థీమ్: విశ్వాసం కోసం పోరాడండి!

I. గ్రీటింగ్ (1, 2)

1యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. 2మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.

ఈ పత్రికలో యూదా ఏవిధముగా తనను తాను పరిచయం చేసుకొంటూ ఉన్నాడో చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇతడు యేసుక్రీస్తుతో తనకు గల రక్త సంబంధాన్ని చెప్పకుండా యెరూషలేముకు చెందిన యేసుని సహోదరుడైన యాకోబుకు స్నేహితుడనని పరిచయము చేసుకొంటూ ఉన్నాడు. బహుశా ఇది సముచితమైన వినయం కావొచ్చు. నజరేతులో ఎదుగుతున్న సంవత్సరాల్లో మరియు యేసు బహిరంగ పరిచర్య మూడు సంవత్సరాలలో, యూదా ప్రత్యేకంగా ఎక్కడా మనకు కనబడడు. ఈ యాకోబు జెబెదీ కుమారుడు మరియు యోహాను సోదరుడు అయిన యాకోబు కాదు, అల్ఫాయస్ కుమారుడైన యాకోబు ది లెస్, యాకోబు 1:1; గలతి 1:19; 1 కొరింథీయులకు 15:7. ఈ యూదా, ప్రభువు యొక్క సోదరుడు (కజిన్) కూడా; అతను ఒక అపొస్తలుడు మరియు బహుశా తద్దయియను మారుపేరుగల లెబ్బయి, మత్తయి 10:3; మార్కు 3:18; లూకా 6:16; అపొస్తలుల కార్యములు 1:13. యూదా అను పేరుకు “స్తుతించుట” అని అర్ధము (ఆది 29:35).

ఇక్కడ ఇతడు యేసుక్రీస్తుకు సహోదరుడనని కాకుండా తనను యేసుక్రీస్తు దాసుడును అని పరిచయము చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు. ఆదిమ క్రైస్తవులలో ముఖ్యంగా, నాయకులు తమ్మును ఈ విధముగా పరిచయము చేసుకొనెడి వాళ్లు. దాసుడు అనే మాట బానిసత్వం, మరణం నుండి రక్షింపబడియుండటాన్ని తెలియజేస్తూ ఉంది. ఈ చిత్రాన్ని మనకు వర్తింపజేసుకొంటే, దాసుడు అనే మాట దేవుని రక్షణ కృపకు కూడా వర్తిస్తుంది. ప్రభువుకు సేవకునిగా లోబడి ఉండటం యూదాకి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అతడు క్రీస్తు చెల్లించిన వెలచే కొనుగోలు చేయబడియున్నందున తాను తన స్వంతం కాదని ప్రభువును ఈ విధముగా మహిమపరుస్తూ, ఇతర అపొస్తులులవలె (యాకోబు పేతురు పౌలు వలే) ఇతడు కూడా యేసుక్రీస్తు దాసుడును అని తనను తాను పరిచయము చేసుకొంటూ ఉన్నాడు, (యాకోబు 1:1, 2 పేతురు 1:1, రోమా 1:1). దాసుడు అనే మాట వారి బాధ్యతలను నిర్దేశించుకోవడంలో వారికి సహాయపడుతూ ఇష్టపూర్వకంగా సేవ చేసేందుకు వారిని ప్రేరేపించింది. అతడు యాకోబు యొక్క సోదరుడిగా గుర్తించబడటంలో సంపూర్ణంగా సంతోషించుచున్నాడు అని కూడా ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి.

వారి మధ్య లోనికి అబద్ద బోధకులు చొరబడియున్నప్పటికిని, వారిచే అనేకులు కలవరపర్చబడియున్నప్పటికిని యూదా విశ్వాసులను పిలువబడినవారికి అని సంభోదిస్తూ ఉన్నాడు. పిలువబడినవారికి అంటే ఎవరినైతే దేవుని వాక్యం విశ్వాసానికి ఆహ్వానించియున్నదో, యేసుక్రీస్తులో విశ్వాసంలో ఉంచుటకు తెచ్చియున్నదో వారికి (రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి) యూదా వ్రాస్తూ, మీరందరు తండ్రి యొక్క దయగల ఎంపిక ద్వారా నిత్యత్వము నుండి ప్రేమింపబడి, (రోమా 8:29,30 దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యముగల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను) మానవజాతి పతనం నుండి ప్రేమింపబడి, (మొదటి సువార్త వాగ్దానం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంది) ఇప్పుడు భౌతిక జన్మ మరియు ఆధ్యాత్మిక పునర్జన్మతో ప్రేమించబడుతూ, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి ఉన్నారని (1 పేతురు 1:5 విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతూ) వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మన ప్రభువు మనకు నిత్యజీవానికి అవకాశాన్ని అందించడమే కాకుండా, దానిని పొందేందుకు మనల్ని విశ్వాసంలో ఉంచడానికి శ్రమిస్తున్నాడని తెలుసుకోవడం ఎంతో ఓదార్పును కలుగజేస్తూ ఉంది. (యోహాను 6:37-40 తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వానిని లేపుదును; యోహాను 17:11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు).

ఈ గ్రీటింగ్స్ క్రీస్తులో, క్రీస్తు ద్వారా మానవులకు దేవుడు ఇచ్చిన బహుమతులు. ఈ గ్రీటింగ్స్ ఇతర అపొస్తులుల గ్రీటింగ్స్ కు భిన్నముగా ఉంటూ, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక అను ట్రిపుల్ దీవెనతో ముగుస్తూ ఉంది: కనికరము అంటే బలహీనుల పట్ల దేవుని దృఢమైన కరుణ (క్షమాపణ, దేవుని అంగీకారం; ఆదికాండము 19:16 అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి). రక్షణ అనేది మానవ ప్రయత్నం లేదా యోగ్యతతో సాధించబడదు కాని దేవుని కనికరము ద్వారా మాత్రమే వస్తుంది. ఈ విషయాన్నే తీతుకు 3:5 తెలియజేస్తూ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను అని చెప్తూ ఉంది. సమాధానము అంటే క్రైస్తవులు ఇప్పుడు తమ తండ్రితో ఆనందించే ప్రశాంతమైన మరియు సంతోషకరమైన సంబంధం. ఆయన తనతో సమాధానముగా ఉన్నవారికి మాత్రమే సంపూర్ణ శ్రేయస్సును మరియు భద్రతను పూర్తిగా అందిస్తాడు. ప్రేమ అంటే మనల్ని నేరస్థులుగా కాకుండా పిల్లలుగా పరిగణించాలనే దేవుని నిర్ణయం. ఏ క్రైస్తవ హృదయాలు మరియు జీవితాలు ఈ సమృద్ధితో నిండి ఉంటాయో వాళ్ళు ఒకరి పట్ల మరొకరు అదే కనికరము సమాధానము ప్రేమతో వ్యవహరిస్తారు.

యూదా యొక్క పాఠకుల విశ్వాసం మందకొడిగా ఉన్నప్పటికీ, అతడు ఓదార్పు మరియు ప్రోత్సాహంతో ప్రారంభించాడు. తప్పుడు బోధకులు వారి మధ్య ఉన్నప్పటికీ, అతడు మొత్తం సమాజాన్ని దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా పలకరిస్తూ ఉన్నాడు. ఈ రోజు, విభజనలు లేదా తప్పుడు బోధకుల వల్ల ఇబ్బంది ఉన్నప్పటికీ, మీ సంఘాన్ని దైవభక్తితో ప్రియమైన వారిగా పరిగణించండి మరియు సంబోధించండి. ఎందుకంటే ప్రభువు సువార్త ద్వారా వారిని పిలిచాడు. ప్రభువా, మా సంఘాలకు సమృద్ధిగా దయను మరియు శాంతిని ప్రసాదించుము; వారి సేవను బలోపేతం చేయండి. ఆమేన్.

II. పత్రిక వ్రాయడానికి గల కారణం (3, 4)

3ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగల వాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. 4ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు.

యూదా సంబోధిస్తున్న “ప్రియులారా” అను మాటకు యూదా పత్రిక పరిచయంలో యూదా ఈ పత్రికను ఎవరికి వ్రాసాడు వ్రాయడానికి గల కారణం అను శీర్షికలో ఉంది చూడండి. అట్లే అపొస్తలులు సహోదరులను సంబోధించేటప్పుడు ఆప్యాయతతో ఉపయోగించిన వ్యక్తీకరణ ఇది, రోమా ​​1:7; 1 కొరింథీ 4:14; 10:14; 15:58; 2 కొరింథీ 7:1; 12:19; ఫిలిప్పీ 2:12; 4:1. అపొస్తలులు పత్రికలను వ్రాసినప్పుడు వ్యక్తులను (1, 2 తిమోతి), సంఘాలను (కొలొస్సయులకు), అతి పెద్ద సహవాసాన్ని (హెబ్రీయులకు) ఉద్దేశించి వ్రాసియున్నారు లేదా పైన చెప్పిన వాటి కలయికలో పత్రికలను ఉద్దేశించి వ్రాసియున్నారు.

మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని, యూదా రక్షణను గూర్చి (మానవ పాపం, దేవుని ప్రేమ, పాప క్షమాపణ, నూతనమైన జన్మను అనుసరించే జీవన విధానం వంటి విషయాలతో) వారికి వ్రాయాలనుకొన్నాడు. క్రీస్తులో వారి అద్భుతమైన రక్షణలో సంతోషించుమని చెప్పడానికి యూదా ఈ పత్రికను వ్రాయడానికి విశేషాసక్తి గలవాడై ప్రయత్నపడుచుండగా, అపొస్తలునికి తన పాఠకులు నివసించే ప్రావిన్స్‌లో తప్పుడు బోధకుల నుండి వచ్చిన ప్రమాదాన్ని గురించిన చెడ్డ వార్తలు వచ్చాయి, సత్యం దాడికి గురైందని, సాతాను అతని సహాయకులు ఓవర్ టైం పని చేస్తున్నారని, చర్చిలోనికి డిస్ట్రాయర్లు చొరబడియున్నారని, క్రీస్తు సువార్త ప్రమాదంలో ఉందని (2 పేతురు 2 :1-3) కాబట్టే ఈ సత్యాన్ని డిఫెండ్ చెయ్యడానికి పోరాడవలెనని వారిని వేడుకొనుచు ఈ పత్రిక వ్రాయవలసివచ్చెను అని యూదా తెలియజేస్తూ ఉన్నాడు.

విశ్వాసం కలిగి ఉండేందుకు కావలసిన శక్తిని పొందడానికి పోరాడమని యూదా చెప్పటం లేదు. ఎందుకంటే విశ్వాసము అనేది పరిశుద్దాత్ముని యొక్క వ్యవహారం అది పరిశుద్దాత్ముని యొక్క బహుమానము మాత్రమే. ప్రజలు విశ్వసించాల్సిన బోధ (వాక్యం) కోసం పోరాడాలని, బోధను (వాక్యాన్ని) స్వచ్ఛమైనదిగా ఉంచడానికి పోరాడాలని యూదా చెప్తూవున్నాడు. ఎందుకంటే వాక్యము మనకు జీవనాధారము. దానిని తారుమారు చేయడం లేదా దానికి జోడించడం లేదా తీసివేయడం లేదా దానిని మార్చడం అనేది దేవునితో ప్రజలకున్న సంబంధాన్ని పాడుచేస్తుంది. (ద్వితీయోపదేశకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు; సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు; ప్రకటన 22:18-19 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును).

యూదా ఇక్కడ క్రైస్తవులు రక్షణలో ఉండటమే కాకుండా, తమను తాము రక్షించుకోవాలని విశ్వాసం కోసం, సువార్త కోసం అత్యంత తీవ్రంగా దృఢంగా పోరాడాలని తన పాఠకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అపొస్తలుల బోధల ద్వారా సత్యం పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడింది. అపొస్తలులు ఎక్కడికి వెళ్లినా, వారు క్రీస్తుని ప్రాయశ్చిత్త కార్యము ద్వారా మనుష్యులందరి రక్షణకు సంబంధించిన ఆనందకరమైన శుభవార్తను మనుష్యులకు తెలియజేసారు. అదే వారి బోధల సారాంశం మరియు ఆధారం. ఈ సత్యానికి, క్రైస్తవులు అంటిపెట్టుకుని ఉండాలి, దీని కోసం వారు పోరాడాలని అతడు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు.

ప్రతి తరానికి దేవుని వాక్యాన్ని తరచుగా నవీకరించి పునర్విమర్శ చెయ్యాల్సిన అవసరం లేదు. విశ్వాసం అనేది “ఒక్కసారే” పరిశుద్ధులకు అప్పగించబడిందని యూదా చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు 1:1,2 పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. నిజమైన పరిశుద్దులు పరిశుద్ధ లేఖనాల ద్వారా ఆయన కుమారునిచే అప్పటికే అందించియున్న దాని కంటే ఎక్కువ ప్రత్యక్షతను దేవుని నుండి ఆశించలేరు. దేవుడు వేరేవారి ద్వారా మరెక్కడా మరికొంత సత్యాన్ని ఇక వెల్లడించడు. భక్తిహీనులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు, సంఘాలలోనికి వస్తూనే ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ విభిన్నమైన క్రొత్తదాన్ని భోదిస్తూనే ఉంటారు. దృఢమైన సిద్ధాంతంలో పాతుకుపోని దుష్టాత్మే దీనికి కారణం. ఇది ఎల్లప్పుడూ కొత్త సిద్ధాంతం కోసం చూస్తూ ఉంటుంది. క్రొత్త సిధ్ధాంతాలేవైనా సరే తప్పక తప్పుడు సిధ్ధాంతాలే. మనం ఈ విశ్వాసం కోసం శ్రమించాలి దాని కోసం చివరి వరకు పోరాడాలి. శరీరం వాక్యము విషయములో మందగిస్తుంది అది మనం వాక్యాన్ని మరచిపోయేలా చేస్తుంది. కాబట్టి విశ్వాసులు వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తునే ఉండాలి రోగగ్రస్థమైన బోధలను వ్యతిరేకిస్తు ఉండాలని యూదా పిలుపునిస్తూ ఉన్నాడు.

ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై, (వారు తమను తాము మనుష్యుల ఆత్మలను చంపేవారిగా, అబద్ధికులుగా, మోసగాళ్ళుగా ప్రకటించుకోలేదు) రహస్యముగా సంఘాలలోనికి జొరబడియున్నారు, గలతీయులకు 2:4 మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీస్తు యేసువలన మనకు కలిగిన మన స్వాతంత్యమును వేగుచూచుటకు, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది; 1 తిమోతికి 1:6 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి; 2 తిమోతికి 2:16-18 అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడు వారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు–పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

అన్ని కాలాలలో సంఘముపై సాతాను రెండు రకాలుగా దాడి చేస్తాడు. మొదటిగా, సంఘముపై వాడు బయటి నుండి దాడి చేస్తాడు, సంఘమును బాధపెట్టడానికి భౌతిక మార్గాలను ఉపయోగించే అవిశ్వాసుల ద్వారా దాడి చేస్తాడు: అపహాస్యం, చట్టపరమైన వేధింపులు, ఆస్తి జప్తు, శ్రమలు, జైలు శిక్ష, హింస, చంపడం ద్వారా దాడి చేస్తాడు. దాడి యొక్క రెండవ రూపం అధ్వాన్నం: సంఘముపై సంఘము లోపల నుండే దాడి చేస్తాడు. సాతాను తన ఏజెంట్లను సంఘాల లోపల వీలైతే నాయకత్వ స్థానాలలో ఉంచుతాడు. వీళ్ళు దేవుని రక్షణ సత్యాన్ని అబద్ధాలతో క్రమంగా భర్తీ చేయడానికి పని చేస్తారు.

దైవభక్తి లేని ఈ చొరబాటుదారులపై యూదా రెండు ప్రధాన నేరారోపణలు చేశాడు, ఒకటి క్రైస్తవులు నమ్ముతున్న దానికి సంబంధించినది. మరొకటి క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారనే దానికి సంబంధించినది. ఈ చొరబాటుదారులు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించియుండుటను బట్టి వీరిని అతడు ఖండిస్తూ ఉన్నాడు. వీరి బోధ అతి తీవ్రమైన తప్పుడు సిద్ధాంతం, ఇది మనల్ని రక్షించే సువార్త నుండి వేరు చేస్తూ ఉంది. అలాంటి తప్పుడు బోధ పరిశుద్ధ త్రిత్వమును తిరస్కరిస్తూ తద్వారా నిజమైన దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉంది. దేవుడే స్వయంగా, క్రీస్తుయేసులో, మన పాపముల కొరకు శ్రమపడి మరణించియున్నాడని మరియు తిరిగి లేచియున్నాడనే ప్రాముఖ్యమైన సత్యాన్ని కూడా ఇది తిరస్కరిస్తూ ఉంది. యేసు నిజంగా దేవుడు కాకపోయి ఉంటే, ఆయన మానవుడు మాత్రమే అయి ఉంటే, ఆయన పరిపూర్ణమైన జీవితం మరియు నిర్దోషమైన మరణం పాపులందరిని కవర్ చేసేంతగా సార్వత్రికమైనది అయ్యి ఉండేది కాదు.

యూదా యొక్క రెండవ ఆరోపణ ఏమిటంటే, దైవభక్తి లేని ఈ వ్యక్తులు (వీళ్ళు పురుషులు కావొచ్చు లేదా స్త్రీలు కావొచ్చు) దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచడం అంటే కృపను అనైతికతకు లైసెన్స్‌గా మార్చడం. దేవుడు తన కృప కనికరములలో వారి పాపాలన్నిటినీ పూర్తిగా క్షమించియున్నందున విశ్వాసులు ఇకపై పాపం మరియు ప్రలోభాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదని వాళ్ళు “సువార్త” అనే గొడుగు క్రింద తమకు నచ్చినట్లు జీవించవొచ్చని చొరబాటుదారులు ప్రజలకు బోధిస్తున్నారు. కృపను బట్టి క్రైస్తవులు ధర్మశాస్త్రము మరియు సంఘము సూచించిన ప్రవర్తనా నియమాల నుండి మాత్రమే కాకుండా, అన్ని నైతిక చట్టాల నుండి కూడా విముక్తి పొందియున్నారనే బోధ. పాపవిముక్తి, రక్షణ కేవలం దేవుని కృప మూలంగానే గనుక ఏ విధముగానూ మంచి పనులపై అది ఆధారపడదు గనక క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చని, వారెలా జీవించినా, ఏమి చేసినా కృప వారిని క్షమిస్తుందనే బోధ. క్రైస్తవులు యథావిధిగా పాపాల్లో కొనసాగినా వారికి రక్షణ ఉంటుందని చెప్తుంటారు, గలతీ 5:13. దీనిపై దేవుని వాక్యము చెప్తూవున్న దానిని వాళ్ళు పట్టించుకోరు, 1 కొరింథీ 6:9,10; గలతీ 5:19-24. రోమా 6:1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? పశ్చాత్తాపపడిన పాపుల కోసం దేవుడు ఉద్దేశించిన ఓదార్పు ఇప్పుడు పశ్చాత్తాపపడని పాపులకు తప్పుగా అందించబడుతోంది.

రోమాలోని క్రైస్తవుల మధ్య కూడా ఇదే సమస్య ఉత్పన్నమయ్యి ఉండుటను బట్టి పౌలు మాట్లాడుతూ, అట్లయిన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకేగాని, నీతి నిమిత్తముగా విధేయతకేగాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? అని హెచ్చరించుటను మనం రోమా ​​6:15,16 వచనాలలో చూడొచ్చు.

క్రీస్తును ఏకైక సార్వభౌమాధికారిగా, ప్రభువుగా తిరస్కరించడం ఇస్లాం, జుడాయిజం, బహాయిజం, హిందూయిజం, బౌద్ధమతం ఇతర అన్ని క్రైస్తవేతర మతాల లక్షణం. ఈ తప్పుడు బోధను క్రైస్తవ చర్చిలోనికి చొప్పించే ప్రయత్నాన్ని సాతాను ఎప్పుడూ ఆపలేదు. ప్రతి శతాబ్దంలో క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధ త్రిత్వాన్ని తిరస్కరించే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను యూనిటేరియన్‌లు అని అంటారు. ఈ యూనిటేరియన్‌లు (దేవుని ఏక వ్యక్తిత్వాన్ని, త్రిత్వమును, క్రీస్తు యొక్క దైవత్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు) ఈ “యూనిటేరియన్‌ల” నుండి “యూనిటేరియన్-యూనివర్సలిస్ట్” అను మరో తెగ కూడా పుట్టుకొచ్చింది. వీళ్ళు ట్రినిటేరియన్ క్రిస్టియన్ చర్చి బాడీలలో ఉన్న చాలా మంది నమ్మకాలను పాడు చేసారు. ఉదాహరణకు, హార్వర్డ్ యూనివర్శిటీ ఆఫ్ డివినిటీ స్కూల్, ట్రినిటేరియన్ కాంగ్రేషనలిస్ట్‌లచే స్థాపించబడింది, 1817లో యూనిటేరియన్‌గా మారింది. లేఖనాలలోని క్రీస్తు వైపుకు అది ఇప్పటికి రాలేకపోతూ ఉంది.

యేసు యొక్క దైవికమైన స్వభావాన్ని తిరస్కరించడం ఘోరమైన విషయం. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే యేసును నమ్ముతున్నానని చెప్తూ, మాటలు, ఇతర బోధలు, క్రియల ద్వారా ఆయన దైవికమైన స్వభావాన్ని తిరస్కరించడం. ఉదాహరణకు, బైబులులో ఎలాంటి తప్పులు లేవు అది నమ్మదగినది అంటూ దాని దోషరహితతను తిరస్కరించడం అనేది క్రీస్తు ప్రభువుపై దాడి చెయ్యడమే. క్రైస్తవులలో కొందరు బైబిలును కేవలం మానవ అభిప్రాయాల శకలాలుగా విడదీసి, దాని అధికారానికి లోబడడానికి నిరాకరించినప్పుడు, వారు వాస్తవానికి తమపై క్రీస్తు ప్రభువును నిరాకరిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘ నాయకులు తమ అధికారం బైబిల్ కంటే గొప్పదని చెప్పినప్పుడు, వారు వాస్తవానికి క్రీస్తు ప్రభువును తిరస్కరిస్తూ ఉన్నారు. క్రైస్తవ సంఘ సభ్యులు విశ్వాసప్రమాణాలను ప్రార్ధనలను చదువుతూ ఉన్నప్పుడు గాని లేదా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నప్పుడు గాని అది వారి పాపాన్ని మందలించినప్పుడు లేదా వారిని మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నించినప్పుడు దానిని వాళ్ళు నిరాకరించినప్పుడు, వాళ్ళు క్రీస్తును ప్రభువుగా తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఎల్లప్పుడూ పోరాడవలసియున్నాము.

పాపమును గూర్చిన హెచ్చరికలను పక్కన పెట్టునట్లు, క్షమాపణా సువార్తను ఉపయోగించేలా, క్రైస్తవులను ప్రేరేపించడానికి సాతాను ఈ రోజుకు కూడా చాలా కష్టపడుతూ ఉన్నాడు. పాపపు ఆలోచనలు, మాటలు మరియు క్రియలను బట్టి పశ్చాత్తాపపడడానికి నిరాకరించే క్రైస్తవుడు తన రక్షణను ప్రమాదములో పెడుతూ ఉన్నాడు. కాబట్టే హెబ్రీ గ్రంధకర్త, “మనము సత్యమును గూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును” (హెబ్రీ 10:26, 27) అని హెచ్చరిస్తూ ఉన్నాడు.

ఉదాహరణకు, క్రైస్తవులు తమ వివాహాలను నాశనము చేసుకొని విడాకులు అడుగుతున్నప్పుడు, అది పాపమని చెడ్డ విషయమని వారికి తెలుసు. కాని క్షమింపబడతామని అనుకొంటూ దానిని కొనసాగిస్తారు. వారు దేవుని కృపను అనైతికతకు లైసెన్స్‌గా మార్చుకొంటున్నారు, (మత్తయి 5:32 నేను మీతో చెప్పునదేమనగా–వ్యభిచారకారణమును బట్టిగాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించు చున్నాడు). ఒక జంట వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్నప్పుడు, దేవుడు దానిని వ్యభిచారం అని పిలుస్తున్నాడని వాళ్లకు తెలుసు. కాని వాళ్ళు ఆదివారం ఉదయం చర్చిలో ఆలకించే పాప క్షమాపణ మాటలలో ఆధ్యాత్మికంగా క్షమింపబడియున్నామని అనుకొంటూ వాళ్ళు ఆ వ్యభిచార పరిస్థితిలోనే ఉండాలని ఎంచుకున్నప్పుడు, వాళ్ళు దేవుని కృపను వారి అనైతికత కోసం లైసెన్స్‌గా మార్చుకొంటున్నారు.  “దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాడు” అని చెప్తూ, ప్రజలు తమ స్వలింగ సంపర్కాన్ని లేదా వివాహేతర సంబంధాలను సమర్థించు కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు (పాపములో కొనసాగుతూ, ఆరాధనలో సంస్కారములలో పాలుపొందుకొంటూ ఉండటం) వాళ్ళు దేవుని కృపను వారి అనైతికతకు లైసెన్స్‌గా మార్చుకొంటున్నారు. కాబట్టే యూదా: “క్రైస్తవులారా, మేల్కొనండి! విశ్వాసం కోసం పోరాడండి!” అని వ్రాస్తూ ఉన్నాడు.

(మనం క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా ప్రకటింపబడియున్నాము. ధర్మశాస్త్రం మనపై అధికారాన్ని కలిగి ఉండదు. ఇప్పుడు మీరు క్రీస్తు ద్వారా స్వాతంత్రం పొందారు. మీరు రక్షించబడ్డారు; క్రీస్తు మీ జీవితం. కాబట్టి ధర్మశాస్త్రం, పాపం మరియు మరణం మిమ్మల్ని భయపెట్టినప్పటికీ, అవి మీకు హాని కలిగించవు. అవి మిమ్మల్ని ఏమి చెయ్యవు. వాటికంటే మీ స్వంత మనస్సాక్షిలో మరియు దేవుని దృష్టిలో మీరు చాలా ఉన్నతంగా ఉన్నారు; మీరు ఆశీర్వదించబడ్డారు. ఇది మీ అద్భుతమైన మరియు అమూల్యమైన స్వేచ్ఛ. ఇలాంటి మాటలను విన్నప్పుడు, శరీరం కృపను లైసెన్షియల్‌గా మారుస్తుంది).

వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు; కాబట్టి తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఎందుకంటే, వారు దైవభక్తిని ప్రకటిస్తున్నప్పటికీ, వారు వాస్తవానికి దైవభక్తి లేని వారు; వారు దేవుని యొక్క ఉచిత కృపను శరీరము యొక్క కామానికి దుర్వినియోగ పరుస్తూ ఉన్నారు; వారు సువార్త యొక్క స్వేచ్ఛను వారి దుష్ట స్వభావం కోరుకునే లైసెన్స్‌గా మార్చారు; వారు బహిరంగ అమర్యాదతకు కూడా బానిసలయ్యారు; వారు దేవుడును ఏకైక ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తును రెండింటినీ తిరస్కరించారు. (2 పేతురు 2:1-3 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించు కొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు; 2 తిమోతికి 3:2-8 ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెర పట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు; తీతుకు 1:10-16 అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునై యున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టి వారు ఉపదేశింప కూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయు చున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను–క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిపోతులునై యున్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి యున్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు).

యూదా భక్తిహీనుల కార్యకలాపాలను ఖండించాడు, వాటిని సహిస్తున్నందుకు విశ్వాసులను సున్నితంగా మందలించాడు. సువార్తను కూడా అవినీతికి వాడుకొంటారని అతడు నిజాయితీగా ఎత్తి చూపాడు. తప్పు చేసే వారితో ఓపికగా పని చేయటం అనేది ప్రభువు అభిమతమని చెప్పాడు. కాని మన రక్షణకు ఆధారమైన సువార్త విషయములో మనం ఎన్నటికీ రాజీపడలేం. ప్రభువా, నీ స్వచ్ఛమైన కృపను బట్టి మమ్మల్ని రక్షించుము, మరియు సత్యం కోసం కష్టపడునట్లుగా చేయుము. ఆమేన్.

III. తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (5–16)
అబద్ధభోదకులపై తీర్పుకు చరిత్రాత్మికమైన ఉదాహరణలు (5–7)
అవిశ్వాసియైన ఇశ్రాయేలు (5)

5ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను.

4వ వచనంలో మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తు అను మాటలలో యూదా యేసుక్రీస్తును ప్రభువు అని అంటున్నాడు. క్రొత్త నిబంధనలో యేసుకు ఇవ్వబడిన బిరుదు ఇది, లూకా 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. పాత నిబంధనలో ప్రభువు అంటే యెహోవా. ఈ వచనములో, యూదా యేసుని “ప్రభువు” అంటున్నాడు.

ఈ తప్పుడు బోధల యొక్క తీవ్రతను నొక్కిచెప్పడానికి, యూదా పాత నిబంధన నుండి మూడు ఉదాహరణలను ఇక్కడ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కటి భక్తిహీనత యొక్క తీవ్రమైన పర్యవసనాలను, ఇక్కడ కాలములో మరియు నిత్యత్వములో ఎలా ఉంటాయో చూపిస్తూ ఉన్నాయి. ఏదెనులో హవ్వను శోధించినప్పటి నుండి, సాతాను ప్రజలతో “మీరు చావనే చావరు” (ఆదికాండము 3:4) అని చెప్తూ ఉన్నాడు, ప్రజలు అతనిని నమ్ముతూ ఉన్నారు. సాతాను ఎల్లప్పుడూ ప్రజలను గ్రుడ్డివారిగా మార్చి బాధాకరమైన పర్యవసానాలకు వాళ్ళు లోనగునట్లు వారిని శోధిస్తూ ఉన్నాడు.

పాత నిబంధనను అధ్యయనం చేయడంలో ఉన్న గొప్ప విషయాలలో ఒకటి, మానవ చరిత్రలో దేవుడు ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న వివిధ వృత్తాంతాలలో ఆ దేవుని చర్యను చూసే అవకాశం. క్రింద ఏమి జరుగుతోందో చూడడానికి దేవుడు తన ఉన్నతమైన సింహాసనం నుండి క్రిందికి చూడడమే కాదు, ఆయన పాలుపంచుకున్నాడు. ఆయన పట్టించుకున్నాడు. ఆయన తన ధర్మశాస్త్రము సువార్త ద్వారా ప్రజలను తీర్పు తీర్చడానికి ఆశీర్వదించడానికి ప్రజల జీవితాలతో మమేకం అయ్యాడు. ఆ చర్య పాత నిబంధన కాలంతో ఆగిపోలేదు, యూదా కాలములో జరిగింది మరియు నేటికీ జరుగుతూ ఉంది.

యూదా శ్రోతలకు చెప్తూవున్న ఈ మూడు పాత నిబంధన ఉదాహరణలను గురించి (వచనం 5) వారికి అప్పటికే తెలుసు. దేవుని హెచ్చరికలు తీవ్రమైనవని వాటి పర్యవసానాలు వాస్తవమైనవని వారికి అతడు జ్ఞాపకము చేయగోరుచూ, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెనను విషయాన్ని వారికి గుర్తుచేసాడు. దీనిలో, దేవుడు తన ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో వారిని రక్షించడానికి ఆయన ఏవిధముగా మానవ చరిత్రలో జోక్యం చేసుకొన్నది, ఆ విషయములో దేవుని శక్తిని, ఆయన వారికి ఇచ్చిన స్వేచ్ఛ, వారి ప్రయాణంలో ఆయన నిర్ధేశకత్వము, ఆ ప్రయాణములో వారికి అవసరమైన ఆహారం, నీరు, రక్షణను ఇవ్వడం వారితో చేసుకొనిన ఒడంబడిక అట్లే ఆయన వారి కోసం ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, లోకము కొరకైన తన రక్షణ ప్రణాళికలో వారి పాత్ర ఏమిటో వంటివి ఎన్నో ఉన్నాయి.

అయినప్పటికి, యెహోషువ, కాలేబు తప్ప ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములో నుండి వచ్చిన వారందరు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు (సంఖ్యాకాండము 32:11-12). వారు ప్రయాణ కష్టాల గురించి ఫిర్యాదు చేశారు, దేవుని ఆహారం గురించి ఫిర్యాదు చేశారు. దేవుడు ఎన్నుకున్న నాయకుడైన మోషే గురించి ఫిర్యాదు చేశారు. వారు తబేరా (సంఖ్యాకాండము 11) వద్ద అగ్నిశిక్ష నుండి ఏమీ నేర్చుకోలేదు, లేదా కిబ్రోతు హత్తావాలో చెలరేగిన తెగులు నుండి లేదా మిరియం యొక్క కుష్టు వ్యాధి నుండి ఏమీ నేర్చుకోలేదు. ఆ పై పారాన్ అరణ్యంలో, వాగ్దాన భూమి సరిహద్దులలో, వారందరూ సర్వసమాజముగా దేవునిపై తిరగబడ్డారు. ఆయన ప్రేమను అనుమానించారు. ఆయన శక్తిని శంకించారు. మరోసారి వారి నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. వారు తిరిగి బానిసత్వంలోకి వెళ్లాలని కోరుకోవడం ద్వారా దేవుడిని అవమానించారు (సంఖ్యాకాండము 14). అప్పుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయుల కందరికి కనబడగా, యెహోవా– ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? అని అడుగగా, మోషే మధ్యవర్తిత్వంతో ప్రభువు వారిని విడిచిపెట్టి, వారి పాపాన్ని క్షమించాలని నిర్ణయించుకున్నాడు, కాని ఆయన కఠినమైన శిక్షను వారికి ప్రకటిస్తూ: కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు అని చెప్పాడు (సంఖ్యాకాండము 14:23). 1 కొరింథీ 10:5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అని చెప్తూ ఉంది. వారు 40 సంవత్సరాలుగా రోజుకు కనీసం 82 అంత్యక్రియలు చేసి ఉండాలి! “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి” అని (1 కొరింథీయులు 10:6) లో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ తన శ్రోతలు గుర్తుచేసుకోవాలని, గుర్తుంచుకోవాలని మరియు నేర్చుకోవాలని యూదా కోరుకుంటున్నాడు.

పడిపోయిన దేవదూతలు (6)

6మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.

యూదా యొక్క రెండవ ఉదాహరణ, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవదూతలు. ఆదిలో దేవుడు దేవదూతలతో సహా తన జీవులందరినీ మంచిగా చేసాడు, ఆదికాండము 1:31, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. కాని ఆయన దేవదూతలలో కొందరు తమ స్థానంతో, వారి పదవితో, వారి గౌరవంతో సంతృప్తి చెందలేదు. వారు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పరలోకంలో తమ స్థానాన్ని కోల్పోయారు. ప్రభువు యొక్క శిక్ష సర్వశక్తిమంతమైన శక్తితో వారిపైకి వచ్చింది. వారు తప్పించుకోలేని నిర్బంధ స్థితిలో శాశ్వతమైన కటికచీకటిలో నిత్యపాశములతో బంధించబడియున్నారు. దేవుని అనుమతితో వారు ప్రపంచంలో తిరగవచ్చు, కానీ వారు ఇప్పటికీ శిక్ష కింద ఉన్నారు, దాని నుండి తప్పించుకోలేరు; వారు దేవునితో నిజమైన సహవాసం నుండి, రక్షణ, నిరీక్షణ నుండి శాశ్వతంగా నరికివేయబడ్డారు, 2 పేతురు 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.

యెషయా 14:12-15 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? –నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.

మరియు యెహెజ్కేలు 28:1-19లో సాతాను మరియు పడిపోయిన దేవదూతల పతనం సూచించబడింది: యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. –నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము– ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–గర్విష్ఠుడవై–నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనైయున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలున కంటె జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యము నొందితివి, నీ ధనాగారముల లోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా, ఆలకించుము; నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు, నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చిన వారివలెనే నీవు చత్తువు. –నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. సున్నతిలేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశులచేత చత్తువు, నేనే మాట యిచ్చి యున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–పూర్ణ జ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యరత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించు చుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదెగా చేసెదను. జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్నుగూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.

ప్రకటన 12వ అధ్యాయంలో, పడిపోయిన దేవదూతలు ఆకాశంలోని నక్షత్రాలలో మూడింట ఒక వంతుగా వర్ణించబడ్డారు. యెఱ్ఱని మహాఘట సర్పము దాని తోకతో ఆకాశ నక్షత్రములలో మూడవభాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను (12:4). ఆ మహాఘట సర్పాన్ని అపవాది యనియు సాతాననియు పిలుస్తారు, కాగా ఇది సర్వలోకమును మోసపుచ్చుచు నడిపిస్తూ ఉంది (వచనం 9). సాతాను పడిపోయిన దేవదూతలు నరకంలో నవ్వుతూ, ఉల్లాసంగా ఆనందిస్తూ పరిపాలిస్తూ ఉండరు. వారి కొరకు ఎన్నటికీ ఆరని అగ్నిచే మండుతున్న నరకముంది. అంతమే లేని హింస యొక్క ప్రదేశం అది. వాళ్ళు కూడా నిరాశ, బాధ, కోపంతో శాశ్వతంగా అందులో కాలుతూ ఉంటారు.

సొదొమ మరియు గొమొర్రా (7)

7ఆప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.

పాపం యొక్క భయంకరమైన పరిణామాలకు యూదా యొక్క చివరి పాత నిబంధన ఉదాహరణ, కాలిపోయిన సొదొమ గొమొఱ్ఱాలు. ఒకప్పుడు మృత సముద్రానికి దక్షిణంగా ఉన్న సిద్దిమ్ లోయ “యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమైయుండెను”, ఆదికాండము 13:10. ఏదెను తోట మరియు నైలు డెల్టా కంటే సారవంతమైన భూమి ఎక్కడా లేదు. పురాతన ఇశ్రాయేలు రైతులకు పశువుల కాపరులకు ఈ విషయం బాగా తెలుసు. యెహోవా సొదొమ గొమొఱ్ఱాను శిక్షించినప్పుడు ఆ సారవంతమైన భూమి శాశ్వతంగా నాశనం చేయబడింది. ఇప్పుడు కూడా అక్కడ ఏమీ పెరగదు. నిజానికి, యెహోవా ఆ పాపపు లోయను చాలా గట్టిగా కొట్టాడు, దానిలో ఎక్కువ భాగం ఇప్పుడు నీటిలో ఉంది. ఇదంతా ప్రజల లైంగిక అనైతికత, వక్రబుద్ధి మరియు హింస కారణంగా జరిగింది (ఆదికాండము 19). ఈ రోజుకు మృత సముద్రం దేవుని ప్రతీకారం యొక్క ఉగ్రతకు హెచ్చరిక చిహ్నంగా ఉంది.

ద్వితీయోప 29:23,24 వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకముచేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. హేతువు, వ్యభిచారం, అసహజమైన వ్యభిచారంలో మితిమీరిన నేరాలకు పాల్పడటం, ఇతరత్రమైన ఇతర పాపపు క్రియలు. యెహెఙ్కేలు 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే; అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. యూదా 1:7 ఆప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరానుసారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. కొంతమంది విమర్శకులు దీనిని బైబిల్ వైరుధ్యంగా ఎత్తి చూపుతారు. స్పష్టత కొరకు ఆదికాండము 19:1-11 చూడండి.

ఈ మూడు భయంకరమైన దృశ్యాలు- 12,00,000 ఇసుక సమాధులు, నరకంలో బంధించబడిన దూతలు విలపించడం మరియు మృత సముద్రం యొక్క నిర్జరణ్యమైన తీరాలు పశ్చాత్తాపపడని పాపులను జవాబుదారీగా ఉంచడంలో దేవుడు చాలా కఠినముగా ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యంగా ఉన్నాయి. నరకం నిజం.

యూదా పాత నిబంధన చరిత్రలో దేవుని ఉగ్రత మరియు కృపకు సంబంధించిన ఉదాహరణలను పేర్కోనియున్నాడు. యేసు స్వయంగా ఇశ్రాయేలీయులను వారి పాపాలను ఖండించియున్నాడు మరియు వారి రక్షకునిగా కూడా వ్యవహరించాడు. బైబిల్ కథలు మరియు ధర్మశాస్త్రం మరియు సువార్త యొక్క బేసిక్స్‌ను ఎప్పటికీ అధిగమించలేరు, దీని ద్వారా ప్రభువు స్థిరమైన ఆశీర్వాదాలను మంజూరు చేస్తూ ఉన్నాడు. యేసూ, మీరు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును రక్షించారు; అవిశ్వాసం నుండి నన్ను రక్షించండి మరియు మీ మాట యొక్క ఉదాహరణలు మరియు ఆశీర్వాదాలతో నన్ను రిఫ్రెష్ చేయండి. ఆమేన్.

IV. యూదా కాలము నాటి అబద్ధభోదకుల స్వభావము (8–16)
వారి తప్పుడు బోధ  (8–10)

8-16 వచనాలలో, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుట మరియు కృపను దుర్వినియోగపర్చడం అనే ఈ రెండు బోధలు ఎంత విధ్వంసకరమైనవో తన పాఠకులు తెలుసుకోవాలనేదే యూదా ఉద్దేశ్యము. కాబట్టే ఈ తప్పుడు బోధకుల నిజస్వభావానికి సంబంధించిన లక్షణాలను తన పాఠకులు తెలుసుకోవాలని వాటిని యూదా ఇక్కడ పేర్కొంటూ ఉన్నాడు. యూదా ఈ భక్తిహీనుల అవినీతిని వివరించడానికి కొన్ని పోలికలను ఇక్కడ ఉపయోగించియున్నాడు (4, 8). అతడు వారికి విరోధముగా వారి జ్యూయిష్ లెజెండ్ నుండి (9,14-15) ఉదాహరణలను కూడా ఉదహరించియున్నాడు.

ఈ అబద్ధ బోధలను విశ్వసిస్తూ, బోధిస్తూ ఉన్నవాళ్లు దేవుని ప్రశస్తమైన విషయాలను తృణీకరిస్తూ ఉన్నారు. వీళ్ళు సమాజములో మంచిగా చట్టాన్ని గౌరవించే, మర్యాదగల వ్యక్తులుగా, చర్చిలో అధికారం బాధ్యతతో కూడిన గౌరవనీయమైన స్థానాలలో ఉంటూ, విషపూరితమైన తమ బోధల ద్వారా ఇతరుల విశ్వాసాన్ని పాడుచేస్తూ, కృపను దుర్వినియోగపర్చేలా ప్రేరేపిస్తూ అద్వితీయనాధుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించెలా చేస్తూ ఉన్నారు. అలా చేసే వాళ్ళు తప్పించుకోజాలరని వారి స్వనాశనం దేవునిచే నిశ్చయించబడిందని దేవుడు వారిని కఠినముగా శిక్షిస్తాడని యూదా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు, అని లూకా 17:2లో యేసు కూడా చెప్పియున్నాడు.

ఈ ఆధ్యాత్మిక నాయకులు ప్రజల విశ్వాసాన్ని విషపూరితం చేసే మాటలు మాట్లాడినప్పుడు, వాళ్ళు ఆధ్యాత్మిక హంతకులు అవుతారు. ఇతరుల విశ్వాసాన్ని నాశనం చేసేవాళ్ళు ఎదుటి వారి ఆత్మ పాడై పోయినట్లుగా చూపెడతారు. విసుగు చెందియున్న క్రైస్తవులకు, ఇటువంటి వాళ్ళు, వాటినుండి తప్పించుకొంటున్నట్లుగా కనిపిస్తారు. కాబట్టి వారిని అనుసరించడానికి వారు ప్రేరేపింపబడతారు.

యూదా కనికరం లేకుండా ఈ భక్తిహీనుల పేర్లు చెప్పకుండా లేదా వారి గుంపు పేరు చెప్పకుండా ఈ పత్రికను వ్రాసియున్నాడు. ఈ తప్పుడు సహోదరుల వినికిడిలో సంఘం తన లేఖను బహిరంగంగా చదువుతుందని అతనికి తెలుసు. సమస్యలను సరిచేయడానికి అవసరమైన అన్ని చర్యలను సంఘం తీసుకుంటుందని యూదా విశ్వసిస్తున్నాడు. పేర్లను పేర్కొనకపోవడం ద్వారా, అతడు సంఘానికి దీనిని విడిచిపెట్టాడు దాని నిర్దేశానుసారం అది వ్యక్తులతో కలిసి పని చేస్తుంది. ఇది ఒప్పుకోలుకు క్షమాపణకు అవకాశాన్ని ఇస్తుంది.

8అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. 9అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక–ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. 10వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.

యూదా ఇక్కడ పేర్కొనిన ఉదాహరణలలో, అబద్ద బోధకులు వారు అర్థం చేసుకోలేని గౌరవించలేని వాటిని నిరాకరిస్తూ మహాత్ములను దూషిస్తూ శరీరమును అపవిత్రపరచుకొనుచు ఉందురని వారి దుష్ట స్వభావాన్ని దృశ్యార్ధములో  చెప్తూ ఉన్నాడు.

వీరును కలలు కనుచు – వారు కలలు కనేవారు, వారి స్వంత ఊహ వారిని మోసం చేస్తుంది; వారి భ్రమలో అంధత్వంలో వారు అవాస్తవమైన వాటిని నిజమైనవిగా తీసుకుంటారు. వారు ఆలోచనలు కోరికలలో మాత్రమే కాకుండా, పనులలో కూడా ఇంద్రియాలకు సంబంధించిన అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడతారు.

మొదటిగా, వారు “తమ శరీరములను అపవిత్రపరచుకొనుచు” ఉండటమే కాకుండా భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచటం (4) ద్వారా తాము మోసపుచ్చుతూవున్న వారందరినీ కలుషితం చేస్తారు. శక్తివంతమైన నాయకులు దేవుని వాక్యం మరియు ఆయన చిత్తము పట్ల ఉండాల్సిన నిగ్రహాన్ని త్రోసిపుచ్చినప్పుడు, వ్యభిచారం మరియు అసహజ లైంగిక వాంఛలు తరచుగా సంభవిస్తాయని సంఘ చరిత్ర తెలియజేస్తూ ఉంది. పరిశుద్దుడైన పౌలు 1 కొరింథీయులు 6:15-20లో క్రీస్తు మన ఆత్మలనే కాదు మన శరీరాలను కూడా రక్షించియున్నాడని మన శరీరాలు క్రీస్తుకు చెందినవని, చెప్తూ ఉన్నాడు. (1 కొరింథీయులు 6:15-20 మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలిసికొనువాడు దానితో ఏకదేహమై యున్నాడని మీరెరుగరా? –వారిద్దరు ఏకశరీరమై యుందురు అని మోషే చెప్పుచున్నాడు గదా? అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి).

రెండవదిగా, చొరబాటుదారులు ఆధ్యాత్మిక, లౌకిక అధికారాన్ని రెండింటినీ తిరస్కరిస్తారు. స్వేచ్ఛ స్వాతంత్రంలను గూర్చిన సాతాను అబద్ధపు వాగ్దానాలకు హవ్వ మోసపోయినప్పటి నుండి, పశ్చాత్తాపపడని పాపులు అధికారానికి విధేయత చూపటాన్ని బానిసత్వంగా చూస్తున్నారు. “ఏం చేయాలో ఎవరూ చెప్పనక్కర లేదు” అంటూ భూసంబంధమైన అధికారాన్ని అనుమానించడం, ప్రశ్నించడం, ఎగతాళి చేయడం, తృణీకరించడం వంటివి ప్రజలకు బోధించబడితే, వారు దేవునికి విధేయత చూపడంలో సంతోషిస్తారని ఎలా ఎదురు చూడగలం?

మూడవదిగా, వారు “మహాత్ములను” దూషిస్తారు. (అక్షరాలా: వారు మహిమలను దూషిస్తారు). ఈ “మహిమలు” క్రీస్తు మహిమలు అట్లే అవి దేవదూతలను కూడా సూచిస్తూ ఉండొచ్చు. వీళ్ళు దేవుని (క్రీస్తు) మాట ద్వారా సమస్త సృష్టి ఉనికి లోనికి రావడం, క్రీస్తుని అద్భుతాలు, ఆయన ప్రత్యామ్నాయ మరణం, ఆయన పునరుత్థానం మరియు ఆయన రెండవ రాకడ అని పిలిచే భావనలను అపహాస్యం చేస్తారు. అనేక క్రైస్తవ కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో మరియు సంఘాలలో క్రీస్తు మహిమలను నమ్మని ఎంతో మంది ప్రొఫెసర్లు, మిషనరీలు, బిషప్లు, అపొస్తులులుగా చెప్పుకొంటున్న వాళ్ళు, పాస్టర్లుగా పిలుచుకొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.

అబద్ధ బోధకులు తమకు తెలియని వాటిని ఎగతాళి చేస్తారు. మరోవైపు, సహజంగా అర్థం చేసుకున్న వాటి విషయములో వారి ప్రవుత్తిని బట్టి వారు (మృగాలవలె) ప్రవర్తిస్తారు, ఇది అబద్ధ బోధకుల లక్షణం. వారి శరీరానికి సంబంధించిన మనస్సు నిజమైన జ్ఞానానికి గ్రుడ్డితనము కలుగజేసియున్నదనే విషయం వారికి అర్థం కాని నిజం. అందువల్లే వారు మహాత్ములను (మహిమలను) ఎగతాళి చేస్తారు, కొలొస్సయులకు 2:18 అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్ఛకలిగి, తాను చూచిన వాటిని గూర్చి (చూడని వాటిని గూర్చి) గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి అని చెప్తూ ఉంది.

ప్రజలు ఈ పవిత్రమైన మహిమలను అర్ధరహితమైనవిగా కొట్టివేస్తే, వారు దేవుని వాక్యం నుండి డిస్ కనెక్ట్ అవుతారు (వేరు చేయబడతారు). ఆయన అధికారాన్ని గౌరవించనప్పుడు, వారు జంతువుల స్థాయికి దిగజారి పోతారు. దురాశ, సెక్స్, హింస, సంతోషం వారిని నాశనం చేస్తాయి. మద్యపానం, మాదకద్రవ్యాలు, జూదం, లైంగిక సంబంధమైన వ్యాధులు, దుర్వినియోగం, ఇళ్ళలో, వీధుల్లో యుద్ధభూమిలో హింస అన్నీ అనివార్యంగా మారతాయి. మనుషులు జంతువులలాగా ఆలోచించినప్పుడు, వారు జంతువుల వలె ప్రవర్తిస్తారు మరియు జంతువుల వలె చనిపోతారు. కాబట్టే 2 పేతురు 2:12 వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు అని చెప్తూ ఉంది.

9వ వచనంలో యూదా, ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమును గూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అని అనెనని చెప్పడం ఆసక్తికరంగా వుంది. మానవ చరిత్ర తెర వెనుక, దేవుని దూతలు సాతానుతో అతని దయ్యాలతో నిరంతరం యుద్ధంలో ఉన్నారనే విషయాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. యూదా ఆ తెరను కొద్దిగా లాగియుండగా, అలాంటి సంఘర్షణలలో ఒకటైన మోషే శరీరంపై జరిగిన వివాదంని చూధ్ధాం.

నెబో పర్వత శిఖరము నుండి దేవుడు వాగ్దాన దేశమంతటిని మోషేకు చూపించిన తరువాత అతడు మరణించగా, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడ నున్నదో నేటివరకు ఎవరికి తెలియదు, (ద్వితీయోప 34:5,6). అతని అంత్యక్రియల బాధ్యతను దేవుడే తీసుకొని అతనిని నెబో పర్వతముపై రహస్యముగా ఖననం చేసాడు. దేవుని ఈ పనికి ఏజెంట్ మిఖాయేలు అని యూదా చెప్తున్నాడు. ఎల్లప్పుడూ మూఢనమ్మకాలతో ఉండే ఇశ్రాయేలీయులకు అతని సమాధి యెక్కడ ఉన్నదో తెలిస్తే దానిని వాళ్ళు విగ్రహారాధన చేసే మందిరంగా మారుస్తారని ఆశించి, బహుశా సాతాను మోషే సమాధి స్థలం గురించి తెలుసుకోవాలని ఆశపడి ఉండొచ్చు. రూపాంతర కొండపై యేసుతో పాటు (పరలోకానికి డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళబడిన) ఏలీయాతో కలసి ఉండుటకు గాను మోషే ముందస్తు పునరుత్థానాన్ని పొంది ఉండవచ్చు (మత్తయి 17:3). మరణం అనే “ధర్మాన్ని” దేవుడు ఉల్లంఘించడాన్ని సాతాను వ్యంగ్యంగా వ్యతిరేకించి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ, “దేవదూతల సైన్యానికి అధిపతి మరియు [దేవుని] జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియైన మిఖాయేలు (దానియేలు 12:1)” కూడా సాతానుతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహిస్తూ “ప్రభువు నిన్ను గద్దించును గాక” అని అన్నాడే తప్ప సాతానును దూషిస్తూ మాట్లాడలేదు. దానికి బదులుగా మిఖాయేలు ప్రభువు నిన్ను గద్దించును గాక అంటూ ప్రతీకారాన్ని, శిక్షను దేవుని చేతిలో పెట్టాడు. దూషించుట అనేది అహంభావాన్ని దుర్మార్గతను తెలియజేస్తూ ఉంది, 2 పేతురు 2:12.

నిజానికి, ఈ రహస్య సంభాషణను గురించి పాతనిబంధన ఏమి చెప్పటం లేదు ఇది పాత నిబంధనలో ఎక్కడా కనిపించదు. అలాంటప్పుడు యూదా ఈ సమాచారాన్ని ఎక్కడ నుండి పొందాడని శతాబ్దాలుగా ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అందుకు ఏమేమి పోసిబిలిటీస్ ఉన్నాయో చూధ్ధాం: సృష్టి యొక్క ఆరు రోజుల గురించి ప్రభువు మోషేకు చెప్పినట్లే, ఆయన ప్రత్యక్షంగా ఈ విషయాన్ని గురించి యూదాకు బయలుపర్చి ఉండొచ్చు. యూదా బహుశా ప్రవక్తల నుండి మౌఖికంగా, లేదా ఎన్నడూ వ్రాయబడని మౌఖిక సంప్రదాయాల నుండి ఈ సమాచారాన్ని అందుకొని ఉండొచ్చు. యూదా ఈ విషయాన్ని తన లేఖలో వ్రాయడం వల్ల దానిని ఎల్లకాలం భద్రపరుస్తున్నాడు. యూదా బహుశా బైబిలేతర రచనల నుండి ఈ కొటేషన్ న్ని ఉటంకిస్తూ ఉండొచ్చు. ఒకవేళ యూదా మానవులచే వ్రాయబడిన పుస్తకం నుండి ఈ విషయాన్ని కోట్ చేసాడని అనుకుందాం. అలాంటి కోట్ యూదా వ్రాసిన దాని ఖచ్చితత్వంపై సందేహాన్ని కలిగిస్తుందా? అస్సలు కుదరదు. ఎందుకంటే యూదా దైవ ప్రేరణతో రాశాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్ర గ్రంథాల యొక్క అన్ని వ్రాతలలోని విషయాలపై పూర్తి నియంత్రణను కలిగి ఉన్నాడు (2 పేతురు 1:21). ఈ వృత్తాంతాన్ని తన లేఖలో చేర్చడానికి ఆత్మ యూదాను నడిపించినట్లయితే, అది నిజమై ఉండాలి. లైంగిక అనైతికత, అధికారాన్ని ధిక్కరించడం మరియు దూషించే మాటలు నరకం నుండి వస్తాయనే యూదా పాయింట్ ఇక్కడ చాల స్పష్టంగా ఉంది.

తమ్మునుతాము నాశనము చేసికొనుచున్నారు – పాపపు కోరికలు సహజంగానే స్వీయ నాశనానికి దారితీస్తాయి. భక్తిహీనులు తమ పాపాలను అంగీకరించడానికి పశ్చాత్తాపపడడానికి నిరాకరించినందున నాశనం చేయబడే ప్రమాదం ఉంది.

గ్రాఫికల్‌గా చిత్రీకరించబడిన వారి స్వభావము (11–13)

11అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.

పాత నిబంధన నుండి మరొక మూడు ఉదాహరణలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. యూదా మునుపటి వైఖరి యొక్క భయంకరమైన ఫలితాలను ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కయీను, భూమిపై జన్మించిన మొదటి మానవుడు (ఆదికాండము 4:1). కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు, ఆదికాండము 4:3. కాని అతని హృదయం అందులో లేదు (1 యోహాను 3:12 మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?). కాబట్టే ఆయన కయీనును అతని యర్పణను లక్ష్యపెట్టలేదు. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టాడు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తనముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను, ఆదికాండము 4:5-7. కయీను దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు ఫలితముగా కయీను తన సోదరుడైన హేబెలు పట్ల అసూయతో, పగతో, ద్వేషంతో, ఆకస్మిక దాడికి పథకం వేసి హేబెలును చంపాడు. ఆపై దేవుని ముందు తన సోదరుడి పట్ల బాధ్యతను నిరాకరించాడు. యెహోవా–నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు –నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను, ఆదికాండము 4:9. కయీను తన ఆత్మను కోల్పోయాడు. ఈ ఉదాహరణ ద్వారా యూదా తెలియజేస్తూ ఉన్నదేమిటంటే, ప్రజలు అంతర్గత చెడుకు లొంగిపోయినప్పుడు, వారి బాహ్య చర్యలు అనివార్యంగా చెడుగా మారుతాయి అని తెలియజెయ్యటమే అతని ఉధ్దేశ్యము. (సత్యం పట్ల దానిని అనుసరించే వారి పట్ల ద్వేషం పెరుగుతుంది).

బిలాము (సంఖ్యాకాండము 22–25, 31) ఒక తాంత్రికుడు, అతని ద్వారా మాట్లాడడానికి ప్రభువు అతనిని ఎంచుకున్నాడు (సంఖ్యాకాండము 22:8 యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను) (దేవుడు బిలాము నొద్దకు వచ్చి– నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా, సంఖ్యాకాండము 22:9). ఇశ్రాయేలీయులను శపించడానికి బిలాముకు మోయాబు రాజు చాల సంపదను ఇచ్చాడు. కాని బిలాము నోటి నుండి ఆశీర్వాదాలు మాత్రమే రావడానికి ప్రభువు అనుమతించాడు, కాని బిలాముకు ఇంకా డబ్బు కావాలి. అందుకు అతడు ఇశ్రాయేలీయులపై విపత్తును తీసుకురావడానికి తెలివిగా మరో మార్గాన్ని సూచించాడు. మిద్యానీయుల స్త్రీలను ఇశ్రాయేలీయుల పురుషులతో వ్యభిచారం చేయమని ప్రలోభపెట్టి, ఆపై ఆ లైంగిక ఆకర్షణను ఉపయోగించి ఇశ్రాయేలీయులను విగ్రహారాధనకు నడిపించాడు. (ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి సంఖ్యాకాండము 25:1,16 మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై యున్నారు). దేవుని తీర్పు బిలాముపై కూడా పడింది. అతడు కత్తితో చంపబడ్డాడు (సంఖ్యాకాండము 31:8). దురదృష్టవశాత్తూ, బిలాము పాపం బిలాముతో పోలేదు. సంఘ చరిత్రలో వారి స్థానాన్ని వాడుకొని డబ్బు దోచుకొనిన వారి ఉదాహరణలు ఎన్నో వున్నాయి. (తమకు కావాలనుకున్న దాని విషయములో దురాశ).

కోరహు (సంఖ్యాకాండము 16) లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు మహాత్ములను దూషించు వారికందరికి ఒక ఉదాహరణగా ఉన్నాడు. అతడు మోషే నాయకత్వంపై మరియు దేవుని ప్రణాళికలు మార్గాలపై భారీ తిరుగుబాటును ప్రేరేపించాడు. అతని పతనం వేగంగా, ఖచ్చితంగా మరియు బహిరంగంగా జరిగింది- భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసింది. తిరుగుబాటులో చేరిన 250 మంది సంఘ నాయకులను దేవుని నుండి వచ్చిన అగ్ని కాల్చివేసింది. వీక్షిస్తున్న సమూహంలోని ప్రజలు ఈ తీవ్రమైన హెచ్చరికలను అగౌరవపరిచి, దూషణలను మళ్లీ ప్రారంభించినప్పుడు, దేవుడు మరొక తెగులును పంపాడు, అది వారిలో 14,700 మందిని చంపింది. (దేవునికి విరోధముగా తిరుగుబాటు, మోషే అహరోనుల ద్వారా దేవుని నాయకత్వమును అంగీకరించుటకు కోరహు తిరస్కరించాడు). ఇక్కడ యూదా మాట్లాడే ఈ తప్పుడు బోధకులు అతిక్రమణలకు, స్వార్థానికి, దురాశకు, అవిధేయతకు పాల్పడుతున్నారు.

ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవని పౌలు చెప్తూ ఉన్నాడు, 1 కొరింథీయులకు 10:6. ఉదాహరణలను గుర్తు పెట్టుకొని విశ్వసించి గౌరవించినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి. కాబట్టే మేల్కొనండి, పరిశుద్ధులకు అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తమై పోరాడండి మరియు సంఘ భద్రతపై దేవునిదే చివరి మాట అని తెలుసుకుని ఓదార్పు పొందండి అని యూదా చెప్తూ ఉన్నాడు.

12వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, 13తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

అబద్ధ బోధకుల నిజమైన స్వభావాన్ని ఆరు స్పష్టమైన సారూప్యతల ద్వారా యూదా ఇక్కడ ప్రస్ఫుటపరుస్తూ ఉన్నాడు: వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమవిందులలో దొంగమెట్టలుగా ఉన్నారని; ఈ మోసగాళ్ళు తమ నిజ స్వరూపాన్ని నైపుణ్యంగా దాచి పెట్టడం వలన విశ్వాసులకు నిరంతరం ముప్పుగా ఉంటారు. వారు క్రైస్తవుల ప్రేమ విందులకు హాజరవుతారు, అయితే, క్రైస్తవ సహవాసం యొక్క స్ఫూర్తితో కాదు, కాని వారి ప్రయోజనం కోసం, ఔచిత్యం కోరే గౌరవం పట్ల కనీస శ్రద్ధ లేకుండా, వారి స్వంత శరీరాల యొక్క నిజమైన సేవకులుగా వస్తారు. అబద్ధపు కాపరులు దేవుని హెచ్చరికలను బట్టి కొంచము కూడా భయము లేకుండా వారు స్వచ్ఛమైన ఆరాధన, ప్రభురాత్రి భోజనము, సంఘ ఫెలోషిప్ సమావేశాలలో దొంగ మెట్టలుగా ఉంటారు; తమ గొర్రెలను పట్టించుకోరు తమ్మును తాము పోషించుకోవడం గురించి మాత్రమే ఆలోచించు వారిగా ఉంటారు. (యెహెజ్కేలు 34:8 కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహారమాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు). ఈ అబద్ధపు కాపరులు దేవుని వాక్యమును నమ్మకముగా భోదించే నమ్మకమైన కాపరుల అధికారాన్ని అంగీకరించని వారుగా ఉంటారు, (యెహెజ్కేలు 34:1-10, యిర్మీయా 10:21;12:10, 23:1).

వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను (వర్షం లేని మేఘాలుగాను); కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను (ఫలించని చెట్లుగాను) (ఎఫెసీయులకు 2:1, 1 తిమోతి 5:6), వారు నీతిని ఫలించే లేదా పశ్చాత్తాపానికి వచ్చే అవకాశాన్ని దాటేసే ఉంటారు; హెబ్రీయులకు 6:4-6; తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, యెషయా 57:20,21; మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారని (యూదా కాలములో రాత్రిపూట ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలను ఆధారముగా చేసుకొని ప్రయాణించే వారికి ఆకాశంలోని కొన్ని నక్షత్రాలు నావిగేషన్ కోసం నమ్మదగనివి కావని వారికి తెలుసు, ఎందుకంటే ఈ నక్షత్రాలు ప్రతిరోజు తమ తమ స్థానాలను నిరంతరం మారుస్తూ ఉంటాయి. అబద్ద బోధకులు కూడా తమ బోధలను నిరంతరం మార్చుకునే విశ్వసనీయత లేని మార్గదర్శకులు) తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఉదాహరణ నిర్జలత్వాన్ని నిరుత్సాహాన్ని ఎలా వివరిస్తూ ఉందో గమనించండి, అవి సరైన రూపంలో ఉన్ననూ వాటి విధులను అవి నెరవేర్చవు. అట్లే అబద్ధ బోధకులు తమ విధ్వంసక చర్యల నుండి బయటపడరు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.

గొప్పగా ఉప్పొంగు మాటల యొక్క వ్యర్ధతతో అబద్ద బోధకులు కొత్తదైన జ్ఞానాన్ని బోధిస్తారు కాని అదే అవివేకము తప్ప మరేమి ఉండదు. కాబట్టే కొలొస్సయులకు 2: 8 ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అని 1 తిమోతి 4: 7లో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము అని; 2 తిమోతి 2:16-18లో అపవిత్రమైన వట్టిమాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు–పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అని చెప్తూ ఉన్నాయి. వారు నిజమైన క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నామని చెప్పుకొంటారు కాని వారి జీవితాలలో వేషధారణ తప్ప మరేమీ ఉండదు. వారు నిజమైన, ఆధ్యాత్మిక జీవితం యొక్క ఒక స్పార్క్ కూడా లేకుండా పూర్తిగా శరీరానికి సంబంధించిన వారు. కాబట్టి వారి ముగింపు నరకం యొక్క చీకటిలో శాశ్వతమైన అవమానంగా ఉంటుంది. అదే వర్ణన మన రోజుల్లోని తప్పుడు బోధకులకు కూడా వర్తిస్తుంది.

వారి నాశనము ప్రవచించబడింది (14–16)

14-15ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరిని గూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. 16వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.

అబద్ధ బోధకుల క్యారక్టరైజేషన్ని యూదా ముగిస్తూ, కఠినమైన భాషతో మరొక అసాధారణమైన ఉదాహరణను ప్రస్తావిస్తూ, వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు, సణుగు వారును, తమ గతిని గూర్చి నిందించు వారుగాను ఉందురని; వారి నోరు డంబమైన మాటలు పలుకునని ఈ భక్తిలేని మనుష్యుల ఐదు లక్షణాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక నాయకులు తమ ప్రజల పట్ల శ్రద్ధ వహించడం, ప్రేమించడం మానేసినప్పుడు, వారు అనివార్యంగా “తమ స్వంత ప్రయోజనాల కోసం” మరియు వ్యక్తిగత లాభం కోసం మానిప్యులేటర్లుగా మారతారు. నిజాయితీలేని వ్యక్తులు ఇతరులపై అధికారాన్ని పొందేందుకు లేదా తమ అహమును తృప్తి పర్చుకొనేందుకు లేదా డబ్బు కొరకు ఉపయోగించు కోవడానికి చర్చి అనేది వారికి అనుకూలముగా ఉంటుంది. యూదా వారి నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చూపించడానికి – వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు – అని చెప్తూ “భక్తిహీనుడు” అనే పదాన్ని పలుమార్లు వాడాడు.

ఆదాము వంశావళిలో ఏడవ వ్యక్తియైన హనోకు టైములో కూడా భక్తిహీనత విచ్చలవిడిగా ఉండేదని యూదా చెప్తూ ఉన్నాడు. మెతూషెల తండ్రియైన హనోకు, “దేవునితో నడిచాడు“, 365 సంవత్సరాలు విశ్వాసంతో జీవించాడు (ఆదికాండము 5:21-24). విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు, హెబ్రీయులు 11:5,6. ప్రళయానికి ముందు కాలములో హనోకు చేసిన ప్రవచనాత్మక పరిచర్యను గురించి ప్రభువు యూదాకు అదనపు సమాచారాన్ని అందించాడు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరు తమ జీవితాలను బట్టి దేవునికి లెక్కచెప్పాలని వారి భక్తిహీనమైన మాటలు చర్యలనుబట్టి ఆయన భక్తిహీనులందరినీ దోషులుగా నిర్ధారిస్తాడని హనోకు కూడా వీరినిగూర్చి ప్రవచించియున్నాడని యూదా తెలియజేస్తూ ఉన్నాడు. అంత్యదినాన్న కొందరు దేవదూతలు ప్రభువుతో శాశ్వతంగా ఉండేందుకు విశ్వాసులను పరలోకానికి తీసుకొని వెళతారు, దూతలలో మరికొందరు అవిశ్వాసులను చుట్టుముట్టి ప్రభువు యొక్క దయగల సన్నిధి నుండి వారిని శాశ్వతంగా లాగేస్తారు. ప్రభువు ప్రతి ఒక్కరికి వారి వారి పనుల ప్రకారం తిరిగి ఇస్తాడు.

ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు ఖండిస్తున్న దానిని కయీనీయుల వంశంలో ఆదాము మొదలుకొని యేడవ వాడైన లెమెకు ఉదహరించాడు. లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను, ఆదికాండము 4:19 (లెమెకు యొక్క ద్విభార్యత్వం). తన హంతక పూర్వీకుడైన కయీను గురించి సిగ్గుపడే బదులు, లెమెకు కోపములో అతనిని మించిపోయానని ప్రగల్భముగా చెప్పుకోవడం సిగ్గుపడే విషయం, ఆదికాండము 4:23-24, (లెమెకు తన భార్యలతో –ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను).

యూదా కనికరం లేకుండా భక్తిహీనుల పేర్లను పేర్కొనకుండా సంఘానికి ఈ లేఖను వ్రాసియున్నాడు. ఈ తప్పుడు సహోదరుల వినికిడిలో సంఘం తన లేఖను బహిరంగంగా చదువుతుందని అతనికి తెలుసు. సమస్యలను సరిచేయడానికి అవసరమైన అన్ని చర్యలను సంఘం తీసుకుంటుందని యూదా స్పష్టంగా విశ్వసిస్తున్నాడు. పేర్లను పేర్కొనకపోవడం ద్వారా, అతడు సంఘము తనకు తానే ఈ విషయములో ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో నిర్ణయించుకొందుకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇది ఒప్పుకోలుకు మరియు క్షమాపణకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రభువా, నా బలహీనతలను ఓపికగా సహించుచున్నారు. నా సహోదరుని పట్ల నేను కూడా సహించునట్లు ఓపికను ఇవ్వండి. సహనంతో కూడిన బోధనలు తమను తాము సహోదరులుగా పిలుచుకునే మరియు సువార్తకు విరుద్ధంగా ప్రవర్తించే వారికి పశ్చాత్తాపాన్ని కలిగించేలా చేయండి. ఆమేన్.

V. విశ్వాసులు పట్టుదలతో ఉండాలని ఉద్బోధించడం (17–23)

17-18అయితే ప్రియులారా, అంత్యకాలము నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి. 19అట్టివారు ప్రకృతి సంబంధులును ఆత్మలేని వారునై యుండి భేదములు కలుగజేయుచున్నారు.

మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు సంఘములో ఈ చొరబాటును ఊహించారని, తమ స్వంత ఎజెండా కోసం లేఖనాలను వక్రీకరించే తప్పుడు బోధకుల గురించి హెచ్చరించారని జ్ఞాపకము చేసికొనుడి. అన్ని మానవ నిర్మిత సంస్థలు, సంఘాలు, సినడ్‌లు వంటివి అపరిపూర్ణమైనవని అవి నిజమైన, మహిమాన్వితమైన, అదృశ్య, పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుధ్ధుల సహవాసము యొక్క దృశ్య వ్యక్తీకరణలు మాత్రమే అని గుర్తుంచుకోండి. గొర్రెల దుస్తులలో ఉన్న తోడేళ్ళ ద్వారా దాడులు చొరబాట్లను ఆశించండి మరియు సిద్ధంగా ఉండండి అని యూదా చెప్తూ ఉన్నాడు.

విచారకరమైన వాస్తవం ఏమిటంటే, ఈ రోజు చాలా మంది క్రైస్తవులు దేవుని ప్రేరేపిత, తప్పుపట్టలేని, స్థిరమైన బైబిల్ వాక్యాముపై సాంప్రదాయకంగా కరెక్ట్ అని అంగీకరించిన వాటికి అనుగుణంగా స్థాపించబడని ఆమోదించబడని ఫెలో షిప్స్ లో, సంఘాలలో, సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. చాలా క్రైస్తవ సంఘాలు సంస్థలు బైబిల్ యొక్క చారిత్రక సత్యాన్ని తిరస్కరించే, పరిణామ సిద్ధాంతాన్ని బోధించే, వ్యభిచారాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించని, స్వలింగ సంపర్కం మరియు గర్భస్రావం యొక్క చట్టబద్ధతను సమర్థించే, నరకం యొక్క ఉనికిని మరియు అంతిమ తీర్పును తిరస్కరిస్తూ ఉన్న పాస్టర్లను ప్రొఫెసర్లను సహిస్తూ ఉన్నాయి, ప్రోత్సహిస్తూ ఉన్నాయి మరియు క్రైస్తవ మతంతో సమానంగా అన్ని ప్రపంచ మతాల ఆధ్యాత్మిక చట్టబద్ధతను అంగీకరిస్తూ ఉన్నాయి. యూదా ఇటువంటి వారిని పరిహాసకులని, ప్రకృతి సంబంధులని, దేవుని ఆత్మలేని వారని, భేదములు కలుగజేయు వారని పిలుస్తూ ఉన్నాడు. నిజ క్రైస్తవులెప్పుడు భేదములు కలుగజేయరు, అబద్ధపు సహోదరులు మాత్రమే భేదములు కలుగజేస్తారు. భక్తిహీనులు దేవుని పరిశుధ్ధాత్మ చేత నిర్దేశింపబడరు.

నేటికీ చాలా మంది అబద్ద బోధకులలో, వారు ఎల్లప్పుడూ గొణుగుతూ ఉంటారు ఫిర్యాదు చేస్తు ఉంటారు. దేవుడు, లోకం పట్ల అసంతృప్తితో ఉంటారు, ఎల్లప్పుడూ తమ విధి గురించి విలపిస్తూ ఉంటారు. వారు తమ స్వంత కోరికలుతో మాత్రమే నడవాలని కోరుకుంటారు, వారి శరీరసంబంధమైన ఆకలి, సంతృప్తే వారి లక్ష్యం. వారు ప్రగల్భాలకు పోతూ ఉంటారు. తమ్మును తాము హెచ్చించుకొంటూ ఉంటారు. కాని తమకు కొంత ప్రయోజనం ఉంటుందని వారు ఆశించినప్పుడు, మనుష్యులను ముఖస్తుతి చెయ్యడంలో ఎవరూ వారిని అధిగమించలేరు. “ధనవంతులను పొగిడేవారందరు ఈ రకమైనవారే; ముఖ్యంగా సువార్త పరిచారకులమని చెప్పుకునే వారు మరింత ప్రయోజనకరమైన పరిష్కారం కోసం లేదా జీవనం కోసం ధనవంతులను వారి పాపాలలో కూడా శాంతపరుస్తూ ఉంటారు” (క్లార్క్).

యూదా హెచ్చరిక అతని పాఠకులు అందుకున్న మొదటిది కాదు. 2 పేతురు 3:3 అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు; అపొ. కార్య. 20:29-30 నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు; 1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు; 2 తిమోతి 3:1-9 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకము లాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించు వారు, పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి, వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. యన్నే, యంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిది కూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకముందుకు సాగరు. రోమా 16:17,18 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

అబద్ధపు బోధకులను నిర్మూలించడానికి ప్లాన్ ఏమిటి? అబద్ధపు బోధకులను నిర్మూలించడానికి యూదా నిర్మాణాత్మక, క్రమబద్ధమైన ప్లాన్ని ప్రతిపాదించలేదని గమనించండి. అతడు వారి దుర్మార్గపు పనిని మందలిస్తూ ఉన్నాడు మరియు ఖండిస్తూ ఉన్నాడు, వారి మారువేషాన్ని చింపి, సాతాను యొక్క వికృతత్వాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. అతని గంభీరమైన మాటలు ఈ వ్యక్తులపై కొంత ప్రభావం చూపి ఉండొచ్చు-బహుశా వారిలో కొందరు తాము చేస్తున్న చెడును గ్రహించి పశ్చాత్తాపపడి ఉండొచ్చు. తన ప్రియమైన స్నేహితులను బెదిరించే దైవభక్తి లేని, ఆధ్యాత్మికత లేని వ్యక్తులు సంస్థపై నియంత్రణలో ఉంటారని యూదా భావిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రమాదకరమైన చివరి కాలాలను ఎలా తట్టుకోవాలి, ఆధ్యాత్మికంగా తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై అతడి చివరి మాటలు ప్రధానంగా విశ్వాసులైన క్రైస్తవులను ఉద్దేశించి వ్యక్తిగతముగా ప్రస్తావించినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి.

20-21ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.

20, 21 వచనాల ప్రకారం, క్రైస్తవులు దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని ఉండాలనేది ప్రధాన ఆలోచనయై ఉన్నది. అయితే అది ఎలా సాధ్యం? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించేలా చేయగలమా? దేవునికి మనపట్ల ఉన్న ప్రేమ షరతులు లేనిది కాదా? అవును షరతులు లేనిదే. యూదా యొక్క ప్రబోధం మన క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సత్యాన్ని వివరిస్తూ ఉంది: మన స్వంత ఆధ్యాత్మిక సంకల్ప శక్తి, పుట్టుకతోనే పాపంలో చనిపోయింది, పునర్జన్మ పొందింది. క్రీస్తుపై విశ్వాసం ద్వారా మనం ఇప్పుడు మరోసారి దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాము. మనం ఇప్పుడు, “ప్రభువా, నీ చిత్తం చేయడం నాకు చాలా ఇష్టం” అని చెప్పగలం. దేవుడు వాక్యం, సంస్కారముల ద్వారా మనతో కమ్యూనికేట్ చేయడానికి ఎంచుకొనియున్నాడు. వాక్యం, సంస్కారముల ద్వారా దేవుడు తన పిల్లలకు ఆధ్యాత్మిక యుధ్ధము కొరకై ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తూ ఉన్నాడు, కాబట్టి, వాక్యం సంస్కారముల ద్వారా దేవుడు మనలను బలపరచడాన్ని రక్షించడాన్ని మనం ఇప్పుడు ఎంచుకోవచ్చు.

20 మరియు 21 వచనాలలో, క్రైస్తవులు దేవుని ప్రేమలో ఎలా ఉండాలనే మూడు అంశాలను యూదా ప్రస్తావించాడు:

1. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవడం. ఎఫెసీయులకు 2: 20 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. కొలొస్సయులకు 2: 6,7 కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు, ఆయనయందుండి నడుచుకొనుడి. క్రైస్తవ విశ్వాసం ప్రపంచంలోని అవిశ్వాసం నుండి వేరుగా ఉంటుంది. అటువంటి విశ్వాసం ప్రపంచానికి సాధారణం కాదు. అది పవిత్రమైనది. మీరు ఆయుధాలు ధరించి, రక్షణగా కవచాన్ని ధరించుకొని ఉంటే అబద్ద బోధకులు మీకు హాని చేయలేరు. క్రైస్తవ మతం యొక్క యుద్ధాలు యుద్ధభూమిలో కాకుండా మీ హృదయంలో మనస్సులో జరుగుతాయి కాబట్టి మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. ఎలాగంటే, వాక్యాన్ని చదవండి. వాక్యాన్ని వినండి. వాక్యాన్ని పాడండి. వాక్యాన్ని పంచుకోండి. వాక్యాన్ని గుర్తుంచుకోండి. ప్రభువు శరీరాన్ని, రక్తాన్ని తిని త్రాగండి. కాబట్టే యోహాను 8:31లో యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు అని చెప్పాడు. సాతాను అబద్ధాలు మరియు లంచాలు బైబిల్ సత్యం యొక్క ప్రకాశవంతమైన కాంతి క్రింద ముడుచుకుంటాయి. మీరు మీ రక్షకుడు నిభంధనా రక్తం ద్వారా ఐక్యమైనప్పుడు నిరాశ భయం తొలగిపోతాయి.

2. పరిశుద్ధాత్మలో ప్రార్థన. దేవుని ఈ ప్రేమ మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరింపబడి యున్నది, రోమా 5:5 మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి యున్నది. దేవుని ఈ ప్రేమ మన హృదయాలలో దేవుని పట్ల ప్రేమను మేల్కొల్పుతూ ఉంది, 1 యోహాను 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించు చున్నాము. ఈ విధంగా మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దయను ప్రతిరోజూ అంగీకరిస్తూ ఉన్నాం, ఆయన శ్రమ మరణం ద్వారా సంపాదించిన ఆయన అనుగ్రహం, ఆయన పై విశ్వాసం ద్వారా మనకు శాశ్వత జీవితానికి భరోసా ఇస్తూ ఉంది. 1 యోహాను 2:1,2, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; రోమా 8:34, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే; హెబ్రీయులకు 7:25, ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చు వారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు. యేసుక్రీస్తులో దేవుని కనికరము ద్వారా మనకు నిత్య రక్షణ కచ్చితం.

ఆత్మ ప్రేరేపించిన రీతిగా, దేవుని వాక్య ప్రకారము ప్రార్ధిదాం. దేవుడు తన వాక్యంలో మీతో మాట్లాడిన తర్వాత, మీరు మీ మాటలతో దేవునితో మాట్లాడండి. దేవునితో మాట్లాడటం ఆయనతో మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఆత్మ మీకు క్రీస్తు పై విశ్వాసం ఇచ్చియున్నదని, అది మిమ్మల్ని దేవుని బిడ్డగా మార్చియున్నదని యెరిగి ఆత్మవిశ్వాసంతో ప్రార్థించండి. ఏమి ప్రార్థించాలో లేదా ఎలా ప్రార్థించాలో తెలియని పరిశుద్దుల కొరకు ఆత్మ మధ్యవర్తిత్వం వహిస్తాడని యెరిగి ఆత్మవిశ్వాసంతో ప్రార్థించండి. ప్రభువు ప్రతి అభ్యర్థనను ప్రాసెస్ చేస్తాడని, ఆయన శక్తికి పరిమితులు లేవని, మీ నుండి వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడని, తన పిల్లల ఆశలను నెరవేర్చడంలో వారి అవసరాలను తీర్చడంలో ఆయన సంతోషిస్తున్నాడని యెరిగి ఆత్మవిశ్వాసంతో ప్రార్థించండి. నిన్ను ఆశీర్వదించుటకు నీ కొరకు పనులు జరిగేలా ఆయన చేస్తాడు.

3. మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టటం. మనం ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఈ లోకాన్ని సంస్కరించలేమని, శుద్ధి చేయలేమని విశ్వాసులకు తెలుసు. ఇది నయం చేయలేని రీతిగా పాడైయున్నది. దేవుని ప్రణాళిక త్వరగా వచ్చి, దానిని కరిగించి, కొత్త ఆకాశాన్ని భూమిని రూపొందించ వలసియున్నది. కాబట్టి మన అంతిమ లక్ష్యం, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన కనికరమును అనుభవించడం. ఆ ప్రకాశవంతమైన నిరీక్షణ మనల్ని ముందుకు సాగేలా చేస్తుంది.

ఈ రీతిగా క్రీస్తులో దేవుని ప్రేమ నుండి దూరంగా నడిపించే తప్పుడు బోధలకు వ్యతిరేకంగా జాగ్రత్త వహించవలసి యున్నాము.

22సందేహపడు వారిమీద కనికరము చూపుడి. 23అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.

విశ్వాసం యొక్క ఈ నిశ్చయత మన సహోదరుల పట్ల మన ప్రవర్తనలో, సోదర ప్రేమలో కనిపిస్తుంది: క్రైస్తవులందరికీ సందేహాలు ఉంటాయి. అయితే విశ్వాసం వారి సందేహాలను అధిగమించేలా వారు సహనంతో వ్యవహరించవలసియున్నారు. క్రీస్తు దయను అనుభవించిన వ్యక్తులు ఇతర వ్యక్తుల పట్ల కనికరమును చూపాలని యూదా కోరుకుంటున్నాడు: సందేహపడు వారిమీద కనికరము చూపుమని (వారి బలహీనతలను తృణీకరించకుండా, ఓపికగా ప్రోత్సహించమని, మందలించమని, నడిపించమని మరియు ప్రేమించమని) యూదా కోరుకుంటున్నాడు; పాపం చేసే వారందరూ పశ్చాత్తాపపడాలని కోరబడుతూ ఉన్నారు, తద్వారా వారు క్షమాపణను పొందగలరు, వారు అగ్నిలో ఉండిపోతే తమ విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి దేవుని కోపాన్ని గురించి ఆయన వాగ్దానాలను గురించి మాట్లాడటానికి సమయమును తగినంతగా కేటాయించి శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారి ఆత్మీయ ఆత్మహత్యలను నిరోధించడానికి జోక్యం చేసుకొంటూ (మోసగాళ్లచే దాదాపుగా దారితప్పిన ఇతరులను) అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుమని యూదా కోరుకుంటున్నాడు; మరికొందరు మోసగాళ్ల మాట వినడానికి మొగ్గు చూపుతూ సరైన మార్గం నుండి పక్కకు తప్పుకునే అంచున ఉన్నారు. అలాంటి వారికి మనం ప్రేమతో, దయతో కూడిన సహాయాన్ని అందించాలి, గలతీ 6:1,2 సహోదరులారా, ఒకడు ఏ తప్పితములో నైనను చిక్కుకొనిన యెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని (శరీరమువలన డాగుపడిన అంగీని) అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుమని అతడు బ్రతిమలాడుతున్నాడు. ఇది భయంతో, సాత్విక స్ఫూర్తితో చేయాలి; మనం కూడా శోధించబడకుండా ఎల్లప్పుడూ మనకోసం మనం చూసుకోవాలి. మన మొత్తం వైఖరిలో అహంకారం మరియు దురభిమానం యొక్క కనీస సూచన కూడా ఉండకూడదు. ఒకరినొకరు సరిదిద్దుకోవడం భయంతో చేయాలి, ఎందుకంటే క్రైస్తవులందరూ పరిశుద్దులు పాపులై యున్నారు, పాపం పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు. పాపముతో ఆటలాడ కూడదు లేదా దానిని వాయిదా వేయకూడదు. పశ్చాత్తాపపడని పాపం క్రీస్తు మనకు ఇచ్చిన నీతి వస్త్రంపై మరక వంటిది. ఆయన రక్తం మాత్రమే ఆయన క్షమాపణతో దానిని మళ్లీ తెల్లగా చేయగలదు. సుంకరులను వేశ్యలను కూడా యేసు ప్రేమించియున్నాడు. ఆయన వారిపై ప్రేమను చూపకుండా లేడు, కాని వారి పాపభరితమైన జీవనశైలిని మాత్రం ఆయన క్షమించలేదు, “వెళ్ళి నీ పాప జీవితాన్ని విడిచి పెట్టుమని” ఆయన వారికి చెప్పియున్నాడు.

లేఖనాలలో సంపూర్ణ రక్షణను కలిగి ఉన్న క్రైస్తవులు మోసంలో పడవలసిన అవసరం లేదు. తప్పుడు బోధ మరియు మరణానికి దారితీసే పాపం యొక్క మోసం గురించి హెచ్చరించబడ్డాము. అదే విధంగా, ప్రభువు మనకు నీతి మార్గాన్ని బోధించాడు, దీని ద్వారా ఆయన ఆత్మ మనలను కనికరములో మరియు సమాధాన సువార్తలో నడిపిస్తూ ఉంది. ప్రభువైన దేవా, అన్ని చెడుల నుండి మమ్మల్ని విడిపించడానికి మీతో మరియు మీ పవిత్రాత్మతో నిత్యజీవానికి తీసుకురావడానికి క్రీస్తు వచ్చే వరకు మమ్మల్ని మీ ప్రేమ కనికరములలో ఉంచుము. ఆమేన్.

VI. డాక్సాలజీ (24, 25)

24-25తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమేన్.

మానవ శక్తి సామర్థ్యం సరిపోని చోట, మన శక్తితో లక్ష్యాన్ని చేరుకోలేని చోట, మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తిమంతమైన, దయగల శక్తి మనకు సహాయం చేస్తుంది. మన పాదాలు జారిపోకుండా, మనం దొర్లకుండా, పడిపోకుండా ఆయన మనల్ని కాపాడుకోగలడు. ఆయన శాశ్వతమైన కనికరము ద్వారా మనం చివరి రోజున ఆయన ముందు దోషరహితంగా ఉంచబడతాము, మన స్వంత నీతిలో కాదు, మన గొప్ప ఛాంపియన్‌లో, అందువల్ల చెప్పలేని ఆనందంతో నిండిపోతాము, 1 థెస్స 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును; కొలొస్సయులకు 1:22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను; 1పేతురు 4:13 క్రీస్తు మహిమ బయలుపరచబడి నప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి.

యూదా యొక్క అద్భుతమైన ఈ డాక్సాలజీ ఏ క్రైస్తవుల విశ్వాసం పైనైతే దాడి జరిగియున్నదో వారికి ఈ వాగ్దానాల గురించి తెలియజేయడం ద్వారా వారు తొట్రిల్లకుండ కాపాడబడుటకు కావలసిన ఓదార్పుని ఇస్తూ ఉంది. మన స్వంత ప్రయత్నాలు ఆరాధన విషయములో కాని లేదా, బైబిలు అధ్యయనం విషయములో కాని లేదా ప్రార్థన విషయములో కాని కాని తగ్గొచ్చు. కాని మనల్ని పరలోకానికి చేర్చడానికి కట్టుబడి ఉన్న వ్యక్తి చేతిలో మన జీవితాలను ఉంచడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంది. దేవుడు మాత్రమే తన మాట యొక్క శక్తి ద్వారా వారిని ఏక నిజ విశ్వాసంలో ఉంచగలడు.

పాపం మరియు సాతానుకు వ్యతిరేకంగా పోరాటంలో మనం అలసిపోయినప్పుడు, మన గొప్ప, మార్పులేని, ఉన్నతుడైన మన దేవుని వైపు మన కన్నులను ఎత్తడం ఆనందదాయకంగా ఉంటుంది, ఆయన శక్తి అధికారం అపరిమితం. పాపం మరియు సాతానుపై ఆయనకు విజయం తథ్యం. మన కష్టాలన్నీ కొద్దికాలం మాత్రమే అని గ్రహించి, మన పెదవులు హృదయాలతో ఆయనకు ఇవ్వగలిగిన గౌరవాన్ని కీర్తిని ఆయనకు ఇధ్ధాం. క్రీస్తు ద్వారా మనలను రక్షించిన పరలోకపు తండ్రికి మహిమ కలుగును గాక. ఆమేన్!

రోమా 16: 25-27 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడియున్నది. ఈ మర్మమును అనుసరించియున్న నా సువార్త ప్రకారముగాను, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తు ద్వారా, నిరంతరము మహిమ కలుగును గాక. ఆమేన్. 1 తిమోతి 1:17, సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్.

యూదా రక్షణ అనేది మన స్వంత కారణం లేదా బలం మీద ఆధారపడి ఉండదని అది పూర్తిగా క్రీస్తులో తండ్రి పని అని నొక్కి చెప్పాడు. ప్రభువు మీకు అవకాశం ఇచ్చినందున, రక్షణ సందేశాన్ని ధైర్యంగా పంచుకోండి, ఎందుకంటే ఇది నిజంగా ప్రభువు నుండి వచ్చింది. ఆయన నిజంగా సాక్ష్యం ద్వారా పనిచేస్తాడు, పశ్చాత్తాపపడే వారిని గొప్ప ఆనందానికి నడిపిస్తాడు. ప్రభువా, నా సేవలో ప్రస్తుత ఆనందాన్ని మరియు క్రీస్తు యేసు ద్వారా మీరు నా కోసం సిద్ధం చేసిన పరలోక మహిమలలో శాశ్వతమైన ఆనందాన్ని నాకు దయచేయండి. ఆమేన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.