పరిశుద్ధ లేఖనాలలో గ్రంథస్థము చెయ్యబడియున్నట్లుగా, ప్రత్యేకముగా ఆదికాండము 1,2 అధ్యాయాలలో నమోదు చెయ్యబడియున్న రీతిగా, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (ఆదికాండము 1:1). దేవుడు తన శక్తిగల సృజనాత్మకమైన మాటల ద్వారా, ప్రతి దానిని శూన్యము నుండి కలుగజేసియున్నాడని, (కీర్తనలు 33:6,9, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెనని)  ఆరు రోజులలో భూమ్యాకాశములను సృజించియున్నాడని (ఆదికాండము 1:31; నిర్గమకాండము 20:11, ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించెను) నేను నమ్ముతున్నాను. అయితే స్త్రీ పురుషులు మాత్రం ఆయన ప్రత్యేకమైన సృష్టియైయున్నారు (మార్కు 10:6,  సృష్ట్యాదినుండి (దేవుడు) వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ జేసెను).

లేఖనాల్లో భోధింపబడుతున్నట్లుగా సృష్టి సిద్ధాంతాన్ని తిరస్కరిస్తూ లేక తక్కువ చేసి చూపించే ప్రతి సిద్ధాంతాన్ని నేను తిరస్కరిస్తూవున్నాను. ఈ రోజులలో కొందరు బైబిలులోని సృష్టి క్రమము సైన్స్ తో విభేదిస్తూ వున్నదని సృష్టి అనేది పరిణామ ప్రక్రియ ద్వారా ఉనికిలోనికి వచ్చియున్నదని; అంటే, అది, కొన్ని కోట్లసంవత్సరాల కాలవ్యవధిలో, తనకు తానుగా వేగముగా పరిణామము చెందియున్నదని లేక నెమ్మదిగా అభివృద్ధి చెందియున్నదని చెప్తూ బైబిలులోని సృష్టి క్రమాన్ని తిరస్కరిస్తూవున్నారు లేక బైబులును తక్కువ చేసి మాట్లాడుతూవున్నారు. దేవుడు సృష్టిని చేయుటకు ఉబలాటపడ్డప్పుడు ఎవరు లేరు. కాబట్టే దేవుని స్వంత పుస్తకమైన బైబిలులో దేవుడు స్వంతముగా గ్రంథస్థము చేసియున్న విశ్వసనీయమైన సృష్టి వృతాంతాన్ని మనం నమ్మాలి మరియు దానిని సంపూర్ణమైన నమ్మకంతో అంగీకరించాలి, హెబ్రీయులకు 11:6, ప్రపంచములు దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము అని తెలియజేస్తూవుంది. కాబట్టి లూథర్ ప్రశ్నోత్తరిలో చెప్పబడియున్న రీతిగా “దేవుడు నన్నును సమస్త జీవులను కలుగ చేసియున్నాడని” ఒప్పుకొందాం.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.