యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట (యేసుని మొదటి సూచక క్రియ)

యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చుట

యోహాను 2:_1 మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 3ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. 5ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6యూదుల శుద్ధీకరణా చార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడి యుండెను. 7యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా, వారు తీసికొని పోయిరి. 9ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 10–ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలు పరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి.

  1. మూడవదినమున అంటే? కానా ఎక్కడవుంది?
  2. యేసు పెండ్లికి ఎందుకని ఆహ్వానించబడ్డాడు?
  3. వైన్ త్వరగా ఎందుకని అయ్యిపోయి ఉండొచ్చు?
  4. మరియ యేసును ఎందుకని జోక్యం చేసుకోమంది?.
  5. మరియ ఈ విషయాన్ని యేసుతో ఎందుకు చెప్పింది?
  6. ఆమె ఒక అద్భుతాన్ని ఆశిస్తుందా?
  7. యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? అను మాటలకు అర్థమేమిటి?
  8. మరియ యేసుకు చెప్పడంలో ఆమె ఉదేశ్యము ఏంటి?
  9. నా సమయమింకను రాలేదని యేసు చెప్పడంలో యేసుని ఉదేశ్యము?
  10. ఆయన మీతో చెప్పునది చేయుమని చెప్పడంలో మరియ అంతర్యం?
  11. నీటిని ద్రాక్షారసముగా మార్చడానికి యేసు ఏమి చేసాడు? నీళ్లను పట్టుకొన్నాడా? ప్రార్ధన చేశాడా? ఆకాశమువైపు కన్నులెత్తి చూసాడా? నీరు ద్రాక్షారసముగా మారు అని చెప్పాడా?
  12. అద్భుతం అనేది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక అసాధారణమైన సంఘటన, ఇక్కడ ఏమి జరిగింది?
  13. ఓయినోస్ అంటే అర్థమేమిటి? యేసు ద్రాక్షారసమును చేశాడా లేదా రియల్ వైన్ ని చేశాడా?
  14. ఈ అద్భుతం The manifestation of Christ’s glory ని ఏవిధముగా బయలుపరుస్తూ ఉంది?
  15. యేసు చేసిన ఈ అద్భుతం యేసుని గురించి ఏయే విషయాలను తెలియజేస్తూ ఉంది?

మూడవ దినమున అంటే? యేసు తన మొదటి శిష్యులను పిలిచిన మూడు రోజుల తర్వాత, నతనయేలుతో సంభాషణ తర్వాత మూడవ రోజున, యేసు తన శిష్యులతో, అంద్రెయ పేతురు యోహాను యాకోబు ఫిలిప్పు మరియు నతనయేలు అను వారితో కలసి గలిలయ సముద్రానికి మధ్యధరా సముద్రానికి ఉత్తర-మధ్య ప్రాంతంలో నజరేతుకు ఈశాన్య, గలిలీ సముద్రానికి వెళ్లే దారిలో ఉన్న కానా అను ఒక ఊరికి ఒక పెండ్లికి వచ్చాడు. నజరేత్‌కు ఈశాన్యంగా 6 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊరు కానా. యోహాను 21:2 ప్రకారం కానా నతనయేలు స్వస్థలం. ఇది ఇప్పుడు కెర్ కెన్నా అని పిలువబడుతూ ఉంది.

యేసు పెండ్లికి ఎందుకని ఆహ్వానించబడ్డాడు? అనే ప్రశ్నకు, యేసు తల్లి అక్కడ ఉంది. ఆమెను బట్టి యేసును ఆయన శిష్యులును ఆ వివాహానికి పిలువబడ్డారు. పెండ్లి తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి అను మాటలను బట్టి యేసుని కుటుంబమంతా ఈ పెండ్లికి హాజరైందని చెప్పొచ్చు (12). యేసుని తల్లికి వధూవరులకు ఉన్న సంబంధమేమిటో మనకు తెలియదు కాని ఆ వివాహములో యేసుని తల్లియైన మరియ సర్వింగ్ ని సూపర్వైజ్ చేస్తూ ఉండటం సేవకులపై అధికారాన్ని కలిగి ఉండటాన్ని బట్టి వధూవరులు మరియకు సన్నిహితులై ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు.

యూదుల పెళ్లిలో, పెండ్లి తరువాత వివాహ ఉత్సవాన్ని కొందరు వారం రోజులపాటు జరుపుకొనే వాళ్ళు. పేదవారైతే ఒక రోజే. యూదులకు పెండ్లి అంటే ఒక పరిశుద్ధ సంస్కారము వంటిది. పెండ్లికి ముందు జరగబోయే పెండ్లి కొరకు వాళ్ళు ఉపవాసాలు ఉండేవాళ్ళు, పాపములు ఒప్పుకొనే వాళ్ళు, వివాహ స్థితి లోనికి ప్రవేశించడమంటే పరిశుద్ధమైన స్థితి లోనికి ప్రవేశించడమని వాళ్ళు అనుకొనే వాళ్ళు. కాబట్టి ఈ వివాహ వేడుకను అంటే ఆ పరిశుద్ధ సంస్కారములోని పరిశుద్ధతను సంతోషాన్ని శ్రద్దగా ప్లాన్ చేసి ఉంటారని మనం అనుకొంటాం. కాని, ఆ వివాహ వేడుకలో అసాధారణమైన ఒక సంఘటన జరిగింది. యూదులకు భోజనంలో వైన్ ప్రధానమైనది. ఆ సెలెబ్రేషన్స్ లో వైన్ అయిపోయింది. వైన్ ఎందుకని అయిపోయిందో కారణం తెలుపబడలేదు. అతిధులు అధికముగా రావడం బట్టి వైన్ అయిపోయిందా లేక అతిధులు వైన్ ను అధికముగా తీసుకోవడాన్ని బట్టి అయిపోయిందా లేక సరిగా ప్లాన్ చెయ్యక పోవడాన్ని బట్టి వైన్ అయిపోయిందా తెలియదు. అలాగే పెండ్లి విందులో వైన్ కి ఏ రోజున కొరత ఏర్పడిందో బైబిలులో చెప్పబడలేదు.

వైన్ త్వరగా ఎందుకని అయిపోయి ఉండొచ్చు? అనే ప్రశ్నకు యేసు అదనపు అతిథులతో వచ్చినందున, వారు వైన్‌ కొరతకు కారణమై ఉండొచ్చని కొందరు అంటుంటారు. మరికొందరు వధూవరులు పేదవారని తగినంత వైన్ని సమకూర్చలేక పోయారని చెప్తుంటారు. ఈ రెండు జవాబులు హాస్యాస్పదమేనని చెప్పాలి.

మరియ యేసును ఎందుకని జోక్యం చేసుకోమంది? అనే ప్రశ్నకు కొందరు ఈ వివాహము మరియ బంధువులలో ఒకరిదని, మరియ బంధువులు ద్రాక్షారసం అయిపోయి ఆతిథ్యం ఇవ్వలేని ఎంబర్రస్సింగ్ పరిస్థితిలో ఉండగా మరియ యేసును జోక్యం చేసుకోమని అడిగి ఉండొచ్చు అని చెప్తారు. వివాహ ఉత్సవంలో వైన్ అయ్యిపోవడం చాలా ఎంబర్రస్సింగ్ సిట్యుయేషన్. ఇబ్బందికరమైన పరిస్థితి.

యేసుని తల్లి అయిన మరియ యేసుని దగ్గరకు వచ్చి వివాహ వేడుకలో  “వైన్ లేదు” అనే విషయాన్ని ఆమె యేసుకు చెప్పింది. మరియ ఈ విషయాన్ని యేసుతో ఎందుకు చెప్పింది? పెండ్లిలో వైన్ అయిపోయింది యేసు నీవును నీ శిష్యులును వెళ్లిపోవచ్చు అనే హింట్ ఏమన్నా ఇచ్చి ఉండొచ్చా? కొందరి వివరణ ఏమిటంటే, ఆ రోజుల్లో కుటుంబ గౌరవానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. వివాహాలు సాధారణంగా ఏడురోజుల పాటు కొనసాగేవి. ఆ సమయంలో వధువు వరుడి కుటుంబాలు ఆహారాన్ని వైన్ని పెండ్లికి వచ్చిన అందరికి సమృద్ధిగా అందుబాటులో ఉంచేవారు. ఆహారము వైన్ లో కొరత అంటే ఆలోచన లేని దారుణమైన వారి ఆతిధ్యాన్ని సూచించడమే కాకుండా ఇంటి పేరు మీద పరువు పోతుంది. కాబట్టే కొందరేమో మరియ బంధువుల కుటుంబం సమాజములో అవమానించబడకుండా ఏమి చెయ్యాలనే విషయంలో ఆమె తన కొడుకును జనరల్ గా సలహా అడిగుండొచ్చు అని చెప్తారు.

యేసు ఏమి చేయగలడు? ఆమె ఒక అద్భుతాన్ని యేసు నుండి ఆశిస్తుందా? యేసు అప్పటికి ఇంకా ఎలాంటి అద్భుతాన్ని చేయనప్పటికి, యేసు ఆ ఇబ్బందికర పరిస్థితిని మార్చగలడనే నమ్మకంతో అయిపోయిన ద్రాక్షారసము విషయములో యేసు ఏదైనా చేయాలని మరియ ఆశించి ఉండొచ్చు అనే విషయాన్ని మనం తోసిపుచ్చలేం. ఆ వివాహ వేడుకలో ఎదురైనా సమస్యను యేసుని అసాధారణ సహాయం ద్వారా వెంటనే పరిష్కరించి ఇబ్బందిని నివారించాలని మరియ కోరుకొంటుందనేది సుస్పష్టం. ఎందుకంటే, ఆమెకు యేసు ఎవరో వ్యక్తిగతముగా తెలుసు. యేసు జన్మమును గురించి దేవదూత తనతో మాట్లాడడం, గొర్రెల కాపరుల సందర్శన, యేసును శిశువుగా మందిరానికి తీసుకొని వెళ్ళినప్పుడు సుమెయోను హన్నల మాటలు, జ్ఞానుల రాకడ, 12 సంవత్సరాల బాలుడైన యేసు యూదా మత పెద్దలతో మాట్లాడటం, యేసుని బాప్తిస్మమును గురించి ఆ బాప్తిస్మములో ఇవ్వబడిన దేవుని సాక్ష్యమును గురించి శిష్యులను ఆయన ఏర్పరచుకోవడం గురించి ఆమె ఆలకించి ఉండొచ్చు. ఇవన్ని మరియకు కలిగిన ప్రత్యక్షతలను నిర్ధారిస్తున్నాయి. మరియ తన హృదయంలో యేసు గురించిన అనేక విషయాలను భద్రము చేసుకొనియున్నదని లూకా 2:51 స్పష్టముగా తెలియజేస్తుంది. తన కుమారుడైన ఈ యేసే మెస్సయ్య అని ఆమె ఎరిగి ఉండటం మూలాన్న తన కొడుకు తప్ప ఏ మనిషి సహాయపడలేని ఆ పరిస్థితులలో మరియ తన కొడుకు వైపు తిరిగింది. అద్భుతాన్ని ఆమె ఆయన నుండి ఎదురు చూసి ఉండొచ్చు. తాను ఒక అద్భుతం చేయాలని మరియ కోరుకుంటోందనే విషయం యేసుకు అర్ధం అయ్యింది.

అయితే యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? అని పలికిన మాటలను మనమెలా అర్ధం చేసుకొందాం. ఎందుకంటే, తెలుగు బైబులులో మరియను “అమ్మ” అని ఇక్కడ తర్జుమా చేసారు కాని గ్రీకు బైబిలులో యేసు ఆమెను “స్త్రీగా” (బయటి వ్యక్తిని) సంభోదించినట్లుగా వ్రాయబడింది. యేసు తన తల్లి అయిన మరియను బయటి వ్యక్తిగా సంబోధించడం ఆమెను మందలించడం కాదు లేక అగౌరవపర్చడం కాదు, మరేమై ఉండొచ్చు?

దేవుని రాజ్య విషయానికి వచ్చేటప్పటికి భూసంబంధమైన సంబంధాలకు ఎలాంటి తావు లేదు కాబట్టే యేసు మరియను దేవుని రాజ్యములోని స్త్రీలలో ఒకరిగా ఆమెను సంభోదించాడు. అలాగే ఇది ఆమెకు ఒక హింట్ ఇస్తూ ఉంది_ అదేమిటంటే మెస్సయ్య కార్యనిర్వహణ విషయములో ఆమె యేసుకు తల్లిగా ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అనే విషయాన్ని ఇది తెలియజేసిందని చెప్పొచ్చు. ఈ పాఠాన్ని మరియ నేర్చుకోలేదు కాబట్టే మత్తయి 12:48లో నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి యేసు తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును అని మళ్ళి చెప్పవలసి వచ్చింది.

యేసు పరిచర్యలో మొదటి అద్భుతానికి సిద్ధమైన వేదికగా ఈ వివాహ ఉత్సవంలో కొరత ఏర్పడుతుందని దేవునికి ముందే తెలుసు. ఈ కొరత ద్వారా తన కుమారుని ఎలా హైలైట్ చెయ్యాలో నిత్యత్వములోనే నిర్ణయించబడింది. వైన్ అయిపోయిన విషయాన్ని మరియ యేసుకు తెలియజేస్తుందని కూడా దేవునికి ముందే తెలుసు. కాకపోతే ఇక్కడ మరియ ఉద్దేశ్యం ఎలా ఉందంటే, ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి వైన్ విషయములో తక్షణమే స్పందించి వెంటనే దేవుని కుమారునిగా ఏదైనా చేయుమనే ఉద్దేశ్యముతో క్రీస్తు కార్యనిర్వహణ విషయములో ఆమె జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది. నేనైతే విషయాలు భిన్నముగా ఉండెడివి అనే ఆమె అంతర్ స్వభావాన్ని బట్టే యేసు అమ్మా నాతో నీకేమి (పని)? అని కఠినముగా చెప్పాడు.

ఈ మాటలలో యేసు నేనేమి చేయలేనని చెప్పడం లేదు. కాబట్టి ఈ మాటలను తిరస్కరణగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ విషయములో తాను సహాయపడగలనని ఆమె తెలుసుకోవాలనేదే యేసుని ఈ మాటలకు అర్ధం. ఈ విషయాన్నే “నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలు ధ్రువీకరిస్తున్నాయి.

నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలకు అర్ధం నా పరిచర్యలోని మాటలు క్రియలు సంఘటనలు అన్ని నిత్యత్వములో ముందుగానే నిర్ణయించబడ్డాయి. కాబట్టి ప్రతిది దేవుడు నిర్ణయించిన టైములో మాత్రమే జరుగుతాయని తండ్రి పరలోకంలో నాకోసం నిర్ణయించిన ఘడియలో నేను దీనిని చేస్తానని యేసు చెప్పాడు. నా సమయమింకను రాలేదని చెప్పటంలో యేసు తన మహిమను కనపర్చేందుకు ఇంకా రైట్ టైం రాలేదని చెప్పాడు. ఎందుకంటే ఆ వివాహ ఉత్సవంలో బహుశా వైన్ ఇంకా పూర్తిగా అయిపోలేదు. వైన్ అయ్యిపోవడం ప్రారంభించింది. అది పూర్తిగా అయిపోవాలి. అద్భుతం ఎప్పుడు చెయ్యాలో ఆ ఘడియ ఖచ్చితముగా దేవునికి మాత్రమే తెలుసు. ఆ ఘడియలో చేసే అద్భుతం విశిష్టమైనదిగా ఉంటూ మెస్సయ్య యొక్క మహిమను కనపర్చుతుంది. దేవుని ఉధ్దేశ్యాన్ని నెరవేరుస్తుంది. ఈ విషయాన్నే యేసు చెప్పాడు తప్ప తాను సహాయపడనని మరియ విన్నపాన్ని యేసు తిరస్కరించలేదు.

మరియ విశ్వాసము యేసు మాటలలో దాగివున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొంది. ఇంకా రాలేదు అంటే వస్తుంది రైట్ టైం రానిమ్మనేగా అర్ధం. కాబట్టే మరియ పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుమని చెప్పింది. ఆమెలో కోపము అసహనము లేదు. ఆమె తన కొడుకుకు వైన్ విషయంలో టైంని గాని పద్ధతిని గాని నిర్దేశించడానికి ప్రయత్నించలేదు. ఆమె ఆ విషయాన్ని యేసుకే  వదిలివేసింది.

అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు వారికి సమీపంలో ఉంచబడియుండెను, యూదులు ఆచారబద్ధంగా శుద్ధి కోసం (తినడానికి ముందు మరియు తరువాత చేతులు కడుగు కొనుటకు, కాళ్ళు కడుగుకొనుటకు మరియు విందుపాత్రలను కడుగుకొనుటకు) ఆ రాతిబానలలోని నీళ్లను వాడుకొనే వాళ్ళు ఈ విషయం, మార్కు 7:3,4 లో ఉంది చూడండి.

యేసు– ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. ద్రాక్షరసం అయిపోయింది అనే మాటలు యేసు ఆయన తల్లి మాట్లాడుకొంటుండగా సేవకులు విన్నారు. అట్లే ఆ విషయములో ఆయనేమి చెప్పిన మీరు చెయ్యండని మరియ సేవకులకు చెప్పింది. ఈయనేమో రాతి బానలను నీళ్లతో నింపుమని చెప్పాడు. సేవకుల రెస్పాన్స్ ఏవిధముగా ఉండొచ్చొ ఊహించండి. ఈయన ద్రాక్షారసము బదులు నీళ్లు పొయ్యమంటాడా ఏంటి అని అనుకొని ఉండొచ్చు కదా. ఆయన మాటలు వారిని అసహనానికి గురిచేసి ఉండొచ్చు. బానలను అంచులమట్టుకు నింపేశారు ఇంక దానిలో ఏమి కలపకుండా. నీళ్లను ద్రాక్షారసముగా మార్చడానికి నీళ్లలో ఏదన్నా కలపాలన్నా కూడా ఖాళీ లేదు.

అప్పుడాయన వారితో– మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా, వారు తీసికొని పోయిరి. ఈ మాటలలో యేసు సేవకులకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు_ మొదటి ఆజ్ఞ, ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. రెండవ ఆజ్ఞ, అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా వారు తీసికొని పోయారు. యేసుని శక్తిగల మాట నీటిని ద్రాక్షారసముగా ఎప్పుడు మార్చెనో మనకు తెలియదు.

ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను. దీనిలో ఎలాంటి సందేహము లేదు. సేవకులు నీళ్ళను రాతిబానలలో నింపారు, తప్ప ఆ నీళ్లు ద్రాక్షారసముగా చెయ్యడానికి వాళ్ళెలాంటి ఎక్స్ట్రా వర్క్ చెయ్యలేదు. యేసు నీళ్లను కూడా ముట్టుకోలేదు. ఎలాంటి ప్రార్ధనా చెయ్యలేదు. ఎలాంటి భూసంబంధమైన మూలకాలు ఆ నీళ్లకు కలుపబడలేదు. యేసుని శక్తి ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చేసింది.  

ద్రాక్షారసమైన ఆ నీళ్లను విందు ప్రధాని రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పాడు.

చాలామంది కామెంటేటర్స్ ఏమని చెప్తారంటే, విందు ప్రధాని ఆ నీళ్లను రుచి చూసే ముందుగా ఆ నీళ్లు ద్రాక్షారముగా మారిపోయాయి అని చెప్తారు. ఆ రోజులలో సాధారణముగా మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు చీప్ క్వాలిటీ పోసేవాళ్ళు అనే విషయాన్ని ఈ స్టేట్మెంట్ తెలియజేస్తుంది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావనే మాటలు యేసు చేసినది రియల్ వైన్ అని బెస్ట్ క్వాలిటీ వైన్ అని తెలియజేస్తుంది.

నిజం చెప్పాలంటే నీళ్లు నీళ్లుగానే ఉంటాయి తప్ప ద్రాక్షారసముగా మారే ఛాన్స్ లేనేలేదు. ఆయన శక్తిగల మాట నీటిని లావిష్ వైన్ గానే కాకుండా సుపీరియర్ క్వాలిటీ వైన్ గా చేసింది. వైన్ తయారీలో అనేక ప్రక్రియలు అవసరం. ద్రాక్ష మొక్క యొక్క పరిపూర్ణమైన పెరుగుదల, మంచి కాపు, ద్రాక్ష పండ్ల మంచి పరిపక్వత, ద్రాక్ష పండ్లను జ్యూస్‌గా తొక్కడం, పులియబెట్టే ప్రక్రియకు అవసరమైన ఏజింగ్ టైం. ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి పులియబెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ మొత్తం కాలవ్యవధిని యేసు రెప్పపాటులో దాటేశాడు. ఇక్కడ ప్రకృతి యొక్క సాధారణ నియమాలను అధిగమించి ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి అవసరమైన కామన్ ఎక్సపెక్టషన్స్ ని ధిక్కరించి యేసుని శక్తివంతమైన చర్య ద్వారా ది బెస్ట్ వైన్ ఉనికి లోనికి వచ్చింది. అద్భుతం అనేది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక అసాధారణమైన సంఘటన. దీనిని నేచురల్ సైంటిఫిక్ నియమాల ద్వారా వివరించలేం. అద్భుతం జరగడానికి సూపర్ నేచురల్ శక్తి మాత్రమే కారణం ఔతుంది. ఆ ఆరు రాతిబానలలో (120–180) గాలెన్స్ నీళ్లు పడతాయి, 488.318 – 681.374 లీటర్లు కావొచ్చు. ఇది చిన్న విషయమేమి కాదండి. దీనిని బట్టి ఈ మొదటి సూచకక్రియ ఎంత పెద్దదో చూడండి. తర్కముతో అద్భుతాలను వివరించలేం. అద్భుతాలు అర్థం చేసుకోలేనివి కాబట్టే అవి అద్భుతాలు. అద్భుతాలు లేవంటే ఎలా? మనచుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి దేవుని అద్భుతమే. ఒప్పుకోవడానికి అహం అడ్డువస్తుందా? తప్పదు దేవుని క్రియలు అద్భుతాలే. 

ఇంత విస్తారముగా నీళ్లను ద్రాక్షారసముగా యేసు ఎందుకని మార్చాడు? యేసు తన దైవికమైన దాతృత్వము లో ఇంత ధారాళముగా వైన్ని ఇవ్వడం కొందరిని ఎంతగానో ఆశ్చర్యపర్చి ఉండొచ్చు. “వైన్” అను మాటకు ఇక్కడ వాడబడిన గ్రీకు పదం “ఓయినోస్, ఇది పులియబెట్టిన/ఆల్కహాలిక్ వైన్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. మద్యం సేవించడాన్ని వ్యతిరేకించే వారు, యేసు నీటిని ఆల్కహాలిక్ వైన్ గా మార్చలేదని వాదిస్తారు. యేసు మద్యము యొక్క వినియోగాన్ని ప్రోత్సహించుచున్నాడా? అని కాన్ఫ్యుజ్ అవుతుంటారు. సద్వినియోగం చేయగల పదార్థాన్ని ఒకడు సృష్టించినప్పుడు మరొకడు దానిని దుర్వినియోగం చేయడానికి మూర్ఖంగా ఎంచుకున్నప్పుడు దాని సృష్టికర్త ఆ విషయములో ఎలాంటి బాధ్యత వహించడు. యేసు ఆల్కహాలిక్ వైన్‌ని సృష్టించడం ఏ విధంగానూ తాగుబోతుతనమును ప్రోత్సహించడం కాదు.

ఈ అద్భుతం క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షతని వెల్లడిచేసింది. శరీరధారిగా భూమిపైకి దిగి వచ్చిన దేవుని కుమారుని సర్వశక్తిమంతత్వాన్ని దైవత్వాన్ని తెలియజేసింది. ఈ అద్భుతము ద్వారా ఐశ్వర్యవంతమైన తండ్రికి కుమారునిగా యేసు తనను తాను నిరూపించుకొన్నాడు. వివాహం ముగిసిన తర్వాత కూడా ఆ ద్రాక్షారసము నిజముగా రూపాంతరం చెందిందనడానికి రుజువుగా అక్కడ ఉంది. లిటరల్ గా అక్కడ అందరి కంటికి కనబడుతూ ఉంది. ఆయన ద్వారా జరిగిన అద్భుతం గురించి అతిథులకు తెలిసినప్పుడు అది వారిని విస్మయానికి గురిచేసింది. అది మెస్మరిక్ ట్రిక్ కాదు. అక్కడ సమృద్ధిగా వైన్ ఉంది. ఆ వైన్ని అందరూ చూసారు, టేస్ట్ చేసారు. ఆ వార్త దావాలనంలా వ్యాపించి ఉంటుంది. ఈ సమాచారం ప్రజలలో యేసుపట్ల శ్రద్ధ ని కలుగ జేసింది. యేసుని మాటలు కున్న అధికారాన్ని తెలియజేసింది. ప్రజలను యేసు వైపు ఆకర్షితులను చేసింది. ఈ మొదటి సూచకక్రియ యేసుని బహిరంగ పరిచర్యకు చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసింది.

యేసు చేసిన ఈ అద్భుతం యేసుని గురించి ఏయే విషయాలు తెలియజేసిందంటే, ఈ అద్భుతము ద్వారా యేసు తన సర్వశక్తిమంతత్వమును బయలుపరచినప్పుడు మనుష్యుడు తిరస్కరించలేని రీతిలో దేవుని మహిమ శిష్యులకు అక్కడ ఉన్న అనేకులకు ప్రత్యక్షపరచబడింది. అది యేసు దేవుని నుండి పంపబడ్డాడని తెలియజేసింది. యేసు దేవుని కుమారుడని దేవుని ఆమోదాన్ని తెలియజేసింది. దేవుని ఉద్దేశ్యం ప్రకారము ఈ సూచక క్రియ ద్వారా యేసు తన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చాడు. మెస్సీయగా తన శక్తిని బహిర్గతపర్చాడు.

క్రీస్తు తన మొదటి అద్భుతాన్ని యెరూషలేము దేవాలయములో చెయ్యలేదు. మెస్సయ్య మొదటిగా తన మహిమను యెరూషలేములోని దేవాలయములోనే చూపిస్తాడని యూదులు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కాని దూరంగా ఉన్న గలిలయను మాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. యేసు తన మొదటి సూచక క్రియకు గలిలయ లోని కానాను ఎంచుకోవడం లేఖనానుసారమే, మత్తయి 4: 12-16 లో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చడానికే.

అంతేనా, 11వ వచనములోని తన మహిమను బయలు పరచెను అనే మాటలు, ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను (ఆయన దైవికమైన లక్షణాలలో) కనుగొంటిమి అనే వచనాన్ని జ్ఞపకం చేస్తుంది. ఇక్కడ యేసు తన దైవికమైన లక్షణాలలో ఒక్కటియైన ఆయనకున్న క్రియేటివ్ పవర్ ను, ఆయన సర్వశక్తిమంతత్వాన్ని బయలుపరచాడు. సర్వశక్తిమంతత్వము ఒక్కటే ఉండదు కదండి. ఆయనలో సర్వశక్తిమంతత్వము ఉందంటే సర్వాంతర్యామి తత్వము, సమస్తమును యెఱుగుట అనే స్వభావము కూడా ఉన్నట్లే కదా. “నా సమయమింకను రాలేదని“ యేసు పలికిన మాటలలో నా పరిచర్యలోని మాటలు క్రియలు సంఘటనలు అన్ని నిత్యత్వములో ముందుగానే నిర్ణయించబడ్డాయి. కాబట్టి ప్రతిది నా తండ్రి  నిర్ణయించిన టైములో మాత్రమే జరుగుతాయని, తండ్రి పరలోకంలో నాకోసం నిర్ణయించిన ఘడియలో నేను దీనిని చేయుదునని చెప్పడంలో ఆయన ఓమిని ప్రెసెన్స్, ఓమిని సైన్స్ చూస్తున్నాం. ఆయన ఆ పెండ్లి విందులో సహాయపడటం అనేది – ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.   

హిస్టారికల్ గా పురావస్తు శాస్త్రవేత్తలు పెద్ద రాతి పాత్రల ముక్కలను కానాలో  కనుగొన్నారు. కాని ప్రత్యేకించి ఆనాటి కానా యొక్క లొకేషన్ విషయంలో మాత్రం విభేదిస్తున్నారు.

మనుష్యులముగా మన బలహీనతలు పరిమితులు ఏమిటో మనకు తెలుసు అయినను దేవుని సూపర్ నేచురల్ పవర్ కున్న శక్తిని నమ్మం. అదే మన సమస్య.

ఈ పాఠము మన ఏయే బలహీనతలను ప్రభువు ముందు ఒప్పుకోమంటుంది?
1. మన అవసరంలో మనం క్రీస్తు వైపు తిరగకుండా, మనపై లేదా ఇతరులపై ఆధారపడటానికి ప్రయత్నిస్తాం.

2. దేవుడు ఇలా చెయ్యమని మనకు చెప్పినప్పుడు, సంకోచం, సందేహం లేదా అవిధేయత చూపకుండా ఉందాం.

3. దేవుడు సమృద్ధిని సంతోషాన్ని ఇచ్చే దేవుడని మర్చిపోకుండా లోభత్వపు స్ఫూర్తితో జీవించకుందాం.

4. మన దైనందిన జీవితాల్లోకి, ఇళ్లలోకి లేదా సంబంధాలలోకి క్రీస్తును ఆహ్వానించడంలో మనం విఫలమవుతున్నాం.

5. ఆధ్యాత్మిక అంధత్వాన్ని ఒప్పుకొందాం – రోజువారీ జీవితంలో దేవుని హస్తాన్ని చూడలేకపోతున్నాం.

ఈ పాఠములోని దేవుని ప్రేమ
1. దేవుడు సాధారణ మానవ ఆనందాలను గురించి కూడా శ్రద్ధ తీసుకొంటాడు. దేవుని ప్రేమ అత్యవసర పరిస్థితులకు మాత్రమే కాదు; ఆయన మీ వేడుకలు, మీ సంబంధాలు మరియు మీ దైనందిన క్షణాలలో ఆనందిస్తాడు. దేవుని ప్రేమ “ఆధ్యాత్మిక” విషయాలకు మాత్రమే కాకుండా మీ మొత్తం మానవ జీవితాన్ని ఆలింగనం చేసుకొని ఉంది.

2. దేవుడు ఉదారంగా మరియు సమృద్ధిగా అందిస్తాడు. ఆయన ప్రేమ పరిమితం కాదు లేదా అయిష్టంగా ఉండదు – అది పొంగిపొర్లుతుంది. దేవుని ప్రేమ “కేవలం సరిపోతుంది.” అది ఉదారంగా లభిస్తుంది, సంపూర్ణమైనది మరియు గొప్పది.

3. దేవుడు మానవ అవసరానికి కరుణతో ప్రతిస్పందిస్తాడు. ఆయన నిశ్శబ్దంగా లేదా దూరంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా దేవుని ప్రేమ మనల్ని కరుణతో కలుస్తుంది. దేవుడు మన గౌరవం మరియు చిన్న అవసరాల గురించి కూడా శ్రద్ధ వహిస్తాడు – అది ఇంకా “మన సమయం” కానప్పుడు కూడా.

4. దేవుని ప్రేమ యేసు మహిమలో వెల్లడైంది. దేవుని ప్రేమ అమూర్తమైనది కాదు – అది యేసులోనే కనిపిస్తుంది. ఆయన అద్భుతం గొప్ప బహుమతికి పూర్వదర్శనం – యేసు తనను తాను అర్పించుకోవడం, ఆనందం మరియు మోక్షం యొక్క నిజమైన “ద్రాక్షారసం”.

ఈ అద్భుతం సిలువను సూచిస్తుంది:
1. యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు → తరువాత, ద్రాక్షారసం ఆయన రక్తానికి చిహ్నంగా మారింది (యోహాను 6, లూకా 22).

2. పాత్రలు యూదుల శుద్ధీకరణ కోసం → యేసు పాత ఆచారాలను కృపతో భర్తీ చేసాడు.

3. ప్రేమ యొక్క ఈ చిన్న చర్య ప్రేమ యొక్క అంతిమ చర్యను అంచనా వేస్తుంది – ఆయన మరణం మరియు పునరుత్థానం.

ఈ పాఠము మనకేమి నేర్పిస్తుంది?
1. దేవుడు చిన్న విషయాల గురించి కూడా శ్రద్ధ వహిస్తాడు. దేవునికి ఏదీ చిన్నది కాదు. మన రోజువారీ విషయాలలో కూడా ఆయన మన అవసరాలు, గౌరవం మరియు ఆనందం గురించి శ్రద్ధ వహిస్తాడు.

2. మీ సమస్యలను మొదట యేసు వద్దకు తీసుకురండి. మనం సమస్యలను ఎదుర్కొన్నప్పుడు, ఆందోళన, నియంత్రణ లేదా ఫిర్యాదులు మనపైకి వచ్చే ముందు – ముందుగా యేసు వద్దకు వెళ్ళదాం.

3. మీరు ఆయనను అర్థం చేసుకోనప్పుడు కూడా ఆయనను నమ్మండి మరియు ఆయన మాటలను పాటించండి. కొన్నిసార్లు దేవుడు మనల్ని వింతగా లేదా సరళంగా అనిపించే పనులు చేయమని అడుగుతాడు. అద్భుతాలు తరచుగా విధేయత మరియు విశ్వాసంతో ప్రారంభమవుతాయి.

4. దేవుని సమయం పరిపూర్ణమైనది. దేవుని ప్రణాళికలు మన సమయంలో కాదు, ఆయన సమయంలోనే జరుగుతాయి. మనం నమ్మకంతో వేచి ఉండటం నేర్చుకోవాలి.

5. దేవుడు సాధారణమైన వాటిని అసాధారణమైనవిగా మారుస్తాడు. మన జీవితంలోని సాధారణ మైన వాటిని మనం యేసు వద్దకు తీసుకువచ్చినప్పుడు, ఆయన వాటిని అందమైన అర్థవంతమైన వాటిగా మార్చగలడు.

6. యేసు నిజమైన ఆనందాన్ని తెస్తాడు. ప్రపంచం తరిగిపోతున్న ఆనందాన్ని ఇస్తుంది, కాని యేసు శాశ్వతమైన, సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తాడు.

7. యేసు కరుణ ద్వారా తన మహిమను వెల్లడిస్తాడు. దేవుని మహిమ ఆయన శక్తిలో మాత్రమే కాదు, ఆయన ప్రేమ, కృప, దయలో కూడా వెల్లడవుతుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl