నాల్గవ భాగం
అబద్ద బోధకులకు వ్యతిరేకంగా మీ అప్రమత్తతను పెంచుకోండి (2:1–22)

నిజమైన ప్రవచనం యొక్క శ్రేష్ఠతను వక్కాణించిన తరువాత, అపొస్తలుడు ఇప్పుడు అబద్దపు బోధల గురించి మాట్లాడు తున్నాడు. ఎందుకంటే, చర్చితో తన వివాదంలో సాతాను అన్ని రకాల ప్రణాళికలను రూపొందించాడు, వాటిని అమలు చేసాడు. అందుకు నీచమైన మోసపూరిత వ్యక్తులను సాధనంగా ఉపయోగించుకున్నాడు. వాడిచే ప్రేరేపించబడిన, మోసగాళ్ళు మతంను అడ్డు పెట్టుకొని విశ్వాసులను నాశనం చెయ్యడానికి ప్రయత్నించారు. కాబట్టే, సంఘము యొక్క మొదటి తరంలోనికి ఇప్పటికే జరిగిన చొరబాట్లను గురించి క్రొత్త నిబంధన చెప్తూవుంది. హుమెనైయును, ఫిలేతును కొందరి విశ్వాసాన్ని నాశనం చేశారు (2 తిమోతి 2:17); అలెక్సంద్రు అను కంచరివాడు పౌలుకు చాలా హాని చేశాడు (2 తిమోతి 4:14); మరియు నీకొలాయితులు చాలా మందిని దారి తప్పించారు (ప్రకటన 2:6, 15). ఇప్పుడు పేతురును అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులను గురించి మాట్లాడుతున్నాడు.

మొదటి శతాబ్దములో సంఘములోనికి చొరబడిన అబద్దపు బోధలు వాటి బ్యాక్ గ్రౌండ్ గురించి కొద్దిగా తెలుసుకొందాం: మొదటి శతాబ్దాములో ఉనికిలో ఉన్న ఎబియోనైట్‌లు (Ebionites), నీకొలాయితులు (Nicolaitans) మరియు గ్నోస్టిక్స్ (Gnostics) వంటి తప్పుడు బోధలను ఫాలో అవుతున్న వాళ్ళు వారి కన్వర్షన్ తరువాత సంఘము లోనికి చేర్చబడ్డారు. వీళ్ళు వారి మునుపటి బోధలను క్రీస్తు సువార్తతో కలిపి ఆయా సంఘాలలో ఉన్న సత్యాన్ని విశ్వాసులను గందరగోళపరిచారు. అట్లే వీరిలో కన్వెర్ట్ అయ్యిన యూదులు కూడా ఉన్నారు.

ఎబియోనైట్‌లు ఒక యూదు క్రైస్తవ శాఖ, ఇది మొదటి శతాబ్దంలో ఉద్భవించింది. వీళ్ళు పూర్తిగా శాఖాహారులు. వీళ్ళు తోరాను ఫాలో అయ్యేవాళ్ళు. యెరూషలేమును పరిశుద్ధ పట్టణముగా గౌరవించారు. ఏకైక దేవుణ్ణి విశ్వసించారు. యేసును మెస్సీయ అని మరియు ద్వితీయోప. 18:15లో ప్రస్తావించబడిన నిజమైన “ప్రవక్త” అని నమ్మారు. క్రీస్తు ఒక దేవుని దూత అని యేసులో అవతరించాడని, యేసు తన బాప్తిస్మములో దేవుని కుమారుడిగా దేవునిచేత దత్తత తీసుకోబడిన వ్యక్తి మాత్రమే అని అభిప్రాయపడ్డారు. వారు యేసు యొక్క దైవత్వం, పూర్వ ఉనికి, కన్యకు పుట్టుక మరియు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం వంటి క్రైస్తవ విశ్వాసాలను తిరస్కరించారు; యేసు యేసేపు మరియలకు జీవసంబంధమైన కుమారుడిగా యేసు యొక్క మానవత్వాన్ని నొక్కిచెప్పారు. యేసు తన ప్రవచనాత్మక ప్రకటన ద్వారా జంతుబలుల రద్దును ప్రకటించ డానికి వచ్చాడని మరియు ఇతరులకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఒక అమరవీరుడుగా మరణించాడని నమ్మేవాళ్ళు. ఎబియోనైట్‌లు పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను వక్కాణించారు. హతసాక్షిగా యేసు మరణం, మెస్సియానిక్ యుగంలో ప్రామాణికంగా దేవుని ఎదుట నీతితో (అంతరంగములో, బయటి ప్రవర్తనలో) జీవించుమని ఇశ్రాయేలీయులందరినీ పశ్చాత్తా పపడేలా కదిలిస్తూవుందని కాబట్టి, నీతిమంతులుగా మారడానికి, భూమిపై ఉన్న దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి మరియు వినాశనం నుండి రక్షింపబడటానికి, యూదులు మరియు యూదు మతంలోకి మారిన విశ్వాసులైన అన్యులు ఇద్దరూ పశ్చాత్తాపం చెందాలని, వ్రాతపూర్వక ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలను పాటించాలని (జంతుబలి తప్ప) ఎబియోనైట్‌లు పట్టుబట్టారు. వీళ్ళు దయతో కూడిన పనులను గూర్చిన యేసు బోధలను అనుసరించారు. పవిత్ర పేదరికంలో జీవించడానికి ఇష్టపడేవాళ్లు. జుడాయిజంలోకి మారిన అన్యులకు మాత్రమే టేబుల్ ఫెలోషిప్ పరిమితం చేసారు. పౌలును నిజమైన అపొస్తలునిగా పరిగణించలేదు, పౌలు పత్రికలను తిరస్కరించారు. యేసు సహోదరుడైన యాకోబును యేసుకు నిజమైన వారసునిగా గౌరవించారు. వీళ్ళు హీబ్రూ బైబిల్‌కు (పాత నిబంధనకు) అదనపు గ్రంథంగా మత్తయి సువార్తలో మొదటి రెండు అధ్యాయములను తీసివేసి 3-28 అధ్యాయాలను మాత్రమే ఉపయోగించారు. వీళ్ళు యేసుని దైవత్వాన్ని మానవత్వాన్ని తిరస్కరించారు.

నీకొలాయితులు అనే వాళ్ళు క్రొత్తనిబంధనలోని ప్రకటన గ్రంధములో రెండుసార్లు ప్రస్తావించబడిన ప్రారంభ క్రైస్తవ విభాగం, ప్రకటన 2:6, 14-16. నీకొలాయితులు “బిలాము సిద్ధాంతాన్ని” కలిగి ఉన్న సమూహంలో భాగమయ్యారు, “బిలాము సిధ్ధాంతము”, అంటే సంఖ్యాకాండము 25: 1-3, “విగ్రహాలకు అర్పించిన ఆహారం తినడం మరియు లైంగిక అనైతికత”. బిలాము సిధ్ధాంతము రాజీ సిధ్ధాంతము, క్రైస్తవ మతం మరియు అన్యమతముల మధ్య పూర్తి విభజన అవసరం లేదని సూచించటం. వ్యభిచరింప వద్దు అనే ఆజ్జ్య మోషే ధర్మశాస్త్రములో భాగమని నికోలాయిటన్లు విశ్వసించారని (దీని నుండి వారు యేసుక్రీస్తు ద్వారా విముక్తి పొందారని నమ్మేవారని) వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్విని యోగ పరచారు

ఆదిమ క్రైస్తవులు అన్యమత సంస్కృతిలో నివసించారు. వారి చుట్టూ అక్కడ అన్యమత ఆరాధనలలో, దేవాలయాలలో ఆచార వ్యభిచారం చేసే సంస్కృతి ఉంది. వాటిలో మత్తు పదార్థాలు మరియు సామాజిక పరిమితులను తొలగించడానికి ఇతర ట్రాన్స్-ప్రేరేపిత పద్ధతులను ఉపయోగించే వారు. డయోనిసియన్ మిస్టరీలు కూడా వున్నాయి. వీటి ప్రభావాన్ని సంఘము లోనికి విభిన్న విధములుగా ప్రవేశపెట్టడానికి సాతాను ప్రయత్నాన్ని గమనించండి.

గ్నోస్టిక్స్ మేజిక్ మరియు ఆచారాల ద్వారా రహస్యముగా దాగివున్న జ్ఞానం కోసం శోధించారు. గ్నోస్టిసిజం ఒక పదునైన విశ్వ సంబంధమైన ద్వంద్వవాదం గురించి బోధించింది. గ్నోస్టిసిజం యొక్క ప్రధాన ఆలోచనలలో ఒకటి “పదార్థం” (మనం చూడగలిగే మరియు తాకగలిగే భౌతిక ప్రపంచంలోని విషయాలన్ని) చెడ్డవని, ఆత్మ మాత్రమే స్వచ్ఛమైనదని మంచిదని నమ్మేవాళ్ళు. దేవునికి పదార్థంతో సంబంధం లేదు కాబట్టి, ఆయన మానవ శరీరాన్ని తీసుకోలేడని వారు నిర్ధారించారు. వాళ్ళు భౌతిక ప్రపంచం చెడ్డదని విశ్వసించినందున, వారు యేసు శరీరధారి ఆయెనని నమ్మడానికి నిరాకరించారు. క్రీస్తు యొక్క శరీరం మానవ శరీరము కాదని అది ఒక భ్రాంతి కావొచ్చని లేదా అది నిజమైన ఖగోళ పదార్ధంకు సంబందించిన శరీరమై ఉండొచ్చని కాబట్టే ఆయన శ్రమలు అంత స్పష్టంగా ఉన్నాయి అని నమ్ముతూ యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని పూర్తిగా తిరస్కరించారు. అట్లే ఆయనను జ్ఞానాన్ని భూమిపైకి తీసుకురావడానికి అవతారమెత్తిన సర్వోన్నత జీవి యొక్క స్వరూపంగా గుర్తించారు, మరికొందరు సర్వోన్నత జీవి శరీరంలో వచ్చాడనే విషయాన్ని మొండిగా ఖండిస్తూ, యేసు కేవలం జ్ఞానోదయం ద్వారా జ్ఞానోదయం పొందిన మానవుడని పేర్కొన్నారు. ఆయన ఈ ఉనికి నుండి తీసుకోబడిన భౌతిక రూపాన్ని మాత్రమే కలిగి ఉన్నాడని అందువలన ఆయన నిజంగా చనిపోలేదని నమ్ముతూ యేసు యొక్క దైవిక స్వభావాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన శిలువ మరణాన్ని తిరస్కరించారు. ఆయనకు శరీరం లేదు కాబట్టి పునరుత్థానం లేదని పేర్కొన్నారు. ఆ విధంగా, గ్నోస్టిసిజం సువార్త ప్రధానాంశముపై దాడి చేసింది. గ్నోస్టిక్స్ ప్రకారం, రక్షణ అనేది రహస్య జ్ఞానం ద్వారా ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రలోభాల నుండి, శరీరం నుండి విముక్తి పొందడం. శరీరం చెడ్డది కాబట్టి, దాని ప్రయోజనాలు కొద్దిగా మాత్రమే ఉన్నందున, దానిని కఠినంగా ట్రీట్ చెయ్యమని భోదించారు (అన్ని విషయాలలో కఠినమైన సన్యాసం). గ్నోస్టిక్స్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది దేవుళ్లను పూజించారు, అజ్ఞాన నిర్మూలనపై వారు దృష్టి సారించారు.

కన్వెర్ట్ అయ్యిన యూదులు, వీరి అభిప్రాయం ప్రకారం రక్షణకు క్రీస్తు యొక్క విమోచన ఒక్కటే సరిపోదని, అదనంగా ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చ వలసియున్నారు అనే బోధను భోదిస్తూవున్నారు.

కాబట్టే, ఈ అధ్యాయములో పేతురు అబద్ద బోధకులు గురించి మాట్లాడుతూ, విశ్వాసుల విశ్వాసాన్ని నాశనం చేసే వారిపై గట్టిగా కోప్పడుతున్నాడు. పేతురు తప్పుడు బోధకుల పేర్లనుగాని లేదా తప్పుడు బోధలనుగాని పేర్కొనలేదు. అతడు వ్యక్తిగతముగా ఏ సంఘాన్నిగాని పాస్టర్ల పేర్లనుగాని ప్రస్తావించలేదు. పాఠకులకు హెచ్చరికలు లేవు. అయితే దేవుని పేరుతో అబద్ధాలు చెప్పే వ్యక్తుల అంతర్గత అవినీతిని వివరిస్తూ, దేవుని భయంకరమైన కోపాన్ని మరియు వారిపై దేవుని నిర్దిష్ట తీర్పును ప్రకటిస్తూ మరియు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండే వారందరికీ రక్షణను వాగ్దానం చేయడం ఇక్కడ పేతురు లక్ష్యంగా కనిపిస్తూ వుంది.

పేతురు అబద్ధ భోదకులను గురించి ఈ అధ్యాయములో ఏమి చెప్తూవున్నాడంటే,

  1. సాతాను చర్చి పై బయట నుండి దాడి చేస్తాడని, శ్రమలు, ప్రభుత్వ వ్యతిరేకత ద్వారా మాత్రమే కాకుండా, చర్చి లోపల నుండి కూడా దాడి చెయ్యడానికి వాడు అబద్ద బోధకుల ద్వారా ప్రయత్నిస్తాడని పేతురు చెప్తూవున్నాడు. అబద్ద బోధలను బట్టి సంఘము లోపల నుండి కుళ్ళిపోయేటట్లుగా వాడు ప్రయత్నిస్తాడు. అబద్ద బోధకులు తరచుగా సౌకర్యవంతమైన, సాంప్రదాయ పదజాలాన్ని ఉపయోగిస్తారు; వాళ్ళు బైబిల్‌ను తారుమారు చేస్తున్నామని ప్రచారం చేసుకోరు. వారి పరిచర్య ద్వారా, వారు పెద్ద సంఖ్యలో అనుచరులను కలిగి వుండొచ్చు. సంఖ్య ఆధారంగా సత్యాన్ని గుర్తించడం ఎప్పటికీ సురక్షితం కాదు.
  2. అబద్ద బోధకులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. పేతురు కొన్నింటిని పేర్కొన్నాడు: (1) వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించిన వారు. (2) నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా భోదించువారు, (వారు తమ స్వంత ఆలోచనలను దేవుని వాక్యంగా అందిస్తారు). (3) వారు అధికారాన్ని తృణీకరిస్తారు మరియు తిరస్కరిస్తారు. (4) వారు స్వేచ్ఛను వాగ్దానం చేస్తారు, కాని దీనివల్ల బానిసత్వం మాత్రమే వస్తుంది. (5) వారు “మహిమలను” దూషిస్తారు. (6) వారు వ్యభిచారం, దురాశ, భౌతికవాదం వంటి దుర్మార్గమైన అవినీతికరమైన వారి వ్యక్తిగత జీవితాన్ని దాచిపెడతారు.
  3. అబద్ద బోధకులు ఇతరులను బాధపెడతారు. సత్యమార్గం చెడ్డదిగా కనబడేలా చేస్తారు. ఇటీవల రక్షింప బడిన వ్యక్తులను వారు తిరిగి అవిశ్వాసంలోకి లాగుతారు. వారి అబద్ద బోధలు హానిచేయని అభిప్రాయ భేదాలు మాత్రమే కాదు, అవి నాశనం చేస్తాయి. వాటిని బట్టి ప్రజలు ఆకర్షింపబడి క్రీస్తుకు దూరమవుతారు.
  4. అబద్ద బోధకులు లోపల కుళ్ళిపోయిన వారు. పేతురు ద్వారా మాట్లాడుతున్న పరిశుధ్ధాత్ముడు ఈ ప్రజల హృదయాల లోకి చూడగలడు, అక్కడ ఏమి ఉందో బయలుపరచగలడు. మనం ఇతరుల మనస్సులను, హృదయాలను చదవలేము, కాని దేవుడు చేయగలడు. తప్పుడు బోధకులు సత్యం పట్ల తీవ్రమైన కోరికతో ప్రేరేపింపబడకుండా దురాశ, అహంకారం, అవినీతి, కోరికలు, డబ్బు మరియు సుఖానుభవాన్ని ప్రేమించడం ద్వారా ప్రేరేపించబడతారని పేతురు చెప్తూ వున్నాడు.
  5. అబద్ద బోధకుల గురించి నిజాలు దేవునికి తెలుసు. పేతురు వారిని గురించి దేవునికున్న అభిప్రాయాన్ని చెప్తూ: వారు నిజమైన ప్రవక్తలు కాదు అబద్ధప్రవక్తలని; అధిక లోభులని; ప్రభుత్వమును నిరాకరించు వారని; వారు తెగువగలవారని; స్వేచ్చాపరులునై మహాత్ములను దూషించు వారని; దుర్నీతిపరులని, వివేకశూన్యములగు మృగములని, దుష్‌ప్రవర్తన కలిగిన వారని, ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొను వారని, కళంకులును నిందాస్పదులని, వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకువారని, శరీరసంబంధమైన దురాశలుగలవారని, పోకిరిచేష్టలు గలవారని, భ్రష్టత్వ మునకు దాసులైయున్నవారని, శాపగ్రస్తులని, తమ భోగములయందు సుఖించువారని వారిని గురించి తెలియజేస్తూ వున్నాడు.
  6. అబద్ద బోధకులు దేవుని పేరు మీద అబద్ధాలు చెప్పి విజయం సాధిస్తున్నట్లు అనిపించవచ్చు. కాని వాస్తవము అది కాదు. దేవుడు వారి నాశనము నిశ్చయమైనదని అది వేగంగా ఆకస్మికంగా వారిపైకి వస్తుందని చెప్పాడు. తిరుగుబాటు చేసిన దేవదూతలతో, జలప్రళయములో మరియు సొదొమ గొమొఱ్ఱాలతో వ్యవహరించినట్లుగా దేవుడు వీరితో వ్యవహరిస్తాడు. చివరికి న్యాయం జరుగుతుంది. అబద్ధ బోధకులు మృగములవలె చీకటిలో నశించిపోతారు.
  7. దేవుడు విశ్వాసులను రక్షిస్తాడు. దేవుడు నోవహును జలప్రళయము నుండి మరియు లోతును అగ్ని నుండి నాశనము నుండి రక్షించినట్లుగా ఈ ఆపద నుండి ఆయన విశ్వాసులను రక్షిస్తాడు.

ప్రపంచంలోని ప్రతితరములో అబద్ధ ప్రవక్తల, అబద్ధ బోధకుల లక్షణాలు ఒకేలా ఒకే ఉద్దేశ్యము కలిగివుంటాయి, తప్ప అవి మారవు. భూమిపై మొట్టమొదటి అబద్ద బోధకుడు సైతానే (ఆది 3:4; యోహాను 8:44). సైతాను చెప్పిన ఒక్క అబద్ధము మానవాళినంతటిని పతనం చేసింది. వాడి అనుచరులు అనేకమంది అబద్దాలు చెప్తూ మనుష్యులను ఆ పతన స్థితిలోనే ఉంచుతున్నారు. శతాబ్దాలుగా విజయవంతమైన ఈ పద్దతిని సైతాను వదులుకోడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు తమ కపట ఉపదేశాలను క్రైస్తవులలోనికి చొప్పించక ముందు బహు కుయుక్తిగా వారికి చేరువ అవుతారు. అసత్యానికి కొంత సత్యాన్ని కూడా కలిపి అది చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు. వారిలో అనేకమంది సంఘాల్లో డినామినేషన్స్ లో అందరి ఆమోదము పొందిన కాపరులుగా ఉపదేశకులుగా వుంటారు.1మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటు వలెనే మీలోను అబద్ధ బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. 2మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింప బడును. 3వారు అధిక లోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.

నిజమైన అపొస్తలులు, ప్రవక్తల ద్వారా అందించబడిన దేవుని వాక్యంలో క్రైస్తవులు ఎదగటం మాత్రమే సరిపోదు. యేసు తిరిగి వచ్చే వరకు సంఘాన్ని భాదిస్తూ ఉండే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల ఉనికి, ప్రమాదాన్ని గురించిన అవగాహనలో కూడా వారు ఎదగటం అవసరం. ఎందుకంటే తరచుగా, ప్రజల విశ్వాసానికి, జీవితానికి సంఘము లోపలి వారి వల్లే (అబద్ధప్రవక్తలు, అబద్ధబోధకులు, వారి నాశనకరమగు భిన్నాభిప్రాయములు వల్లే) నష్టం కలుగుతోందని లేఖనాలు మనకు తెలియజేస్తూవున్నాయి.

అబద్ధప్రవక్తలు అంటే, ద్వితీయోప. 13:1-5; 18:20-22; 1 రాజులు 18:19-40; 22:6-7; యెషయా 9:15; యిర్మీయా 2:8; 5:31; 14:14; 23:30-32; 28:1-17; యెహెజ్కేలు 13:2-7. అబద్ధబోధకులు అంటే క్రీస్తు పై విశ్వాసం ద్వారా, కృప ద్వారా మాత్రమే రక్షణ అను వాటికి సంబంధించిన కొన్ని లేఖనభాగాలను తీసుకొని, తమ వ్యక్తిగత లాభం కోసం, కీర్తి కోసం వక్రీకరించేవాళ్ళు లేదా ఐసోలేటె చేసేవాళ్ళు. నాశనకరమగు భిన్నాభిప్రాయములు అంటే తరచుగా వ్యక్తిగత హక్కులను మరియు అనైతికతను ప్రోత్సహించే తప్పుడు బోధలు. అవి ఎల్లప్పుడూ క్రీస్తుపై ఉంచే విశ్వాసాన్ని నాశనం చేసేందుకే రూపొందించబడ్డాయి.

ప్రకటన 13వ అధ్యాయంలో, బయటి శక్తుల ద్వారా విశ్వాసులపై జరిగే దాడులను యోహాను “సముద్రపు మృగంగా” వర్ణిం చాడు. కాని అక్కడ ఒక “భూమృగము” కూడా ఉంది—వీరు ఆధ్యాత్మికంగా కుళ్ళిన సంఘ నాయకులు మరియు బోధకులు. మన మధ్య సాతాను యొక్క పనిని చేస్తూవున్నారు. వారి ద్వారా జరిగే ప్రమాదాలను గుర్తించడం చాలా కష్టం, అదే వాటిని మరింత ప్రాణాంతకంగా చేస్తుంది. ఎందుకంటే, మన మధ్యలో ఉంటూ సాతాను యొక్క పనిని చేస్తూవున్న వాళ్ళు వ్యక్తిగతంగా చాల మంచి వ్యక్తులుగా ఉండొచ్చు, మర్యాదస్థు లై ఉండొచ్చు, ఆధునికంగా ఉండొచ్చు, యూనివర్సిటీ డిగ్రీలు పొందినవారు కావచ్చు, సెమినరీలో శిక్షణ పొందిన వారు కావచ్చు. కాని వారు దేవుని వాక్యాన్ని వదిలి కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొంటున్నారు. వారి బోధలు మీ విశ్వాసానికి చిత్తడి నేలలా ప్రమాదకరమైనవి.

ఈ రోజుల్లో ఇతరుల నమ్మకాలను విమర్శించడం చెడ్డ విషయముగా కనబడుతుంది. అందరి నమ్మకాలు అందరిలాగే మంచివిగానే భావించబడుతూ వున్నాయి. ప్రజలు తమకు ఏది సరైనదో ఎంచుకోవచ్చు. క్రైస్తవ మతం యొక్క చరిత్రను వారి గత మత దురభిమానం, దాని శ్రమలు మసకబార్చియుండుటను బట్టి ప్రజలు ఇతర దిశలో వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తి యొక్క నమ్మకాలను బట్టి లేదా అతని మతాన్ని బట్టి/ డినామినేషన్ న్ని బట్టి మనం అతనిని విమర్శించలేం, ఎందుకంటే అది అతని వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయం కాబట్టి. మరి ఈ విషయములో దేవుడు ఏమి చెప్తాడో?

అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను వారి చరిత్ర అంతటా బాధించారు. అహాబు రాజుకు నాలుగు వందల మంది ప్రవక్తలు ఉన్నారు, రాజు ఏ విషయాన్ని వినాలనుకొంటున్నాడో దానినే వారు అతనికి చెప్పేవారు (1 రాజులు 22:6). సమస్య ఏమిటంటే, ఆ సమయంలో యెహోవా యొక్క నిజ ప్రవక్తయైన మీకాయా మాటలకు వారి మాటలు ఆలోచనలు విరుద్ధంగా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ “ప్రవక్తలు” యెహోవాను పూర్తిగా తిరస్కరించుమని ప్రజలకు సలహా ఇచ్చారు. బదులుగా బయలుదేవత, మోలెకు, కెమోషు లేదా చుట్టుపక్కల దేశాలలోని ఇతర మానవ నిర్మిత దేవతలను ఆరాధించడానికి వారిని నడిపించారు. కొన్నిసార్లు వారు విగ్రహారాధనను సత్యంతో కలపాలని వాదించారు.

సంఘము యొక్క మొదటి తరంలోనికి అప్పటికే జరిగిన చొరబాట్లను గురించి క్రొత్త నిబంధన వివరిస్తూ ఉంది. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల ఉద్దేశాలు గొప్పవా లేదా స్వార్థపూరితమైనవా అనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీటి ప్రభావం ఏ విధంగా అయినా ఒకే విధంగా ఉంటుంది. వాక్యం నుండి దూరమయ్యే వ్యక్తులు తమ రక్షకుని నుండి కూడా దూరమవుతారు. వ్యంగ్యమైన విషయమేమిటంటే, ఈ అబద్ధ బోధకులు స్వయంగా క్రీస్తులో రక్షకుని కలిగి ఉన్నారు – మత్తయి 20:28; 1 కొరింథీ 7:23; గలతీ 3:13,14; ప్రకటన 5:9,10; 1 పేతురు 1:18,19 వీళ్ళు, ఈ లేఖన భాగాలు తెలియజేస్తూవున్న సువార్త సత్యాలను విశ్వసిస్తూ, క్రీస్తుని తమ స్వకీయ రక్షకునిగా ఒప్పుకొని, బాప్తిస్మము ద్వారా సంఘములోనికి చేర్చబడిన వారు. కాని కాలక్రమేణా వాళ్లు తమను కొనిన క్రీస్తును తిరస్కరించారు, అంటే వాళ్ళు తాము విశ్వసించిన వాక్యం నుండి దూరమవ్వటమే కాకుండా వీళ్ళు తమ రక్షకుని నుండి కూడా దూరమయ్యారు కానీ వీళ్ళు తమను క్రైస్తవులనే చెప్పుకొంటారు. కాని నిజానికి వాళ్ళు తమను కొనుగోలు చేసిన సార్వభౌమ ప్రభువును ఎక్కడో పారవేసియున్నారు.

కాబట్టే పేతురు ఈ వచనాలలో, (1) అబద్ధ బోధలు చాలా మందిని తప్పుదారి పట్టిస్తాయని మరియు (2) చెడ్డ నాయకుల అనైతిక జీవనశైలి క్రీస్తును మరియు క్రైస్తవ విశ్వాసాన్ని చూసేందుకు చెడ్డదిగా చేస్తుందని చెప్తూ వున్నాడు.

ప్రజలపై ఉంచడానికి తయారు చెయ్యబడిన మానవ నిర్మిత బోధలు కొన్నిసార్లు చిన్నవిగానే ఉంటాయి, (ఉదాహరణకు, వ్యక్తిగత దుస్తుల విషయములో కావొచ్చు, జీవన శైలి విషయములో కావొచ్చు, లేదా ఆహారాల విషయానికి సంబందించిన వాటి విషయములో కావొచ్చు). మరికొందరు ఏకంగా క్రీస్తు పైనే దాడి చేస్తారని కూడా పేతురు చెప్తూవున్నాడు. పౌలు 1కొరింథీ 15: 3లో, మృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు? అని ప్రశ్నించడం, దానికి సంబంధించినదే.

పురాతన ఆసియా మైనర్‌లో ఏమి జరుగుతుందో మనకు ప్రత్యేకంగా తెలియదు, కాని నేడు ఏమి జరుగుతుందో మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఉదాహరణకు, సార్వభౌముడైన యేసు ప్రభువు గురించి ఒక సెమినార్ నిర్వహించి దానికి చాల మంది వేదాంతవేత్తలను పిలిచామనుకోండి, నిజముగా అక్కడ యేసు తిరస్కరించబడతాడు. ఈ ఇంటర్‌ డినామినేషనల్ “క్రైస్తవ” వేదాంతవేత్తలు నాలుగు సువార్తలలోని అనేకమైన బైబిల్ భాగాలను గురించి తర్కిస్తూ, దేవుని మాటలు, క్రియలను గురించి వాదులాడుకోవడం వాటికి విలువనివ్వక పోవడం ఆయా భాగాలలోని యేసు మాటలను, క్రియలను వాస్తవమైనవిగా, వాస్తవ చరిత్రగా పరిగణించడంలో ఇబ్బందిపడుతూ ఉండటం మనం చూడొచ్చు. వారి సందేహాస్పద దృక్పథం వారు బోధించే సంఘస్థుల ఆలోచనల్లోకి కూడా ప్రవేశించే ఉంటుంది, తద్వారా వాళ్ళు క్రీస్తుకు అపకీర్తిని తెస్తున్నారు.

సార్వభౌముడైన ప్రభువైన యేసు, ఈ రోజు ఈ ప్రపంచములో పరిచర్య చేస్తూవున్న వేలమంది మార్మన్ మిషనరీలచే తిరస్కరించబడియున్నాడు. వారు పరిశుధ్ద త్రిత్వములో ఆయన స్థానాన్ని తిరస్కరించియున్నారు. కృప ద్వారా మాత్రమే రక్షణ అనెడి ఆయన బహుమతిని తిరస్కరించియున్నారు. అట్లే, రక్త ప్రాయశ్చిత్తం అనెడి ఆలోచనను అపహాస్యం చేస్తూ, యేసును గొప్ప మోరల్ టీచర్ గా మాత్రమే చూసే మతాచార్యులచే కూడా సార్వభౌముడైన ప్రభువు తిరస్కరించబడి యున్నాడు. మతపరమైన ఏ ఆలోచనను తప్పుగా ప్రకటించలేక సహనంతో నాన్-జడ్జిమెంటల్ గా కనిపించాలని కోరుకునే క్రైస్తవ నాయకులచే ఆయన తిరస్కరించబడియున్నాడు. యెహోవా సాక్ష్యుల ద్వారా ఆయన తిరస్కరించబడియున్నాడు. వారు యేసును “దేవుడు” అని పిలుస్తారు, కానీ ఏ విధంగానూ ఆయనను ఆరాధించరు, స్తుతులను చెల్లించరు. ఈ అబద్ధ భోదకులను బట్టి ఆందోళనచెందుతూవున్న విశ్వాసులను ఉద్దేశిస్తూ, పేతురు, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదని, వారి నాశనము కునికి నిద్రపోదని, దేవుని ఖండన ఇప్పటికే ప్రకటించబడిందని వారు చేసిన హానికి సరైన సమయంలో- దేవుని టైములో- వాళ్ళు శిక్షించబడతారని చెప్తున్నాడు. నిశ్చయతకై ఈ క్రింది ఉదాహరణలను పేర్కొంటూవున్నాడు.

4దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలముల లోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 5మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించి నప్పుడు, నీతిని ప్రకటించిన నోవహును మరి యేడుగురిని కాపాడెను. 6మరియు ఆయన సొదొమ గొమొఱ్ఱాలను పట్టణములను భస్మముచేసి, ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి, 7దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. 8ఆ నీతిమంతుడు వారిమధ్యను కాపురముండి, తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించు కొనుచు వచ్చెను. 9అదే నిజమైతే, భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు.

చెడుకు శిక్ష పడుతుందని, మంచికి ప్రతిఫలం లభిస్తుందని పిల్లలకు నేర్పిస్తాం. చెడు చేసే వారు శిక్ష తప్పించుకొన్నారే అనుకోండి పిల్లలు ఆందోళన చెందుతారు. అట్లే అబద్దపు బోధకులు ప్రజల విశ్వాసాన్ని పాడుచేయడాన్ని చూసి భయపడే క్రైస్తవులు, వారి మీదికి శిక్ష రాలేదనుకొండి వాళ్ళు అది చూసి దేవుడు తన చర్చిపై ఆసక్తిని కోల్పోయాడని లేదా దానిని పట్టించుకోవడం లేదనే నిర్ధారణకు రావచ్చు.

కాబట్టి, పేతురు పేర్కొనిన మూడు పాత నిబంధన కథనాలు, దేవుని నెమ్మదైన స్థిరమైన న్యాయము పనిచేస్తూ ఉందని, నమ్మకమైన విశ్వాసులను సకాలంలో విమోచించడాన్ని చూపుతూ ఉన్నాయి.

ఉదాహరణ 1: పాపము చేసిన దేవదూతలు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుడు పడిపోయిన దేవదూతలకు శిక్ష విధించి కఠినమైన తీర్పు, శిక్షకు బందీలుగా బంధించి వారిని నరకంలో పడేశాడు. తీర్పు కోసం రిజర్వు చేసాడు. వారి కాళ్లకు ఇప్పటికే నరకానికి చెందిన చీకటి చెరసాలలో సంకెళ్లు వేయబడి ఉన్నాయి (యూదా 1:6). అక్కడ ఉన్న దుష్ట దేవదూతలు దేవునితో ఉన్న ఆశీర్వాదకరమైన సహవాసాన్ని కోల్పోయారు, వారు ప్రభువు సన్నిధానంలో ఉండే శాశ్వతమైన ఆనందం నుండి శాశ్వతంగా దూరపర్చబడ్డారు. పరలోకము నుండి వెళ్లగొట్టబడ్డారు. పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసివేయబడి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారు అప్పగింప బడియున్నారు. అక్కడ వారు ఇంకా శిక్షను అనుభవించటం లేదు, వారు దేవుని అనుమతితో కొంత స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ, వారు దోషులు. ఎందుకంటే వారు ఇప్పటికే శిక్షించబడి ఉంటే, సాతాను ఇక్కడ కుయుక్తిలో పాల్గొన లేడు. వీళ్ళు ఈ ప్రపంచంలో పనిచేస్తూ ఉండొచ్చు. సాతాను నరకానికి రాజు కాడు, ఖండింపబడి యున్న వారిని పాలించేవాడు. అతడు కూడా స్వయంగా ఖైదీనే #000–000-001, నరకాగ్నిని తాకే మొదటి వ్యక్తి వాడే. దేవుడు వారిపై తుది తీర్పును ప్రకటించే సమయం కోసం వారు రిజర్వ్ చేయబడియున్నారు. దేవుడు తనపై తిరగబడిన వారిపట్ల కఠినముగా వున్నాడు గనుక ఆయన అబద్ధ ప్రవక్తలను అబద్ధ భోధకులను ఊరికినే వదిలిపెట్టాడని మనం రూఢిగా గ్రహించవలసియున్నాము.

ఉదాహరణ 2: జలప్రళయము. నీతిని గురించి ప్రకటించిన దేవుని రాయబారి నోవహు. ఇతడు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు (ఆది 6:9) మరియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన వాడు (ఆది 6:22) ఆ తరం వారిలో వారి ప్రతి ఆలోచన “ఎల్లప్పుడు కేవలము చెడ్డది” (ఆది 6:5). నోవహు ఓడను నిర్మిస్తున్న 120 సంవత్సరాలలో, ఆ సమయంలో నోవహు నీతిని బోధించడం ద్వారా మనుషులను పశ్చాత్తాపంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు, గాని ఒక్కడు మారలేదు (హెబ్రీ. 11:7). అయితే చివరకు ప్రభువు సహనం నశించింది. ఎనిమిది మంది మినహా మానవకోటినంతటిని దేవుడు శిక్షించాడు. దిగువ నుండి మరియు పై నుండి వచ్చిన అపారమైన నీరు దాదాపు మొత్తం మానవ జాతిని ముంచి వేసింది. ఇక్కడ అనీతిమంతుల అరుపులను విన్న ఎవరికైనా దేవుడు తన వాక్యం పట్ల సీరియస్ గా ఉన్నాడని మన క్రియలను బట్టి నిజమైన పర్యవసానాలను ఇస్తాడనుటలో ఎటువంటి సందేహం ఉండదు.

ఉదాహరణ 3: సొదొమ గొమొఱ్ఱా. అనీతిమంతత్వము, తప్పుడు బోధలు, అనైతికత మరియు చెడు (అవి లోతు రోజులలో కావచ్చు, పేతురు రోజులలో కావచ్చు లేదా ఈ రోజు కావచ్చు) చివరికి దేవుని తీర్పును అమలు చేయడానికి దారితీస్తాయని తరువాతి తరాలకు గుర్తు చేయడానికి దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను నాశనం చేశాడు (ఆది 19). ఆయన తన శిక్షను విధ్వంసంతో అమలు చేశాడు, తద్వారా దైవభక్తి లేని జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్న వారికి దృష్టాంతముగా వాటిని ఉంచాడు. ఈ నగరాలు అత్యంత భయంకరమైన ఆ విపత్తులో బూడిదగా మారాయి, దీని ప్రభావం ఈనాటికీ స్పష్టంగా గమనించవచ్చు. నేడు ఆ ప్రాంతాన్ని సందర్శించే ఎవరికైనా లోతు దానిని వ్యవసాయ భూమిగా లేదా మేత భూమిగా ఎందుకని కోరుకున్నాడో అర్థం కాదు. వాస్తవానికి అది అప్పుడు, యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను (ఆది 13:10). ఇప్పుడు ఈ వ్యక్తీకరణ డెడ్ సీ యొక్క దక్షిణం చిట్టచివరిలో ఉన్న మట్టిని వివరించడానికి ఉపయోగించబడదు. దేవుడు వారి గొప్ప చెడు కారణంగా ఆ నగరాలను కాల్చివేయడమే కాకుండా, ఆ ప్రాంతాన్ని చాలా తీవ్రంగా కొట్టాడు, దానిలో కొంత భాగం ఇప్పుడు నీటిలో ఉంది. ఇది ఇప్పుడు వాస్తవానికి భూఉపరితలానికి అత్యంత దిగువన, సముద్ర మట్టానికి 1,290 అడుగుల దిగువన ఉంది. ఇప్పుడు అక్కడ ఏమీ పెరగదు. అక్కడ జంతువులు నివసించలేవు. అబ్రాహాము 30 మైళ్ల దూరంలో ఉన్న హెబ్రోన్ నుండి అది సృష్టించిన పొగ మేఘాలను చూడగలిగాడు అంటే ఆ ఫైర్ స్ట్రోమ్ ఎంత తీవ్రమైనదో ఊహించండి.

కాని దేవుడు నీతిమంతుడైన నోవహును, నీతిమంతుడైన లోతును జ్ఞాపకం చేసుకొని తప్పించాడు. ఇక్కడ మూడు విషయాల ను మనం గమనించవలసియున్నాము. మొదటిది, నోవహు, లోతు చుట్టూ ప్రజలు ఉన్ననూ, వారెవరు వీరి మాటలను వినలేదు. ఇద్దరూ యెహోవా ఆయన సత్యం కోసం ఒంటరిగానే సాక్ష్యమిచ్చారు. అయినాసరే వారు తమ విశ్వాసాన్ని వదులుకోలేదు. రెండవది, వారి ప్రపంచాలు వారి చుట్టూ కూలిపోతున్నప్పుడు కూడా వారిని ఎలా రక్షించాలో దేవునికి తెలుసు. జలప్రళయము గాని లేదా ఫైర్ స్ట్రోమ్ గాని వారిని బాధించలేదు. మూడవది, ఇద్దరూ లోపభూయిష్టంగా, (మీలా నాలా) పాపాత్ములుగా ఉన్నప్పటికి దేవుడు వారిని నీతిమంతులని పిలిచాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవహు యొక్క తాగుబోతు నగ్నత్వం యొక్క విచారకరమైన కథ నమోదు చేయబడి ఉంది. 19వ అధ్యాయంలో లోతు తన కుమార్తెలను తన తలుపు బయట ఉన్న రేపిస్టుల గుంపుకు అందించడాన్ని, అలాగే తన ప్రియమైన, అందమైన సొదొమను విడిచిపెట్టడానికి అతని అయిష్టత నమోదు చేయబడి ఉంది. అయితే వారు యెహోవా పై విశ్వాసముంచారు, దేవుని మాటలను నమ్మారు.

దేవుని న్యాయం విషయములో మనకు ఎలాంటి భయాలు అవసరం లేదు – అది పరిపూర్ణంగా ఉంటుంది. అట్లే మనం కూడా మన పాపానికి బదులుగా, మన రక్షకుడైన క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా పరిగణించ బడుతూ ఉన్నాము. ఆయన తీర్పులో వచ్చినప్పుడు రక్షణ మరియు విమోచనను గురించిన దేవుని వాగ్దానాలను మనం కూడా క్లెయిమ్ చెయ్యొచ్చు.

ముగింపుని (9వ వచనం) గ్రహించమని పేతురు మనలను ప్రోత్సహిస్తున్నాడు: “భక్తులను శోధనలోనుండి ఎలా తప్పించాలో, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఎలా ఉంచాలో దేవునికి తెలుసు”. ఏ సందర్భంలో నైనా పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ప్రభువుకు తెలుసు. దైవభక్తి గలవారు, తనకు భయపడేవారు, ఆయన ముందు నీతిగా నడుచుకునే వారు, అవిశ్వాసుల మధ్య జీవిస్తూవున్నప్పటికిని, వారి పరిసరాల వల్ల కలిగే ప్రలోభాల నుండి, వారిని తప్పించేందుకు ఆయనకు మార్గాలు ఉన్నాయి. అట్లే మరోవైపు, ఆయన ఎగతాళి చేయబడడు, కాని తనను అగౌరపర్చిన వారిపట్ల ప్రతీకారం తీర్చుకోవడం ఆయనకు తెలుసు అనే విషయాన్నీ మర్చిపోకూడదు, కీర్తన 16:4.

10దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశకలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, వీరు తెగువగల వారును స్వేచ్చాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారు. 11దేవదూతలు వారికంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప వెరతురు. 12వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్‌ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు, తాముచేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు.

ఈ అబద్ధ బోధకులను దుర్నీతిపరులుగా ప్రమాదకరంగా మార్చేది ఏమిటంటే, దేవుని అధికారాన్ని తృణీకరించడం, ఇతరులను కూడా అలా చేయమని బోధించడమే. ఆ దుష్ట దృక్పథమే మానవ పాపాలన్నింటికి అంతర్లీనంగా ఉంది. అది సాతాను యొక్క తిరుగుబాటుకు కూడా మూలమై ఉంది. సాతాను, ఒకప్పుడు వెలుగు దూత, అతనిపై ఉన్న దేవుని అధికారాన్ని త్రోసివేసి, వాడు దేవునిలా ఉండాలని కోరుకున్నాడు. వాడు హవ్వను కూడా అలాగే చేయమని ఒప్పించాడు. చరిత్ర అంతటా వాడు దేవుని అధికారిక వాక్యమైన బైబిలును తిరస్కరించునట్లు ప్రజలను శోధించాడు. మీరు బైబిల్‌కు విధేయులై ఉండనప్పుడు, దేవుని పట్ల మీ సమర్పణ క్రమేణా క్షీణించిపోతుంది. మన నుండి దేవుడు ఏమి కోరుకొంటున్నాడు అనే దాని గురించి బైబిల్ మాత్రమే నమ్మదగిన మూలం. ఈ రోజుల్లో, ప్రవక్తలు, అపొస్తలుల అధికారం మసకబారుతుంది. చర్చి నాయకత్వం ఆధ్యాత్మికంగా కాకుండా రాజకీయంగా మారుతుంది. ప్రభుత్వ అధికారాన్ని ధిక్కరించడం ఫ్యాషన్‌గా మారుతుంది. ఆధ్యాత్మికంగా బలహీనమైన పురుషులు నాయకత్వం వహించడానికి నిరాకరించడం ఆధ్యాత్మికంగా బలహీనమైన స్త్రీలు అనుసరించడానికి నిరాకరించడం వలన క్రైస్తవ కుటుంబాలు కూడా శ్రమపడుతూ ఉన్నాయి.

పాపులలోని ప్రాథమిక పాపం ఏమిటంటే, దేవుని అధికారాన్ని తృణీకరించి, స్వాతంత్య్రాన్ని ప్రకటించు కోవడం. మన స్వతంత్రం మన స్వంత దేవుడిగా ఉండాలని కోరుకోవడం. ఆ క్రమములో మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొను వారు తమ దుర్నీతిని అరికట్టజూచే అధికారమంతటిని ఎదిరిస్తారు, అది దేవుని అధికారము కానివ్వండి, మనుష్యుల అధికారము కానివ్వండి వాళ్ళు లెక్కచేయరు. వాళ్ళు క్రీస్తు అధికారాన్ని త్రోసిపుచ్చుతూ శరీరానుసారముగా నడుచుకొంటూ భ్రష్ట కోరికలను బట్టి తెగువగల వారిగా అహంభావులుగా తయారౌతారు. పేతురు 10వ వచనంలో ఈ అబద్దపు బోధకులు “మహాత్ములను (పరలోక జీవులను) దూషింప వెరువకయున్నారని” చెప్పాడు. ఇది గ్రీకులో కష్టమైన పదమై యున్నప్పటికీ ఆమోదయోగ్యమైన అనువాదం ఏమిటంటే వాళ్ళు దేవుని ప్రణాళికలు మరియు పనిలో (పరలోక జీవుల) ప్రాముఖ్యతను అపహాస్యం చేస్తూవున్నారని తెలియజేస్తూవుంది.

అట్లే వారు వీరు తెగువగలవారును స్వేచ్చాపరులునై మహాత్ములను దూషింప వెరువకయున్నారని 10వ వచనంలో పేతురు చెప్తూవున్నాడు. “మహిమ” లేదా “మహిమలు” అనే పదం దేవదూతలను కాకుండా దేవుడిని సూచిస్తుంది. అబద్ధ బోధకులు, అన్ని అధికారాలను త్రోసిపుచ్చి, దేవునిని అపహాస్యం చేస్తూ ఉన్నారని, ఆయన వాక్యానికి విధేయత చూపాలనే ఆలోచనను కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారని పేతురు చెప్తూవున్నాడు. అట్లే, వీరికి ఏ విషయములోను మాకు తెలియదు అని ఒప్పుకొనే అణకువ వారిలో ఉండదు. తమ గర్వములో కన్నుమిన్నుగానక తమకు తెలియని పరలోక సత్యాలను గురించి నోటికొచ్చినట్టెల్లా వాగుతుంటారు. అలాంటి వారికి మృగాల లాగానే ఆధ్యాత్మిక వివేచన ఉండదు. వారికి శరీర వాంఛలు తీరితే చాలు. తర్కబద్ధముగా వాదించగల వారి సామర్ధ్యమును బట్టి వాళ్ళు గర్వించవచ్చు కాని వారి ప్రవర్తన వివేకము లేనట్లుగా ఉంటుంది.

అయితే, దీనికి విరుద్ధంగా, పరలోకంలోని దేవదూతలు అబద్ధ బోధకుల కంటె మరి అధికమైన బలమును శక్తియు గలవారై నను, ప్రభువు ఎదుట వారిని దూషించి వారిమీద నేరము మోప భయపడుతున్నారు. దూషించుటకు అర్హులైయున్నను వారు అబద్ధ బోధకులను దూషించకున్నారు. తీర్పు తీర్చే విషయములో, ఖండించే విషయములో వాళ్ళు దానిని ప్రభువు చిత్తానికే వదిలివేస్తారు. ఆయనే తీర్పు తీరుస్తాడు. తన వాక్యాన్ని వక్రీకరించే వ్యక్తుల పట్ల దేవుడు చాలా సీరియస్ గా ఉన్నాడు, ప్రకటన 22:18, 19లోని భయంకరమైన శాపాలను చూడండి, ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

13ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందు లలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు. 14వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గల వారును, అస్థిరులైన వారి మనస్సులను మరులుకొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయముగల వారును, శాపగ్రస్తులునై యుండి, 15తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమునుబట్టి త్రోవ తప్పిపోయిరి. 16ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను; అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను, ఎట్లనగా నోరులేని గార్దభము మానవస్వరముతో మాటలాడి ఆ ప్రవక్తయొక్క వెఱ్ఱితనము అడ్డగించెను.

న్యాయవంతుడు నీతిమంతుడైన దేవునితో ప్రేమతో కూడిన సహవాసంలోకి తిరిగి చేరడానికి పాపాత్ములకు ఏకైక మార్గం క్రీస్తుయేసే. ఒక వ్యక్తి క్రీస్తును తిరస్కరించినప్పుడు అది చాలా విచారకరమైన విషయం – ఎందుకంటే అతడు తననుతాను నాశనం చేసుకుంటున్నాడు. దేవుణ్ణి వెతుకుతున్న వ్యక్తులు చర్చికి వచ్చి, దాని సహవాసం, దాని ఆధ్యాత్మిక బోధనలలో ఆశ్రయం పొందినప్పుడు, ఆ ప్రజలు ఆకలిగొనకుండా లేదా వారిని విషపూరితం చెయ్యకుండా ఆ ప్రజలకు అవసరమైన ఆత్మీయ ఆహారం ఇవ్వడం చర్చి నాయకత్వం యొక్క ప్రత్యేక బాధ్యత.

ఆహారం, పానీయం, సెక్స్ లేదా డబ్బుతో సహజంగా తప్పేమి లేదు. మితంగా దేవుని చిత్తానికి అనుగుణంగా, అవన్నీ దేవుని దయగల బహుమానాలు. కాని క్రైస్తవులు వాటిని అప్రియమైన రీతిలో బహిరంగ ధోరణితో దుర్వినియోగం చేసినప్పుడు, అవి క్రీస్తుకు ఆయన సందేశానికి అవమానాన్ని తెస్తాయి. క్రైస్తవ నాయకులు విలాసవంతమైన జీవనశైలిని గడుపుతూ, అందులో సంతోషిస్తూ, తాగి, వ్యభిచారానికి పాల్పడే వారు “శాపగ్రస్త సంతానం”. వారి మాదిరిని అనుసరిస్తూ, వారిని అనుసరిస్తూవుండే వారు తమ స్వంత పాపపు కోరికలకు లొంగిపోవడానికి మరియు దేవునితో వారి సంబంధంలో అంతా బాగానే ఉన్నట్లు నటించడానికి వాళ్ళు ప్రజలను అనుమతిస్తారు. క్రైస్తవ నాయకుల లైంగిక అనైతికతకు సంబంధించిన విస్తృత కథనాల కారణంగా పౌర హక్కుల గౌరవానికి దాని విశ్వసనీయతకు జరిగిన నష్టం గురించి ఆలోచించండి. సంఘ నాయకుల అనైతిక ప్రవర్తనను బట్టి ప్రజలు చెడ్డగా ఎలా మాట్లాడుకొంటారో ఎలా అపహాస్యం చేస్తారో ఆలోచించండి. అబద్ధ బోధకులు వారి అనైతికతలో కొనసాగుతూ పరివర్తన లేకుండా భయమనేది లేకుండా పరిశుద్ధ ప్రభురాత్రి భోజనంలో కూడా పాలు పంచుకొంటూ సంతోషిస్తారు. వారికి సిగ్గు గాని పశ్చాత్తాపము గాని ఉండదు.

వారు లోభులై మీవలన సంపాదించుకొన్న డబ్బును బట్టి పగటిపూట కూడా ఆనందించడానికి వెనుకడుగు వేయరు. అది వారి దుర్నీతిలో కనిపించే మొదటి రూపం. దీనితో దగ్గరి సంబంధం కలిగిన మరొకటి: వ్యభిచారంతో నిండిన కళ్ళు కలిగి ఉండటం, పాపాన్ని వదులుకోలేని/ పాపము మానలేని కన్నులు కలిగి ఉండటం అంటే ఆడవాళ్లందరి వైపు మోహముతో చూస్తూ వారినెలా వశపర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఆ ఆలోచనల్లో కోరికల్లో, చర్యల్లో అస్తమానం పాపం చేస్తు ఉండటం. పాపం వారిని బలంగా పట్టుకుంది, వారు పూర్తిగా దాని నియంత్రణలో ఉన్నారు, వారు దాని బానిసలు. వారు ప్రతి విధమైన అపవిత్రత మరియు వ్యభిచారానికి లొంగిపోవాలి. కాబట్టి వారు విశ్వాసంలో ఇంకా స్థిరపడని స్త్రీల ఆత్మలను మరులు కొల్పుతారు. ఎందుకంటే, వారు లేఖనాలలో లోతుగా వేరు పారిన వారు కారు కాబట్టి వారు అబద్దపు బోధకులచే సులభంగా మోసగించబడతారు. అది వారి దుర్నీతికి రెండవ రూపం.

చివరిగా, అపొస్తలుడు వారి స్వభావాన్ని వర్ణిస్తూ: వాళ్ళు లోభత్వమందు సాధకముచేయబడిన హృదయముగల వారును, శాపగ్రస్తులునైయున్నారు అని తెలియజేస్తూవున్నాడు. ఈ అంశం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే వారికి తమ అనుచరుల హృదయాలను గురించి కాని వారి ఆత్మల గురించి కాని శ్రద్దేమి ఉండదు. వారి శ్రద్ధ అంతా డబ్బు గురించే అంటే, స్వంతానికి ఎంత సంపాదించుకోగలమనేదే వారికి ప్రాముఖ్యము. వారి జీవితాలలో విలాసవంతమైన జీవితం, అపవిత్రత, దురాశ సాధారణం. డబ్బుపై వారి కున్న కోరిక, తృప్తి చెందని వారి దురాశను బట్టి వారు నిజంగా శపించబడిన వారు. చివరకు దేవుని శాపం యొక్క ఫలితాన్ని అనుభవిస్తారు.

నాయకులు తమ నాయకత్వాన్ని తమను తాము సుసంపన్నం చేసుకోవడానికి ఒక మార్గంగా ఉపయోగించినప్పుడు, వాళ్ళు అబద్ధ ప్రవక్తయైన బిలామును పోలియున్నారు (సంఖ్యా 22-25). బిలాము తన ఉద్దేశ్యాలను అభిప్రాయాలను దేవునికి తెలియకుండా దాచిపెట్టాలనుకోవడం, ఆయన మార్గములో కాకుండా తన స్వంత మార్గంలో వెళ్లాలనుకోవడం వెర్రితనం. నిజమైన దేవుడు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాలను కుంటున్నాడని అతనికి తెలిసియున్నప్పటికీ, అతడు డబ్బు కోసం ఇశ్రాయేలీయులను శపించాలనుకొన్నాడు. అతని స్వంత గాడిద, అతని కంటే తెలివైనది, అతనిని విపత్తు నుండి కాపాడింది. ప్రభువు దానికి వాక్కు నివ్వగా అది అతనితో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. అయినను బిలాము మారకపోగా మరొక రీతిగా అతడు ఇశ్రాయేలీయుల పైకి విపత్తును తెచ్చాడు. ఇశ్రాయేలీయుల పురుషులు వ్యభిచారం చేసేలా లైంగిక ప్రలోభాలను ఉపయోగించాలని తద్వారా వాళ్ళను మోయాబీయుల దేవుళ్లను ఆరాధించేటట్లు చేయుమని అతడు మోయాబీయులకు సలహా ఇచ్చాడు. అతడి కుయుక్తిలో పడిన ఇశ్రాయేలీయులపై దేవుడు తెగులును పంపగా ఇరవై నాలుగు వేల మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

17వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునై యున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది. 18వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు. 19తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా.

అపొస్తలుడు ఈ వచనాలలో అబద్ధ బోధకులు మోసపూరితముగా మనుషులను ఆకర్షించే విధానాన్ని తెలియజేస్తూ వున్నాడు: అబద్ధ బోధకులు నీళ్లులేని బావులు. అబద్ధ బోధకులకు ప్రాణాన్ని నిలబెట్టే జీవజలముతో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే సామర్థ్యం లేదు. నీళ్లులేని బావులైన వీరి దగ్గర విశ్వాసులు అధిక సమయం గడిపేలా వాళ్ళు ప్రజలను మోసగిస్తారు, కానీ వారి దాహార్తిని మాత్రం జీవనాధారమైన నీటితో ఏమాత్రం తీర్చలేరు. వారు దేవునికి చెందిన వారమని చెప్పుకొంటారు, కాని వారు దేవుని ఆత్మ లేని వారు. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులోనుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచు వారు పొంద బోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను, యోహాను 7:38. వాళ్ళు పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములు అంటే, వారిలో ఏదో ఉందనట్టుగా కనబడతారు గాని నిజానికి వారిలో ఉన్నదంతా శూన్యమే, వారిలో కంటెంట్ ఏమి ఉండదు. వారిలో ఉన్న దురాశ, చెడు కోరికలు అనే గాలికి వారు కొట్టుకొని పోతూ ఉంటారు. వారి బోధలు ఆధ్యాత్మిక ఫలాలు పెరగడానికి అవసరమైన వర్షాన్ని కలిగించవు, యూదా 12. వారు చీకటిని కోరుకొంటారు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు, యోహాను 3:19,20. వారికి శాశ్వతముగా ఉండేది చీకటే. వారు ఈ విషయాన్ని నమ్మకపోయినప్పటికిని వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును, మత్తయి 8:12.

అబద్ధ బోధకుల ప్రభావితమైన బోధనా విధానం ఇలా వివరించబడింది: వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టలచేత మరలుకొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్యము ఇత్తుమని చెప్పుదురు. ఇక్కడ నేరం హృదయములేని వారి పాపిష్ఠితనము. అట్లే, బలహీనమైన వారిని ఆకట్టుకునేలా వారి గొప్పతనం రూపొందించబడిన భాషలో వారిని మోసగించే ఉద్దేశ్యంతో వ్యర్థమైన డంబపు మాటలు. అట్లే వారు ఉపయోగించే ఎర, తుచ్ఛమైన శరీరసంబంధమైన దురాశలు. వారు క్రైస్తవ మతం యొక్క సత్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు, మంచిదే, కాని వారి పాత అలవాట్లు మరియు దురాచారాల నుండి తమ్మును తాము దూరముగా ఉంచుకొనే శక్తిని వారు ఇంకను కనుగొనలేదు. వారు ఒకరికి స్వేచ్ఛను వాగ్దానం చేస్తున్నప్పుడు, వారే అవినీతికి బానిసలు; ఒక మనిషి ఓడిపోయాడనుకోండి. అతనిని గెల్చిన దానికి అతడు బానిస. ప్రతిరోజు శరీరసంబంధమైన దురాశలు చేత ఓడిపోతూనే ఉండే వాళ్ళు, ఇతరులకు స్వేచ్ఛను ఎలా వాగ్దానము చెయ్యగలరు?

అబద్ధ బోధకులు తమ స్వంత విశ్వాసాన్ని పాడుచేసుకోవడం చాలా విచారించదగిన విషయం. వీళ్ళు వారి సంరక్షణకు అప్పగించబడిన వారు యథావిధిగా పాపాల్లో కొనసాగినా వారికి రక్షణ ఉంటుందని భోదిస్తూ వుంటారు, గలతీ 5:13; యూదా 4. అసలు దీనిపై దేవుని వాక్యము ఏమి చెప్తూ ఉందనే విషయాన్నీ వాళ్ళు పట్టించుకోరు, 1 కొరింథీ 6:9,10; గలతీ 5:19-24. అబద్ధ బోధకులు ప్రజలను విశ్వాసం నుండి దూరం చేసి, సువార్త యొక్క స్వేచ్ఛను కోరికలు తీరడంవల్ల కలిగే సంతృప్తికి సాకుగా మారుస్తారు. వారు సౌలభ్యం, నెమ్మది, ఆచరణాత్మకత అనే మొదలైన ముసుగుల వెనుక దాక్కోనివుంటారు. తద్వారా వాళ్ళు ప్రజలను క్రీస్తు నుండి దూరంగా, అవిశ్వాసంలోకి నడిపిస్తారు. వారు ఇస్తామంటున్న స్వేచ్ఛ వారి పాత స్వభావాల కోరికలకు సంబందించిన స్వేచ్ఛ. సాతాను హవ్వకు వాగ్దానము చేసినట్లుగా, దేవుని ఆజ్జ్యల నుండి విముక్తిని వాగ్దానం చేయడంలో, అంటే, కృపను బట్టి క్రైస్తవులు ధర్మశాస్త్రము మరియు సంఘము సూచించిన ప్రవర్తనా నియమాల నుండి మాత్రమే కాకుండా, అన్ని నైతిక చట్టాల నుండి కూడా విముక్తి పొందియున్నారనే బోధ. పాపవిముక్తి, రక్షణ కేవలం దేవుని కృప మూలంగానే గనుక ఏ విధముగానూ మంచి పనులపై అది ఆధారపడదు గనక క్రైస్తవులు తమ ఇష్టం వచ్చినట్లు జీవించ వచ్చని, వారెలా జీవించినా, ఏమి చేసినా కృప వారిని క్షమిస్తుందని భోదిస్తూ, వారు వారిని తిరిగి దుర్మార్గపు బానిసత్వంలోకి నెట్టివేస్తారు. దేవుని వాక్యం మరియు దేవుని ఆజ్ఞలచే నియంత్రించబడని స్వేచ్ఛ బానిసత్వానికి మాత్రమే దారి తీస్తుంది. నిజమైన స్వతంత్రం పాపంలో కాదు, క్రీస్తులోనే కనుగొనబడుతుంది, యోహాను 8:31-32. ఇతరుల విశ్వాసాన్ని నాశనం చేసే వ్యక్తులు, యేసు ప్రకారం, దేవుని కోపాన్ని అనుభవించడం కంటే మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను చెప్పడానికి ఇష్టపడతారని చెప్తూవున్నాడు (లూకా 23:30). విశ్వాసం నుండి పడిపోవడం సాధ్యమేనా? సాధ్యమే. అటువంటి వ్యక్తి యొక్క చివరి పరిస్థితి మొదటి దానికంటే అధ్వాన్నంగా ఉంటుందని యేసు చెప్పాడు, లూకా 11:24-26; హెబ్రీ 6:6.

20వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడిన యెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును. 21వారు నీతిమార్గమును అనుభవపూర్వకముగా తెలిసికొని, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞనుండి తొలగిపోవుట కంటె ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక యుండుటయే వారికి మేలు. 22కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను.

కొంతమంది క్రైస్తవులు యేసు తన ప్రజలకు చేసిన వాగ్దానాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి రక్షింపబడినట్ల యితే, శాశ్వతముగా రక్షింపబడినట్లేనని, అంటే, ఒకసారి మీరు విశ్వాసిగా మారితే, మీరు ఎప్పటికీ పడిపోలేరని, తన వంతుగా, యేసు తన చేతుల్లో నుండి ఎవరినీ లాక్కోనివ్వడని, మనం పట్టుబట్టినట్లయితే ఆయన మనల్ని బయటకు దూకడానికి అనుమతిస్తాడని భావించారు. 20వ వచనం, కొంతమంది అబద్ధ బోధకులు ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండేవారని, అంటే, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును అనుభవ జ్ఞానముచేత ఎరిగి, ఈ లోకమాలిన్యముల నుండి తప్పించు కొన్నవారని, అయితే వారు మరల ఈ లోకమాలిన్యములలో చిక్కుబడి తిరిగి అవిశ్వాసానికి వెళ్లిపోయారని అంటే, వారు ఆ అవినీతికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్తూవుంది. ఎంత ఘోరం! తెలిసిన మరియు అంగీకరించబడిన సత్యానికి విరోధముగా తలెత్తిన మతభ్రష్టత్వం ఊహించలేని పరిణామాలను కలిగి ఉంటుంది. క్రీస్తులో సజీవంగా ఉండాల్సిన హృదయం దేవుని వాక్యం మరియు కృప యొక్క రక్షణ శక్తికి విరోధముగా రాయివలె గట్టిపడిపోయింది. ఇది ఆ వ్యక్తిని తిరిగి క్రీస్తు వైపుకు తేవడం మరింత కష్టతరం చేస్తుంది. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటె చెడ్డదగును, మత్తయి 12:45.

అటువంటి వారిపై తీర్పు మరింత కఠినంగా ఉంటుంది, ఎందుకంటే వారికి నిజం తెలుసు కాని వాళ్ళు ఆయనను తెలిసే తృణీకరించారు. ఒకసారి ఒక పాస్టర్ గారు, “దేవుడు తన ఆజ్ఞలను ఉల్లంఘించే వ్యక్తుల పట్ల అనంతమైన సహనాన్ని చూపిస్తాడు కాని ఆయన తన సువార్తను తృణీకరించబడడాన్ని మాత్రం సహించడు”, అని అన్నాడు. ఈ విషయాన్నే యేసు కూడా చెప్పాడు: “తన యజమానుని చిత్త మెరిగి యుండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును”, లూకా 12:47,48.

పేతురు అబద్ధ బోధకులకు వ్యతిరేకంగా తన సందేశాన్ని ముగిస్తూ, క్రీస్తును, క్రైస్తవ విశ్వాసాన్ని విడిచి పెట్టడాన్ని కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అంటూ సామెతలతో పోల్చాడు. తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు, సామెతలు 26:11. రెండవ సామెతను మనకు తెలియని సెక్యూలర్ సోర్స్ నుండి తీసుకొని ఉండొచ్చు. ఇవి క్రైస్తవులందరిని తమ అక్షయమైన ఆత్మలను కొన్ని పనికిరాని వాటి కోసం అమ్ముకోవద్దని, తాము స్వేచ్ఛగా త్యజించిన పాపాలకు తమ్మును తాము తిరిగి అప్పగించుకోవద్దని కఠినముగా హెచ్చరిస్తూ వున్నాయి.

పేతురు విశ్వాసి మరియు అవిశ్వాసిలో పాపాత్మకమైన స్వభావం యొక్క స్థిరమైన వాస్తవికతను సూచించడానికి ఈ రెండు సామెతలతో తన హెచ్చరికలను ముగిస్తువున్నాడు. ఈ సందర్భంలో, కుక్క మరియు పంది అని వాడబడిన జంతువులు రెండూ దేవుని మాటను తిరస్కరించే వ్యక్తులతో పోల్చబడ్డాయి. కుక్కలు అనైతికత, అనాగరికత, అసభ్యత మరియు అజ్ఞానానికి చిహ్నాలు. దేవుని చట్టం ప్రకారం పందులు అధికారికంగా అపవిత్రమైనవి, లేవీయ 11:7; మత్తయి 7:6.

మునుపు బాప్తిస్మము ద్వారా వీళ్ళు అవిశ్వాసాన్ని విసిరివేసారు, వారిపై ఉండే అపరిశుభ్రమైన మరకలన్నీ కడిగివేయ బడ్డాయి. విశ్వాసం, ప్రేమతో కూడిన స్వచ్ఛమైన జీవితంలోకి వాళ్ళు ప్రవేశించారు. కానీ ఇప్పుడు వాళ్ళు మరల అపనమ్మకంలో, వారి స్వంత పనులలో పడిపోయారు. వారు మళ్లీ తమను తాము మురికిగా మార్చుకొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళి పవిత్రంగా మారాలనుకుంటే, మాకు నిజమైన విశ్వాసాన్ని ఇవ్వమని దేవుడిని అడగవలసియున్నారు. అవిశ్వాసం నుండి మళ్ళుకోవలసియున్నారు. వాళ్ళు విశ్వాసాన్ని పొందినప్పుడు, మంచి పనులు స్వయంచాలకంగా వస్తాయి. వాళ్ళు మళ్ళి స్వచ్ఛమైన పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు.

1-22 మన ప్రభువు, లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నా ననెను, యోహాను 16:33; 2 పేతురు 2:9. సాతాను, లోకము, మన స్వంత పాపపు స్వభావం మన శ్రమల ద్వారా మనల్ని అధిగమించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనేవుంటాయి. ఆయన పరిశుద్ధ వాక్యము, సంస్కారములు ద్వారా మాత్రమే మనం వాటినుండి తప్పించుకోగలం. ఈ విధంగా ఆయన తన వాక్యములో మరియు విశ్వాసంలో మనల్ని బలపరుచుచూ ఉన్నాడు మరియు స్థిరంగా ఉంచుతూ ఉన్నాడు.

లోకాన్ని జయించిన ప్రభూవా, నా దగ్గరకు రండి, నన్ను బాధించే శ్రమలను ఓపికతో భరించడానికి, చివరకు వాటిని అధిగమించి విజయం సాధించడానికి నాకు శక్తిని ప్రసాదించండి, ఆమెన్.

ఆసియా మైనర్లోని సంఘములోనికి చొరబడిన అబద్ధ భోదకులను గురించి పేతురు చెప్పిన భయంకరమైన సూచనలు పదే పదే నిజమయ్యాయి. చరిత్రకారుడైన రోలాండ్ బైంటన్ తూర్పు ప్రాచ్యం గురించి చెప్తూ, “తూర్పు ప్రాచ్యం, దాని నిరంతర మేధోవాదంతో, అబద్ధ బోధల వృద్ధికి సారవంతమైన నేలగా ఉంది” అని చెప్పాడు. గ్రీకులు ఎల్లప్పుడూ క్రొత్త విషయాలను నేర్చుకోవడంలో మరియు వాటిని గురించి ఎక్కువగా చర్చించుచూ సమయాన్ని గడిపేందుకు ఎంతగానో ఇష్టపడ్డారు, వారి భాష సంక్లిష్టమైనది. అర్థం, వ్యక్తీకరణ, ధ్వనిలో సూక్ష్మ వ్యత్యాసాలు కలిగి చాల డెలికసీగా ఉంటుంది. విశ్వాసులను గందరగోళపరిచేందుకు, చెదరగొట్టేందుకు దుష్టుడు ఆ లక్షణాలను ఉపయోగించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

పేతురు రాసిన రెండు లేఖల తర్వాతి సంవత్సరాల్లో, ఆసియా మైనర్‌లోని చర్చి వేగంగా అభివృద్ధి చెందింది. రెండవ శతాబ్దం నాటికి, ప్రస్తుత టర్కీ దేశమంతటా సంఘాలు ప్రారంభమయ్యాయి. కాని వారి విశ్వాసములో మరియు ఆచరణలో ఐక్యత లేకపోవడాన్ని బట్టి, అట్లే ఒకదాని తర్వాత మరొకటి వచ్చిపడిన అబద్దపు బోధల పరంపరతో తొందరగానే అవి విచ్ఛిన్నమయ్యాయి.

విశ్వాసానికి ఆధారముగా మూలమైయున్న లేఖనాలపై క్రైస్తవుల కున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి సాతాను తొలి దాడులు ప్రయత్నించాయి. వదులుగా వ్యవస్థీకృతమైయున్న మరణకరమైన గ్నోస్టిసిజం అనే తప్పుడు బోధ ఉద్భవించింది. గ్నోస్టిక్ మూవ్మెంట్ నాయకులైన మార్సియన్, సెరింథస్, బాసిలిడెస్ వంటి అబద్ధ మత బోధకులు ఆధునిక క్రైస్తవులు కోరుకునే జ్ఞానంలో విస్తారమైన కొత్త స్థాయిలు ఎన్నో ఉన్నాయని బోధించారు. పదార్థం మరియు మానవ శరీరం ప్రాథమికంగా చెడ్డవని, ఆత్మకు మాత్రమే శాశ్వత విలువ ఉంటుందని వారు బోధించారు. వారు మతకర్మల యొక్క చెల్లుబాటును తిరస్కరించారు. ఆదికాండము సృష్టి కథలతో సహా పాత నిబంధనలో చాలా భాగాన్ని తిరస్కరించారు. వారి బోధనలలో అన్ని రకాల అన్యమత పురాణాలను చేర్చారు. ఈ రోజుల్లో “జ్ఞానంలో బైబిల్ కంటే ఇంకా ఎన్నో ఉన్నాయి” అనే మోసపూరిత వాగ్దానంతో ప్రజలను ఆకర్షిస్తున్నట్లే, చాలా మంది సనాతన క్రైస్తవులు ఆ రోజుల్లో ఈ ఉద్యమంలోకి ఆకర్షితులయ్యారు. గ్నోస్టిసిజం యొక్క తప్పుడు బోధనలను ఎదుర్కోవడంలో భాగంగా, క్రిస్టియన్ కన్వెర్ట్స్ వారి బాప్టిజం సమయంలో బైబిల్ బోధన యొక్క శక్తివంతమైన ప్రకటన ద్వారా తమ విశ్వాసాన్ని ఒప్పుకొనేవారు. అదే మనం నేడు అపొస్తలుల విశ్వాస ప్రమాణము అని పిలుస్తున్న రూపాన్ని తీసుకుంది.

లేఖనాల పై మరొక పెద్ద దాడి సెంట్రల్ ఆసియా మైనర్‌లోని ఫ్రుగియనుండి (అపొ. కార్య. 16:6;18:23) మోంటానస్ (క్రీ.శ 133-177) అనే వ్యక్తి ద్వారా వచ్చింది. ఇతడు అన్యుడైన పూజారి, క్రైస్తవత్వములోనికి కన్వెర్ట్ అయ్యాడు. అతడు తన ఇద్దరు మహిళా సహోద్యోగులతో కలసి ప్రవచనాత్మక పరిచర్యను ప్రారంభించాడు (క్రీ.శ 157-172). వారి మాటకారితనాన్ని బట్టి వారు ప్రారంభించిన మాంటనిస్ట్ ఉద్యమం పెరగడం ప్రారంభించింది. ఈ కొత్త ప్రవచన పరిచర్య క్రైస్తవ సంఘాలను విభజించింది. అతడు, అతని ఇద్దరు మహిళా సహోద్యోగులు, ప్రిస్కా మరియు మాక్సిమిల్లా, ఫైనల్ అథారిటీని క్లెయిమ్ చేస్తున్న స్క్రిప్చర్స్ ని తిరస్కరించారు. లేఖనాలు పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిగత వాహనాలని అవి నిరంతరంగా బయలు పరచబడుతూనే ఉంటాయని వాళ్ళు బోధించారు. అత్యంత ప్రసిద్దుడైన టెర్టులియన్ వీరికి మద్దతు నిచ్చాడు. దాదాపు క్రీ.శ 177లో ఆసియా మైనర్ చర్చిలు వీరిని, వీరి అనుచరులను బహిష్కరించాయి, వీరి ప్రవచనాలను అపవిత్రమైనవిగా ప్రకటించాయి.

కప్పదొకియ మరియు అర్మేనియా సరిహద్దులో ఉన్న సమోసాటా పట్టణానికి చెందిన పాల్ (క్రీ.శ. 260 – 272) అనే ప్రభావవంతమైన బోధకుడు, యేసు కేవలం ఒక గొప్ప వ్యక్తియని , పరిపూర్ణమైన మంచివాడని, ఆయన తన బాప్టిజం సమయంలో క్రీస్తు అయ్యాడని, మరియు ఆయన తండ్రి చేత దత్తత తీసుకోబడ్డాడని బోధించాడు. సమోసాటా పాల్‌కు చాలా మంది అనుచరులు కూడా ఉన్నారు. క్రీ.శ. 269లో సినడ్ ఆఫ్ ఆంటియోచ్ ఇతనిని తొలగించింది. ఇతని బోధలను ఖండించింది.

నైలు డెల్టాలోని అలెగ్జాండ్రియాలో ప్రిస్బైటర్ (పెద్ద) అయిన ఆరియస్, (క్రీ.శ 256–336) త్రిత్వ సిద్ధాంతాన్ని బహిరంగంగా సవాలు చేస్తూ, క్రీస్తుకు ఆరంభం ఉందని, క్రీస్తు సృష్టింపబడిన వాడని, క్రీస్తు మార్పునొందగల వాడని, తండ్రికి లోబడి యుండుటను బట్టి తండ్రితో సమానం కాదని నొక్కి చెప్పాడు. ఈ తప్పుడు బోధ ఈజిప్టులో ఉద్భవించినప్పటికీ, (అరియనిజం) అతిత్వరగా ఆసియా మైనర్‌ను కూడా చుట్టుముట్టింది. ఆనాటి చక్రవర్తులలో ఒకరు అరియన్‌గా ఉన్నారు. అరియనిజంపై వివాదం 3వ శతాబ్దం చివరలో తలెత్తింది మరియు 4వ శతాబ్దంలో చాలా వరకు కొనసాగింది.

ఆరియస్‌ను ప్రధానంగా మరొక ఈజిప్షియన్, అతనేసియన్ అనే డీకన్ వ్యతిరేకించాడు. (అరియనిజంకు వ్యతిరేకముగా అతడు సబ్మిట్ చేసిన డాక్యూమెంట్ని, అతని గౌరవార్థం దానికి అతనేసియన్ విశ్వాస ప్రమాణము అనే పేరు పెట్టారు). దేవుడు కప్పదొకియలో ముగ్గురు గొప్ప ఆర్థోడాక్స్ రచయితలను, నాయకులను లేపాడు: నాజియాంజస్ బిషప్ యైన గ్రెగొరీ (క్రీ.శ. 330–390); నిస్సా బిషప్ యైన గ్రెగొరీ (క్రీ.శ. 330–394); మరియు అతని సోదరుడు కైసరయ కప్పదొకియ బిషప్ యైన బాసిల్ (క్రీ.శ. 329–379). ముగ్గురూ అరియనిజాన్ని వ్యతిరేకించారు, వీళ్ళు దేవుడు ముగ్గురు వ్యక్తులు కాని ఒక్కటే సబ్ స్టాన్స్ substance అని బోధించారు. క్రీ.శ 325లో నైసియాలో మరియు క్రీ.శ 381లో కాన్స్టాంటినోపుల్ (నేటి ఇస్తాంబుల్)లో జరిగిన చర్చి నాయకుల రెండు సమావేశాలు సత్య దేవున్ని గురించిన బైబిల్ బోధలకు కీలకమైన మద్దతునిచ్చాయి. ఆ రెండు గొప్ప సభల నుండే నేటి నిజ క్రైస్తవులందరూ ఒప్పుకొంటువున్న నికేయ విశ్వాస ప్రమాణము పుట్టుకొచ్చింది. త్రిత్వమును తిరస్కరించిన అరియస్ సిధ్ధాంతము నేటికీ యెహోవా సాక్షుల తప్పుడు బోధలలో బ్రతికే ఉంది.

దీని తర్వాత సాతాను యేసుక్రీస్తు పై దాడి చెయ్యడం ద్వారా తూర్పు క్రైస్తవుల విశ్వాసాన్ని కాన్ఫ్యూజ్ చెయ్యడానికి ప్రయత్నించాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు మరియు నిజమైన మానవుడు, అదే సమయంలో ఆయన ఫుల్లీ డివైన్ అండ్ ఫుల్లీ హ్యూమన్ అని బోధించడంలో లేఖనాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఒక తప్పుడు బోధకుడు యేసు యొక్క రెండు స్వభావాల యొక్క ప్రాథమిక సత్యాలను వక్రీకరించడం ద్వారా చర్చిలో విభేదాలను సృష్టించాడు. కాన్‌స్టాంటినోపుల్‌ లోని నెస్టోరియస్ అనే ఆర్చ్‌బిషప్ యేసులో రెండు స్వభావాలు పూర్తిగా వేరుగా వేరుగా ఉన్నాయని, యేసుకు రెండు స్వభావాలు మాత్రమే కాకుండా రెండు గుర్తింపులు మరియు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఆయనలో కలిసి ఉన్నారని బోధించాడు. విచారకరమైన విషయం ఏమిటంటే, నెస్టోరియనిజంచే పట్టబడిన చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ కు (సిరియా మరియు పర్షియాలో ఉన్న సంఘాలకు) సామ్రాజ్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న సంఘాలకు మధ్య ద్వేషం పెరిగింది. నెస్టోరియస్ మరియు అతని బోధనలు చివరికి క్రీ.శ. 431లో కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్‌లో మరియు క్రీ.శ. 451లో కౌన్సిల్ ఆఫ్ చాల్సెడాన్‌లో ఖండించబడ్డాయి. క్రీ.శ. 431లో కౌన్సిల్ ఆఫ్ ఎఫెసస్ నెస్టోరియనిజాన్ని తిరస్కరించినప్పుడు, ఆ తూర్పు సంఘాలు విడిపోయాయి.

గ్రీకుల స్పెకులెటివ్ మైండ్ యేసు యొక్క రెండు స్వభావాలు అనే రిడిల్ ని విప్పలేకపోయింది. కాన్‌స్టాంటినోపుల్‌లోని యూటీచెస్ (క్రీ.శ. 431-451) అనే సన్యాసి, అలాగే నైరుతి ఆసియా మైనర్‌లోని హలికర్నాసస్‌కు చెందిన జూలియన్ (క్రీ.శ. 527) మరియు ఇతరులు, యేసు నిజంగా దైవం మాత్రమే అని బోధించారు అంటే, క్రీస్తులో మానవ స్వభావం పూర్తిగా దైవిక స్వభావంతో శోషించబడిందని, ఆయన కేవలం దైవిక స్వభావాన్ని మాత్రమే కలిగియున్నాడనే బోధ. మోనోఫిజిటిజం అనే ఈ ఆలోచన ఈజిప్టు (కోప్ట్స్), ఇథియోపియా మరియు అర్మేనియాలోని క్రైస్తవులకు, అలాగే నెస్టోరియన్లు కాని సిరియన్లలో కూడా వ్యాపించింది. ఏదేమైనప్పటికీ, 451లో ఆసియా మైనర్‌లో జరిగిన ముఖ్యమైన కౌన్సిల్ ఆఫ్ చాల్సెడాన్‌లో యేసు యొక్క పూర్తి మానవత్వం పూర్తిగా నొక్కిచెప్పబడింది మరియు ఆ అభిప్రాయం క్రైస్తవమత సామ్రాజ్యం అంతటా ప్రబలంగా వ్యాపించింది.

దేవుని కృపలో, గ్నోస్టిసిజం, మోంటనిజం, అరియానిజం, నెస్టోరియనిజం, అడాప్షనిజం మరియు మోనోఫిజిటిజం లాంటి తప్పుడు బోధలు, కొంతకాలం చాలా మందిని తప్పుదారి పట్టించినప్పటికీ, సార్వత్రిక సంఘములో పెద్దగా ప్రబలంగా లేవు. ఇవి పట్టించుకోకుండా వదిలివేయడానికి చిన్న విషయాలేమి కాదు. అవి లైఫ్ అండ్ డెత్ టీచింగ్స్. మన రక్షణ పూర్తిగా మానవుడైన రక్షకునిపై ఆధారపడి ఉంది, ఆయన దేవుని ధర్మశాస్త్రము క్రింద మీ కొరకు నా కొరకు వ్యక్తిగత ప్రత్యామ్నాయంగా దానిని నెరవేర్చియున్నాడు. నిజమైన మానవ శ్రమలతో దేవుని ఉగ్రతను అనుభవించియున్నాడు. అట్లే ఆయన సంపూర్ణముగా దేవుడే, ఆయన రక్తం అన్ని కాలాల్లో ఉన్న అందరి కొరకై ప్రాయశ్చిత్త పాపపరిహార్ద బలిగా, అర్పణగా సంపూర్ణముగా చెల్లించబడింది, (గతం, వర్తమానం మరియు భవిష్యత్తు లోని మానవాళి అంతటి కొరకు).

ఈ విభేదాలు ఆసియా మైనర్‌లోని క్రైస్తవులను విభజించి విచ్చిన్నము చెయ్యటానికి ఎంతగానో ప్రయత్నించాయి. ఇవే చెడ్డగా ఉన్నాయని అనుకొంటే, వచ్చేవి వీటికంటే ఇంకా ఘోరమైనవనే చెప్పాలి. క్రీ. శ. 632లో మహమ్మద్ అనే అరబ్ మత నాయకుడు మరణించిన తరువాత, అతని ముస్లిం అనుచరులు అరబ్ నుండి బయటపడ్డారు, ఇస్లాం పతాకం క్రింద అరబ్బులందరినీ ఒక దేశంగా ఏకం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సైన్యాలు క్రైస్తవులు బలహీనంగా అవ్యవస్థీకృతముగా ఉన్న సమయంలో వారిపై దాడి చేసాయి. క్రీ. శ. 636లో యర్ముక్ యుద్ధంలో ముస్లింలు విజయం సాధించారు. క్రీ.శ. 648 నాటికి అరేబియా, సిరియా, మెసొపొటేమియా, ఈజిప్ట్ మరియు పాలస్తీనా (జెరూసలేంతో సహా) ముస్లింల నియంత్రణలోకి వచ్చాయి. క్రైస్తవ ఉనికి తగ్గిపోవడం ప్రారంభమైంది. క్రీ. శ. 717 నాటికి అరబ్బులు కాన్స్టాంటినోపుల్ రాజధానిపై దాడి చేసేంత బలంగా ఉన్నారు, అయినప్పటికీ ఆ దాడి విఫలమైంది. క్రీ. శ. 1071 నాటికి, తూర్పు అనటోలియాలోని మాంజికెర్ట్ యుద్ధంలో, బైజాంటైన్ క్రైస్తవులు ఆసియా మైనర్‌పై నియంత్రణను కోల్పోయారు. తద్వారా వారు ఐరోపాలో ఇప్పటికీ కలిగి ఉన్న కొద్దిపాటి భూభాగానికి వెనుదిరగవలసి వచ్చింది. తద్వారా ఆసియా మైనర్ యొక్క గొప్ప భూభాగము ముస్లిం టర్క్‌ల దండయాత్రలకు మరియు స్థిరనివాసానికి తెరతీసింది. కాన్స్టాంటినోపుల్ చివరకు 1453లో పడిపోయింది. ఈ రోజు టర్కీలో 98 శాతం ముస్లింలు ఉన్నారు, అక్కడ క్రైస్తవ ఉనికి చాలా చాలా తక్కువ.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.