పాత నిబంధన పాఠము: సంఖ్యాకాండము 21:4-9; పత్రిక పాఠము: ఎఫెసీయులకు 2:4-10; సువార్త పాఠము: యోహాను 3:14-21; కీర్తన 38.

సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు
ప్రసంగ పాఠము: సంఖ్యాకాండము 21:4-9

సంఖ్యాకాండము 21: 4-9_ వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరుకొండ నుండి ఎఱ్ఱసముద్ర మార్గ ముగా సాగి నప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పము లను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

మీరు ఎప్పుడైనా నిరాశకు లోనయ్యారా? అందరం ఎన్నోసార్లు నిరాశకు లోనవుతునేవుంటాం. నిరాశలో కోపగిం చు కొంటూ ఉంటాం. నిరాశలో పొరపాటు దేవునిలోనే వున్నదని అనుకొంటూ దేవునిని “ఇలా ఎందుకు చేసావు” అని ప్రశ్నిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలమున అలా అనుకొంటున్న ప్రజలను ఈ పాఠములో మనం చూడొచ్చు. దేవుడు ఆ ప్రజలకు నేర్పిస్తున్న పాఠాల నుండి మనం కూడా నేర్చుకొందాం. మన పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము నిరాశలో, కోపములో మీరు దేవుని వైపునకు తిరగండి అని మనకు చెప్తూవుంది. నిరాశలో, కోపములో ఎందుకని దేవుని వైపుకు తిరగవలసి ఉన్నామో తెలుసుకొందాం.

నిరాశలో, కోపములో మీరు దేవుని వైపునకు తిరగండి

  1. నిరాశ సణుగుడుకు నడిపించవచ్చు దేవునికి కోపము తెప్పించవచ్చు (4,5)
  2. నిరాశ దేవుని మీద తిరుగబడేటట్లు ప్రేరేపించవొచ్చు శిక్షను మనపైకి తేవొచ్చు (6,7)
  3. నిరాశలో దేవుని వైపుకు చూడండి, బాగుపడండి (8,9)

1

4 వచనమును చదువుకొందాం: వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఎందుకని? ఇశ్రాయేలీయులు వాగ్దానదేశానికి ఉత్తరాన దానికి చాల దగ్గరలో ఉన్నారు. కాని ఆ వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్లే దారిలో ఎదోము దేశముంది. దాని గుండా వాళ్ళు వెళ్ళ వలసి ఉన్నారు. కాని ఎదోమీయులు వారిని అనుమతించలేదు. ఎదోమీయులతో మాట్లాడటానికి ఇశ్రాయేలీయులు రాయబా రులను కూడా పంపారు. వారికి ఎలాంటి హాని తలపెట్టమని రాజమార్గములోనే ప్రయాణిస్తామని వాగ్దానము కూడా చేసారు. ఎదోమీయుల భూభాగము గుండా ప్రయాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందునిమిత్తము ధనమును కూడా చెలిస్తామని వాళ్ళు చెప్పారు. కాని ఎదోమీయులు అందుకు ఒప్పుకోలేదు వారి భూభాగము గుండా వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తామని ఇశ్రాయేలీ యులను వాళ్ళు బెదిరించారు.

ఎదోమీయుల ముర్కత్త్వాన్ని బట్టి ఇశ్రాయేలీయులు ఏమి చెయ్యలేకపోయారు.  కాబట్టి వాళ్ళు ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వారికి ఎదురైనా ఈ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీయులు నిరాశ చెందారు, అసహనా నికి లోనయ్యారు. ఇశ్రాయేలీయులను తిరస్కరించడానికి ఎదోమీయులకు కొన్ని కారణాలు ఉండొచ్చు. కాని 40 సంవత్సరాలు దేవుని కృపలో 6,00,000 జనాంగము దేవుని మేళ్ళను సంరక్షణను అనుభవిస్తూ మార్గాయాస ము చేత సొమ్మసిల్లిరి అని బైబులు చెప్తూవుంది.

5వచనమును చదువుకొందాం: కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.

చుట్టూ తిరిగి వెళ్ళవలసి రావడం వాళ్ళని నిరాశకు గురిచేసింది, వాళ్ళు అనుకొన్న దాని ప్రకారము జరగ లేదు కాబట్టి వాళ్ళు నిరాశ పడ్డారు. చుట్టూ తిరిగి వెళ్ళవలసి రావడం టైం తీసుకుంటుంది, అలాగే ప్రయాస ము భారము కూడా కాబట్టే  వాళ్ళు నిరాశపడ్డారు. వేరొకరి మాట వినాల్సి రావడం (మోషే మాటలు) వాళ్ళని నిరాశకు గురిచేసాయి. సహనం చూపెట్టాల్సి రావడం వాళ్ళని నిరాశకు గురిచేసింది. ఫలితాన్నీ చూడలేక పోవడం వాళ్ళని నిరాశకు గురిచేసింది. వాస్తవికతను అంగీకరించలేక వాళ్ళు నిరాశకు గురయ్యారు.   ఎందుకంటే ఇది వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీసింది కాబట్టి వాళ్ళు నిరాశపడ్డారు. వాళ్ళు కోపముతో నిండుకొని శోధింపబడ్డారు. దీనిని వారి మాటలలో మనం చూడొచ్చు. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి. వారి నిరాశను మనం అర్ధం చేసుకోవొచ్చు. కాని వాళ్ళ నిరాశ వాళ్ళను దేవుని మీద తిరుగబడేటట్లు చేస్తూవుంది.

యూదులు కేవలము మోషేని గురించి మాత్రమే పిర్యాదు చెయ్యడం లేదు. వాళ్ళు దేవునికి విరోధముగా మాట్లాడుతున్నారని మన పాఠము ప్రత్యేకముగా చెప్తూవుంది. నిరాశలో తప్పంతా దేవునిదే అని నిందిస్తూ వున్నారు. ఇది మొదటిసారి కాదు. వాళ్ళు దేవుని ప్రేమను సంరక్షణను తప్పు పడుతున్నారు. వాళ్ళు దేవునిపైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఈ గొణుగుడు నిరాశ లేక తిరుగుబాటా?

అపొ. కార్య 6:1_ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఫిలిప్పీయులకు 2:14-15_మీరు మూర్ఖైమెన వక్రజనముమధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి.

కాని వారి సణుగులు సంశయములను బట్టి వాళ్ళు నిరాశావాదులుగా ఉంటూవున్నారు. నిరాశ_ భరింపలేని భారమును కలుగజేస్తూవుంటుంది, అవిధేయతకు చోటు ఇస్తుంది, ఒంటరిని అని ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. చచ్చిపోతే బాగుణ్ణు అనిపిస్తుంది, వ్యర్ధమైన వాటి విషయములో గొడవపడేటట్లు చేస్తుంది. తృణీకరించేటట్లు చేస్తుంది, దేవునిపై తిరుగబడేటట్లు చేస్తుంది, నిరీక్షణలేనట్లుగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. దీనికి కారణం_ ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడటమే. దేవునిపై తిరుగుబాటు పాపమును పెంచుతుంది, దేవుని దీవెనల నుండి దూరము చేస్తుంది. దేవుని ఉగ్రత క్రిందకు తెస్తుంది. 

అన్వయము: నిరాశ సణుగుడుకు నడిపించవచ్చు దేవునికి కోపము తెప్పించవచ్చు. మనము కూడా కొన్ని విషయాలలో దేవునిపై ఫిర్యాదు చేసే ఉంటాం. మన కష్టాలను బట్టి, రోగాలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునిపై సణుగుకొనే ఉంటాం. అంతేనా కొన్నిసార్లు దేవునిని వదిలేస్తాం, దేవునికి దూరముగా వెళ్ళిపోతాము. నిశ్చయముగా దేవుడు ఎవరిని శోధింపడు. కాని మనం శోధనను బట్టి దేవునిని నిందిస్తాము. ఇక్కడ సణుగుడు లో ఇశ్రాయేలీయులు దేవుని ప్రేమను అసహ్యించుకొంటున్నామని చెప్తూవున్నారు. ఎంత భయంకరమైన విషయమో ఆలోచించండి. మనకు దిశా నిర్ధేశనం చేయుచు మన జీవితాలను నడిపించుచు శ్రమలలో మనకు తోడుగా వుంటూ ఆశీర్వాదములను మనకు ఇచ్చుచున్న దేవునిపై మనము సణుగుతున్నామా? సాతాను మన జీవితాలలో అసంతృప్తి అనే విత్తనాలను మన చుట్టూ చల్లినప్పుడు తిరుగుబాటు అనే మొక్కలు మొలకెత్తుతాయి. అప్పుడు మనం కూడా దేవునిపై తిరుగబడుతూవుంటాం.

2

తిరుగుబాటును దేవుడు ఒప్పుకోడు, తేలికగా తీసుకోడు. 6వ వచనాన్ని చదువుకొందాం, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.

ఇంత చిన్న పాపానికి ఇంత పెద్ద శిక్ష అని అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులను క్రమశిక్షణలో వుంచుట కొరకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీ యులలో అనేకులు చనిపోయిరి. సణుగుకొంటేనే ఇంతమందిని చంపేస్తారా అని మనం అడగొచ్చు. ఇది కరెక్ట్ కాదు అని మనం అనుకోవొచ్చు.

తిరుగుబాటుదారులు_ స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు, ఆదేశాలను స్వీకరించరు, లోబడుటకు ఒప్పుకోరు. వాళ్ళు చెప్పినట్లు జరగాలని కోరుకొంటూ ఆదేశాలను ఇవ్వడానికి కోరుకొంటారు. నిగ్రహంగా ఉండటానికి అసలు ఒప్పుకోరు. పైగా నిగ్రహంగా ఉండటాన్ని ద్వేషిస్తారు. వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా జరగడాన్ని ఆశిస్తూ వాళ్ళు నాయకులను దుర్మార్గముగా దూషిస్తారు. అధికారాన్ని ఒప్పుకోరు, అధికారానికి తలవంచరు. తిరుగుబాటు స్వభావము అప్రజాస్వామికమైన పద్దతులలో ఇతరులకు హానిచేస్తూ ముందుకు వెళ్లాలని కోరుకొంటుంది. వారి ఆలోచనలు భయంకరంగా ఉంటాయి ఇతరులకు ఇబ్బందిగా ఉంటాయి. కృతజ్జ్యత లేని జీవితం వారిది. ముర్కత్వం మొండితనంతో 40సంవత్సరాలు నడుపుతున్న దేవునిని వద్దు అనుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, తమ్మును తాము నమ్ముకోవాలనుకుంటున్నారు. వీరిని చూసి క్రొత్తతరం చెడిపోవొచ్చు. దేవుడు వీరికి ఒక పాఠాన్ని నేర్పించాడు. 

ఇశ్రాయేలీయులు పాఠాన్ని నేర్చుకున్నారని మన పాఠము తెలియజేస్తూవుంది. 7వ వచనాన్ని చదువు కొందాం: కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.

ఇప్పుడు ప్రజలు మోషేతో ఏళ్ళ మాట్లాడుతున్నారో గమనించండి. ఫిర్యాదులు గాని సణుగులుగాని లేవు. తగ్గింపుతో మేము పాపము చేసియున్నామని ఒప్పుకొన్నారు. ప్రభువు వద్దకు వెళ్ళుటకు మేము తగనివారము అని తెలియజేస్తూ వారి పక్షమున యెహోవాను ప్రార్ధించమని వాళ్ళు మోషేను అడుగుతున్నారు. ఈ ఘోరమైన పాముల ఉనికిని చూసి ఆశ్చర్యపోయిన ఇశ్రాయేలీయులు తమ ఫిర్యాదులకు శిక్షగా ఏమి జరుగుతుందో గుర్తించారు, కాబట్టి వారు త్వరగా పశ్చాత్తాపపడి, వారిని రక్షించడానికి యెహోవాతో మధ్య వర్తిత్వం చేయమని మోషేను కోరారు.

అన్వయము: నిరాశ తెచ్చే తిరుగుబాటు దేవుని శిక్ష క్రిందికి తెస్తుంది. నిశ్చయముగా దేవుడు ఎవరిని శోధింపడు ఈ లోకము సాతాను మన పాపపు స్వభావమును బట్టి శోధింపబడుతూ కొన్నిసార్లు దేవునికి సంబంధము లేకపోయినను దేవుని నిందిస్తూ ఆయనను తూలనాడుతూ ఆయనను వీడుదుమని కూడా బెదిరిస్తూవుంటాం. మన నిరాశ దేవుని మీద తిరగబడేటట్లు మనలను ప్రోత్సహించడమే కాకుండా మన పైకి మనం శిక్షను తెచ్చుకొనేటట్లు చేస్తుంది. మన జీవితాలను దుర్లభం చేసుకొనేటట్లు చేస్తుంది. దారుణం కదా. మన కష్టాలకు మన పాపమే కారణమేమో గుర్తిధ్ధాం, పశ్చాత్తాపపడదాం, మన మధ్యవర్తి అయిన క్రీస్తుని మధ్యవర్తిత్వం చెయ్యమని వేడుకుందాం. 

3

8,9 వచనాలను చదువుకుందాం: మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.

ఆయనను వేడుకొనగా ఆయన పరిహారాన్ని తెలియజేసాడు. ఆ పరిహారంలో భాగముగా, దేవుడు చెప్పినట్లుగా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టగా; అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికాడు.

దేవుడు విగ్రహాన్ని ఎందుకు పెట్టమన్నాడు అని మీరు అడగొచ్చు. ఇక్కడ దేవుడు విగ్రహాన్ని పూజించమని చెప్పటం లేదు. అలాగే సర్పము కాటుతిని మనుష్యులు చచ్చిపోతూవుంటే, సర్పము ప్రతిమను చూడాలా? చూస్తే బ్రతుకుతామా? అని ఇశ్రాయేలీయులలో కొందరు అనుకొనివుండొచ్చు. అలాగే పైకెత్తబడిన పాము ప్రతిమను చూస్తే బ్రతుకుతామా అని అనుమానించి చూడక చచ్చారు కొందరు. అలాగే పాముకాటు తినిన వాడు పరుగెత్తి వెళ్లి ఆ పాము ప్రతిమను చూస్తే నన్ను పిచ్చివాడు అనుకుంటారేమోనని అనుకోని ఆ ప్రతిమను చూడక చచ్చారు మరి కొందరు.

ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరగబడి పాపము చేసినప్పుడు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాడు; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. అంటే దేవుడు వారిని శిక్షించుటకు సర్పములను పంపాడు. వారి పాపమును బట్టి వారిపైకి వచ్చిన మరణమునకు కారణమైన పాము యొక్క ప్రతిరూపమును దేవుడు వారి మధ్యలో నిలబెట్టమన్నాడు. ఎందుకంటే, ఆ ఇత్తడి సర్పము వారి పైకి వచ్చిన శిక్షను సూచిస్తూవుంది. అలాగే ఆ ఇత్తడి సర్పమును చూడటమంటే వారి పాపమును జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని వారి పాపము వారిపైకి తెచ్చిన దండన నుండి విడుదల కొరకు ఎదురుచూస్తూ స్వస్థత కొరకు దేవుని మాటలపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచడం అని బైబులు చెప్తూవుంది. కాబట్టే సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికారు అని బైబులు చెప్తూవుంది.

ఇక్కడ విశ్వసించుట తప్ప మరొక ఆప్షన్ లేదు ఇశ్రాయేలీయులకు. అవిధేయులు తిరుగుబాటుదారులు తమ అవిశ్వాసమును బట్టి చచ్చారు. దేవుని చికిత్స సర్పము ప్రతిమను చూడటం. చూచిన వాడు బ్రతికాడు అంటే దేవుని మాటలను విశ్వసించి ఆయన వాగ్దానాన్ని నమ్మినవారు, విషపుకాటు తినినను వాళ్ళు బ్రతికారు, క్రొత్త జీవితాన్ని పొందుకొన్నారు. దేవుని మాటలను విశ్వసించని వారు చచ్చారు. 

క్రొత్త నిబంధనలో యోహాను 3:3,4లో_యేసు నీకొదేముతో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పగా అప్పుడు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని యేసును ప్రశ్నించాడు, అప్పుడు యేసు అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను అని యేసు జవాబిచ్చాడు(14-15). అంటే యేసు యేమని చెప్తున్నాడంటే, మనుష్యుల పాపమును బట్టి వారిపైకి వచ్చిన మరణమును తొలగించుటకుగాను దేవుడు పంపిన ప్రాయశ్చితపు గొర్రెపిల్ల అయిన యేసును దేవుడు మనుష్యులందరి మధ్యలో నిలబెట్టియున్నాడని దేవుడు మన కొరకు ప్రొవైడ్ చేసిన ప్రాయశ్చిత్త అర్పణగా సిలువపై పైకెత్తబడియున్న యేసును చూడటమంటే మనుష్యులు వారి పాపమును జ్ఞాపకం చేసుకుని ఒప్పుకొని వారి పాపము వారిపైకి తెచ్చిన దండన నుండి విడుదల ఆయనేనని విశ్వసిస్తూ స్వస్థత కొరకు దేవుని మాటలపై సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుతూ మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారు దేవుని క్రొత్త జీవితాన్ని పుచ్చూకొంటే తప్ప దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాడు. యేసును విశ్వసించుట తప్ప మరొక ఆప్షన్ లేదు, మనుష్యులకు. 

అంటే ఎవరైతే పైకెత్తబడిన యేసును విశ్వసిస్తారో వాడు క్రొత్తగా జన్మించునని యేసు చెప్తున్నాడు. మరొకప్రక్క ఆయనను విశ్వసింపనివారు మరణిస్తారు అనేగా అర్ధం. ఎందుకంటే ప్రతిఒక్కరిని తాపకరమైన పాపము కాటు వేసి యున్నది.

ఆ పాపము యొక్క కాటునుండి బ్రతకాలంటే, బాగుపడాలంటే మన అందరికొరకు దేవుడు అనుగ్రహించి యున్న యేసును మనము విశ్వసింపవలసియున్నాము. క్రొత్త జీవితాన్ని పుచ్చుకొని జీవింపవలసి యున్నామని అర్ధం.

మరొకమాట, మీ అందరి మధ్యలో దేవుడు తన జ్ఞాపకార్ధముగా మీ మందిరమును కట్టించుకొనియున్నాడు. అవునా ఆయన మీ ఈ మందిరములో తన కుమారుని పైకెత్తియున్నాడు. మీ కష్టములొ మీరు మీ మందిరము వైపు చూచి ప్రార్ధించండి. అంతేనా మీకొరకు ఆయన తన సేవకులను మీ మందిరములో మీ కొరకు మధ్యవర్తిత్వము చెయ్యడానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఉంచియున్నాడండి. మీకు తెలుసా మీ సేవకులు మీకొరకు మీకుటుంబాలకొరకు కన్నీటితో ప్రార్థిస్తూ వుంటారు. తండ్రి నీ బిడ్డలను క్షమించమని, దీవించమని, మీ పనిపాటలలో కాయుమని. మీ రాకపోకలలో తోడుగావుండమని. మీ చుట్టూ ప్రతిరోజు దేవుని కంచెను వేస్తూ ఉన్నారనే విషయాన్ని మరచిపోవద్దండి.

ముగింపు: కాని ప్రజలు నిరాశలో దేవుడు ఎవరిని శోధింపడు అని మర్చిపోయి వారి ప్రతి శోధనలో దేవునిని బాధ్యుని చేస్తూ ఆయన మీద తిరుగబడుతూ కష్టాలను వారి జీవితములలోనికి తెచ్చుకొంటూ ఉన్నారు. అంతేనా దేవుని కంచెను తొలగించుకొంటు ఉన్నారు. కాని మీ సేవకులు కన్నీళ్లతో కష్టముతో మీ కొరకు ప్రతి రోజు దేవునిని ప్రాధేయపడుతూ వున్నారు. కాని మీరేమో దేవుని మందిరమునకు రారు. ఇది మీ కొరకు పైకెత్తబడియున్న యేసును మీకు చూపే చోటు. మిమల్ని మీరు సరిదిద్దుకొనే చోటు ఇది. మీ పాపములను మీరు ఒప్పుకొనే చోటు ఇది. దేవుని క్షమాపణను పుచ్చుకొనే చోటు ఇది. మీ చుట్టూ దేవుని కంచెను వేసే చోటు ఇది. మీరు నెలలు నెలలు రాకపోతే మీ సేవకులు తమ ప్రార్ధనలో మిమల్ని గూర్చి మధ్యవర్తిత్వము చేసినను మీ ప్రవర్తన మిమల్ని దేవుని నుండి దూరము చేసివున్నది కాబట్టి మీరు ఎలా ఉంటారంటే దేవుని కంచె దేవుని సంరక్షణ దేవుని ప్రేమ తొలగింపబడిన ఆనాటి ఇశ్రాయేలీయులవలె ఉంటారండీ.

ఈ క్షణమే మీకొరకు మీ మందిరములో పైకెత్తబడియున్న యేసును చూడండి. మీ ప్రతి విషయములో మార్పును మీరు చూస్తారు. మీ చీకటి రోజులు మారిపోతాయి. ఎదోమీయులాంటి వాళ్ళు మీ జీవితాలను అడ్డగించినను నిరాశ పడకండి. దేవునిపై కోపగించుకోకండి. ఎందుకంటే ఆయనే మిమల్ని నడిపించు చున్నవాడు, ప్రేమిస్తున్నవాడు, సంరక్షిస్తున్నవాడు, మీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, మీ విడుదల నాయకుడు. మిమ్మల్ని అనాధలుగా విడువడు, తప్పు దారిన నడిపించడు. మీకు సహాయము చేయువాడు మీతోనే వున్నడనే  విషయాన్ని మర్చిపోకండి. ఆమెన్. 

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.