ప్రథమ భాగము
శుభాకాంక్షలు (1:1, 2)

1యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది: 2దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చి నట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురునని రచయిత గౌరవంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. సీమోను అనేది (హీబ్రూ పేరు) అతడు పుట్టినప్పుడు అతనికి పెట్టబడిన పేరు. అతనికి వారి పితరుడైన యాకోబు యొక్క రెండవ కుమారుని పేరు పెట్టారు. యేసు పన్నెండు మంది శిష్యులలో మరొక సీమోను కూడా ఉన్నాడు, జెలోతే అనబడిన సీమోను (అపొ. కార్య. 1:13). యేసు పేతురు కలిసిన రోజున (యోహాను 1:42) యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. యేసు ఇచ్చిన ఈ ప్రవచనాత్మక మారుపేరును అతడు ఎక్కువగా ఇష్టపడతాడు: కేఫా (అనేది అరామిక్ పేరు), అతని గొప్ప ఒప్పుకోలు తర్వాత యేసు అతనిని పేతురు అని పిలిచాడు. పేతురు (అనేది గ్రీకు పేరు, మత్తయి 16:18), అంటే “రాయి అని అర్థము“. అందువల్ల అతని పత్రికలు 1 మరియు 2 సీమోను అని కాకుండా 1 మరియు 2 పేతురు అని పిలువబడుతున్నాయి.

యేసు – (హీబ్రూలో యెహోషువా) అంటే “యెహోవాయే రక్షణ”. ” తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుమని ప్రభువు దూత యేసేపుకు చెప్పింది (మత్తయి 1:21). క్రీస్తు – ఆయన క్రీస్తు అని కూడా పిలువబడ్డాడు. గ్రీకు పదమైన ఈ మాట మెస్సీయ అనే హీబ్రూ పదానికి సమానం. రెండు పేర్లకూ “అభిషిక్తుడు” అని అర్థం. పాత నిబంధన కాలంలో దేవుడు రెండు ఉద్దేశ్యముల కొరకు అభిషిక్తులునుగా చెయ్యడం ప్రారంభించాడు: దేవుడు ఎంచుకున్న వ్యక్తిని ప్రత్యేకమైన కీలకమైన ఉద్యోగం కోసం వేరు చేయడం (ప్రవక్తలు, ప్రధాన యాజకులు మరియు రాజులు బహిరంగంగా దేవుని ఎంపిక మరియు దేవుని అధికారాన్ని చూపించడానికి అభిషేకించబడ్డారు). రెండవది, వారి పని యొక్క కఠినత కోసం వారిని సన్నద్ధం చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేక బహుమతులను పుచ్చుకోనుటకు అభిషేకింప బడ్డారు. యేసు రక్షకునిగా యొర్దాను నదిలో అభిషేకించబడ్డాడు – తండ్రి స్వరం తండ్రి ప్రేమపూర్వక ఎంపికను చూపించింది. పావురం ఆయన తన మానవ స్వభావంలో ఆత్మ యొక్క శక్తితో బలపరచబడటాన్ని చూపిస్తూవుంది.

ఇక్కడ పేతురు తనను తాను వర్ణించుకోవడానికి దాసుడు అనే మాటను ఉపయోగించియున్నాడు. ఆదిమ క్రైస్తవులలో ముఖ్యంగా, నాయకులు తమ్మును ఈ విధముగా పరిచయము చేసుకొనెడి వాళ్లు. దాసుడు అనే మాట బానిసత్వం, మరణం నుండి రక్షింపబడియుండటాన్ని తెలియజేస్తూ వుంది. ఈ చిత్రాన్ని మనకు వర్తింపజేసుకొంటే, దాసుడు అనే మాట దేవుని రక్షణ కృపకు కూడా వర్తిస్తుంది. ప్రభువుకు సేవకునిగా లోబడి వుండటం పేతురుకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అతడు క్రీస్తు చెల్లించిన వెలచే కొనుగోలు చేయబడి యున్నందున తాను తన స్వంతం కాదని ప్రభువును ఈ విధముగా మహిమ పరుస్తూ, ఇతర అపొస్తులులవలె (యాకోబు యూదా పౌలు వలే) ఇతడు కూడా యేసుక్రీస్తు దాసుడును అని తనను తాను పరిచయము చేసుకొంటూ వున్నాడు, (యాకోబు 1:1, యూదా 1:1; రోమా 1:1). దాసుడు అనే మాట వారి బాధ్యతలను నిర్దేశించు కోవడంలో వారికి సహాయపడుతూ ఇష్టపూర్వకంగా సేవ చేసేందుకు వారిని ప్రేరేపించింది.

ఇది అతడు యేసుకు శిష్యునిగా ఉన్న రోజుల నుండి అతనిలో వచ్చిన మార్పు. ఆ రోజుల్లో అతడు మరియు పన్నెండు మందిలో ఉన్న ఇతరులు తరచుగా ప్రముఖ స్థానాల కోసం పోటీ పడ్డారు, వారిలో వారు ఎవరు గొప్ప అని వాదించుకొన్నారు, లూకా 22: 24. యేసు వారికి నిజమైన నాయకత్వాన్ని ఎలా బోధించాడో పేతురు ఎన్నటికీ మరచిపోలేడు – ఆయన సిలువ వేయబడటానికి కొన్ని గంటల ముందు, మోకాళ్లపై ఉండి వారి పాదాలను కడిగి, “ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే“, యోహాను 13: 14 అని చెప్పటం ఎలా మర్చి పోగలడు. క్రీస్తు ద్వారా తన పరలోకపు తండ్రితో అతని సంబంధం ఒక బహుమతి. అతని అపొస్తలులత్వం సంపాదించబడ లేదు కాని దేవుని మహిమ కోసం మరియు సంఘ ప్రయోజనం కోసం అతనికి ఇవ్వబడింది.

అపొస్తలుడునైన సీమోను పేతురు – ఈ దాసుడు అపొస్తలుడు. అపొస్టల్‌షిప్‌ను అర్థం చేసుకోవడానికి కీలకం డైరెక్ట్ అనే మాట.

  • అపొస్తలులు వారి పూర్వ జీవితాల నుండి నేరుగా (డైరెక్ట్ గా) క్రీస్తు ద్వారా పిలువబడ్డారు.
  • అపొస్తలులు వారి సందేశాలను లేఖనాల నుండి పొందుకోకుండా నేరుగా క్రీస్తు నుండి పొందుకొన్నారు.
  • సంఘము యొక్క ఓటు ద్వారా పరోక్షంగా కాకుండా, వారికి నేరుగా క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించే అధికారం ఇవ్వబడింది.
  • వారు నేరుగా క్రీస్తు ద్వారా పంపబడ్డారు (వాస్తవానికి గ్రీకులో అపొస్తలుడు అనే పదానికి “పంపబడిన వాడు” అని అర్ధం.

మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు – ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించిన విషయాలను గురించి తెలియజేస్తూవున్నాయి. శతాబ్దాలుగా తప్పుడు బోధకులు కనికరం లేకుండా యేసును తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉండటం మూలాన్న ఈ మాటలు ఎంతో ప్రాధాన్యతను కలిగివున్నాయి.

  • యేసు దేవుడైయున్నాడు – తండ్రి పరిశుధ్ధాత్మతో ఒక్కటై యున్నవాడు. మన ఆరాధనకు మరియు ఘనతకు అర్హుడు.
  • యేసు రక్షకుడైయున్నాడు – మనల్ని నరకం నుండి తప్పించే క్షమాపణను వ్యక్తిగతంగా తీసుకువస్తున్న వాడు.

మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి – ఆయన రక్షించే నీతి, సువార్తలో వెల్లడి చేయ బడింది, (రోమా1:16).

పేతురు తన లేఖను ప్రత్యేకముగా ఆసియా మైనర్లోని క్రైస్తవులకే కాకుండా, క్రైస్తవులందరిని ఉద్దేశించి వ్రాస్తూ, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి, అని వారినందరిని సంభోదిస్తూ వున్నాడు. విశ్వాసం అంటే రక్షణ కొరకు క్రీస్తును విశ్వసించుటకు దేవుడు ఇచ్చిన సామర్ధ్యము. క్రైస్తవుల విశ్వాసం మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిపై ఆధారపడి ఉంటుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ద్వారా, మనుష్యుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడం ద్వారా, దేవునితో ఆయన చేసిన సయోధ్య ద్వారా, మానవులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతి లభించింది, అది ఇప్పుడు దేవుని చేతిలో ఉంది. ఈ నీతి ఉద్దేశ్యం ఏమిటంటే, మన అనీతిమంతత్వాన్ని మరియు పాపాన్ని కప్పిపుచ్చడం, విశ్వాసం ద్వారా దీనిని అంగీకరిస్తూ, దేవుని ముందు నిలబడుటకు, ఆయన ప్రియమైన పిల్లలుగా అంగీకరించబడుటకు మనలను సిద్ధపర్చటమే. కాబట్టే విశ్వాసాన్ని నమ్మకము యొక్క చర్యగా కూడా చెప్పొచ్చు. 

అపొస్ట్లిక్ మాటల మీద ఆధారపడిన విశ్వాసం ప్రత్యక్ష సాక్షి యొక్క విశ్వాసం వలె చెల్లుతుంది, ఎందుకంటే వారి విశ్వాసం క్రీస్తు నీతిపై మాత్రమే ఆధారపడి ఉంది. (యేసు–నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను, యోహాను 20:29). గమనించండి – మనలను మన దేవునితో కలిపే విశ్వాసం, మనల్ని నరకం నుండి బయటికి తీసుకొచ్చి మన తండ్రితో ఒకటిగా ఉంచే లైఫ్ లైన్, క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఈ మార్గాన్ని మనకు మనముగా సృష్టించుకోలేం, అలా చేయలేం. ఇది దేవుని బహుమతి, వాక్యం మరియు సంస్కారముల ద్వారా మాత్రమే మన దగ్గరకు వస్తూవుంది. క్రైస్తవ జీవితం వాస్తవానికి స్వంత క్రియలు, ప్రయత్నాలను కలిగి ఉన్నప్పటికీ, దేవుడు చేసిన గొప్ప పనులను విశ్వసించేలా ఆయన మనస్సులను హృదయాలను తెరవడంతో ప్రారంభమవుతుంది.

దేవునిగూర్చి నట్టియు మన ప్రభువైన యేసునుగూర్చి నట్టియునైన అనుభవజ్ఞానము, ప్రభువుతో మన సంబంధానికి అనుభవజ్ఞానము అనే మాట పదేపదే ఉపయోగించబడింది. మేధోపరమైన భయాందోళన కంటే, ఇది క్రీస్తులో నిత్యజీవం యొక్క బహుమానం కోసం అన్నింటి కంటే దేవునికి భయపడి, ఆయనను ప్రేమించి, ఆయనను నమ్మియుండడం వంటి దైవిక జ్ఞానం. అటువంటి జ్ఞానం మనకు దేవుని వాక్యం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ రక్షణ జ్ఞానం భూమిపై దైవిక జీవితానికి మరియు రాబోయే పరలోకంలో శాశ్వతత్వం కోసం మనల్ని సిద్ధం చేస్తుంది.

మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. విశ్వాసులు దేవుని వాక్యం ద్వారా త్రియేక దేవుణ్ణి మరియు వారి రక్షకుడైన యేసును మరింతగా తెలుసుకున్నప్పుడు, వారి జీవితాలు మారుతాయి. కృప సమాధానములు పుష్కలంగా ఉంటాయి. కృప అనేది మన పాపాలను మనపై ఉంచకుండా, యేసుని బట్టి మనలను దయతో చూడాలనే తండ్రిలోని వైఖరి. క్రీస్తు ద్వారా మనం తండ్రిని ఎక్కువగా తెలుసుకొనే కొలది, ఆయన ఉగ్రతకు భయపడుటకు బదులుగా ఆయన అనుగ్రహములో జీవించడాన్ని అంతగా ఆస్వాదిస్తాం. అపరాధ భావానికి బదులుగా మన హృదయాలలో ఆయన ఇచ్చిన సమాధానంలో అధికముగా సంతోషిస్తాం. నిజమైన భద్రత, ఓదార్పు మరియు ఎమోషన్స్ అన్ని దేవుని హృదయంలో ఉద్భవించాయి కాబట్టి, మనం ఆయనను ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మన జీవితాలు అంత మెరుగ్గా సాగుతాయి. వాక్యం ద్వారా మన రక్షకుని మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో, అంత ఎక్కువగా కృప సమాధానములు పుష్కలంగా ఉంటాయి.

1-2 పేతురు తన పాఠకులను క్రీస్తులో వారి స్థితిని ధృవీకరిస్తూ శుభమని చెప్తూ పలకరించాడు. క్రీస్తును ఒప్పుకునే వారందరూ “అపొస్తలులవలెనే అమూల్యమైన విశ్వాసాన్ని” కలిగి ఉంటారు. అయితే, తప్పుడు విశ్వాసం, నిరాశ, ఇతర గొప్ప అవమానములలోనికి మరియు దుర్మార్గంలోనికి, శోధించబడినందున క్రీస్తు విశ్వాసంపై మన పట్టు బలహీనపడుతుంది. మన పాపాల కంటే మన ప్రభువు యొక్క కృపా సమాధానములు మరింత గొప్పవి గనుక విశ్వాసంపై మన పట్టును బలోపేతం చేయడానికి ఆయన తన మాట మరియు సంస్కారముల ద్వారా ఎల్లప్పుడూ పని చేస్తున్నందుకు దేవునికి వందనములు తెలియజేధ్ధాం.

ప్రభువైన యేసు, అపొస్తలుల విశ్వాసంతో పోలిస్తే – నాకును వారితో సమానమైన విశ్వాసాన్ని ఇచ్చినందుకు వందనములు. నా విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించే వాటన్నిటినీ అధిగమించడానికి నీ మాట ద్వారా నన్ను అనుమతించుము, ఆమెన్.

రెండవ భాగం
మీరు నమ్మిన దానిని జీవించడానికి మీ ప్రయత్నాలలో ఎదగండి (1:3–11)

ఈ మొదటి తరం విశ్వాసులలో ఉన్న బలహీనత, క్రైస్తవ జీవనంలో వారికి ఎదుగుదల లేకపోవడం. సంఘము కొత్త క్రైస్తవులకు జన్మనిస్తోంది, కాని చాలా మంది శిశువులుగానే ఉంటున్నారు. అది వారిని (వారి స్వంత భయాలను బట్టి, స్వీయ సందేహాలను బట్టి, అబద్ధ బోధకులను బట్టి) సాతాను నుండి హాని పొందే అవకాశమున్న వారిగా ఉంచుతుంది. అట్లే “నా నుండి ఇది ఆశించబడుతుందని నాకు తెలియదు”, “నేను నా మార్గాలను మార్చుకోలేను”, “మనం కృపలో జీవిస్తున్నందున నేను నా జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు” లాంటి సాకులు కూడా సర్వసాధారణం. కాబట్టే అతడు ఫస్ట్ మూవ్మెంట్స్ అన్ని దేవునివే అని చూపించడం ద్వారా రెండవ భాగాన్ని ప్రారంభించాడు. దేవుడు క్రీస్తు మరణము ద్వారా సమస్త ప్రపంచాన్ని తనతో సమాధానపరచుకోవడమే కాకుండా, ఆ సందేశాన్ని విశ్వసించిన వారందరికీ క్షమాపణను ఇచ్చాడు మరియు విశ్వసించే సామర్థ్యాన్ని కూడా దయచేయుచున్నాడని చెప్తున్నాడు. అలా చెప్పటంలో పేతురు యొక్క ఉద్దేశ్యం, మన నూతన ఆధ్యాత్మిక జీవితానికి మూలాధారం నూటికి నూరు శాతం దేవుని క్రియ, ఆయన స్వచ్ఛమైన కృప, ఆయన స్వచ్ఛమైన ప్రేమ అని తెలియజేయటమే.

3తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, 4ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావము నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను.

ఆయన శ్రేష్ఠతను, లక్షణాలను మరియు దైవత్వమును (Essenceను) వ్యక్తపరుస్తూవున్న ఆయన మహిమను బట్టి మరియు ఆయన క్రియలలో వ్యక్తీకరించబడిన ఆయన మంచితనమును వర్ణిస్తూవున్న ఆయన గుణాతిశయమును బట్టి అనుభవ జ్ఞానము మూలముగా (దేవుని వాక్యం బయలుపరచుచున్న దేవుని జ్ఞానమైన క్రీస్తును తెలుసుకోవడం మూలముగా), మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక.

ఈ వచనాలు ప్రేమ, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు పతనమైన మానవాళి కోసం కలిగి ఉన్న ఉద్దేశాన్ని మానవ భాషలో చక్కగా వ్యక్తీకరిస్తూవున్నాయి. అట్లే 3వ వచనం మన జీవితాల పట్ల ఉన్న దేవుని ఉద్దేశ్యానికి విలువనివ్వకుండా ప్రయత్నిం చే బలహీనమైన, పాపభరితమైన 3 భౌతిక వాదనలకు/ ప్రశ్నలకు జవాబిస్తూ ఉంది:

ప్రశ్న: క్రైస్తవుడిగా మారాలనేది నా నిర్ణయం, నా ఆలోచన కాదా?
జవాబు: కాదు కానే కాదు. దేవుడు మిమ్మల్ని తన మహిమనుబట్టి మరియు మంచితనంనుబట్టి పిలిచాడు.

రక్షింపబడటం అనేది మానవ నిర్ణయం కాదు, దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే దైవిక పిలుపు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును, రోమా 10: 17. (ఆయన తన మంచితనములో మిమ్మల్ని ఇష్టపడాలని నిర్ణయించుకున్నాడు) ఆయన ఉద్దేశ్యం కోసం మీరు ఉన్నారు.

ప్రశ్న: నేను నా జీవనశైలిని మార్చుకోలేను – ఇది దేవుడు చెప్పినది కాదని నాకు తెలుసు, కాని నేను ఇలా ఉండకూడదా?
జవాబు: ఉండకూడదు. ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేస్తూ వున్నది.

దేవుడైన పరిశుధ్ధాత్ముడు మనలను విశ్వాసానికి పిలువడానికి వాక్యము ద్వారా పనిచేస్తూవున్నాడు. వాక్యము మనకు నిత్యజీవానికి దారితీసే జ్ఞానాన్ని ఇస్తూ ఉంది మరియు అది క్రీస్తులో మన జీవితాన్ని మరియు ప్రవర్తనను ప్రోత్సహిస్తూ నిజమైన దైవ భక్తికి నడిపిస్తూవుంది. నిజమైన దైవభక్తి అనేది జీవితంలోని ప్రతి అంశం పట్ల వారి వైఖరిని నియంత్రించే దేవుని పట్ల నిజమైన గౌరవం. వీటి ద్వారా మన జీవితానికి మరియు దైవభక్తికి కావలసినవన్నీ ఆయన దైవశక్తి మనకు దయచేస్తూ వున్నది.

ప్రశ్న: నా జీవితంలో పనిచేస్తూవున్న దేవుని శక్తిని నేను ఎందుకని చూడలేక పోతూవున్నాను?
జవాబు: ఆ శక్తి మనలను పిలిచిన వాని గూర్చిన మన అనుభవజ్ఞాన మూలముగా పని చేస్తూవుంది కాబట్టి.

బలహీనమైన క్రైస్తవులు, వారి జీవిత ఉద్దేశ్యం, అర్థం గురించి గందరగోళ స్థితిలో వున్నప్పుడు వారు దేవుని వాక్యానికి తిరిగి వెళ్లి, ఆయన ప్రశస్తమైన వాగ్దానాలను మళ్లీ వినొచ్చు, (ఇవి క్రీస్తులో కొత్త జీవితానికి పునాదులు). ఈ దిగువున ఇవ్వబడినవి దేవుని ప్రశస్తమైన వాగ్దానాలకు ఉదాహరణలు:

  • [దేవుడు] జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను (ఎఫెసీ 1:4).
  • అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చు చున్నాడు –నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు (యెషయా 43:1).
  • కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు (రోమా 8:1).
  • నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను (ఫిలిప్పీ 4:13).
  • అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, (ప్రకటన 21:3-4).

ఆయన మహిమ గుణాతిశయములనుబట్టి, ఆయన మనకు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. కొత్త జీవితానికి ప్రేరణగా, సాధనంగా ఆ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి, (2 కొరింథీ 7:1, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము). ఆ వాగ్దానాలు రక్షణకు సంబంధించిన అన్ని విషయాలు, నిస్సందేహంగా సువార్తలో వెల్లడి చేయబడిన రక్షణ ప్రణాళికకు సంబంధించినవి. ఈ వాగ్దానముల మూలముగా, దేవస్వభావము నందు పాలివారము కావలసియున్నాము, మరియు లోకమందున్న భ్రష్టత్వము నుండి తప్పించుకోవలసి యున్నాము. దైవిక స్వభావంలో పాల్గొనడానికి మరియు ప్రపంచంలోని అవినీతి నుండి తప్పించుకోవడానికి దేవుడే మనల్ని ఎనేబుల్ చేస్తాడు. అమూల్యములును అత్యధికములు నైన వాగ్దానములను ఇవ్వడంలో ఆయన ఉద్దేశ్యం, ఆయన మన విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా ఆయన దైవిక స్వభావంలో మనల్ని భాగస్వాములుగా చేసి, దేవుని నీతి, పవిత్రతతో సృష్టించబడిన కొత్త మనిషిని ధరించడానికి మనకు అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని ఇవ్వటమే.

ఈ అమూల్యమైన వాగ్దానాలను నమ్మిన ప్రజలు అపారమైన ఆశీర్వాదాలను పొందుకోవడమే కాదు, దేవస్వభావమునందును పాలివారగుదుని పేతురు చెప్తూవున్నాడు. కొత్త జీవితం యొక్క మంచితనాన్ని నొక్కిచెప్పిన ఆనాటి ప్రముఖ స్టోయిక్ తత్వవేత్తల నుండి పేతురు ఈ వ్యక్తీకరణను తీసుకొనివుండొచ్చు. (స్టోయిసిజం అనేది ప్రాచీన గ్రీస్ మరియు ప్రాచీన రోమ్‌లో వర్ధిల్లిన హెలెనిస్టిక్ తత్వశాస్త్రం. వెల్ బీయింగ్ మరియు హ్యాపీనెస్ని సాధించడానికి సద్గుణ సాధన సరిపోతుందని స్టోయిక్స్ విశ్వసించారు. స్టోయిక్స్ రోజువారీ జీవితంలో నాలుగు సద్గుణాలను అభ్యసిస్తూ దానిని సాధించే మార్గాన్ని గుర్తించారు: జ్ఞానం, ధైర్యం, నిగ్రహం లేదా పరిమితత్వము మరియు న్యాయం మరియు ప్రకృతికి అనుగుణంగా జీవించడం. ఇది ఏథెన్స్‌ లోని పురాతన అగోరాలో క్రీ.పూ. 300 లో సిటియమ్‌కు చెందిన జెనోచే స్థాపించబడింది).

క్రైస్తవులు ఏ కోణంలోనైనా దైవంగా మారతారని సూచించడం లేదు, మనం దైవత్వంలో భాగమవుతామని కాదు, కాని ఆ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తాడు, నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును, యోహాను 14:16-17. క్రీస్తు మన పాపపు స్వభావం మరియు మన పాపపు కోరికల ద్వారా ఏర్పడిన లోకమందున్న భ్రష్టత్వము (నైతిక అధోకరణం) నుండి మనలను విడిపించాడు (1 యోహాను 2:16, లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే). “క్రీస్తు కృపతో మాత్రమే నివసించే మనం, ఆ గొప్ప రహస్యం కారణంగా, క్రీస్తులోని దైవిక స్వభావంలో భాగస్వాములం”. మనలో, మన మానవత్వం మరియు ఆయన దైవత్వం, అలాగే మన మానవ వ్యక్తిత్వం మరియు ఆయన వ్యక్తిత్వం, విభిన్నంగా మరియు వేరుగా ఉంటాయి.

దేవస్వభావమునందును పాలివారగుదును మాటలు కొందరికి, బహుశా, “మీరు దేవతలవలె ఉందురని” సాతాను హవ్వతో చెప్పిన మాటల్ని గుర్తుచెయ్యొచ్చు (ఆది 3:5). సాతాను హవ్వను దేవుని నుండి వేరు చేయాలనే ఉద్దేశ్యములో ఈ మాటలు చెప్పాడు. సృష్టిలో ఒక కొత్త దేవతగా ఆమె తనను తాను ఊహించుకునేలా వాడు ఆమెను మెచ్చుకున్నాడు. కాని ఇక్కడ పేతురు ఉద్దేశ్యములో “దేవస్వభావమునందు పాలివారగుట” అంటే దేవునితో మరింత సన్నిహిత సంబంధములో ఉండటం, ఆయన పవిత్ర పోలికను తిరిగి పొందడం, ఆయన ఇష్టపడే వాటిని ఇష్టపడటం, ఆయన ద్వేషించే వాటిని ద్వేషించడం, ఆయన పనిని మరియు ఆయన ఆనందాలను పంచుకోవడం, ఆయన న్యాయమైన తీర్పులను పంచుకోవడం మరియు ఆమోదించడం. విశ్వాసము ద్వారా మనము ఇప్పటికే మనలో క్రీస్తును కలిగియున్నాము (కొలొస్సయులు 1:27), ఆ క్రమములో మనము దేవుని కుమారుని పోలికకు అనుగుణంగా వున్నాము (రోమా 8:29). ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలా ఉంటాం, ఆయన యున్నట్లుగానే ఆయనను చూస్తాం (1 యోహాను 3:2).

క్రైస్తవుని ఎదుట రెండు దారులు ఉన్నాయి – వాడు తన విశ్వాసం మరియు జీవితంలో ఎదుగుతూ, దేవుని విలువైన వాగ్దానాలను విశ్వసిస్తూ మరియు జీవిస్తూ, దేవస్వభావమునందు పాలివాడై ఉండటం, లేదా, వాడు తన విశ్వాసం మరియు జీవితంలో మరణిస్తూ “దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వము” వైపు వెళ్ళటం (వచనం 4). దేవుని వాగ్దానాలను విశ్వసించకూడదని మరియు దేవుని వాగ్దానాల ప్రకారము జీవించకూడదని ఎంచుకునే ఎవరైనా సాతాను అబద్ధాలకు సులభంగా మోసపోయే వ్యక్తిలా ఉంటాడు. ఆ అబద్ధాలు తరచుగా స్వల్పకాలిక ఉద్వేగాన్ని కలిగిస్తాయి, కాని అవి జీవనశైలిగా మారినప్పుడు, (పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలు, 1పేతురు 1:14, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు, 1పేతురు 2: 11), అవి ఆ వ్యక్తిని పాడు చేస్తాయి (వారి మార్గమును చెరిపివేసి, బలత్కారముతో నింపి, (ఆది 6:11,12) రోతగా ఉండేటట్లు చేసి, (కీర్తనలు 14:3) యెహోవాను విసర్జింపజేసి, (యెషయా 1:4) మోసకరమైన కోరికల చేత చెడిపోయిన పాత స్వభావాన్ని కలిగి ఉండేటట్లు ప్రోత్సహిస్తూ, ఎఫెసీ 4:22, లోకమందున్న భ్రష్టత్వములో మునిగిపోయేటట్లు చేసి), తద్వారా అతనిలో మిగిలి ఉన్న విశ్వాసాన్ని విషపూరితం చేసి అతనిని నరకానికి నడిపిస్తాయి. లోకములోని కుళ్ళు నుండి మనం తప్పించుకోకపోతే దాని మీదికి వచ్చే దేవుని కోపాన్ని తప్పించుకోలేము, (మత్తయి 23:33; రోమా 2:3; 1థెస్స 5:3; 2తిమోతి 2:26; హెబ్రీ 2:3;12:25).

దేవుని వాగ్దానములను నమ్ముట ద్వారా తప్పించుకొనుడి, దేవుడు మీకు ఇచ్చిన శక్తితో మీ జీవితాలను మార్చుకొనుడి అని పేతురు చెప్తూవున్నాడు. జీవితాలను మార్చుకొనుటకు అవసరమైన ఎనిమిది లక్షణాలను ఈ దిగువ వచనాలలో వివరిస్తూ వున్నాడు.

5ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, 6జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, 7భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. 8ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును. 9ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి పోయి, గ్రుడ్డివాడును దూరదృిష్టిలేని వాడునగును.

మీరు పూర్ణజాగ్రత్తగలవారై అంటే అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి అని అర్ధం. క్రైస్తవుని పవిత్రీకరణ జీవితం యొక్క పెరుగుదల మరియు విస్తరణను అపొస్తలుడు క్రమంగా, స్థిరమైన పురోగతిగా వివరిస్తూ వున్నాడు. వారు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో దేవుని అద్భుతమైన బహుమతులను ఆస్వాదిస్తున్నారు కాబట్టి, విశ్వాసులు తమలో పునర్నిర్మించబడిన దైవిక స్వభావాన్ని గురించి సాక్ష్యమివ్వడానికి సహజంగానే సాధ్యమైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తారు. దేవుడు తన సర్వ సమృద్ధిలో ఉచితముగా అమూల్యమైన వాగ్దానములను ఇవ్వడం విశ్వాసి యొక్క హృదయమును సంపూర్ణముగా ప్రేరేపిస్తుంది అన్ని విధాలా ప్రయత్నం చేసేటట్లు చేస్తుంది, ( మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే, ఫిలిప్పీ 2:12,13).

పేతురు 5 నుండి 8 వచనాలలో, దేవునిని సంతోషపెట్టే జీవితంలో ఉండే కొన్ని లక్షణాలను పేర్కొంటూ వున్నాడు. కారణం, మనం ఎదుగుటకు లేదా స్తబ్దుగా ఉండి క్షీణించుటకు ఎంచుకోవచ్చు అనే విషయాన్ని అట్లే ఈ క్రింది లక్షణాలు దేవుణ్ణి సంతోషపెట్టడమే కాదు, మన జీవితాలను కూడా మెరుగుపరుస్తాయని మనం తెలుసుకోవాలని అతడు కోరుకుంటున్నాడు. ఇక్కడ పేర్కొనబడిన సద్గుణాలు ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితంలో పొందవలసిన ఫలాలు. ఇవి ఫలవంతమైన క్రైస్తవ జీవితాన్ని ఉత్పత్తి చేసే సద్గుణాలు (గలతీ 5:22-23). నొక్కిచెప్పడానికి ఎంపిక చేయబడిన లక్షణాలన్నీ అబద్ద బోధకుల లక్షణాలకు భిన్నంగా ఉంటాయి, అబద్ద బోధకులు సత్యం యొక్క మార్గాన్ని వక్రీకరించారు (అధ్యాయం 2) మరియు క్రైస్తవ నిరీక్షణను తిరస్కరించారు (3:3-4).

విశ్వాసము — మొదటి స్థానంలో ఉంచబడింది ఎందుకంటే విశ్వాసము క్రైస్తవ జీవితానికి మూలం. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము, హెబ్రీ 11:6. విశ్వాసం అనేది అన్ని సద్గుణాలు మరియు మంచి పనులను కలిగి ఆధ్యాత్మికత యొక్క గొప్ప ఫలాలుగా ముందుకు సాగుతుంది. విశ్వాసం సద్గుణాన్ని, ధైర్యాన్ని మరియు బలాన్ని తెస్తుంది, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలని కోరుకునే మనస్సు యొక్క వైఖరి. విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును, యాకోబు 2:17.

సద్గుణము — ఇక్కడి గ్రీకు పదం శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని, నైతిక విలువలను, యథార్థతను, మంచితనాన్ని సూచిస్తూ వుంది.

జ్ఞానము — ఇక్కడ 2 మరియు 3 వచనాల్లోని “జ్ఞానం” అనే పదానికి వాడిన గ్రీకు పదము కాకుండా భిన్నమైన గ్రీకు పదం వాడబడింది. ఆ పదం దేవుని ద్వారా అనుగ్రహింపబడిన మన రక్షకుని గూర్చిన సంపూర్ణమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. క్రీస్తులో వెల్లడి చేయబడిన దేవుని గురించిన జ్ఞానం. ఆ జ్ఞానం మనకు సమృద్ధిగా ఇవ్వబడింది. ఇప్పటికే దానిని మనం కలిగియున్నాము. అయితే, ఈ జ్ఞానం, బైబిల్ చదవడం, బైబిల్ స్టడీలో చేరడం, బైబిల్ ప్రసంగం వినడం లేదా బైబిల్ వ్యాఖ్యానాన్ని చదవడం ద్వారా దేవుని మార్గాల్లో మీరు పొందే లోతైన అంతర్దృష్టి.

ఆశానిగ్రహము — ఇది దేవుని ఆత్మ ఫలము (గలఁతి 5:22). భావోద్వేగాలు, ప్రేరణలు మరియు కోరికలను నియంత్రించు కోవడం మరియు మనలో నివసించే క్రీస్తుకు విధేయత చూపడం. క్రైస్తవులు తమ పాపపు ఆకలితో పోరాడడానికి దీనిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. 21వ శతాబ్దంలోని క్రైస్తవులు స్వీయ-భోగానికి మరియు అభిరుచులకు లోబడిపోతూ వాటికి అధిక ప్రాధాన్యతనిస్తూవున్నారు. వ్యక్తిగత ఫీలింగ్ యొక్క తీవ్రత వాటి విలువను ధృవీకరిస్తుంది. ఈ రోజు నేను కనీసం ప్రతిఘటించకుండా పాపానికి గురైతే, రేపు నేను మరింత బలహీనంగా ఉంటాను. ఈ రోజు సాతానుకు నో చెప్పడాన్ని ఎంచుకోవడం వల్ల రేపు వద్దు అని చెప్పడానికి నన్ను మరింత బలపరుస్తుంది.

సహనము — మనకు ఏ భాధలు కష్టాలు వచ్చినా ఓపీగ్గా సహించి విశ్వాసములో సాగిపోవడం అని అర్ధం. ఇది స్వభావ సిద్ధముగా మనలో ఉండేది కాదు. దానిని సమకూర్చుకోవడం మనం నేర్చుకోవాలి, యాకోబు 1:2-4,12.

దైవభక్తి — దేవుని చిత్తం మరియు మార్గాల పట్ల గౌరవ దృక్పథం, దేవుని గొప్పతనం మరియు మంచితనమును బట్టి ఆరాధించే దృక్పథం, మనం చేసే ప్రతి పనిలో భగవంతుని గురించిన అవగాహన. ఆచరణలో క్రియలలో దేవుని పట్ల కనిపించే భక్తి శ్రధ్దలు.

సహోదర ప్రేమ — ఇది అందరి పట్ల ఆచరణపూర్వకంగా వెల్లడయ్యే ప్రేమ, వాత్సల్యత, (రోమా 12:10; 1 థెస్స. 4:9; హెబ్రీ 13:1; 1పేతురు 1:22,23). నేడు సహోదర ప్రేమను నటించే వాళ్ళు ఎక్కువగా వున్నారు. పరిశుద్ధ గురువారం తన శిష్యులకు యేసు చెప్పిన మాటలు ఇప్పటికీ నిజం: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” (యోహాను 13:35). బహిరంగంగా ప్రదర్శించబడే నిస్వార్థ వైఖరి, నిజమైన ప్రేమ, వాత్సల్యత, ఆప్యాయత అత్యంత శక్తివంతమైన సువార్త.

దయ — క్రీస్తులో దేవుడు మనలను ప్రేమించినట్లే, నిస్వార్థంగా, ఇతరుల కోసం మీరు త్యాగం చెయ్యడం. నిజానికి అబద్ద బోధకులు స్థిరమైన కుటుంబాలను కలిగి ఉండరు. ఈ నిజమైన దయ (ప్రేమ) లేకపోవడం వారి మాటలను మోసకరముగా చేస్తుంది.

ప్రతి గుణాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా, అన్నీ పరిపూర్ణం అయ్యేంత వరకు పెంపొందించుకోవాలని పేతురు సూచించడం లేదు. బదులుగా, అవన్నీ ఏకకాలంలో అలవర్చుకోవాలని ఆధ్యాత్మిక వృద్ధిలో కొనసాగుతూ ఉండమని పేతురు చెప్తూ వున్నాడు, (2పేతురు 3:18, 1పేతురు 2:2; ఫిలిప్పీ 3:10; 1 థెస్స 3:12). క్రైస్తవుల జ్ఞానం వారి జీవన విధానాన్ని ప్రభావితం చేయాలి. అబద్ద బోధకులు బోధించినట్లుగా అది వారిని నైతిక పరిమితుల నుండి విముక్తి చేయదు. బదులుగా అది పవిత్రతను మరియు అన్ని సద్గుణాలను ఉత్పత్తి చేస్తుంది, (కొలొస్స 1:9-12).

క్రీస్తు యొక్క కల్వరి విజయం పాపము యొక్క అపరాధంపై మరియు అధికారముపై రెట్టింపు విజయం అని గుర్తుంచుకొండి. సాతానుని గద్దించి, దేవుని దృష్టిలో ఏది సరైనదో దాన్ని ఎంచుకునే సామర్థ్యాన్ని ఆయన మనకు ఇచ్చియున్నాడు. మనం నమ్మే విధంగా జీవించడానికి మన ప్రయత్నాలలో ఎదగాలని ఎంచుకుంటే మనకు ప్రభావవంతమైన ఫలభరితమైన జీవితాన్ని వాగ్దానం చేస్తూవున్నాడు. విమోచించబడిన, క్షమించబడిన మరియు నమ్మే వ్యక్తులను తీసుకొని తన ప్రయోజనాల కోసం వారిని ఉపయోగకరంగా మార్చడం ఎల్లప్పుడూ దేవుని ఉద్దేశం. క్రైస్తవులు క్రైస్తవ జీవనంలో ఎదుగుదల లేకుండా ఉన్నట్లయితే, వారిలో ఏదో లోపముంది. ఆధ్యాత్మిక ఎదుగుదల దాదాపు భౌతిక పెరుగుదల వలె నెమ్మదిగా జరుగుతుంది, కాని అది ఆటోమేటిక్ గా జరగదు. ప్రతి వ్యక్తి యొక్క మెడలో పిట్యూటరీ గ్రంధి ఉంటుంది, ఇది పిల్లలలో శారీరక పెరుగుదలను నడిపిస్తుంది మరియు నియంత్రిస్తుంది. శరీరం పూర్తిగా పెరిగినప్పుడు పెరుగుదల ప్రక్రియను ఆపేస్తుంది. ఎదగడానికి ఎవరూ ఎంచుకోవలసిన అవసరం లేదు – అలా జరుగుతుంది అంతే. అయితే ఆధ్యాత్మిక ఎదుగుదల విషయములో అలా ఆటోమేటిక్ గా స్వయంగా జరగదు. దేవుడు విశ్వాసుల విషయములో వాళ్ళు విశ్వాసములో, జీవితములో ఎదగడానికి ఎన్నుకొనుటకు వారికి సామర్ధ్యమును ఇచ్చియున్నాడు.

ఈ సద్గుణాలు మీలో పెరుగుతున్నప్పుడు, అవి మిమ్మల్ని పనికిరానివారిగా లేదా నిష్ఫలులుగా ఉంచవు. ఈ సద్గుణాలు లేని వ్యక్తి అంధుడు, హ్రస్వదృష్టి గలవాడు, తన పాపాల యొక్క పూర్వ ప్రక్షాళనను మరచిపోయినట్లు ప్రవర్తిస్తాడు. ఒక వ్యక్తి తన హృదయంలో దేవుని పట్ల విశ్వాసం, ప్రేమను కలిగి ఉండకపోతే, అతడు క్రైస్తవ సంఘంలో సభ్యుడైయున్నప్పటికీ, అతడు పాక్షికంగా అంధుడిగా ఉంటాడు, అతనికి హ్రస్వదృష్టి ఉన్నందున సమీపంలోని తాత్కాలిక విషయాలను మించి చూడలేడు. అతని మనస్సు భూసంబంధమైన విషయాలపై మాత్రమే నిమగ్నమై ఉంటుంది. అతడు విశ్వాసానికి వచ్చిన సమయంలో అతనికి వర్తించే పాప క్షమాపణ ద్వారా ప్రభువు అతనికి ఎలాంటి అద్భుతమైన బహుమతులు ఇచ్చాడో అతడు మర్చి పోయాడు. మరో మాటలో చెప్పాలంటే, అతని ప్రవర్తన అతనికి తన మార్పిడి సమయంలో ఇవ్వబడిన విశ్వాసాన్ని కోల్పోయిందని చూపిస్తుంది, కాబట్టే అతడు పరలోక విషయాల పై ద్రుష్టి పెట్టాడు.

క్రైస్తవ జీవనంలో ఎదుగుదల లేకుండా ఉన్న వారిని, పేతురు దూరదృష్టి లేనివారు అంటూవున్నాడు. దూరదృష్టి లేనివారు అంటే పేతురు ఉద్దేశ్యములో, “క్రీస్తుకు కళ్ళు మూసుకొన్న వాళ్ళు”. 5-7లోని లక్షణాలను అభ్యసించకుండా ఉద్దేశపూర్వకంగా కళ్ళు మూసుకొన్న గ్రుడ్డివారు (ఆధ్యాత్మికంగా). వారు ఆధ్యాత్మిక ప్రమాదాన్ని చూడకున్నారు. ఈ ఆధ్యాత్మిక కంటిశుక్లం ఉన్న వారి కోసం పేతురు ప్రిస్క్రిప్షన్ వ్రాస్తూ : మీరు నమ్మే విధంగా జీవించడానికి మీ ప్రయత్నాలలో వృద్ధి చెందండి అనే మెడిసిన్ వాడమని చెప్తూవున్నాడు.

మనకు అవసరమైన వాటినన్నిటిని క్రీస్తు ఇచ్చాడు గనుక ఆయన ఇచ్చిన వాటిని చేపట్టి క్రైస్తవ జీవితం తాలూకు అన్ని మంచి లక్షణాలలోను ఎదగడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి.

10అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. 11మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.

మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. దేవుడు శాశ్వతత్వములోనే మనలను ముందుగానే ఆయన వారిగా మనలను ఎంచుకున్నాడు. విశ్వాసులు 5-7లో వివరించిన సద్గుణములలో శ్రద్ధగా కొనసాగుతూ, తమను నిష్ఫలులుగా చేసే పాపాలను మరియు జీవితంలోని సంక్లిష్టతలను తప్పించుకొనుటకు జాగ్రత్తపడవలసియున్నారు.

మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి అను మాటలలో, ఏదో ఒకవిధంగా దేవుని దయపై మాత్రమే కాకుండా మానవ ప్రయత్నంపై పిలుపును ఏర్పాటును ఆధారపడి ఉన్నాయని పేతురు చెప్తూ ఉన్నాడా? లేదు. (1) మానవులు దేవుని ఎన్నికను మరింత నిశ్చయము ఎలా చేసుకోగలరు? అంటే ఆయన రాజ్యంలో మన పౌరసత్వానికి నిత్యత్వములో ఆయన నిర్ణయము గ్యారంటీ నిస్తూవుందా? (2) మన ప్రయత్నాలు మనల్ని విశ్వాసానికి పిలువడంలో ఆయన వాక్యాన్ని శక్తివంతంగా ఎలా చేయగలవు? (3) మనం కృప ద్వారా రక్షింపబడినట్లయితే, సత్క్రియలు (సద్గుణ లక్షణాలు) మన పరలోకపు ప్రవేశముతో ఎందుకని అనుసంధానించ బడివున్నాయి? మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడి యున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు, ఎఫెసీ 2: 9.

పేతురుకు తానేమి చెప్తున్నాడో ఖచ్చితముగా తెలుసు. సోమరులుగా నిష్ఫలులుగా ఉంటూ, దేవుని కృపను గురించి అభద్రతా భావములో భక్తిపూర్వకంగా మాట్లాడే వారిని అతడు గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. వారి సంఘాల్లోకి చొరబడిన అబద్ద బోధకులచే కన్ఫ్యూజ్ అయ్యి ఆత్మవంచన చేసుకునే వారి స్వంత సామర్థ్యం కారణంగా, కొంతమంది క్రైస్తవులు క్రైస్తవ మతం కేవలం దేవుని గొప్ప కార్యాల సందేశానికి మేధోపరమైన సమ్మతిని తెలియజేయడమేనని వారు అనుకొన్నారు. దేవుడే ఇదంతా చేశాడు కాబట్టి వారి ఆధ్యాత్మిక జీవితాల్లో పెరుగుదల అనేది అనవసరమైన విషయమని బహుశా అది అసాధ్యం కూడా అని వారు భావించడం మొదలుపెట్టారు. ఫలితం-ఫలాలు లేని “విశ్వాసం”, ఎదుగుదల లేని “సువార్త”, జీవశక్తి లేని “శరీర జ్ఞానం”. దేవుని ఖరీదైన కృప చీప్ అయ్యిపోయింది మరియు విమోచించబడిన జీవితాలపై దేవుని యాజమాన్యపు హక్కు బలహీన పడింది. ఇది ప్రమాదకరమైనది. వారు నమ్మిన దానిని జీవించడానికి వారి ప్రయత్నాలలో వారు ఎదగవలసి యున్నారు.

ఈ సద్గుణాలను పెంపొందించుకునే వారు ఎన్నటికీ పాపం చేయరని కాదు, కాని వారు క్రీస్తు రాజ్యానికి నడిపించే మార్గం నుండి దూరంగా ఉండరు (లూకా 12:32). పేతురు పాప క్షమాపణ తర్వాత క్రియలను గురించి మాట్లాడుతున్నాడు మరియు వాటిని ఎందుకు చేయాలో బోధించాడు. మీరు మీ పిలుపులో భద్రంగా ఉండటానికి, మీ పిలుపు యొక్క బహుమతులను మీరు కోల్పోకుండా ఉండటానికి మంచి పనులు చేయండి.

యాకోబు తన పత్రికలో, చాలా దృఢముగా, క్రియలు లేని విశ్వాసం మృతమని వ్రాసియున్నాడు (యాకోబు 2:17). విశ్వాసం చనిపోయినప్పుడు, ప్రజలు తమ రక్షకునితో తమ సంబంధాన్ని కోల్పోతారు. వారిపైకి పాపం యొక్క అపరాధం మరియు అధికారము తిరిగి వస్తుంది. కాబట్టే పేతురు తన సహోదరులు తమ ఎన్నికను నిశ్చయము చేసికొనుటకు జాగ్రత్తగా ఉండాలని బ్రతిమాలాడుతున్నాడు. దేవుని ఎంపిక శాశ్వతత్వం నుండి ఖచ్చితమైనదిగానే ఉంది, కాని సహోదరులు తాము నిశ్చయతను కలిగియుండవలసియున్నారు. దేవుడు నిజంగా వారిని తన వారుగా ఎన్నుకొనియున్నాడు. వారు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మరియు శక్తిని ఉపయోగించినప్పుడు, దేవుడు నిజంగా వారిని తన వారిగా ఎన్నుకొనియున్నాడనే నిశ్చయతలో, దాని ప్రభావంలో ఎదగగలుగుతారు. వారు తమ జీవితాల్లో జరుగుతున్న నిజమైన మార్పులను చూసినప్పుడు, తమలో పరిశుద్ధాత్ముడు నిజంగా పనిచేస్తూ ఉన్నాడనే జ్ఞానంలో వారు పెరుగుతారు.

అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు వ్రాస్తూ, “కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ 2: 12, 13) అని సహోదరులను పేతురు లాగానే ప్రోత్సహిస్తూవున్నాడు.

దైవిక జీవనంలో ఎదుగుదలకు దేవుడు ఇచ్చిన రెండు అద్భుతమైన వాగ్దానాలను పేతురు జతపరిచాడు. “మీరు ఎప్పుడును తొట్రిల్లరు“, అని అతను చెప్పాడు. దీనర్థం వారు మళ్లీ పాపం చేయరని కాదు. అయితే, వారు క్రీస్తు నుండి ఎన్నటికీ దూరంగా ఉండరని దీని అర్థం. నిజమైన విశ్వాసం, నిజమైన క్రియలలో వ్యక్తీకరించుకొంటుంది, మంచి కాపరియైన రక్షకునిలో పాతుకుపోయి ఉంటుంది, నమ్మిన గొర్రెలతో ఆయన, “[మిమ్మల్ని] ఎవడును నా చేతిలోనుండి అపహరింపడు” (యోహాను 10:28) అని వాగ్దానం చేసాడు. పాపం, స్వీయ-భోగ జీవితం ద్వారా మూర్ఖంగా తమ ఆత్మ యొక్క రక్షణను పణంగా పెట్టేవారు, పొరపాట్లు చేసి తొట్రిల్లుదురు.

పేతురు చేసిన రెండవ వాగ్దానమేమిటంటే, యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింప బడును. వారి దైవిక కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోబడతాయి. క్రైస్తవులు తమ ప్రభువును ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు, ఆయన వారి నీతివంతమైన చర్యలను ఆయన బహిరంగంగా అంగీకరిస్తాడు (మత్తయి 25:31-46 చూడండి). విందుకు తన అతిథులను స్వాగతిస్తున్నట్లుగా ఆయన వారిని స్వాగతిస్తాడు: నూనెతో వారి తలలు అభిషేకింపబడతాయి, వారి గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది, శత్రువులందరి నుండి వారి భోజనము సురక్షితంగా ఉంటుంది (కీర్తన 23).

మూడవ భాగం
మీరు నమ్మేదానిపై మీ నిశ్చితాభిప్రాయాన్ని పెంచుకోండి (1:12–21)

12కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. 13-14మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని యెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచు కొనుచున్నాను. 15నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్త చేతును.

దేవునిని గురించి అనుభవజ్ఞానమూలముగా అధికముగా తెలుసుకోవాల్సిన విశ్వాసులు తమ విశ్వాసంలో శిశువులుగా ఉండడాన్ని ఎన్నుకోవడం కొనసాగించినప్పుడు, పేతురు వారిని “దూరదృిష్టిలేనివాడు” మరియు “గ్రుడ్డివాడు” అని పిలిచాడు (వచనం 9). ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు, వారికి ఆధ్యాత్మికంగా మతిమరపు రోగము కూడా ఉందని ఆరోపించాడు. దేవునికి వందనాలు, ఇది ఆధ్యాత్మిక అల్జీమర్స్ వ్యాధి వంటిది కాదు, అల్జీమర్స్ వ్యాధి కోలుకోలేనిది, కాని పేతురు చెప్పే మతిమరపు రోగము నయం చేయదగినది. భౌతిక మతిమరపు రోగము ఎంత హానికరమో ఆధ్యాత్మికంగా మతిమరపు రోగము కూడా అంతే హానికరం. ఇది మీ సంబంధాల గురించి/ మీ గుర్తింపు గురించి మీకు అవగాహన లేకుండా చేస్తుంది. అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది, మీ జీవిత లక్ష్యాన్ని దోచుకుంటుంది. కాబట్టి పేతురు తన లేఖను “మీకు జ్ఞాపకము చేయుటకు,” “మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి” మీరు ఈ సంగతులను గుర్తుంచుకోవడానికి వ్రాసాడు.

మనమందరం కొన్నిసార్లు కొన్నింటిని మరచిపోతువుంటాం. ప్రతిరోజూ మన మెదడు నుండి సమాచారం నెమ్మదిగా డ్రైన్ అయిపోతూవుంది. కొన్నిసార్లు మతిమరపు చాలా అందంగా ఉంటుంది. మతిమరపు వ్యక్తుల గురించి నవ్వుకోవడానికి వేలకొద్దీ స్టాండ్-అప్ కామెడీ గ్యాగ్‌లు ఆన్లైన్లో విరివిగా వున్నాయి. కాని కొన్నిసార్లు మతిమరుపు చాలా ఖరీదైనది అవుతుంది. మతిమరుపును బట్టి విలువైనవి కోల్పోవాల్సి వస్తుంది, ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు చెయ్యవలసిన ముఖ్యమైన పనులను గురించి కూడా మర్చిపోతూవుంటారు. కొన్నిసార్లు మరచిపోవడం రోతగా అసహ్యకరంగా ఉండటమే కాదు ప్రమాదకరం కూడా (జీవిత భాగస్వామి అతడు లేదా ఆమె వివాహం చేసుకున్నట్లు “మర్చిపోయి” ఇతరులతో లైంగిక సంబంధాలను కలిగియున్నప్పుడు లేదా యుక్తవయస్కులు కుటుంబాలను కలిగి ఉన్నారనే విషయాన్ని “మర్చిపోయి” కుటుంబసభ్యులను ఇబ్బందుల్లోకి అవమానంలోకి లాగినప్పుడు లేదా చర్చి నాయకులు తాము సేవకులం అనే విషయాన్ని “మర్చిపోయి” వారు ప్రభువుల వలె ప్రవర్తించినపుడు).

కొన్నిసార్లు మరచిపోవడం ఆధ్యాత్మిక అనారోగ్యానికి మరియు మరణానికి కూడా కారణమవుతుంది, ప్రజలు తాము స్వాభావికంగా పాపులమని అపవిత్రులమని మరచిపోయినప్పుడు, వారిని నరకం నుండి బయటకు తీసిన క్రీస్తుని ఖరీదైన రక్షణను గురించి మర్చిపోతున్నారు. సాతానును వారి ఇతర ఆధ్యాత్మిక శత్రువులను గురించి మర్చిపోతున్నారు. వారి ఆధ్యాత్మిక రక్షణ కవచాన్ని ధరించడానికి మరియు వారి ఆధ్యాత్మిక ఆయుధాలను తీయడానికి మర్చిపోతున్నారు. పేతురు తన పాఠకుల బలహీనతలను బట్టి వారిని ఎగతాళి చెయ్యడం లేదు. కాబట్టే మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నానని చెప్తున్నాడు.

అట్లే మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి, విశ్వాసులను చివరిసారిగా వారికి ఇప్పటికే తెలిసిన జీవమిచ్చే దేవుని వాక్యం నుండి బోధలతో వారి జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడం ద్వారా బలపరచి ప్రోత్సహించాలని పేతురు ఆశపడుతున్నాడు. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్త చేతును అని చెప్తున్నాడు. ఈ లేఖ రాయడం ద్వారా జాగ్రత్త చేస్తున్నానని చెప్తూ వున్నాడు. వ్రాసిన లేఖను చదవవచ్చు మళ్ళి తిరిగి చదవవచ్చు ఇతరులకు బోధించవచ్చు. జ్ఞాపకము చేసే ప్రక్రియ ను కొనసాగించేందుకు పరలోకరాజ్యం కోసం కొత్తగా సేవకులను తీసుకోవడం వారికి శిక్షణ ఇవ్వడం వంటి అపొస్టోలిక్ ప్రాక్టీస్ ని కూడా పేతురు సంఘానికి, సూచిస్తూ ఉండొచ్చు. లేదా అతడు క్రీస్తు జీవిత సువార్తను వ్రాయడానికి సెయింట్ మార్క్‌కు సహాయం చేయడాన్ని (ఆ జ్ఞాపకాలను) సూచిస్తూ ఉండవచ్చు (మార్కు రోమ్‌లో పేతురుతో ఉన్నాడు. పేతురుకు అతడు కుమారుని వలె సన్నిహితంగా ఉన్నాడు (1 పేతురు 5:13).

ఐదు ప్రావిన్సులలోని క్రైస్తవులను వేధిస్తున్న అత్యంత తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్యలలో ఒకటి ఆధ్యాత్మిక అధికారాన్ని మరచిపోవడమే. వారు దేవుని గురించిన వారి సమాచారం యొక్క నిజమైన మూలాన్ని మరచిపోయారు మరియు ఏమి విశ్వసించాలనే దానిపై అనిశ్చితిలో కూరుకుపోయారు. తప్పుడు బోధకులు తమ స్వంత ప్రత్యక్షతలతో ప్రజలను దోపిడీ చేస్తున్నారు మరియు ప్రజలకు ఆనందం మరియు “స్వేచ్ఛను” వాగ్దానం చేస్తున్నారు. సత్యం ఒక్కటే చాలా సత్యాలు లేవు (12వ వచనం). ముగ్గురు శిష్యులు, ఇద్దరు ప్రవక్తలు మరియు ఒక మెస్సీయ పాల్గొన్న ఆ రూపాంతర పర్వతంపై జరిగిన ఒక నిర్దిష్ట సంఘటనను గూర్చిన జ్ఞాపకాలతో పేతురు వారిని రిఫ్రెష్ చేస్తున్నాడు.

3-15 పేతురు క్రైస్తవ ఆశ యొక్క గొప్పతనాన్ని ధృవీకరిస్తూవున్నాడు మరియు మంచి పనులతో వారి విశ్వాసానికి సాక్ష్యాలను ఇవ్వడం ద్వారా వారి పిలుపు మరియు ఎన్నికను నిశ్చయము చేసుకొమ్మని అతడు తన పాఠకులను ప్రోత్సహిస్తూవున్నాడు. మనం విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడ్డాము, కాని విశ్వాసం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. ఇంకా, పాపాన్ని బట్టి, మన విశ్వాసానికి రుజువుగా మనం ఆచరించాల్సిన ధర్మాలను మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తూ మరియు గుడ్డి వారిగా మారుతున్నాము. దేవునికి సంతోషకరమైన ఫలాలను ఇవ్వడంలో మనం వైఫల్యం చెందుతూ ఉన్నప్పటికీ, మన ప్రభువు పవిత్ర బాప్టిజం ద్వారా ప్రతిరోజూ మనలను బలపరుస్తూనే వున్నాడు.

ప్రభువా, జీవితానికి మరియు దైవభక్తికి సంబంధించిన అన్ని విషయాలను మాకు అందించినందుకు వందనములు, నీ కృపతో నీ శాశ్వతమైన రాజ్యంలోకి మాకు ప్రవేశం సమృద్ధిగా అందించుము. ఆమెన్.

16ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని 17ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా 18మేము ఆ పరిశుద్ధపర్వతము మీద ఆయనతోకూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి.

ఆసియా మైనర్ చర్చిలలోనికి జొరబడిన అబద్ద బోధకులు ప్రభువు యొక్క అపొస్తలులు మరియు ప్రవక్తలపై, దాడి చేస్తూ పేతురు, ఇతర అపొస్తలుల విశ్వసనీయతను మరియు పాత నిబంధన యొక్క విశ్వసనీయతను అవమానపరుస్తూ, యేసు క్రీస్తు శక్తిని ఆయన రాకడను తిరస్కరించారు. ప్రత్యేకించి, క్రీస్తు మొదటి రాకడ (1:16) మరియు ఇంకా నెరవేరని వాగ్దానమైన క్రీస్తు రెండవ రాకడ (3:4,9) మరియు నీతి నివసించు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి (3:13). కాబట్టే పేతురు 2 పేతురు 3:3,4లో అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే అను వారి మాటలను వక్కాణిస్తున్నాడు.

ఈ అబద్ద బోధకులు యేసుని శక్తిని అధికారమును కూడా ప్రశ్నించారు- (మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగుట, (లూకా 22:69); మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట (మత్తయి 24:30); మృతులను లేపుట, తీర్పుతీర్చుట, (యోహాను 5:26-29). గనుకనే మీరు నీతివిరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొని యుండుడి, 2 పేతురు 3:17, అని పేతురు చెప్పవలసి వచ్చింది.

యేసు ఎప్పటికీ తిరిగి రాడని, వారి నమ్మకాలు, జీవితాల విషయంలో ప్రజలు ఆయనకు జవాబుదారీగా లేరని ఆలోచించేలా వాళ్ళు ప్రజలను నడిపించారు. ఇక్కడ వ్యంగ్యం ఏమిటంటే, కల్పనా కథలను కనిపెట్టిన (2:3) వీళ్ళు, పేతురుకు వీటిని ఆరోపిస్తున్నారు కాబట్టే పేతురు చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అని డిఫెండ్ చేసుకొంటూవున్నాడు. అబద్ద బోధకులు మానకుండా అబద్దాలను చెప్తూవుంటే, అవి ఎంత దిగ్భ్రాంతికరంగా లేదా దారుణంగా ఉన్నా ఒకరోజున ప్రజలు వాటిని నమ్మడం ప్రారంభిస్తారు. క్రైస్తవ బోధనలన్నింటికీ పునాది ప్రవక్తలు మరియు అపొస్తలుల సందేశమని పౌలు వలె పేతురుకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఆ పునాది రాళ్లు లేకపోతే మొత్తం నిర్మాణమే కూలిపోతుంది.

కాబట్టే అతడు యేసు పరిచర్యలో ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒక్కటైన, యేసుని మహిమకు శక్తికి సాక్ష్యమైన రూపాంతరంలో తాను ఉన్నానని వారికి గుర్తుచేశాడు. యేసు రెండు సంవత్సరాల సుదీర్ఘ గలిలియన్ పరిచర్య ముగింపులో, ఆయన పేతురు, యాకోబు మరియు యోహానులను “చాలా ఎత్తైన” బహుశా 9,232 అడుగుల ఎత్తులో ఉన్న హెర్మోన్ పర్వతానికి తీసుకువెళ్లాడు. అక్కడ తీర్పు దినానికి ముందే మరే ఇతర మానవుడు చూడని దేవుని కుమారుని నిజమైన మహిమను చూడడానికి ఆయన వారిని అనుమతించాడు. ఆయన వారి ముందు రూపాంతరం చెందాడు అంటే, ఆయన స్వయంగా దేవుని సన్నిధి యొక్క ప్రకాశంతో ప్రకాశించడం ప్రారంభించాడు. ఆయన ముఖం సూర్యునిలా మారింది; ఆయన బట్టలు భూమిపై ఎవరు బ్లీచ్ చేయలేనంత తెల్లగా ప్రకాశించాయి. ప్రకాశిస్తున్న రక్షకుని చుట్టూ ఒక ప్రకాశవంతమైన మేఘం ఉంది, దానిని పేతురు “మహాదివ్యమహిమ” అని పిలిచాడు. పాత నిబంధనలో, “ప్రభువు మహిమ” అనేది మేఘం మరియు అగ్నిలో దేవుని ప్రత్యక్షతను సూచిస్తుంది. ఈ విధంగా రక్షకుడైన దేవుడు తన ఆమోదాన్ని మరియు తన ప్రజల మధ్య తన వాస్తవ ఉనికిని సూచించాడు.

చాలా ఎత్తైన పర్వతం మీద యేసు చుట్టూ మహాదివ్యమహిమ మేఘం ప్రజ్వరిల్లినప్పుడు, తండ్రి తన కుమారుడి వ్యక్తిత్వం మరియు ఆయన పని పట్ల తన ఆమోదాన్ని తెలియజేసియున్నాడు. ఆయన క్రీస్తు ద్వారా భూమిపై తన ప్రజల మధ్య ఉన్నానని కూడా ధ్రువపరుస్తూ వున్నాడు. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే క్రీస్తు ముఖములో దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యొక్క వెలుగును మన హృదయాలలో ప్రకాశింపజేసాడు” (2 కొరింథీ 4:6). అవి జరగడం నేను చూశాను అని పేతురు చెప్తున్నాడు. గొప్పలు చెప్పుకోవడానికి కాదు కాని క్రీస్తు తరపున మాట్లాడే తన అధికారాన్ని ప్రదర్శించడానికి, కల్పనా కధలను కనిపెట్టిన వారి వలె కాకుండా, అతడు దానిని కన్నులార చూచిన ప్రత్యక్ష సాక్షిగా, అక్కడ జరిగిన విషయాలను చెవులారా విన్న ప్రత్యక్ష సాక్షిగా మాట్లాడుతున్నాడు. అతడు మహాదివ్య మహిమను చూశాడు; తండ్రి స్వరాన్ని కూడా విన్నాడు. అక్కడ తండ్రి, యేసు, మోషే, ఏలీయాలు ప్రత్యక్ష సాక్షుల నిశ్చయతను కూడా బలపరిచారు.

రూపాంతరం విషయాన్ని పేతురు వక్కాణించడానికి కారణం, అపొస్తలులు యేసుని గురించి ఎలాంటి దృక్పధాన్ని కలిగి యున్నారో తెలియజేస్తూ, యేసు దేవుని ప్రియమైన కుమారుడని ప్రకటిస్తూ, పరలోకము నుండి వచ్చిన స్వరాన్ని బట్టి ఆ వాస్తవానికి ప్రత్యక్ష ధృవీకరణను ఇస్తూ, రూపాంతరం కొండ మీద కనబడిన ఆయన మహిమ ఆయన దైవత్వమును తెలియ జేస్తూ ఉందని, అది మెస్సీయ ఖచ్చితంగా మహిమతో తిరిగి వస్తాడని నిశ్చయత నిచ్చేందుకు రూపొందించబడిందని సందేహించనవసరము లేదని, దేవుని మహిమ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతను ఆయన ఎవరికైతే ఇచ్చాడో వారు నమ్మదగిన సాక్షులని, అందువల్ల వారి సువార్త ప్రభువు యొక్క సత్యంగా ఎటువంటి సందేహం లేకుండా అంగీకరించ వచ్చని తెలియజేసేందుకే పేతురు దీనిని ఇక్కడ పేర్కోనియున్నాడు. కపటులు మోసగాళ్ళు అయిన అబద్ద బోధకులకు దేవుడు ఈ విధంగా తనను తాను బహిర్గతం చెయ్యలేదని వక్కాణిస్తూవున్నాడు.

మనలాగే క్రీస్తుపై శిష్యుల విశ్వాసం కొన్నిసార్లు అస్థిరంగా ఉండేది. క్రీస్తు వచ్చే ఇరుకైన మార్గాన్ని చూసి మనం కూడా నిరాశ చెందుతూవున్నాము. (తొట్టి, సిలువ, బాప్టిజం మరియు ప్రభువు రాత్రి భోజనం) విజయవంతమైన క్రీస్తును చూడటం ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా వాగ్దానం చేస్తూవున్నాయి. కాని పేతురు ఒకసారి చూశాడు మరియు విన్నాడు. అతడు ఎప్పటికీ మరచిపోలేడు మరియు అతని స్నేహితులు కూడా మరచిపోవాలని అతడు కోరుకోవడం లేదు. వారు విశ్వసించే దాని నిశ్చయతలో వారు అభివృద్ధి చెందాలని అతడు కోరుకొంటున్నాడు. ఆయన ఎవరని తండ్రి చెప్పియున్నాడో ఆయనే యేసు. ఆయన చేస్తాడని ఆయన చెప్పినట్లుగా ఆయన చేసాడు. ఆయన ఇస్తానని చెప్పిన వాటిని ఆయన నిజంగా ఇచ్చాడు.

19మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు.

ఆధ్యాత్మిక నిశ్చయత మరియు అధికారం గురించి పేతురు యొక్క గొప్ప వాదనకు ముగింపుగా చాలా శక్తివంతమైన మరియు కొంచెం క్లిష్టముగా ఉండే విభాగము ఇక్కడ ఉంది. ఆసియా మైనర్ క్రైస్తవులు ఇప్పుడు కలిగి ఉన్న సత్యంలో దృఢంగా స్థిరపడటానికి రెండు కారణాలు ఉన్నాయి (12వ వచనం): అపొస్టోలిక్ ప్రత్యక్ష సాక్షుల మౌఖిక సాక్ష్యం మరియు ప్రవక్తల మాట.

లేఖనాలలో ప్రవక్త అనే మాటకు కనీసం నాలుగు అర్ధాలున్నాయి. దాని విస్తృత అర్థంలో, దేవుని తరపున మాట్లాడే వ్యక్తి అని అర్థం. విశ్వాసులందరూ దేవుని తరపున మాట్లాడే వ్యక్తులే. దేవుడు ఏమి చెప్పాడో, ఏమి చేశాడో మనకు తెలుసు. ఇతరుల విశ్వాసాన్ని పెంచడానికి మనం ఆ మాటలను వారితో చెప్పినప్పుడు, మనం ప్రవచిస్తున్నాము. పెంతెకొస్తు రోజున పేతురు మాట్లాడుతూ, దేవుని ప్రజలందరూ, స్త్రీపురుషులు, యువకులు పెద్దలు, అందరూ “ప్రవచిస్తారని”, దేవునిని బహిరంగంగా స్తుతిస్తారని మరియు ఆయన అద్భుతమైన పనులను ప్రకటిస్తారని విశదపరచియున్నాడు, అపొ.కార్య 2 : 17-18. ఇది కొత్త నిబంధన జీవితానికి సంబంధించిన ఒక లక్షణం. కాబట్టే, 1 కొరింథీలో, పౌలు ఈ బహిరంగ సాక్ష్యాలను ఇచ్చిన విధానంలో ఉన్న సంతోషాలు మరియు సమస్యల గురించి విస్తృతంగా రాశాడు.

సంకుచిత భావంలో, ప్రవక్తలు ప్రత్యేక పరిచర్య కోసం దేవునిచే ఎన్నుకోబడిన వ్యక్తులు మరియు వారి సందేశాన్ని బలోపేతం చేయడానికి తరచుగా వారికి అద్భుత శక్తులు ఇవ్వబడ్డాయి. తరచుగా వారి దైవిక సందేశాలలో భవిష్యత్తును గురించి దేవుడు ఇచ్చిన ప్రవచనాలు ఉన్నాయి. ఈ కోణంలో ప్రవక్తలు, “సాధారణ” విశ్వాసుల నుండి భిన్నంగా వున్నారు. వారికి నేరుగా దేవుని నుండి సందేశాలు ఇవ్వబడ్డాయి మరియు దేవుని నుండి ప్రత్యేక అధికారం కూడా వారికి ఇవ్వబడింది. కొత్త నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారు: అన్నా (లూకా 2:36), అగబు (అపొ.కార్య. 11:28; 21:10), యూదాయు సీలయు (అపొ.కార్య. 15:32), అంతియొకయలోనున్న ప్రవక్తలు (అపొ.కార్య. 13:1), మరియు ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపొ.కార్య. 21:9).

అయితే, ప్రవక్త అనే పదం బైబిల్లో, పాత నిబంధన కాలంలో, దేవుని ప్రత్యేక దూతల కోసం సర్వసాధారణంగా ఉపయోగించ బడింది. కొన్ని సందేశాలు పరిమిత సమయాల్లో నిర్దిష్ట వ్యక్తులతో మాత్రమే మాట్లాడటానికి ఉద్దేశించబడ్డాయి. తర్వాత ఈ సందేశాలు అదృశ్యమైపోయాయి. కొంతమంది ప్రవక్తలలో మనకు పేర్లు మాత్రమే తెలుసు, ఇంకొందరి విషయములో ఏమి తెలియదు. ప్రతి ఒక్కరు కేవలం “దేవుని మనిషి” అని మాత్రమే పేర్కొనబడ్డారు. 1 మరియు 2 రాజులలో ఏలీయా మరియు ఎలీషా యొక్క శక్తివంతమైన సందేశాలు సారాంశ రూపంలో మనం కలిగియున్నాము. రాజనీతిజ్ఞులైన మోషే మరియు దావీదులను ప్రవక్తలు అంటారు. చివరగా, దేవుడు తన పవిత్ర గ్రంథాలలో వ్రాయించిన మరియు చేర్చిన 16 మంది పురుషులు, యెషయా ద్వారా మలాకీ వరకు పాత నిబంధన ప్రవక్తలు ప్రత్యేక గమనిక.

ఇప్పుడు, ప్రవక్త అనే పదం వెనుక ఉన్న అర్థాలన్నింటిలో, 19వ వచనంలో పేతురు దేనిని సూచిస్తున్నాడు? ఇది కష్టమైన వచనం. “ఇంతకంటె స్థిరమైన” అను మాటలను గురించి అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. పాత నిబంధన లేఖనాలు క్రీస్తును గూర్చిన అపొస్తలుల సాక్ష్యాన్ని నిర్ధారిస్తూ వున్నాయి. ఆ విధంగా, రూపాంతరం గురించి పేతురు యొక్క వ్యక్తిగత ప్రత్యక్ష సాక్ష్యం నమ్మదగినది ఎందుకంటే ఇది పాత నిబంధన లేఖనాల యొక్క అధికారంపై ఆధారపడి ఉంది. రూపాంతరం కొండపై పేతురు యొక్క ప్రత్యక్షసాక్షి అనుభవం రాబోయే మెస్సీయ గురించి దేవుని పాత నిబంధన వాక్య వాగ్దాన నెరవేర్పును మరింత ఖచ్చితం చేస్తూవుంది మరియు ధృవీకరించింది. అపొస్తలుల యొక్క క్రొత్త నిబంధన సాక్ష్యము పాత నిబంధనను మరింత ఖచ్చితంగా చేస్తుంది మరియు అవి రెండు కలిసి మన విశ్వాసానికి దృఢమైన స్థిరమైన ఆధారాన్ని ఏర్పరుస్తున్నాయి.

పేతురు అయోమయంలో ఉన్న క్రైస్తవులను వ్రాయబడియున్న లేఖనాల వైపుకు నడిపిస్తున్నాడు. దేవుని కోసం మాట్లాడు తున్నామని చెప్పుకునే వారికి, ఆధ్యాత్మిక సమాచారానికి మరియు అధికారానికి స్థిరమైన మూలంగా ఉండేందుకు లేఖనాలు వ్రాయబడివున్నాయని తెలుసుకోవడం చాలా భరోసానిస్తుంది.

సాతాను అంధకారానికి రాజు, అతని కోసం తెలిసి లేదా తెలియకుండా పనిచేసే ప్రతి ఒక్కరూ వాడి చీకటిని వ్యాపింప జేస్తారు. సాతాను అంధకారంలో కొందరు వ్యక్తులు తమ సొంత మంచితనం గురించి గర్వపడతారు, రక్షకుని అవసరం అనే ఆలోచనకు విరుద్ధంగా ఉంటారు. వారు తమంతట తాముగా తప్పుఒప్పులను గుర్తించగలమని సంతృప్తి చెందుతూవుంటారు. చీకట్లో ఉన్న కొందరికి తాము చెడ్డవాళ్లమని తెలిసి, తమ కోసం రక్షకుడు ఉన్నాడని తెలియక నిరాశ, భయాందోళనలకు గురవుతూవుంటారు. మరి కొందరు ఆధ్యాత్మిక విషయాల గురించి పట్టించుకోరు; ఉదాసీనత వారి హృదయాలను శాసిస్తుంది. జంతువులలాగే, వారి అత్యంత శ్రద్ధ వారి ఆశలను తీర్చుకోవడం. క్రైస్తవులను ఈ విధమైన చీకటిలోకి నెట్టడానికి సాతాను తప్పుడు బోధకులను ఉపయోగిస్తాడు.

దేవుని గ్రంథం ఎన్నటికీ అబద్ధం చెప్పదు; ఇది పూర్తిగా ఆధారపడదగినది; మనం దానిపై ఆధారపడొచ్చు. క్రైస్తవులు తాము విశ్వసించే వాటి నిశ్చయతలో ఎదగడానికి ఉత్తమ మార్గం దేవుని వాక్యానికి తిరిగి వెళ్లడం. నరకం నుండి బోధలు క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా ప్రబలలేవు. దేవుని వాక్యం చీకటి ప్రదేశంలో ప్రకాశించే వెలుగు అని పేతురు చెప్తున్నాడు. ఆ చీకటి ప్రదేశం మన స్వంత అంతరంగం, మన స్వంత మనస్సు మరియు హృదయం. మనం ఆ వాక్యానికి శ్రద్ధ చూపడం మంచిది, ఎందుకంటే అది మాత్రమే నరకంలోని చీకటిని మరియు గందరగోళాన్ని పారద్రోలుతుంది. ప్రభువు తిరిగి వచ్చే వరకు, ప్రవచనాత్మక మాటలు చీకటిలో ప్రకాశించే కాంతి వలె దేవుని ప్రజలను నడిపిస్తాయి మరియు నిర్దేశిస్తాయి.

వాక్యం తన పనిని తాను చేస్తున్నప్పుడు, పగలు తెల్లవారుతుంది మరియు రాత్రి మసకబారుతుంది. పేతురు లేఖ త్వరలో బైబిలుకు జోడించబడుతుంది మరియు దేవుని వాక్యం యొక్క అద్భుతం ద్వారా, పాఠకులందరూ ఇప్పుడు పేతురు, యాకోబు మరియు యోహానులతో కలసి రూపాంతరాన్ని అనుభవించ వచ్చు. క్రీస్తు నుండి ప్రకాశించిన మహిమ మరియు తండ్రి యొక్క గంభీరమైన మహిమ ఇప్పుడు మనలో ప్రకాశిస్తుంది. రక్షకుని కోసం మానవ జాతి యొక్క సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది- కృప యొక్క రోజు ఉదయిస్తూ వుంది. దేవుని విశ్వసనీయతకు సంబంధించిన ఈ ప్రదర్శనలో పరవశించిన జెకర్యా, మన దేవుని మహావాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గము లోనికి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శన మనుగ్రహించెను అని చెప్పియున్నాడు (లూకా 1:77–79).

ప్రసిద్ధ ఖగోళ శాస్త్రంలో, శుక్ర గ్రహాన్ని కొన్నిసార్లు మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు. ఇది, వాస్తవానికి, ఒక నక్షత్రం కాదు కాని అది తెల్లవారకముందే సూర్యుని కిరణాలను పట్టుకుని ప్రతిబింబిస్తుంది మరియు దాని కాంతి రాత్రి దాదాపు ముగిసిందని మరియు పగలు సమీపిస్తోందనడానికి ఖచ్చితమైన సంకేతం. ప్రకటన 22:16లో యేసుక్రీస్తు ప్రకాశమానమైన వేకువ చుక్కగా పేర్కొనబడియున్నాడు. ఆయన మన ప్రపంచానికి రావడం పాపం, అనారోగ్యం, మరణం మరియు నరకం అనే రాత్రి యొక్క శక్తి విచ్ఛిన్నమైందని త్వరలో అది ముగుస్తుందని సూచిస్తుంది. ఆయన వాక్యం ఆయన కాంతిని ప్రతిబింబిస్తుంది. దేవుని కుమారుడు మనలను ఇంటికి తీసుకువెళ్లడానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన పూర్తి ప్రత్యక్షత కోసం ఆయన ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

20ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 21ఏలయన గా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.

క్రీ.శ. 60వ దశకం మధ్యలో, పూర్తిగా వ్రాయబడిన కొత్త నిబంధన లేదు. ఇక్కడ అపొస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు, అతడు బహుశా తనకు తెలిసిన బైబిల్ గురించి, అంటే పాత నిబంధన పుస్తకాల గురించి ఆలోచిస్తున్నాడు. కాని ప్రవచనాత్మక రచనల మూలం మరియు విశ్వసనీయత గురించి 20 మరియు 21 వచనాలలో అతడు వ్రాసిన ఈ మాటలు అతని రెండు లేఖలకు, పౌలు, యోహాను, యాకోబు మరియు యూదా లేఖలకు, నాలుగు సువార్తలు మరియు అపొస్తలుల కార్యములకు, హెబ్రీయులకు మరియు ప్రకటనకు కూడా సమానముగా వర్తిస్తుంది. ఎందుకంటే ముందు తరాలలో, ఈ రచనలు కొత్త నిబంధనగా సేకరించబడతాయి.

తన సృష్టికర్త గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా, దేవుడు ఏమి చెప్పాడు? ఏమి చేసాడు? నేను దానిని ఖచ్చితంగా ఎలా తెలుసుకోగలను? అను సమాచారం యొక్క మూలం కోసం వెతకవలసి యున్నాడు. అపొస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఆసియా మైనర్లో ఉన్న సంఘాలలోనికి చొరబడిన అబద్ద బోధకులు దురాశ, అధికారము, ప్రజలపై నియంత్రణ, ప్రశంసలు లేదా ఇతరమైన వాటిచేత ప్రేరేపింపబడుతూ, “కల్పనావాక్యములు” అంటే వారు రూపొందించిన కథలతో (2:3) దేవుని వాక్యాన్ని తమ మాటతో, ఆయన అధికారాన్ని తమ అధికారంతో భర్తీ చేయాలని ఆశపడుతూవున్నారు.

మానవ నిర్మిత ఆజ్ఞ్యలు మరియు బోధలు సంవత్సరాల తరబడి ప్రజల విశ్వాసం మరియు జీవితాలకు విపరీతమైన నష్టాన్ని కలిగించాయి. మోసపూరిత అపరిపక్వత కల్పిత కథలతో మానవ ఊహ నిరంతరం సమృద్ధిగా ఉంటుంది. సొంతముగా రూపొందిన అభిప్రాయాలు ఎల్లప్పుడూ అపరిపక్వముగా, సులభముగా అన్నింటిని నమ్మేసే క్రైస్తవులను క్రీస్తు నుండి దూరము చెయ్యడానికి ఉద్దేశించబడినవే. ఉదాహరణకు, జోసెఫ్ స్మిత్ 19వ శతాబ్దపు ప్రారంభంలో న్యూయార్క్‌లో ఒక విచిత్రమైన కలను కన్నాడు దాని ఫలితమే ఈనాటి మోర్మాన్ సంస్థ. అట్లే అనేకమైన డినామినేషన్స్కు కారణం వ్యక్తుల సొంత అభిప్రాయాలే. కొన్ని సంఘాలలో, స్వలింగ సంపర్క జీవనశైలిని చట్టబద్ధం చేయడం వంటి మానవ నిర్మిత ఆజ్ఞ్యలు బోధలు ప్రజలను క్రీస్తు నుండి దూరం చేస్తాయి.

ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్నిబట్టి లేఖనాలయొక్క పునాది దృఢమైనదనే విషయాన్ని తన పాఠకులు తెలుసు కోవాలని పేతురు ఆశపడుతూ వున్నాడు. దేవుని ఆత్మ ఈ లేఖనాలను తీసుకువచ్చింది. రచయితలు దేవునిచే సంకల్పించబడ్డారు; దేవుడు వారి కంటెంట్ను నిర్ణయించాడు; ఆత్మ రచయితలను వారు వ్రాయగల విధంగా వ్రాయడానికి ప్రేరేపించింది. లేఖనాల రచయితలు ఎవ్వరూ తమ సొంత మెటీరియల్‌తో రాలేదని దేవుడే ప్రవక్త యొక్క స్వంత ప్రత్యేక పదజాలాన్ని, శైలిని మరియు జీవిత పరిస్థితిని ఉపయోగించు కొంటూ కంటెంట్‌ను సరఫరా చేశాడు మరియు దానిని నియంత్రించాడు. పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన, మనుష్యులు దేవుని నుండి మాట్లాడారు. యాదృచ్ఛికంగా, ఇది యాంత్రిక ప్రేరణ కాదు, పరిశుధ్ధాత్ముడు తెలివితేటలు మరియు జ్ఞానాన్ని, రచయితలకు ఇచ్చాడు , ఫలితంగా వైవిధ్యభరితమైన శైలిలో ఆసక్తికరంగా, కంటెంట్ లో హితోపదేశ గ్రంధముగా రూపొందించబడింది. (యిర్మీయా 1:19, ఇదే యెహోవా వాక్కు; యెహోవా మాటలాడుచున్నాడు, యెషయా 1:2; యెహోవా సెలవిచ్చిన మాట ఇదే యెషయా 1:11; యెహోవా వాక్కు వినుడి, యిర్మీయా 2:4; యెహెజ్కేలు 3:16,17 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను, కాబట్టి నీవు నా నోటిమాట ఆలకించి నేను చెప్పిన దానినిబట్టి వారిని హెచ్చరిక చేయుము).

ఈ ప్రక్రియను ప్రేరణ అంటారు. అంటే, పరిశుద్ధ త్రిత్వములోని పరిశుద్దాత్మ దేవుడు దేవుని చేత ఎంపిక చేయబడిన మనుష్యుని (ప్రవక్త) దగ్గరకు దేవుని నుండి సమాచారాన్ని తెచ్చి, ఆ మనుష్యుడు వాటిని వ్రాసేటట్లుగా ప్రేరేపిస్తూ దానిని పర్యవేక్షించాడు కాబట్టి తుది ఉత్పత్తిని దేవుని మాటలుగా పిలవవచ్చు. కాబట్టే పౌలు తిమోతికి వ్రాస్తూ, 2తిమోతికి 3:16లో ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది అని చెప్తూ వున్నాడు.

16-21 పేతురు పవిత్ర పర్వతం మీద మన ప్రభువు మహిమను పాక్షికంగా చూశాడు. మన దగ్గర దేవుని ప్రవచనాత్మక మాటలు వున్నాయి, మహిమలో మన ప్రభువు యొక్క విజయవంతమైన పునరాగమనం పై విశ్వాసం నిరీక్షణ ఆధారపడి వున్నాయి. క్రీస్తులో దేవుని కృపలో, మనం ఇప్పుడు ఆయన పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నాము (1పేతురు 2:9).

ప్రభువా, చీకటిలో నుండి నీ అద్భుతమైన వెలుగులోకి మమ్మల్ని పిలిచినందుకు వందనములు. మా మాటలు మరియు క్రియల ద్వారా మీ గొప్పతనాన్ని ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాల నే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.