు. యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు దానియేలు జ్ఞానులకు ప్రధాన అధికారిగా నియమింపబడ్డాడు అనే విషయం మరచిపోకండి. రాజు దానియేలును బహుగా హెచ్చించి, అనేక గొప్ప దానము లిచ్చి, అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను, అని దానియేలు 2:48 చెప్తూవుంది. కాబట్టి మెస్సీయను గురించి ఆయనకు సంబందించిన ప్రవచనాలను గురించి సంక్షిప్త సమాచారం దానియేలు ద్వారా జ్ఞానుల దగ్గర ఉండి ఉండొచ్చు. యూదాపై అటువంటి నక్షత్రం కనిపించడాన్ని గమనించిన వాళ్ళు, రాజు జన్మించాడని తేల్చి ఉండొచ్చు. ఇశ్రాయేలు దేవుణ్ణి జ్ఞానులు విశ్వసించారు. వాళ్ళు మెస్సీయను గూర్చిన వాగ్దానాలను చాలా సీరియస్ గా తీసుకున్నారు లేకపోతే వారు యేసును కనుగొని ఆరాధించడానికి సుదీర్ఘమైన ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేపట్టి ఉండక పోవొచ్చు అని అంటారు, నేను దీనిని నమ్ముతాను.   

నక్షత్రం_ ప్రాచీనకాలములో ఒక నక్షత్రం లేదా తోకచుక్క కనిపించడం ఒక గొప్ప సంఘటనకు శకునంగా పరిగణించబడేది. విశిష్ట పురుషుల పుట్టుక లేదా మరణం వద్ద రోమన్ చరిత్రకారులు ఇలాంటి అనేక సంఘటనలను నమోదు చేశారు. జూలియస్ సీసర్ మరణం వద్ద ఒక తోకచుక్క ఆకాశములో కనిపించి ఏడు రోజులు ప్రకాశించింది. మన పాఠములోని జ్ఞానులు కూడా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ (యూదుల రాజు) జన్మించారనడానికి ఈ నక్షత్రాన్ని ఒక సాక్ష్యంగా భావించారు, ఎలా?

నక్షత్రము యాకోబులో ఉదయించును” (సంఖ్యాకాండము 24:17) అనే ప్రవచనంలో నక్షత్రం మెస్సయ్యను సూచిస్తూ వుంది తప్ప ఒక నక్షత్రము యూదయ భూభాగముపై క్రొత్తగా పుడుతుందని చెప్పటం లేదు. ఒక నక్షత్రం (ప్రకాశమానమైన వెలుగు) యాకోబు పైన అంటే యూదయ భూభాగంలో లేదా ఇశ్రాయేలుదేశం మీదుగా “నడిచి” వెళ్ళినప్పుడు, మెస్సయ్య ఇశ్రాయేలు నుండి బయటపడతాడని ఇశ్రాయేలీయులు నమ్మే వాళ్ళు. ఈ ప్రవచనం సాంప్రదాయముగా రాబోయే తరాలకు అందించబడింది. ఇది జ్ఞానులకు కూడా బాగా తెలిసి ఉండొచ్చు.

తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి”, అంటే వాళ్ళు తమకు తూర్పున ఉన్న నక్షత్రాన్ని చూశారని కాదు, వాళ్ళు తూర్పున ఉన్నప్పుడు, వాళ్ళు ఈ నక్షత్రాన్ని చూశారని అర్ధం. ఈ నక్షత్రం యెరూషలేము ఉన్న దిశలో ఉన్నందున అది వారికి పశ్చిమాన ఉండాలి. కాబట్టే వాళ్ళు హేరోదుతో, తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి అని చెప్పారు. ఈ నక్షత్రానికి ఆయన నక్షత్రము అని వాళ్ళు పేరుపెట్టారు, ఎందుకంటే ఇది ఆయన పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన భూభాగాన్ని సూచించడానికి ఉద్దేశించినదిగా వాళ్ళకి తెలియజేయబడి ఉండటమే.

జ్ఞానులకు ఆకాశములో కనబడినది చాల ప్రకాశవంతమైనది అని మనం చెప్పొచ్చు. ఈ ప్రకాశవంతమైనది నక్షత్రములా యూదయమీద ఉదయించింది. యూదయ భూభాగంలో అటువంటి నక్షత్రం (ప్రకాశమానమైన వెలుగు) కనిపించడాన్ని జ్ఞానులు గమనించినప్పుడు, రాజు జన్మించాడని వాళ్ళు నిర్ధారించి బయలుదేరి ఉండొచ్చు. లూకా 2:8లో యేసు జన్మములో గొఱ్ఱెల కాపరులకు ప్రభువు దూత ప్రత్యక్షమైనప్పుడు “ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించెను” అని చెప్పబడియున్నది కదా. ఇక్కడ జ్ఞానులకు యూదయ భూభాగంలో ప్రకాశమానమైన ప్రభువు మహిమ నక్షత్రము వలె కనబడి ఉండొచ్చు. దేవుడు తన కుమారుని వద్దకు జ్ఞానులను నడిపిస్తున్న క్రమములో ప్రస్తావించబడిన నక్షత్రము ప్రభువు మహిమే కావొచ్చు. ఆ కాంతి దూరం నుండి జ్ఞానులకు కనబడి ఉండొచ్చు. జ్ఞానులు దానిని చూసి ఉండొచ్చు.

యూదయ భూభాగంలో నక్షత్రం కనిపించడాన్ని జ్ఞానులు మెస్సీయ పుట్టుకతో ఎలా నిర్ధారించుకొని వచ్చారో బైబిలు చెప్పటం లేదు. రక్షకుడు పుట్టియున్నాడనుటకు ఈ నక్షత్రాన్ని సంకేతముగా జ్ఞానులు ఎలా తీసుకొన్నారనేది ఊహించడం చాల కష్టం. దేవుడే వారికి ఈ విషయాన్ని వెల్లడించాడని మాత్రమే మనం చెప్పగలం.

ఆ నక్షత్రం వారిలో ఆసక్తిని మేల్కొల్పింది. నక్షత్రాలు చాల పెద్ద గ్రహాలు. సూర్యుడు కంటే పెద్దవి. వాటిలో ఒకటి జ్ఞానులకు మార్గనిర్దేశం చేయడానికి పంపబడిందని అనుకోవడం అసంబద్ధం. శతాబ్దాలుగా, ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని వివరించగల సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. శతాబ్దాలుగా పండితులు ఈ సంభావ్య కారణాలపై చర్చిస్తూ కనీసం 13వ శతాబ్దం నుండి ఖగోళ శాస్త్రవేత్తలు ఖగోళ సంఘటనలతో ఈ నక్షత్రాన్ని అనుసంధానించడానికి ప్రయత్నిస్తూ, ఈ నక్షత్రం వాస్తవానికి ప్రకాశవంతమైన గ్రహాలయొక్క “గొప్పసంయోగం” అయి ఉండవచ్చని, ఇది మీనరాశిలో బృహస్పతి శని గ్రహాల సంయోగం అయినా అయ్యి వుండాలి లేదా బృహస్పతి శుక్ర గ్రహాల సంయోగం అయినా అయ్యి ఉండాలి అని చెప్తూ లేదంటే అది ఒక తోకచుక్క కావొచ్చని, ఒక సూపర్నోవా కావొచ్చని లేదా అది ఒక సౌరమంట కావొచ్చని అంటున్నారు. బృహస్పతి, సాటర్న్ మరియు మార్స్ గ్రహాల కలయికగా ఉల్కాపాతంగా తోకచుక్కగా సౌరమంటగా వివరించే ప్రయత్నాలు సంతృప్తికరంగా లేవు అని గట్టిగా చెప్పొచ్చు.

ఈ నక్షత్రం దేవుని ప్రత్యేక సృష్టి. కొత్తది మరియు అసాధారణమైనది, ఇదివరకు ఎన్నడూ చూడనిది గమనించనిది. ఇది ఇతర నక్షత్రాల మాదిరిగా కనిపించలేదు మరియు ఇతర నక్షత్రాల వలె వ్యవహరించ లేదు. ఈ నక్షత్రం జ్ఞానులకు ఆసక్తిని కలిగించింది. దీనిని గురించి వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవాలను కొన్నారు. దీని గమనాన్ని అనుసరిస్తూ దానిని స్పష్టముగా చూసేందుకు, అదేమిటో తెలుసుకొనేందుకు వాళ్ళు ఈ నక్షత్రాన్ని అనుసరించి ఉండొచ్చు. ఆ నక్షత్రము యొక్క ఉద్దేశ్యము వారికి తెలియజేయబడినప్పుడు ఆ నక్షత్రము వారి నమ్మకాన్ని దేవునిలో ఇనుమడింపజేసింది. దేవుడు తన కుమారుని జన్మమును గురించి జ్ఞానులకు తెలియజేసినప్పుడు, వాళ్ళు దేవుని కుమారుని కొరకు కష్టతరమైన దారిలో వందల మైళ్లు ప్రయాణించి ఆయనను వెదికారు. ఆయన నక్షత్రమును చూడటమంటే ఆయన దయకు పాత్రులగుటే కదా, ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు అది వారిలో బాధ్యతను పెంచింది. వాళ్ళు తమకు బయలుపరచబడిన దానిని గురించి తేలికగా తీసుకోలేదు. ఆ నక్షత్రాన్ని వెంబడించడం ద్వారా వారి విశ్వాసాన్ని వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. అన్యులైయుండి దేవుని ప్రజల ముందు వారి దేవునిపై వారికున్న నమ్మకాన్ని వాళ్ళు వక్కాణించారు. తమ మాటలు చేతల ద్వారా దానిని కనపరచారు. దానిని గూర్చి సాక్ష్యమిచ్చారు. అజ్ఞానంను గద్దించారు, ప్రశ్నించారు. క్రీస్తును తెలుసుకోవాలని, ఆయనను వెతకాలని నిజంగా కోరుకునే వారు ఆయనను వెతకడంలో శ్రమలను తిరస్కారాలను ప్రమాదాలను పట్టించుకోరు. 

వీళ్ళు గొప్ప వ్యక్తులు కాబట్టి ఈ ముగ్గురుతో పాటు ఈ కష్టమైన వందలాదిమైళ్ళ ప్రయాణములో వీళ్లకు సహాయకులుగా వీరి అవసరతలను తీర్చడానికి మరికొందరు వీరితో ఉండి ఉండొచ్చు. ఈ ప్రయాణములో వాళ్ళు తమ దగ్గర ఉన్న, తెలిసిన ప్రతి సంక్షిప్త సమాచారాన్ని క్రోడీకరించుకొంటూ, చర్చించుకొంటూ దానిని గురించి నేర్చుకొంటూ వారికి దేవుని ద్వారా బయలుపరచబడిన విషయాలను ఈ నక్షత్రానికి ముడిపెట్టుకొంటూ యెరూషలేముకు చేరారు.

జ్ఞానులు రాజధాని నగరం అయిన యెరూషలేముకు వచ్చారు. అన్యజనులకు మెస్సయ్య జన్మసమయం నక్షత్రం ద్వారా తెలుపబడింది. లేఖనాల ద్వారా యూదులకు మెస్సయ్య జన్మస్థలం తెలుపబడింది. నక్షత్రం జ్ఞానులను తిన్నగా బేత్లెహేముకు నడిపించిందనుకొండి, క్రీస్తు జన్మమును గూర్చిన సమాచారం యూదులందరికి తెలిసి ఉండేదా? ఉండేది కాదు. అంటే నక్షత్రం ఉద్దేశ్యవూర్వకముగా జ్ఞానులను యెరూషలేముకు నడిపి అదృశ్యమయ్యింది. దీని అర్ధం, జ్ఞానులు యూదులందరికి హెడ్క్వాటర్ అయిన యెరూషలేము పట్టణములో “జన్మించిన యూదులరాజును” గురించి ఎంక్వయిరీ చెయ్యమని చెప్పడమే. అంటే, యెరూషలేము వాసులందరికి యూదులరాజును గురించి చెప్పడానికి దేవుడు జ్ఞానులను ఉపయోగించుకొన్నాడనేగా అర్ధం, అంటే, ఉద్దేశ్యపూర్వకంగానే నక్షత్రం జ్ఞానులను యెరూషలేముకు నడిపి అదృశ్యమయ్యింది. అలాగే జ్ఞానులు ఆ ఎంక్వయిరీలో వాళ్లకు తెలిసిన పద్దతులపై ఆధారపడేలా నక్షత్రం వాళ్ళని వదిలి వేసింది.

యెరూషలేములో అనేకులు ఆ నక్షత్రాన్ని చూసేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యివుండొచ్చు. ఎందుకంటే ఆ నక్షత్రం ఆకాశములో వారికి కనబడలేదు. ఇప్పుడు జ్ఞానుల మాటలు నమ్మాలా వద్దా? యెరూషలేమువాసులందరికి తన కుమారుని జన్మమును గురించి తెలియజెయ్యడానికేనా దేవుడు జ్ఞానులను యెరూషలేముకు రప్పించింది లేదా దేవునికి మరేదన్నా ఉద్దేశ్యం ఉందా? ఉంటే ఏమిటది? ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిధ్ధాం.

దేవుడు జ్ఞానులను యూదులను ఒకచోటికి చేర్చి ఒకరినుండి మరొకరు మెస్సయ్యను గురించిన సమాచారాన్ని ఎక్స్చేంజి చేసుకొనేలా చెయ్యడం దేవుని ప్రణాళికలో భాగం. రక్షకుడు అందరివాడు కాబట్టి విశిష్టమైన దేవుని జ్ఞానములో అన్యులు యూదులు ఇరువురు ఎదగాలన్నదే దేవుని ప్రణాళిక. అన్యులు యూదుల దగ్గరకు వచ్చి దేవుని కుమారుని జన్మమును గురించి దేవుని అధికారపూర్వకమైన వార్తను తెలియజేయటం, యూదులను వారి ఆత్మీయ విషయాలలో హెచ్చరించడమే.

దేవుడు క్రీస్తుని జన్మమును గురించి చాల దూరాన ఉన్న జ్ఞానులకు తెలియజేసాడు, ఇది ఆధ్యాత్మికంగా యెరూషలేము వారి భ్రష్టస్థితిని తెలియజేస్తూ మెస్సయ్య రాకడ కొరకు వాళ్ళు సిద్ధముగా లేరు అనే విషయాన్ని చెప్తూవుంది. దేవుడు తన సొంత పద్దతిలో యెరూషలేమువాసుల దగ్గరకు క్రీస్తు జన్మవార్తను తెచ్చి వాళ్ళు భయముతో వారి మెస్సయ్యను గురించి ఆలోచించేలా చేసాడు. ఇక్కడ జ్ఞానులు క్రీస్తును కనుగొనటానికి చాలా దూరం నుండి వచ్చారు.

జ్ఞానులు మెస్సయ్య యొక్క జన్మమును గురించి యెరూషలేములో ఉన్న ప్రతిఒక్కరికి తెలిసే ఉంటుందని అనుకొన్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గురించి చుట్టుప్రక్కల విచారించినప్పుడు, యెరూషలేమువాసులకు ఈ విషయాన్ని గురించి ఏమి తెలియదని తెలుసుకొని ఆశ్చర్యపడి ఉండొచ్చు. జ్ఞానుల ఎంక్వయిరీ గురించి యెరూషలేము అంతటా త్వరగా వ్యాపించి ఉండొచ్చు. అంటే, యెరూషలేములో ఉన్న ప్రధానయాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దూకయ్యులకు, ఇశ్రాయేలు పెద్దలకు, ఇశ్రాయేలులో సామాన్యుల వరకు అందరికి మెస్సయ్య జన్మమును గురించి జ్ఞానుల ద్వారా తెలుపబడింది. ఈవెన్ హేరోదు వరకు ఈ విషయం వెళ్లిపోయింది. తన పాలన గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోవడానికి, అలాగే రాజుకు విరోధముగా కుట్ర ఏమన్నా జరుగుతుందా అనేది తెలుకోవడానికి హేరోదు ప్రజల మధ్యలో ఎప్పుడు వేగుల వారిని ఉంచేవాడు. వారి ద్వారా ఈ వార్త హేరోదు వరకు వెళ్ళింది. హేరోదు జ్ఞానులను పిలిపించాడు. వాళ్ళు చెప్పిన సంగతి విన్నప్పుడు అతడును అతనితోకూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

హేరోదు ఎందుకని కలవరపడ్డాడు? హేరోదు గొప్ప నేరాలు చాలా రక్తపాతము ద్వారా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. హేరోదు యూదుడు కానప్పటికి, యూదులు మెస్సయ్య కొరకు నిరీక్షిస్తున్నారని అతనికి తెలుసు. ఇప్పుడు జ్ఞానులు వచ్చి, యూదుల రాజు పుట్టేసాడు మేము ఆయన నక్షత్రాన్ని చూసే వచ్చామని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళు మాములు వ్యక్తులు కారు, ఘనత వహించిన వాళ్లు. రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో తెలియదు. హేరోదు ప్రభుత్వము ఆగిపోతుందని అతని వంశపారంపర్యత నిలిచిపోవడాన్ని దేవుడు ఆజ్జ్యాపించి యున్నాడని పరిసయ్యులు నమ్మేవాళ్ళని చరిత్రకారుడైన జోసిఫస్ తెలియజేసియున్నాడు. జ్ఞానుల మాటలను బట్టి, నక్షత్రం కనిపించిందనే వాస్తవాన్నిబట్టి, అది యూదులరాజు జన్మించాడనడానికి రుజువుగా పరిగణించబడుతుండటం బట్టి, తన పాలన ముగియబోతోందని హేరోదు భయపడ్డాడు. అందువల్ల తన స్వంత భద్రతను మరియు తన ప్రభుత్వ శాశ్వతతను ఏ విధంగా భద్రపరచవచ్చో అనే కలవరం హేరోదులో మొదలయ్యింది. అంతేనా, వాగ్దానం చేయబడిన రాజు పుట్టిన వార్త ప్రజలకు ఉత్సాహం కలిగించి వారిని ఎంతగానో రెచ్చగొట్టొచ్చు, ప్రజలు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఆ క్రొత్త రాజును పట్టాభిషక్తుని గావించుటకు మద్దతు నిచ్చే అవకాశం మెండుగా ఉండటమే కాకుండా గొప్ప తిరుగుబాటు ద్వారా హేరోదును పదవీచ్యుతిని గావించి తన ప్రభుత్వ శాశ్వతతను తొలగిస్తారేమోనని, ఎంతో రాజ్యకాంక్ష కలిగిన హేరోదు కలవరపడ్డాడు, జ్ఞానుల మాటలు యెరుషలేము అంతటా వ్యాపించేసాయి, అక్కడినుండి యూదయ అంతటను వ్యాపించాయా అని హేరోదు ఆలోచిస్తూ భయాందోళనకు గురయ్యాడు. అతని ప్రశాంతత చెదిరిపోయింది. ఇది హేరోదు పరిస్థితి.

యెరూషలేమువాసులందరు ఎందుకని కలవరపడ్డారో తెలుసుకొందాం?. అతనితోకూడ వున్న యెరూషలేము వారందరి పరిస్థితి కూడా భిన్నమేమీ కాదు వాళ్ళది ఇబ్బందికమైన పరిస్థితే. ఒకప్రక్క, అలాంటి రాజు జన్మించి ఉన్నట్లైతే, మేము ఆయనను గురించి విని ఉందుము కదా, అలాంటిదేమి లేదని యెరూషలేమువాసులు జ్ఞానులకు చెప్పి ఉండొచ్చు. ప్రజలు చాలా అసహనాన్ని వ్యక్తీకరించి ఉండొచ్చు. అన్యులు దేవుని ప్రజలైన మా దగ్గరికి వచ్చి మా వాగ్దాన మెస్సయ్యను గురించి మాకు తెలియజెయ్యడమా అని ఉక్రోషపడి ఉండొచ్చు, అవమానంగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వారి విశ్వాసానికి ఇదొక పరీక్ష. దేవునిలో వారి జ్ఞానము అజ్ఞానమని తెలియజేయబడటం, వాగ్దాన రక్షకుని గుర్తించలేని వారి గ్రుడ్డితనము దేవుని మందిరమున్న పట్టణానికి దగ్గరలో జన్మించిన దేవుని కుమారుని గురించి ఎవరికి తెలియకపోవడం విచారించదగిన విషయం.  కాబట్టే వాళ్ళు నిర్గాంతపోవడమే కాకుండా కలవరపడ్డారు.

మరొకప్రక్క, హేరోదు ఎంతటి క్రూరుడో నిరంకుశుడో, నెత్తురు పారించేవాడో హింసాత్ముకుడో ప్రజలకు తెలుసు. హేరోదు కలవరాన్ని గమనించిన ప్రజలు తర్వాత జరగబోయే హింసను గురించి ఆలోచించటానికి భయపడ్డారు. మెస్సీయను సింహాసనంపై ఉంచడానికి జరిగే ఏ ఉద్యమన్నైనా అణచివేయడానికి హేరోదు ఏం చేస్తాడో అని ప్రజలు భయాందోళనకు గురైయ్యారు తప్ప తాము ఎదురు చూచిన మెస్సయ్య వచ్చియున్నాడని ప్రజలు సంతోషపడలేదు. బేత్లెహేము యెరూషలేముకు చాల దగ్గరగా ఉన్నప్పటికి, యెరూషలేమువాసులు అన్యుల నుండి యేసు పుట్టుకకు సంబంధించిన విషయాన్ని వినాల్సి రావడం చాల బాధాకరం. దేవునికి ఆయన కృపకు దగ్గరగా ఉన్నామని అనుకొనే వాళ్ళు ఆ కృప నుండి దూరముగా ఉండటం, విచారించదగిన విషయం.

మత్తయి 2:4-8_ 4 కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి – క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. 5 అందుకు వారు – యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి. 6-7 అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని 8– మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

  1. జ్ఞానులు యెరూషలేముకు ఎప్పుడు వచ్చారు?
  2. అప్పుడు యేసు పశువుల శాలలో ఉన్నాడా లేదా బేత్లెహేములో ఒక ఇంట్లో ఉన్నాడా?
  3. రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని ఎందుకని సమకూర్చాడు?
  4. హేరోదు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు ఎందుకని పిలిపించుకున్నాడు?
  5. హేరోదు జ్ఞానులను మాత్రమే బేత్లెహేముకు ఎందుకని పంపియున్నాడు?
  6. ఇశ్రాయేలీయులలో ఎవరు జ్ఞానులకు తోడుగా బేత్లెహేముకు ఎందుకని వెళ్ళలేదు? కారణాలు ఏమై ఉండొచ్చు?
  7. జ్ఞానుల ప్రతిస్పందన ఎలా ఉండి ఉండొచ్చు?
  8. ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి అని జ్ఞానులు ఆజ్జ్యాపింపబడ్డారు, ఎందుకని?

యేసు జన్మించిన చాలా నెలల తరువాత జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. అప్పటికే యేసుకు సున్నతి చేయబడింది. మరియ యోసేపులు అప్పుడు పశువుల పాకలో కాకుండా బేత్లెహేములోని ఒక ఇంట్లో ఉన్నారు. హేరోదు రాజు 4 బి.సి.లో మరణించాడని చరిత్ర చెప్తూవుంది. యేసు 5 లేదా 6 బి.సి.లో జన్మించి ఉండవచ్చని ఇది తెలియజేస్తూవుంది. 

జ్ఞానులు హేరోదు సభకు వచ్చారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ పుట్టాడు? అని అడిగారు. వచ్చిన వాళ్ళు మాములు వ్యక్తులు కారు, తూర్పు దేశపు రాజులు. కష్టమైన వందలాది మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ ప్రశ్నను తీసివేయడానికి లేదు కొట్టి పారేయడానికి లేదు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎవరో, ఎక్కడున్నాడో హేరోదుకు తెలియదు. కాని జ్ఞానుల ప్రశ్నను బట్టి మెస్సయ్య జన్మించాడని మాత్రం హేరోదుకు అర్ధమయ్యింది.

అయితే తనకేమి తెలియనట్లు నటిస్తూ, మెస్సయ్య జన్మస్థలం గురించి పక్కాగా తెలుసుకోవాలని హేరోదు అనుకొని, ఒక అసాధారణమైన సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ధర్మశాస్త్రములో నిష్ణానీతులైన శాస్త్రులును, ధర్మశాస్త్రమును అనువదించుటలో గుర్తింపు పొందిన పెద్దలను, పాతనిబంధన గ్రంథాలపై అధికారులుగా ఉన్న మనుష్యులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాడు. ఇక్కడ సమకూర్చుట అనే మాటకు అర్ధం హేరోదు ప్రధానయాజకులను, శాస్త్రులును, ఇశ్రాయేలు పెద్దలను ఉద్దేశిస్తూ, క్రీస్తుని గూర్చి వెతకండి, దర్యాప్తు చెయ్యండి, విచారించండి ఖచ్చితమైన సమాచారాన్ని నాకు తెలియజేయండి అని ఆజ్జ్యాపించడమే. హేరోదు ఒక మోసపూరిత క్రిమినల్ పథకాన్ని అమలు చేయడానికి ఈ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు తప్ప జ్ఞానులకు కావాల్సిన సమాచారాన్ని అందిధ్ధామని మాత్రం కాదు.

అప్పుడు వాళ్ళందరూ ఏకాభిప్రాయముతో, హేరోదుకు నివేదికను ఇస్తూ, జన్మించిన రాజు ఖచ్చితంగా ప్రవచనాల ప్రకారం ఎక్కడ పుడతాడో చెప్తూ, ఆ ప్రవచనాలను సాక్ష్యాధారాలుగా నివేదికలో పొందుపరచి, సింపుల్ గా విన్న వారందరికి అర్ధమయ్యేటట్లుగా యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలాన్ని గురించి ఖచ్చితముగా తెలియజేస్తూ, ప్రవక్తద్వారా వ్రాయబడియున్న ప్రవచనాన్ని అందుకు రుజువుగా, మీకా 5:2ను చూపించారు. ఆ కాలములో రెండు బేత్లెహేములు వున్నాయి. జెబూలోను గోత్రములో కూడా బేత్లెహేము అనే పల్లె వుంది దీనిని గురించి యెహోషువ 19:15 లో ప్రస్తావించబడి ఉంది. కాబట్టి ఏ మాత్రము గలిబిలికి తావివ్వకుండా ఖచ్చితముగా యూదయ బేత్లెహేములోనే మెస్సయ్య పుడతాడని చెప్పారు.

వాళ్ళు చెప్పిన దానిని బట్టి హేరోదుకు ప్రత్యర్థి రాజు ఎక్కడ జన్మించాడో తెలిసిపోయింది. తన మనస్సులో అప్పటికే ఏర్పడిన నెత్తుటి ప్రణాళికను అమలు చేయడానికి అతడు శిశువైన మెస్సయ్య ఖచ్చితంగా ఎప్పుడు జన్మించాడో అతని వయస్సు ఖచ్చితంగా ఎంతుంటుందో తెలుసుకోవాలి. అందుకు హేరోదుకు ఉన్న ఒకేఒక ఆప్షన్ జ్ఞానులు మాత్రమే. రెండో ఆప్షన్ కూడా ఉందనుకోండి “నక్షత్రం” కాని అది ఎవ్వరికి కనబడలేదే, జ్ఞానులకు తప్ప. నక్షత్రం హేరోదుకు కనబడి ఉంటే మెస్సయ్య ఇంకా అక్కడే ఉన్నాడనే నిర్ధారణతో తన మనుష్యులను బేత్లెహేముకు పంపి తన నెత్తుటి ప్రణాలికను అమలుచేసి ఉండేవాడు. యూదులకు కూడా నిశ్చయత కలిగి బేత్లెహేముకు వెళ్లి ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ఉన్నది ఒకటే ఆప్షన్ కాబట్టే హేరోదు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు పిలిపించుకున్నాడు. రహస్యముగా పిలిపించుకోవడమంటే, ఆలోచించాల్సిందే, కారణాలు ఏమై ఉండొచ్చని ఎప్పుడన్నా ఆలోచించారా?

హేరోదు వంచనను మోసాన్ని ఎరిగిన యూదులు హేరోదు మెస్సయ్య విషయములో కుట్ర చేస్తాడేమో అని అనుకోని, మెస్సయ్యను చంపాలనుకొనే అతని పధకాన్ని అడ్డుకోకుండా, ఆ క్రమములో యూదుల పెద్దలు జ్ఞానులకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా, ఒకవేళ యూదుల పెద్దలు జ్ఞానులకు సూచనలేమన్న ఇచ్చుంటే వాళ్ళు ఎలాంటి సూచనలు ఇచ్చారో జ్ఞానుల ద్వారా తెలుసుకొనేందుకు హేరోదు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు పిలిపించుకొని ఉండొచ్చు. జ్ఞానుల ద్వారా ఎలాంటి హెచ్చరిక యేసేపు మరియలకు చేరకుండా ఎంతో విధేయుడైన ఒక యూదునివలె జ్ఞానులకు నమ్మకము కలిగించేందుకు హేరోదు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు పిలిపించుకొని ఉండొచ్చు. జన్మించిన క్రొత్త రాజుపట్ల హేరోదు ప్రవర్తనను అతని ప్రతిస్పందనను జ్ఞానులు వారి దేశాలలో మంచిగా చెప్పుకోవాలని ఒక మంచి దౌత్యవేత్తగా ప్రవర్తిస్తూ ప్రోటోకాల్లో భాగముగా హేరోదు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు పిలిపించుకొని ఉండొచ్చు. మెస్సయ్య జన్మించిన సమయము యూదులకు తెలియకూడదని, తనకు మాత్రమే తెలియాలని అనుకొని ఖచ్చితమైన సమాచారంను సేకరించే క్రమములో, జన్మించిన రాజు వయస్సును అంచనా వెయ్యడానికి, ఆ శిశువును బ్రతకనివ్వకూడదనే కృతనిశ్చయంతో ఆ క్రమములో చాలామంది నష్టపోకుండా ఉండాలనే ఉదేశ్యముతో, హేరోదు ఎవ్వరికీ తెలియకుండా, ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలుసుకొనుటకు జ్ఞానులను రహస్యంగా తన దగ్గరకు పిలిపించుకొని ఉండొచ్చు.

ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలుసుకొనిన తరువాత  హేరోదు జ్ఞానులతో, మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి _ క్రీస్తును గుర్తించడంలో జ్ఞానులను ఉపయోగించుకోవాలనుకొని తద్వారా తన అధికారకాంక్షకు అడ్డం వచ్చే ఈ ముప్పును సులభంగా నాశనం చెయ్యాలనుకొని హేరోదు జ్ఞానులను బేత్లెహేమునకు పంపాడు.

ఇక్కడ హేరోదు ఒక పని చేసి ఉండొచ్చు. బేత్లెహేము యెరూషలేముకు 8 మైళ్ల దూరంలో ఉంది; జ్ఞానులకు గౌరవం ఇస్తున్నాననే నెపంతో హేరోదు సైనికుల రక్షణతో జ్ఞానులను బేత్లెహేముకు పంపించి ఉండొచ్చు, వాళ్ళ వెనుక హేరోదు ఈజీగా గూఢచారులను పంపించి ఉండొచ్చు. ఆ గూఢచారులు ఆ శిశువుని జ్ఞానుల సహాయముతో కనుగొని పిల్లవాడిని అతని తల్లిదండ్రులను ఏ కష్టం లేకుండా చంపేసి ఉండొచ్చు. ఇంత ఈజీ ప్లాన్ ని హేరోదు ఎలా మిస్ అయ్యాడు? జ్ఞానుల ద్వారా హేరోదు క్రూరత్వము అతనిని విదేశాలలో చెడ్డగా చెయ్యొచ్చు కాబట్టి జ్ఞానుల సమక్షంలో అతను అలాంటి క్రూరమైన చర్య చేయడానికి ఇష్టపడి ఉండక పోవచ్చు అని కొందరు అంటారు. కాని నేనైతే, ఒక విషయాన్ని నమ్ముతాను_ తన బిడ్డలను ఈజీగా నాశనం చేసే పద్దతులను శత్రువుల కళ్ళకు కనబడకుండా దేవుడు చెయ్యగలడు. దేవుడు రాజుల జ్ఞానమును నిరర్థకము చెయ్యగల వాడు, నమ్మండి.

జ్ఞానులు యెరూషలేము నుండి బెత్లెహేముకు బయలుదేరారు. జ్ఞానులు మాత్రమే ఒంటరిగా బేత్లెహేముకు వెళ్తుండటం మీకు విచిత్రంగా అనిపించడం లేదా? ఈ విషయాన్ని గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? హేరోదు సభనుండి కాని, యూదుల పెద్దలలో నుండి కాని లేదా యెరూషలేమువాసులలో నుండి కాని ఒక్క వ్యక్తికూడా జ్ఞానులతో క్రీస్తును చూడడానికి బయలుదేరక పోవడం, వెళ్ళకపోవడం, యూదులు భాద్యతారాహిత్యముగా ప్రవర్తించడం విచిత్రముగా అనిపించడం లేదా? కనీసం మనస్సాక్షిని బట్టి అయిన, మారాజు అనే ఆలోచనతోనైనా, రాజును చూడాలనే ఉత్సుకతతోనైనా లేదా విదేశీయులకు ఇచ్చే ప్రోటోకాల్ బట్టి అయిన ఎవరన్నా ఒక్కరు జ్ఞానులతో బయలుదేరి ఉండొచ్చు.

మరి ఎందుకని ఎవరూ బయలుదేర లేదంటారు. కారణాలు ఏమైవుండొచ్చు? అందుకు కొందరు కొన్ని కారణాలను చెప్తూ, హేరోదు ద్వారా జ్ఞానులు యెరూషలేము నుండి రహస్యంగా బేత్లెహేముకు పంపబడి ఉండొచ్చు అని. యూదులకు జ్ఞానులతో వెళ్లాలనివున్నా హేరోదును బట్టి జ్ఞానులతో వెళ్లే అవకాశం వాళ్ళకి దొరికి ఉండకపోవచ్చు అని. అలాగే ఆ శిశువు తలితండ్రులకు అనుమానము రాకుండా హేరోదు జ్ఞానులతో ఎవరినీ పంపించకుండా ఉండొచ్చు అని. యూదులు హేరోదు కుట్రను అనుమానించకుండా హేరోదు జ్ఞానులతో ఎవరినీ పంపలేదని, మెస్సయ్య ఎవరో తెలిస్తేనే కదా తిరుగుబాటుకు అవకాశం ఉంటుంది, ఆ అవకాశం యూదులకు హేరోదు ఇవ్వకుండా హేరోదు జ్ఞానులను ఒంటరిగా పంపించి ఉండొచ్చని చెప్తుంటారు.

మరికొందరు యూదులు హేరోదుకు భయపడి ఉండొచ్చు అని, యూదుల అమర్యాద పూర్వకమైన ప్రవర్తన, చూపిన నిర్లక్ష్యం దేవుని పట్ల వారి అవిధేయతకు కారణమని, ఆధ్యాత్మికంగా ఇది యెరూషలేము వారి భ్రష్టస్థితిని తెలియజేస్తూ మెస్సయ్య రాకడకు సిద్ధంగా వాళ్ళు లేరనే విషయాన్ని తెలియజేస్తూ ఉందని చెప్తూ ఉంటారు. యెరూషలేము ఆయనను తిరస్కరించడానికి మరొక కారణం వారి విలాసవంతమైన జీవిత ప్రమాణాలే. అవి వారిని నైతిక పతనానికి దారి తీయించాయని అందుకనే యెరూషలేమువాసులు వారి యూదుల రాజు విషయములో స్తబ్దుగా ఉండిపోయారని కొందరి చరిత్రకారుల అభిప్రాయం. ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, అనే మాటలు కరెక్టే కదండి.

ఏ కారణమైతేనేమి యూదుల ప్రతిస్పందన జ్ఞానులను నిరుత్సాహపర్చి ఉండొచ్చు. యూదుల రాజును గౌరవించడానికి మేము ఎంతో దూరంనుండి వస్తే, ఈ యూదులు జన్మించిన వారి రాజుపట్ల, మా పట్ల ఇలా వ్యవహరిస్తున్నారేంటి? అని జ్ఞానులు అనుకోని ఉండొచ్చు. మనతో ఎవరు రాక పోయిన, మన మాటలను ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం సిగ్గుపడకుండా క్రీస్తు దగ్గరకు ఒంటరిగానే వెళదాం అని జ్ఞానులు నిశ్చయించుకొని ఒంటరిగానే బయలు దేరారు. క్రీస్తును కనుగొనేవరకు వెతకాలని నిశ్చయించుకున్నారు. బేత్లెహేముకు బయలుదేరారు.

ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొండి అని జ్ఞానులు ఆజ్జ్యాపింపబడ్డారు. జాగ్రత్తగా విచారించి తెలుసుకొండి అనే మాటలకు, బేత్లెహేములో ఉన్న ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో విచారించండి, వెతకండి, మీరు అతన్ని కనుగొనే వరకు ఎవరినీ వదిలిపెట్టవద్దు అనే ఆజ్జ్య హేరోదు మాటలలో ధ్వనిస్తూ వుంది. ఆయన ఏ ఇంట్లో పుట్టాడు, ఇప్పుడు ఏ ఇంట్లో వున్నాడు, ఆయన తలితండ్రులు ఎవరు? యేసుని ఇంటి ప్రక్కన వాళ్ళు ఎవరు? ఆ ఇంటి ఆనవాళ్లు, గుర్తులు. ఆయన జన్మములో ఎలాంటి సంఘటనలు జరిగాయి? ఆయనను గురించి బేత్లెహేమువాసులకు తెలుసా? బేత్లెహేమువాసులు ఈ విషయాన్ని కప్పిపెడుతున్నారా? ఎంక్వయిరీకి సహకరిస్తున్నారా? యేసుని తల్లితండ్రులు ఈ విషయాన్ని దాచిపెడుతున్నారా? అనుమానమే రాకుండా చాల జాగ్రత్తగా క్రీస్తుని గూర్చి విచారించి ఆయన్ను గురించి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చెయ్యమనే ఆదేశము కూడా హేరోదు మాటలలో ధ్వనిస్తూవుంది. వాళ్ళు ఆ శిశువును గురించి ఎంత తెలుసుకొంటే హేరోదుకు ఆయనను చంపడం అంత సులభమవుతుంది కాబట్టి.

మత్తయి 2:9-12_ 9 వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను. 10-11 వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 12 తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

  1. జ్ఞానులు బేత్లెహేముకు వెళ్లి యేసును యెక్కడని వెదకాలి?
  2. తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచింది, ఎందుకని?
  3. నక్షత్రం తిరిగి కనిపించడానికి కారణం ఏమంటారు?
  4. నక్షత్రం నడవడమంటే ఏంటి?
  5. నక్షత్రం క్రీస్తువున్న ఇంటి పైన నిలిచిపోవడానికి కారణమేమంటారు?
  6. జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులెందుకని అయ్యారు?
  7. జ్ఞానులు బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఎందుకని ఆయనకు సమర్పించారు?
  8. జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత ఎందుకని బోధింపబడ్డారు?
  9. ఎందుకనిహేరోదు యేసును అడ్డు తొలగించుకోవాలనుకొన్నాడు?    

ఇప్పుడు జ్ఞానులు బేత్లెహేముకు వెళ్లి యేసును యెక్కడని వెదకాలి? తెలియదు. యెరూషలేము నుండి బేత్లెహేముకు 8 మైళ్ళు అంటే సుమారు రెండు గంటల ప్రయాణం. యెరూషలేము నుండి బేత్లెహేముకు రోడ్ ఉంది కాబట్టి జ్ఞానులు ఆ రోడ్డుని ఫాలో అయ్యి ఉంటారు. కొందరేమో (హేరోదు ప్లాన్ లో భాగముగా రాత్రి బసలో పగలు బస/ఎంక్వయిరీ లో అనేక విషయాలు తెలుసుకొనే ఉద్దేశ్యములో) జ్ఞానులు యెరూషలేము నుండి బేత్లెహేముకు సాయంత్రం బయలుదేరి ఉండొచ్చు అని అంటారు. నిరుత్సాహముతో వాళ్ళు బేత్లెహేముకు ప్రయాణం మొదలుపెట్టారు. వారికి నక్షత్రం మళ్ళి కనబడిన వెంటనే వారి ఆత్మలు పునరుజ్జీవనం పొందాయి, వారి హృదయాలలో ఆనందం నిండింది, వారి ముఖాలలో ఉల్లాసం కనిపించింది; చెప్పలేని ఆనందంతో తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచింది. నక్షత్రం తిరిగి కనిపించడానికి కారణం ఏమంటారు? జ్ఞానులను వారి నిరుత్సాహములో వారిని ప్రోత్సహించడం దేవుని ఉద్దేశ్యము కావొచ్చు. వేరొక్కరి ప్రమేయమేమి లేకుండా ఖచ్చితమైన లొకేషన్కి వారిని నడిపించడానికి దేవుని ప్రణాళికలో భాగముగా నక్షత్రము కనబడి ఉండొచ్చు.

ఈ నక్షత్రం వారితో పాటు యెరూషలేము నుండి బెత్లెహేమ్ దిశగా వారితో పాటు వెళ్తూవుంది అంటే ఇది ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లింది; దీని కక్షను బట్టి ఇది ఆకాశంలోని ఇతర నక్షత్రాల కంటే భిన్నమైనదని చెప్పొచ్చు. ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న ఇంటిపైన నిలిచింది అంటే, అర్ధమేమిటంటే, నిస్సందేహముగా, ఈ నక్షత్రం బేత్లెహేము మీద కాకుండా మెస్సయ్య ఉన్న ఇంటి మీద ఆగిపోయింది అని అర్ధం. నక్షత్రం జ్ఞానులను క్రీస్తు ఉన్న ఇంటి దగ్గరికి నడిపి అంటే ఇంటిపైన నిలచిపోవడాన్ని బట్టి అంటే నక్షత్రం కదలకపోవడాన్ని బట్టి ఈ నక్షత్రం బహుశా చాలా ఎత్తులో ఉండి ఉండక పోవచ్చని అంతరిక్ష ప్రపంచానికి చెందినది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే అంతరిక్షం నుండి ఏ నక్షత్రం కూడా ఒక నిర్దిష్ట ఇంటిని ఖచ్చితముగా సూచించ లేదు. ఈ నక్షత్రం చేసినట్లుగా ఏ నక్షత్రము గాని గ్రహము గాని ఇలా చెయ్యడం అసాధ్యం. అలాగే నక్షత్రం నుండి ఖచ్చితముగా క్రీస్తువున్న ఇంటిపైన పడిన వెలుగు కిరణం గురించి ఇక్కడ ఏమీ చెప్పబడలేదు కూడా.

కాబట్టే లూకా 2:8లో యేసు జన్మములో గొఱ్ఱెల కాపరులకు ప్రభువు దూత ప్రత్యక్షమైనప్పుడు “ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించెను” అని చెప్పబడియున్నది కదా. ఇక్కడ దేవుడు తన కుమారుని వద్దకు జ్ఞానులను నడిపిస్తున్న క్రమములో ప్రస్తావించబడిన నక్షత్రము ప్రభువు మహిమ కావొచ్చు. దానిని జ్ఞానులు చూశారు. అది జ్ఞానులను బేత్లెహేముకు బేత్లెహేములో ఉన్న క్రీస్తుని ఇంటికి నడిపి ఉండొచ్చు, సందేహమే లేదు.

నక్షత్రం క్రీస్తువున్న ఇంటిపైన నిలిచిపోవడానికి కారణమేమంటారు? బేత్లెహేములో క్రీస్తు ఏ ఇంట్లో ఉన్నాడో జ్ఞానులకు తెలియదు. ఒకవేళ జ్ఞానులు ఇంటింటికి తిరుగుతూ క్రీస్తు గురించి ఎంక్వయిరీ చేస్తే, ఎవరో ఒకరు ఆ విషయాన్ని హేరోదుకు తెలియజేసే అవకాశం ఉంది. అప్పుడు క్రీస్తుని తలితండ్రులను గురించి, క్రీస్తుని గురించి హేరోదుకు తెలిసిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు జ్ఞానులు ఆయన కోసం ఏ వ్యక్తిని విచారించాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా తెలియాల్సిన అవసరం లేదు.

జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులైయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి సుదీర్ఘ ప్రయాణం విజయవంతమైంది. క్రీస్తుని జన్మమునుబట్టి వారు ధృవీకరించబడ్డారు, దైవికమైన నిర్దేశకత్వములో (దేవుడే నేరుగా ఏ పొరపాటు లేకుండా వారిని గమ్యానికి నడిపించుటను బట్టి), తమకివ్వబడిన ధన్యతనుబట్టి ఆనందపడ్డారు నిశ్చయతతో ఉబ్బితబ్బిబయ్యారు అని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. వారి కష్టమైన అన్వేషణ ముగిసింది.

తర్వాత జ్ఞానులు యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, ఆ శిశువు ఎదుట సాగిలపడి, ఆయనను పూజించి, జ్ఞానులు ఎవరినైతే చూడాలని కోరుకున్నారో ఆయనను వారు తమ కళ్లతో ప్రత్యేకముగా చూసారు. ఆయన జన్మస్థలము ఆయన దీనస్థితి అక్కడి పేదరికము ఇవి ఏమి కూడా క్రీస్తును ఆరాధించకుండా జ్ఞానులను అడ్డుకోలేక పోయాయి. జ్ఞానులు కలత చెందలేదు. వారు కేవలం ప్రవక్త యొక్క ప్రవచనాన్ని బట్టి మరియు నక్షత్రం యొక్క సాక్ష్యాన్ని అనుసరించి వచ్చారు. ఆయనను రాజుగా నమ్మారు. వారి తూర్పు దేశపు సంప్రదాయాలను అనుసరించి సంపూర్ణ సమర్పణతో యూదులరాజైన ఆ శిశువు ఎదుట సాగిలపడ్డారు.

తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఈ విషయాన్నే కీర్తనలు 72:10,15 చెప్తూ_ రాజులు “రాజును” సేవించడం ఆయన ముందు సాగిలపడటం మరియు బహుమతులు అందించడం గురించి మాట్లాడుతూ_తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబ రాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు. షేబ బంగారము అతనికి ఇయ్యబడును అని ముందుగానే ప్రవచింపబడియున్నది. అలాగే యెషయా 60:1-6 వచనాలలో బంగారము ధూపద్రవ్యములు యెహోవా స్తోత్రములను గూర్చి ప్రస్తావించబడియున్నది. ఈ రెండు ప్రవచనాలు ఇక్కడ నెరవేరాయి. కొందరేమో ఈ రెఫరెన్సులను బట్టి  క్రీస్తును చూడటానికి వచ్చిన జ్ఞానులు తూర్పు దేశపు రాజులై ఉండొచ్చని అంటూ వుంటారు.

బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా శిశువుకు ఇవ్వడం వింతగా అనిపించొచ్చు. ఇవి ఖరీదైన బహుమతులు. మూడు బహుమతులలోనూ గొప్ప సింబాలిజంను మనం చూడవచ్చు. బంగారం అనేది రాజుకి ఇచ్చే బహుమతి. దేవాలయ ఆరాధనలో సాంబ్రాణి ఉపయోగించబడుతుంది. నిర్గమ 30:34 ప్రకారము యాజకునికి తగిన బహుమతి. సాంబ్రాణి క్రీస్తు దేవుడని గుర్తుచేస్తూ ఉంది. యూదులు ప్రతిరోజు దేవాలయములో జరిగే ఆరాధనలలో సాంబ్రాణిని విరివిగా ఉపయోగించే వాళ్ళు. పైకిలేచే సుగంధ ధూపం దేవునికి ఇష్టమైన ప్రజల ప్రార్థనలను సూచిస్తుంది. బోళమును యాజకులు అభిషేక తైలముగా ఉపయోగిస్తారు, ఈ విషయం నిర్గమ 30:23 లో తెలియజేయబడియున్నది. బోళము యేసు మానవత్వాన్ని ఆయన శ్రమలు మరణాన్ని సూచిస్తూ వుంది. అట్లే దీనిని పెర్ఫ్యూమ్ గాను మరియు ఎంబాలింగ్ ప్రక్రియలో అంటే మృతదేహాలను ఖననం చేయడానికి, సిద్ధం చేయడానికి అవసరమైన సుగంధ రెసిన్ గా కూడా ఉపయోగించే వాళ్ళు. నీకొదేము యేసు శరీరాన్ని ఖననానికి సిద్ధం చెయ్యడానికి కలబంద బోళము కలిసిన మిశ్రమాన్ని తెచ్చినట్లుగా యోహాను 19:39-40 వచనాలు తెలియజేస్తూవున్నాయి. ఇది వైన్తో కలిపినప్పుడు ఒక రకమైన మత్తుమందుగా కూడా ఉపయోగపడింది. అందుకే రోమన్ సైనికులు యేసు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆయనకు బోళముతో కలిపిన వైన్ ఇచ్చారు (మార్క్ 15:23), కాని ఆయన దానిని త్రాగడానికి నిరాకరించాడని బైబులు తెలియజేస్తూవుంది.

క్రీస్తుకు వారు ఇచ్చిన బహుమతులలో, ఆ టైంలో, మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్న సింబాలిజంను వారు ఎంత వరకు అర్థం చేసుకున్నారో మనం చెప్పలేము. బహుశా వారు తమ మాతృభూమి నుండి అత్యంత ప్రత్యేకమైన బహుమతులను శిశువైన యేసుకు ఇవ్వాలనుకున్నారు, తెచ్చి ఇచ్చారు అంతే.  కొద్ది గంటలలో యేసేపు తన భార్య అయిన మరియను క్రీస్తును తీసుకొని ఐగుప్తుకు వెళ్లిపోవలసి ఉన్నాడు. బంగారము సాంబ్రాణి బోళము చాల ఖరీదైన బహుమతులు మాత్రమే కాదు, అవి సులభముగా తీసుకుపోగలిగినవి కూడా. తనతో వారి కొరకు యేసేపు ఈ బంగారంను సాంబ్రాణి బోళములను తీసుకెళ్లొచ్చు. ఐగుప్తు ప్రయాణ ఖర్చులకు అక్కడ వారి జీవనానికి ఆసరాగా కొద్ది రోజులు ఇవి యేసేపు మరియలకు సహాయపడతాయి. అంటే ఇవి వారి ముందున్న ప్రయాణము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బహుమతులు కావొచ్చు.

తరువాత జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి. హేరోదునొద్దకు తిరిగి వెళ్లవద్దని కలలో దేవుడు వారిని హెచ్చరించడంతో, వారు మరొక మార్గంలో తమ స్వంత దేశానికి బయలుదేరారు. రక్షకుని పట్ల హేరోదు కున్న ప్లాన్ లను భగ్నం చేయడానికి దైవిక జోక్యం యొక్క మరొక ఉదాహరణ ఇక్కడ ఉంది. జ్ఞానులు ఖచ్చితంగా హేరోదు యొక్క క్రూరత్వంను గురించి మరియు అతడు చేయించిన అనేకమైన హత్యలను గురించి వినే వుంటారు. ఇప్పుడు జ్ఞానులు హేరోదు దగ్గరకు తిరిగి వెళ్లి మెస్సయ్యకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే ఏమి జరుగుతుందో జ్ఞానులకు తెలియదా, వాళ్ళు ఆ మాత్రం ఊహించి ఉండరా? కాబట్టే దేవా, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని వాళ్ళు దేవునిని ప్రార్దించి ఉండొచ్చు. ఆ రాత్రంతా వాళ్ళు బేత్లెహేములో గడపాలని అనుకోవడం లేదు. జవాబు కొరకు ఎదురుచూస్తూ ఉండగా వాళ్ళకి చిన్న నిద్రపట్టి ఉండొచ్చు. ఆ నిద్రలో దేవుడు వారి ప్రశ్నకు వారి స్వప్నమందు జవాబునిచ్చాడు. ఈ విషయాన్నే ఈ మాటలు తెలియజేస్తూ, వాళ్ళు హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారైరి అని చెప్తూవుంది. ఇక్కడ వాడిన బోధింపబడినవారై అను గ్రీకు మాటను, ఒక ప్రశ్న అడిగిన వ్యక్తికి జవాబు చెప్పేందుకు వాడే వాళ్లు. అంటే జ్ఞానులు దేవునిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు వారి ప్రశ్నకు స్వప్నమందు జవాబు చెప్పాడని ఈ మాటలు చెప్తున్నాయి. వారు జవాబును అందుకున్నారు, హేరోదు వద్దకు వెళ్లకుండా మరొక మార్గమున తమ దేశానికి బయలుదేరారు.

ఆయన నక్షత్రమును జ్ఞానులు యూదయ భూభాగముపై చూచినప్పుడు వాళ్ళు ఇప్పుడు జవాబు కొరకు ప్రార్దించినట్లుగానే దేవా, ఈ నక్షత్రము యూదుల రాజుకు చెందినదా? అని ప్రశ్నించి ఉండొచ్చుగా. అప్పుడు దేవుడు అవును అను జవాబుతో ఆ విషయాన్ని వాళ్లకు నిర్ధారించి ఉండొచ్చుగా.

ఈ ప్రపంచంలో ఎందరు హేరోదులు ఉన్నా దేవునికి లేదా దేవుని ప్రజలకు సరిపోరు. హేరోదు ఉద్దేశ్యాలలో చిక్కుబడకుండా దేవుడు జ్ఞానులను హెచ్చరించాడు. కాబట్టే హేరోదును తప్పించుకోగలిగారు. ఇరుకైన మరొక మార్గం ద్వారా తమ సొంత దేశానికి తిరిగి వెళ్లారు.

ఈ కథ రెండు ఉదేశ్యాలను తెలియజేస్తూవుంది. ఒకటి, క్రీస్తుకు సంబంధించిన ప్రవచన నెరవేర్పును చూపించడానికి, ఆయనే నిజమైన మెస్సీయ అని కాన్స్టిట్యూట్ చేయడం; మరొకటి, దేవుడు ఎలా ఏవిధముగా ఎటువంటి నిర్ధారణ నిశ్చయత ద్వారా అన్యజనులను క్రీస్తు వద్దకు నడిపించియున్నాడో తెలియజేయటమే. యేసు అందరి రక్షకుడై యున్నాడు.

అన్వయింపులో కొన్ని హెచ్చరికలను మంచిని మన కొరకు తీసుకొందాం:

జ్ఞానులులాగే ప్రభువు మిమ్మల్ని కూడా తానే రక్షకుని వద్దకు తెచ్చియున్నాడు. ఆ సంఘటనలు మీకు సాధారణమైనవిగా అనిపించి ఉండొచ్చు, అసలు మీకవి గుర్తేలేకపోవొచ్చు. కాని అవి యేసు సన్నిధిలోకి జ్ఞానులను నడిపించడానికి దేవుడు  ఉపయోగించిన సంఘటనలవలె అద్భుతమైనవని మాత్రం మరచి పోకండి. జ్ఞానులు దేవునిని నమ్మారు, వారి నమ్మిక వ్యర్ధము కాలేదు నమ్మకంతో ముందుకు వెళ్ళితే దేవుడే నిర్దేశిస్తాడు. ఆయనే తోడుగా ఉంటాడు. క్రియాశీలకంగా ఉన్న విశ్వాసానికి తప్పకుండ సహాయము దొరుకుతుంది. తమతో ఎవ్వరు రాకపోయినా క్రీస్తు నొద్దకు జ్ఞానులు ఒంటరిగానే వెళ్లారు. ఒకవేళ ఎవరు మీతో పాటు పరలోకానికి రావడానికి ఇష్టపడకపోతే, దయచేసి వాళ్ళతో మాత్రం నరకానికి వెళ్ళకండి.

హేరోదు అప్పటికే ముసలివాడు, యూదయను ముప్పైఐదు సంవత్సరాలు పాలించాడు; జన్మించిన రాజు క్రొత్తగా అప్పుడే జన్మించాడు. అతను ఎదిగి పెద్దవాడవటానికి చాల కాలం పడుతుంది. కాని హేరోదు అతనిపై అసూయపడ్డాడు. ఎంతలా అంటే ఆ శిశువైన యేసురక్తం మాత్రమే అతని అసూయను సంతృప్తిపరచగలిగే అంతగా. ఆ శిశువు మెస్సయ్య అంటే దేవుని కుమారుడు, దేవుడే. ఆయనను వ్యతిరేకించడం లేదా ఆయనపై ఏవైనా ప్రయత్నాలు చేస్తే, హేరోదు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు, దానికంటే వ్యర్ధమైన పని మరొకటి లేదు, అది ప్రమాదకరం. మరి తెలిసి తెలిసి ఎందుకని హేరోదు యేసును అడ్డు తొలగించుకోవాలనుకొన్నాడు? దీనికి ఒకటే కారణం, హేరోదు యొక్క కాంక్ష అతని మనసును మనసాక్షిని లోపరచుకొని దానిపై అధికారాన్ని చెలాయించడమే అని చెప్పొచ్చు. అతడు తన కాంక్షలకు ఎంత వ్యసనపరుడై యున్నాడో చూడండి. రెండవదిగా, దీని వెనుక మనకు ఆగర్భ శత్రువైన సాతానుడు కూడా ఉన్నాడు. మెస్సయ్యను మట్టుపెట్టి తద్వారా మానవాళికి విముక్తిని రక్షణను దూరం చేయాలన్నదే వాడి సంకల్పం. హేరోదు ఎంత ప్రయత్నించినా, ప్రపంచ రక్షణ కోసమైన దేవుని ప్రణాళికను భగ్నం చేయలేడు.

యూదుల సౌకర్యవంతమైన జీవితము వారి జీవితాలను తన స్వాధీనములో ఉంచుకొనియున్నది. మరి మన విషయములో?

ఐగుప్తుకు తప్పించుకోవడం 13-18

మత్తయి 2:13-18_ 13వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై–హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. 14-15 అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని, ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడనుండెను. 16 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను. 17అందువలన –రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదనధ్వనియు కలిగెను 18 రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.

  1. దేవుడు యేసేపుకు మరియను యేసును తీసుకొని ఐగుప్తుకే పారిపొమ్మని ఎందుకని చెప్పాడు? దీనితో ముడిపడి ఉన్న దేవుని ప్రవచనాలు ఏంటి?
  2. ఐగుప్తులో వీళ్లు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ ఉండేవాళ్ళు?
  3. ఐగుప్తుకు వెళ్లడంలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి?
  4. దేవుడు భూసంబంధమైన ఒక రాజునుంచి పారిపోవడం అవమానకరంగా లేదా అని ఎవరన్నా ప్రశ్నించారనుకొండి ఎలా జవాబిస్తాం?
  5. యేసు ఈ ఐగుప్తు ప్రయాణములో జరిగినట్లుగా చెప్పే కధలు ప్రామాణికమైనవా?
  6. హేరోదులో ఆగ్రహము ఎందుకని కట్టలు తెంచుకొంది?
  7. బేత్లెహేములోనే కాకుండా దానిచుట్టూ ఉన్న గ్రామాలలోని పిల్లలను హేరోదు ఎందుకని చంపించాడు?
  8. ఎంతమంది పిల్లలు మరణించి ఉండొచ్చు?
  9. ఫ్లవర్ అఫ్ martyrdom అంటే ఎవరు?
  10. నిర్దోషులైన పిల్లలు చంపబడుటకు దేవుడు ఎందుకని హేరోదును అనుమతించాడు?
  11. హేరోదు ఆదేశాల మేరకు పిల్లలను దారుణంగా చంపేసిన వ్యక్తుల సంగతేంటి?
  12.  పిల్లలను చంపడంలో involveయైన వాళ్ళకి మంచి ఉదేశ్యము ఏమై ఉంటుంది??  
  13. రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అను మాటలకు అర్ధం ఏమిటి?

యెరూషలేము నుండి బేత్లెహేముకు రెండు గంటల ప్రయాణం. జ్ఞానులు హేరోదుతో మాట్లాడిన రోజునే వాళ్ళు బేత్లెహేముకు చేరుకున్నారు, క్రీస్తును కనుగొన్నారు, ఆయనను సేవించారు దేవునిచేత భోధింపబడి మరొక దారిన తిరిగి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్లిపోయారు. యేసేపు మరియ, శిశువైన క్రీస్తు కూడా అదే రాత్రి బేత్లెహేము నుండి బయలుదేరి ఐగుప్తునకు పారిపోయారు. ఉదయానికి జ్ఞానులు గాని యేసేపు చిన్న కుటుంబంగాని కనబడకుండ పోయారు. క్రీస్తు ఏ ఇంట్లో ఉన్నాడో ఎవరికీ తెలియదు కాబట్టి బెత్లెహేమ్‌లో ఎవ్వరికి యేసేపు కుటుంబాన్ని గురించి గాని వాళ్ళు ఎక్కడకు వెళ్లారో, ఎక్కడున్నారో చెప్పలేని పరిస్థితి.

సాతాను, సాతానుచే చెడగొట్టబడిన మనిషి తమ వికృతమైన దుర్మార్గమైన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో దేవునికి ముందుగానే తెలుసు. వారి దుర్మార్గమైన చర్యలు, పనులలో కూడా దేవుని ముందస్తు జ్ఞానం పనిచేస్తూనే ఉంటుంది, దేవుడు చెడును ఇష్టపడడు కాబట్టి ఆ చెడుకు ఒక పరిమితి కొలత time ఉంది. ఆయన ఎప్పుడు, ఎలా దానితో జోక్యం చేసుకొంటాడో శిక్షిస్తాడో అనే విషయాలు దేవుని చేతిలోనే ఉంటాయి. దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ప్రతిదీ నియంత్రిస్తూనే ఉన్నాడని, సమస్తమును ఆయన స్వాధీనములోనే ఉన్నవనే విషయాన్ని మరచిపోకండి.

శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు చెప్పింది. నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని (మరోసారి ఖచ్చితంగా ఆయన తల్లిని అనే మాటలలో కన్యక గర్భవతియై కుమారుని కనును) అనే వాగ్ధానాన్ని ఈ మాటలు వక్కాణిస్తూవున్నాయి. హేరోదు నుండి తప్పించుకోవడానికి క్రీస్తును యేసేపును, మరియలను దేవుడు ఐగుప్తుకే ఎందుకని వెళ్ళమన్నాడు? ఎందుకంటే, దేవుని ప్రవచనాలు దీనితో ముడిపడివున్నాయి కాబట్టి ఆయన వారిని అక్కడికి వెళ్ళమన్నాడు. యేసు నెరవేర్చిన ఆ ప్రవచనాలేంటో తెలుసుకొందాం: మొదటి ప్రవచనము: హోషేయ 11:1_ ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతని యెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని.

  1. ఈ మాటలు “ఇశ్రాయేలు” విషయములో నెరవేరియున్నవని పాత నిబంధన చెప్తూవుంది. యాకోబు కుమారుడైన యేసేపు టైంలో యెహోవా ఐగుప్తునుండి తనబిడ్డ అయిన ఇశ్రాయేలును పిలుచుట ద్వారా వారిని కరువు నుండి మరణం నుండి కాపాడాడు.
  2. ఈ మాటలు యేసు జీవితములో కూడా నెరవేరాయని కొత్త నిబంధన చెప్తూవుంది. క్రీస్తు ఇశ్రాయేలుకు ప్రతి రూపం. తన ఏకైక కుమారుణ్ణి హేరోదు రాజు చేతిలో నుండి రక్షించడానికి యెహోవా తన బిడ్డ అయిన ఇశ్రాయేలును యేసేపు మరియలను ఐగుప్తునుండి పిలిచాడు.

మనం గుర్తుంచుకోవలసిన మరొక విషయం, ఐగుప్తునుండి ఇశ్రాయేలు యొక్క నిర్గమము అంటే, దేవుడు తాను ఏర్పరచు కొనినవారిని దాస్యము నుండి విడిపించడం. ఈ చర్యలో, దేవుని చిత్తము నెరవేరింది కాని అది పాక్షికంగా మాత్రమే. దేవుడు తన సొంత కుమారుడిని ఐగుప్తు నుండి పిలిచి తిరిగి ఆయనను వాగ్ధాన దేశమునకు నడిపించడంలో ఆయన చిత్తము పూర్తిగా నెరవేరింది.

ఐగుప్తులో వీళ్లు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడ ఉండేవాళ్ళు? అనే ప్రశ్నలకు బైబులు జవాబు ఇవ్వడం లేదు. అయితే ఆ రోజులలో యూదులు ఎక్కువగా ఆశ్రయించిన ప్రదేశం, వారి జీవనోపాధి కోసం ఏర్పాటు చేయబడిన పట్టణము ఐగుప్తులోని అలెగ్జాండ్రియా. కాబట్టి యేసేపు మరియ యేసులు అలెగ్జాండ్రియాకు వెళ్లారని యూదులలో కొందరు చెప్తారు. Tradition యేమని చెప్తుందంటే, యేసేపు మరియ, యేసు నైలు డెల్టా ప్రాంత మధ్య భాగంలో ఉన్న ఒక ఈజిప్షియన్ నగరమైన లియోంటోపాలిస్ సమీపంలోని మాతారెయాకు వెళ్లారని అక్కడ నివసించారని తెలియజేస్తూవుంది. వాళ్ళు బహుశా తమ ప్రయాణానికి ఐగుప్తులో బస చేయడానికి జ్ఞానులనుండి స్వీకరించిన ఖరీదైన బహుమతులను ఉపయోగించి ఉండొచ్చు.

ఐగుప్తుకు వెళ్లడంలో ఉన్న advantages చూధ్ధాం. మొదటిది, పాత నిబంధన కాలములో ఐగుప్తు ఒక సాంప్రదాయ ఆశ్రయ ప్రదేశం అని మనం గ్రహించాలి. అబ్రాహాము కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్లినట్లుగా ఆదికాండము 12:10 చెప్తూవుంది. అట్లే యాకోబు అతని 70 మంది కుటుంబసభ్యులు కరువు కారణంగానే ఐగుప్తులో ఆశ్రయం పొందియున్నారనే విషయాన్ని ఆదికాండము 46 చెప్తూవుంది. వాళ్ళు అక్కడ శక్తివంతమైన దేశంగా మారారు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత దేవుడు మోషే క్రింద వారిని వాగ్దాన దేశమునకు నడిపించే వరకు వారు ఐగుప్తులో ఉన్నారనే విషయం మనకందరికి తెలుసు. సొలొమోను యరొబామును చంపచూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషకునొద్ద చేరి సొలొమోను మరణమగువరకు ఐగుప్తులోనే యుండెనని 1రాజులు 11:40 చెప్తూవుంది. ఉరియా అను ప్రవక్తను రాజైన యెహోయాకీమును అతని శూరులందరును ప్రధానులందరును చంపచూడగా అతడు ఐగుప్తుకు పారిపోయాడనే విషయం యిర్మీయా 26: 21-23 తెలియజేస్తూవుంది. ఈ లేఖనభాగాల ఆధారముగా ఐగుప్తు అనేది ఒక సంప్రదాయమైన ఆశ్రయ ప్రదేశమని చెప్పొచ్చు.

రెండవదిగా, సుదీర్ఘమైన మరియు దుర్భరమైన ప్రయాణం తల్లి మరియు ఆమె చిన్న బిడ్డకు తగినది కాదు. ఐగుప్తు యూదయకు నైరుతి దిశలో బెత్లెహేము నుండి దాదాపు 60మైళ్ల దూరంలో మాత్రమే ఉంది. అక్కడ చాలామంది యూదులు ఉన్నారు, వారికి అక్కడ దేవాలయం సమాజమందిరాలు కూడా ఉన్నాయనే విషయాన్ని యెషయా 19:18,19 తెలియజేస్తూవున్నాయి. కాబట్టి యేసేపు మరియలు తమ సొంత దేశస్థుల మధ్య సౌఖ్యముగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐగుప్తులో ఉండొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. అట్లే శిశువైన యేసుకాలములో ఇది రోమన్ ప్రావిన్స్. హేరోదు యొక్క అధికార పరిధి సిహోన్ నది వరకు మాత్రమే కాబట్టి హేరోదు వారిని చేరుకోలేడు. ఇది మరొక అడ్వాంటేజ్.

శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు చెప్పింది. ఈ మాటలలో మనలను ఇబ్బందిపెట్టే ఒక మాటవుంది, “పారిపోయి” అనే మాట. ఆ శిశువు “శరీరధారియైయున్న నిజదేవుడు”. ఆయన భూసంబంధమైన ఒక రాజునుంచి పారిపోవడం అవమానకరంగా లేదా అని ఎవరన్నా ప్రశ్నించారనుకోండి ఎలా జవాబిస్తాం?

జవాబుగా, ఇక్కడ యేసేపు విశ్వాసము త్రీవంగా పరీక్షింపబడినదని మనం తప్పకుండ ఒప్పుకొని తీరాలి. నిశ్చయముగా ఈ శిశువేవరో యేసేపుకు తెలుసు. అతడు గొర్రెలకాపరుల అనుభవాన్ని విన్నాడు, సుమెయోను హన్నా చెప్పిన మాటలను విన్నాడు, జ్ఞానుల అనుభవాన్ని గురించి కూడా విన్నాడు. ఇప్పుడు ఆ శిశువు విషయములో దేవుని ఈ మాటలు. ఈ మాటలు యేసేపులో సందేహాలను రేకెత్తివుండొచ్చు. ఇది నిజమా? ఇది సాధ్యమా? తన పక్షమున కోట్లకొలదిగా దేవదూతలను కలిగియున్న ఈ శిశువును తీసుకొని నేను ఐగుప్తుకు పారిపోవాలా? ఈ చీకట్లోనా అని సణుగుకొని ఉండొచ్చు, అభ్యంతరపడి ఉండొచ్చు.

అయితే, ఇశ్రాయేలు యొక్క ఓదార్పుకోసం ఎదుచూస్తున్న వాళ్ళు లోకముయొక్క ద్వేషాన్నికూడా తప్పకుండా అనుభవించాల్సి ఉంటుందనే విషయం నీతిమంతుడైన యేసేపుకు అనుభవమే. ఈ శిశువు విషయములో ఈ విషయాన్ని గురించే సిమియోను ప్రవచిస్తూ, లూకా2:34-35లో, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి యున్నాడు; మరియు నీ హృదయము లోనికి ఒక ఖడ్గము దూసికొని పోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పటం యేసేపు వినియున్నాడు కూడా. కాబట్టి ప్రభువు యొక్క అభిషిక్తునికి లోకము విరోధమనే సంగతి యేసుపుకు ఆశ్చర్యాన్నేమి కలిగించి ఉండక పోవొచ్చు. అతడు సంతోషముతో ఆ భాధ్యతను తీసుకొన్నాడు. వెంటనే యేసేపు నిద్రనుండి లేచి తడవుచేయక, తక్షణమే ఆ బాధ్యతకు విధేయుడయ్యాడు. అదే రాత్రి అతడు నిశ్శబ్దంగా తన సంరక్షణకు అప్పగించబడిన వారితో తప్పించుకున్నాడు.

రక్షణ కోసం దేవదూతల మహా సైన్యాన్ని తన కోసం తన తండ్రిని అడగగలిగిన యేసు ఒక వ్యక్తి నుండి బలవంతముగా పారిపోవలసి రావటం, అవమానకరం కాదు అది ఆయన దీనత్వములో ఒక భాగము. యేసు నిజదేవుడు నిజమానవుడు. సర్వశక్తిమంతుడైన దేవుడు చాల మాములు మనిషి అయిన యేసేపు (రక్షకభటుని) చేతిలో “ప్రశాంతముగా” ఉన్నాడనే విషయాన్ని మరచిపోకండి. ఆయన ఘడియ ఇంకను రాలేదు. కాబట్టి ఆయనకు జరిగే ప్రమాదమేమీ లేదు, ఆయన ఘడియ వచ్చేవరకు అది దేవుని చిత్తము. ఈ విషయం దేవునికి తన ముందస్తు జ్ఞానములో జగత్తుపునాది వేయబడకముందే అంటే హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకుననే విషయం ఆయనకు తెలుసు అనే విషయాన్ని మరచిపోకండి.   

కాని కొంతమంది యేసు ఈ ఐగుప్తు ప్రయాణాన్ని ఆయన దీనత్వములో భాగముగా చూడక ఈ విషయాన్ని అవమానకరంగా చూడటం మూలన్నా ఐగుప్తులో యేసు చేరవలసిన స్థలాన్ని చేరేవరకు యేసును హైలైట్ చేస్తూ కొన్ని కధలను వాడుకలోనికి తెచ్చారు. అంతేనా మరికొందరు ఐగుప్తులో యేసు ఉన్న కాలములో, ఉదేశ్యపూర్వకంగా, యేసును తక్కువ చెయ్యాలని, ఆయన అంతటి కీర్తిని మా మతము నుండి మా మనుష్యులనుండి నేర్చుకున్నాడని చెప్పేందుకు వాడుక లోనికి తెచ్చారు. బైబులు వాటిని గురించి ఏమి చెప్పటం లేదు. బైబులు మాట్లాడని వాటిని గురించి మనకెందుకు చెప్పండి.

జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, అనే మాటలలో, అపహసించుట అనే మాటకు అర్ధం, “తప్పుత్రోవ పట్టించుట, మోసగించుట, నాతోనే ఆటలా అని అర్ధం.” పిల్లవాడి యొక్క ఖచ్చితమైన ఆచూకీతో జ్ఞానులు తిరిగివస్తారని హేరోదు వారికొరకు ఎదురుచూసి ఉండొచ్చు. జ్ఞానులు తిరిగి రాలేదు. హేరోదు ప్రణాళికలో ఒక భాగం ఫలించలేదు. వాళ్ళు రాకపోవడంతో అతడు మోసపోయానని నిర్ధారించుకొన్నాడు. హేరోదులో ఆగ్రహము కట్టలు తెంచుకొంది. నిజానికి జ్ఞానులు హేరోదును మోసగించలేదు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేసారు. హేరోదు మాటకంటె దేవుని మాటకే విలువనిచ్చారు. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదక బోవుచున్నాడు, అనే మాటలలో హేరోదు ఏ నిర్ణయాన్ని ఆ శిశువుపట్ల తీసుకోబోతున్నాడో దేవుడు తన ముందస్తు జ్ఞానములో ముందుగానే యేసేపుకు తెలియజేశాడు. ప్రమాదాన్ని ముందుగానే చెప్పించిన దేవునికి ఆ ప్రమాదపు సరిహద్దు తెలియదంటారా? ఆ ప్రమాదము ఏరీతిగా ఉంటుందో తెలియదంటారా? ఆ ప్రమాదపు సరిహద్దునుండి తన కుమారుని యేరీతిగా, ఎక్కడ, ఏ టైములో దాటించాలో జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయింపబడింది అనే విషయాన్ని మర్చిపోకండి.

తన పధకం విచ్చిన్నమవ్వటం బట్టి హేరోదు భయపడి ఉండొచ్చు. మెస్సయ్య తన చేతుల నుండి తప్పించుకుంటాడనే ఆలోచన అతనిలో అసహనాన్ని కోపాన్ని ఎంతగానో పెంచింది. కాబట్టే న్యాయా న్యాయాలు పట్టించుకోకుండా నిరంకుశ రాజుగా వ్యవహరిస్తూ, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, (అంటే మెస్సయ్య వయ్యస్సును ఊహిస్తూ, ఆ మెస్సయ్య తన చేతులలో నుండి తప్పించుకోకుండా) బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరిని వధించమని ఆజ్జ్యాపించి ఉండొచ్చు.

బేత్లెహేములోనే కాకుండా దానిచుట్టూ ఉన్న గ్రామాలలోని పిల్లలను హేరోదు ఎందుకని చంపించాడు అనే ప్రశ్నకు, మెస్సయ్య తప్పించుకోకూడదు, తప్పకుండా మరణించాడు అనే నిశ్చయత కోసం చంపించాడు. ఎంతమంది పిల్లలు మరణించి ఉండొచ్చు అనే ప్రశ్నకు, బేత్లెహేము ఒక చిన్నగ్రామము కాబట్టి, చంపబడిన పిల్లల సంఖ్య దాదాపు 15 లేదా 20మంది మధ్య ఉండొచ్చు, ఖచ్చితముగా తెలియదు.

అయితే ఇక్కడ ఈ పిల్లలు ఖచ్చితంగా మరణానికి తగిన నేరం చేయలేదు మరి ఈ పిల్లలు చంపబడుటకు దేవుడు ఎందుకని హేరోదును అనుమతించాడు? అని కొందరు ప్రశ్నించొచ్చు. ఈ ప్రశ్నకు మార్టిన్ లూథర్ గారు జవాబు చెప్తూ, సున్నతి ద్వారా ఆ చిన్నపిల్లలు దేవుని ద్వారా దేవునితో నిబంధన కృపలోనికి ప్రవేశించి యున్నారనే విషయాన్ని జ్జాపకముంచుకొనుమని, ఆ చిన్నపిల్లలు వాళ్ళ నిర్దోషత్వములో వాళ్ళు మరణించడంలో ఈ పిల్లలకు రెండు ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు అని చెప్తూ, మొదటి ప్రయోజనమేమిటంటే, ఆ పిల్లలు జీవించి ఉంటే వాళ్ళు అసలు (actual) పాపాలు చేసేవాళ్ళు, కాని ఇప్పుడు వారి మరణం వారికి దేవునితో దీవెనకరమైన జీవితాన్ని అందించింది. రెండవ ప్రయోజనమేమిటంటే, వారు క్రీస్తు కొరకు చనిపోయారు, వారి మరణం పాపానికి శిక్ష కాదు, అత్యంత ఆశీర్వదకరం అని చెప్పాడు. కాబట్టే చంపబడిన ఈ పిల్లలు “ఫ్లవర్ అఫ్ martyrdom” అని పిలువబడుతూ వున్నారు. క్రైస్తవ సంఘము యొక్క మొట్ట మొదటి హత సాక్షులు వీళ్ళు. వీళ్ళు క్రీస్తుకొరకు చంపబడ్డారు.

హేరోదు చేసినది ఘోరమైన నేరం. మన రోజుల్లో ఖచ్చితంగా మరణానికి తగిన నేరం చేయని పిల్లలను అబార్షన్ చేయడం ద్వారా వేలాదిమంది పుట్టబోయే పిల్లలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడాన్ని ఇది మనకు గుర్తు చెయ్యడం లేదా? ఇది నేరం కాదా? హేరోదు నేరానికి పాల్పడినప్పుడు తన స్వంత అధికారానికి  ముప్పు ఉందని అనుకొని “మెస్సయ్యను” చంపడానికి ప్రయత్నించాడు. రక్తపాత విప్లవం జరగడానికి అనుమతించడం కంటే 15 లేదా 20 మంది పిల్లలను బలి ఇవ్వడం మంచిదని అతడు వాదించి ఉండవచ్చు. నేడు మనం మన సౌలభ్యం కోసం పుట్టబోయే పిల్లలను హత్య చేస్తున్నాం. మన దేశ చట్టాలు దానిని అనుమతిస్తాయి. స్వార్థం హత్యను మంచి పనిలా చేస్తుంది.       

కొందరు హేరోదు ఆదేశాల మేరకు పిల్లలను దారుణంగా చంపేసిన వ్యక్తుల సంగతేంటి? అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నకు 2 రకాలుగా జవాబులు చెప్పొచ్చు.

  1. ఇటువంటి హంతక చర్యకు సహాయపడేవాళ్లు ఖండింపబడిన వాళ్ళై ఉంటారు. ఇది వాళ్ళ స్వభావముపై ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం మరచిపోకూడదు.
  2. అలాగే పబ్లిక్ సర్వెంట్స్ మంచి చెయ్యడం కంటే చెడ్డపనులు చెయ్యడానికే ఎల్లప్పుడు సిద్ధముగా ఉండాలి అనే విషయం మనకందరికి తెలుసు. ఇక్కడ హేరోదు ఆజ్జ్య చెడు చెయ్యమని, కాని ఈ చెడ్డ పనిలో involveయైన వాళ్ళకి మంచి ఉదేశ్యం ఉండొచ్చు కదా. పిల్లలను చంపడంలో వాళ్ళకి మంచి ఉదేశ్యము ఏమై ఉంటుంది?

మెస్సయ్యను గూర్చిన వార్తను బహిరంగంగా నిర్ధారిస్తే, ప్రకటిస్తే ఆ వార్త సెన్సేషనల్ వార్త అవుతుంది. దేవుని రక్షణ ప్రణాళికకు దేవుని చిత్తానికి విరోధముగా ప్రజలు ఈ లోక సంబంధమైన రాజుకు ప్రాధాన్యతను ఇచ్చి తిరుగుబాటు చేస్తారు. వేలాదిమంది చంపబడతారు. యేసు చుట్టూ కోటరి ఏర్పడుతుంది. యేసును ఈ లోక సంబంధమైన రాజుగా పెంచుతారు, దేవుని చిత్తములో మనుష్యులు జోక్యం చేసుకొని రక్షణ ప్రణాళికను జరగకుండా చూస్తారు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తరువాత మళ్ళి సింహాసనము కొరకు తిరుగుబాటు చేసేలా ప్రజలను ప్రేరేపిస్తారు. మళ్ళి వేలాదిమందిగా మరణిస్తారు. ఇంత మారణకాండకు బదులుగా ఒక 20మంది చిన్న పిల్లలను త్యాగం చేయడం ఇప్పుడు మంచిది అని వాళ్ళు అనుకొని ఉండొచ్చు. అట్లే హేరోదు ఆదేశాల మేరకు పిల్లలను దారుణంగా చంపేసిన వ్యక్తులు హేరోదు ఆదేశాల మేరకు చేస్తున్నట్లుగా నటిస్తూ ఒక మంచి కార్యం చేస్తున్నట్లుగా భావించి ఉండొచ్చు కదా.

బేత్లెహేములో శిశువుల వధ కూడా పాత నిబంధన ప్రవచన నెరవేర్పు. ఈ విభాగములో నెరవేర్చబడిన రెండవ ప్రవచనము: యిర్మీయా 31:15_ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

రామా అనేది బెంజమిన్ గోత్రమునకు చెందిన భూభాగములో ఒక పట్టణం. ఈ విషయం యెహోషువ 18:23-26 లో చెప్పబడి ఉంది. రామా యూదా గోత్రములోని బేత్లెహేమునకు చాల దగ్గరలో ఉండెడిది. ఈ రెండిటికి మధ్యలో రెండిటికి దగ్గరగా రాహేలు సమాధి ఉందనే విషయాన్ని ఆదికాండము 35: 19 తెలియజేస్తూ, రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను అని చెప్తూవుంది. బెంజమిన్ రాహేలు కుమారుడు, రామా బెంజామిన్కు చెందిన భూభాగము. యూదా బేత్లెహేము దాని చుట్టూ ఉన్న గ్రామాలలో రామా కూడా ఒక్కటి.

పాత నిబంధన కాలములో, నెబుకద్నెజరు యెరూషలేము నుండి ఉత్తరాన ఐదు మైళ్ల దూరంలో ఉన్న రామాలో తాను బందీలుగా పట్టుకొన్న యూదా ప్రజలందరిని అక్కడ ఉంచి అక్కడి నుండి వాళ్ళని ప్రవాసానికి తరలించాడు. బందీలుగా మారిన ఇశ్రాయేలీయులు చివరిసారిగా తమ పవిత్ర పట్టణాన్ని చూస్తూ అంగలారుస్తూ రోదిస్తూ ప్రవాసానికి తరలింపబడ్డారు. అక్కడ రామా వద్ద తన పిల్లలకు కలిగిన శ్రమ దుస్థితిని బట్టి ఆ జాతికి తల్లి అయిన రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకున్నదని ప్రవక్త ప్రవచించినట్లుగానే జరిగింది.

కొత్త నిబంధన కాలములో బేత్లెహేము దానిచుట్టూ ఉన్న గ్రామాలలో మారణకాండ జరిగింది, చాలామంది పిల్లలు చంపబడ్డారు. బేత్లెహేము దానిచుట్టూ ఉన్న గ్రామాలలో పిల్లలు చంపబడిన తల్లులకు రాహేలు ప్రతినిధ్యము వహిస్తూ, తన పిల్లలను గూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అనే ప్రవచనము క్రీస్తును నాశనంచేయడానికి సాతాను చేసిన ప్రయత్నంలో బెత్లెహేంలోని చిన్నపిల్లలు క్రూరముగా చంపబడటం వారి తల్లుల అంగలార్పు, రోదన యిర్మీయా ప్రవచనం మరొకసారి నెరవేర్చబడటం గురించి తెలియజేస్తూ ఉంది.

నజరేత్‌కు తిరిగి రావడం 19-23

మత్తయి 2: 19-23_ 19 హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై 20–నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; 21 శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చెను. 22-23 అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)

  1. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు_ వారు అంటే_ బహువచనమే కదండి, హేరోదుకాకుండా శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు ఇంకా ఎవరై ఉంటారు?
  2. యేసేపు మరియ శిశువైన క్రీస్తు ఐగుప్తులో ఎంత కాలము  ఉండి ఉండొచ్చు?
  3. హేరోదు ఆర్కెలాస్‌ తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, యేసేపు అక్కడికి వెళ్లటానికి ఎందుకని భయపడ్డాడు?
  4. యేసేపు యేసును తీసుకొని నజరేతుకు ఎందుకని వెళ్ళాడు?
  5. నజరేతుని దేవుడు ఎందుకని తన బిడ్డకు హోమ్ టౌన్ గా ఎన్నుకున్నాడు?
  6.  ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను) అని మత్తయి దేని ఆధారముగా చెప్తూవున్నాడు?
  7. లూకా 2:39_అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి అని చెప్తూవుంది, ఇదేంటి?

హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై -నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను_ శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు_ అంటే బహువచనము. హేరోదు కాకుండా శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు ఇంకా ఎవరై ఉంటారు? ఈ మాటలు హేరోదు అతని కుమారుడైన ఆంటిపేటర్ని గూర్చి అయ్యి ఉండొచ్చు.

ఆంటిపేటర్ హేరోదు మొదటి భార్య కుమారుడు, తన వారసునిగా హేరోదు ది గ్రేట్ చేత ప్రకటింపబడినవాడు, దేశములో హేరోదు తరువాత అంతటి పొజిషన్లో అధికారంలో ఉన్నవాడు. ఆంటిపేటర్ తన తండ్రి లాగానే క్రూరమైన స్వభావం కలిగిన వాడు. హేరోదు ది గ్రేట్ మరణానికి అయిదురోజుల ముందు ఆంటిపేటర్ తన తండ్రి అయిన హేరోదు ది గ్రేట్ ను ఉదేశ్యపూర్వకముగా చంపడానికి ప్రయత్నించాడనే నేరారోపణతో హేరోదు ఆజ్జ్యతో చంపబడ్డాడు.

హేరోదు ది గ్రేట్, తీవ్ర అనారోగ్యంతో తన 71వ సంవత్సరంలో యెరికోలో మరణించాడు. చరిత్రకారుడైన జోసెఫస్ హేరోదు దుర్భరమైన మరణం గురించి తెలియజేస్తూ_ చివరి రోజులలో హేరోదు విపరీతమైన ఏమాత్రమును తగ్గని జ్వరంతో భాదపడ్డాడని, శరీరమంతా తట్టుకోలేని దురదతో విపరీతమైన కడుపు నొప్పితో ఇబ్బందిపడ్డాడని, అతని పాదాలు బాగా ఉబ్బిపోయాయని, బొడ్డు యొక్క దిగువభాగంలో విపరీతమైన మంటను కలిగి ఉన్నాడని, అతని ప్రైవేట్ భాగాలు కుళ్లిపోయి పురుగులు పట్టాయని, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిపడ్డాడని, తరచుగా మూర్ఛ వచ్చేదని, విపరీతమైన ఆకలి, దుర్వాసనతో నిండిన శ్వాస, అతని పేగులు అల్సర్‌తో నిండిపోయాయని, నరకయాతన అనుభవించాడని, దగ్గరకు వెళ్లలేనంత దుర్గంధముతో ఉండేవాడని, వాడిన మందులు పనిచేయ లేదని, అతను చాలా ఉద్రేకంతో అసహనంతో ఉండేవాడని, తనను తాను హింసించుకొనేవాడని, అతని దగ్గరకు వెళ్ళడానికే జనాలు భయపడేవారని, అతని సహజమైన క్రూరత్వం, ఆవేశంతో, అతన్ని గతంలో కంటే మరింత అనాగరికంగా చేసిందని, తన ఈ దుస్థితికి తన పెద్ద కుమారుడు కారణమేమోనని అనుమానించి చంపాలని ఆదేశించిన తరువాత, తన దుస్థితిని బట్టి ప్రజలు సంతోషించకుండా చాలామంది ప్రభువులను మరియు పెద్దమనుషులను జైలులో పెట్టించాడని, చివరికి దయనీయమైన స్థితిలో మరణించాడని వ్రాసియున్నాడు.

హేరోదు ది గ్రేట్ తన వీలునామాలోనుండి ఆంటిపేటర్ పేరును తొలగించి ఆర్కెలాస్ పేరును చేర్చి తన తరువాత తన వారసునిగా ఆ ఆధిక్యతను ఇచ్చియుండుటను బట్టి హేరోదు రాజ్యములో సగభాగము ఆర్కెలాస్ కు మిగతా రాజ్యము మిగిలిన ఇద్దరు కుమారులకు హేరోదు చనిపోయిన తరువాత ఇవ్వబడింది. హేరోదు ఆర్కెలాస్‌కు యూదయ, ఇడుమియా మరియు సమారియా; హేరోదు ఫిలిప్పుకు బటానియా మరియు ట్రాకోనిటిస్; హేరోదు అంటిపాస్ కు గలిలయ, పెరియా అను భూభాగాలు ఇవ్వబడ్డాయి. యేసు, అపొస్తలుల కాలములో ఉన్న హేరోదులు వీళ్ళే. 

యేసేపు మరియ శిశువైన క్రీస్తు ఐగుప్తులో కొన్ని నెలలు మాత్రమే ఉండి ఉండవచ్చు. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై -నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలుదేశమునకు వెళ్లుము; శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పగా అప్పుడు యేసేపు  బయలుదేరి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలుదేశమునకు వచ్చాడు. అయితే హేరోదు ఆర్కెలాస్ తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచెను అని బైబులు చెప్తూవుంది.

యేసేపు అక్కడికి వెళ్ళడానికి ఎందుకని భయపడ్డాడు? బెత్లెహేమ్‌లో జన్మించిన యేసును అక్కడే పెంచాలేమో అనుకోని యేసేపు భయపడి ఉండొచ్చు. అక్కడికి వెళ్తే ఏమి జరుగుతుందో? ఎందుకంటే హేరోదు స్థానంలో అర్కెలాస్ పరిపాలిస్తున్నాడని విన్నాడు.ఆర్కెలాస్ తన తండ్రిలాగే క్రూరమైన నిరంకుశ స్వభావాన్ని కలిగినవాడు. అతడు పట్టాభిషిక్తుడు కాకముందే, పస్కా పండుగకు ముందు ఆలయంలో, యెరూషలేము నగరంలో 3,000 మందిని చంపించిన వాడు. అతని స్వభావం తెలుసుకొని, తాము సురక్షితంగా ఉండలేమని భయపడి, యేసేపు అక్కడికి వెళ్లడానికి సంకోచించాడు, భయపడ్డాడు. స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై తద్వారా సురక్షిత ప్రదేశమైన గలిలయకు వెళ్లమని దేవుని చేత ఆదేశింపబడ్డాడు. అతడు గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను అని బైబులు చెప్తూవుంది. అప్పుడు గలిలయ ప్రాంతాలు నజరేతను ఊరు హేరోదు అంటిపాస్ పాలన క్రింద ఉన్నాయి. హేరోదు ఆర్కెలాస్‌తో పోల్చుకొంటే ఇతడు చాల నెమ్మదిపరుడు.

నజరేతు గలిలయ సముద్రానికి నైరుతి దిశలో కానాకు సమీపములో ఉండే ఒక చిన్న గ్రామము. దీనికి పశ్చిమాన సమీపాన తాబోర్ పర్వత శ్రేణిని కలిగి ఇది ఒక కొండ వాలుపై ఉండెడిది దాని చుట్టూ అందమైన గొప్ప దృశ్యాలు ఉండెడివి. యేసు తన పరిచర్యలో ప్రవేశించే వరకు ఇక్కడే జీవించాడు, లూకా 2: 51; 4:16; మత్తయి 3:13. నజరేతు యెరూషలేము నుండి ౩ రోజుల ప్రయాణమంతా దూరములో ఉండెడిది. యూదుల గ్రంధమైన తాల్ముద్ లోగాని, చరిత్రకారుడైన జొసీఫస్ చేత గాని ఈ గ్రామము పేర్కొనబడలేదు కాబట్టి ఈ గ్రామము చాల చాల చిన్నగ్రామము అని చరిత్రకారుల అభిప్రాయము. యేసేపు నజరేతులోనే ఎందుకు స్థిరపడ్డాడు అనే ప్రశ్నకు, మత్తయి ఎటువంటి జవాబును ఇవ్వలేదు. యేసు పుట్టుకకు ముందు మరియ (లూకా 1:26) మరియు యేసేపులు (లూకా 2: 4) అక్కడ నివసించినట్లుగా లూకా చెప్తున్నది ఒక  కారణం కావొచ్చు.

ప్రజలు చిన్నచూపుచూసే నజరేతును గలలీ ఊళ్ళు నగరాల జాబితాలో చేర్చబడని చాల తక్కువస్థాయి ఉన్న ఈ గ్రామాన్నిదేవుడు ఎందుకని తన బిడ్డకు హోమ్ టౌన్ గా ఎన్నుకున్నాడు? యేసయ్య తాను పరిచర్యలోనికి వచ్చే ముందు వరకు ఇక్కడే ఉన్నాడు. ఎంతో ఔన్నత్యములో ఉండే దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకొనియున్నాడో ఇది తెలియజేస్తూవుంది. ఇది యేసుని దీనత్వాన్ని తగ్గింపును సూచిస్తూ వుంది.

యోహాను 1:45, 46_ ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పగా అందుకు నతనయేలు– నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని నతనయేలు ఫిలిప్పును ప్రశ్నించలేదా? నజరేతులో నుండి మంచిదేదైన రాగలదా అనే మాటలలో ఈ గ్రామము యొక్క అప్రాముఖ్యమైన సాంఘిక సామాజిక స్థితిని నతనయేలు తెలియజేస్తూ ఉండటమే కాకుండా, మెస్సయ్యను నజరేత్‌తో అనుసంధానించే ప్రవచనాలేమి లేవు కదా, ఇదెలా సాధ్యము? అని అడుగుతున్నాడు.

మత్తయి ఏమో ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను) అని చెప్తున్నాడు. ఆయన నజరేయుడనబడుననే నిర్దిష్టమైన ప్రవచనము బైబిలులో ఎక్కడా లేదు కాని కొందరు పాతనిబంధన ప్రవక్తలు ఈ విషయాన్ని గురించి తెలియజేసియున్నారని మత్తయి చెప్తూవున్నాడు. చాలా సహజమైన వివరణ ఏమిటంటే, ఒకటి కంటే ఎక్కువ మంది ప్రవక్తలు అటువంటి ప్రకటన చేశారని మరియు ఇది పాత నిబంధన గ్రంథాలలో ఎక్కడా నేరుగా నమోదు చేయబడనప్పటికి, యూదులలో ఇది అందరికి తెలిసిన విషయం అని మత్తయి చెప్తూవున్నాడు. ఎక్కడ, ఎలా అనే ప్రశ్న మనకు రావొచ్చు.

నజరేతు అనే పేరు మనకొక చిన్న క్లూ ఇస్తూ ఉంది. నజరేతు అనే పదం హీబ్రూ పదమైన “నెట్‌జర్” అనే మాట నుండి వచ్చింది, “నెట్‌జర్” అనేమాటకు “అంకురం” అని అర్ధం. కొన్నిసార్లు చెట్టును నరికివేసినప్పుడు, దాని మొధ్ధు నుండి ఒక చిన్న “అంకురం” పుడుతుంది. రెమ్మ పెరుగుతుంది, పాత చెట్టు చనిపోయిన చోట ఒక కొత్త చెట్టు పుట్టుకొస్తుంది. ఆ షూట్‌ను హీబ్రూలో, “నెట్‌జర్ అంటారు. ఈ ప్రవచనము యెషయా 11:1లో ఉంది.

ఇశ్రాయేలీయులు చెట్టులా నరికివేయబడినప్పటికి, బాబిలోనియన్లు యూదాను నాశనం చేసినప్పటికి యూదా అంకురంలాగా పైకి లేస్తుందని యెషయా ప్రవచించాడు. యిర్మీయా జెకర్యాలు కూడా ఇశ్రాయేలీయుల యొక్క నాశనము మరియు తిరిగి ఆవిర్భవించడం గురించి ప్రవచిస్తూ, ఇశ్రాయేలీయులు నరికివేసిన చెట్టులాగా ఉన్నప్పటికిని, అది మరోసారి మొలకెత్తుతుందని ప్రవచించారు, అయితే వాళ్ళు “నెట్‌జర్” అనే మాటను కాకుండా “బ్రాంచ్” “చిగురు” అనే వేరే పదాన్ని ఉపయోగించారు, అందుకు యిర్మీయా 23:5; జెకర్యా 3:8, 6:12 చూడండి.

ఆయన దీనునిగా ఉండాలి; తృణీకరించబడాలి మరియు తిరస్కరించబడాలి. నజరేత్ నుండి రావడం, లేదా నజరేన్ అవ్వడం, అంటే తృణీకరించబడటం, తిరస్కరించబడటం. ఎండిన మొద్దునుండి అంకురం సురూపమైనను సొగసైనను లేకుండా, తృణీకరించబడిన తిరస్కరించబడిన దాని మొద్దునుండి ఎంత కామ్ గా బయటకు వస్తుందో యేసు కూడా అలానే ఉన్నాడని, బయటకు వచ్చాడని ప్రవక్తలు ప్రవచించినట్లుగానే ఆయన దీనునిగా తృకరింపబడిన స్థితిని తిరస్కరింపబడుటను నజరేయునిగా ఉండటంలో నెరవేర్చబడియున్నవని మత్తయి చెప్తూవున్నాడు. యేసు సిలువ వేయబడినప్పుడు, పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి వ్యంగ్యముగా సిలువమీద పెట్టించుట అందుకు మంచి ఉదాహరణగా మనం చెప్పొచ్చు.

అయితే, లూకా 2: 39_అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి అని చెప్తూవుంది, ఇదేంటి అనే ప్రశ్న మనకు రావొచ్చు?

చాలా సింపుల్. లూకా జ్ఞానుల రాకను, యేసేపు మరియ యేసులు ఐగుప్తుకు వెళ్లడం అక్కడినుండి తిరిగి రావడం దాటవేస్తూ, ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం అవసరమైన ప్రతిదాన్ని చేసిన తర్వాత, మరియ యేసేపులు గలిలయకు, వారి స్వంత ఊరు అయిన నజరేతుకు తిరిగి వచ్చారని నివేదిస్తున్నాడు అంతే. ఇక్కడే యేసు పెరిగాడు, రోజు రోజుకు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుకొన్నాడు; దేవుని దయ ఆయనమీద ఉండెను.

శిశువైన యేసు తన పరలోకపు తండ్రి సంరక్షణలో ఉన్నాడు. తండ్రి ఆయనను సురక్షితంగా నజరేత్‌కు తీసుకొచ్చారు.

1కొరింథీయులకు 1:27_ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. యాకోబు 4:6 దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అను మాటలు ఎంతటి నిజమో కదా.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.