మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అను లేఖనమును బట్టి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులలో యేసుక్రీస్తు ఒకరని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నిత్య దేవుని కుమారుడైయున్నాడు. తండ్రితోను పరిశుధ్ధాత్మునితోను సమానుడైయున్నాడు. 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి రక్షకుడై యున్నాడు, ప్రజలందరిని విమోచించడానికి మనుష్యుడయ్యాడు. ఆయన మనవంటి మానవ స్వభావమును తీసుకొనియున్నను, ఆయన పాపములేనివానిగా ఉన్నాడని, ఆయన తన దైవికతకు మానవ స్వభావాన్ని స్వీకరించియున్నాడని నేను నమ్ముతున్నాను. కాబట్టే యేసుక్రీస్తు “నిజ దేవుడైయున్నాడు, నిత్యత్వమందు తండ్రి కనిన వాడును, మరియు కన్యయైన మరియకు పుట్టిన నిజమానవుడై యున్నాడు”. ఆయన విభజింపబడక విభజింపశక్యముకాక ఒక్కరిలోనే నిజ దేవునిగాను నిజ మానవునిగాను వున్నాడు.

గలతీయులకు 4:4-5 కాలము పరిపూర్ణమై నప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన పరిశుధ్ధాత్ముని వలన గర్భమున ధరింపబడి కన్యయైన మరియయందు పుట్టియున్నాడు (మత్తయి 1:22-23 ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము). దేవుని కుమారుడు శరీరధారి అగుటయను అద్భుతము యొక్క ఉద్దేశ్యము, ఆయన దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఉండవచ్చుననే, మనము దత్తపుత్రులము (స్వీకృతపుత్రులం) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ఆయన మానవులందరి స్థానములో దైవికమైన ధర్మశాస్త్రమును నెరవేర్చి పరిపూర్ణ జీవితాన్ని జీవించియున్నాడు, (హెబ్రీయులకు 4:15 సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను). ఆయన ప్రతిఒక్కరి పాపముకొరకు తగినంత మూల్యమును చెల్లించుటకు గాను (హెబ్రీయులకు 2:16 కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై), సిలువపై మనకు మారుగా నిర్దోషమైన బలిగా మరణించియున్నాడు. (గలతీయులకు 3:13 క్రీస్తు మనకోసము శాపమై (శాపగ్రాహియై) మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను; ఎఫెసీయులకు 1:7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది). ఆయన శ్రమపడి మరణించియున్నాడు. ఈ విధముగా దేవుడు పాపలోకమంతటిని తనతో సమాధాన పర్చుకొనియున్నాడు, (2 కొరింథీయులకు 5:18-19 ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచు కొని…అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు).

మరణమునుండి తిరిగి లేచి, (రోమా 1:5 యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింప బడెను). యేసు పరలోకమునకు ఆరోహణమయ్యాడు (అపొస్తలుల కార్యములు 1:9 ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను). అంత్యదినాన్న ఆయన ప్రజలలో ఇంకను సజీవులుగా ఉన్నవారందరికిని, ఆయనచే మృతులలో నుండి లేపబడిన వారందరికిని తీర్పుతీరుస్తాడు (అపొస్తలుల కార్యములు 10:42 ఇదియుగాక దేవుడు సజీవుల కును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే).

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.