బాప్తిస్మము అంటే ఏమిటి? అది ఎవరికివ్వాలి? బాప్తిస్మములో ముంచుట మాత్రమే కరెక్టా?

బాప్తిస్మము అనేది ఒక పరిశుద్ధ సంస్కరము. అది పరిశుద్ధమైన క్రియయై యుండి మూడు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంది.
1. అది దేవునిచే/ క్రీస్తుచే స్థాపించబడింది (ఏర్పర్చబడింది) మరియు క్రైస్తవులు ఆచరించుటకై ఆజ్ఞాపించబడింది.
2. దేవుని వాక్యంతో జతచేసి భూసంబంధమైన వస్తువులను (నీరు,రొట్టె,ద్రాక్షారసము) అందు వాడవలెనని క్రీస్తు చెప్పాడు.
3. అందు క్రీస్తు పాపక్షమాపణను, తత్ఫలితముగా జీవమును, రక్షణను ప్రకటించుచున్నాడు, అనుగ్రహించుచున్నాడు మరియు ముద్రించుచున్నాడు.

బాప్తిస్మములో, దేవుడు మన హృదయాలలో విశ్వాసాన్ని కలుగజేస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు పునర్జన్మను మరియు పునరుద్ధరణను ఇస్తాడు. ఇది దేవుని కృప యొక్క బహుమతి, ఇది పాప క్షమాపణ, కొత్త జీవితం మరియు రక్షణను ఇస్తుంది, అపొ. కార్య. 2:38, పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. బాప్తిస్మములో దేవుడు సమస్త పాపములను (జన్మ కర్మ పాపములను) సంపూర్ణముగా క్షమించుచున్నాడు.

దేవుడు ఎవరికి బాప్తిస్మం ఇవ్వమని ఆజ్ఞాపించాడు? మత్తయి 28:19,20, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. సమస్త జనులు అనే మాటకు గ్రీకులో ἔθνη అనే మాట వాడబడింది దీని అర్ధం అన్ని దేశాలు. అన్ని దేశాలకు బాప్తిస్మం ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడు, మార్కు 16:15, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అన్ని దేశాలు/సర్వలోకములో అందరూ, అన్ని జాతుల వారు, దేశాల వారు తెగలు, స్త్రీలు పురుషులు ముసలివాళ్ళు పెద్దలు పిల్లలు శిశువులు అందరూ ఉన్నారు.

బాప్తిస్మము ప్రకటిస్తున్న క్షమాపణ మరియు రక్షణ అవసరమైన వారందరికీ ఇవ్వవలసి ఉన్నాం. ఇది దేవుని కృప యొక్క బహుమతి, బాప్తిస్మము వీటిని అందిస్తుంది.

బాప్తిస్మము అనేది దేవుని కృపా సాధనం, దీని ద్వారా దేవుడు పాపాలను క్షమిస్తాడు, విశ్వాసం ఇస్తాడు, రక్షిస్తాడు. అపొస్తలుల కార్యములు 2:38, తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పాపులందరికీ ఈ శుద్ధి అవసరం. బాప్తిస్మము పాపాత్ములను రక్షిస్తుంది, 1 పేతురు 3:21, బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది.

బాప్తిస్మము ఎందుకు ముఖ్యమైనది? ఎందుకంటే అందు దేవుడు ఒకని పాపాలను క్షమించి, క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు. బాప్తిస్మము విశ్వాసులను ఆయనతో ఏకం చేసే కృపకు మార్గం.

బాప్తిస్మం పుచ్చుకొన్న వారందరికీ బాప్తిసం ఎలాంటి దీవెనలను ఇస్తుంది? బాప్తిసంలో, దేవుడు మన పాప స్వభావాన్ని (పాత ఆదామును) మరణానికి గురిచేసి, క్రీస్తులో (నూతన పురుషుడిని) కొత్త జీవితాన్ని ఇస్తాడు. బాప్తిస్మం మనల్ని సిలువపై యేసు రక్షణ పనికి అనుసంధానిస్తుంది కాబట్టి మనం క్షమాపణ పొందుతాం. మనం పరిశుద్దాత్మ ద్వారా దేవుని పిల్లలుగా తిరిగి జన్మిస్తాం. దేవుడు మనల్ని తన కుటుంబంలోకి దత్తత తీసుకుంటాడు మరియు మనల్ని తన వాగ్దానాలకు వారసులుగా చేస్తాడు. మనం క్రీస్తుతో ధరించబడ్డాము, ఆయన మరణం మరియు పునరుత్థానంలో ఆయనతో ఐక్యమవుతాం. ఆత్మ ద్వారా, ఆయన కొత్త సృష్టిగా జీవించడానికి మనం ప్రతిరోజూ పునరుద్ధరించబడతాం.

బాప్తిస్మములో నీటిని ఎలా ఉపయోగించామనేది ముఖ్యమా? వర్తించే విధానం (ముంచడం చిలకరించడం) బాప్తిస్మానికి దాని శక్తిని ఇస్తుందా? ఆలోచించండి.

హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమై యున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని ఉంది చూడండి. స్థితిని పునరుద్ధరించడానికి చేసే శుద్ధికరణములో విభిన్నమైన ప్రక్షాళనలు ఉండేవి అని ఈ వచనము తెలియజేస్తూవుంది. రబ్బానిక్ సాహిత్యం ముఖ్యంగా యూదు మతంలోకి మారే అన్యజనులు సున్నతి మరియు మతమార్పిడి బాప్టిజం పొందుకోవాలని మరియు నైవేద్యాన్ని సమర్పించాలని చెప్తూవుంది. ఈ ఆచారాలు దేవుడు ఎన్నుకున్న సమాజములోనికి వారిని చేర్చుకొనటమే కాకుండా వారికి పూర్తి హక్కులు కలిగించేవి. కాబట్టి యోహాను బాప్తిస్మము క్రొత్త విషయమేమి కాదు అది వారికి వింతగా అనిపించలేదు.

కాని ఇక్కడ యోహాను యూదులు పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పాడు, తద్వారా వారు అన్యజనుల కంటే గొప్పవారు కాదని సూచించాడు. ఇది క్రొత్తగా ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను ఆనాడు యూదులు ఉపయోగించే బాప్తిస్మమును తన పరిచర్యలో వాడుకున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్మం ఏ విధముగా ఇచ్చాడో మనం ఖచ్చితంగా చెప్పలేము. అతడు ముంచుట ద్వారా బాప్తిస్మము ఇచ్చాడు అనే అభిప్రాయం నిరూపించబడదు. బాప్టిజం అనే పదం నీటితో రకరకాలుగా కడిగే పద్ధతులను వివరించడానికి బైబిలులో ఉపయోగించబడింది.

ఈ విషయాన్నే మార్కు 7:1-4 చెప్తూవున్నాయి, చదువుకొందాం: 1యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి 2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. 3పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 4మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారములను వారనుసరించెడి వారు. Mark 7:4 καὶ ἀπ’ ἀγορᾶς ἐὰν μὴ βαπτίσωνται οὐκ ἐσθίουσιν, καὶ ἄλλα πολλά ἐστιν ἃ παρέλαβον κρατεῖν, βαπτισμοὺς ποτηρίων καὶ ξεστῶν καὶ χαλκίων [καὶ κλινῶν]. నీళ్లు చల్లుకొంటేనే అనే మాటకు ఇక్కడ గ్రీకు బైబిలులో (బాప్టిసొంటాయి) అనే మాట వాడబడింది. అట్లే నీళ్లలో కడుగుట అనే మాటకు ఇక్కడ గ్రీకు బైబిలులో (బాప్టిస్మస్) అనే మాట వాడబడింది. ఈ రెండు ఒకే మూలపదమైన “బాప్తిస్మము” అనే గ్రీకు మాట నుండే వచ్చాయి. మన తెలుగు బైబిలులో (ముంచుట) అనే మాటకు (ఫుట్ నోట్స్ లో) ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని ఉంది చూడండి. బాప్తిస్మము అనే మాటకు నీటితో కడుగుకోవడం, నీటిని చిలకరించడం, నీళ్లలో ముంచడం అని అర్ధం.

మెస్సీయ రావడానికి చాలా కాలం ముందు నుండే యూదులు తమ మతములోనికి మారిన అన్యులకు బాప్తిస్మము ఇచ్చేవాళ్ళు. మరి బాప్తిస్మమిచ్చు యోహాను యూదులకు బాప్తిస్మము ఎందుకిచ్చినట్టు? వాళ్ళేమి మతం మారలేదు కదా? ధర్మశాస్త్రము ద్వారా దేవుడు వారి నుండి కోరిన పవిత్రతను వాళ్ళు కలిగిలేరని వారు అపరిచితుల స్థితిలో ఉన్నారని సూచిస్తు (అన్యులుగా) మెస్సీయచే అంగీకరించబడటానికి లేదా ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి ముందు కొత్త స్థితిని పొందమని బాప్తిస్మమిచ్చు యోహాను పిలుపు నిచ్చాడు. యోహాను బాప్తిస్మము ఒక ప్రభావవంతమైన మతకర్మ, “పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము” (మార్కు 1:4) ఇది. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడునని నమ్మని వానికి శిక్ష విధింపబడునని మార్కు 16:16 చెప్తూవుంది.

ఉదాహరణకు, ఒకడు పక్షవాతముతో బాధపడుతూ బాప్తిస్మము ఇమ్మని అడిగాడనుకోండి. ఎలా ఇస్తాం? ముంచితే వాడు మరణించే ప్రమాదముంది. పొరపాటన వాడు మరణిస్తే వాన్ని హత్య చేసిన వారమవుతాం. శిక్షార్హులం. ప్రతి సంవత్సరం, ఆఫ్రికన్ దేశాలలో చాలామంది ముంచుడు బాప్తిస్మము మాత్రమే కరెక్ట్ అని వాదిస్తూ అనేకులకు బాప్తిస్మము ఇస్తున్నారు మంచిదే. కాని వారిలో అనేకులు బాప్తిస్మము పుచ్చుకొంటుండగా, మొసళ్ళు వాళ్ళ కాళ్ళు చేతులు కొరికేయడం మూలాన్న తమ చేతులను కాళ్లను కోల్పోతున్నారు మరికొందరు మొసళ్ల బారిన పడి మరణిస్తున్నారు, ఏమందాం? బాప్తిస్మములో నీటిని ఎలా ఉపయోగించామనేది ముఖ్యమా? వర్తించే విధానం (ముంచడం చిలకరించడం) బాప్తిస్మానికి దాని శక్తిని ఇస్తుందా? ఆలోచించండి.

శిశువులకు బాప్తిస్మం ఇవ్వడం బైబిలు సంబంధమైనదని ఒప్పుకొంటున్నారా? మత్తయి 28:19,20, కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. సమస్త జనులు అనే మాటకు గ్రీకులో ἔθνη అనే మాట వాడబడింది దీని అర్ధం అన్ని దేశాలు. అన్ని దేశాలకు బాప్తిస్మం ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడు, మార్కు 16:15, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అన్ని దేశాలు/సర్వలోకములో అందరూ, అన్ని జాతుల వారు, దేశాల వారు తెగలు, స్త్రీలు పురుషులు ముసలివాళ్ళు పెద్దలు పిల్లలు శిశువులు అందరూ ఉన్నారు. బాప్తిస్మము అనేది ఒక పరిశుద్ధ సంస్కరము. దేవుడు శిశువులను చిన్నపిల్లలను మినహాయించి పెద్దలకు మాత్రమే దీనిని పుచ్చుకొమ్మని చెప్పాడా? బైబులు ఏమి చెప్తుందో చుధ్ధాం.

బాప్తిస్మము మరియు సున్నతి రెండూ బైబిల్‌లోని ఒడంబడికకు సంకేతాలు, పరిశుద్ధ సంస్కారములు. ముఖ్యంగా పాత మరియు కొత్త నిబంధనల మధ్య కొనసాగింపు గురించిన చర్చలలో వాటిని తరచుగా ఒకటిగా క్రైస్తవ వేదాంతశాస్త్రంలో పోల్చారు.

సున్నతి (పాత నిబంధన ఒడంబడిక సంస్కారము)
ఆదికాండము 17: దేవుడు అబ్రాహాముకు ప్రతి పురుషుడిని నిబంధనకు చిహ్నంగా సున్నతి చేయమని ఆజ్ఞాపించాడు. (సున్నతి దేవునిచే స్థాపించబడింది మరియు ఆజ్ఞాపించబడింది)

ఇది అబ్రహాము నిబంధనలో చేర్చడాన్ని సూచిస్తుంది, ఇందులో ఆధ్యాత్మిక వాగ్దానాలు మరియు శారీరక వంశపారంపర్యత రెండూ ఉన్నాయి. దీనిని ఎవరు పొందారు: 8వ రోజున మగశిశువులందరూ (ఆదికాండము 17:12). యూదు మతంలోకి మారిన అన్యులందరు (సున్నతి పొందకపోతే పెద్దలు/పిల్లలు/శిశువులు కూడా). అర్థం: దేవుని ప్రజలకు చెందినవారమనే సంకేతం. ఒడంబడిక విధేయత, లోకం నుండి వేరుపడటం మరియు దేవునికి అంకితభావం యొక్క చిహ్నం. తరువాత “హృదయ సున్నతి” అనే ఆలోచనతో సంబంధం కలిగి ఉంది (ద్వితీ. 10:16, యిర్మీ. 4:4).

బాప్తిస్మము (కొత్త నిబంధన ఒడంబడిక సంస్కారము)
గ్రేట్ కమిషన్‌లో యేసు ద్వారా: స్థాపించబడింది మరియు ఆజ్ఞాపించబడింది, మత్తయి 28:19. సున్నతిని బాప్తిస్మము కొత్త నిబంధనకు చిహ్నంగా భర్తీ చేస్తుంది (కొలొస్సయులు 2:11–12). దానిని ఎవరు స్వీకరించాలి : విశ్వాసులు (అపొస్తలుల కార్యములు 2:38) వారిలో యింటి వారందరును (శిశువులు, పిల్లలు, పెద్దలు, వృద్దులు, స్త్రీలు పురుషులు) చేర్చబడియున్నారు, అపొ. కార్య. 16:15, 33; 18:8; 1 కొరింథీ 1:16. అర్థం: క్రీస్తు మరణం మరియు పునరుత్థానంలో ఆయనతో ఐక్యత. పాపాన్ని కడగడం (అపొ. కార్య. 22:16). ఒడంబడిక సంఘంలోకి (చర్చి) ప్రవేశం. ఇది అందరికి (శిశువులు, పిల్లలు, పెద్దలు, వృద్దులు, స్త్రీలు పురుషులు).

పౌలు పోలిక: కొలొస్సయులు 2:11–12, మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతోకూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి. పౌలు వీటి మధ్య ప్రత్యక్ష సమాంతరాన్ని గీస్తున్నాడు: శరీర సున్నతి (పాత ఒడంబడిక), హృదయ బాప్తిసం (కొత్త ఒడంబడిక). బాప్తిస్మము అనేది కొత్త ఒడంబడిక సంస్కారము. ఇది సున్నతి దేనిని సూచిస్తుందో దానినే సూచిస్తుంది – దేవునికి చెందినది, పాతనిబంధనలో లాగా ఇది అందరికి వర్తిస్తుంది.

కొలొస్సయులు బాప్టిజంలో ఈ ఆధ్యాత్మిక సున్నతిని పొందారని పౌలు చెప్పాడు. యాదృచ్ఛికంగా, పాత నిబంధన సున్నతి మరియు కొత్త నిబంధన బాప్టిజం మధ్య సంబంధాన్ని ఇక్కడ చేయడం ద్వారా, కొత్త నిబంధనలో, బాప్టిజం సున్నతి స్థానంలో ఉందని పౌలు సూచిస్తున్నాడు.

చాలా మంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతూ ఉంటారు? మీరు బాప్తిస్మము తీసుకున్నారా లేక బాప్తిస్మము పుచ్చుకొన్నారా? రెండింటికి చాలా తేడా ఉందండి. బాప్తిస్మము తీసుకోవడమంటే అది మన స్వంత ఆలోచన, నిర్ణయము, సామర్ధ్యమును బట్టి మనకు మనముగా తీసుకోవడం. క్రీస్తును నమ్మని ప్రతి ఒక్కరు వారి పాపములను బట్టి అతిక్రమములను బట్టి చచ్చిన వారైయుండగా వాళ్ళు ఎలా నిర్ణయము తీసుకోగలరండి? తమకున్న సామర్ధ్యమును బట్టి బాప్తిస్మమును ఎవడన్నా తీసుకోగలడా? ఏ ఒక్కడు తన స్వంత నిర్ణయము వలన ఆలోచనవలన యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచలేడు ఆయన యొద్దకు రాలేడు. పరిశుధ్ధాత్ముడు సువార్త వలన మనలను పిలిచి తన వరముల వలన మనలను వెలిగించి విశ్వాసము నందు ఉంచుతూ ఉన్నాడు. ఇది దేవుని కృపావరమే. కాబట్టి మనము బాప్తిస్మమును పుచ్చుకొంటూ ఉన్నాము. పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని 1 కొరింథీయులకు 12:3 చెప్తూవుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl