పాత నిబంధన పాఠము: ఆదికాండము 22:1-18; పత్రిక పాఠము: రోమా 8:31-39; సువార్త పాఠము: మార్కు 1:12-15; కీర్తన 6.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ఆదికాండము 22:1-14

అబ్రాహాము విషయములో ఇది పరిశోధనే అని దేవునికి తెలుసు, ఈ వాక్యభాగాన్ని చదివిన మనకు తెలుసు, కాని ఇది అబ్రాహాముకు తెలియదు. పరిశోధన  దేవుని పట్ల మనకున్న మన నిబద్ధతను పరీక్షిస్తూ, దానిలో భాగముగా సరైనదాన్ని ఎన్నుకునేలా ప్రేరేపించడమే కాకుండా నిర్ణయాత్మకమైన దృఢమైన నిశ్చయమైన  విశ్వాసాన్ని చూపెట్టేందుకు కారణమౌతుంది. కాబట్టే దేవుడు అబ్రాహామును చూచి, నీవు దేవునికి భయపడు వాడవని” అతనిని గూర్చి సాక్షమిచ్చాడు. దేవుడు తన భక్తుని గురించి ఆలా చెప్పడానికి అసలేం జరిగిందో మన పాఠమును చూధ్ధాం. దేవునికి భయపడువాడు అంటే దేవునికి లోబడుతూ ఆయన చిత్తాన్ని మాత్రమే వెంబడించువాడు అని అర్ధం. అబ్రాహాము ఏవిధముగా దేవునికి లోబడుతూ ఆయన చిత్తాన్ని వెంబడించాడో 1,2 వచనాలను పరిశీలించి తెలుసుకొందాం.

1,2 వచనాలను చదువుకొందాం_ 1ఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన–అబ్రాహామా, అనిపిలువగా అతడు–చిత్తము ప్రభువా అనెను. 2అప్పుడాయన–నీకు ఒక్కడై యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయాదేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాడు.

ఈ వచనంలో మనం మొదటిగా అర్ధం చేసుకోవలసిన విషయమేమిటంటే అబ్రాహాము విశ్వాసము ఎంత బలమైనదో లేక ఆతని లోని విశ్వాసము ఎంతవరకు తట్టుకోగలదో చూడడానికి దేవుడు ప్రయత్నించడం లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసి ఉన్నాం. దేవుడు మన అందరి హృదయాలలోనికి చూడగలడు. మన విశ్వాసము బలమైనదో బలహీనమైనదో ఆయనకు తెలుసు. మరి దేవుడు అబ్రాహామును పరిశోధించెను అని చెప్పడంలో గ్రంధకర్తయైన మోషే యేమని చెప్తున్నాడంటే, పరిశోధించుట దేవుని వైపు నుండి వచ్చిందని, దేవునిపై ఆధారపడే విషయములో సహాయము చేయుటకొరకై రూపొందించబడిందని చెప్తున్నాడు. పరిశోధించడం అంటే ఒక వ్యక్తికి సరైనదాన్ని ఎన్నుకునే అవకాశం ఇవ్వడం. పరిశోధించుట “ఒకనిలోని నాణ్యతను నిరూపించే ప్రయత్నాన్ని సూచిస్తుంది”అని కొందరు చెప్తుంటారు. ఏదిఏమైనా పరిశోధించుట దేవునికి దగ్గర చేస్తుంది అని మాత్రం చెప్పొచ్చు.

దేవుడు అబ్రాహామును పరిశోధించెను అను మాటలలో పరిశోధించెను అనేమాట హీబ్రూ భాషలో అభివృద్ధిపరచుట అనే ఉద్దేశములో వాడబడింది. అంటే గ్రంధకర్తయైన మోషే యేమని చెప్తున్నాడంటే, దేవుడు అబ్రాహామును మోరియా దేశమునకు పంపుట ద్వారా అతనిని విశ్వాసమునందు బలపరచెను అని చెప్తూవున్నాడు.

2 వ వచనంలో _ అప్పుడాయన–నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసి కొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, ఇక్కడ దేవుడైన యెహోవా, specificgaa, నీకు ఒక్కడై యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును బలిగా నర్పించుమని అడిగాడు.

అబ్రాహాము ఇస్సాకును ప్రేమించడమే కాదు, ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రాహాముకు వారసులను ఇస్తానని వాగ్దానం చేశాడు (21:12). అబ్రాహాముకు తన వృద్ధాప్యంలో ఉన్న ఈ కొడుకు కంటే విలువైనది ఏదీ లేదు. దేవుడు అబ్రాహాము నుండి ఏమి అడుగుతున్నాడో అర్థం చేసుకోవడంలో ఇది ఎంతో కీలకం. అబ్రాహాము దేవునికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన అర్పణను ఇవ్వమని దేవుడు కోరుతున్నాడు. ఇస్సాకును అమితముగా ప్రేమిస్తున్న అబ్రాహాము దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనే దానికి ఇది పరీక్ష.

ఆ పరీక్షలో భాగముగా దేవుని మాటలెంత కఠినముగా ఉన్నాయో తెలుసా? ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు అదే ప్రాణాన్ని క్రూరమైన పద్దతిలో తిరిగి తనకివ్వమని ఆజ్జ్యపించియున్నాడు. ఇస్సాకును తన కొరకు చంపి దహనబలిగా అర్పించుమని అడుగుతున్నాడు. 

దేవునిపై ఆధారపడిన మీరు మీ జీవితాలలో సరిఅయిన దానిని ఎన్నుకొనేలా దేవుడు మిమల్ని పరిశోధించి నప్పుడు మిమల్ని అభివృద్ధిపరచాలని, విశ్వాసమునందు బలపరచాలని ఆయన ఆశపడుతూ మనలను పరిశోధించినప్పుడు, అవి శోధనలనుకొని పొరబడ్డారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. లేదా ఆ పరిశోధనలో ఉన్న కష్టాన్నిబట్టి సణుగుకొంటూ, మీముందు ఉంచబడిన సరియైన అవకాశాన్ని గుర్తించడంలో ఎన్నుకోవడంలో ఎన్నిసార్లు విఫలం చెందియున్నారో తెలుసా. మిమ్మల్ని అభివృద్ధి పరచాలని మీతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, ఇలాచెయ్యి ఆలా చెయ్యి అని దేవుడు మీతో మాట్లాడినప్పుడు, మీలో కొంతమంది ఆ మాటలను లెక్కచేసి ఉండకపోవొచ్చు. మరికొందరు అందులోవున్న కష్టాన్ని బట్టి సరియైన దానిని ఎన్నుకొని ఉండక పోవొచ్చు, కొందరు వెనుకకు తిరిగి ఉండొచ్చు.

మన పాఠములో దేవుడు, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయాదేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని చెప్పాడు. అబ్రాహాము తన కుమారుని తీసుకొని మోరియా దేశమునకు బయలుదేరాలి, ఇది కొన్ని నిమిషాల ప్రయాణము కాదండి 3రోజుల ప్రయాణమిది. దేవునికి భయపపడువాడు విశ్వాసముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు, అబ్రాహాము విశ్వాసముతో దేవునిచిత్తాన్ని ఏవిధముగా నెరవేర్చడా నికి ప్రయత్నించాడో 3-5 వచనాలను పరిశీలించి తెలుసుకొందాం.   

3-5_3తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను. 4మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి 5తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు).

ఇక్కడ రెండు విషయాలు గమనించవలసి ఉన్నాం_ 1. తన కుమారుని వెంటబెట్టుకొని, దేవుని నిర్ణయానికి ఆజ్జ్యకు కట్టుబడి అబ్రాహాము ఆలస్యము చెయ్యలేదు, వెనుకాడలేదు, ఫిర్యాదు చెయ్యలేదు, వేడుకోలేదు, కనీసం ప్రశ్నించను కూడా లేదు బయలుదేరాడు. 2. మోరియా పర్వతము దగ్గర కర్రలు దొరకక పోతే అని అలోచించి తమతో పాటుగా కర్రలను తీసుకొని వెళ్ళాడు. కర్రలను చీల్చడం అంటే అబ్రాహాము తన చేతులు మరియు మనస్సును దేవుని మాటలపై ఎలా కేంద్రీకరించాడో చూడండి.  బయలు దేరి గమ్యానికి నడవడం అంటే  faith on wheels ని చూడండి. ఇలా చెయ్యాలంటే దేవుని పట్ల ఎంతో విశ్వాసము నమ్మకము ప్రేమ ఉండాలి.

ఎందుకని దేవుడు అబ్రాహాముకు 3రోజుల ప్రయాణాన్ని నిర్దేశించాడు? అబ్రాహాము విధేయత క్షణికమైన ఉత్సాహమును నుండి వచ్చినది కాకుండా హృదయపూర్వకముగా లోబడినవాడై, సంపూర్ణమైన విధేయత నుండి వచ్చినదైయుండాలనే దేవుడు 3రోజుల ప్రయాణాన్ని అబ్రాహాముకు నిర్ణయించాడు. మూడు రోజుల ప్రయాణం అబ్రాహాముకు ఆలోచించడానికి చాలా సమయం ఇచ్చింది. అబ్రాహాము తన సొంత కొడుకు ప్రాణాలను తీయకుండా సాతాను ఎన్నో తార్కికమైన  కారణాలను అబ్రాహాముకు ఇచ్చివుండొచ్చు.

4మూడవనాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి_ అబ్రాహాము మొదటిసారిగా తన కన్నులెత్తి తన కొడుకు మరణించబోతున్న స్థలాన్ని చూసాడు. గుండె పగిలే సన్నివేశమిది. 

5తన పనివారితో–మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు).

అబ్రాహాము ఎందుకు తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి (ముందుకు వెళ్లారు). అందుకు 2కారణాలు ఉండొచ్చు. దేవుని ఆజ్జ్య, ఇస్సాకును దహనబలిగా అర్పించడం. ఇవేవి వాళ్లకు అర్ధంకాదు వాళ్ళు భయపడొచ్చు. అలాగే వాళ్ళు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వాళ్ళు ఇస్సాకును బలి ఇవ్వకుండా అబ్రాహామును ఆపొచ్చు. కాబట్టి అబ్రాహాము వాళ్ళను ఆగిపోమ్మనివుండొచ్చు. విచక్షణను కోల్పోని వివేకాన్ని అబ్రాహాము చూపించడం నిజంగా మెచ్చుకోదగిన అంశము.

అబ్రాహాముతో ఉన్న వారందరికీ తెలుసు తామంతా దహన బలిని అర్పించుటకు వచ్చియున్నామని. అట్లే వాళ్ళ దగ్గర ఆ దహనబలికి అవసరమైన గొర్రెపిల్ల లేదనే విషయం కూడా వాళ్లకి తెలుసు. ఇప్పుడేమో కర్రలు ఇస్సాకును తీసుకొని అబ్రాహాము పర్వతం పైకి వెళ్తున్నాడు, గొర్రెపిల్ల లేకుండా. వాళ్లలో ఎక్కడో చిన్న సందేహము ఉండొచ్చు. కాబట్టి అబ్రాహాము తన సేవకులకు భరోసా ఇస్తూ అసాధారణమైనదేది జరుగదని తిరుగు ప్రయాణం కూడా అసాధారణమైనదిగా ఉండదని చెప్పడానికి ఇలా చెప్పివుండొచ్చని కొందరు చెప్తుంటారు.

కాని నిజానికి ఈ భయంకరమైన పరిస్థితినుండి దేవుడే తనకు ఒక మార్గం చూపిస్తాడని నమ్ముతూ మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పడం ద్వారా అబ్రాహాము దేవునియందు తనకున్న నిశ్చయతను తెలియజేస్తూ ఉన్నాడు.  విశ్వాసిగా అబ్రాహామును ఈ ప్రయాణములో ఒక ప్రశ్న చాల ఇబ్బంది పెట్టి ఉండొచ్చు.

అదేంటంటే, దయగల దేవుడు తానే ఇస్సాకు ద్వారా మెస్సయ్యను వాగ్దానము చేసిన తరువాత ఇస్సాకును ఎలా చంపమని ఆజ్జ్యపిస్తాడు? అనే ప్రశ్న. కాని అతని విశ్వాసము ఇస్సాకును చంపమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను ఆయనకు విధేయతను చూపించాలి. చూపిస్తే, దేవుడు దహనబలిగా అర్పింపబడి యున్న ఇస్సాకును ఆ బూడిద నుండి తిరిగి జీవానికి తీసుకువస్తాడు మేము ఇద్దరం తిరిగి వస్తాం అను ఉద్దేశములో అబ్రాహాము వారితో ఆలా చెప్పాడని హెబ్రీపత్రిక చెప్తూవుంది

విధేయత ఎప్పుడూ కూడా దేవుని మంచితనము మీద నమ్మకముంచేటట్లు చేస్తుంది కాబట్టే ఆయనయందు భయభక్తులుగలవారి నిమిత్తము ఆయన దాచి యుంచిన మేలు యెంతో గొప్పది అని ఆ కష్టములొ అబ్రాహాము నమ్మాడు. అంతేనా యెహోవాయందు నమ్మికయుంచువానిని కృప ఆవరించును కాబట్టి తనపట్ల దేవునికున్న కనికరాన్ని బట్టి యెహోవాను నమ్ముకొనుట ధన్యతగా ఎంచి యెహోవాయందు నమ్మికయుంచి భయపడక, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను యెహోవా నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు అనే ధైర్యముతో, యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయనే అన్ని విషయములలో వారికి  తోడుగాఉండును అనే నిబ్బరంతో మోరియా పర్వతాన్ని ఎక్కుతూ విశ్వాసిగా తన విశ్వాసమును ఏ విధముగా అబ్రాహాము ప్రదర్శిస్తున్నాడో చూడండి.

  1. విశ్వాసిగా మనమందరం కష్టాలలో వున్నప్పుడు మనతండ్రియైన దేవునిమంచితనము మీద నమ్మిక ఉంచుతు ఉన్నామా?
  2. కష్టములొ ఆయన మన కొరకు దాచివుంచిన మేలు ఎంతో గొప్పది అని విశ్వాసముతో ముందుకు వెళ్తున్నామా?
  3. కష్టాలలో కూడా దేవుని కృప మనలను ఆవరించివున్నదనే విషయాన్ని మర్చిపోతున్నామా?
  4. అన్ని వేళల దేవునిని నమ్ము కొనుట ధన్యతగా భావిస్తూ ఉన్నామా?
  5. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను యెహోవా నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు అనే ధైర్యము మీకుందా?
  6. యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయనే అన్ని విషయములలో వారికి  తోడుగాఉండును అనే నిబ్బరం మీకుందా? పరిశీలించుకోండి.

దేవునికి భయపడువాడు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతిదానిని దేవుని చిత్తానికి వదిలి వేస్తాడు. అబ్రాహాము ఏవిధముగా దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతిదానిని దేవుని చిత్తానికి వదిలివేసాడో 6-10 వచనాలను పరిశీలించి తెలుసుకొందాం.      

6దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా 7ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో–నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు–ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు–నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా 8అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను. 9ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను. 10అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా.

అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు తన బలి కొరకు తానే కర్రలను మోయడం అబ్రాహాముకు ఎంతటి దుఃఖమును కలిగించి యుండునో కదా. యెహోవా కోసం చక్కటి గొర్రెపిల్ల కావాలి, అంటే ఎలాంటి లోపము లేనిది, ఆ విషయాన్నే ఇస్సాకు అబ్రాహాముకు గుర్తుచేస్తూ దహన బలికి కర్రలు అంతదూరం నుండి తెచ్చాము. మన మందలో నుండి మంచి లోపములేని గొర్రెను తెచ్చివుంటే బాగుణ్ణు ఇప్పుడు ఇక్కడ ఎలా మంచి లోపములేని గొర్రెను కనుగొనగలం? అనే ఉద్దేశములో, తండ్రి, నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహన బలికి గొఱ్ఱెపిల్ల ఏది? అని అడిగాడు. దహనబలిని అర్పించడానికి వెళ్తున్నాం, కాని మా దగ్గర గొర్రెపిల్ల లేదు ఏదో తప్పు జరుగుతుంది అని ఇస్సాకు అనుకొని ఉండొచ్చా? తానే దహన బలినని ఇస్సాకుకు అనిపించి వుండొచ్చా? మనకు తెలియదు. అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని జవాబు చెప్పాడు. ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఇస్సాకు తన తండ్రిని వెంబడించడం ఒక్కటే మనం చూస్తున్నాం.

ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. అంటే అబ్రాహాము తన కొడుకును బలిగా అర్పించడానికి step by step చక్కగా బలిపీఠాన్ని కట్టాడు తప్ప వెనుకాడలేదు, సంకోచించలేదు, దేవా ఇంకా ఈ పరీక్ష చాలు అని వేడుకోలేదు, ప్రాధేయపడలేదు. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచాడు. యవ్వనస్థుడైన ఇస్సాకు వృద్దుడైన తన తండ్రి తనను బంధించడానికి అనుమతించి వున్నాడు.  

ఇక్కడ ఇస్సాకు యొక్క విధేయత ఆశ్చర్య పరచుచున్నది, ఇస్సాకులో భయము లేదు. తన తండ్రితో పెనుగులాడలేదు. అతడు తన తండ్రినుండి తప్పించుకొని ఉండొచ్చు. కాని ఇస్సాకు అలా చెయ్యలేదు. తన తండ్రికి సంపూర్ణమైన విధేయతను చూపించాడు, తన తండ్రి చిత్తానికి సంపూర్ణముగా లోబడ్డాడు. 

11యెహోవాదూత పరలోకమునుండి–అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు–చిత్తము ప్రభువా అనెను. 12అప్పుడు ఆయన–ఆ చిన్నవానిమీద చెయ్యివేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడై యున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందు వలన నాకు కనబడుచున్న దనెను. 13అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని యున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. 14అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత–యెహోవా పర్వతముమీద చూచుకొనును అని నేటివరకు చెప్పబడుచున్నది.

కాబట్టే హెబ్రీయులకు 11: 17-19 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ అబ్రాహాము, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యెంచినవాడై, తన యేకకుమారుని అర్పించి, ఉపమానరూపముగా అతనిని మృతులలోనుండి మరల పొందెను అని చెప్తూవుంది.

దేవునికి భయపడటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం దేవునికి భయపడే వ్యక్తి దేవుడేం చెవుతున్న చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు. యెహోవా చేసిన గొప్ప కార్యములను చూచి  యెహోవాకు భయపడి యెహోవాయందు నమ్మకముంచడమే కాదు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, ఇతర దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించడం, పరిస్థితులు ఎంతటి కఠినములైనను.

ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును అను నిశ్చయతను కలిగి ఉండండి యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టు వారిమీదను ఎల్లప్పుడూ నిలచే ఉంటుంది (కీర్తన 33:18).

దేవునికి భయపడటం అంటే ఆయనను మాత్రమే సేవించడం అని బైబులు ద్వితీయోపదేశకాండము 6:13 చెప్తూవుంది.

దేవునికి భయపడటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించడం అని అర్ధం  (ద్వితీయోపదేశకాండము 28:58). యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము అని (సామెతలు 1: 7).చెప్తూవుంది అంటే దేవునికి భయపడే వ్యక్తి దేవుడేం చెవుతున్న చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడని అర్ధం. దేవునికి భయపడటం అంటే యెహోవా చేసిన గొప్ప కార్యములను చూచి  యెహోవాకు భయపడి యెహోవాయందు నమ్మకముంచడం అని అర్ధం (నిర్గమకాండము 14:31). దేవునికి భయపడటం అంటే యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, ఇతర దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించడం, పరిస్థితులు ఎంతటి కఠినములైనను అని అర్ధం (యెహోషువ 24:14). ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును అను నిశ్చయతను కలిగి ఉండడం అని అర్ధం (లూకా 1:50). యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులుగలవారిమీదను ఆయన కృపకొరకు కనిపెట్టువారిమీదను ఎల్లప్పుడూ నిలచే ఉంటుంది (కీర్తన 33:18). ఆమెన్.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.