యూదా పత్రిక పరిచయం
విశ్వాసం కోసం పోరాటం
క్రొత్త నిబంధనలో అపొస్తలుల పత్రికలలో చివరిది యూదా వ్రాసిన పత్రిక. ఇది చాల చిన్న లేఖ కాని అత్యంత బలమైన విషయాలను కలిగి వుంది. ఖచ్చితంగా ఇది క్రొత్త నిబంధనలో అతి తక్కువ సుపరిచి తమైన రచనలలో ఒకటి అని చెప్పొచ్చు. చర్చికి వెళ్లేవారు కూడా యూదా పత్రికను ఎక్కువగా చదవరు, వినరు చెప్పాలంటే దాని నుండి ఒక ప్రసంగాన్ని కూడా వాళ్ళు వినియుండకపోవచ్చు. ఈ చిన్న పత్రిక అబద్ద బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరికలను ఇస్తూ తప్పుడు బోధకులు ఉద్భవించినప్పుడు, మతభ్రష్టత్వం తలెత్తినప్పుడు, దేవుని సత్యం పై దాడి జరిగినప్పుడు, విశ్వాసం కోసం పోరాడండి అని చెప్తూవుంది. ఆధ్యాత్మికంగా “బలముగా” ఉన్న విశ్వాసులు మాత్రమే తప్పుడు బోధకులకు జవాబును ఇవ్వగలరు. కాబట్టే యూదా విశ్వాసం కోసం పోరాడటానికి అట్టి వారిని సవాలు చేస్తూవున్నాడు. అబద్ధ బోధ నిజం, దాని దాడి నిజం. తప్పుడు బోధకులు చర్చిలోకి ప్రవేశించారు, వారి ఇష్టానుసారం చేయడానికి దేవుని కృపను అపరిమితమైన లైసెన్స్‌గా మార్చారు. అటువంటి వారితో పాతనిబంధనలో దేవుడు ఎలా వ్యవహరించియున్నాడో వారికి గుర్తు చేస్తూ వారిని హెచ్చరించడమే కాకుండా ఈ యుధ్దములో క్రైస్తవులు నిర్లక్ష్యముగా ఉండకూడదని చెప్తూ వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. క్రైస్తవులు ఈ విషయాలను తెలుసుకొనేందుకు ఈ పత్రికను చదవవలసియున్నారు. ఈ లోకం దేవునికి లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమయింది. మన విశ్వాస పోరాటాన్ని మనం ఎన్నటికి ఆపకూడదు. ఈ సవాలు చాలా గొప్పది, కాని అవి మనలను పాడు చెయ్యకుండా దేవుడు చెయ్యగలడు.
గ్రంధకర్త
యేసు పన్నెండుమంది శిష్యులలో యూదా అను పేరుతో ఇద్దరు శిష్యులు ఉన్నప్పటికి, (లూకా 6:15) మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి అను 17వ వచనాన్ని బట్టి రచయిత తాను అపొస్తలుడని చెప్పుకోవడం లేదు. అపొస్తలుల నుండి తనను తాను వేరు చేసుకున్నట్లు కూడా అనిపిస్తుంది. అయితే ఈ గ్రంధకర్త ఎవరై ఉండొచ్చు అనే ప్రశ్నకు, అతడు తనను తాను యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదాను అని 1వ వచనంలో పరిచయము చేసుకొంటూవున్నాడు. సాధారణంగా యూదా కాలంలోని ఒక వ్యక్తి తన గురించి చెప్పుకోవాల్సి వస్తే తనను ఒకరి సోదరుడిగా కాకుండా నేను ఫలానా వారి కొడుకును అని చెప్పుకొంటాడు. ఇక్కడ మన గ్రంధకర్త తనను యాకోబు యొక్క సహోదరునిగా చెప్పుకోవడానికి కారణం యెరూషలేములోని చర్చిలో యాకోబు యొక్క ప్రాముఖ్యత కావచ్చు. ఈ యాకోబు మరెవరో కాదు, యేసు నలుగురు సహోదరులలో ఒకరు, అప్పటి చర్చికి స్తంభముగా ఎంచబడినవాడు (గలతీయులు 2:9), యెరూషలేములోని చర్చిలో ఎంతో గుర్తింపు కలిగిన వాడు (అపొస్తలుల కార్యములు 15). మత్తయి 13:55, మార్కు 6:3 వచనాలు యేసు సహోదరులను గూర్చి మాట్లాడుతూ యాకోబు యోసేపు సీమోను యూదాయను వారు యేసుకు సోదరులు అని ఆయనకు ఇంకను సోదరీమణులు కూడా ఉన్నారని తెలియజేస్తూవున్నాయి.
యేసుని సహోదరులు మొదట్లో ఆయన మెస్సీయ అనే వాదనలను విశ్వసించలేదు (యోహాను 7:5). ఆయన ఇంటివారు “ఆయనకు మతి చలించియున్నదని” భావించారు (మార్కు 3:21). వారు ఆయన పరిచర్యలో కూడా జోక్యం చేసుకొనుటకు ప్రయత్నించారు (యోహాను 7:3,4). నజరేతులో ప్రతిఘటన ఎదురైన తర్వాత, యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని చెప్పడం (మత్తయి 13:57) విచారించదగిన విషయం. యేసు శిలువ నుండి తన తల్లిని తన సోదరులలో ఒకరికి కాకుండా తన శిష్యుడైన యోహాను సంరక్షణకు ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
కాని యేసు పునరుత్థానం ప్రత్యక్షత తర్వాత, యేసు తల్లి మరియు సోదరులతో పాటు పదకొండు మంది శిష్యులు ప్రార్థనలో ఉన్నారని అపొస్తలుల కార్యములు 1:14 చెప్తూవుంది. తర్వాత యేసుని సహోదరులు సువార్త పరిచర్యలో చురుగ్గా మారారు (1 కొరింథీయులకు 9:5; గలతీయులకు 1:19).
యూదా రచనా శైలి అతని సోదరుడైన యాకోబును గుర్తు చేస్తూవుంది మరియు అతడు ఖచ్చితముగా మండుతున్న ఒక బోధకుడు దూకుడు కలిగిన మిషనరీ అని తెలియజేస్తూవుంది. ఈ చిన్న పత్రిక స్పష్టంగా అవిశ్వాసులందరిపై దేవుని రాబోయే తీర్పును దృష్టిలో ఉంచుకుని అందరిని హెచ్చరిస్తూ, అద్భుతమైన ఉదాహరణలను ఇస్తూ లోతైన అర్దాలతో నిండి ఉండటమే కాకుండా అనేకమైన పాత నిబంధన ఉదాహరణలను కోట్ చేసి ఉండటాన్ని గమనించొచ్చు.
9అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక– ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను.14-15 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను, ఈ రెండు వచనాలను బట్టి కొందరు దీని కెనానికల్ ప్రామాణికతను గూర్చి ప్రశ్నిస్తూవుంటారు. ప్రేరేపిత రచయిత – దృష్టాంత ప్రయోజనాల కోసం లేదా చారిత్రాత్మకంగా నమ్మదగిన అంశాలను చెప్పడం కోసం లేదా ఇతర ఆమోదయోగ్యమైన విషయాలను తెలియజేయడం కోసం- అటువంటి సాహిత్యాన్ని చట్టబద్ధంగా ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఉపయోగం ఆ సాహిత్యాన్ని ప్రేరేపించినట్లు ఆమోదించదు. ఆత్మ ప్రభావంతో, దేవుని అధికారం యూదా పత్రిక వెనుక నిలుస్తుందని చర్చి విశ్వాసానికి వచ్చింది. పత్రికను ప్రశ్నించడం పరీక్షించడం జరిగింది. చర్చి దానిని అంగీకరించడం అనేది దాని ప్రామాణికతకు బలాన్ని ఇస్తూ ఉందనే విషయాన్ని మర్చిపోకండి.
ఈ పత్రిక వ్రాయబడిన కాలం మరియు ప్రదేశం
ఈ పత్రిక ఎప్పుడు, ఎక్కడ వ్రాయబడిందనే దాని గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. యూదా పత్రిక 4-18 వచనాలు మరియు 2 పేతురు 2:1-3:4 వచనాలు చాలా సారూప్యంగా ఉన్నాయి, ఒకదాని నుండి మరొకటి ఉటంకిస్తూ ఉండాలి. ఎవరు ఎవరిని కోట్ చేస్తున్నారు? ఎవరికి ఖచ్చితంగా తెలియదు. 2 పేతురు ప్రెడిక్ట్ చేస్తున్నట్టుగా అనిపించే కొన్ని సంఘటనల గురించి యూదా మాట్లాడుతున్నాడు కాబట్టి, అతని పత్రిక 2 పేతురును ఆధారము చేసుకొని తరువాత కాలములో వచ్చి ఉంటుందని కొందరు అంటున్నారు. అట్లే 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 1,3 అధ్యాయాలకు భిన్నమైన శైలిలో వ్రాయబడినట్లు అనిపిస్తుంది. ఇందునుబట్టి అప్పటికే ఉనికిలో ఉన్న యూదా పత్రికను పేతురు ఆధారము చేసుకొని వ్రాసి ఉంటాడని సూచించడం సహేతుకం. ఎందుకంటే పేతురు చెప్పాలనుకొంటున్న భావాలను యూదా చాలా స్పష్టంగా పేర్కోనియున్నాడు.
యూదా మరియు 2 పేతురు మధ్య సంబంధం పై యూదా పత్రిక యొక్క కాలము ఆధారపడి ఉంది. 2పేతురు 2 అధ్యాయము యూదాను ఉపయోగించి ఉన్నట్లైతే అప్పుడు యూదా 2 పేతురుకు ముందు అంటే బహుశా క్రీ.శ. 65లో వ్రాయబడి ఉండొచ్చు లేదంటే 2 పేతురు తర్వాత క్రీ.శ. 80 లో వ్రాయబడి ఉండొచ్చని కొందరి అభిప్రాయము. ఈ పత్రిక పాలస్తీనాలోని క్రైస్తవులకు వ్రాయబడినట్లు అనిపిస్తుంది. ఇందులో యెరూషలేము నాశనం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు కాబట్టి, దీని తేదీని సురక్షితంగా 68 క్రీ.శ. అని చెప్పొచ్చు.
యూదా ఈ పత్రికను ఎవరికి వ్రాసాడు వ్రాయడానికి గల కారణం
యూదా తన పత్రికను [క్రీస్తునందు విశ్వాసముంచుటకు] తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి వ్రాసియున్నాడని అతని సంబోధన తెలియజేస్తూవుంది. 3,17, 20 వచనాలలో వాడబడియున్న “ప్రియులారా” అనే మాట అతడు ఒక నిర్దిష్ట వ్యక్తుల సమూహంను ఉద్దేశించి వ్రాసినది కావొచ్చు లేదా ప్రత్యేకముగా పేరులేని ఒక సంఘాన్ని ఉద్దేశించి వ్రాసినది కావొచ్చు. అతడు పాతనిబంధన లేఖనాలను విస్తృతంగా ఉపయోగించియున్నందున, అతడు యూదు క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసి ఉంటాడని నిర్ధారించడం సహేతుకం. ఆదాము, కయీను, హనోకు, సొదొమ, ఐగుప్తు చెర, కోరహు మరియు బిలాములకు సంబంధించిన రిఫరెన్స్ లను తన పాఠకులు గుర్తించాలని అతడు ఆశపడ్తువున్నాడు.
యూదా వ్రాసే సమయానికి, గొర్రెల వేషధారణలో తోడేళ్ళు మందలోకి చొరబడతాయన్న యేసుని విచారకరమైన ప్రవచనం నిజమైంది. ఈ తప్పుడు బోధకులు దేవుని కృపను వక్రీకరిస్తూ, వారి ఇష్టానుసారం చేయడానికి దేవుని కృపను అపరిమితమైన లైసెన్స్‌గా మార్చారు. కృప ద్వారా రక్షింపబడియున్నాము. ఇక ఇష్టానుసారం ఏమి చేసినను అవి ఇకపై వారికి వ్యతిరేకంగా తీసుకొనబడవని (పాపం చేయడానికి వారికి లైసెన్స్ ఉందని) భోదిస్తూ విశ్వాసులను ఒప్పించటానికి ప్రయత్నిస్తూవున్నారు. అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, దేవుని రక్షించే కృపను గూర్చిన సత్యంతో వారి వక్రబుద్ధి గల బోధనను వ్యతిరేకించడానికి విశ్వాసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని యూదా బాధతో, ఆగ్రహంతో క్రైస్తవులలో జాగరూకతను ప్రేరేపిస్తూ (వాళ్ళను పశ్చాత్తాపం, విశ్వాసం, ప్రార్థన, పరిచర్య కోసం) వారిలో ఒక కదలికను తేవడానికి ఈ పత్రికను వ్రాసియున్నాడు.
విశ్వాసానికి ఎదురయ్యే ప్రమాదాల గురించి వ్యక్తిగతముగా క్రైస్తవులను హెచ్చరించే విషయములో యూదా విశేషాసక్తి గలవానిగా ప్రయత్నిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఈ పత్రిక తెలియజేస్తూవుంది. “భక్తిహీనులైన చొరబాటుదారుల” పై దేవుని నీతియుక్తమైన కోపాన్ని గురించి అతడు తెలియజేస్తూ క్రీస్తుపై వారి విశ్వాసంలో పట్టుదలతో ఉండమని విశ్వాసులను ప్రోత్సహిస్తూవున్నాడు. విశ్వాసులకు శాశ్వత గమ్యము కంటే ప్రాముఖ్యమైనది ఏమీ లేదని; విశ్వాసం కోసం పోరాడడం మిమ్మల్ని తక్కువ ఏమీ చేయదని చెప్తూ ఉన్నాడు.
యూదా పత్రికలో క్రీస్తు
క్రీస్తును విసర్జించినవాళ్లు ఖండింపబడియున్నారు (4); విశ్వాసులు యేసుక్రీస్తునందు భద్రము చేయబడి యున్నారు (1). యూదా తన పాఠకులకు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి (21) అని చెప్తూ, అదే సమయములో, ప్రభువు, తొట్రిల్లకుండ మిమ్మును కాపాడును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టును అని చెప్తూవున్నాడు.
యూదా పత్రికలో ప్రాముఖ్యమైన మాట
విశ్వాసము కొరకు పోరాడుడి.
ప్రాముఖ్యమైన వచనము
3 ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
అవుట్ లైన్
థీమ్: విశ్వాసం కోసం పోరాడండి!
I. గ్రీటింగ్ (1, 2)
II. పత్రికవ్రాయడానికిగలకారణం (3, 4)
III. తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (5–16)
- అబద్ధభోదకులపై తీర్పుకు చరిత్రాత్మికమైన ఉదాహరణలు (5–7)
1. అవిశ్వాసియైన ఇశ్రాయేలు (5)
2. పడిపోయిన దేవదూతలు (6)
3. సొదొమ మరియు గొమొర్రా (7)
IV. యూదా కాలము నాటి అబద్ధభోదకుల స్వభావము (8–16)
1. వారి తప్పుడు బోధ (8–10)
2. గ్రాఫికల్‌గా చిత్రీకరించబడిన వారి స్వభావము (11–13)
3. వారి నాశనము ప్రవచించబడింది (14–16)
V. విశ్వాసులు పట్టుదలతో ఉండాలని ఉద్బోధించడం (17–23)
VI. డాక్సాలజీ (24, 25)
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.