మత్తయి సువార్త 3 వ అధ్యాయము

బాప్తిస్మమిచ్చు యోహాను మార్గాన్ని సిద్ధపర్చడం 1-12

మత్తయి3:1-6_1ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి2–పరలోకరాజ్యము సమీపించి యున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే. 4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. 5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

మత్తయిసువార్త 1,2 అధ్యాయాలలో ఉన్న యేసయ్య జన్మమునుండి ఇప్పుడు మత్తయి సువార్త 3 అధ్యాయం 1-6 లలో బాప్తిస్మమిచ్చుయోహాను తనపరిచర్యను ప్రారంభించినకాలానికి మనం వస్తున్నాం. ఇక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి:    

 1. మత్తయి 2అధ్యాయము ఆఖరి వచనానికి 3అధ్యాయము మొదటి వచనానికి మధ్యలో ఎన్నినెలలు లేదా  సంవత్సరాలు ఉండొచ్చు?
 2. యేసు బాప్తిస్మనికి ఎన్నినెలలు/సంవత్సరాల ముందు బాప్తిస్మమిచ్చుయోహాను తన పరిచర్యను ప్రారంభించి ఉండొచ్చు?
 3. బాప్తిస్మమిచ్చు యోహాను పరిచర్యను ప్రారంభించినప్పుడు యేసు ఎక్కడ ఉండి ఉండొచ్చు?
 4. బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో, యూదయలో జరిగిన రాజకీయ మార్పులేమిటి?
 5. బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో, యూదయ సమాజం ఎలా వుంది?
 6. బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరు? అతనితో ముడిపడివున్న చారిత్త్రాత్మికమైన వాస్తవమేమిటి?
 7. బాప్తిస్మమిచ్చు యోహానుకు సంబందించిన పాత నిబంధన ప్రవచనాలు ఎక్కడ వున్నాయి?
 8. బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చిన ప్రవచనాత్మక చిత్రం ఏ విషయాలను తెలియజేస్తూవుంది?
 9. బాప్తిస్మమిచ్చు యోహాను లైఫ్ స్టైల్ ప్రత్యేకత ఏ విషయాలను తెలియజేస్తూ వుంది?
 10. బాప్తిస్మమిచ్చు యోహానుకు దేవుడిచ్చిన పని ఏమిటి? అతడు ఎలా ప్రభువు మార్గాన్ని సిద్ధపరచి యున్నాడు?
 11. “మారుమనస్సు” అంటే ఏమిటి? మారుమనస్సు మరియు పరలోకరాజ్యం అను ఈ రెండిటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి?
 12. పాపక్షమాపణ నిమిత్తము పస్కాబలి కాకుండా మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని ప్రకటించడం ఏంటి?  
 13. బాప్తిస్మము అంటే ఏమిటి? యూదులకు బాప్తిస్మమును గురించి తెలుసా? బాప్తిస్మమిచ్చు యోహాను యూదుడు. ఇతడు యూదామతానికి విరోధముగా వేరొక క్రొత్తమతాన్ని ప్రారంభించాడా? అలా ప్రారంభి స్తే యూదులు బాప్తిస్మమిచ్చు యోహానును రిజెక్ట్ చెయ్యాలి మత బ్రష్ఠునిగా శిక్షించాలి. కాని యూదులు యోహానును అంగీకరించారే?
 14. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించిన బాప్తిస్మము యొక్క ఉదేశ్యము ఏంటి?  
 15. యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చారు కదా వాళ్ళు ఎందుకని వచ్చినట్లు?
 16. ప్రవక్తగా యోహాను యెరూషలేము మందిర పెద్దలను ఎందుకని పరిగణలోనికి తీసుకోలేదు?
 17. మరి బాప్తిస్మమిచ్చు యోహాను యూదులకు బాప్తిస్మము ఎందుకిచ్చినట్టు?
 18. చాలామంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతూవుంటారు? మీరు బాప్తిస్మము తీసుకున్నారా లేక బాప్తిస్మము పుచ్చుకొన్నారా?

బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ఎప్పుడు ప్రారంభించి ఉండొచ్చు అనే ప్రశ్నకు లూకా 1:36 చూసిన ట్లయితే యోహాను యేసు కంటే ఆరు నెలలు పెద్దవాడు, బాప్తిస్మమిచ్చు యోహాను ఎప్పుడు పరిచర్యను ప్రారంభించి వుండొచ్చొ చెప్పడానికి ఒక క్లూ ఉందండి. సంఖ్యా 4:3 చూస్తే పరిచర్యకు 30-50 సంవత్సరాలు ప్రాథమికమైన వయస్సుగా నిర్ణయింపబడింది. కాబట్టి అనేకులు బాప్తిస్మమిచ్చు యోహాను యేసు పరిచర్యకు 6 నెలల ముందుగా పరిచర్యను ప్రారంబించియున్నాడని చెప్తారు. మరికొందరు అంతకంటే ముందే బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ప్రారంబించి ఉండొచ్చు అని చెప్తారు.

మత్తయి 2 :23 బట్టి యేసు ఇంకా నజరేతులో నివసిస్తూవుండగా, బాప్తిస్మమిచ్చు యోహాను బోధించడం ప్రారం భించాడని బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అతడు అరణ్యములో నివసిస్తూ వుండేవాడని లూకా 3:1,2 వచనాలు తెలియజేస్తూవున్నాయి.

బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో యుదయా రోమ్ ప్రావిన్స్, గవర్నర్లుచే పరిపాలించబడుతూ వుంది. వీరిలో ఆరవ వ్యక్తి పొంతి పిలాతు. పిలాతు అధికారం మొదలయ్యి ఎక్కువ రోజులు కూడా కాలేదు.

బాప్తిస్మమిచ్చు యోహాను కాలములో యూదయ సమాజం మునుపటి మాదిరిగానే ఉంది. అదే ప్రాపంచికత గ్రీకు పద్ధతులు, విలాసవంతమైన జీవితం, అదే ఫార్మలిజం మతోన్మాదం. మార్పుకు ఎటువంటి సంకేతం కూడా యూదయ సమాజంలో లేదు.

జెకర్యా ఎలీసబెతుల కుమారుడైన యోహాను ఎదిగి, ఆత్మయందు బలముపొంది, ప్రవక్తగా పరిచర్యను ప్రారం బించియున్నాడనే వార్త కలకలం రేపుతోంది. పాతనిబంధన క్రొత్తనిబంధన మధ్యలోవున్న 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలము తరువాత ప్రవక్త ఆవిర్భవించాడని ప్రజలు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు.

ఇక్కడ “ఆ దినములయందు” అంటే? దీనికి లూకా 3:1,2 జవాబుచెప్తూ, తిబెరి కైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను, అన్నయు, కయపయు ప్రధానయాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో నున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చిన రోజుల్లో అని ఒక చారిత్త్రాత్మికమైన వాస్తవాన్ని గురించి తెలియజేస్తూ వున్నాయి. ఈ వాస్తవాలన్నిటిని ఆనాటి చరిత్రకారుడైన జోసిఫస్ కూడా ధ్రువీకరించియున్నా డు. అంటే బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను ఎప్పుడు ప్రారంభించియున్నాడు అనే ప్రశ్నకుగల చారిత్రాత్మికతను గూర్చి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి.

హెబ్రోనులో అతని తండ్రి నివసించిన కొండప్రాంతంలో యోహాను అజ్ఞాతంలో నివసించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యూదులలో అత్యంత కఠినముగా వ్యవహరించే ఎస్సేస్న్స్ essence అనే ఆనాటి యూదా సన్యాసుల తెగకు చెందినవాడని కొందరి అభిప్రాయం. ఈ తెగకు చెందిన వారు స్వచ్ఛంద పేదరికంలో జీవిస్తూ రోజువారీ ఇమ్మర్షన్ (baptism) మరియు సన్యాసం బ్రహ్మచర్యంతో దేవునికి అంకితమైన జీవితంతో ఎంతో నిష్ఠగా బ్రతికేవాళ్ళు. వీళ్ళలో కొందరు ప్రజలకు దూరముగా అరణ్యములలో ఉండేవారు. బాప్తిస్మ మిచ్చు యోహాను యొక్క ప్రత్యేకమైన జీవన శైలిని బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను ఈ తెగకు చెంది ఉండొచ్చని వారి అభిప్రాయం. డెడ్ సీ స్క్రోల్స్ గా 1946 లో మనకు దొరికిన పాత నిబంధన గ్రంథాలన్ని ఈ తెగకు చెందిన వారే భద్రపరచారని అది వాళ్ళ లైబ్రరి అని కొందరి నమ్మకం.

ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి2–పరలోకరాజ్యము సమీపించి యున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే.

ప్రవక్తయైన యెషయా బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రవచించియున్నాడు. యెషయా 40:3-5, 3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా–అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపర చుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. 4 ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వత మును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. 5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు, అని బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి 700 బి.సి.లో సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం ప్రవచింపబడింది. అట్లే ప్రవక్తయైన మలాకీ ద్వారా మలాకీ 3:1, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మలాకీ 4:5 యెహోవా నియమించిన భయంకర మైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును అని బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి 430 బి.సి.లో సంవత్సరాల క్రితమే మరొకసారి ప్రవచింపబడింది.

ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించడానికి వచ్చిన ప్రభువు రాకడను ఈ చిత్రం గుర్తుచేస్తూ వుంది. దేవుడు మోషేను అరణ్యంలో మండుతున్న పొద వద్దకు పిలిచాడు  అతనితో పాటు ఫరో వద్దకు వెళ్ళాడు. యెహోవా మోషేతో పాటు అరణ్యంనుండి వచ్చి తన ప్రజలను ఐగుప్తు నుండి అరణ్యంలో ఉన్న సీనాయి పర్వతానికి తీసుకు వచ్చాడు. అరణ్యానికి సంబంధించి యెషయా ఇక్కడ ప్రస్తావించిన విషయాలు, అతను మొదటిసారి వచ్చినట్లే మళ్లీ వస్తాడని దేవుని ప్రజలకు గుర్తు చేస్తూ వున్నాయి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి అను చిత్రం యెషయా రోజులలో చక్రవర్తులు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లే ముందు రూట్ మ్యాప్ ఇచ్చి దారి క్లియర్ చేయడానికి అతని కంటే ముందుగా ఒక బృందాన్ని పంపేవారు. చక్రవర్తి ప్రయాణించే మార్గములో అవసరమైన ఏర్పాట్లు చూడటం అందుకు తగినట్టుగా పనిచేసేవారికి సామాగ్రిని అందించడం వంతెనలను కట్టడం, కొండలను సమం చేయడం లోయలపై కాజ్‌వేలను నిర్మించడం లేదా వాటిని నింపడం; వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉంచడం ఆ దూతల పని. ప్రవాస యూదుల పునరాగమనానికి వర్తింపజేస్తే, అన్ని అడ్డంకులు తొలగించబడతాయని దేవుని ఆదేశం ముందుకు సాగుతుందని అర్థం. ప్రభువగు యెహోవా ఒక చక్రవర్తిగా ఆయనే తన ప్రజలను విమోచించి వారి స్వంత దేశానికి నడిపించబోతున్నాడు. ఆయన కొరకు ఆయన ప్రజలు సిద్ధపడ వలసియున్నారు. యెషయా మరో ఆలోచనను ఇక్కడ జోడించాడు. నిర్గమములో ఉన్న ప్రజలను  నడిపించడానికి  వారికి భరోసా ఇవ్వడానికి ప్రభువు యొక్క ఉనికి మహిమ వారికి కనిపించినట్లే, “యెహోవా మహిమ మరోసారి బయలుపరచబడబోతూ వుంది” అని అని ప్రవచనము తెలియజేస్తూవుంది. యెహోవా మహిమ అంటే ప్రజలకు దేవుని యొక్క శక్తిని ప్రేమను తెలియజేయుటకు బయలుపరచు ప్రత్యేకమైన ప్రత్యక్షత. బబులోను చెరలో ఉన్న తన ప్రజలను వారి బానిసత్వం నుండి విడిపించడం ద్వారా మరియు వారి స్వంత భూమికి వారిని తిరిగి నడిపించడం ద్వారా తాను ఒడంబడికను కాపాడుకునే దేవుడిగా వెల్లడించుకొని యున్నాడు. తరువాతి రోజుల్లో తన ప్రజల విమోచనను నెరవేర్చడానికి మెస్సీయను పంపడంలో ఇది మరింత విశిష్టంగా చూపబడుతుంది. అదే దేవుడు అందరిని ఆయన విమోచించబోతువున్నాడు. వాస్తవానికి, ఇది ప్రవచనాత్మక చిత్రం.

మెస్సయ్యాకు ముందుగా పోవు దూతను గూర్చి కూడా ఈ ప్రవచనము తెలియజేస్తూ వుంది. ఈ మాటలను ఆలకించినప్పుడు యేసుని రాకడ కొరకు తన ప్రజలను సిద్ధపరచుటకు ప్రభువు పంపిన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చిన ప్రవచనమని సువార్తికుల ద్వారా తెలుస్తూవుంది. మెస్సీయకు వర్తింపజేస్తే, దేవుడు తన ప్రజలను విమోచించడానికి వారి వద్దకు రాబోతున్నాడని అర్థం (ఏదో మారుమూల అరణ్యంలో మెస్సయ్య బయలుపరచబడతాడనే విషయాన్ని ఎదురుచూడం). తన ప్రజలను విమోచించడంలో సర్వశరీరులు దైవికమైన జోక్యాన్ని చూస్తారని ఆయన శక్తి మహిమ యొక్క సాక్ష్యాలను గుర్తిస్తారని ఈ మాటలు చెప్తూవున్నాయి. అట్లే రక్షకుని పొందుటకు కోరుకొంటున్న వారందరి కొరకు ఇవ్వబడిన నియమాలుగా వీటిని మనము తీసుకోవలసి వున్నాము. ప్రభువు హృదయములోనికి వచ్చు మార్గములోప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను చెయ్యబడ వలెను. యేసు ముఖమును మనము చూసే ప్రతిసారి దేవుని మహిమను మనము చూస్తూ వున్నాము.

వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది మారుమనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని ప్రకటించాడు. అంటే అందరి ప్రవక్తలవలె యోహాను కూడా మీ పాపముల నుండి మళ్లుకొని దేవుని వైపునకు తిరగండి అని ప్రకటించాడు.

పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేవి పర్యాయపదాలు. ఇవి దేవుడు పాపులను రక్షించే ప్రక్రియను వివరిస్తు వున్నాయి. వాగ్దానం చేయబడిన రక్షకుడు లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆ ప్రక్రియ యొక్క క్లైమాక్స్ ఆసన్న మైంది. యేసు తన బహిరంగ పరిచర్యను ప్రారంభించబోతున్నాడు. దేవుని ఆజ్ఞలన్నింటికి సంపూర్ణ విధేయతతో జీవితాన్ని గడిపిన తర్వాత, ఆయన లోక పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి కల్వరి శిలువపై ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని అర్పించబోతువున్నాడు. సాతాను రాజ్యంపై దేవుని రాజ్యం విజయం సాధించిందని రుజువు చేస్తూ మూడవ రోజున ఆయన మళ్లీ లేస్తాడు. ఈ ముఖ్యమైన సంఘటనలు త్వరలో జరగబోతున్నాయి. అందుకే యోహాను, “పరలోక రాజ్యం సమీపించింది” అని ప్రకటించగలిగాడు.

మారుమనస్సు” అంటే మనస్సు యొక్క మార్పును లేదా జీవిత సంస్కరణను సూచిస్తుంది. మనస్సు/ హృదయములో మార్పు మాత్రమే కాదండి దేవుని ఆజ్ఞలకు అవిధేయులమని గుర్తించడం. క్షమాపణ మరియు రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తుపై మాత్రమే నమ్మకం ఉంచడం వంటివి ఉన్నాయి.

మారుమనస్సు మరియు పరలోక రాజ్యం అను ఈ రెండిటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే, పరలోకరాజ్యము అనే మాట మనం చూడగలిగే భూసంబంధమైన భూభాగాన్ని గురించి గాని లేదా లెక్కించగల పౌరులను గురించి గాని మాట్లాడటం లేదు; ప్రజల హృదయాలలో దేవుని దయగల పాలనను సూచిస్తూ దేవుడు పాపులను రక్షించే ప్రక్రియను వివరిస్తూ వాగ్దానం చేయబడిన రక్షకుడు లోకంలోకి వచ్చాడు ఆ రక్షణ ప్రక్రియ యొక్క క్లైమాక్స్ ఆసన్నమైంది అని చెప్తూ, ఆయన “వారి మధ్యలోనే” ఉన్నాడని పాపము యొక్క దోషము శిక్షనుండి విడిపించు ఆ మెస్సయ్యయందు విశ్వాసముంచుడి, అందుకుగాను మారుమనస్సు పొందండి అని ప్రకటించాడు. పశ్చాత్తాపపడుమను సందేశం పాత నిబంధన ప్రవక్తలందరి సందేశాన్ని ప్రతిధ్వనిస్తూ వుంది.

ఈ ఉదేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి దానియేలు 2:31-45, కీర్తన 29, జెఫన్యా 3:14-17లను చదవండి. ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు పునరుద్ధరించే సమయం కోసం ఎదురుచూస్తున్న యేసు కాలంలోని ప్రజలకు ఈ లేఖన భాగాలు చాలా బాగా తెలుసు.

బాప్తిస్మమిచ్చు యోహాను ప్రత్యేకముగా ఒక పని కొరకు దేవునిచే ఎన్నుకోబడియున్నాడని మనకు తెలుసు. అతని పని ప్రభువు మార్గం సిద్ధపర్చడం. అతడు ఎలా ప్రభువు మార్గాన్ని సిద్ధపరచియున్నాడో తెలుసు కొందాం?

బాప్తిస్మమిచ్చు యోహాను కాలము నాటి యూదులు ఈ లోకసంబంధమైన గొప్ప జాతీయ విమోచకుడిని గురించి ఎదురుచూస్తూ ఆ జాతీయవిమోచకుడు వచ్చినప్పుడు, చనిపోయినవారందరూ లేపబడతారని, తీర్పు జరుగుతుందని; యూదుల శత్రువులు నాశనంచేయబడతారని ఇశ్రాయేలీయులు గొప్పఘనతను గౌరవాన్ని పొందుతారనేది వారి నమ్మకం.

వారి ఆలోచనలకూ అనుగుణంగా కాకుండా, బదులుగా బాప్తిస్మమిచ్చుయోహాను అంతర్గత శుద్ధీకరణను ప్రకటించటం ఇశ్రాయేలీయులు ఆత్మీయముగా ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో వున్నారో తెలియజేస్తూవుంది.

బాప్తిస్మమిచ్చుయోహానును గురించి గాబ్రియేల్ దూత అతని తండ్రి ఐన జెకర్యాకు చెప్తూ, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పునని తండ్రుల హృదయములను పిల్లలతట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకును త్రిప్పి ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియుగలవాడై ఆయనకు ముందుగా వెళ్లునని అతడు చెయ్యవలసిన పనిని గురించి తెలియజేసి వుండటం లూకా 1:16,17 నందు చూడొచ్చు. ఈమాటలను అర్ధం చేసుకోవడానికి మనం మొదటిగా ఏలీయాను గురించి కొన్ని విషయాలను తెలుసుకొందాం.

ఏలీయా అనే పేరుకు అర్ధం “యెహోవా నా దేవుడు“, “యెహోవా మాత్రమే నా దేవుడు” అని ఇశ్రాయేలును తిరిగి వెన్నక్కు తీసుకురావడమే ఏలీయా లక్ష్యం. అతని పని యెహోవా ధర్మశాస్త్రము గౌరవించబడేటట్లు మరియు పాటించబడేటట్లు చూడటమే. బాప్తిస్మమిచ్చు యోహాను కాలములోని పరిస్థితులు కూడా పునరుద్ధరణ ప్రవక్త అయిన ఏలీయా కాలపు పరిస్థితులానే వున్నాయి. డిఫ్ఫరెంట్ గా ఏమి లేవు.

ఏలీయాయొక్క ఆత్మయు శక్తియుగలవాడైన బాప్తిస్మమిచ్చు యోహాను ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుటకు అంతర్గత శుద్ధీకరణను ప్రకటించాడు. అందుకు కారణాలు అనేకం.

లేఖనాలనుబట్టి ఒకటిగా ఉండవలసిన యూదులు యోహాను కాలంలో అనేకవర్గాలుగా_పరిసయ్యులుగా, సద్దుకైయులుగా, శాస్త్రులుగా ఎస్సెన్లుగా, రాజకీయముగా హేరోదుకు స్నేహితులైన వాళ్ళు హేరోదీయులుగా, పరిసయ్యులలో మరొకశాఖ అయిన గలీలియన్లుగా, ఎస్సెన్లులలో మరొకశాఖ అయిన థెరప్యూటేయనులుగా గ్రీకు కన్వెర్ట్స్గా ఇంకా చాలా వర్గాలుగా విభజింపబడియున్నారు. లేఖనాలపట్ల వారికున్న అవగాహనారాహిత్య మును బట్టి గ్రూప్స్ గా విభజింపబడివుండటమే కాకుండా వాళ్ళు ఒకరినొకరు హింసాత్మకంగా వ్యతిరేకించే కొనెడి వాళ్ళు. వాళ్ళు వారి వ్యతిరేకతను చాలా శత్రుత్వంతో కొనసాగించారు. ఈ వ్యతిరేకత కుటుంబాల్లోకి ప్రవేశించింది. ఈ వర్గ వ్యతిరేకతనుబట్టి తల్లిదండ్రులు పిల్లలు విభజింపబడ్డారు. వారి విభజనకు కారణమైన వాటి నుండి వారి దృష్టిని మరల్చి ఈ శత్రుత్వాన్ని పోగొట్టి వారందరిని లేఖనాలలో ఐక్యతకు తీసుకురావడం ద్వారా వారి కుటుంబాలలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పి వారినందరిని మెస్సీయ వైపుకు త్రిప్పి వారిని యేసుకు జతచేయడం తండ్రుల హృదయములను పిల్లలతట్టుకు త్రిప్పడం బాప్తిస్మమిచ్చు యోహాను పని.

అవిధేయులు అవిశ్వాసులైన ఇశ్రాయేలీయుల అవిశ్వాసమునుబట్టి దేవునికి దూరముగా ఉన్న ఇశ్రాయేలీ యులను పశ్చాత్తాపము మారుమనస్సుద్వారా దేవునికి దగ్గర చేసి వాక్యములో ప్రత్యక్షపరచబడియున్న నిజమైన జ్ఞానం అయిన యేసువైపుకు మళ్లించటం అవిధేయులను నీతిమంతుల జ్ఞానముననుసరించుటకు త్రిప్పటమే బాప్తిస్మమిచ్చు యోహాను పని.

దేవుడు వారి మధ్య కనిపించబోతున్నప్పుడు ప్రజలు ప్రత్యేక పద్ధతిలో పవిత్రంగా ఉండాలని హెచ్చరించ డమే బాప్తిస్మమిచ్చు యోహాను పని. యెహోవా సీనాయి పర్వతం మీదకు దిగబోతున్నప్పుడు ఇశ్రాయేలీ యులు మూడురోజులు తమ్మునుతాము శుద్ధిచేసుకోవలసి వచ్చింది, నిర్గమ 19:14-15 వచనాలు చూడండి. ఆవిధముగానే, కుమారుడైన దేవుడు విమోచకునిగా కనిపించబోతున్నప్పుడు ఆయన రాకడ కోసం ప్రజలు తమ్మునుతాము “సిద్ధం” చేసుకోవాలని దేవుడు కోరుకున్నాడు. వారిని సిద్ధపర్చడానికి దేవుడు యోహానును పంపియున్నాడు. వారిని అతడు సిద్ధపరచే క్రమములో దేవుడు వారితో ఏమైతే చెప్పమన్నాడో వాళ్ళతో చెప్పి బాప్తి స్మమును ఉపయోగించి వారిని శుద్ధి చేసియున్నాడు. ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుట అంటే అదే.

4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించు కొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.

లూకా 1:16,17 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని చెప్తూవుంది. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క ఆహారము ఆనాడు అరణ్యములో అందుబాటులో వుండే సులభమైన ఆహారము, ఆ అరణ్య ప్రాంతంలో అడవి తేనె పుష్కలంగా ఉండేది. లేవీయ 11: 22 నేత మిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడత గాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును అని చెప్తూవుంది. నాజీరు చేయఁబడిన వ్యక్తిగా అతడు ఆహారము విషయములో చాలా కఠినముగా ఉండేవాడని దీనిని బట్టి అర్ధమవుతువుంది.

అతని పనిలో అతని దుస్తులు ఆహారము నివాసస్థలము వైవిధ్యమైన అతని జీవన శైలి ప్రత్యేకమైనవి_ ఇవి అతడు ఎంతటి కఠినమైన పరిస్థితుల మధ్య సిద్ధపరచబడ్డాడో తెలియజేస్తూవున్నాయి. అరణ్యము అంటే ఈజీ అని అనుకుంటు న్నారా? అజ్ఞాతం/ ఏకాంతము దుర్భరమైన జీవన పరిస్థితుల మధ్య చాల ప్రాముఖ్య మైన అంశము నెవెర్ కంప్లైన్డ్స్ స్వభావము, సంతుష్టిగల జీవితమును జీవించడం. సాధారణ జీవితం అంటే తన దృష్టిని దేవుని పైనుండి ఏది మరల్చకుండా లోకాన్ని వస్తువులను, శరీరాశలను పరిత్యజించి బ్రతకడం, అందుకు ఎంతో నిబద్ధత చిత్తశుద్ధి అవసరం. దేవునిపై ఆధారపడి దేవునితోనే బ్రతకడం.

అరణ్యాన్ని ప్రవక్తలు నివాసస్థలముగా ఎన్నుకోవడానికి కొన్ని కారణాలు_ దేవునిపట్ల వారికున్న ప్రేమను కఠిన పరిస్థితుల మధ్య సాధన చెయ్యడం_ ఎందుకు? 1. శోధనలు స్వల్పం ఏకాంతంలో దుర్గుణాల సందర్భాలు తక్కువ. సద్గుణాలతో ధర్మముతో బ్రతుకుట అధికం. 2. మిగతా ప్రపంచముతో తక్కువ కనెక్షన్ ఉంటుంది కాబట్టి శరీర మనస్సులను ప్రశాంతముగా వుంచుకోవడానికి ఆధ్యాతికమైన జీవితముఫై ఎక్కువ ద్రుష్టి పెట్టడానికి అవకాశము ఎక్కువ. 3. అరణ్యము కఠినమైన క్రమశిక్షణను నేర్పిస్తుంది. 4. భక్తికి గోప్యత ఉత్తమం. అంతర్గత సాక్షాత్కారానికి ఏకాంతం అవసరం.

అరణ్యం ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితికి తగిన సింబల్ గా ఉంది. ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసంను బట్టి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించుటకు 40 సంవత్సరాలపాటు వారు తిరిగిన అరణ్యాన్ని కూడా ఇది జ్ఞాపకం చేస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను తన పరిచర్యను యెరూషలేములో కదండి ప్రారంభించాలి? యెరూషలేము నుండి ఒక రోజంత దూరములో వుండే యూదయ అరణ్యమును ఎన్నుకోవడంలో కారణం ఉందా? ఇశ్రాయేలీయులకు ఎంతో ప్రాముఖ్యమైనది వారి మందిరము దాని వ్యవస్థ. దానిని వారిని కాదని అరణ్యమును ఎన్నుకోవడం, ఏంటి? తన కుమారుడు ఈ లోకమునకు వచ్చేటప్పటి పరిస్థితులు ఎలా వుంటాయో మందిరము దాని వ్యవస్థను వ్యర్ధమైనదిగా ప్రజలు ఎలా మార్చేస్తారో దేవునికి ముందే తెలుసు కాబట్టే తన ప్రవక్త ద్వారా ఆయన యెరూషలేములోని అవినీతి యాజకత్వాన్ని తిరస్కరిస్తూ అరణ్యమును ఎన్నుకొని వుండొచ్చుగా అని కొందరు అంటారు. యెహోవా మహిమ మరోసారి అరణ్యంలో ఇశ్రాయేలీయు లకు బయలుపరచబడబోతూ వుంది. ప్రభువు క్రొత్త నిబంధనను చెయ్యబోతూవున్నాడు. అందుకు ఆయన పాతనిబంధనలో చేసినట్లుగానే ఇప్పుడును మరల మరొకసారి చెయ్యబోతూవున్నాడు.

5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారంద రును, అతనియొద్దకు వచ్చి, 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

ఆనాటి యూదులకు బాప్తిస్మము అనేది క్రొత్త కాదు. ఎందుకంటే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాళ్ళు బాప్తిస్మము పుచ్చుకున్నారు అంటే బాప్తిస్మము గురించి వాళ్లకు తెలుసు. కాబట్టే బాప్తిస్మమిచ్చు యోహాను ఆనాడు యూదులు ఉపయోగించే బాప్తిస్మమును తన పనిలో ఉపయోగించుకొనియున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఏ విధముగా ఇచ్చాడో మనం ఖచ్చితంగా చెప్పలేము. అతడు ముంచుట ద్వారా బాప్తిస్మము ఇచ్చాడు అనే అభిప్రాయం నిరూపించబడదు. బాప్టిజం అనే పదం నీటితో రకరకాలుగా కడిగే పద్ధతులను వివరించడానికి బైబిలులో ఉపయోగించబడింది.

హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్న పానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమై యున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని వుంది చూడండి. స్థితిని పునరుద్ధ రించడానికి చేసే శుద్ధికరణములో విభిన్నమైన ప్రక్షాళనలు ఉండేవి అని ఈ వచనము తెలియ జేస్తూవుంది.

ఈ విషయాన్నే మార్కు 7:1-4 చెప్తూవున్నాయి, చదువుకొందాం: 1యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులు ను శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి 2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుటచూచిరి. 3పరిసయ్యులును యూదులందరును పెద్దల పారం పర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 4మరియు వారు సంత నుండి వచ్చి నప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలనుకుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట  మొదలగు అనేకాచారము లను వారనుసరించెడివారు (ముంచుట) అనే మాటకు (ఫుట్ నోట్స్ లో) ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని వుంది చూడండి. అంటే బాప్తిస్మము అనే మాటకు నీటితో కడుగు కోవడం, నీటిని చల్లుకోవడం, చిలకరించుకోవడం, నీళ్లలో ముంచటం అని అర్ధమన్నమాట. బాప్తిస్మము అనే మాటకు గ్రీకు అర్ధము ఇదేనండి.

మెస్సీయ రావడానికి చాలా కాలం ముందు నుండే యూదులు తమ మతములోనికి మారిన అన్యులకు బాప్తిస్మము ఇచ్చేవాళ్ళు. యోహాను బాప్తిస్మము ఒక ప్రభావవంతమైన మతకర్మ, “పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము” (మార్కు 1:4) ఇది.

మరి బాప్తిస్మమిచ్చుయోహాను యూదులకు బాప్తిస్మము ఎందుకిచ్చినట్టు? వాళ్ళేమి మతం మారలేదు కదా.  ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారి నుండి కోరిన పవిత్రతను వాళ్ళు కలిగిలేరని వారు అపరిచితుల స్థితిలో ఉన్నారని సూచిస్తు (అన్యులుగా) మెస్సీయచే అంగీకరించబడటానికి లేదా ఆయన రాజ్యంలోకి ప్రవేశించ డానికి ముందు కొత్త స్థితిని పొందమని బాప్తిస్మమిచ్చు యోహాను పిలుపు నిచ్చాడు. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడునని నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు 16:16 చెప్తూ వుంది.

యోహాను 3:22,23 అటుతరువాత యేసు తన శిష్యులతోకూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను. సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. వారి బాప్టిజంల మధ్య ఎటువంటి తేడాలు ఉన్నట్లు ఎటువంటి సూచన లేదు. కాబట్టి యేసు అపొస్తలులకు కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మరియు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి అని ఆజ్ఞాపించినప్పుడు (మత్తయి 28:19, 20), ఆయన కొత్తది భిన్నమైనదాన్ని చేయమని వారికి చెప్పలేదు. వారు మరియు బాప్తిస్మమిచ్చు యోహాను ఇంతకుముందే చేస్తున్న పనిని కొనసాగించమని ఆయన వారికి చెప్తూవున్నాడు.

చాలామంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతూవుంటారు? మీరు బాప్తిస్మము తీసుకున్నారా లేక బాప్తిస్మము పుచ్చుకొన్నారా? రెండింటికి చాలా తేడా ఉందండి. బాప్తిస్మము తీసుకోవడమంటే అది మన స్వంత ఆలోచన, నిర్ణయము, సామర్ధ్యమునుబట్టి మనకు మనముగా తీసుకోవడం. క్రీస్తును నమ్మని ప్రతి ఒక్కరు వారి అపరాధములచేతను పాపములచేతను చచ్చినవారై యుండగా, ఎఫెసీ 2:1 వాళ్ళు ఎలా నిర్ణయము తీసుకోగలరు? తమకున్న సామర్ధ్యమును బట్టి బాప్తిస్మమును ఎవడన్నా తీసుకోగలడా? ఏ ఒకడు తన స్వంత నిర్ణయము వలన ఆలోచనవలన యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచలేడు ఆయన యొద్దకు రాలేడు. పరిశుధ్ధాత్ముడు సువార్త వలన మనలను పిలిచి తన వరములవలన మనలను వెలిగించి విశ్వాసమునందు వుంచుతూ వున్నాడు. పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు అని 1 కొరింథీయులకు 12: 3 చెప్తూవుంది. ఇది దేవుని కృపావరమే. కాబట్టి మనము బాప్తిస్మమును పుచ్చుకొంటూ వున్నాము.

యెరూషలేమువారును యూదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చారు కదా వాళ్ళు ఎందుకని వచ్చినట్లు?

రోమన్ కాడి యూదులపై కఠినంగా వుంది ఇది వారి మనస్సులలో అశాంతిని  మెస్సీయ రాకడ కోరికను పెంచింది, అసహనాన్ని పెంచింది. ప్రజలు విమోచన మాత్రమే కాకుండా సార్వత్రిక రాచరికాన్ని ఆశిస్తూ వున్నారు. అలాంటి టైములో కొత్త ప్రవక్త ఆవిర్భవించాడనే పుకారు పట్టణం అంతటా వ్యాపించుటను బట్టి అతడు పుట్టిన పరిస్థితులు ప్రవక్త యొక్క అసాధారణ రూపం, అతని దుస్తులు అతని కఠినమైన జీవితం, అతని సిద్ధాంతం యొక్క  ప్రాముఖ్యత, అతను అమలు చేసిన బాప్తిస్మము యొక్క కొత్తదనం (సిద్ధపరచుట), అతని భోదలు, వారి చరిత్రకు సంఘటనలకు ఉన్నటువంటి సారూప్యతను బట్టి ఏమి జరుగుతుందో చూడటానికి చాలా మంది వచ్చారు.

వారిలో కొందరు ఉత్సుకతతో వచ్చి వుండొచ్చు. మరికొందరు ఇశ్రాయేలుకు తిరిగి మంచి రోజులు వచ్చాయి అనే నిరీక్షణతో వచ్చి వుండొచ్చు. మరికొందరు నిస్సందేహంగా 4 శతాబ్దాల తరువాత, నిజమైన ప్రవక్త వచ్చారనే ఆలోచనతో అతనిని చూడాలనే ఉదేశ్యముతో అతని దగ్గరికి వచ్చి వుండొచ్చు. అతను ఎవరు కావచ్చు? అనే ప్రశ్నతో కొందరు. మరికొందరు, అతను ఒక ప్రవక్త కంటే ఎక్కువ? అతడు క్రీస్తు కాగలడా? అనే సందేహముతో వచ్చి ఉండొచ్చు?

తమ పాపములు ఒప్పుకొనుచు, అంటే వారు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పరిచర్య ద్వారా పశ్చాత్తాపానికి పిలువబడినప్పుడు వాళ్ళు ఆ సందేశాన్ని తృణీకరింపక పాపులమని యెరిగి ప్రవక్త ఇస్తూవున్న బాప్తిస్మము ద్వారా క్షమింపబడుటకు శుద్ధీకరింపబడుటకు ముందుకు వచ్చి దేవుని ఎదుట మనుష్యుల ఎదుట తమ పాపాన్ని అంగీకరించడాన్ని ఒప్పుకోవడాన్ని దానిని బహిరంగముగా వ్యక్తీకరించడానికి వాళ్ళు యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పుచ్చుకొంటూ వారి మధ్యకు రోబోతూవున్న మెస్సయ్య కొరకు సిద్ధపడ్డారు.

మత్తయి3:7-12_ 7 అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి–సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధిచెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 8-9 అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. 10 ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 11 మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. 12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

 1. పరిసయ్యులు అంటే ఎవరు?
 2. సద్దూకయ్యులు అంటే ఎవరు?
 3. ఎందుకని బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యులను సద్దూకయ్యులను సర్పసంతానమా అని సంబోధిస్తూ వున్నాడు?
 4. పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మము అంటే ఏమిటి?