
పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము దాని అర్ధము
కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము.
పరిశుద్ధ ప్రభురాత్రి భోజన నియమము
మొదటిది: పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము అనగానేమి?
ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరము మరియు రక్తము క్రింద రొట్టె ద్రాక్షారసమై యున్నది. దీనిని తిని త్రాగుటకు క్రైస్తవులమైన మన కొరకు ఇది క్రీస్తుచే నియమింపబడియున్నది.
ఇదెక్కడ వ్రాయబడియున్నది?
మత్తయి మార్కు లూకా యను పరిశుద్ధ సువార్తికులును, అపోస్తులుడైన పౌలు చెప్పిన వానిలో: మన ప్రభువైన యేసు క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి యందు, రొట్టెను తీసుకొని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన దానిని విరచి తన శిష్యులకిచ్చి, “మీరు తీసుకొని తినుడి (మత్తయి 26:26), ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని చెప్పెను.
ఆ ప్రకారమే వారు భోజనము చేసిన తరువాత ఆయన పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని వారికిచ్చి, “దీనిలోనిది మీరు త్రాగుడి, ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన లూకా 22:20; మీ పాపక్షమాపణ కొరకై చిందింపబడిన నా రక్తము, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని చెప్పెను. (మత్తయి 26:26-28; మార్కు 14:22-24; లూకా 22:19-20)
పరిశుద్ధ ప్రభురాత్రి భోజనపు దీవెనలు
రెండవది: వీనిని తినుట వలనను, త్రాగుట వలనను మనము ఎటువంటి దీవెన పొందుదుము?
“ఇయ్యబడుచున్నదనియు” మరియు “పాపక్షమాపణ నిమిత్తము మీ కొరకు చిందింపబడుచున్నదనియు” చెప్పబడు మాటలు వీని ప్రయోజనమును మనకు చూపుతూ ఉన్నాయి.
ఈ మాటల ద్వారా ఈ సంస్కారములో పాప పరిహారమును, జీవమును, రక్షణను మనము పొందుదుము.
పాప పరిహారమెక్కడనో అక్కడనే జీవమును మరియు రక్షణను ఉండును.
పరిశుద్ధ రాత్రి భోజనము యొక్క శక్తి
మూడవది: తినుట వలనను, త్రాగుటవలను, ఇటువంటి ఘనమైన మేళ్లు ఏలాగు కలుగును?
వాస్తవముగా తినుట వలనను మరియు త్రాగుట వలనను ఇటువంటి మేళ్లు కలుగవు, గాని “మీ కొరకు ఇయ్య బడుచున్నదనియు” మరియు “పాపక్షమాపణ నిమిత్తమై మీకొరకు చిందింపబడుచున్నదనియు“, చెప్పబడు ఈ మాటల వలన ఇటువంటి మేళ్లు కలుగును.
తినుట త్రాగుట అను వాటితో కూడా ఈ మాటలు ఈ సంస్కారములో ప్రధానమైనవి.
ఈ మాటలు విశ్వసించు వానికి పాప పరిహారము కలుగుచున్నదని ఈ మాటలు స్పష్టముగా చెప్తూ ఉన్నాయి.
పరిశుద్ధ ప్రభురాత్రి భోజనమును పుచ్చుకొనుట
నాల్గవది: ఈ సంస్కారమును పొందుటకు తగిన విధముగా సిద్దపడిన వారెవరు?
ఉపవాసము మరియు శరీర సంబంధమైన ప్రయాసములు మంచి ఉదేశ్యమునకు ఉపకరించును, అయినను “పాపక్షమాపణ నిమిత్తమై మీ కొరకియ్యబడుచున్నదనియు” మరియు “చిందింపబడుచున్నదనియు” చెప్పబడు మాటలను విశ్వసించువాడే తగిన విధముగా సిద్దపడిన వాడు.
కాని ఈ మాటలు విశ్వసింపనివాడు లేక సందేహపడువాడు సిద్దపడని వాడై యున్నాడు, ఎందుకనిన “మీ కొరకు” అను మాటలను విశ్వసించు హృదయములు తప్ప అవసరమైనదేదియు లేదు.
ప్రభురాత్రి భోజనమునకైన వ్యక్తిగత సిధ్ధపాటు
ప్రశ్న: దేవుడు తన పరిశుద్ధ వాక్యమునందు నన్ను గూర్చి యేమని చెప్తూవున్నాడు?
జవాబు: నేను పాపినని, ఆయన శిక్షకు మాత్రమే నేను పాత్రుడనని ఆయన చెప్తూవున్నాడు.
ప్రశ్న: నా పాపములను నేను ఎరుగక పోయినను వాటి వలన నేను బాధింపబడక పోయినను నేనేమి చేయవలెను?
జవాబు: పది ఆజ్ఞలను అనుసరించి భార్యగా లేక భర్తగా లేక అవివాహితునిగా లేక తల్లిగా లేక తండ్రిగా లేక బిడ్డగా లేక యజమానిగా లేక ఉద్యోగిగా లేక అధ్యాపకునిగా లేక విద్యార్థిగా, నేను నా విధులను ఎంత మంచిగా నిర్వర్తించియున్నానోనని నాకు నేనుగా పరీక్షించుకోవలసియున్నాను. నా పూర్ణ హృదయముతో దేవునిని నేను ప్రేమించితినా? సంతోషముగా ఆయన వాక్యమును వింటినా? శ్రమలను ఓర్పుతో సహించితినా? అవిధేయుడుగను, గర్విష్ఠునిగాను, క్షమింపని వాని వలెనో నేను ఉంటినా? స్వనీతిపరునిగాను, సోమరిగాను, అసూయపరునిగాను, తగువులాడువానిగాను నేను ఉంటినా? నేను అబద్ధమాడి, మోసముచేసి, నాది కాని వస్తువును తీసుకొని ఇతరులకు చెడ్డ పేరు ఆపాదించితినా? నా దేహమును అపవిత్రపరచుకొంటినా? నా మనస్సులో అపవిత్రములైన తలంపులకు తావిచ్చి అవి నా మనస్సులో స్వేచ్ఛగా తిరుగునట్లు చేసితినా? సరియైన దానిని మేలైన దానిని చేయుటలో నేను విఫలుడనైతినా? అని పరీక్షించుకోవలసియున్నాను.
ప్రశ్న: నేను దేవునికి వ్యతిరేఖంగా పాపము చేసి ఆయన శిక్షకు తగిన వాడినని నేను గమనించినప్పుడు నే నేమి చేయవలెను?
జవాబు: నాకు బాగుగా జ్ఞాపకమున్న నా పాపములన్నియు, నాకు జ్ఞాపకములేని పాపములన్నియు కూడా దేవుని ఎదుట నేను ఒప్పుకొని ఆయన యొక్క కనికరము కొరకు క్షమాపణ కొరకు ఆయనను ప్రార్ధించెదను.
ప్రశ్న: యేసుక్రీస్తు నా వాడనియు నేను ఆయన వాడనియు చెప్పుటకు ఏ నిర్ధారణ కలదు?
జవాబు: ప్రభురాత్రి భోజనము నందు ఆయనతోను, నా తోటి విశ్వాసులతోను ఏకము చేయుటకు జీవదాయకమైన ఆహారమును పానీయమును రొట్టె ద్రాక్షారసములతో తన యొక్క శరీరమును రక్తమును నాకిచ్చుచున్నాడు. ఈ ప్రభు సంస్కారము వలన నా పాపములు యేసు ప్రభువు క్షమించుటయే గాక ఆయన నా యెడల గల ప్రేమను గూర్చి నాకుగల అనుమానములన్నియు తుడిచిపెట్టుచు దేవుని సంతోషపరచునట్టి జీవితము జీవించుటకు ఆయన తన స్వంత శక్తిని ఇచ్చుచున్నాడు. పరలోక ఆనందము యొక్క రుచి ఇప్పుడే కొంతమట్టుకు మనకు ఇచ్చుచున్నాడు.
ప్రశ్న: ఈ దీవెనలన్నీ ప్రభురాత్రి భోజనము నందు పొందుకొంటున్నానను నిర్ధారణ నాకు యెట్లు కలుగుచున్నది?
జవాబు: ఆయన మరణమునకు ముందు రాత్రి ఆయన యొక్క అంతిమ కోర్కెను వీలునామాలో తాను చెప్పిన మాటయందు నాకు నమ్మకమున్నది. “పుచ్చుకొని తినుము ఇది నా శరీరము. పాపక్షమాపణ కొరకు నీ కొరకు చిందింపబబడిన నా రక్తము. దీనిలోనుండి మీరందరు త్రాగుడి. నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని” ఆయన నాతో చెప్తున్నాడు.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl