కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.

మొదటి అంశము

(సృష్టి)

భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను.

దీనికి అర్ధమేమి?

దేవుడు  నన్నును మరియు సమస్తమును కలుగజేసి, మరియు నాకు శరీరాత్మలను, కన్నులు, చెవులు మొదలైన సకలావయవములను, బుద్దిని, సమస్తే౦ద్రియములను ఆయన నాకు దయజేసెనని నేను నమ్ము చున్నాను.

ఆ దేవుడు నా శరీరము మరియు జీవమును సంరక్షించుటకు అవసరమైన సమస్తమును అనగా వస్త్రములు మరియు పాదరక్షలు, ఆహారము మరియు పానీయము, ఆస్తి మరియు ఇల్లు, భర్త లేక భార్య మరియు పిల్లలు, భూమి, పశువులు మరియు నేను కలిగియున్న సమస్తమును అనుదినము సమృద్ధిగా దయచేయుచున్నాడని నేను నమ్ముచున్నాను. ఇంతేగాక దేవుడు సకలాపాయములనుండి నన్ను తప్పించుచు, కీడులన్నిటినుండి నన్ను కాయుచు సంరక్షించుచున్నాడు. దేవుడు ఇవి యావత్తు నా పుణ్యమునుబట్టియు, నా యోగ్యతనుబట్టి యు గాక  పరలోకమందున్న తండ్రి తన మంచితనము వలనను, కృపవలనను, మాత్రమే దయచేయు చున్నాడు. కాబట్టి నేనీ సమస్తమును గూర్చి ఆయనకు కృతజ్జ్యతను అగపరచి ఆయనను స్తుతించి, సేవించి ఆయనకు లోబడుటకు బద్ధుడను.

ఇది వాస్తవమే.

రెండవ అంశము

(విమోచనము)

ఆయన ఏక కుమారుడును, మన ప్రభువైన, యేసుక్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయ బడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకెక్కి, సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడిచేతివైపున కూర్చుండియున్నాడు. సజీవుల కును, మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను.

దీనికి అర్ధమేమి?

నిత్యత్వమందు తండ్రి కనిన, నిజమైన దేవుడును, మరియయను కన్య యందు పుట్టిన, నిజమైన మనుష్యుడు నైన యేసుక్రీస్తు నా ప్రభువై యున్నాడని నేను నమ్ముచున్నాను.

తప్పిపోయి శిక్షకు విధింపబడిన జీవినైన నన్ను ఈయన వెండి, బంగారంల చేతగాక, వెలలేని తన పరిశుద్ధమైన రక్తము చేతను తాను పొందిన నిరపరాధ శ్రమ మరణములచేతను, సమస్త పాపముల నుండియు మరణము నుండియు సాతాను అధికారము నుండియు విమోచించి, కొని మరియు నన్ను గెలుచుకొనెను.

ఆయన మరణము నుండి లేచి నిరంతరము బ్రదికి  యేలుటను బట్టి, నేనును ఆయన వాడనైయుండి ఆయన రాజ్యములో ఆయన క్రింద బ్రదికి మరియు నిత్యమైన నీతిలో, నిర్దోషత్వములో, ధన్యతలో ఆయనను సేవించుటకు ఆయన యిదంతయు చేసెను.

ఇది వాస్తవమే. 

మూడవ అంశము

(పరిశుద్ధపరచుట)

పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్దుల ఐక్యమును, పాపక్షమాపణయు; శరీర పునరుత్థాన మును నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమేన్.

దీనికి అర్ధమేమి?

నేను నా స్వంత ఆలోచన వలనైనను లేక నా స్వంత నిర్ణయము వలననైనను, నా ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మికయుంచలేననియు లేక ఆయన యొద్దకు జేరనేలేననియు నమ్ముచున్నాను.

కాని పరిశుద్దాత్మ సువార్త వలన నన్ను పిలిచి, తన వరముల వలన నన్ను వెలిగించి, నన్ను పరిశుద్ధపరచి మరియు నిజమైన విశ్వాసమునందు నన్ను ఉంచెను. ఈలాగుననే ఆయన భూమి మీదనున్న సమస్త క్రైస్తవ సంఘమును పిలచి, తన చెంతచేర్చి, వెలిగించి, పరిశుద్ధపరచి నిజమైన ఏక విశ్వాసమందు యేసుక్రీస్తుతో ఉంచు చున్నాడు.

ఆయన ఈ క్రైస్తవ సంఘములో నా యొక్కయు, విశ్వాసులందరి యొక్కయు సమస్త పాపములను అనుదినము సంపూర్ణముగా క్షమించుచున్నాడు.

ఆయన అంత్యదినమందు నన్నును చనిపోయినవారి నందరిని లేపి మరియు నాకును క్రీస్తునందు విశ్వాస ముంచు వారందరకును నిత్య జీవము దయచేయును.

ఇది వాస్తవమే.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.