2 పేతురు పరిచయం

మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి (2 పేతురు 3:18).

ఈ లేఖ ప్రేమగల దేవుడు తన ప్రియమైన ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమతి. ఇది 1 పేతురు మరియు పౌలు పత్రికల నీడలో ఉండిపోవడాన్ని బట్టి శతాబ్దాలుగా దీనికి పెద్దగా పేరు రాలేదు. కొత్త నిబంధన యొక్క ప్రేరేపిత పుస్తకాలలో దీని చట్టబద్ధమైన స్థానాన్ని బట్టి ఇది కొంతమంది ఆదిమ సంఘ నాయకులచే సవాలు చేయబడింది. బ్రిటిష్ వేదాంతవేత్తయైన J. N. D. కెల్లీ (1909-1997) గారు 2 పేతురు గురించి వ్రాస్తూ, “2 పేతురులా ఏ కొత్త నిబంధన పుస్తకం కూడా ఆమోదం పొందేందుకు ఎక్కువ కాలం కఠినమైన పోరాటం చెయ్యలేదు” అని రాసాడు. మొదటి శతాబ్దాల సంఘ రచనలలో ఇది చాలా అరుదుగా కోట్ చెయ్యబడింది. ఇంకా కెల్లీ దీనిని గురించి వ్రాస్తూ, ఇప్పటికి అనేకులు “2 పేతురును వేరొకరు పేతురు పేరున వ్రాసిన పత్రికగా అనుమానిస్తున్నారు” అని వ్రాసాడు, (పత్రికను వేరొకరు వ్రాసి దానిని పేతురు పేరున పంపినట్లుగా).

ఏదిఏమైనను, ఇంకను 2 పేతురు అన్ని విమర్శలను సహిస్తూవుంది, సందేహించు వారిని అధిగమిస్తూవుంది మరియు కొత్త నిబంధనలో దాని సరైన స్థానంలో అది ఇంకా నిలిచే ఉంది. ఎట్టకేలకు దాని శక్తివంతమైన సందేశం అది దేవుని నుండి వచ్చినదని తొలి క్రైస్తవులను ఒప్పించింది. ఈ రోజు దాని సందేశం యొక్క ఔచిత్యం, చెడుకు వ్యతిరేకంగా క్రైస్తవులు చేసే వారి పోరాటంలో వారు చెడు చేసినపుడు వారిని దోషులుగా నిర్ధారిస్తూవుంది, చెడును అధిగమించుటకు వారికి శక్తినిస్తూవుంది మరియు మంచిని చేయుటకు వారికి సాధికారమిస్తూ ఉంది.

ఈ మూడు అధ్యాయాలు పేతురు యొక్క చివరి వీలునామా. అవి తన మరణ సమయం ఆసన్నమైందని తెలిసిన పరిణతి చెందిన క్రైస్తవ నాయకుడి నుండి వచ్చిన తెలివైన, లోతైన మాటలు. లేఖలో గంభీరమైన హెచ్చరికలు వున్నాయి, భయంకరమైన శాపాలు ఉన్నాయి, అట్లే అది అద్భుతమైన సువార్త ఇచ్చే ఆదరణను కూడా కలిగి ఉంది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి (2 పేతురు 3:18) అనేదే ఈ లేఖ యొక్క ప్రధాన ఉద్దేశ్యము.

రచయిత
రచయిత, తనను తాను యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురును అని (1:1) తెలియజేసు కొనియున్నా డు. రచయిత 1:14 లో (యోహాను 21:18,19) తన మరణం గురించి ప్రభువు ప్రవచనాన్ని సూచిస్తూ వున్నాడు మరియు తనను ప్రభువు రూపాంతరం యొక్క ప్రత్యక్ష సాక్షిగా పేర్కొన్నాడు (1:16-18). అతడు పాఠకులకు ఇది తన రెండవ లేఖ అని నొక్కి చెప్తున్నాడు (3:1). మరియు పౌలును “మన ప్రియ సహోదరుడు” అని సూచించాడు (3:15). సంక్షిప్తంగా, ఈ పత్రిక తన రచయిత పేతురే అని చెప్తూవుంది మరియు ఈ పత్రిక యొక్క స్వభావము అందుకు మద్దతు ఇస్తూ వుంది.

ఆదిమ సంఘములో 1 పేతురు వలె 2వ పేతురు విస్తృతంగా గుర్తించబడలేదు. కొందరు దీనిని రెండవ శతాబ్దం ప్రారంభం లో మరియు బహుశా మొదటి శతాబ్దం చివరి భాగంలో అధికారపూర్వకముగా ఆమోదించారు అని 1 క్లెమెంట్ [క్రీ.శ. 95] సూచిస్తూ వుంది. ఓరిజెన్ కాలం (Origen’s 185-253) వరకు ఇది పేతురుకు ఆపాదించబడలేదు. అతడు దానిని గురించి కొంత సందేహాన్ని కలిగియున్నట్లు తెలుస్తోంది. యూసేబియస్ (Eusebius 265–340) దీనిని ప్రశ్నించబడిన పుస్తకాలలో ఉంచాడు, అయితే అనేకులు దీని రచయిత పేతురే అని అంగీకరించినట్లు అతడు అంగీకరించాడు. యుసేబియస్ కాలం తరువాత, ఇది కానానికల్ గా ఆమోదించబడింది.

అనేకమంది ఆధునిక పండితులు ఈ క్రింది కారణాలతో పేతురు ఈ లేఖను వ్రాయలేదని చెప్తూవుంటారు : (1) 1 పేతురు శైలి కంటే 2వ పేతురు శైలి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇది పేతురుది కాదు అని చెప్తూవుంటారు; 2 పేతురులో ఉపయోగించిన గ్రీకు భాష 1 పేతురుతో పోలిస్తే కఠినమైనది మరియు ముతకైనది. ఈ విభిన్నతకు ప్రాధాన్యమివ్వవలసిన పనిలేదు ఎందుకంటే ఈ రెండు పత్రికల పదజాలం మరియు ఇతర విషయాలలో గుర్తించదగిన సారూప్యతలు ఉన్నాయి కాబట్టి. నిజానికి, 1 పేతురు, 2 పేతురును పోలిన మరే ఇతర రచనలు లేవు. విభిన్నత సబ్జెక్ట్‌లోని వైవిధ్యాల ద్వారా పరిగణలోనికి తీసుకోబడుతుంది. (అంటే పత్రికల స్వరూపము మరియు వాటి ఉద్దేశ్యాలు మరియు అవి వ్రాయబడిన కాలము మరియు పరిస్థితులు మరియు ఉపయోగించిన మూలాధారాలు లేదా అనుసరించిన నమూనాలు మరియు పనిచేసిన లేఖకులు). (2) వీటికి విరుద్ధంగా, మరికొందరు, ఈ లేఖ యొక్క శైలి 1 పేతురు కంటే భిన్నంగా గ్రీకు వాక్చాతుర్యంలో శిక్షణను ప్రదర్శిస్తూ వుంది; అట్లే 1 పేతురు సిల్వాను (1పేతురు 5:12) ద్వారా వ్రాయబడినట్లుగా చెప్తూవుంది. 2 పేతురుకు ఏమి చెప్పబడలేదు కాబట్టి ఇది పేతురుది కాదు అని చెప్తూవుంటారు; సిల్వానును పేతురు 1 పేతురుకు సెక్రటరీగా ఉపయోగించుకున్నాడు. 2 పేతురును పేతురే (పల్లెలో ఉండే ఒక మత్సకారుడు) స్వయముగా వ్రాసియున్నాడు. ఇది రెండింటి శైలిలో గుర్తించదగిన వ్యత్యాసాన్ని వివరిస్తూవుంది. (1 పేతురు పరిచయం, రచయిత మరియు తేదీ చూడండి). (3) రచయిత ప్రత్యర్థులు పేతురు కాలం తర్వాత కనిపించిన గ్నోస్టిక్స్ కావచ్చు అని కొందరి వాదన; (4) ఈ లేఖ బహుశా యూదా పత్రిక పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ పత్రిక అసలైనది కాదు అని మరికొందరి వాదన; (5) పేతురు మరణానంతరం, అతని విద్యార్థులు వారి కాలం నాటి సమస్యలను పరిష్కరించడానికి దీనిని వ్రాసి ఉండొచ్చు అని ఇంకొందరి వాదన.

(6) ఆదిమ క్రైస్తవ చరిత్ర యొక్క లౌకిక పునర్నిర్మాణమును బట్టి లేదా అందుబాటులో ఉన్న డేటాను అపార్ధం చేసుకోవడం లేదా తప్పుగా అర్ధం చేసుకోవడం బట్టి ఇతర అభ్యంతరాలు ఉత్పన్నమయ్యాయి. ఉదాహరణ కు, 3:15–16 లోని పౌలు లేఖల ప్రస్తావన ఈ పుస్తకానికి అధునాతన తేదీని అంటే పేతురు మరణము తర్వాత కాలాన్ని సూచిస్తుందని కొందరు వాదిస్తున్నా రు. ఎందుకంటే వారు 3:4 లోని తండ్రులు (πατέρες) అనే మాటను మునుపటి క్రైస్తవ తరంగా అర్థం చేసుకొన్నారు. అయితే, ఈ పదం చాలా సహజంగా పాత నిబంధన పితరులకు అన్వయించబడుతుంది (యోహాను 6:31 “పితరులు”; అపొ.కార్య. 3:13; హెబ్రీ 1:1). తెలుగు బైబిలులో తండ్రులు అనే చోట పితరులుగా సరిగానే తర్జుమా చెయ్యబడి యున్నది.

(7) పౌలు పత్రికల సేకరణకు సంబంధించిన సూచన (3:15,16) ఈ పత్రికకు పేతురు మరణాంతర కాలాన్ని సూచిస్తూ ఉందని కొందరి వాదన. నిజానికి, పౌలు లేఖలు చాలా త్వరగా సేకరించబడ్డాయి. ఎందుకంటే వాటిలో కొన్ని ఉనికిలో ఉన్నాయి. బహుశా పేతురు మరణానికి ముందు పది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం (థెస్సలొనీకయులకు 15 సంవత్సరాల వరకు) చెలామణిలో ఉన్నాయి. అంతేకాకుండా, పేతురు చెప్పేది పౌలు యొక్క కొన్ని లేఖలతో (రోమన్ ప్రపంచంలో మరియు ఆదిమ సంఘములో కమ్యూనికేషన్ బాగానే ఉంది) అతనికి పరిచయం ఉందని మాత్రమే సూచిస్తూ వుండొచ్చు తప్ప అధికారికంగా సంఘము వాటిని సేకరించియున్నదని చెప్పటం లేదు.

(8) అబద్ద బోధకులు గ్నోస్టిక్స్గా వర్ణించబడలేదు, పేతురుకు సమకాలీనులుగా ఉన్న ఎపిక్యూరియన్ గ్రీకుల వలె వారు ప్రవర్తిస్తు వున్నారు (సంతోషాలపై మాత్రమే ద్రుష్టి పెట్టిన వాళ్ళు); 2 వ అధ్యయము చెప్తున్నది, మొదటి శతాబ్దంలో ఉన్న అబద్ద బోధకులు గురించి. రెండవ అధ్యాయం రెండవ శతాబ్దపు గ్నోస్టిసిజానికి (Gnosticism) వ్యతిరేకంగా నిర్దేశించబడిందని నొక్కి చెప్పడం అంటే అధ్యాయం యొక్క వారెంట్ యొక్క కంటెంట్ ని దాటి ఎక్కువగా ఊహించడం అని చెప్పొచ్చు. 2 పేతురులో ప్రస్తావించబడిన అబద్ద బోధకులు రెండవ శతాబ్దపు గ్నోస్టిక్స్ (Gnostics) యొక్క పూర్వీకులలో కూడా ఉండొచ్చు. (9) మొదటి, రెండవ శతాబ్దాలలో, మారుపేర్లతో వ్రాయబడిన ఆదిమ యూదు మరియు క్రైస్తవ గ్రంథాలలో సాధారణంగా లేఖలు ఉండేవి కావు.

(10) యూదా పత్రిక 2 పేతురు పై ఆధారపడి ఉండొచ్చు అని కొందరి వాదన; అబద్దపు భోదకులను వర్ణించడానికి 2 పేతురు యూదా నుండి ఒక భాగాన్ని ఉపయోగించాడని కొందరు మరియు పేతురు మరణం తర్వాత యూదా వ్రాయబడిందని కొందరు వాదిస్తూవుంటారు. పేతురు యూదా నుండి కోట్ చేసి ఉండొచ్చు లేదా ఇద్దరూ ఉమ్మడి మూలాన్ని ఉపయోగించి ఉండొచ్చు. ఈ లేఖ యొక్క పేతురు రచయితత్వాన్ని కొంతమంది ఆదిమ క్రైస్తవులు ప్రశ్నించినప్పటికీ, ఈ లేఖ ఇప్పటికీ సాధారణంగా పేతురుకే ఆపాదించబడింది తప్ప ఇతర రచయితలకు కాదు.

ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా 2 పేతురు కానానికల్ పుస్తకంగా త్వరగా ఆమోదించబడలేదు: (1) స్లో సర్క్యూలేషన్ దానిని విస్తృతంగా తెలియకుండా చేసింది. (2) దాని సంక్షిప్తత మరియు కంటెంట్ ఆదిమ సంఘ నాయకుల వ్రాతల్లో విరివిగా కోట్ చెయ్యకపోవడం బట్టి (3) గుర్తింపులో జాప్యం జరిగింది. కాబట్టి 2 పేతురు (పేతురు పేరు మీద అప్పటికే ఉనికిలో ఉన్న ఇతర అబద్దపు పత్రికలతో) పోటీ పడవలసి వచ్చింది (ఉదా. పేతురు యొక్క అపోకలిప్స్).

(అపొస్తలుడైన పేతురు జీవితం మరియు పరిచర్య యొక్క సారాంశం కోసం, 1 పేతురు పరిచయ గమనికలను చూడండి).

వ్రాయబడిన కాలము
పేతురు హతసాక్షిగా మరణిస్తాడని యేసు స్వయంగా ప్రవచించియున్నప్పటికి (1:14; యోహాను 21:19) బైబులు అతని మరణాన్ని గురించి చెప్పటం లేదు. క్రీ.శ. 325లో చరిత్రకారుడైన యూసేబియస్, నీరో చక్రవర్తి ఆధ్వర్యంలో రోమ్‌లో పేతురు మరియు పౌలు ఇద్దరూ ఒకే సమయంలో అమరులయ్యారని పేర్కొన్నాడు. క్రీ.శ. 64లో రోమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తర్వాత క్రైస్తవులకు వ్యతిరేకంగా నీరో మొదటి హింసను ప్రారంభించాడు. క్రీ.శ. 68వ సంవత్సరంలో నీరో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంవత్సరాల మధ్య 2 పేతురు వ్రాయబడి ఉండొచ్చని చెప్పడం సహేతుకంగా ఉంటుంది, ఎందుకంటే 2పేతురు 1:14లో నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని యెరిగి, అను మాటల ద్వారా, తాను ఎక్కువ కాలం జీవించబోవడం లేదని అతడు చెప్పేసాడు. అయితే పుస్తకంలోని దేనికీ తర్వాత తేదీ అవసరం లేదు (పేతురు జీవితకాలం మించిన తేదీ అవసరం లేదు).

వ్రాయబడిన స్థలం
ఈ పత్రిక ఎక్కడినుండి వ్రాయబడిందో ఖచ్చితంగా చెప్పలేము. అయినప్పటికీ, ఇది మొదటి పేతురు వ్రాయబడిన అదే స్థలం నుండి వ్రాయబడిందని సూచించడం సహేతుకమైనది. అది రోమ్ యై ఉండొచ్చు. 1 పేతురు 5:13లో “బబులోను” అని అని వుంది కదా ఇది ఏంటి అని ప్రశ్నించొచ్చు? యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్న బబులోను అసలు నగరం ఈ సమయానికి శిథిలావస్థకు చేరుకుంది. కాని ఆదిమ క్రైస్తవులు రోమ్‌ను వర్ణించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు, క్రీ.పూ. ఆరవ శతాబ్దంలోని ఇశ్రాయేలీయులు భయపడినంతగా ప్రస్తుత కాలములో వున్న క్రైస్తవులు శక్తివంతమైన రోమ్ ను చూసి భయపడుతూ దానిపట్ల చాల కోపముతో వున్నారు.

గ్రహీతలు
3వ అధ్యాయంలోని 1వ వచనం (ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను) ఇది ఈ పత్రికను పేతురు యొక్క రెండవ లేఖ అని చెబుతోంది, కాబట్టి ఈ ఉత్తరం యొక్క మొదటి పాఠకులు 1 పేతురు చదివిన వారిలాగే ఉన్నారని అనుకోవడం సహేతుకంగా అనిపిస్తుంది. మొదటి పేతురు 1వ అధ్యాయం వారిని పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియలోని రోమన్ ప్రావిన్సులలో, అంటే రోమన్ సామ్రాజ్యం యొక్క ఈశాన్య మూలలో నివసిస్తున్న క్రైస్తవులుగా వివరిస్తుంది. (ఈ ఐదు ప్రావిన్సులు మరియు అక్కడ నివసించిన ప్రజల గమనికల కోసం, 1 పేతురు పరిచయాన్ని చూడండి.)

అతడు ప్రత్యేకంగా వారికి ఎందుకు వ్రాస్తున్నాడు? బహుశా అతడు ఈ ప్రాంతాలకు సువార్త ప్రకటించడంలో సహాయం చేసి ఉండొచ్చు. ఈ ప్రావిన్సులు అతడి బాధ్యత. బహుశా ఈ ప్రాంతాల్లోని సంఘాలు వ్యక్తిగత సందర్శన కోసం వేచి ఉండలేని కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయని, వెంటనే లేఖ ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని అతడు విని ఉండొచ్చు కాబట్టే వారికి వ్రాసాడు.

సందర్భం
పౌలు నిర్దిష్ట సంఘాలకు వ్రాసినప్పుడు, అతడు ఆ సంఘాలలో వున్న నిర్దిష్ట సమస్యలను ప్రస్తావించాడు. అయితే, ఆసియా మైనర్‌లోని ఐదు ప్రావిన్స్‌లు చాలా విశాలమైన ప్రాంతం కాబట్టి, ఆ ప్రాంతాలలోని అనేకులను ప్రభావితము చేసిన సార్వత్రిక సమస్యలను ఉధ్దేశించి పేతురు వ్రాస్తూవున్నాడు. నిజానికి, సాతాను తన అబద్ధాలను క్రమం తప్పకుండా రీసైకిల్ చేస్తూవున్నాడు కాబట్టే, రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నట్లే నేటికీని పేతురు పత్రిక తాజాగా మరియు అత్యవసరమైన దిగా కనిపిస్తూవుంది.

పేతురు ఈ రెండవ పత్రికను ఎందుకు వ్రాయవలసి వచ్చింది? ఆసియా మైనర్‌లో సమస్యలు ఉన్నాయని రోమ్‌లో అతనికి రిపోర్టులు వచ్చి ఉండొచ్చు. నూతనముగా సంఘాలను కట్టడంలో సమస్యలు లేవు. కాని అప్పటికే కట్టబడియున్న సంఘాల పెరుగుదలలో మరియు వాటి ఆరోగ్య విషయాలలో సాధారణ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సంఘములో వారి రెండవ తరం ఉనికిలో వుంది. ఈ లేఖలో పేతురు ఉద్దేశ్యం క్రైస్తవ మతం యొక్క ప్రాథమికాలను బోధించడం కాదు – అది ఇప్పటికే జరిగింది. అతని పాఠకులు ఇప్పటికే యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్త యొక్క చారిత్రక వాస్తవాలతో సుపరిచితులని పేతురు భావించాడు. వారు అప్పటికే విశ్వాసం లోనికి తేబడ్డారు. వారి విశ్వాసములో వారు జీవించడంలో మరియు వారి విశ్వాసంపై సాతాను దాడులను తప్పించుకోవడంలో అతని స్నేహితులకు సహాయం కావాల్సి వుంది. యేసుక్రీస్తుతో వారికున్న సంబంధం ప్రమాదంలో పడింది. వారి శాశ్వత లక్ష్యము ప్రమాదములో ఉంది. అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఒకప్పుడు నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను మర్చిపోతున్నారు, కాబట్టి పేతురు వారికి గుర్తుచేయడానికి, వారి జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడానికి వ్రాస్తూ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుయొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక అని రాసాడు.

ఈ ప్రాంతములోని సంఘాలు కనీసం ఈ నాలుగు విధాలుగా ఇబ్బంది పడ్డాయి:

  • వారు క్రీస్తులో తమ కొత్త గుర్తింపును మరచిపోయి క్రైస్తవుల వలె జీవించడంలో విఫలమయ్యారు.
  • లేఖనాల యొక్క దైవిక అధికారంపై వారి విశ్వాసం బలహీనమయ్యింది.
  • సంఘాల్లోకి చొరబడుతున్న అబద్ద బోధకుల ముప్పు గురించి వారు చాలా నిశ్చింతగా ఉన్నారు.
  • వారు ఇక్కడ మరియు ఇప్పుడు గురించి చాలా ఆందోళన చెందారు తప్ప రాబోయే గొప్ప తీర్పు గురించి దాదాపుగా పట్టించుకోలేదు.

ఈ క్రైస్తవులు మరియు వారి సంఘాల కొరకు ఆత్మ యొక్క ప్రణాళిక, బాహ్య చెడులకు వ్యతిరేకంగా దాడి చేయమని చెప్పడం కాదు, కాని అంతర్గతంగా, ఆధ్యాత్మికంగా వారు “మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందమనడం” ఆసక్తికరం (2 పేతురు 3:18).

పత్రిక యొక్క ఉద్దేశ్యము
పేతురు తన మొదటి లేఖలో చర్చి బయట నుండి వచ్చే హింసలను ఎలా ఎదుర్కోవాలో వారికి సూచించడం ద్వారా క్రీస్తు గొర్రెలను పోషించాడు (1పేతురు 4:12 ); ఈ రెండవ లేఖలో చర్చిలోకి వచ్చిన తప్పుడు బోధకులు మరియు దుర్మార్గులతో ఎలా వ్యవహరించాలో వారికి బోధించాడు (2:1; 3:3-4 ). నిర్దిష్ట పరిస్థితులు సహజంగా కంటెంట్ మరియు ఉద్ఘాటనలో వైవిధ్యాలకు పిలుపునిచ్చినప్పటికీ, క్రీస్తు యొక్క గొర్రెల కాపరిగా (యోహాను 21:15-17) పేతురు రెండు లేఖలలో క్రైస్తవ విశ్వాసం మరియు అభ్యాసం యొక్క ఆరోగ్యకరమైన కలయికను తన పాఠకులకు సిఫార్సు చేస్తూవున్నాడు. మరింత ప్రత్యేకంగా, అతని ఉద్దేశ్యం: (1) క్రైస్తవ ఎదుగుదలని ప్రేరేపించడం (అధ్యాయం 1), (2) తప్పుడు బోధనలను ఎదుర్కోవడం (అధ్యాయం 2) మరియు (3) ప్రభువు ఖచ్చితంగా తిరిగి రావడం దృష్ట్యా మెలకువగా ఉండడాన్ని ప్రోత్సహించడం (అధ్యాయం 3)

శైలి
పేతురు ఈ లేఖను వ్రాసే సమయానికి అతడు పరిచర్యలో చాలా సంవత్సరాలు గడిపేశాడు. అతని మైండ్ బాగానే వుంది. అతని లేఖ చక్కగా స్పష్టంగా మరియు అతడు ప్రేమించిన వ్యక్తుల పట్ల మక్కువతో మండుతూ వుంది. స్పష్టమైన, బలమైన భాషలో, అతడు సాతాను బెదిరింపుల యొక్క సీరియస్ నెస్ ని వివరిస్తూవున్నాడు. అట్లే యేసుక్రీస్తు మరియు విశ్వాసుల అంతిమ విజయం గురించి అతడు విజయవంతమైన విశ్వాసంతో అదే స్పష్టతతో మాట్లాడుతున్నాడు. 2 పేతురులోని వచనాలు బలమైన ఉద్దేశ్యముతో ఐశ్వర్యవంతముగా, గంభీరంగా, లోతైన భోధలతో నిండివున్నాయి. కాబట్టి 2 పేతురును వేగంగా చదవలేరు. దీనిని చాలా నెమ్మదిగా చదవాలి, ప్రతి వచనము సంక్లిష్టంగా, అద్భుతంగా వ్రాయబడియున్నది.

ఈ పత్రికను అతని మొదటి పత్రిక మరియు ఇతర కొత్త నిబంధన పత్రికలతో పోల్చిచూస్తే, 2 పేతురు పాత నిబంధన భాగాలను కోట్ చేయలేదు. అయితే, పేతురు కొన్ని పాత నిబంధన సంఘటనలు మరియు వ్యక్తుల గురించి, (నోవహు మరియు జలప్రళయము, లోతు మరియు సొదొమ నాశనం మరియు బిలాము గురించి), 2 పేతురు 2వ అధ్యాయంలో ప్రస్తావించియున్నాడు. అతని రెండవ అధ్యాయం యూదా పత్రికకు సిమిలర్ గా ఉంటుంది, ఒకదాని నుండి మరొకటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

కొత్త నిబంధన రచయిత మరొకరు మొదట వ్రాసిన విషయాలను ఉపయోగించడం మొదట ఆశ్చర్యంగా అనిపించవచ్చు. వాస్తవానికి, ఈ అభ్యాసం పరిశుద్ధ గ్రంథంలో చాలా సాధారణం. కొంతమంది పాత నిబంధన రచయితలు ఇతరులు కోట్ చేసిన విషయాలను తీసుకొని తమ రచనలలో పొందుపర్చియున్నారు. కొత్త నిబంధన రచయితలు పాత నిబంధనను స్వేచ్ఛగా ఉదహరించారు, కొన్నిసార్లు విస్తృతంగా. కొత్త నిబంధన కాలములో క్రొత్త నిబంధన రచయితలు ఒకరి రచనల నుండి మరొకరు కోట్ చేసుకొని వుండొచ్చుగా? పౌలు తన పత్రికలలో ప్రారంభ క్రైస్తవ కీర్తనల నుండే కాకుండా అన్యమత కవులు మరియు రచయితల రచనల నుండి కూడా కోట్ చేసియున్నాడు (ఉదాహరణకు, ఫిలిప్పీ 2:6–11 మరియు 1 తిమోతి 3:16లో పౌలు ఆదిమ కీర్తనలలోని భాగాలను ఉపయోగించాడని చాలామంది నమ్ముతారు). కాబట్టి 2 పేతురు 2వ అధ్యాయం మరియు యూదా సారూప్యతలలో ఉన్నది దొంగతనం కాదు, ఇది పరిశుద్ధ లేఖనాలలోని అన్ని గ్రంథాల సందేశం యొక్క ఐక్యతకు మరో ప్రదర్శన.

2 పేతురు మరియు యూదా మధ్యన స్పష్టమైన సారూప్యతలు ఉన్నాయి (2 పేతురు 2 అధ్యయన్ని యూదా 4–18తో పోల్చిచూడండి) వీటి మధ్యన ముఖ్యమైన తేడాలు కూడా ఉన్నాయి. ఒకరి నుండి మరొకరు వాడుకొని యుండొచ్చు లేదా ఇద్దరూ ఒక ఉమ్మడి మూలాన్ని నుండి తీసుకొని ఉండొచ్చు. వాడుకోవడం రచయిత యొక్క ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉంటుంది.

పేతురు యూదా పత్రికను కోట్ చేస్తున్నాడా లేదా అతనికి ఇలానే చెప్పాలని అనిపించిందా? ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఏదైనా కావొచ్చు. అయితే, యూదా మొదట రాశాడని చెప్పడం సహేతుకం. 2 పేతురు 2 అధ్యాయం దాని 1 అధ్యాయం మరియు 3 అధ్యాయాలలోని ప్రశాంతమైన బోధకు, హెచ్చరికలకు భిన్నంగా ఉంది. పేతురు అబద్ద బోధకులనేడి భయంకరమైన ప్రమాదం గురించి మాట్లాడాలనుకున్నాడు. ఇది యూదా పత్రిక యొక్క ప్రధాన అంశం కూడా. అయితే అప్పటికే చెలామణి అవుతున్న యూదా పత్రికను పేతురు చూసుండొచ్చు, దాని సందేశాన్ని మెచ్చుకుని, దానిలోని కొన్ని భాగాలను తన లేఖలో, తన శైలిలో చేర్చియుండొచ్చు అని అనుకోవడం సహేతుకంగా అనిపిస్తుంది.

2 పేతురులో క్రీస్తు
తన ఈ పత్రికలోని మొదటి వచనంలో తప్పితే, పేతురు రక్షకుని పేరు ఉపయోగించిన ప్రతిసారీ ఆయనకు ప్రభువు అనే బిరుదును వాడాడు. ఆధ్యాత్మిక పరిపక్వత సాధించడానికి అవసరమైన సంపూర్ణ జ్ఞానమునకు మరియు శక్తికి ప్రభువైన యేసు క్రీస్తే మూలమై యున్నాడు, (1:2,3,8; 3:18). పేతురు రూపాంతరం కొండ పై ఆయన రూపాంతరం యొక్క మహిమను గుర్తుచేసుకొంటూ, ప్రపంచం మొత్తం ఆయన మహిమను చూడాలని ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తూ వున్నాడు.

కీ వర్డ్
అబద్దపు బోధకుల నుండి కాపాడుకొనుడి.

కీ వచనములు
2 పేతురు 1:20,21 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొన వలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగ పలికిరి. 2 పేతురు 3:9-12 కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను.

కీ అధ్యయము: 2 పేతురు 1 అధ్యయము.

అవుట్ లైన్
థీమ్: “మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి2 పేతురు 3:18.
I. గ్రీటింగ్ (1:1, 2)
II. మీరు విశ్వసించే విధంగా జీవించడానికి మీ ప్రయత్నాలలో ఎదగండి (1:3-11)
ఎ. మీరు ఎవరో గుర్తుంచుకోండి (3, 4)
బి. మీ పిలుపును మరియు ఎన్నికను నిశ్చయం చేసుకోండి (5–11)
III. మీరు నమ్మేదానిపై మీ నిశ్చయతలో ఎదగండి (1:12-21)
ఎ. మీరు ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని కలిగియున్నారు (12–18)
బి. మీరు ప్రవక్తల యొక్క ఖచ్చితమైన సాక్ష్యాన్ని కలిగియున్నారు (19–21)
IV. తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా మీ అప్రమత్తతను పెంచుకోండి (2:1–22)
ఎ. హెచ్చరిక: ప్రమాదం భయంకరమైనది (1–3)
బి. ఆదరణ: దేవుడు బోధకులందరినీ తనకు జవాబుదారీగా ఉంచుతాడు (4–10)
సి. అంతర్దృష్టులు: అబద్ద బోధకుల నిజమైన పాత్ర (10–22)
V. అంతిమ తీర్పు కొరకు మీ సంసిద్ధతను పెంచుకోండి (3:1–16)
ఎ. మానవ చరిత్రలో దేవుడు ఇప్పటికే హింసాత్మకంగా జోక్యం చేసుకున్న విషయాలను గూర్చిన రిమైండర్‌లు (1–9)
బి. తీర్పు రోజు యొక్క స్పష్టమైన ప్రవచనం (10)
సి. ముగింపు దృష్ట్యా దైవిక జీవనానికి సవాలు (11–16)
డి. ముగింపు ప్రబోధం (3:17, 18)

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.