తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు

కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.

తాళపు చెవులు

మొదటిది: తాళపు చెవుల వలన ఉపయోగమేమి?

తాళపు చెవుల వలన ఉపయోగమేమనగా, అది క్రీస్తు భూమిపైనున్న తన సంఘమునకు పశ్చాత్తాప్తులైన పాపులకు వారి పాపములను క్షమించుటకును, పశ్చాత్తాపము పొందని వారికి వారు పశ్చాత్తాపము పొందని స్థితిలో ఉన్నంత వరకు పాప క్షమాపణను ఇవ్వకుండా తిరస్కరించుటకును, ఇచ్చిన తన ప్రత్యేకమైన అధికారమును హక్కునై యున్నది.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడియున్నది? 

[యేసు] ఈ మాట చెప్పి [ఆయన శిష్యుల] మీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచి యుండునని వారితో చెప్పెను అని పరిశుద్ధ సువార్తికుడైన యోహాను తన సువార్త 20:22,23 వచనాలలో వ్రాసెను.

తాళపు చెవులు బహిరంగముగా వాడుట

రెండవది: క్రైస్తవ సంఘము తాళపు చెవులను ఏ విధముగా ఉపయోగించును?

ఎవరైతే తమ పాపములను బట్టి పశ్చాత్తాపపడుదురో మరియు మళ్లుకొనుటకు ఇష్టపడుదురో వారిని క్షమించుటకును మరియు పాపముల విషయమై స్పష్టముగా పశ్చాత్తాపము పొందక ఉన్నవారి విషయములో వారు పశ్చాత్తాపము పొందు నిమిత్తము వారిని సంఘము నుండి బహిష్కరించుటకును క్రైస్తవ సంఘము తమ సేవకై పిలువబడిన క్రీస్తు సేవకునితో క్రీస్తు ఆజ్జ్య ప్రకారము, తాళపు చెవులను వాడును.

ఇది జరిగినపుడు, మన ప్రియ ప్రభువైన క్రీస్తు ఆయనే మన యెడల జరిపించినట్లుగా పరలోకమందు ఇది సరియైనదియును నిక్కమైనదనియు నేను నమ్ముచున్నాను.

దీనిని గూర్చి ఎక్కడ వ్రాయబడియున్నది?

భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు మత్తయి సువార్త 18:18 నందు చెప్పెను.

ఒప్పుకోలు

మొదటిది: ఒప్పుకోలు అనగానేమి?

ఒప్పుకోలు రెండు భాగములు కలిగియున్నది. మొదటిగా, మనము మన పాపములను ఒప్పుకొందుము; రెండవదిగా, దేవుడు తనకు తానే ప్రకటించినట్లుగా, పాస్టర్ గారి నుండి మనము పాపక్షమాపణను లేక క్షమాపణను పుచ్చుకొందుము. మన పాపములు పరలోకమందున్న దేవుని ఎదుట క్షమింపబడి యున్నవని సందేహించక, దృఢముగా నమ్మవలెను.

రెండవది: మనము ఏయే పాపములను ఒప్పుకొనవలెను?

దేవుని ఎదుట మన పాపములన్నిటిలో మనము అపరాధులమని ఒప్పుకొనవలెను. మనము ఎరిగియుండని పాపములనైనను, ప్రభువు ప్రార్థనలో వేడుకొనునట్లు ఒప్పుకొనవలెను.

కాని పాస్టర్ గారి ఎదుట మనకు తెలిసిన మరియు మన హృదయములో భావించుచున్న మన పాపములను మాత్రమే మనము ఒప్పుకొనవలెను.

మూడవది: మనము యెట్లు ఈ పాపములను గుర్తించెదము?

పది ఆజ్జ్యల ప్రకారము జీవితములో నీకు ఏ స్థానమున్నదో గమనించుము. నీవు తండ్రివా, తల్లివా, కుమారుడవా, కుమార్తేవా, ఉద్యోగివా, లేక యజమానివా? నీవు అవిధేయుడవుగానో, నమ్మకరహితుడవుగానో లేక సోమరిగానో ఉన్నావా? మాటద్వారా గాని, క్రియద్వారా గాని, నీవు ఎవరినైనా గాయపరచితివా? అవినీతిపరుడవుగా గాని, అజాగ్రత్తగా గాని వృధాపుచ్చుట నైనను మరి ఏవిధముగా నైనను నీవు తప్పు చేసితివా?

నాల్గవది: పశ్చాత్తాప్తుడైన పాపికి పాస్టర్ గారు పాప క్షమాపణను యెట్లు ధ్రువపరచును?

“క్రీస్తు ఇచ్చిన అధికారమును బట్టి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుధ్ధాత్మయొక్కయు నామమున నీ పాపములు క్షమించుచున్నాను ఆమెన్,” అని అతడు చెప్పును.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.