
తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది?
పరలోకం పరిపూర్ణమైన స్థలం, అక్కడ పాపము లేదు. మరి సాతానుకు తిరుగుబాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్న లోతైనది వేదాంతపరమైనది. సాతాను తిరుగుబాటు మూలాల గురించి బైబులు చెప్పటం లేదు. సాతాను తనతో పాటు చాలా మంది పతనానికి కారణమవుతుందని తెలిసి కూడా దేవుడు దానిని ఎందుకని సృజించాడు? సాతాను వాని దూతలు ఎలా వ్యవస్థీకృతమైయ్యారో అనే ప్రశ్నలకు బైబిలు సమాధానం ఇవ్వటం లేదు. కొంతమంది బైబిల్ వ్యాఖ్యాతలు సాతాను తిరుగుబాటు టైం ప్రారంభంలో జరిగుండొచ్చని చెప్తారు. అందుకు వాళ్ళు ఆదికాండము 1:2 వచనాన్ని ఆధారం చేసుకొంటూ, ఎందుకని “భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది” మరియు “ఎందుకని చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది” అని ప్రశ్నిస్తూ, దీనికి సాతాను పతనమే కారణమని చెప్తారు. దేవుడు సృష్టిని, దాని క్రమాన్ని పునరుధ్దరించడాన్ని ఆదికాండము 1వ అధ్యాయము చెబుతుందని వాళ్ళు నమ్ముతారు.
అయితే, ఈ ఆలోచనను బైబిలు సమర్ధించడం లేదు. ఆరవ రోజున సృష్టి పూర్తయినప్పుడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెనని, ఆదికాండము 1:31, చెబుతుంది. దేవదూతలు సృష్టించబడిన జీవులు కాబట్టి, దేవదూతలు ఇప్పటికే పాపం చేసి ఉంటే దేవుడు ఈ ప్రకటన చేసి ఉండేవాడు కాదని కొందరు గట్టిగా చెప్తారు. దేవదూతలతో సహా దేవుని సృష్టి అంతా పరిపూర్ణంగా ఉంది.
దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత సాతాను పాపం చేసి ఉంటాడని బైబులు సూచిస్తుంది. సాతాను ఆదాము హవ్వలను పాపము చేయడానికి శోధించినందున ఇది మానవుని పతనానికి ముందు జరిగింది.
ఆదాము హవ్వలలు సృష్టింపబడినప్పటి నుండి వారి పతనం వరకు ఎంత సమయం గడిచింది? అనే ప్రశ్నకు కూడా బైబులు మౌనంగా ఉన్నప్పటికీ, ఇది చాలా తక్కువ కాలం అని అనిపిస్తుంది. పతనానికి ముందు ఆదాము హవ్వలకు పిల్లలు లేరనే వాస్తవం దీనికి మద్దతు ఇస్తుంది. వాళ్ళు పరిపూర్ణులుగా పవిత్రులుగా, దేవుని ఆజ్ఞలను అమలు చేసే వాళ్ళు. ఆ దేవుని ఆజ్ఞలో ఒకటి, “మీరు ఫలించి అభివృద్ధిపొందుడి” ఆదికాండము 1:28 అనేది. వారికి పిల్లలను కనాలనే కోరిక సామర్థ్యం రెండూ ఉన్నాయి. కాని వారికి సంతానం లేకపోవడం వారి సృష్టి – పతనం మధ్యన సంవత్సరాలు కాకుండా కొన్ని రోజులు ఉండొచ్చని సూచిస్తుంది. ఆ రోజుల్లో ఒక దానిలో సాతాను దేవుడు సృష్టించిన వాటిలో మొదటి విషాదకరమైన కేసు అయ్యాడు.
కొంతమంది దేవదూతలు దేవుడిపై తిరుగుబాటు చేశారని బైబులు సూచిస్తుంది. 2 పేతురు 2:4, “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలముల లోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. వారి పాపం ఏమిటో మనకు ఖచ్చితంగా చెప్పబడలేదు. నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును, సామెతలు 16:18. కాబట్టి, కొందరు గర్వాన్ని అసలు నేరంగా సూచిస్తున్నారు. 1 తిమోతి 3:6, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు” అని పౌలు చెబుతున్నాడు. గర్వం అపవాది యొక్క అసలు పాపం అని సూచిస్తుంది.
సాతాను మొదట ఉన్నత హోదా కలిగిన దేవదూతగా సృష్టించబడ్డాడు, కాని మానవుల మాదిరిగానే వాడికి కూడా స్వేచ్ఛా సంకల్పం ఇవ్వబడింది. సాతాను తిరుగుబాటు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛా సంకల్పం యొక్క విషాదకరమైన దుర్వినియోగం. ఈ తిరుగుబాటు సాధారణంగా గర్వం మరియు దేవునిలా హెచ్చయిన స్థితిలో ఉండాలనే కోరికతో ముడిపడి ఉంది, యెహెజ్కేలు 28:12–19, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. యెషయా 14:12–15, –నేను ఆకాశమున కెక్కి పోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. యెహెజ్కేలు 28 ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తుంది. ఈ మాటలు దుష్ట తూరు రాజును ఉద్దేశించి చెప్పినప్పటికీ, ప్రభువు అతన్ని సాతానుతో పోలుస్తున్నట్లు కనిపిస్తుంది. అలా అయితే, ఈ వృత్తాంతం సాతాను వాని దూతల సృష్టి, పతనం మరియు చివరికి నాశనం గురించి కొన్ని వివరాలను ఇస్తుంది.
మరోసారి, ప్రస్తుత సందర్భం ఒక భూసంబంధమైన పాలకుడిని, అంటే బాబిలోన్ రాజును సూచిస్తుంది. ప్రవచనం కొన్నిసార్లు ఒకే విభాగంలో ఇద్దరు సారూప్య వ్యక్తుల గురించి లేదా సంఘటనల గురించి మాట్లాడగలదని గుర్తించి, ఈ ప్రవచనంలోని రాజు పతనం బాబిలోన్ రాజు మరియు సాతాను ఇద్దరి గురించి మాట్లాడుతుండవచ్చు. ఈ విభాగం సాతానుకు లూసిఫర్ అనే పేరు ఎలా ఉపయోగించబడిందో వివరిస్తుంది. హీబ్రూ పాత నిబంధన యొక్క లాటిన్ అనువాదం యెషయా 14:12లో “లూసిఫర్” అనే పదాన్ని ఉపయోగించింది. లూసిఫర్ అనే పదానికి “ఉదయ నక్షత్రం” అని అర్థం. ఈ శీర్షిక పరలోకములో – దేవదూతలలో – సాతాను యొక్క ప్రత్యేక స్థానాన్ని సూచిస్తుంది. ప్రకటన 22:16లో ఉదయపు నక్షత్రం అనేది క్రీస్తు పేరు అని గమనించండి.
సాతాను చేసిన నిర్దిష్ట నేరం, దేవుని పవిత్ర చిత్తానికి విరుద్ధం. దేవుణ్ణి తన సింహాసనం నుండి తొలగించి తనను తాను భూమికి పాలకుడిగా ఉంచుకోవడం దీని లక్ష్యం. సాతాను ఆదాము హవ్వలకు వాగ్దానం చేసినప్పుడు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవుడిలా ఉంటారు, అని చెప్పాడు, ఆదికాండము 3:5. ఈ ప్రకటన ఎంత అబద్ధమో సాతానుకు వ్యక్తిగత అనుభవం నుండి తెలుసు. అదే అబద్ధంతో అతడు తనను తాను మోసం చేసుకున్నాడు.
సాతాను గర్వించాడని వాడి గర్వము వాడి పతనానికి నాంది పలికిందని వేదంతవేత్తలు చెప్తారు. అపవాది చేసిన మొదటి పాపం శారీరక ప్రలోభం కాదని, అది ఒక మేధోపరమైన గర్వమని అక్వినాస్ చెప్పాడు – వాడి స్వభావానికి అతీతంగా “దేవునిలా” ఉండాలనే కోరిక.
అగస్టీన్ లాంటి కొంతమంది వేదాంతవేత్తలు, చెడు కారణం లేకుండా ఉద్భవించిందని నొక్కి చెబుతూ, దానిని “ధర్మవిరోధ సంబంధమైన మర్మము” (2 థెస్సలొనీకయులు 2:7) అని చెప్పారు. ఈ దృక్కోణంలో, సాతాను తిరుగుబాటును పూర్తిగా వివరించలేము. చెడుకు సానుకూల స్వభావం లేదు కాని మంచిని కోల్పోవడమే ‘చెడు’ అని వారి ఉద్దేశ్యము.
సాతాను మానవాళి పట్ల అసూయపడి వారిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడని, తద్వారా దేవుని సృష్టి ప్రణాళికను వ్యతిరేకించాడని ఈ తిరుగుబాటు చర్య బాహ్య ప్రభావం వల్ల కాదు, సాతాను స్వంత ఎంపికలు మరియు కోరికల ఫలితంగా జరిగిందని ఐరేనిస్ అఫ్ లీయోన్స్ (క్రీ.శ. 130-202) తప్పుగా అభిప్రాయపడ్డాడు.
అగస్టీన్, సాతాను పతనం వాడి స్వంత స్వేచ్ఛా సంకల్పం మరియు అహంకారం ఫలితంగా జరిగిందని వాదించాడు. అగస్టీన్ ప్రకారం (క్రీ.శ. 354-430), దేవునిచే మంచిగా సృష్టింపబడిన సాతాను, దేవునితో సమానంగా ఉండాలనే కోరికతో తిరుగుబాటును ఎంచుకున్నాడని, స్వేచ్ఛా సంకల్పం యొక్క ఈ దుర్వినియోగం అతని పతనానికి మరియు ప్రపంచంలోకి చెడును ప్రవేశపెట్టడానికి దారితీసిందని చెప్పాడు. అగస్టీన్ చెడు అనేది ఒక పదార్థం కాదని, స్వేచ్ఛా సంకల్పం యొక్క దుర్వినియోగం నుండి ఉత్పన్నమయ్యే మంచి లేకపోవడం అని నొక్కి చెప్పాడు.
సాతాను తిరుగుబాటు వాడి గర్వం మరియు స్వయంప్రతిపత్తి కోరిక నుండి ఉద్భవించిందని ఆంబ్రోస్ (క్రీ.శ. 340-397) సూచించాడు. సాతాను పతనం వాడి స్వంత ప్రాముఖ్యతను వాడు అతిగా అంచనా వేయడం వల్ల కలిగిన ప్రమాదమని వాడి తిరుగుబాటు దేవుని చిత్తం నుండి తప్పుకోవడం వల్ల కలిగే పరిణామమని అతడు నమ్మాడు. ఆంబ్రోస్ రచనలు గర్వం యొక్క విధ్వంసక శక్తిని మరియు సాతాను తిరుగుబాటులో దాని పాత్రను హైలైట్ చేస్తాయి.
జాన్ క్రిసోస్టమ్ (క్రీ.శ. 349–407) గర్వం కృప నుండి పతనానికి దారితీసిందని నొక్కి చెప్పాడు.
మరికొందరు దేవుని అధికారాన్ని సాతాను ఉద్దేశపూర్వకంగా తిరస్కరించాడని చెప్తారు.
దేవుడు సహా అన్నింటికంటే ఎక్కువగా గౌరవించబడాలనే సాతాను కోరిక వాడి తిరుగుబాటులో కీలకమైన అంశం. ఈ గర్వం మరియు స్వీయ ప్రాముఖ్యత వాన్ని విశ్వాన్ని పరిపాలించగలడని మరియు దేవుని ప్రణాళికలను నిర్దేశించగలనని నమ్మేలా చేసిందని, మరికొందరు అభిప్రాయపడ్డారు.
అధికార కోరికను బట్టి సాతాను దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే ఆ అధికారమునకు బయట ఉండేలా చేసిందని అది అతన్ని దేవుని ప్రణాళికను వ్యతిరేకించేలా చేసిందని సాతాను తిరుగుబాటు దేవుని అధికారానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే చర్యగా ప్రదర్శించాడని, ఇది మంచి చెడుల మధ్య కొనసాగుతున్న విశ్వ యుద్ధానికి నాంది పలికిందని కొందరు నమ్ముతారు.
సాతాను పతనం కథలో స్వేచ్ఛా సంకల్పం పాత్రను బైబిల్ నొక్కి చెబుతుంది, సాతానుతో సహా దేవదూతలకు విధేయత మరియు తిరుగుబాటు మధ్య ఎంచుకునే సామర్థ్యం ఇవ్వబడిందని హైలైట్ చేస్తుంది.
అనేకులు భిన్నమైన అభిప్రాయాలను కలిగియున్నప్పటికిని తొలి చర్చి ఫాదర్లలలో అనేకులు, సాతాను తిరుగుబాటును దేవుడు ఇచ్చిన స్వేచ్ఛా సంకల్పాన్ని దుర్వినియోగం చేయడంగా సమిష్టిగా చూశారు. గర్వం, స్వయంప్రతిపత్తి కోరిక మరియు దేవుని అధికారాన్ని తిరస్కరించడం వారి వివరణలలో కేంద్ర ఇతివృత్తాలు. ప్రతి చర్చి ఫాదర్ ప్రత్యేకమైన అంతర్దృష్టులను అందించినప్పటికీ, స్థిరమైన థ్రెడ్ స్వేచ్ఛా సంకల్పంపై మరియు దాని దుర్వినియోగం యొక్క నైతిక పరిణామాలపై మాత్రమే ద్రుష్టి పెట్టాయి.
సాతాను తిరుగుబాటుకు మూలం గర్వం మరియు దేవునిలా ఉండాలనే కోరిక అని లూథర్ తరచుగా వక్కాణించాడు, యెషయా 14 మరియు యెహెజ్కేలు 28. సాతాను తనను తాను దేవుని కంటే ఉన్నతంగా చేసుకోవాలనుకున్నాడని మరియు సృష్టికర్త తనకు కేటాయించిన స్థానంలో ఉండటానికి నిరాకరించాడని నమ్మాడు. “వాడు ఒక జీవిగా కాకుండా దేవుడిగా ఉండాలని కోరుకున్నాడు” — లూథర్ రచనలు (LW 1:101). ఇది మొదట మంచిగా సృష్టించబడిన సాతాను, గర్వం మరియు స్వీయ-అధిక్యతతో ప్రేరేపించబడి తన స్వేచ్ఛా సంకల్పాన్ని దుర్వినియోగం చేశాడనే ఆలోచనతో సమానంగా ఉంది.
దేవుని సార్వభౌమాధికారం అనుమతించిన తిరుగుబాటు దుష్టత్వంపై కూడా దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారం అనే ఆలోచనకు లూథర్ గట్టిగా కట్టుబడి ఉన్నాడు. దేవుని అనుమతి లేకుండా సాతాను ఏమీ చేయలేడని అతడు నమ్మాడు. సాతాను తాను స్వంతంగా తిరుగుబాటు చేయాలని ఎంచుకున్నప్పటికీ, అతని చర్యలు ఇప్పటికీ దేవుని మొత్తం దైవిక ప్రణాళికలో చక్కగా ఫిట్ అవుతాయి. “దెయ్యం కూడా దేవుని దెయ్యమే” — టేబుల్ టాక్. చెడు నిజమైనది మరియు భయంకరమైనది అయినప్పటికీ, దేవుని నియంత్రణ వెలుపల లేదని లూథర్ నమ్మకాన్ని ఈ విరుద్ధం సంగ్రహిస్తుంది. చెడు యొక్క మూలాన్ని లేదా దేవుడు సాతానును తిరుగుబాటు చేయడానికి ఎందుకు అనుమతించాడో మానవులు పూర్తిగా అర్థం చేసుకోగలరని అతడు నమ్మలేదు. వివరణాత్మక ఊహాజనిత వివరణను అందించే బదులు, దైవిక రహస్య విషయాలలో మానవ కారణాన్ని అతిక్రమించవద్దని అతడు తరచుగా హెచ్చరించాడు.
దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, దేవదూతల పతనాన్ని మరియు ఆదాము హవ్వల పతనాన్ని ఆయన ఖచ్చితంగా అడ్డుకోగలడు. ఆ పతనాలను ఎందుకు అడ్డుకోలేదో దేవుడు వివరించలేదు- అలా చేయాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. రోమా 11:33-36 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి.
బైబిల్ నుండి మనకు తెలిసిన విషయమేమిటంటే, దేవుడు సాతానును చితుకకొట్టుటకు రక్షకున్ని వాగ్దానం చేసాడు (ఆది 3:15 నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను), యేసుక్రీస్తు సరిగ్గా అదే చేశాడు (1 యోహాను 3:8 అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను). ఆత్మ ద్వారా, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుట ద్వారా, క్రైస్తవులు దేవునితో పరిపూర్ణ నిత్య జీవము కొరకు నమ్మకంగా ఎదురుచూడవచ్చు. (ప్రకటన 21:3-4 అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని).
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl