క్రొత్త నిబంధనలో, పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల గురించి మనం పదే పదే వింటూవుంటాము. పాత నిబంధన పుస్తకాలలో ఈ మతపరమైన పార్టీల గురించి మనం ఎప్పుడూ వినలేదు. కారణం ఏమిటంటే, ఈ మతపరమైన విభాగాలు మొదటగా ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో ఏర్పడ్డాయి.

హసిడిమ్: సెల్యూసిడ్ మరియు హస్మోనియన్ కాలంలో ఇశ్రాయేలులో నివసిస్తున్న యూదులను హెలెనైజ్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. కొంతమంది పాలకులు యూదులను గ్రీకు సంస్కృతి దాని ఆచారాలను అవలంబించాలని యూదుల మత విశ్వాసాలను అనుసరించవద్దని బలవంతపెట్టారు. ఈ సమయంలో, వారి సాంప్రదాయాలు సంస్కృతికి మరియు మతానికి నమ్మకంగా ఉన్న యూదులలో కొందరు  కలిసికట్టుగా ఉండటం ప్రారంభించారు. వీళ్ళు యూదులను హెలెనైజ్ చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలను వ్యతిరేకించారు. ఈ సాంస్కృతిక సంప్రదాయవాద సమూహం హసిడిమ్ (అక్షరాలా, “సెపెరేటెడ్”) అని పిలువబడ్డారు.

హసిడిమ్‌లు దేవుని ధర్మశాస్త్రము మరియు ఇశ్రాయేలు యొక్క సాంస్కృతిక సంప్రదాయాలకు కట్టుబడి వాటిని కాపాడుకోవటం కోసం సెల్యూసిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతూవున్న మక్కాబీస్‌తో చేరి పవిత్ర యుద్ధంలో పోరాడుతున్నామని నమ్ముతూ పోరాడారు. ఆలయం విదేశీ జోక్యం నుండి విముక్తి పొందిన తర్వాత, వారు రాజకీయ స్వేచ్ఛ కోసం మరింత పోరాడటానికి నిరాకరించారు. జోనాథన్ ప్రధాన యాజకునిగా నియమించబడినప్పుడు, అతడు మళ్లీ హసిడిమ్ మద్దతును పొందగలిగాడు.

హసిడిమ్‌లు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు మరియు సంవత్సరాలుగా అందించబడిన అనేక మతపరమైన సంప్రదాయాలను అనుసరించాలని పట్టుబట్టారు. ఈ విధంగా, వారు పరిసయ్యులకు సద్దుకయ్యులకు ముందున్నవారు.

ఒక వ్యక్తి గ్రీకు ఆచారాలలో దేనినైనా స్వీకరించి నమ్మకమైన యూదుడిగా ఉండగలడా లేదా అనే విషయంలో ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నంలో ఇశ్రాయేలు మత పెద్దల మధ్య చీలిక వచ్చింది. ఇది జాన్ హిర్కనస్ పాలనలో జరిగినట్లు తెలుస్తోంది. అప్పటినుండి హాసిడిమ్ పరిసయ్యులుగా , సద్దుకయ్యులుగా మరియు యూదులలో ఇతర పార్టీలుగా చీలిపోయారు. ఈ పార్టీలకు అధికారిక సభ్యత్వ జాబితాలు లేనప్పటికీ, ప్రజలు తమ స్వంత రాజకీయ మరియు మత విశ్వాసాలకు అనుగుణముగా ఉండే పార్టీలకు మద్దతు ఇవ్వటం జరిగింది.

సద్దుకయ్యులు

కొత్త నిబంధన కాలంలో ఇశ్రాయేలులో రెండవ అత్యంత ప్రభావవంతమైన మతపరమైన విభాగం సద్దుకయ్యులు. అయితే, పరిసయ్యులు యూదు మతాన్ని మరియు సంస్కృతిని కొనసాగించాలని ప్రయత్నించారు. సద్దుకయ్యులు యూదుల ఆచారాలను మరింత “ఆధునిక” హెలెనిస్టిక్ సంస్కృతికి అనుగుణంగా మార్చుకోవాలని భావించారు. గ్రీకు ఆచారాలకు అనుగుణంగా మారడానికి ఈ సుముఖత సద్దుకయ్యుల వైపు నుండి మతపరమైన రాజీకి దారితీసింది.

పరిసయ్యులలాగే సద్దూకయ్యులు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని ఎంతో గౌరవించారు. ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. వారు ధర్మశాస్త్రాన్ని మాత్రమే వారి బోధనలకు ప్రేరేపిత మూలంగా తీసుకున్నారు తప్ప పరిసయ్యుల వలె యూదు పెద్దల ద్వారా సంవత్సరాలుగా వారికి అందించబడిన అనేక మతపరమైన సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ క్రమములో బైబిలుకు జోడించబడినవని వారు భావించిన కొన్ని పాత నిబంధన బోధనలను కూడా తిరస్కరించారు, ముఖ్యంగా మంచి దేవదూతలు మరియు చెడ్డ దేవదూతలు ఉన్నారని మరియు ఏదో ఒక రోజు చనిపోయిన వారి భౌతిక పునరుత్థానం ఉంటుందనే బోధలు అందుకు ఉదాహరణ.

శరీరం యొక్క పునరుత్థానాన్ని సద్దూకయ్యులు తిరస్కరించడం పరిసయ్యులను మరియు ఆదిమ క్రైస్తవులను వ్యతిరేకించేలా చేసింది. వారు ఈ విషయంపై యేసుతో వాదించారు, వారి దృక్కోణాన్ని అంగీకరించేలా ఆయనను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు (మత్తయి 22:23 ff). యేసు మృతులలోనుండి లేచినట్లు పేతురు యోహానులు ప్రకటించుచుండటాన్ని బట్టి వారు సద్దూకయ్యుల మద్దతుదారులచే అరెస్టు చేయబడ్డారు, (అపొస్తలుల కార్యములు 4:1-2).

పరిసయ్యులు స్థానిక సమాజ మందిరాల్లోని శాస్త్రులు మరియు ధర్మశాస్త్ర బోధకులతో స్నేహం చేయగా, సద్దూకయ్యులు ప్రధాన యాజకునితో మరియు ఇతర దేవాలయ అధికారులతో జతకట్టారు (అపొస్తలుల కార్యములు 3:17). సద్దుకయ్యులలో అధికశాతం ఇశ్రాయేలులోని విద్యావంతుల నుండి మరియు ఉన్నత తరగతి పౌరుల నుండి వచ్చారు. సద్దూకయ్యుల మతపరమైన బాధ్యతల్లో యెరూషలేము ఆలయ నిర్వహణ కూడా ఉంది. క్రీస్తు జీవిత కాలంలో ప్రధాన యాజకుడు సద్దూకయ్యుడే. తోరాలో ఆదేశింపబడినట్లుగా వారి ఉన్నత సామాజిక స్థితి వారి యాజకత్వ బాధ్యతల ద్వారా బలపరచబడింది. యాజకులలో ప్రధాన యాజకులలో మరియు విద్యావంతులలో అందరూ సద్దూకయ్యులు కారు వారిలో చాలా మంది పరిసయ్యులుగా, అనేకులు ఏ సమూహంలోనూ సభ్యులు కాకుండగా తటస్థముగా కూడా ఉండేవాళ్ళు.

వారు యూదుల మధ్య హెలెనైజేషన్ని నిర్దిష్ట స్థాయి వరకు అనుమతించినందున వారు రోమన్లు వంటి విదేశీ పాలకులతో కలిసి పని చేయగలిగారు. ఆ విధంగా వారు తమ అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు మరియు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సుని కాపాడుకోగలిగారు. పరిసయ్యుల కంటే సద్దూకయ్యులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. యూదుల మండలిలో, సన్హెడ్రిన్లో, అయితే ఇద్దరు దాదాపు సమాన సంఖ్యలో ఉండేవాళ్ళు. పౌలు యెరూషలేములో తన విచారణ సమయంలో దీనిని నుంచి ప్రయోజనం పొందాలని చూసాడు (అపొస్తలుల కార్యములు 23:6 ff.).

సద్దూకయ్యులు మరియు పరిసయ్యులు ఇద్దరూ రక్షణలో సత్క్రియలు పాక్షికంగానైనా చాల చాల ప్రాముఖ్యమని సమ్మతించారు. కాబట్టి, యేసు వారిద్దరినీ ఒకే వర్గంలో ఉంచాడు. కాబట్టే యేసు తన శిష్యులను, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని, మత్తయి 16:6, హెచ్చరించాడు. దీనర్థం పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి, మత్తయి 16:12. మాములుగా పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు ఒకరికొకరు శత్రువులు, కాని క్రీస్తును చంపడానికి వీరిద్దరూ కలసి పనిచేసారు.

సద్దుకయ్యులు రాష్ట్రంలోని అనేక అధికారిక వ్యవహారాలను పర్యవేక్షించేవారు:

  • రాష్ట్రాన్ని దేశీయంగా పరిపాలించారు
  • అంతర్జాతీయంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు
  • మహాసభలో పాల్గొన్నారు అక్కడ తరచుగా పరిసయ్యులను ఎదుర్కొన్నారు
  • వసూలు చేసిన పన్నులు చూసేవారు. ఇవి డయాస్పోరాలోని యూదుల నుండి అంతర్జాతీయ నివాళి రూపంలో కూడా వచ్చాయి.
  • సైన్యాన్ని సమకూర్చుకుని నడిపించారు
  • రోమన్ సామ్రాజ్యంతో నియంత్రిత సంబంధాలు నెరిపేవారు
  • మధ్యవర్తిత్వ గృహ ఫిర్యాదులు చూసేవారు

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.