పాత నిబంధన పాఠము: ఆదికాండము 28:10-17; పత్రిక పాఠము: రోమా 5:1-11; సువార్త పాఠము: మార్కు 8:31-38; కీర్తన 73.
సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: ఆదికాండము 28:10-17
10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. 12అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశము నంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 13మరియు యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును తూర్పుతట్టును ఉత్తరపుతట్టును దక్షిణపుతట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. 15ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా 16యాకోబు నిద్ర తెలిసి–నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని 17భయపడి–ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమేగాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను.
బేతేలులో యాకోబుకు దేవునితో జరిగిన ఆశ్చర్యకరమైన ఎన్‌కౌంటర్, మన జీవిత ప్రయాణంలో వ్యక్తులుగా, సంఘాలుగా అనుకోకుండా దేవునిని ఎక్కడ కలుసుకొంటాము అనే దాని గురించి ఆలోచించమని చెప్తున్నట్లుగా ఉంది. ఏశావు యొక్క ద్వేషం నుండి తప్పించుకొని పారిపోతూవున్నప్పుడు దారిలో యాకోబుకు దేవుడు కనిపించాడు (ఆది 27:41-45). యాకోబు పారిపోవడానికి కారణం ఏశావుకు చెందిన జన్మహక్కును (ఆది 25:29-34) మరియు ఆశీర్వాదములను (ఆది 27:1-40) దొంగిలించటమే. కుటుంబ హోదాను యాకోబు పట్టుకోవడంతో అది యాకోబును ప్రమాదములోనికి నెట్టింది, కుటుంబము నుండి దూరం చేసింది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతడు తన ప్రియమైన తల్లి రెబెకాను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి (అంటే దక్షిణం నుండి) ఉత్తరాన ఉన్న హారానుకు ప్రయాణిస్తూ వున్నాడు. హారానులోని తమ స్వస్థలం నుండి అతని పితరులు దేవుడు వారి సంతతికి వాగ్దానం చేసిన దేశానికి విశ్వాసంతో ప్రయాణిస్తే ఇతడు తిరిగి వారి స్వస్థలానికి వెళ్తువున్నాడు (ఆదికాండము 12:1-9). ప్రయాణం మధ్యలో, రాత్రిపూట కారణంగా విశ్రాంతికి అతడు ఎంచుకున్న సైట్‌లో, యాకోబు తన జీవితాన్ని మార్చే ఒక అసాధారణమైన కల కన్నాడు. దేవుడు యాకోబుకు కూడా చేరువవుతున్నాడు. నేడు మనలో చాలా మంది దేవుని నుండి వినాలను కుంటున్నాం. మనకు కూడా భరోసా కావాలి, దిశానిర్దేశం కావాలి, పనులు జరిగేలా హామీలు కావాలి. మనకు కూడా బేతేలు కావాలి. యాకోబు కథ బైబిల్ యొక్క పెద్ద సందేశాలలో ఒకటి. దేవుడు మన గురించి పట్టించుకుంటాడు మరియు మనల్ని చేరుకుంటున్నాడు అనే సందేశం ఈ కధలో ఉంది.
తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసి, ఆ స్థలమునకు బేతేలను (దేవుని మందిరము) పేరు పెట్టాడు. అబ్రాహాము కూడా ఈ స్థలములో ఆరాధించాడని, ఆది 12:8 చెప్తూవుంది.
అయితే నేడు ఆ స్థలమునకు ఇవ్వబడిన పేరులా అది లేదు. అక్కడ చెల్లాచెదురుగా నున్న రాళ్లు రప్పలు పిచ్చిగా పెరిగిన కలుపు మొక్కలు తప్ప మరేమియు చూడలేము. ఒకప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు మన పితరులు సమావేశమైన స్థలమీదేనా అని మనలను మనమే ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉదయకాలమున మన పాఠము యేసు ఉన్న చోటల్లా దేవుని మందిరమే అని తెలియజేస్తూ ఉంది. అది సంఘము కానివ్వండి లేదా మీ ఇల్లు కానివ్వండి, విశ్వాసులముగా మనమున్న ప్రతి చోట అది దేవుని మందిరమే.
యేసు ప్రతి స్థలమును బేతేలుగా చేయుచున్నాడు
- ఆయన దేవుని సన్నిధికి మార్గమును తెరచుచున్నాడు 10,12
- దేవుని వాగ్దానములను గురించి ఆయన మనకు నిశ్చయత నిచ్చుచున్నాడు 13,14 ఏ, బి
- దేవునితో పరిపూర్ణమైన జీవితమునకు ఆయన మనలను నడిపించుచున్నాడు 14 సి – 17
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.