ఈ ఆర్టికల్ ని A Voice of a Shepherd Publishing house Pvt. Ltd తరఫున రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారు అందిస్తున్నారు.

ప్రచురణ: A Voice of a Shepherd Publishing House Pvt. Ltd.
రచన: రెవ. కూరపాటి విజయ్ కుమార్

పరిశుద్ధ భోజనం గురించి క్రైస్తవ సంఘాలలో ఎందుకు ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి?

పరిచయం

పరిశుద్ధ భోజనం (Holy Communion), ప్రభువు బల్ల (The Lord’s Supper), లేదా ప్రభువు రాత్రి భోజనం (The Lord’s Table) అనేది క్రైస్తవ సంఘ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు తన శ్రమలు, మరణానికి ముందు తన శిష్యులతో కలిసి చివరి భోజనం చేసినప్పుడు దీనిని స్థాపించాడు. ఆ సమయంలో ఆయన రొట్టెను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, విరిచి శిష్యులకు ఇస్తూ, “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము” అని చెప్పాడు. అలాగే పాత్రను ఇచ్చి, “ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన కలిగిన క్రొత్త నిబంధన” అని ప్రకటించాడు (మత్తయి 26:26–28; మార్కు 14:22–24; లూకా 22:19–20).

అయితే, క్రైస్తవ సంఘాలన్నీ పరిశుద్ధ భోజనం యేసుక్రీస్తు స్థాపించినదని అంగీకరించినప్పటికీ, దాని అర్థం, అందులో క్రీస్తు సన్నిధి, రొట్టె మరియు ద్రాక్షారస స్వభావం, దానిని ఆచరించే విధానం వంటి విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ భిన్నాభిప్రాయాలకు ప్రధాన కారణం ఏమిటంటే, యేసు చెప్పిన మాటలను, పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశాన్ని, దాని ద్వారా దేవుడు మనకు అందించే ఆశీర్వాదాలను సంఘాలు వేర్వేరు విధాలుగా అర్థం చేసుకోవడం. ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, మొదట బైబిలు పరిశుద్ధ భోజనం గురించి ఏమి బోధిస్తుందో తెలుసుకోవాలి.

1. పరిశుద్ధ భోజనాన్ని ఎవరు స్థాపించారు?

పరిశుద్ధ భోజనం మనుషులు ప్రారంభించిన ఆచారం కాదు. దానిని స్వయంగా మన ప్రభువైన యేసుక్రీస్తే స్థాపించాడు. యేసు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేస్తున్నప్పుడు రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి వారికిచ్చాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు: “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి”— లూకా 22:19 తరువాత పాత్రను తీసుకొని ఇలా చెప్పాడు: “ఈ పాత్ర మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తమువలన కలిగిన క్రొత్త నిబంధన” — లూకా 22:20. ఈ మాటల ద్వారా యేసు పరిశుద్ధ భోజనాన్ని తన శిష్యులకు ఇచ్చాడు. అంతేకాక, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ భోజనాన్ని కొనసాగించాలని ఆజ్ఞాపించాడు.

పౌలు కూడా ఈ విషయాన్ని కొరింథీయులకు వివరించాడు: “మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు” (1 కొరింథీయులకు 11:26). అందువల్ల పరిశుద్ధ భోజనం క్రీస్తు స్థాపించినది; సంఘం తన ఇష్టానుసారం సృష్టించిన ఆచారం కాదు.

2. పరిశుద్ధ భోజనం గురించి భిన్నాభిప్రాయాలు ఎందుకు ఏర్పడ్డాయి?

పరిశుద్ధ భోజనం గురించి అనేక ప్రశ్నలు క్రైస్తవ సంఘాలలో చర్చలకు, భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి.

మొదటిది: “ఇది నా శరీరము” అనే యేసు మాటల అర్థం ఏమిటి? యేసు రొట్టెను చూపిస్తూ “ఇది నా శరీరము” అని చెప్పినప్పుడు, ఆయన నిజంగానే తన శరీరాన్ని రొట్టెతో కలిపి ఇచ్చాడా? లేక రొట్టె తన శరీరానికి గుర్తుగా మాత్రమే ఉందని చెప్పాడా? ఈ ప్రశ్నకు సంఘాలు వేర్వేరు సమాధానాలు ఇచ్చాయి.

రెండవది: క్రీస్తు పరిశుద్ధ భోజనంలో ఏ విధంగా సన్నిహితంగా ఉన్నాడు? కొన్ని సంఘాలు రొట్టె, ద్రాక్షారసం క్రీస్తు శరీరరక్తాలుగా మారుతాయని బోధిస్తాయి. మరికొన్ని సంఘాలు అవి కేవలం జ్ఞాపకార్థమైన చిహ్నాలని చెబుతాయి. ఇంకొన్ని సంఘాలు క్రీస్తు ఆత్మీయంగా సన్నిహితంగా ఉంటాడని బోధిస్తాయి.

మూడవది: పరిశుద్ధ భోజనం ద్వారా మనకు ఏమి లభిస్తుంది? ఇది కేవలం యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమమా? లేక దేవుడు తన క్షమాపణను, కృపను మనకు అందించే సాధనమా? ఈ ప్రశ్న కూడా ప్రధానమైన భేదానికి కారణమైంది.

నాలుగవది: పరిశుద్ధ భోజనాన్ని ఎంత తరచుగా ఆచరించాలి? కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం ఆచరిస్తాయి. మరికొన్ని నెలకు ఒకసారి లేదా ఇతర నిర్ణీత సందర్భాలలో ఆచరిస్తాయి.

ఐదవది: దానిని ఏ విధంగా నిర్వహించాలి? పులిసిన ద్రాక్షారసం ఉపయోగించాలా, మామూలు ద్రాక్షరసం ఉపయోగించాలా? రొట్టె ఎలా ఉండాలి? ఎవరు దానిని అందించాలి? పరిశుద్ధ భోజనానికి ముందు పాపస్వీకారం అవసరమా? వంటి ప్రశ్నలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే స్థాయిలో ప్రాముఖ్యత లేదు. కొన్ని విషయాలు ఆచరణకు సంబంధించినవి మాత్రమే; మరికొన్ని క్రైస్తవ విశ్వాసంలోని ముఖ్యమైన సిద్ధాంతాలను ప్రభావితం చేస్తాయి.

3. పరిశుద్ధ భోజనం గురించి బైబిలు మనకు ఏమి తెలియజేస్తుంది?

యేసు చివరి భోజనం గురించి మత్తయి 26:26–29, మార్కు 14:22–25, లూకా 22:14–20 మరియు 1 కొరింథీయులకు 11:23–29 వాక్యభాగాలు వివరంగా తెలియజేస్తున్నాయి.

ఈ వాక్యభాగాలను కలిపి పరిశీలించినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి.

3.1 యేసు రొట్టెను తీసుకొని తన శరీరమని చెప్పాడు: యేసు రొట్టెను తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. “ఇది నా శరీరము” అని చెప్పాడు (మత్తయి 26:26). ఇక్కడ మనం యేసు మాటలను తేలికగా తీసుకోకూడదు. ఆయన చెప్పిన దానిని మనుషుల అభిప్రాయాల ఆధారంగా మార్చకుండా, ఆయన మాటలనే విశ్వసించాలి.

3.2 యేసు పాత్రను తన రక్తమని చెప్పాడు: యేసు పాత్రను ఇచ్చి, అందులోని ద్రాక్షారసాన్ని తన రక్తమని, అది పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతుందని చెప్పాడు (మత్తయి 26:27–28). ఇక్కడ ఆయన తన సిలువ మరణాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడు. మన పాపాల క్షమాపణ కోసం ఆయన తన రక్తాన్ని చిందించబోతున్నాడు.

3.3 శిష్యులందరూ ఆ భోజనంలో పాల్గొనాలని యేసు ఆజ్ఞాపించాడు: “మీరందరు దీనిలోనిది త్రాగుడి” అని యేసు చెప్పాడు (మత్తయి 26:27). అందువల్ల పరిశుద్ధ భోజనం కేవలం కొందరు వ్యక్తులు చేసే ప్రత్యేకమైన ఆచారం కాదు. అది క్రీస్తు తన సంఘానికి ఇచ్చిన వరం.

3.4 యేసు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని ఆయన ఆజ్ఞాపించాడు (లూకా 22:19).

పౌలు కూడా పరిశుద్ధ భోజనంలో పాల్గొనడం ద్వారా మనం ప్రభువు మరణాన్ని ఆయన తిరిగి వచ్చేవరకు ప్రకటిస్తున్నామని బోధించాడు (1 కొరింథీయులకు 11:26).

3.5 దేవుని రాజ్యంలో క్రీస్తుతో తిరిగి కలుసుకునే నిరీక్షణ ఉంది: యేసు తన శిష్యులతో మాట్లాడుతూ, తన తండ్రి రాజ్యంలో వారితో కలిసి కొత్తగా ద్రాక్షారసాన్ని పానము చేసే దినం వరకు తాను దానిని త్రాగనని చెప్పాడు (మత్తయి 26:29).

అందువల్ల పరిశుద్ధ భోజనం కేవలం గతంలో జరిగిన సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు; క్రీస్తు తిరిగి వచ్చి తన ప్రజలతో నిత్యమైన ఆనందంలో పాలుపంచుకునే భవిష్యత్తును కూడా మనకు గుర్తుచేస్తుంది.

4. పరిశుద్ధ భోజనం గురించి ప్రధానమైన నాలుగు సిద్ధాంతాలు

క్రైస్తవ చరిత్రలో ముఖ్యంగా నాలుగు విధాలైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా సంఘాల మధ్య ఉన్న భేదాలను అర్థం చేసుకోవచ్చు.

4.1 రొట్టె మరియు ద్రాక్షారసం క్రీస్తు శరీరరక్తాలుగా మారుతాయి — రూపాంతర సిద్ధాంతం (Transubstantiation). రోమన్ కాథలిక్ సంఘం ప్రధానంగా ఈ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ఈ బోధ ప్రకారం, పరిశుద్ధ భోజనంలో ప్రీస్ట్ ప్రార్థన చేసినప్పుడు రొట్టె యొక్క అసలు స్వభావం క్రీస్తు శరీరంగా, ద్రాక్షారసం యొక్క అసలు స్వభావం క్రీస్తు రక్తంగా మారుతాయి. బయటికి అవి రొట్టె, ద్రాక్షారసంలాగే కనిపించినప్పటికీ, వాటి అంతరార్థ స్వభావం మారుతుందని వారు నమ్ముతారు.

అయితే ఈ బోధను లూథరన్ సంఘం అంగీకరించదు. ఎందుకంటే యేసు రొట్టెను తన శరీరమని, పాత్రలోని ద్రాక్షారసాన్ని తన రక్తమని చెప్పాడు; కానీ అవి తమ స్వభావాన్ని కోల్పోయి వేరే పదార్థాలుగా మారాయని చెప్పలేదు.

4.2 క్రీస్తు శరీరరక్తాలు రొట్టె, ద్రాక్షారసంతో కలిసి నిజంగా ఇవ్వబడతాయి — లూథరన్ బోధ

లూథరన్ సంఘం యేసు మాటలను అక్షరార్థంలో స్వీకరిస్తుంది. యేసు “ఇది నా శరీరము”, “ఇది నా రక్తము” అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి పరిశుద్ధ భోజనంలో రొట్టె నిజమైన రొట్టెగానే, ద్రాక్షారసం నిజమైన ద్రాక్షారసంగానే ఉంటాయి; అదే సమయంలో క్రీస్తు నిజమైన శరీరరక్తాలు కూడా వాటితో కలిసి ఇవ్వబడతాయి.

దీనిని కొన్నిసార్లు Consubstantiation అని పిలుస్తారు. అయితే లూథరన్ విశ్వాసాన్ని వివరించడానికి ఈ పదం పూర్తిగా సరైనది కాదు. లూథరన్ విశ్వాస ప్రకటనలు ఈ విషయాన్ని “క్రీస్తు శరీరరక్తాలు రొట్టె మరియు ద్రాక్షారసంతో కలిసి, వాటి ద్వారా నిజంగా ఇవ్వబడుతున్నాయి” అని వివరిస్తాయి.

ఇది కేవలం ఒక ఆత్మీయ భావన మాత్రమే కాదు. క్రీస్తు తన వాక్యానుసారం నిజంగానే తన శరీరరక్తాలను పరిశుద్ధ భోజనంలో మనకు ఇస్తున్నాడు.

1 కొరింథీయులకు 10:16లో పౌలు ఇలా అడుగుతున్నాడు: “మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? –మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?” ఈ వాక్యం పరిశుద్ధ భోజనంలో క్రీస్తు శరీరరక్తాలతో నిజమైన భాగస్వామ్యం ఉందని తెలియజేస్తుంది.

4.3 పరిశుద్ధ భోజనం కేవలం జ్ఞాపకార్థమైన ఆచారం — జ్ఞాపకార్థ సిద్ధాంతం (Memorial View)

ఈ అభిప్రాయం ముఖ్యంగా జ్వింగ్లీ బోధనతో సంబంధం కలిగి ఉంది. అనేక బాప్టిస్టు సంఘాలు కూడా ఈ అభిప్రాయానికి దగ్గరగా ఉంటాయి. ఈ బోధ ప్రకారం, రొట్టె క్రీస్తు శరీరానికి, ద్రాక్షారసం ఆయన రక్తానికి గుర్తులు మాత్రమే. వాటిలో క్రీస్తు శరీరరక్తాలు నిజంగా ఉండవు. విశ్వాసులు వాటిని తీసుకోవడం ద్వారా యేసు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.

ఈ అభిప్రాయాన్ని సమర్థించేవారు యేసు ఇతర సందర్భాలలో కూడా ఉపమాన భాషను ఉపయోగించాడని చెబుతారు. ఉదాహరణకు, “నేనే ద్వారమును” (యోహాను 10:9), “నేనే ద్రాక్షావల్లిని” (యోహాను 15:5) అని చెప్పినప్పుడు ఆయన భౌతికంగా ద్వారమో, ద్రాక్షావల్లినో కాలేదు. అలాగే “ఇది నా శరీరము” అన్న మాటను కూడా సింబాలిక్ గా అర్థం చేసుకోవాలని వారు భావిస్తారు.

అయితే లూథరన్ సంఘం ఈ వివరణను అంగీకరించదు. ఎందుకంటే యేసు తన శరీరాన్ని, రక్తాన్ని పరిశుద్ధ భోజనంలో నిజంగా ఇస్తానని చెప్పిన మాటలను కేవలం గుర్తులుగా మార్చడం ఆయన వాక్యాన్ని తగ్గించినట్లవుతుంది.

4.4 క్రీస్తు ఆత్మీయంగా సన్నిహితంగా ఉంటాడు — ఆత్మీయ సన్నిధి సిద్ధాంతం (Spiritual Presence)

ఈ అభిప్రాయం ముఖ్యంగా కాల్విన్ బోధనతో సంబంధం కలిగి ఉంది. అనేక రిఫార్మ్డ్ సంఘాలు ఈ అభిప్రాయాన్ని అనుసరిస్తాయి. ఈ బోధ ప్రకారం, రొట్టె మరియు ద్రాక్షారసం క్రీస్తు శరీరరక్తాలుగా మారవు. క్రీస్తు తన శరీరంతో భౌతికంగా భూమిపై ఉన్నాడని కూడా వారు చెప్పరు. అయితే పరిశుద్ధ భోజనంలో విశ్వాసులు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుతో ఆత్మీయ సహవాసాన్ని అనుభవిస్తారని బోధిస్తారు.

ఈ అభిప్రాయం కేవలం జ్ఞాపకార్థ సిద్ధాంతం కంటే భిన్నమైనది. ఎందుకంటే ఇందులో పరిశుద్ధ భోజనం ద్వారా విశ్వాసికి క్రీస్తుతో నిజమైన ఆత్మీయ సంబంధం కలుగుతుందని చెబుతారు.

అయితే లూథరన్ సంఘం క్రీస్తు సన్నిధిని కేవలం ఆత్మీయమైన లేదా అంతరంగ అనుభవంగా మాత్రమే పరిమితం చేయదు. యేసు తన శరీరరక్తాలను నిజంగా ఇస్తానని చెప్పినందున, ఆయన మాటలను అలాగే అంగీకరిస్తుంది.

5. పరిశుద్ధ భోజనం కేవలం జ్ఞాపకార్థమైనదా? లేక కృపను అందించే సాధనమా?

ఇది పరిశుద్ధ భోజనం గురించి ఉన్న అత్యంత ముఖ్యమైన సిద్ధాంతపరమైన ప్రశ్నలలో ఒకటి. కొన్ని సంఘాలు పరిశుద్ధ భోజనం ద్వారా దేవుడు ప్రత్యేకమైన కృపను అందించడని, అది ప్రధానంగా యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకునే ఆచారమని బోధిస్తాయి.

కానీ లూథరన్ బోధ ప్రకారం పరిశుద్ధ భోజనం దేవుడు మనకు ఇచ్చిన కృపా సాధనం (Means of Grace). అంటే దేవుడు తన వాక్య వాగ్దానం ద్వారా మనకు పాపక్షమాపణను, విశ్వాసాన్ని బలపరచే ఆశీర్వాదాన్ని అందిస్తాడు.

యేసు పాత్రను ఇచ్చినప్పుడు ఇలా చెప్పాడు: “ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” (మత్తయి 26:28).

గమనించండి: యేసు తన రక్తాన్ని కేవలం జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే చెప్పలేదు. ఆ రక్తం పాపక్షమాపణతో సంబంధం కలిగి ఉందని స్పష్టంగా ప్రకటించాడు.

అలాగే 1 కొరింథీయులకు 11:27–29లో పౌలు పరిశుద్ధ భోజనాన్ని నిర్లక్ష్యంగా స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ అది కేవలం సాధారణ రొట్టె, ద్రాక్షారసం మాత్రమే అయితే, దానిని అపవిత్రంగా స్వీకరించడం వల్ల ఇంత తీవ్రమైన ఆత్మీయ బాధ్యత ఎందుకు ఉంటుందనే ప్రశ్న వస్తుంది.

కాబట్టి లూథరన్ విశ్వాసం ప్రకారం పరిశుద్ధ భోజనం ఒక సాధారణ జ్ఞాపక కార్యక్రమం కాదు. ఇది క్రీస్తు తన సంఘానికి ఇచ్చిన పవిత్రమైన వరం. ఇందులో ఆయన నిజమైన శరీరరక్తాలను రొట్టె, ద్రాక్షారసంతో కలిసి అందిస్తూ, తన క్షమాపణ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తాడు.

6. పరిశుద్ధ భోజనంలో పాల్గొనడం ద్వారా మనం రక్షణను సంపాదిస్తున్నామా?

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనుషులు తమ క్రియల ద్వారా రక్షణను సంపాదించలేరు. మన రక్షణ దేవుని కృపవలన, విశ్వాసం ద్వారా కలుగుతుంది. “మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే” (ఎఫెసీయులకు 2:8–9).

పరిశుద్ధ భోజనంలో పాల్గొనడం ద్వారా మనం రక్షణను కొనుగోలు చేయడం లేదు. దేవుడు తన వాగ్దానం ద్వారా ఉచితంగా అందించే క్షమాపణను విశ్వాసంతో స్వీకరిస్తున్నాము.

అయితే పరిశుద్ధ భోజనం అవసరం లేదని, దానిని నిర్లక్ష్యం చేయవచ్చని దీని అర్థం కాదు. క్రీస్తు స్వయంగా దీనిని స్థాపించి, ఆచరించాలని ఆజ్ఞాపించాడు. కాబట్టి విశ్వాసి దానిని నిర్లక్ష్యం చేయకూడదు.

ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది: పరిశుద్ధ భోజనాన్ని ఆచరించడం ద్వారా మనం దేవుని అనుగ్రహాన్ని సంపాదించము; దేవుడు అందిస్తున్న అనుగ్రహాన్ని విశ్వాసంతో స్వీకరిస్తాము.

7. క్రీస్తు ఒక్కసారే చేసిన బలి మరియు పరిశుద్ధ భోజనం

పరిశుద్ధ భోజనం గురించి మరో ముఖ్యమైన ప్రశ్న: ప్రతి సారి పరిశుద్ధ భోజనం ఆచరించినప్పుడు క్రీస్తు మళ్లీ బలిగా అర్పించబడుతున్నాడా?

బైబిలు ప్రకారం క్రీస్తు తనను తాను ఒక్కసారే బలిగా అర్పించాడు. ఆయన బలి సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, మరలా చేయవలసిన అవసరం లేనిది. “క్రీస్తు మృతులలోనుండి లేపబడినవాడై ఇకను మృతిపొందడు; మరణమునకు ఇక ఆయనమీద అధికారము లేదు” (రోమీయులకు 6:9). హెబ్రీయులకు 9:26–28 కూడా క్రీస్తు అనేకుల పాపాలను భరించడానికి ఒక్కసారే అర్పించబడ్డాడని తెలియజేస్తుంది.

లూథరన్ బోధ ప్రకారం పరిశుద్ధ భోజనంలో క్రీస్తు మళ్లీ సిలువ వేయబడడు; ఆయన బలి మళ్లీ అర్పించబడదు. బదులుగా, సిలువపై ఒక్కసారే జరిగిన ఆయన బలి ఫలితమైన పాపక్షమాపణను క్రీస్తు తన వాక్య వాగ్దానం ద్వారా మనకు అందిస్తాడు.

కాబట్టి పరిశుద్ధ భోజనం క్రీస్తు బలిని పునరావృతం చేసే ఆచారం కాదు; ఆయన సంపూర్ణ బలి ద్వారా పొందిన క్షమాపణను మనకు అందించే కృపా వరం.

8. పరిశుద్ధ భోజనాన్ని ఎంత తరచుగా ఆచరించాలి?

పరిశుద్ధ భోజనం ఎంత తరచుగా ఆచరించాలనే విషయంపై కూడా సంఘాలలో భేదాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ప్రతి ఆదివారం ఆచరిస్తాయి. మరికొన్ని నెలకు ఒకసారి లేదా ఇతర సందర్భాలలో ఆచరిస్తాయి. 1 కొరింథీయులకు 11:25–26లో పౌలు “మీరు ఎన్నిసార్లు దీనిని త్రాగుదురో” అని చెబుతూ, ప్రభువు రాకడ వరకు ఆయన మరణాన్ని ప్రకటించాలని తెలియజేస్తున్నాడు.

అయితే యేసు ప్రతి వారం తప్పనిసరిగా ఆచరించాలా, లేక నెలకు ఒకసారి ఆచరించాలా అనే నిర్దిష్ట కాలవ్యవధిని నిర్ణయించలేదు. కాబట్టి ఆచరించే తరచుదనం విషయంలో సంఘాలకు కొంత స్వేచ్ఛ ఉంది. అయితే ఈ స్వేచ్ఛ పరిశుద్ధ భోజనం యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి ఉపయోగించకూడదు. సంఘం దానిని నిర్లక్ష్యం చేయకుండా, విశ్వాసులకు క్రమంగా అందించేలా చూడాలి.

9. పరిశుద్ధ భోజనానికి ముందు పాపస్వీకారం ఎందుకు ముఖ్యమైనది?

పరిశుద్ధ భోజనంలో పాల్గొనే వ్యక్తి తనను తాను పరిశీలించుకోవాలని పౌలు బోధిస్తున్నాడు. “కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువుయొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమునుగూర్చియు రక్తమునుగూర్చియు అపరాధియగును” (1 కొరింథీయులకు 11:27).

తరువాత ఆయన ఇలా చెబుతున్నాడు: “మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను” (1 కొరింథీయులకు 11:28).

దీని అర్థం పరిశుద్ధ భోజనంలో పాల్గొనడానికి ముందు మనం పాపరహితులుగా మారాలి అని కాదు. అలా అయితే ఎవ్వరూ దానిలో పాల్గొనలేరు. మనమందరం పాపులమే; మనకు క్రీస్తు క్షమాపణ అవసరం.

అయితే మన పాపాన్ని గుర్తించాలి, దాని విషయంలో పశ్చాత్తాపపడాలి, క్రీస్తు వాగ్దానాన్ని విశ్వసించాలి. క్రీస్తు శరీరరక్తాలు నిజంగా ఇవ్వబడుతున్నాయని విశ్వసించాలి.

అందువల్ల పాపస్వీకారం, ఆత్మపరిశీలన అనేవి మనల్ని భయపెట్టి క్రీస్తు నుండి దూరం చేయడానికి కాదు; మన పాపాన్ని గుర్తించి, ఆయన క్షమాపణను ఆశ్రయించడానికి సహాయపడతాయి.

10. పరిశుద్ధ భోజనంలో ఎవరు పాల్గొనాలి?

పరిశుద్ధ భోజనం ఒక సాధారణ సామూహిక భోజనం కాదు. ఇది క్రీస్తు శరీరరక్తాలు నిజంగా ఇవ్వబడే పవిత్రమైన సంస్కారం.

అందువల్ల ఇందులో పాల్గొనే వ్యక్తి:

  1. తన పాపాన్ని గుర్తించి పశ్చాత్తాపపడాలి.
  2. యేసుక్రీస్తు తన పాపాల కోసం మరణించాడని విశ్వసించాలి.
  3. క్రీస్తు మాట ప్రకారం రొట్టెతో పాటు ఆయన శరీరమును, పాత్రతో పాటు ఆయన రక్తమును స్వీకరిస్తున్నాడని నమ్మాలి.
  4. పరిశుద్ధ భోజనం గురించి సంఘం బోధిస్తున్న విశ్వాసంతో ఏకీభవించాలి.

అందుకే లూథరన్ సంఘాలలో పరిశుద్ధ భోజనానికి ముందు విశ్వాస బోధన, ఆత్మపరిశీలన, పాపస్వీకారం ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. అలాగే పరిశుద్ధ భోజనంలో పాల్గొనడం అనేది కేవలం వ్యక్తిగత విశ్వాస ప్రకటన మాత్రమే కాదు; అది ఆ సంఘం బోధించే విశ్వాసంతో ఐక్యతను కూడా తెలియజేస్తుంది.

ఈ కారణంగా లూథరన్ సంఘాలు సాధారణంగా బహిరంగంగా అందరికీ పరిశుద్ధ భోజనం ఇవ్వకుండా, తమ బోధతో ఏకీభవించిన మరియు తగిన బోధన పొందిన వారికే అందిస్తాయి. ఇది వ్యక్తులను తిరస్కరించడానికి కాదు; ప్రభువు భోజనాన్ని గౌరవించడానికి, పాల్గొనేవారి ఆత్మీయ మేలును కాపాడడానికి.

11. ఈ భిన్నాభిప్రాయాల మధ్య మనం ఏ విషయాన్ని ప్రాధాన్యంగా చూడాలి?

పరిశుద్ధ భోజనం గురించి అనేక సిద్ధాంతాలు, చర్చలు, వివాదాలు ఉన్నప్పటికీ, మనం ముఖ్యంగా మూడు విషయాలను గుర్తుంచుకోవాలి.

మొదటిది: యేసు మాటలే మనకు ఆధారం. మనుషుల అభిప్రాయాలు, సంప్రదాయాలు, తర్కాలు దేవుని వాక్యానికి మించినవి కావు. యేసు “ఇది నా శరీరము”, “ఇది నా రక్తము” అని చెప్పినప్పుడు, ఆ మాటలను విశ్వాసంతో స్వీకరించాలి.

రెండవది: క్రీస్తు సిలువ మరణమే మన రక్షణకు ఆధారం. పరిశుద్ధ భోజనం మన మంచి క్రియలను, మన అర్హతను ప్రకటించదు. అది మన పాపాల కోసం క్రీస్తు తన శరీరాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించిన సత్యాన్ని ప్రకటిస్తుంది.

మూడవది: పరిశుద్ధ భోజనం దేవుని కృపను స్వీకరించే సమయం. మన బలహీనతలు, పాపాలు, అపరాధభావం మధ్య క్రీస్తు మనకు తన క్షమాపణ వాగ్దానాన్ని అందిస్తున్నాడు. మనం మన అర్హతను బట్టి కాకుండా, ఆయన వాగ్దానాన్ని నమ్మి దానిలో పాల్గొంటాము.

ముగింపు

పరిశుద్ధ భోజనం గురించి క్రైస్తవ సంఘాలలో ఇన్ని భిన్నాభిప్రాయాలు ఉండడానికి ప్రధాన కారణం యేసు మాటలను, రొట్టె మరియు ద్రాక్షారసం యొక్క స్వభావాన్ని, క్రీస్తు సన్నిధిని, ఈ సంస్కారం ద్వారా దేవుడు అందించే ఆశీర్వాదాలను వేర్వేరు విధాలుగా అర్థం చేసుకోవడమే.

కొన్ని విషయాలు ఆచరణకు సంబంధించినవి. ఉదాహరణకు, ప్రతి వారం ఆచరించాలా లేక నెలకు ఒకసారి ఆచరించాలా అనే ప్రశ్న. కానీ కొన్ని విషయాలు చాలా ముఖ్యమైన సిద్ధాంతాలకు సంబంధించినవి. ఉదాహరణకు, క్రీస్తు నిజమైన శరీరరక్తాలు పరిశుద్ధ భోజనంలో ఇవ్వబడుతున్నాయా? పాపక్షమాపణ అందించబడుతున్నదా? అనే ప్రశ్నలు.

లూథరన్ విశ్వాసం ప్రకారం, పరిశుద్ధ భోజనంలో రొట్టె మరియు ద్రాక్షారసంతో పాటు క్రీస్తు నిజమైన శరీరరక్తాలు ఇవ్వబడుతున్నాయి. ఇది మనుషుల ఊహ కాదు; యేసు స్వయంగా ఇచ్చిన వాగ్దానం. ఈ భోజనం ద్వారా ఆయన మనకు పాపక్షమాపణను, విశ్వాస బలాన్ని అందిస్తున్నాడు.

మన రక్షణ మన క్రియలవలన కాదు, దేవుని కృపవలన మాత్రమే. క్రీస్తు ఒక్కసారే మన పాపాల కోసం తనను తాను బలిగా అర్పించాడు. ఆయన మరణం, పునరుత్థానం మన రక్షణకు సంపూర్ణమైన ఆధారం. పరిశుద్ధ భోజనంలో ఆయన ఆ క్షమాపణ వాగ్దానాన్ని మనకు అందిస్తున్నాడు.

కాబట్టి పరిశుద్ధ భోజనంలో పాల్గొనేటప్పుడు మనం కేవలం ఒక మతాచారాన్ని ఆచరిస్తున్నామని భావించకూడదు. మన పాపాల కోసం మరణించిన, తిరిగి లేచిన మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన అమూల్యమైన వరాన్ని విశ్వాసంతో స్వీకరిస్తున్నామని గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన ఆత్మీయ సత్యం: పరిశుద్ధ భోజనం మనం దేవునికి ఏదో సమర్పించి ఆయన కృపను సంపాదించే ఆచారం కాదు. అది క్రీస్తు తన శరీరరక్తాలను మనకు ఇచ్చి, తన పాపక్షమాపణ వాగ్దానంతో మనలను బలపరిచే కృపా వరం.

ప్రియమైన సహోదర సహోదరీలకు క్రీస్తులో వందనాలు! దేవుని పరిశుద్ధ వాక్యాన్ని దాని స్వచ్ఛతలో, బైబిలు బోధిస్తున్నట్లుగా ప్రజలందరికీ, అన్ని భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ పరిచర్య కొనసాగుతోంది. ఈ సేవకు ఎంతో సమయం, శ్రమ, ప్రార్థన, ఆర్థిక వనరులు అవసరం. కాబట్టి, ఈ పరిచర్యను మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి, సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడానికి, ప్రజలకు అందించడానికి అవసరమైన జ్ఞానాన్ని, ఆత్మీయ బలాన్ని, ఆరోగ్యాన్ని, సహకారాన్ని, తగిన వనరులను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించండి. ఈ పరిచర్య ద్వారా అనేకమంది దేవుని వాక్యాన్ని తెలుసుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా లభించే పాపక్షమాపణను, రక్షణను విశ్వసించి, విశ్వాసంలో ఎదగాలని ప్రార్థిద్దాం. మీ ప్రార్థనల ద్వారా, అలాగే దేవుడు మీకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి, మీకు ఇష్టమైన సహకారం ద్వారా ఈ సేవలో భాగస్వాములు కావలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. “దేవుని వాక్యము వ్యాపించుచు మహిమపరచబడునట్లు ప్రార్థించుడి” — 2 థెస్సలొనీకయులకు 3:1. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక! కృతజ్ఞతలతో,
రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl