
యేసుని శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్లారు అనే అబద్ధంలోని అసంబద్దతలు (రోమన్ సైనికుల తరుపున ఆలోచిద్దాము)
ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు
మత్తయి 28:11-15_ వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడివచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిబడిన యెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందర కలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి.
రోమన్ సైనికులు పిలాతుకు బదులుగా ప్రధాన యాజకులకు ఈ విషయాలను ఎందుకని నివేదించారు? పిలాతు కాపలాదారులను ప్రధాన యాజకులకు, పరిసయ్యులకు అప్పగించాడు. ప్రస్తుతానికి ఈ సైనికులు కయప అతని భాగస్వాముల క్రింద ఉన్నారు. కాబట్టి కాపలాదారులుగా వారి డ్యూటీ నిష్ఫలమైన తర్వాత జరిగిన విషయాలను గురించి కయప అతని భాగస్వాములకు నివేదించడం సరియైనది.
ప్రధాన యాజకుల కోరిక మేరకు యేసుని సమాధి వద్ద కాపలాగా ఉన్న సైనికులు పునరుత్థానం గురించిన మొదటి వార్తను యెరూషలేముకు తీసుకువచ్చారు. సైనికులు జరిగినదంతా ప్రధాన యాజకులకు చెప్పారు, అంటే, 28:2-4 వచనాలలో మత్తయి నమోదు చేసిన అన్ని విషయాలు, భూకంపం, దేవదూత కనిపించడం, రాయి దొర్లడం, ఖాళీ సమాధి. అయితే, ప్రధాన యాజకులకు దీనిపై మరింత సమాచారాన్ని అందజేయడానికి దేవదూత సైనికులకు పునరుత్థానం గురించిన ఏ ఇతర విషయాలను అందించలేదు. అయినప్పటికీ, జరిగిన విషయాలు ఆయన పునరుత్థానం గురించిన ప్రవచనం నిజమైందని ప్రధాన యాజకులకు చెప్పడానికి సరిపోతాయి.
సైనికుల నివేదిక ప్రధాన యాజకులకు చాలా చిరాకు తెప్పించింది. వారు తమ విజయం గురించి చాలా ఖచ్చితంగా ఉన్నారు, ఇప్పుడు ఇది! ఏమి చేయాలి? వాళ్ళు ఎంత జాగ్రత్త వహించినప్పటికీ, యేసుదేహం సమాధిలో లేదు. నిజానికి ఆయనను చంపడానికి వాళ్ళెంతగానో కష్టపడ్డారు. ఆయన దేహము సమాధిలో పెట్టబడక ముందు వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నారు – ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు. యేసుని బరియల్ లో వాళ్ళు ఉన్నారు, యేసుని సమాధిని రాతితో మూసివేసినప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ సమాధికి పిలాతు ఆజ్ఞతో కావలి పెట్టారు. కాని యేసుని దేహము సమాధిలో లేదు. అక్కడ ఖాళీ సమాధి తప్ప. ఆయన మళ్లీ బ్రతికించబడ్డాడని స్త్రీలు శిష్యులచే ధృవీకరింపబడి యుండటాన్ని కూడా యూదా మతపెద్దలు విని ఉండొచ్చు.
యేసు సిలువపై మరణించిన తర్వాత సమాధి నుండి బయటకు వచ్చాడనే వార్త ప్రజలలో వ్యాపించినట్లయితే, వారి స్వంత ప్రతిష్ట మరియు కీర్తి దెబ్బతింటుంది. పరిస్థితులు ఖచ్చితంగా మరింత ప్రతికూలంగా మారతాయి. పునరుత్థానుడైన మెస్సీయ చాలా చాలా గొప్ప వ్యక్తిగా ఉంటాడు. సమాధి ఖాళీగా ఉందని, యేసు మృతులలో నుండి లేచాడని ఎవరూ ఖండించడంలేదు. ఈ సందిగ్ధంలో, యేసు మరణంలో హస్తం ఉన్న వారందరికీ ఖాళీ సమాధి గురించి తెలియజేయబడింది. మహాసభ సన్హెడ్రిన్ కూడుకొంది. త్వరితంగా సమావేశమైన అనేక మంది సభ్యులు ఈ పరిస్థితి యొక్క కొత్త పరిణామాలపై చర్చించారు. ప్రధాన యాజకుల జీవితంలో ప్రాముఖ్యమైన క్షణాలు ఉన్నాయి అనుకొంటే అవి ఇవే. వారికి వచ్చిన వార్త యేసు దైవత్వమును గురించి తెలియజేస్తుంది. ఆయన సమాధి నుండి విజయవంతంగా బయటకు వచ్చి తద్వారా అతని మెస్సీయత్వాన్ని స్పష్టంగా నిరూపించుకొన్నాడు కాబట్టి ఆయనను మెస్సీయగా అంగీకరించాలా? వారు ఆయన మరణానికి పట్టుబట్టి తప్పు చేశారని ఒప్పుకోవాలా? ఇప్పుడు తమ నాయకత్వాన్ని వదులుకుని, ప్రతిదీ పునరుత్థానమైన ప్రభువుకు అప్పగించాలా? లేదా వారు తమ వ్యతిరేకతను కొనసాగించాలా? వారి హృదయాలను మరింత కఠినతరం చేసుకుంటారా? పునరుత్థానం చేయబడిన మెస్సీయకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారా? ఇప్పుడు తమ స్వజనులకు, పిలాతుకు, లోకానికి యేమని జవాబు చెప్పాలి? ఎలా చెప్తే బాగుంటుంది?
నిజానికి సైనికులు తెచ్చిన వార్త, ఆ పాపులకు కృప యొక్క చివరి అవకాశాన్ని అందించింది. కాని వారందరూ ఏకగ్రీవంగా ఆ కృప హస్తాన్ని తిరస్కరించారు. క్రీస్తును గురించి ఏమీ తెలుసుకోకూడదని నిశ్చయించుకున్నారు. వారు పూర్తిగా మొండిగా మారారు. వాళ్ళు ఆలోచన చేసి సైనికులకు చాల ద్రవ్యమిచ్చి – మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి, అనే దానిని ఫైనల్ చేశారు.
నిజానికి, మొదటిగా ప్రధానయాజకులు లేదా యూదా మతపెద్దలు శిష్యులను స్త్రీలను పిలిచి ఈ విషయమై ఎంక్వయిరీ చెయ్యాలి. చేశారా, లేదే. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి కనీసం ఎలాంటి ప్రయత్నము చెయ్యకుండా యూదా మతపెద్దలు చాలా తర్జనభర్జన తర్వాత వాళ్ళు సైనికులకు లంచం ఇచ్చి అబద్ద సాక్ష్యము పలుకకూడదు అనే యెహోవా ఆజ్ఞను మీరుతూ, అబద్ధం చెప్పడానికి వారిని ప్రేరేపించి ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయనను ఎత్తికొనిపోయిరనే అబద్దాన్ని ప్రాచుర్యము లోనికి తేవాలనే అభిప్రాయానికి వచ్చారు. సమాధి వద్ద జరిగిన నిజమైన సంఘటనల గురించి వారి నోళ్లను మూసివేయడానికి మరియు ఒక కల్పనను భర్తీ చేయడానికి, సత్యాన్ని దాచి అబద్దాన్ని ప్రాచుర్యము లోనికి తేవడానికి ఆ అబద్దాన్ని ధృవీకరించడానికి సైనికులకు చాలా పెద్ద మొత్తములో లంచం ఇవ్వబడింది. పెద్ద మొత్తంలో డబ్బు సులభంగా సమకూర్చబడింది. అనర్హమైన పనులకు సులభంగా స్పాన్సర్లు దొరుకుతారు.
యూదా మతపెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములోని అసంబద్ధతలను ఒక్కసారి పరిశీలిధ్ధాం:
1. యేసుని సమాధి వద్ద ఉంచబడిన రోమన్ సైనికుల సంఖ్య 60. వాళ్ళు యేసు దేహాన్ని కాపాడే ఉద్దేశ్యంతో అక్కడ ఉంచబడ్డారు. వాళ్ళు శిక్షితులైన సైనికులు. రోమన్ రూల్స్ ప్రకారం సైనికులు కాపలా ఉన్నప్పుడు (డ్యూటీలో) నిద్రపోతే శిక్ష మరణమే. మరి యేసు లేచి వెళ్ళిపోతున్నప్పుడు సైనికులందరు నిద్రపోతూ ఉన్నారా? తమ విధి నిర్వహణలో సైనికులు నిద్రపోయినందుకు వారిని ఎందుకని జవాబుదారీగా ఉంచలేదు? వారిలో ఏ ఒక్కరికి కూడా మెలకువ రాకుండా సమాధి మీద రాయిని దొర్లించడం సాధ్యమేనా? సైనికులు “నిద్రలో” ఉంటే, శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించారని వాళ్లకు ఎలా తెలుసు. ఒకవేళ సైనికులు “మేల్కొని ఉంటే,” వాళ్ళు శిష్యులను ఎందుకని ఆపలేదు, పట్టుకోలేదు. సైనికులు వాళ్లకు ఎందుకని భయపడ్డారు? తరువాతైనా శిష్యులే యేసుని దేహాన్ని దొంగిలించినట్లు ఎందుకని వాళ్ళు రుజువు చెయ్యలేదు? ఆ దిశగా వాళ్ళు కనీసం ప్రయత్నించను కూడా లేదు ఎందుకని? ప్రధానయాజకులు లేదా మహాసభ సన్హెడ్రిన్ వారు శిష్యులను పిలిచి ఎంక్వయిరీ చెయ్యను కూడా లేదు, ఎందుకని?
2. శిష్యులు సాయుధులైన రోమన్ సైనికుల నుండి వారి కావలిలో ఉన్న సమాధినుండి యేసుని దేహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారంటే ఎలా నమ్మగలం? ఎందుకంటే అక్కడ గొడవ జరిగిన దాఖలాలు ఏవి లేవు. శిష్యులలో ఏ ఒక్కరు గాయపడలేదు.
3. శిష్యులు సమాధిపై ఉన్న ముద్రను పగలగొట్టి యేసు శరీరాన్ని దొంగిలించి ఉంటే, ఈ దుష్కార్యానికి వారిని ఎందుకు శిక్షించలేదు? దొంగిలించబడిన శరీరాన్ని సమాధికి తిరిగి తీసుకురావాలని వారిని ఎందుకు బలవంతం చేయలేదు? రోమన్ గార్డుల దృష్ట్యా శిష్యులు శరీరాన్ని దొంగిలించడానికి ధైర్యం చేయడం అంటే మరణాన్ని ఆహ్వానించడం కాదా?
4. సమాధులను దోచుకొనే దొంగలు ఒకవేళ యేసుని సమాధిని తెరచి యేసుని ఎత్తుకొనిపోయి ఉంటే ఆయనను అలాగే ఎత్తుకొనిపోయి ఉండేవాళ్ళు తప్ప ఆయన దేహమును చుట్టిన నారబట్టను పూర్తిగా విప్పేసి వాటిని చక్కగా మడిచి (అదికూడా నేను తిరిగి వత్తును అనే అర్ధములో) ఆయన నగ్నదేహాన్ని ఎత్తుకొనిపోయారా? లేదా ఆయనకు మరొక బట్టను చుట్టి ఎత్తుకొని పోయి ఇంకెక్కడన్న పాతిపెట్టారా?
యూదా మతపెద్దలు ప్రాచుర్యములోనికి తెచ్చిన ఈ అబద్దములోని అసంబద్ధతలను బట్టి వీళ్ళని వెర్రివాళ్ళు అనుకోకండి. వీళ్ళు ప్రాచుర్యము లోనికి తెచ్చిన ఈ అబద్దమును వీళ్ళు ఎంత మేనేజ్ చేసారో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. (చరిత్రపరంగా, మతపరంగా, రాజకీయపరంగా ఈ అబద్దమును మేనేజ్ చెయ్యాలి) చేశారు. అందుకనే రోమన్ రికార్డ్స్ లో యేసుని దేహానికి ఏమయ్యింది అనే విషయమై ఎలాంటి సమాచారం లేకుండా యూదా మతపెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు.
యేసు లేచాడనే సాక్ష్యాలు తారుమారు చెయ్యాలి, చేశారు. సైనికులు వారి జీవితాంతము నోరువిప్పకుండా వారి చుట్టూ వారికి తెలియకుండా కస్టడీ ఏర్పాటు చేసి ఉంటారు, అలాగే వాళ్ళు ఇందుకోసమై కరడుకట్టిన మత ఛాందసవాదులను కూడా ఏర్పాటు చేసుకొన్నారు. ఈ అబద్దాని ప్రజలలోనికి వైరల్ గా తీసుకొని వెళ్ళాలి అంటే ఇశ్రాయేలులోని ప్రతి ఒక్కరి దగ్గరకు ప్రతి గ్రామానికి ఈ అబద్దాన్ని చేర్చవలసి ఉన్నారు. ఇందుకు వాళ్ళు సమయాన్ని, సంపదను, సామర్ధ్యమును వెచ్చించవలసియున్నారు. ఈ అబద్ధము వ్యాపించే క్రమములో అది ప్రజలలో ఎన్నో సందేహములను లేవనెత్తాలంటే వాళ్ళు ఈ అబద్దాన్ని భూదిగంతముల వరకు వ్యాపింప చెయ్యవలసి ఉన్నారు, వ్యాపింప చేశారు. ప్రజలు ఈ అబద్దాన్ని నమ్మేలా చేయడంలో యూదా మతపెద్దలు విజయం సాధించామనే అనుకొన్నారు.
యూదా మత పెద్దలు ప్రాచుర్యము లోనికి తెచ్చిన అబద్దములో క్లిష్టమైన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఖాళీ సమాధి. యూదా మతపెద్దలేమో యేసుని శిష్యులు యేసుని దేహాన్ని ఎత్తుకొనిపోయారని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా చూపెడుతున్నారు. ఇదేమో అందరికి అందుబాటులో వాస్తవంలో కనబడుతూ ఉంది. ఇక్కడ యేసుని శిష్యులు అంటే అపొస్తలులు, అరిమతియా యేసేపు, నీకొదేములాంటి అత్యంత ధనవంతులు, ప్రభావశీలురు, ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు యేసుకు రహస్య అనుచరులుగా ఉన్నారు. ఇలా చాలామంది శిష్యులు యేసుకు ఉన్నారు అనే విషయం మరచిపోకండి.
రెండవది యేసుని పునరుత్థానము. అపొస్తలులు యేసును దగ్గరగా వెంబడించిన స్త్రీలలో కొందరు యేసు లేచియున్నాడని తాము ప్రత్యక్షంగా చూచి యున్నామని చెప్తున్నారు. అందుకు ఖాళీ సమాధిని రుజువుగా వాళ్ళు కూడా చూపెడుతున్నారు. మరి యేసు లేచినట్లైతే ఆయన అందరికి ఎందుకని తన్నుతాను ప్రత్యక్షపర్చుకోలేదు. ఈ రెండిటిని కలిపి అర్ధం చేసుకోవడమే వాళ్ళు ప్రాచుర్యములోనికి తెచ్చిన అబద్దములో ఉన్న చిక్కు ప్రశ్న.
చివరిగా, లంచం ఇవ్వడం మరియు లంచాలు తీసుకోవడం అనైతిక చర్యలు. తన సైనికులు లంచాలు తీసుకొన్నారని పిలాతుకు తెలుస్తుంది. ఈ విషయం ప్రధాన యాజకులకు, మహాసభ సన్హెడ్రిన్ కు మరియు సైనికులకు తెలుసు. కాబట్టే వీళ్ళు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇది గవర్నర్ చెవులకు చేరితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైనికులకు హామీ ఇచ్చారు. అలాంటప్పుడు, వారు గవర్నర్‌ను ఒప్పించి, ఒప్పించడం ద్వారా అతనిని ప్రభావితం చేసి, సైనికులు శిక్షించబడకుండా అతన్ని శాంతింపజేస్తామని వారికి హామీ ఇచ్చారు. అది చాలా సులభం. వారు పిలాతుకు వాస్తవ పరిస్థితిని వ్యక్తిగతంగా తెలియజేసి సైనికులు నిర్దోషులని అతనికి చెబుతారు. ప్రజలలో ఎటువంటి గందరగోళం రాకుండా ఉండటానికి, వారు కథను కనుగొన్నారు. పిలాతు అర్థం చేసుకుంటాడు. లంచం ఇవ్వడం విషయానికొస్తే, అది చాలా సాధారణం మరియు ఈ విషయంలో దోషులుగా ఉన్న ప్రాంతీయ రోమన్ అధికారులు నైతిక తప్పుగా దీనిని పరిగణించరు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl