అపొస్తలుల విశ్వాసప్రమాణము యొక్క ఉపొద్ఘాతము
అపొస్తలుల విశ్వాస ప్రమాణము (Apostles’ Creed) క్రైస్తవ విశ్వాసానికి అత్యంత పురాతనమైన, విశ్వవ్యాప్తంగా ఆమోదించబడిన విశ్వాస ప్రకటనలలో ఒకటి. ఇది అపొస్తలుల బోధనల సారాంశాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలలో ఇది విశ్వాస ఒప్పుకోలుగా, బోధనా సాధనంగా, ఆరాధనలో భాగంగా ఉపయోగించబడుతోంది. దీని సరళత, స్పష్టత మరియు లోతైన వేదాంత సత్యాలు దీనిని చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి పునాదిగా నిలబెట్టాయి.
మన లిటర్జికల్ సంఘాలలో, సంఘారాధనలలో, కుటుంబ ఆరాధనలలో మరియు ఇతర క్రైస్తవ సమావేశాలలో మనమందరం కలిసి ఈ విశ్వాస ప్రమాణాన్ని ప్రకటిస్తుంటాము. దీనిని చెప్పడం ద్వారా మనం ఏమి నమ్ముతున్నామో బహిరంగంగా ఒప్పుకుంటాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంతో మన ఐక్యతను వ్యక్తపరుస్తాము. ఈ విశ్వాస ప్రమాణం ఎలా ఉద్భవించింది? సంఘ ఆరాధనలో దీనికి ఎలా స్థానం లభించింది? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
అపొస్తలుల విశ్వాస ప్రమాణం యొక్క ఆవిర్భావం గురించి పలు అభిప్రాయాలు ఉన్నాయి. సంప్రదాయం ప్రకారం, దీనిని పన్నెండు మంది అపొస్తలులే రూపొందించారని చెబుతారు. మరికొందరు, ఇది అపొస్తలుల బోధనల నుండి క్రమంగా అభివృద్ధి చెందిన విశ్వాస ప్రకటన అని భావిస్తారు. ఇంకొందరి అభిప్రాయం ప్రకారం, బాప్తిస్మము పొందబోయే వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడానికి దీనిని ఉపయోగించేవారు. మరికొందరు, ఆదిమ సంఘంలో కొత్త విశ్వాసులకు క్రైస్తవ విశ్వాసంలోని ప్రధాన సిద్ధాంతాలను బోధించడానికి ఇది రూపొందించబడిందని చెబుతారు. ఏ అభిప్రాయం సరైనదైనా, ఈ విశ్వాస ప్రమాణం అపొస్తలుల బోధనలను విశ్వసనీయంగా సంగ్రహించి నేటి వరకు భద్రపరచబడింది.
ఈ విశ్వాస ప్రమాణానికి ఆధారం ప్రభువైన యేసు ఇచ్చిన మహా ఆజ్ఞ (మత్తయి 28:19). “తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మమియ్యుడి” అనే ఆజ్ఞ ఆధారంగా త్రిత్వ విశ్వాసాన్ని సంగ్రహించే రూపంగా ఇది అభివృద్ధి చెందింది. దీనికి మొదటి రూపం “ఓల్డ్ రోమన్ క్రీడ్” (Old Roman Creed)గా రెండవ శతాబ్దం ప్రారంభంలోనే ఉపయోగంలో ఉంది, (కెల్లీ, క్రీడ్స్, 101). ఈ విశ్వాసం యొక్క తొలి లిఖిత రూపం అన్సైరాకు చెందిన మార్సెల్లస్ క్రీ. శ. 341లో రోమ్ బిషప్ జూలియస్కు గ్రీకులో రాసిన లేఖలో ఇది కనుగొనబడింది. దాదాపు 50 సంవత్సరాల తరువాత, టైరానియస్ రూఫినస్ ఈ విశ్వాస ప్రమాణము పై లాటిన్లో వ్యాఖ్యానం రాశాడు (కామెంటారియస్ ఇన్ సింబోలమ్ అపొస్టోలోరం). “అపొస్తలుల విశ్వాస ప్రమాణము” అనే పేరు క్రీ.శ. 390 ప్రాంతంలో అంబ్రోస్ రచనలలో కనిపిస్తుంది. ఇది సుమారు క్రీ.శ. 180 నాటికే వ్రాత రూపంలో ఉందని వాదించబడింది. కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం అంగీకరించిన విశ్వాస ప్రకటనగా మారింది.
సంఘ చరిత్రలో అపొస్తలుల విశ్వాస ప్రమాణం విశ్వాసుల జీవితాలపై గొప్ప ప్రభావం చూపింది. మొదటి శతాబ్దం నుండే ఇది క్రైస్తవ ఆరాధనలో భాగమైంది. విశ్వాసులు దీనిని బహిరంగంగా ప్రకటించేవారు. బాప్తిస్మ సమయంలో కొత్త విశ్వాసులు తమ విశ్వాసాన్ని దీని ద్వారా ఒప్పుకొనేవారు. హింసల కాలంలో అనేకమంది హతసాక్షులు కూడా తమ చివరి విశ్వాస ప్రకటనగా ఈ విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించారు.
చర్చి చరిత్ర అంతటా ఈ విశ్వాస ప్రమాణం బాప్తిస్మము, కేటకిజం (Catechism) మరియు లిటర్జీలలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది కొత్త విశ్వాసులకు క్రైస్తవ విశ్వాసపు పునాదులను నేర్పింది. అదే సమయంలో, సార్వత్రిక సంఘంలోని విశ్వాసులందరినీ ఒకే విశ్వాసంలో ఏకపరిచింది. ఈ రోజుకూడా ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైస్తవ సంఘాలు తమ ఉమ్మడి విశ్వాస ప్రకటనగా దీనిని పఠిస్తున్నాయి. ఇది చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి ఒక శాశ్వత లంగరుగా నిలుస్తోంది.
అపొస్తలుల విశ్వాస ప్రమాణం త్రిత్వ నిర్మాణాన్ని అనుసరిస్తుంది. మొదటి భాగం సర్వశక్తిమంతుడైన తండ్రియైన దేవునిని గురించి, రెండవ భాగం యేసుక్రీస్తును గురించి, మూడవ భాగం పరిశుద్ధాత్మ, పరిశుద్ధ సంఘము, పాపక్షమాపణ, శరీర పునరుత్థానం మరియు నిత్యజీవము గురించి బోధిస్తుంది. ఈ విధంగా త్రియేక దేవుని రక్షణ కార్యాన్ని ఇది సంక్షిప్తంగా వివరిస్తుంది.
ఈ విశ్వాస ప్రమాణం కేవలం సిద్ధాంతాల జాబితా మాత్రమే కాదు. ఇది త్రియేక దేవునిపై క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన బహిరంగ ఒప్పుకోలు. ఇందులో క్రీస్తు అవతారం, శ్రమ, మరణం, పునరుత్థానం, పరలోకారోహణం, తిరిగి రాక, పాపక్షమాపణ, పరిశుద్ధ సంఘము, శరీర పునరుత్థానం మరియు నిత్యజీవము వంటి సువార్త యొక్క ప్రధాన సత్యాలు సంగ్రహించబడ్డాయి. అందువల్ల ఇది క్రైస్తవ విశ్వాస సారాంశాన్ని సరళంగా, స్పష్టంగా తెలియజేస్తుంది.
ఈ విశ్వాస ప్రమాణాన్ని చెప్పేటప్పుడు మనం కేవలం మాటలు పలకడం కాదు; మనం నమ్ముతున్న సత్యాలను బహిరంగంగా ఒప్పుకుంటున్నాము. మన జీవితాన్ని ఆ సత్యాల ప్రకారం నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాము. కాబట్టి ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, ఒక విశ్వాస ప్రకటన.
“రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి?” అనే మానవుని అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు ఈ విశ్వాస ప్రమాణం బైబిలు ఆధారంగా స్పష్టమైన దిశను చూపిస్తుంది. ఇది రక్షణకు కేంద్రం యేసుక్రీస్తేనని, త్రియేక దేవుని రక్షణ కార్యమే క్రైస్తవ విశ్వాసానికి పునాదని ప్రకటిస్తుంది. అందుకే శతాబ్దాలుగా ఇది క్రైస్తవ విశ్వాస సారాంశంగా నిలిచి ఉంది.
అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని అపొస్తలులే స్వయంగా వ్రాసినట్లు చారిత్రక ఆధారాలు లేనప్పటికీ, ఇందులోని ప్రతి బోధన అపొస్తలుల బోధనల నుండే తీసుకోబడింది. మొదటి శతాబ్దం నుండి క్రైస్తవులు దీనిని ఆరాధనలో ఉపయోగిస్తూ, తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చారు. నేటికీ లిటర్జికల్ సంఘాలలో దేవుని వాక్యము చుట్టూ కూడినప్పుడు విశ్వాసులు దీనిని కలిసి చెప్పి, సార్వత్రిక సంఘంతో తమ ఐక్యతను ప్రకటిస్తున్నారు.
కాబట్టి అపొస్తలుల విశ్వాస ప్రమాణం క్రైస్తవ విశ్వాసానికి గొప్ప మరియు శాశ్వతమైన సారాంశం. ఇది పురాతనమైనదైనా, నేటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. సువార్త యొక్క ప్రధాన సత్యాల చుట్టూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులను ఏకం చేస్తుంది. ఒక విశ్వాస ఒప్పుకోలుగా ఇది బోధిస్తుంది; ఒక ఆరాధనా ప్రకటనగా ఇది విశ్వాసాన్ని బలపరుస్తుంది; ఒక చారిత్రాత్మక సాక్ష్యంగా ఇది త్రియేక దేవుని మార్పులేని సత్యాన్ని తరతరాలకు ప్రకటిస్తూ నిలిచి ఉంది.
అపొస్తలుల విశ్వాస ప్రమాణము
భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియైన దేవునిని నేను నమ్ముచున్నాను.
ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు, పరిశుద్దాత్మ వలన గర్భమున ధరియింపబడి, కన్యయైన మరియ యందు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడెను. ఆయన నరకములోనికి దిగెను. చనిపోయిన వారిలోనుండి మూడవ దినమున ఆయన తిరిగి లేచెను. ఆయన పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి యున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి ఆయన వచ్చునని నేను నమ్ముచున్నాను.
పరిశుద్దాత్మను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్దుల ఐక్యమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నేను నమ్ముచున్నాను. ఆమెన్.
క్రొత్త నిబంధనలోని క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన పన్నెండు ప్రధాన సత్యాలను అపొస్తలుల విశ్వాస ప్రమాణం సంక్షిప్తంగా తెలియజేస్తుంది.
మొదటిగా, దేవుడు సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మాత్రమే కాదు, మనలను ప్రేమించే, శ్రద్ధ చూపించే పరలోక తండ్రి అని ప్రకటిస్తుంది.
రెండవదిగా, యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు, మన ప్రభువు మరియు రక్షకుడు అని తెలియజేస్తుంది.
మూడవదిగా, యేసు పరిశుద్ధాత్ముని శక్తివలన కన్యయైన మరియ గర్భంలో అద్భుతరీతిగా గర్భం ధరించి జన్మించాడని ప్రకటిస్తుంది.
నాల్గవదిగా, యేసు మొదటి శతాబ్దంలో పొంతీయు పిలాతు కాలంలో శ్రమపడి, సిలువపై మరణించి, సమాధి చేయబడ్డాడనే చారిత్రక సత్యాన్ని తెలియజేస్తుంది.
ఐదవదిగా, యేసుక్రీస్తు మూడవ దినమున మృతులలోనుండి తిరిగి లేచాడని ప్రకటిస్తుంది.
ఆరవదిగా, ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున మహిమపరచబడి ఉన్నాడని తెలియజేస్తుంది.
ఏడవదిగా, యేసుక్రీస్తు మళ్లీ వచ్చి జీవులకును మృతులకును న్యాయము తీర్చుతాడనే సత్యాన్ని ప్రకటిస్తుంది.
ఎనిమిదవదిగా, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవునిలోని మూడవ వ్యక్తి అని తెలియజేస్తుంది.
తొమ్మిదవదిగా, క్రీస్తు సంఘము సార్వత్రికమైనదని, అన్ని దేశాలలో ఉన్న విశ్వాసులందరూ ఒకే సంఘానికి చెందినవారని ప్రకటిస్తుంది.
పదవదిగా, పరిశుద్ధుల సహవాసం అనేది కాలాన్ని, ప్రాంతాలను దాటి క్రీస్తునందు ఉన్న విశ్వాసుల ఐక్యతను తెలియజేస్తుంది.
పదకొండవదిగా, యేసుక్రీస్తు ద్వారా మన పాపాలకు నిజమైన మరియు సంపూర్ణమైన క్షమాపణ లభించిందని ప్రకటిస్తుంది.
పన్నెండవదిగా, మృతుల పునరుత్థానం మరియు నిత్యజీవం వాస్తవమని, విశ్వాసులకు పరలోక నిరీక్షణ ఉందని ప్రకటిస్తుంది.
ఇవన్నీ మనం నమ్ముతున్న క్రైస్తవ విశ్వాసపు మూల సత్యాలే. అందువల్ల ప్రతి ఆదివారం, సంఘమంతా కలిసి అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ధైర్యంగా, నిశ్చయతతో ఒప్పుకుంటూ, మనం నమ్ముతున్న విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిద్దాం.
మీ సంఘంలో అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, దానిని మరింత అర్థవంతంగా ఉపయోగించండి. ఇంకా ఉపయోగించకపోతే, దానిని ఆరాధనలో భాగంగా చేర్చండి. కేవలం వల్లించడం మాత్రమే కాకుండా, దాని ప్రతి వాక్యానికి ఉన్న బైబిలు అర్థాన్ని మీరు నేర్చుకోండి, సంఘానికి కూడా బోధించండి. అప్పుడు విశ్వాసులు తమ విశ్వాసాన్ని మరింత స్పష్టంగా గ్రహించి, ధైర్యంగా ఒప్పుకోగలుగుతారు.
దేవుడు తన వాక్యములో మనలను స్థిరపరచి, సత్యంలో నడిపించి, మన సేవను ఆశీర్వదించును గాక.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
