అపొస్తలుల విశ్వాసప్రమాణము యొక్క ఉపొద్ఘాతము

అపొస్తలుల విశ్వాసం క్రైస్తవ విశ్వాసం యొక్క అత్యంత పురాతనమైన మరియు విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రకటనలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది అపొస్తలుల విశ్వాసం యొక్క ముఖ్యమైన బోధనలను సంగ్రహిస్తుంది మరియు శతాబ్దాలుగా అన్ని వర్గాల చర్చిలలో విశ్వాస ఒప్పుకోలుగా, బోధనా సాధనంగా మరియు ప్రార్ధనా ధృవీకరణగా ఉపయోగించబడుతోంది. దీని సరళత, స్పష్టత మరియు వేదాంత లోతు దీనిని క్రైస్తవ సనాతన ధర్మం యొక్క పునాది యొక్క వ్యక్తీకరణగా చేశాయి.

మన లిటర్జికల్ సంఘాలలో, సంఘారాధనలలో, కుటుంబరాధనలలో, మీటింగ్స్లో, విశ్వాసప్రమాణాన్ని చెప్తూ ఉంటాం. ఈ విశ్వాస ప్రమాణాన్ని సంఘముగా, కుటుంబముగా కలసి, మనమేమి నమ్ముతున్నామో ప్రకటిస్తూ, మన ఐక్యతను తెలియజేస్తున్నాం. ఈ అపొస్తులుల విశ్వాస ప్రమాణము ఎలా ఉద్భవించిందో సంఘారాధనలలో ఎలా చోటు దక్కించుకొందో దీని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకొందాం. దీని అర్ధాన్ని నేర్చుకొందాం.

ట్రెడిషన్ ప్రకారమైతే, అపొస్తలుల విశ్వాస ప్రమాణము అనేది 12 మంది అపొస్తులులచే రూపొందించబడిందని చెప్తుంటారు. మరికొందరు మొదటి శతాబ్దములో శ్రమలను బట్టి చెదరిన క్రైస్తవులు చరిత్రాత్మికమైన క్రైస్తవత్వము లోనికి తిరిగి రావాలనే ఉదేశ్యముతో ఇది అపొస్తలుల ఐశ్వర్యవంతమైన, సిద్ధాంతపరమైన భోధల నుండి, సువార్త సమరోత్సాహము నుండి ఉద్భవించిందని చెప్తుంటారు. ఇంకొందరు ఇది బాప్తిస్మము పొందబోయే వ్యక్తులు తమ విశ్వాసమును బహిరంగముగా వ్యక్తపరిచే క్రమములో రూపుదిద్దుకోబడిందని చెప్తుంటారు. మరికొందరు ఆదిమ క్రైస్తవ సంఘములో క్రైస్తవత్వాన్ని వెంబడించే వాళ్ళకు లేఖనాలలో ఉన్న ప్రధానమైన నిర్దిష్టమైన సిద్ధాంతాల మీద తమ విశ్వాసాన్ని కేంద్రీకరించేటట్లు వారికి సహాయపడే ఉద్దేశ్యములో వారికి సామర్ధ్యమును కలుగజేసే క్రమములో రూపుదిధ్డుకోబడిందని చెప్తుంటారు. ఏదైతేనేమి చరిత్రకు ఆధారముగా ఇది ఆనాటి నుండి నేటివరకు భద్రపరచబడి ఉంది.

గ్రేట్ కమిషన్‌లోని భాగమైన మత్తయి 28:19, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి దాని ఆధారంగా అపొస్తలుల విశ్వాస ప్రమాణము ఉద్భవించింది. అపొస్తలుల విశ్వాస ప్రమాణముగా మారిన దాని ప్రారంభ వెర్షన్, “ఓల్డ్ రోమన్ విశ్వాస ప్రమాణముగా” పిలువబడింది. ఇది రెండవ శతాబ్దం ప్రారంభంలోనే వాడుకలో ఉంది, (కెల్లీ, క్రీడ్స్, 101). ఈ విశ్వాసం యొక్క తొలి లిఖిత రూపం అన్సైరాకు చెందిన మార్సెల్లస్ క్రీ. శ. 341లో రోమ్ బిషప్ జూలియస్‌కు గ్రీకులో రాసిన లేఖలో ఇది కనుగొనబడింది. దాదాపు 50 సంవత్సరాల తరువాత, టైరానియస్ రూఫినస్ ఈ విశ్వాస ప్రమాణము పై లాటిన్‌లో వ్యాఖ్యానం రాశాడు (కామెంటారియస్ ఇన్ సింబోలమ్ అపొస్టోలోరం). అందులో, పెంతెకొస్తు తర్వాత, యెరూషలేము నుండి ప్రకటించడానికి బయలుదేరే ముందు అపొస్తలులు కలిసి ఈ విశ్వాస ప్రమాణాన్ని వ్రాసారనే దృక్కోణాన్ని ఆయన వివరించాడు. “అపొస్తలుల విశ్వాస ప్రమాణము” అనే శీర్షికను 390లో అంబ్రోస్ ప్రస్తావించాడు. ఈ విశ్వాస ప్రమాణాన్ని వివరించే కథనం ఇది అపొస్తలులచే సంయుక్తంగా సృష్టించబడిందని, పన్నెండు మందిలో ప్రతి ఒక్కరూ పన్నెండు స్టేట్మెంట్స్ లలో ఒక దానిని అందించారని చెప్తుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది సుమారు క్రీ.శ. 180 నాటికే వ్రాత రూపంలో ఉందని వాదించబడింది. కాలక్రమేణా, ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చి అంతటా ఏకీకృత ప్రకటనగా మారింది, మతవిశ్వాశాల నుండి రక్షణ కల్పించడానికి మరియు క్రైస్తవ గుర్తింపును స్పష్టం చేయడానికి సహాయపడుతుంది.

సంఘ చరిత్రలో, కొన్ని విషయాలు, విశ్వాసుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసాయి. అందులో అపొస్తలుల విశ్వాస ప్రమాణము ఒకటని సంఘచరిత్ర చెప్తుంది. అపొస్తలుల విశ్వాస ప్రమాణమును క్రీ.శ. మొదటి శతాబ్దం నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరు ఉపయోగిస్తున్నారు. ఆదిమ సంఘము ఈ విశ్వాస ప్రమాణాన్ని తమ ఆరాధనలో పొందుపర్చింది. విశ్వాసులు అందరూ ఈ అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని బహిరంగముగా చెప్పే వాళ్ళు. హతసాక్షులు అందరి ఎదుట తమ విశ్వాసపు ఒప్పుకోలుగా (చివరి మాటలుగా) ఈ మాటలను ప్రకటించే వాళ్ళు.

సంఘ చరిత్ర అంతటా, అపొస్తలుల విశ్వాస ప్రమాణము అనేది క్రైస్తవ విశ్వాసానికి చారిత్రాత్మికమైన మూలరాయి అని చెప్పొచ్చు. అపొస్తలుల విశ్వాస ప్రమాణము అనేది ముఖ్యంగా బాప్టిజం, కేటకిజం మరియు లిటర్జీలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కొత్త విశ్వాసులు తమ బాప్టిజం సమయంలో దీనిని చెప్పుట ద్వారా విశ్వాసాన్ని ధృవీకరించారు, త్రియేక దేవునిపై వారి వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రకటించారు మరియు సార్వత్రిక సంఘంతో గుర్తింపు పొందారు. నేటికీ, అనేక క్రైస్తవ సంప్రదాయాలు ఈ విశ్వాసాన్ని ఉమ్మడి విశ్వాసం యొక్క ప్రకటనగా పఠిస్తున్నాయి. ఇది కొత్త విశ్వాసులకు బోధించడానికి ఒక సిద్ధాంతపరమైన పునాదిని అందిస్తుంది మరియు క్రైస్తవులు తాము నమ్మే వాటిని వ్యక్తీకరించడంలో సహాయపడుతుంది. సంఘ చరిత్రలో క్రైస్తవ విశ్వాసం యొక్క చారిత్రాత్మిక సార్వత్రిక సారాంశమే అపొస్తలుల విశ్వాస ప్రమాణం. అపొస్తలుల విశ్వాస ప్రమాణము విశ్వాసానికి శాశ్వతమైన లంగరుగా పనిచేస్తుంది. ఇది విశ్వాసులకు చారిత్రక క్రైస్తవ మతంలో వారు పాతుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తుంది. సంఘము దాని స్పష్టమైన సంక్షిప్తమైన విశ్వాసముపై ఆధారపడుతూ, అందరూ కలసి దీనిని ఒప్పుకొంటూ, సత్యాన్ని, లోకానికి ప్రామాణికమైన క్రైస్తవత్వాన్ని దాని విశిష్టతను తెలియజేస్తూ ప్రపంచానికి సంక్షిప్త సాక్ష్యాన్ని అందిస్తున్నారు.

అపొస్తలుల విశ్వాస ప్రమాణం త్రిత్వ నిర్మాణ శైలిలో ఉంది. ఇది ఈ క్రింది విశ్వాసాల చుట్టూ వ్యవస్థీకృతమై ఉంది: తండ్రి దేవుడు; యేసుక్రీస్తు, ఆయన కుమారుడు; పవిత్రాత్మ.

ప్రతి విభాగం సృష్టి, విమోచన మరియు పవిత్రీకరణ పనిలో త్రిత్వానికి చెందిన ప్రతి వ్యక్తి పాత్ర మరియు పనిని వివరిస్తుంది. ఇది “సర్వశక్తిమంతుడైన తండ్రి దేవుడు” పై విశ్వాసం యొక్క ప్రకటనతో ప్రారంభమవుతుంది, తరువాత యేసుక్రీస్తు గురించి వివరణాత్మక ధృవీకరణకు వెళుతుంది – ఆయన కన్య జననం, శ్రమ, మరణం, పునరుత్థానం మరియు భవిష్యత్తులో తిరిగి రావడం. చివరి విభాగం క్షమాపణ, పునరుత్థానం మరియు నిత్యజీవంతో పాటు పరిశుద్ధాత్మ మరియు సంఘము పై విశ్వాసాన్ని ప్రకటిస్తుంది.

అపొస్తలుల విశ్వాస ప్రమాణం అనేది కేవలం సిద్ధాంతాల జాబితా కాదు – ఇది త్రియేక దేవుని జీవితం మరియు లక్ష్యంలో పాతుకుపోయిన విశ్వాసం యొక్క ఒప్పుకోలు. దీని కేంద్ర ఇతివృత్తాలు: క్రీస్తు శరీరధారిగా రావడం మరియు ఆయన పునరుత్థానం – యేసు మానవత్వం మరియు దైవత్వాన్ని ధృవీకరిస్తుంది. పాప క్షమాపణ – కృప సువార్తను హైలైట్ చేస్తుంది. సంఘము యొక్క ఐక్యత మరియు పవిత్రత – విశ్వాసం యొక్క సామూహిక స్వభావాన్ని నొక్కి చెబుతుంది. నిత్య జీవితం మరియు శారీరక పునరుత్థానం – క్రైస్తవుల ఆశను నొక్కి చెబుతుంది. ఈ విశ్వాసం క్రైస్తవ సువార్త యొక్క హృదయాన్ని సంక్షిప్త మరియు ప్రాప్యత రూపంలో సంగ్రహిస్తుంది.

దీనిలో “మేము నమ్ముతున్నాము”, అనే మాటలకు దీనిని చెప్పే వారు, వారు ఏవైతే చెప్తున్నారో వాటిని నిజమని అంగీకరిస్తున్నామని, వాటిని నమ్ముతూ వాటిని వెంబడించుటకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, ఇది విశ్వాసం యొక్క ప్రకటన, (అంటే వారు నమ్మేదాన్ని వారు చెబుతున్నారు.)

ఇది ఎంతటి ప్రాముఖ్యమైనదంటే, “రక్షింపబడటానికి నేను ఏమి చేయాలి?” అనే ప్రజలందరి ప్రాముఖ్యమైన ప్రశ్నను బట్టి, అపొస్తలుల విశ్వాస ప్రమాణము, జవాబు చెప్తూ ప్రజలను నిర్దేశిస్తూ మార్గనిర్దేశం చేస్తూ, తాను చెప్తున్న వాటిని సమర్థిస్తూ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది. కాలానికి అతీతమైన, ఈ బైబిల్ సత్యాలు చరిత్ర అంతటా క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశాన్ని అందిస్తున్నాయి.

ఇది అసలు అపొస్తలులచే వ్రాయబడనప్పటికీ, అపొస్తలుల విశ్వాస ప్రమాణములోని ప్రతి పంక్తిని అపొస్తలులు మరియు యేసు యొక్క తొలి శిష్యులు ఆదిమ క్రైస్తవ సంఘములో బోధించారు. క్రీ.శ. 1వ శతాబ్దము నుండి క్రైస్తవ సంఘము దీనిని సంఘారాధనలలో లేదా వాక్యము చుట్టూ తాము కూడుకొనిన ప్రతిసారి దీనిని అందరూ కలసి చెప్పేవాళ్ళు, తమ విశ్వాసమును (తాము నమ్ముతున్న వాటిని) బహిరంగముగా దీని ద్వారా ప్రకటించెడి వాళ్ళు. ఈ రోజుకు కూడా లిటర్జికల్ సంఘ ఆరాధనలలో లేక దేవుని వాక్యము చుట్టూ వారు కూడుకొనిన ప్రతిసారి వీళ్ళు దీనిని అందరూ కలసి చెవుతూ తమ విశ్వాసాన్ని బహిరంగముగా ఒప్పుకొంటూ, సార్వత్రిక సంఘములో తమ ఐక్యతను, తెలియజేస్తున్నారు.

అపొస్తలుల విశ్వాస ప్రమాణం క్రైస్తవ విశ్వాసం యొక్క గొప్ప మరియు శాశ్వతమైన సారాంశం. పురాతనమైనప్పటికీ, ఇది నేటికీ చాలా సందర్భోచితంగా ఉంది. సువార్త యొక్క ముఖ్యమైన సత్యాల చుట్టూ కాలం మరియు సంప్రదాయం అంతటా విశ్వాసులను ఏకం చేస్తుంది. ఒప్పుకోలుగా, ఇది బోధిస్తుంది. ప్రార్థనగా, ఇది బలపరుస్తుంది. ఒక విశ్వాసంగా, ఇది త్రియేక దేవుడు – తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ – యొక్క మార్పులేని సత్యానికి సాక్ష్యమిస్తుంది.

అపొస్తలుల విశ్వాస ప్రమాణము

భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవునిని నేను నమ్ముచున్నాను.

ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరియింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలోనుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను.

పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్దుల ఐక్యమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమెన్.

క్రొత్త నిబంధనలో క్రైస్తవత్వమును గురించి మనం నేర్చుకునే పన్నెండు ప్రాముఖ్యమైన సత్యాలను అపొస్తలుల విశ్వాస ప్రమాణము వక్కాణిస్తుంది.

మొదటిగా, దేవుడు మన శక్తివంతమైన సృష్టికర్త మాత్రమే కాదు, మనపై ప్రేమ శ్రద్ధ గల తండ్రి కూడా అనే సత్యాన్ని తెలియజేస్తుంది.

రెండవదిగా, యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడైయున్నాడని, మన ప్రభువైయున్నాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

మూడవదిగా, యేసు అద్భుతమైన రీతిగా పరిశుదాత్మ వలన గర్భమున ధరింపబడియున్నాడని, కన్యయైన మరియ యందు పుట్టాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

నాల్గవదిగా, మొదటి శతాబ్దములో యేసు రోమీయుల ద్వారా శ్రమపడి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి యున్నాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

ఐదవదిగా, యేసు మరణము నుండి తిరిగి లేచియున్నాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

ఆరవదిగా, యేసు పరలోకమునకు ఎక్కియున్నాడని, మహిమపరచబడి యున్నాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

ఏడవదిగా, యేసు న్యాయాధిపతిగా తిరిగి వస్తాడనే సత్యాన్ని తెలియజేస్తుంది.

ఎనిమిదవదిగా, పరిశుద్దాత్ముడు పరిశుద్ధ త్రిత్వములోని ఒక వ్యక్తి అనే సత్యాన్ని తెలియజేస్తుంది.

తొమ్మిదవదిగా, సంఘము సార్వత్రికమనే సత్యాన్ని తెలియజేస్తుంది.

పదవదిగా, క్రైస్తవ సహవాసము/ఐక్యం అనేది అన్ని సమయాలలో అన్ని స్థలంలో ఉంటుంది అనే సత్యాన్ని తెలియజేస్తుంది.

పదకొండవదిగా, మన పాపములు నిజముగా వాస్తవంగా క్రీస్తునందు క్షమింపబడియున్నాయి అనే సత్యాన్ని తెలియజేస్తుంది.

పన్నెండవదిగా, చనిపోయిన వారందరు తిరిగి లేపబడతారు. పరలోకము వాస్తవము అనే సత్యాన్ని తెలియజేస్తుంది.

ఇవన్ని మనమందరం నమ్ముతున్న సత్యాలే కదండి, మరి ప్రతి ఆదివారన్న దీని విశ్వాసులందరితో కలసి మనమందరం ఒప్పుకొంటూ మనమేమి నమ్ముతున్నామో వాటిని ధైర్యముగా నిశ్చయతతో ప్రకటిద్దాం. మీ సంఘములో అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని వాడుతున్నారా? వాడండి. అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని నేర్చుకోండి, దాని అర్ధములో దానిని అర్ధం చేసుకోండి, విశ్వాసులకు దాని అర్ధములో నేర్పించండి. దేవుడు మీ ప్రయత్నాన్ని సఫలము చేయును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl