ప్రభువు ప్రార్ధన దాని అర్ధము

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.

సంబోధన
పరలోకమందున్న మా తండ్రీ.
దీనికి అర్ధమేమి?

ఆయన మనకు నిజమైన తండ్రియనియు మరియు మనమాయన నిజమైన పిల్లలమనియు నమ్మవలెనని ఈ మాటలతో దేవుడు మనలను వాత్సల్యముతో ఆహ్వానించుచున్నాడు, కావున ప్రియులైన పిల్లలు తమ ప్రియమైన తండ్రిని అడుగులాగున మనము ధైర్యముతోను మరియు నిశ్చయముతోను ఆయనను ప్రార్దించుదము.

మొదటి మనవి
నీ నామము పరిశుద్ధ పరచబడు గాక.
దీనికి అర్ధమేమి?

దేవుని నామము వాస్తవముగా దానంతట అదే పరిశుద్ధమైయున్నది, అయినను మనము కూడ దానిని పరిశుద్ధ ముగా ఉంచున్నట్లు ఈ మనవిలో ప్రార్ధించుచున్నాము.

దేవుని నామము పరిశుద్ధముగా ఎట్లు ఉంచబడును?

ఆయన వాక్యము సత్యముగా, శుద్ధముగా భోధింపబడినప్పుడు మరియు మనము దేవుని పిల్లలముగా దాని ప్రకారము పరిశుద్ధముగా జీవించునప్పుడు దేవుని నామము పరిశుద్ధముగా ఉంచబడును. పరలోకమందున్న ప్రియమైన తండ్రీ! ఈలాగు చేయుటకు మాకు సహాయము చేయుము, అయినను దేవుని వాక్య ప్రకారము భోధింప కయు, జీవింపకయు నుండువాడు మన మధ్య దేవుని నామమును అగౌరవపరచుచున్నాడు. పరలోకమందున్న ప్రియమైన తండ్రీ! మే మీలాగు చేయకుండా మమ్మును కాపాడుము.

రెండవ మనవి
నీ రాజ్యము వచ్చు గాక.
దీనికి అర్ధమేమి?

దేవుని రాజ్యము వాస్తవముగా మన ప్రార్ధన లేక దానంతట అదే వచ్చును గాని అది మన వద్దకు కూడా రావలె నని ఈ మనవిలో ప్రార్ధించుచున్నాము.

దేవుని రాజ్యము ఏ విధముగా వచ్చును?

మనము ఆయన కృపవలన ఆయన పరిశుద్ధ వాక్యమును నమ్మి ఇప్పుడు భూమి మీదను మరియు పరలోక మందు ఎల్లప్పుడును దైవికమైన జీవితమును జీవించుటకు పరలోకమందున్న తండ్రి మనకు తన పరిశుద్దాత్మను దయచేసినప్పుడు దేవుని రాజ్యము వచ్చును. 

మూడవ మనవి
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.
దీనికి అర్ధమేమి?

దేవుని మంచి కృపగల చిత్తము మన ప్రార్ధన లేకయే వాస్తవముగా జరుగుచున్నది. అయినను, అది మన మధ్య గూడ జరగవలెనని ఈ మనవిలో ప్రార్ధించుచున్నాము.

దేవుని చిత్తము ఎలాగు నెరవేరును?

దేవుని నామము పరిశుద్ధముగా ఉంచుటకును మరియు ఆయన రాజ్యము వచ్చుటను ఆపుచేయుటకు ప్రయత్నము చేయు సాతాను, లోకము, మన పాప శరీరము యొక్క ప్రతి దుష్టాలోచనను మరియు ఉదేశ్యమును ఆయన భగ్నపరచి మరియు ఓడించినప్పుడు దేవుని చిత్తము నెరవేరును. మనము జీవించునంత కాలము ఆయన తన వాక్యమందును మరియు విశ్వాసమునందును మనలను బలపరచి, స్థిరముగా ఉంచినప్పుడు దేవుని చిత్తము నెరవేరును. ఆయన మంచి కృపగల చిత్తమిదే.

నాల్గవ మనవి
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.
దీనికి అర్ధమేమి?

దేవుడు నిశ్చయముగా మనము అడుగకుండానే సకల దుర్మార్గులకు కూడా దినాహారమును దయచేయు చున్నాడు. కాని మనము దీనిని జ్యాపకము చేసుకొనుటకు మరియు మన అనుదినాహారమును కృతజ్జ్యతతో పుచ్చుకొనునట్లు ఆయన మనలను నడిపించవలెనని ఈ మనవిలో ప్రార్ధించుచున్నాము.

అనుదిన ఆహారము అనగా నేమి?

మన శరీరక్షేమమునకు అవసరమైన సమస్తమును అనగా, ఆహారము మరియు పానీయము, వస్త్రములు మరియు పాదరక్షలు, ఇల్లు మరియు ఆవరణము, భూమి మరియు పశువులు, డబ్బు మరియు సొత్తులు, దైవికమైన భర్త లేక భార్య, దైవికమైన పిల్లలు, దైవికమైన పనివారు, దైవికమైన మరియు నమ్మకమైన నాయకులు, మంచి ప్రభుత్వము, మంచి వాతావరణము, శాంతిసమాధానము, ఆరోగ్యము, మంచి పేరు, మంచి స్నేహితులు, నమ్మకమైన పొరుగువారు మొదలగునవి దినాహారమనబడును.  

ఐదవ మనవి
మా యెడల పాపము చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా పాపములను క్షమించుము.
దీనికి అర్ధమేమి?

మనము అడుగునవి ఏమైనను పొందుటకు యోగ్యులము కాము మరియు వాటిని కలిగియుండ తగము, కాని కృపచేత ఆయన వీటనన్నిటిని మనకివ్వవలెనని మనము అడుగుచున్నాము; ఎందుకనగా మనము అనుదిన ము విస్తారముగా పాపముచేసి నిశ్చయముగా ఏమియు పొందతగము కాని శిక్షను మాత్రమే పొందవలసి యున్నా ము. గనుక పరలోకమందున్న మన తండ్రి మన పాపములను చూడకుండునట్లును లేక వానిని బట్టి మన ప్రార్థనలను త్రోసివేయకుండునట్లును ఈ మనవిలో ప్రార్ధించుచున్నాము.

అలాగుననే మనకు విరోధముగా పాపము చేయువారిని పూర్ణ హృదయముతో క్షమించి మరియు సంతోషముతో వారికి మేలును చేయుదుము.

ఆరవ మనవి
మమ్ము శోధనలోనికి తేకుము.
దీనికి అర్ధమేమి?

దేవుడు నిశ్చయముగా ఎవరిని పాపమునకు శోధింపడు, గాని సాతాను, లోకము, మన పాపశరీరము మనలను మోసపుచ్చక లేక మనలను అవిశ్వాసము, నిరాశ మరియు ఇతర గొప్ప మరియు అవమానకరమైన పాపము లకు నడుపక దేవుడు మనలను కాయవలెనని మరియు సంరక్షించవలెనని ఈ మనవిలో మనము ప్రార్ధించు చున్నాము మరియు మనము వాటి చేత శోధింపబడినను, మనము వాటిని అధిగమించి జయించునట్లు ప్రార్ధించు చున్నాము.

ఏడవ మనవి
కీడు నుండి మమ్మును తప్పించుము.
దీనికి అర్ధమేమి?

మన పరలోకమందున్న తండ్రి మన శరీరమునకును మరియు ఆత్మకును, ఆస్తి మరియు ఘనతను బెదిరించు ప్రతి కీడునుండి మనలను విడిపించి మరియు తుదకు మన అవసాన కాలమందు, ఆశీర్వాదకరమైన ముగింపును దయచేసి ఈ దుఃఖలోకము నుండి కృపతో పరలోకములో తన యొద్దకు తీసుకొనవలెనని యీ ముగింపు మనవి లో ప్రార్ధించుచున్నాము.

స్తుతి
రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవియై యున్నవి. ఆమేన్.
దీనికి అర్ధమేమి?

యీ మనవులు మన పరలోకమందున్న తండ్రికి అనుకూలముగా నున్నవనియు మరియు ఆయన ఆలకించు నను నిశ్చయతను మనము కలిగియున్నాము, ఎందుచేతననగా ఇట్లు ప్రార్దిపవలెనని ఆయనే మనకాజ్ఞాపించి మరియు ఆయన వాటిని ఆలకించుదునని వాగ్దానము చేసెను. కాబట్టి మనము “ఆమేన్, నిజముగా అలాగు జరుగునని” చెప్పుదుము.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.