పాత నిబంధన పాఠము: 2వ రాజులు 2:1-12a; పత్రిక పాఠము: 1 కొరింథీయులకు 3:12-4:2; సువార్త పాఠము: మార్కు 9:2-9; కీర్తన 148.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: 2వ రాజులు 2:1-12a

1యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా 2ఏలీయా– యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా–యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. 3బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. 4పిమ్మట ఏలీయా–ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. 5యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చి–నేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు–నేనెరుగు దును మీరు ఊరకుండుడనెను. 6అంతట ఏలీయా–యెహోవా నన్ను యొర్దాను నకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు–యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి. 7ప్రవక్తల శిష్యులలో ఏబదిమంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొర్దానునదిదగ్గర నిలిచిరి. 8అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి. 9వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి–నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా–నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. 10అందుకతడు–నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.

మనం చదువుకొన్న వచనాలలో ఎలీషా నేను నిన్ను విడువను అని చెప్పిన మాట చాల ప్రోత్సాహకరముగా ఉండి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. అంతేనా తన బిడ్డలను దేవుడు వారి ముగింపులో విడువడనే విషయాన్నీ అట్లే  విశ్వాసుల పోకడ మహిమకరమనే విషయాన్ని మన పాఠము తెలియజేస్తూవుంది. 2 విషయాలు విశ్వాసుల పోకడను మహిమకరముగా చేస్తూవున్నాయి_ విశ్వాసి వదిలి వెళ్తున్న వారసత్వాన్ని బట్టి మరియు అతడు ముందుగా చూచుచున్న స్వాస్థ్యమును బట్టి అతని పోకడ మహిమకరమని మనం చెప్పొచ్చు.

ప్రతి విశ్వాసి మరణము మహిమకరమై యున్నది

  1. అతడు వదిలి వెళ్లు వారసత్వమును బట్టి 1-10
  2. అతడు పొందబోవుచున్న స్వాస్థ్యమును బట్టి 11,12

1

పాత నిబంధనలో ప్రవక్తయైన ఏలీయాగారికొక ప్రత్యేకమైన స్థానముంది. అట్లే ఏలీయా పరిచర్య చాల కష్టము సంక్లిష్టమైనదని మనం చెప్పొచ్చు. మన పాఠము ఏలీయా పరిచర్య ముగింపును గూర్చి తెలియజేస్తూ ఆశ్చర్యకరమైన రీతిలో యెహోవా ఏలీయాను యెట్లు తీసుకు వెళ్లియున్నాడో చెప్తూవుంది.

మన పాఠములో ఏలీయా ఈ లోకాన్ని విడిచి పెట్టవలసియున్నాడనే విషయాన్ని యెహోవా ఏలీయాకు తెలియజేసి యున్నాడు. ఆ విషయాన్ని యెహోవా ఏలీయాకు ఎలా తెలియజేసియున్నాడో మన పాఠము చెప్పటంలేదు. ఏలీయాకు తన పోకడను గూర్చి తెలిసింది, ఎప్పుడు? ఎక్కడ? ఎలా? అనేది. అలాగే యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయించుటకు నిర్ణయాన్ని తీసుకొని యున్నాడనే విషయాన్ని మొదటి వచనము తెలియజేస్తూ వుంది.

చివరి కోరికగా, ఏలీయా ఆ ప్రాంతానికి వెళ్ళుటకు ముందుగా తన శిష్యులను సందర్శించి వారిని బలపరచి ప్రోత్సహించాలనుకొన్నాడు. ఎందుకంటే అతడు తన వారసత్వాన్ని విడిచివెళ్ల బోవుచున్నాడు. అతడు తాను విడిచివెళ్ల బోవుచున్న వారసత్వమును తనివితీరా చూసుకొని వారిని బలపరచుటకు ఆశపడ్డాడు, అలాగే తాను విడిచివెళ్ల బోవుచున్న తన వారసత్వములో దేవుడు తన తర్వాత ఎవరిని ఎన్నుకొనునో అలాగే తనలా దేవుని పనిని చేయగల మరొక శిష్యుణ్ణి తన తర్వాత వారసునిగా ఏర్పరచుటకు చివరిసారిగా అతని నిబద్ధతను పరీక్షించుటకు, అది దేవుని చిత్తమని తెలుసుకొనుటకు చూచుటకు అతనికి అవకాశమియ్య బడింది. వాళ్ళు గిల్గాలు నుండి బయలుదేరి బేతేలుకు అక్కడనుండి యెరికోకు అక్కడనుండి యొర్దానుకు వచ్చారు. గిల్గాలులో, బేతేలులో యెరికోలో నీవు దయచేసి యిక్కడ ఉండిపో అని ఏలీయా ఏలీషాతో ఎందుకని అన్నాడో మనకు తెలియదు.

బహుశా ఏలీయా ఏలీషా యొక్క నిబద్ధతను పరీక్షిస్తున్నాడా? లేదా ఎడబాటు కష్టమని ఎలీషాను ఆగిపొమ్మని చెప్తున్నాడా? ఏలీయాను విడిచి ఉండటం ఎలీషాకు చాల చాల కష్టముగా ఉంది కనుకనే ఏలీయా ఇక్కడ ఉండిపో అని ఎలీషాకు చెప్పినప్పుడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని ఏలీషా చెప్పియున్నాడు.

దేవుని ప్రవక్తగా ఏలీయాకున్న ప్రత్యేకత, పని విలువలు వ్యక్తిగత విలువలు అతడు విడిచివెళ్తున్న వారసత్వములో ప్రతిబింబించుటను చూడగలం.

ఏలీయాకున్న మరొక ప్రత్యేకతను 8వచనంలో మనం చూడగలం:  అంతట ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయిరి.

ఈ సంఘటన ఏలీయా దేవుని పై ఎంతగా ఆధారపడియున్నాడో తెలియజేస్తూ వుంది. అట్లే  మోషేలా, యెహోషువాలా ఇశ్రాయేలీయులతో దేవుడెలా ఉన్నాడో తనతో కూడా అలానే ఉన్నాడనుటకు ఇది సాదృశ్యముగా ఉంది. 

ఇశ్రాయేలీయులు దాస్యమునుండి విడిపింపబడినప్పటికిని, విమోచింపబడినప్పటికిని శత్రువు వారిని తరిమినప్పుడు దేవుడే వారి ఎదుటనున్న యెర్ర సముద్రమును చీల్చి వారిని తప్పించియున్నాడు. అట్లే ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటకు ముందుగా వాళ్ళు యొర్దానును దాటవలసి వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మందసమును ఎత్తుకొని ముందుకు నడువగా మందసమును మోయుచున్న యాజకుల పాదములు యొర్దాను నీళ్లను తగలగానే పారుతున్న యొర్దాను నీళ్లు  ఆపబడ్డాయి.

ఇప్పుడు మన పాఠములో ఏలీయా దేవునిని చేరుటకు ముందుగా ఏలీయాకు యెహోవాకు మధ్యలో యొర్దాను అడ్డుగా వచ్చింది. నదిని దాటుటకు పడవ వంటిది అక్కడ లేదు, నదిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యను ఏలీయా సులభముగా పరిష్కరించాడు. ఏలీయా తన దుప్పటి తీసికొని మడత పెట్టి నీటిమీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరు పొడినేలమీద దాటిపోయారని మన పాఠము చెప్తూవుంది.

ఇక్కడ ఏలీయా తమను గమనించుచున్న శిష్యులను, ఎలీషాను మెప్పించుటకు ఇలా చెయ్యలేదు. ఆ యొర్దానును చీల్చిన యెహోషువాను ఇశ్రాయేలీయులను జ్జ్యపాకం చేసుకొని వాళ్ళు తనకు అందించిన వారసత్వాన్ని ఆదే దేవుని శక్తిని నమ్మిన బిడ్డగా తన ముందున్న యొర్దానును ఏలీయా దేవుని శక్తితో చీల్చగలిగాడు.

దేవుడు తన పిల్లలను తన వద్దకు తీసుకొంటున్నపుడు వాళ్ళు మరణమనే యొర్దానును దాటవలసి యున్నారు. మరణము గుండా వెళ్ళవలసియున్నారు. ఆ మరణమును దాటి దేవుని చేరుటకు అక్కడ బోట్ ఏమి వుండదండి. ఆ మరణమును దాటి దేవునిని చేరుకోవాలనుకొంటే, సొంత ప్రయత్నం చేయలేము. మరి మనకు సహాయపడేదెవరు?  ఆ మరణాన్ని ఎలా దాటగలం? దేవునిపై ఆధారపడటం ఒక్కటే ఆ మరణాన్ని దాటించగలదు.  

అది కూడా నిజ దేవునిపై ఆధారపడటం ఒక్కటే మనలను దాటించగలదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మనకందరికీ తెలుసు, మనుష్యులు దేవుడు తినవద్దని చెప్పిన పండును తిని,  దేవుని ఆజ్ఞను మీరి పాపమును చేసారని. అలా చెయ్యడం ద్వారా మనుష్యులు దేనిని కోరుకున్నారో ఏం చెప్తున్నారో ఎప్పుడన్నా మీకు మీరుగా ఆలోచించారా? దేవుని న్యాయ విమర్శను కోరుకొనేటట్లు సాతాను వారిని ప్రేరేపించగా వాళ్ళు అలా చేసారండి. అంటే దేవా మా ప్రతి క్రియ తలంపు మాటలను బట్టి మాకు న్యాయము తీర్చి వాటినిబట్టి మీతో ఉండటాన్ని నిర్ణయించండి అనేటట్లు వాడు వాళ్ళను శోధించాడు. పండును తినడం ద్వారా కమిట్ అయ్యేలా చేసాడు. వాళ్ళు కమిట్ అయ్యారు. మనం కొనసాగిస్తున్నాం. దాటగలరా? దేవుని న్యాయవిమర్శలో పాస్ అవ్వగలననే నమ్మకము మీకు ఉందా? దేవునితో ఉండగలమనే నమ్మకము మీకుందా? 

ఆ మరణాన్ని దాటటానికి అక్కడ ఒక మార్గం, సహాయం దేవుడు ఉంచాడండి. ఆ సహాయం ఆ మార్గం దేవుని శక్తే. ఆ శక్తే యేసుక్రీస్తుగా తనను నమ్మిన వారి కొరకు ఆ మరణాన్ని చీల్చి వాళ్ళు దేవునిని సులభముగా చేరుకొనుటకు మార్గమును ఏర్పర్చి వున్నాడండి. విమోచింపబడిన వాళ్ళు సులభముగా దాటిపోతారు. ఈ విషయాన్నే ఏలీయా తనను చూస్తున్న శిష్యులకు తనను వెంబడిస్తున్న ఎలీషాకును తన క్రియ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 

ఇలాంటి ప్రార్ధనా శక్తిని, వాక్యపు బలాన్ని, నిజదేవుని యందు మీకున్న దృఢమైన విశ్వాసాన్ని నమ్మికను ప్రేమను, ఓర్పును, సహనాన్ని, ధైర్యాన్ని తొట్రిల్లని మనస్సును ప్రోత్సహించే హృదయాన్ని బ్రతికించే మనస్తత్వాన్ని మన పిల్లలకు వారసత్వముగా ఇవ్వాలని నేను మిమ్మల్నందరిని వేడుకొంటున్నాను. ఎలాంటి వారసత్వాన్ని మన పిల్లలకు మనం ఇస్తున్నాం? వారి కొరకు వదిలి వెళ్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. Please. అన్ని వేళల దేవుని శక్తి పై ఆధారపడిన మీ జీవితాలను, మీ జీవితాలలో ఉన్న దేవుని శక్తిని వారసత్వముగా వదిలి వెళదాం.     

ఒకసారి పిల్లలు మాట్లాడుకొంటూ ఉండగా, వాళ్లలో ఒకడు ఒరే మాకు మేయర్ గారు తెలుసు అని అన్నాడు, ఇంకొకడు వెంటనే మాకు స్టేట్ మంత్రి గారు తెలుసు అని చెప్పాడు, వెంటనే మరొకడు మాకు సెంట్రల్ మంత్రి గారు తెలుసు అని అన్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి నాల్గవ వాడిని ఒరే మీకు ఎవరు తెలుసు అని అడిగారు? దానికి వాడు మాకు దేవుడు తెలుసు అని చెప్పాడు. దేవుడు తెలుసా? అని ఆశ్చర్యముతో వాళ్ళు అడుగగా వాడు అవునురా మేము రోజు దేవునికి పాటలు పాడుతాం దేవునికి ప్రార్ధన చేస్తాం, మాకు కావాల్సిన వన్నీ ఆయనను అడుగుతాం. ఆయన మా కిస్తూవున్నాడు  మా నాన్నగారు రోజూ దేవునితో ఎంతోసేపు మాట్లాడుతారు. నా గురించి, మా అందరి బాగు గురించి దేవుని నిర్దేశకత్వాన్ని సలహాను రోజూ తీసుకొంటారు అని చెప్పాడు. ఆ పిల్లవాడు తన తలితండ్రుల నుంచి ఎంతటి అద్భుతమైన వారసత్వాన్ని పొందుకొని యున్నాడో కదా.

క్రైస్తవులారా ఎందరో మన కొరకు తమ వారసత్వాన్ని వదిలి వెళ్లియున్నారు. నిత్యమైన స్వాస్థ్యమును మనకు అందించియున్నారు. దేవుని శక్తిని చూపించియున్నారు. ఆ వారసత్వము సహాయముతో యేసుని బట్టి మన చుట్టూ ఉన్న అనీతిమంతతత్వము యొక్క బురద లేక దౌర్భాగ్యము అను నీటిని మనము తాకకుండా ఆరిన నేలను సులభముగా యేసుని శక్తిని బట్టి ఈ జీవితములో ముందుకు వెళదాం, దృఢచిత్తముతో దేవునిని సమీపిద్దాం.

బలమైన వారసత్వములో ఎదుగుతున్న వారు,  దేవుని బిడ్డలకు దొరికే ఆ గొప్పతనమును బట్టి దానినే కోరుకుంటారు తప్ప ఇహ విషయాలను కాదు. ఇక్కడ ఏలీయా నీ లాస్ట్ విష్ ఏంటని ఎలీషాను అడిగినప్పుడు, నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయమన్నాడు, మరి మన పిల్లలు. మన ఆస్తులను కోరుకొంటున్నారు తప్ప దేవుడు మనలను ఆ స్థితికి తెచ్చిన ఆయన కనికరాన్ని కోరుకోవడం లేదు. దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఆశ పడడం లేదు. ఏమి జరుగుతున్నను, ప్రభువే మన నిశ్చయతని కదల్చబడని మన బలమునకు మూలమని మనము నమ్మాలని ఆయన చిత్తమునకై ఎదురు చూడండని ఏలీయా మనకును నేర్పిస్తువున్నాడు.

2

11-12a వచనాలను చదువుకొందాం: 11వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణ మాయెను 12ఎలీషా అది చూచి–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని కేకలువేసెను; అంతలో ఏలీయా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను.

ఎలియన్ గురించి కొందరు ఏవేవో చెప్తూఉంటారు. వాళ్లలో కొందరు మరి ముందుకు వచ్చి ఇక్కడ మనం చదువుకొన్న ఈ అగ్నిరధము అగ్ని గుఱ్ఱములు ఎలియన్ షిప్స్ అని మనుషులకు ఎలియెన్స్ కు సంబంధముంది చూడండని ఈ విషయం బైబిలులో కూడా ఉన్నదని చెప్తూ, ఈ వచనాన్ని చూపిస్తున్నారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా?

రథాలు మరియు గుర్రాలు అనేవి సైనిక శక్తికి చిహ్నాలు. అగ్ని రథాలు మరియు అగ్ని గుర్రాలు అనేవి సర్వశక్తిమంతుని సైనిక శక్తికి చిహ్నాలు. ఇజ్రాయెల్ చరిత్రలో, అగ్ని తరచుగా దేవుని ఉనికికి చిహ్నంగా ఉంది (నిర్గమకాండము 3: 2; 13:21; 19:18; 24:17; ద్వితీయోపదేశకాండము 4:12). ఏలీయా జీవితంలో రెండు సందర్భాలలో యెహోవా తన శక్తిని ప్రదర్శించడానికి అగ్నిని ఉపయోగించాడు, ముఖ్యంగా (నిర్భయముగా ఏలీయా దేవునిని గురించి సాక్ష్యమిచ్చే సందర్భములో) పరలోకం నుండి వచ్చిన అగ్ని కార్మెల్ పర్వతంపై ఏలీయా  బలిని దహించివేసినప్పుడు (1 రాజులు 18). తరువాత, (ఏలీయాను సంరక్షించే సందర్భములో) రాజైన అహజ్యా ఏలీయాను పట్టుకోవడానికి యాభై మంది సైనికులతో ఒక అధిపతిని పంపగా  అతనిని అతని సైనికులను దహించి వేసే సందర్భములో. (2 రాజులు 1: 9-12).

ఈ రథములు గుఱ్ఱములు సర్వశక్తిమంతుడైన దేవుని అండ మనకున్నదనే విషయాన్ని తెలియజేస్తూ వున్నాయి. మన సహాయము కొరకు మన దేవుడు తన పరలోక సైన్య సమూహమును మనకు తోడుగా పంపిస్తాడనే నమ్మికను కలిగి ఉండండి. లోక  శక్తులను నమ్ము కోకండి, ఆశ్రయించకండి. యెహోవాను ఆశ్రయించండి, ఆయనను నమ్ముకోండి.

అంతేనా, మన పాఠము యొక్క స్పష్టతను బట్టి ఏలీయా ఎక్కడికి వెళ్ళాడో ఎలీషాకు తెలుసు. దీనిని గూర్చి ఎలీషాకు ఎలాంటి సందేహము లేదు. ఏలీషా యొక్క ఆత్మీయ తండ్రియైన ఏలీయా తన స్వాస్థ్యమును పుచ్చుకోనుటకు యెహోవా చేత కొనిపోబడ్డాడని ఎలీషాకు తెలుసు.

ప్రతి ఒక్కరి జీవితములో మరణము అనివార్యము మరియు తప్పించుకోలేనిది. కాని అది జీవితములో ఒక భాగము మాత్రమే. ప్రతి ఆత్మ అంతిమ లక్ష్యము యెహోవాను చేరుటే. అదే ప్రతి విశ్వాసి మరణాన్ని మహిమకరముగా మార్చివేస్తూ ఉంది. విశ్వాసి లోకమును విడిచిపెట్టడం, అతనికి అద్భుతముగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రతి విశ్వాసి మరణములో అగ్ని రథములు గుఱ్ఱములు ఉండక పోవొచ్చు. కాని విశ్వాసులు వాళ్ళు వదిలి వెళ్లే వారసత్వమును బట్టి మరియు దేవుని యొద్ద వాళ్ళ కొరకు ఎదురు చూచుచున్న స్వాస్థ్యమును బట్టి మరణములేదా ఒక విశ్వాసియొక్క పోకడ మహిమకరమని చెప్పొచ్చు.  

ప్రతి విశ్వాసి యొక్క పోకడ మహిమకరముగా ఉండులాగున దేవదూతలు వారితో ఉండులాగున లోక రక్షకుడైన యేసుని శక్తిని బట్టి ప్రతి విశ్వాసి దృఢచితముతో యెహోవాను చేరులాగున ఆయనే ప్రతి ఒక్క విశ్వాసిని నడిపించును గాక. ఆమెన్.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.