యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చడం (యేసుని మొదటి సూచక క్రియ)
యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చడం
యోహాను 2:_1 మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 3ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా 4యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయమింకను రాలేదనెను. 5ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6యూదుల శుద్ధీకరణా చార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడి యుండెను. 7యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా, వారు తీసికొని పోయిరి. 9ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 10–ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 11గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలు పరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి.
- మూడవదినమున అంటే? కానా ఎక్కడవుంది?
- యేసు పెండ్లికి ఎందుకని ఆహ్వానించబడ్డాడు?
- వైన్ త్వరగా ఎందుకని అయ్యిపోయి ఉండొచ్చు?
- మరియ యేసును ఎందుకని జోక్యం చేసుకోమంది?.
- మరియ ఈ విషయాన్ని యేసుతో ఎందుకు చెప్పింది?
- ఆమె ఒక అద్భుతాన్ని ఆశిస్తుందా?
- యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? అను మాటలకు అర్థమేమిటి?
- మరియ యేసుకు చెప్పడంలో ఆమె ఉదేశ్యము ఏంటి?
- నా సమయమింకను రాలేదని యేసు చెప్పడంలో యేసుని ఉదేశ్యము?
- ఆయన మీతో చెప్పునది చేయుమని చెప్పడంలో మరియ అంతర్యం?
- నీటిని ద్రాక్షారసముగా మార్చడానికి యేసు ఏమి చేసాడు? నీళ్లను పట్టుకొన్నాడా? ప్రార్ధన చేశాడా? ఆకాశమువైపు కన్నులెత్తి చూసాడా? నీరు ద్రాక్షారసముగా మారు అని చెప్పాడా?
- అద్భుతం అనేది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక అసాధారణమైన సంఘటన, ఇక్కడ ఏమి జరిగింది?
- ఓయినోస్ అంటే అర్థమేమిటి? యేసు ద్రాక్షారసమును చేశాడా లేదా రియల్ వైన్ ని చేశాడా?
- ఈ అద్భుతం The manifestation of Christ’s glory ని ఏవిధముగా బయలుపరుస్తూ ఉంది?
- యేసు చేసిన ఈ అద్భుతం యేసుని గురించి ఏయే విషయాలను తెలియజేస్తూ ఉంది?
తన మొదటి శిష్యులను పిలిచిన మూడు రోజుల తరువాత, యేసు వారితో కలిసి కానాలో ఒక పెళ్ళికి వెళ్ళాడు. యేసు తన శిష్యులతో, అంద్రెయ పేతురు యోహాను యాకోబు ఫిలిప్పు మరియు నతనయేలు అను వారితో కలసి గలిలయ సముద్రానికి మధ్యధరా సముద్రానికి ఉత్తర— మధ్య ప్రాంతంలో నజరేతుకు ఈశాన్యంగా, గలిలీ సముద్రానికి వెళ్లే దారిలో ఉన్న కానా అను ఒక ఊరికి ఒక పెండ్లికి వచ్చాడు. నజరేత్‌కు ఈశాన్యంగా 6 మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న ఊరు పేరే కానా. యోహాను 21:2 ప్రకారం కానా నతనయేలు స్వస్థలం. ఇది ఇప్పుడు కెర్ కెన్నా అని పిలువబడుతూ ఉంది.
ఆయన తల్లియైన మరియ అక్కడ ఉన్నందున యేసు పెండ్లికి ఆహ్వానించబడ్డాడు. ఆమెను బట్టి యేసును ఆయన శిష్యులును ఆ వివాహానికి పిలువబడ్డారు. పెండ్లి తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి అను మాటలను బట్టి యేసుని కుటుంబమంతా ఈ పెండ్లికి హాజరైందని చెప్పొచ్చు (12). యేసుని తల్లికి వధూవరులకు ఉన్న సంబంధమేమిటో మనకు తెలియదు కాని ఆ వివాహములో యేసుని తల్లియైన మరియ సర్వింగ్ ని సూపర్వైజ్ చేస్తూ ఉండటం, సేవకులపై అధికారాన్ని కలిగి ఉండటాన్ని బట్టి వధూవరులు మరియకు సన్నిహితులై ఉండొచ్చు.
యూదు సంస్కృతిలో, వివాహ ఉత్సవాన్ని కొందరు వారం రోజులపాటు జరుపుకొనే వాళ్ళు. పేదవారైతే ఒక రోజే. యూదులకు పెండ్లి అంటే ఒక పరిశుద్ధ సంస్కారము వంటిది. పెండ్లికి ముందు జరగబోయే పెండ్లి కొరకు వాళ్ళు ఉపవాసాలు ఉండేవాళ్ళు, పాపములు ఒప్పుకొనే వాళ్ళు. కాబట్టి ఈ వివాహ వేడుకను శ్రద్దగా ప్లాన్ చేసి ఉంటారని మనం అనుకొంటాం. కాని, ఆ వివాహ వేడుకలో అసాధారణమైన ఒక సంఘటన జరిగింది. ఈ వివాహ సమయంలో, వైన్ అయిపోయింది. అటువంటి వేడుకలలో వైన్ ఒక ముఖ్యమైన భాగం. అది ఎందుకు అయిపోయిందో బైబిల్ చెప్పడం లేదు. అతిధులు అధికముగా రావడం బట్టి వైన్ అయిపోయిందా లేక అతిధులు వైన్ ను అధికముగా తీసుకోవడాన్ని బట్టి అయిపోయిందా లేక సరిగా ప్లాన్ చెయ్యక పోవడాన్ని బట్టి వైన్ అయిపోయిందా మనకు తెలియదు. అలాగే పెండ్లి విందులో వైన్ కి ఏ రోజున కొరత ఏర్పడిందో బైబిలు చెప్పటం లేదు.
యేసు అదనపు అతిథులను తీసుకువచ్చినందున లేదా దంపతులు పేదవారు కాబట్టి ఇది జరిగిందని కొందరు చెప్తుంటారు. కానీ ఈ ఆలోచనలు కేవలం ఊహలు మాత్రమే. బైబులు ఈ ఊహలకు మద్దతు ఇవ్వటంలేదు. ఈ రెండు ప్రశ్నలు హాస్యాస్పదమైనవని చెప్పాలి.
మరియ యేసు దగ్గరకు వచ్చి, “వారి దగ్గర ద్రాక్షారసం లేదు” అని చెప్పింది. పెళ్లిలో వైన్ అయిపోవడం చాలా ఇబ్బందికరం మరియు కుటుంబానికి అది అవమానాన్ని తెస్తుంది.
మరియ ఈ విషయాన్ని యేసుకు ఎందుకని చెప్పిందో? బైబిల్ స్పష్టమైన కారణాన్ని ఇవ్వటం లేదు. ఆమె హోస్ట్‌ల గురించి ఆందోళన చెంది ఉండొచ్చు. ఆమెకు సన్నిహితులైన ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా వారికి సహాయం చేయాలనుకుంది. కొందరి వివరణ ఏమిటంటే, ఆ రోజుల్లో కుటుంబ గౌరవానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. వివాహాలు సాధారణంగా ఏడురోజుల పాటు కొనసాగేవి. ఆ సమయంలో వధువు వరుడి కుటుంబాలు ఆహారాన్ని వైన్ని పెండ్లికి వచ్చిన అందరికి సమృద్ధిగా అందుబాటులో ఉంచేవారు. ఆహారము/ వైన్ లో కొరత అంటే ఆలోచన లేని దారుణమైన వారి ఆతిధ్యాన్ని సూచించడమే కాకుండా ఇంటి పేరు మీద పరువు పోతుంది. కాబట్టి ఆ కుటుంబం సమాజములో అవమానించబడకుండా ఏమి చెయ్యాలనే విషయంలో, మరియ సమస్యను యేసు వద్దకు తీసుకువెళ్లింది — ఆయన ఎలా సహాయం చేస్తాడో ఆమెకు పూర్తిగా అర్థం కాకపోయినను/ తెలియకపోయినను. అవసరమైన సమయాల్లో, మనం మన ఆందోళనలను యేసు వద్దకు తీసుకు వెళ్లాలనే సాధారణ సత్యాన్ని ఇది మనకు తెలియజేస్తూ ఉంది.
మరియ తన సమస్యను యేసు దగ్గరకు తెచ్చింది — కానీ ఆయన ఏమి చేయాలని ఆమె ఆశించిందో బైబిల్ స్పష్టంగా చెప్పటం లేదు. ఆయన ఇంకా ఎలాంటి అద్భుతాలు చేయనప్పటికీ, ఆయన ఏదో ఒక ప్రత్యేక మార్గంలో సహాయం చేస్తాడని ఆమె ఆశించి ఉండొచ్చు. ఆమెకు యేసు ఎవరో వ్యక్తిగతముగా తెలుసు. యేసు జన్మమును గురించి దేవదూత తనతో మాట్లాడడం, గొర్రెల కాపరుల సందర్శన, యేసును శిశువుగా మందిరానికి తీసుకొని వెళ్ళినప్పుడు సుమెయోను హన్నల మాటలు, జ్ఞానుల రాకడ, 12 సంవత్సరాల బాలుడైన యేసు యూదా మత పెద్దలతో మాట్లాడటం, యేసుని బాప్తిస్మమును గురించి ఆ బాప్తిస్మములో ఇవ్వబడిన దేవుని సాక్ష్యమును గురించి, శిష్యులను ఆయన ఏర్పరచుకోవడం గురించి ఆమె ఆలకించింది. ఇవన్ని మరియకు కలిగిన ప్రత్యక్షతలను నిర్ధారిస్తున్నాయి. మరియ తన హృదయంలో యేసు గురించిన అనేక విషయాలను భద్రము చేసుకొనియున్నదని లూకా 2:51 స్పష్టముగా తెలియజేస్తుంది. యేసు వాగ్దానం చేయబడిన మెస్సీయ అని ఆమె నమ్మింది మరియు ఆయనను విశ్వసించింది. తన కొడుకు తప్ప ఏ మనిషి సహాయపడలేని ఆ పరిస్థితులలో మరియ తన కొడుకు వైపు తిరిగింది. ఆయన నుండి అసాధారణమైన దానిని ఆమె ఎదురు చూసి ఉండొచ్చు. తాను ఒక అద్భుతం చేయాలని మరియ కోరుకుంటోందనే విషయం యేసు అర్థం చేసుకున్నాడు.
అయితే యేసు ఆమెకు జవాబిస్తూ ఆమెతో— అమ్మా, నాతో నీకేమి (పని)? అని చెప్పడం, ఆయన మరియ పట్ల మొరటుగా లేదా అగౌరవంగా ప్రవర్తించడం కాదు. తెలుగు బైబులులో ఇక్కడ మరియను “అమ్మ” అని తర్జుమా చేసారు కాని గ్రీకు బైబిలులో యేసు ఆమెను “స్త్రీగా” సంభోదించాడు. యేసు తన తల్లి అయిన మరియను స్త్రీగా సంబోధించడం ఆమెను మందలించడం కాదు మర్యాదగా చాలా మాములుగా సంభోదించాడు.
దేవుని రాజ్య విషయానికి వచ్చేటప్పటికి భూసంబంధమైన సంబంధాలకు ఎలాంటి తావు లేదు కాబట్టే యేసు మరియను దేవుని రాజ్యములోని స్త్రీలలో ఒకరిగా ఆమెను సంభోదించాడు. మెస్సీయగా తన పని భూసంబంధమైన సంబంధాల ద్వారా నిర్దేశించబడలేదని మరియు దేవుని రాజ్యంలో, మానవ సంబంధాలు ఆయన మిషన్‌ను నియంత్రించవని ఆయన ఈ విధంగా సంబోధించడం దారా తెలియజేస్తున్నాడు. ఆయన తల్లిగా మరియ ఆయనేం చేయాలో ఆయనకు చెప్పలేక పోయింది. కాబట్టి, యేసు ప్రతిస్పందన సున్నితమైన దిద్దుబాటు. ఆయన మానవ అంచనాల ప్రకారం కాకుండా తండ్రి చిత్తానికి అనుగుణంగా పనిచేస్తాడని ఆమెకు మరియు మనకు గుర్తు చేస్తున్నాడు. ఈ పాఠాన్ని మరియ నేర్చుకోలేదు కాబట్టే మత్తయి 12:48లో నా తల్లి యెవరు? నా సహోదరులెవరు? అని చెప్పి యేసు తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును అని మళ్ళి చెప్పవలసి వచ్చింది.
యేసు పరిచర్యలో మొదటి అద్భుతానికి సిద్ధమైన వేదికగా ఈ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతుందని దేవునికి ముందే తెలుసు. ఆయన తన మొదటి అద్భుతం ద్వారా యేసు శక్తిని వెల్లడించడానికి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. వైన్ అయిపోయిన విషయాన్ని మరియ యేసుకు తెలియజేస్తుందని కూడా దేవునికి ముందే తెలుసు. ఆయన వెంటనే చర్య తీసుకుంటాడని ఆశించి మరియ యేసుకు సమస్య గురించి చెప్పింది. ఆమె తన అభ్యర్థనలో ఆయన ఎలా స్పందించాలో నిర్ధేశించమనే కోరికను వ్యక్తపర్చింది.
దీనికి యేసుని సమాధానం, “అమ్మా, దీనికి నాకేమి సంబంధం?” ఇది తిరస్కరణ కాదు. ఆయన ఆమెను సున్నితంగా సరిదిద్దుతూ, తన మిషన్ మరియు సమయం తండ్రి అయిన దేవునిచే మార్గనిర్దేశం చేయబడిందని – మానవ అంచనాల ద్వారా కాదు అనే విషయాన్ని తెలియజేశాడు.
“నా సమయం ఇంకా రాలేదు” అని ఆయన చెప్పినప్పుడు, ఆయన చేసే ప్రతిదీ దేవుని ఖచ్చితమైన ప్రణాళిక మరియు సమయానికి అనుగుణంగా జరుగుతుందని ఆయన అర్థం.
కాబట్టి, యేసు సహాయం చేయడానికి నిరాకరించడం లేదు. తాను దేవుని చిత్తం ప్రకారం పనిచేస్తానని, మానవ ఒత్తిడిని బట్టి కాదనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు.
అద్భుతం ఎప్పుడు చెయ్యాలో ఆ ఘడియ ఖచ్చితముగా దేవునికి మాత్రమే తెలుసు. ఆ ఘడియలో చేసే అద్భుతం విశిష్టమైనదిగా ఉంటూ మెస్సయ్య యొక్క మహిమను కనపర్చుతుంది. దేవుని ఉధ్దేశ్యాన్ని నెరవేరుస్తుంది.
యేసు తన అభ్యర్థనకు “నో చెప్పలేదని “ఆగండి” అని చెప్పాడని మరియ అర్థం చేసుకుంది. ఆమె ఆయనను నమ్మింది మరియు ఆయన సరైన సమయంలో పని చేస్తాడని నమ్మింది.
కాబట్టే ఆమె సేవకులతో, “ఆయన మీకు ఏది చెబితే అది చేయండి” అని చెప్పింది. ఆమె వాదించలేదు లేదా ఆయనని నియంత్రించడానికి ప్రయత్నించలేదు. బదులుగా, ఆమె నిశ్శబ్ద విశ్వాసంతో ఆయన చేతుల్లో ప్రతిదీ వదిలివేసింది.
అక్కడ యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు వారికి సమీపంలో ఉంచబడియుండెను, యూదులు ఆచారబద్ధంగా శుద్ధి కోసం (తినడానికి ముందు మరియు తరువాత చేతులు కడుగు కొనుటకు, కాళ్ళు కడుగుకొనుటకు మరియు విందుపాత్రలను కడుగుకొనుటకు) ఆ రాతిబానలలోని నీళ్లను వాడుకొనే వాళ్ళు ఈ విషయం, మార్కు 7:3,4 లో ఉంది చూడండి.
యేసు సేవకులతో– ఆ బానలు నీళ్లతో నింపండి అని చెప్పాడు. వారు వాటిని అంచులమట్టుకు నింపారు. ద్రాక్షరసం అయిపోయింది అనే మాటలు యేసు ఆయన తల్లి మాట్లాడుకొంటుండగా సేవకులు విన్నారు. అట్లే ఆ విషయములో ఆయనేమి చెప్పిన మీరు చెయ్యండని మరియ సేవకులకు చెప్పింది. ఈయనేమో రాతి బానలను నీళ్లతో నింపుమని చెప్పాడు. వారికి ఈ ఆదేశం గందరగోళంగా అనిపించి ఉండొచ్చు. సేవకుల రెస్పాన్స్ ఏవిధముగా ఉండొచ్చొ ఊహించండి. ఈయన ద్రాక్షారసము బదులు నీళ్లు పొయ్యమంటాడా ఏంటి అని అనుకొని ఉండొచ్చు కదా! ఆయన మాటలు వారిని అసహనానికి గురిచేసి ఉండొచ్చు. బానలను అంచులమట్టుకు నింపేశారు ఇంక దానిలో ఏమి కలపకుండా. నీళ్లను ద్రాక్షారసముగా మార్చడానికి నీళ్లలో ఏదన్నా కలపాలన్నా కూడా ఖాళీ లేదు.
అప్పుడాయన వారితో– మీరిప్పుడు ముంచి, విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా, వారు తీసికొని పోయారు. ఈ మాటలలో యేసు సేవకులకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు— మొదటి ఆజ్ఞ, ఆ బానలు నీళ్లతో నింపండి అని చెప్పాడు. వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. రెండవ ఆజ్ఞ, అప్పుడాయన వారితో—మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసికొని పొండని చెప్పగా వారు కట్టుబడి అతని వద్దకు తీసుకువెళ్లారు. యేసుని శక్తిగల మాట నీటిని ద్రాక్షారసముగా ఎప్పుడు మార్చిందో మనకు తెలియదు. యేసు అద్భుతంగా నీటిని ద్రాక్షారసంగా మార్చాడు.
ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను. దీనిలో ఎలాంటి సందేహము లేదు. సేవకులు పాత్రలను నీళ్లతో మాత్రమే నింపారు— ఇంకేమీ లేదు. దానిని వైన్‌గా మార్చడానికి వారు ఏమీ చేయలేదు. యేసు నీటిని ముట్టుకోలేదు, దానికి ఏదైనా జోడించలేదు లేదా బిగ్గరగా ప్రార్థించలేదు. ఆయన శక్తితోనే మార్పు జరిగింది.
ద్రాక్షారసమైన ఆ నీళ్లను విందు ప్రధాని రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పాడు.
విందు ప్రధాని ఆ నీళ్లను రుచి చూడకముందే ఆ నీళ్లు ద్రాక్షారముగా మారిపోయాయి అని చాలామంది నమ్ముతారు. ఆ రోజులలో సాధారణముగా మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు చీప్ క్వాలిటీ వైన్‌ను అందించేవారు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావనే మాటలు యేసు చేసినది రియల్ వైన్ అని, అది అత్యంత నాణ్యమైనదని చూపించింది.
నిజం చెప్పాలంటే నీరు దానంతట అదే వైన్‌గా మారే ఛాన్స్ లేనేలేదు. ఆయన శక్తిగల మాట నీటిని లావిష్ వైన్ గానే కాకుండా అత్యుత్తమ నాణ్యత గల ద్రాక్షారసంగా మార్చింది. సాధారణంగా, వైన్ తయారీకి సమయం పడుతుంది: ద్రాక్ష పండించడం, ద్రాక్ష మొక్క యొక్క పరిపూర్ణమైన పెరుగుదల, మంచి కాపు, ద్రాక్ష పండ్ల మంచి పరిపక్వత, కోయడం, ద్రాక్ష పండ్లను జ్యూస్‌గా తొక్కడం, పులియబెట్టడం, పులియబెట్టే ప్రక్రియకు అవసరమైన ఏజింగ్ టైం. ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి పులియబెట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ మొత్తం కాలవ్యవధిని యేసు రెప్పపాటులో దాటవేసి తక్షణమే చేశాడు. ఇక్కడ ప్రకృతి యొక్క సాధారణ నియమాలను అధిగమించి ది బెస్ట్ వైన్ తాయారు కావటానికి అవసరమైన కామన్ ఎక్సపెక్టషన్స్ ని ధిక్కరించి యేసుని శక్తివంతమైన చర్య ద్వారా ది బెస్ట్ వైన్ ఉనికి లోనికి వచ్చింది. ఇది ప్రకృతిపై ఆయనకున్న శక్తిని తెలియజేస్తుంది. అద్భుతం అనేది సహజ నియమాలకు మించినది మరియు సైన్స్ ద్వారా వివరించలేనిది. దేవుడు మాత్రమే ఇలాంటి పనులు చేయగలడు. ఆరు పాత్రలు భారీ మొత్తంలో నీటిని (సుమారు 120–180 గ్యాలన్లు) కలిగి ఉన్నాయి, 488.318 – 681.374 లీటర్లు కావొచ్చు. కాబట్టి ఇది చిన్న చర్య కాదు— ఇది గొప్ప అద్భుతం. దేవుడు పనిలో ఉన్నాడని అద్భుతాలు మనకు గుర్తు చేస్తాయి. ఆయన చేసేవి మన అవగాహనకు మించినవి కావచ్చు, కానీ అవి వాస్తవమైనవి మరియు శక్తివంతమైనవి.
యేసు ఎందుకు అంత ద్రాక్షారసాన్ని తయారుచేశాడు? అనే ప్రశ్నకు, అది ఆయన ఉదారతను చూపిస్తుంది—ఆయన కేవలం సరిపడా మాత్రమే కాకుండా, సమృద్ధిగా ఇస్తాడు. యేసు తన దైవికమైన దాతృత్వములో ఇంత ధారాళముగా వైన్ని ఇవ్వడం కొందరిని ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ ఉంది. “వైన్” అను మాటకు ఇక్కడ వాడబడిన గ్రీకు పదం “ఓయినోస్”, దీనికి పులియబెట్టిన ఆల్కహాలిక్ వైన్ అని అర్థం. దీని గురించి కొందరు ఆందోళన చెందుతున్నారు. మద్యం సేవించడాన్ని వ్యతిరేకించే వారు, యేసు నీటిని ఆల్కహాలిక్ వైన్ గా మార్చలేదని వాదిస్తారు. యేసు మద్యము యొక్క వినియోగాన్ని ప్రోత్సహించుచున్నాడా? అని కన్ఫ్యుజ్ అవుతుంటారు. మంచిదాన్ని సృష్టించడం అంటే దాని దుర్వినియోగాన్ని ఆమోదించడం కాదు. ద్రాక్షారసాన్ని సరిగ్గా ఉపయోగించవచ్చు, లేదా దాని దుర్వినియోగ పరచొచ్చు. మత్తు అనేది పాపం. యేసు మత్తును ప్రోత్సహించటం లేదు. కాబట్టి, ఈ అద్భుతం క్రీస్తు యొక్క ఉదారమైన ఏర్పాటును చూపిస్తుంది, అంతేగాని మద్యపాన దుర్వినియోగాన్ని ఆమోదించడం కాదు.
ఈ అద్భుతం యేసు మహిమను వెల్లడి చేసింది. ఆయన కేవలం మనిషి మాత్రమే కాదు, భూమిపైకి వచ్చిన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడని ఇది చూపించింది. పెళ్లి తర్వాత కూడా వైన్ అలాగే ఉంది, ఇది నిజమైన అద్భుతం— అది మెస్మరిక్ ట్రిక్ కాదు అని రుజువు చేసింది. ప్రజలు దానిని చూసి రుచి చూడగలిగారు. జరిగినది విన్న అతిథులు ఆశ్చర్యపోయారు. ఆ వార్త దావాలనంలా వ్యాపించి ఉంటుంది, చాలామంది యేసు పట్ల ఆసక్తి కనపర్చేటట్లు చేసింది. ఈ మొదటి అద్భుతం ఆయన శక్తిని మరియు అధికారాన్ని చూపించింది మరియు అది ఆయన బహిరంగ పరిచర్యకు నాంది పలికింది.
యేసు నిజంగా ఎవరో ఈ అద్భుతం చూపించింది. నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా, ఆయన తన దైవిక శక్తిని మరియు మహిమను వెల్లడించాడు. ఆయన దేవుని ద్వారా పంపబడ్డాడని ఆయన శిష్యులకు మరియు ఇతరులకు ఇది స్పష్టం చేసింది. ఈ సంకేతం ఆయన పట్ల దేవుని ఆమోదాన్ని చూపింది మరియు యేసు దేవుని కుమారుడని ధృవీకరించింది. దాని ద్వారా, ఆయన తన శిష్యుల విశ్వాసాన్ని బలపరిచాడు మరియు వాగ్దానం చేయబడిన మెస్సీయగా తనను తాను వెల్లడించుకొన్నాడు.
చాలా మంది యూదులు ఊహించినట్లుగా, యెరూషలేము ఆలయంలో యేసు తన మొదటి అద్భుతాన్ని చేయలేదు. బదులుగా, ఆయన దానిని సుదూర ప్రాంతమైన గలిలయలోని కానాలో చేశాడు. ఇది దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది, మత్తయి 4:12-16లోని ప్రవచనాన్ని నెరవేర్చింది.
11వ వచనములో, ఆయన తన మహిమను బయలు పరచెను అనే మాటలు, యేసు కృపాసత్యసంపూర్ణుడైన, మానవ రూపంలో ఉన్న దేవుడని మనకు గుర్తుచేస్తుంది. ఈ అద్భుతంలో, ఆయన తన దైవిక శక్తిని—ముఖ్యంగా సృష్టించగల మరియు సమస్తమును చేయగల తన సామర్థ్యాన్ని (ఆయన సర్వశక్తిమంతుడు) చూపించాడు. ఆయనకు సర్వశక్తి ఉన్నప్పుడు, ఆయనకు అన్నీ తెలుసు మరియు ఆయన సర్వత్రా వ్యాపించియున్నాడు. యేసు, “నా సమయము ఇంకా రాలేదు” అని చెప్పినప్పుడు, ఆయన పరిచర్యలోని ప్రతిదీ దేవుని పరిపూర్ణ ప్రణాళిక మరియు సమయం ప్రకారమే జరుగుతుందని చెప్పాడు. పెళ్ళిలో ఆయన సహాయం చేయడం కూడా ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తుంది.
హిస్టారికల్ గా పురావస్తు శాస్త్రవేత్తలు పెద్ద రాతి పాత్రల ముక్కలను కానాలో కనుగొన్నారు. కాని ప్రత్యేకించి ఆనాటి కానా యొక్క లొకేషన్ విషయంలో మాత్రం విభేదిస్తున్నారు.
ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది: మనుష్యులముగా మన బలహీనతలు పరిమితులు ఏమిటో మనకు తెలుసు అయినప్పటికీ మనం తరచుగా దేవుని శక్తిని నమ్మడంలో విఫలమవుతున్నాం. అదే మన సమస్య — ఆయనను పూర్తిగా నమ్మడానికి బదులుగా మనపైనే మనం ఆధారాడుతున్నాం.
ఈ పాఠం మన ఈ బలహీనతలను ప్రభువు ముందు ఒప్పుకోమని పిలుస్తుంది:
- అవసరమైన సమయాల్లో, మనం తరచుగా క్రీస్తు వైపు తిరగడానికి బదులుగా మనపై లేదా ఇతరులపై ఆధారపడటానికి ప్రయత్నిస్తున్నాం.
- దేవుడు ఇలా చెయ్యమని మనకు చెప్పినప్పుడు, మనం కొన్నిసార్లు సందేహం, సంకోచం లేదా అవిధేయతతో ప్రతిస్పందిస్తున్నాం.
- సమస్తాన్ని సమృద్ధిగా అందజేసేది దేవుడే అనే విషయాన్ని మరచి మనం స్వార్థపరులుగా లేదా జిత్తులమారిగా ప్రవర్తిస్తున్నాం.
- మన దైనందిన జీవితాల్లోకి, ఇళ్లలోకి లేదా సంబంధాలలోకి క్రీస్తును ఆహ్వానించడంలో మనం విఫలమవుతున్నాం.
- మన జీవితాలలో దేవుని పనిని మరియు ఆశీర్వాదాలను గుర్తించలేకున్నాం, కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా అంధులుగా ఉంటున్నాం.
ఈ పై పాయింట్స్ మన పాపాన్ని— అంటే మన అవిశ్వాసాన్ని, అవిధేయతను మరియు ప్రేమ లేకపోవడాన్ని బహిర్గతం చేస్తున్నాయి.
ఈ పాయింట్స్ క్రీస్తు, మన పట్ల సహనంతో ఉన్నాడని, ఆయన ఇప్పటికీ మన వద్దకు వస్తూ ఉన్నాడని, మనల్ని క్షమించాడని మరియు ఆయన దయతో మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడని చూపిస్తున్నాయి.
ఈ పాఠంలో దేవుని ప్రేమ:
ఆయన మన అవసరాలకు, చిన్నవాటికి కూడా కరుణతో స్పందిస్తాడు మరియు మన శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తాడు.
తండ్రి ప్రేమ యేసులో వెల్లడి చేయబడింది— యేసు ద్వారా ప్రత్యక్షపర్చబడింది, రక్షణ మరియు నిజమైన ఆనందం యొక్క గొప్ప బహుమతిని చూపిస్తూ ఉంది.
దేవుడు మన దైనందిన జీవితంలో— మన అత్యవసర పరిస్థితులలో మాత్రమే కాకుండా, మన ఆనందం, సంబంధాలు మరియు రోజువారీ క్షణాలలో కూడా మనలను గురించి శ్రద్ధ వహిస్తాడు.
ఆయన ఉదారంగా అందజేస్తాడు. ఆయన ప్రేమ పరిమితం కాదు; అది సమృద్ధిగా పొంగిపొర్లుతుంది.
ఈ పాఠం మనకు ఏమి బోధిస్తుంది:
1. దేవుడు మన జీవితాలలో చిన్న విషయాల గురించి కూడా శ్రద్ధ వహిస్తాడు— ఆయనకు ఏదీ చాలా చిన్నది కాదు.
2. చింతిస్తూ ప్రతిదీ నియంత్రించడానికి ప్రయత్నించే బదులు మొదట మీ సమస్యలను యేసు వద్దకు తీసుకురండి.
3. మీరు పూర్తిగా అర్థం చేసుకోనప్పటికీ, ఆయనను విశ్వసించండి మరియు కట్టుబడి ఉండండి.
4. దేవుని సమయం పరిపూర్ణమైనది, కాబట్టి మనం విశ్వాసంతో వేచి ఉండడం నేర్చుకోవాలి.
5. యేసు సాధారణ విషయాలను అర్థవంతంగా మరియు మంచిగా మార్చగలడు.
6. నిజమైన మరియు శాశ్వతమైన ఆనందం యేసు నుండి మాత్రమే వస్తుంది, ప్రపంచం నుండి కాదు.
7. దేవుడు తన ప్రేమ, దయ మరియు కరుణ ద్వారా తన మహిమను చూపిస్తాడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
