పరలోకములో ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూడగలరా?

మరణించిన తరువాత పరలోకంలో ఉన్న ఆత్మలు భూమిపై జరిగే సంఘటనలను చూడగలవా అనే ప్రశ్నకు బైబిలు స్పష్టమైన, సంపూర్ణమైన సమాధానం ఇవ్వడం లేదు. ప్రసంగి 12:7 ప్రకారం, మరణించిన తరువాత మనిషి శరీరం మట్టికి తిరిగి వెళుతుంది; ఆత్మ దేవుని యొద్దకు తిరిగి వెళుతుంది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం, మరణించిన తరువాత విశ్వాసులు క్రీస్తుతో ఉంటారు. ఫిలిప్పీయులకు 1:23 లో పౌలు తాను ఈ లోకాన్ని విడిచి క్రీస్తుతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. దీనివల్ల మరణించిన విశ్వాసులు క్రీస్తుతో ఉండటం గొప్ప ఆశీర్వాదమని తెలుస్తుంది. యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా రక్షణ లభిస్తుంది. యోహాను 3:16 ప్రకారం, క్రీస్తునందు విశ్వాసముంచే వారు నిత్యజీవం పొందుతారు. అయితే, మరణించిన తరువాత ఆత్మలు భూమిపై జరిగే ప్రతి విషయాన్ని చూస్తాయని బైబిలు స్పష్టంగా చెప్పదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అసలు బైబిలు ఏమి చెప్తుందో చూధ్ధాం.

పరలోకంలో సంపూర్ణ సంతోషం ఉంటే, అక్కడి వారు భూమిపై జరిగే బాధలను చూడగలరా?
కీర్తన 16:11 లో దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందని చెప్పబడింది. ప్రకటన 21:4 ప్రకారం, దేవుడు తన ప్రజల కన్నీళ్లన్నిటిని తుడిచివేస్తాడు; ఇక మరణం, దుఃఖం, ఏడ్పు, వేదన ఉండవు. ఈ వాక్యాలు పరలోకంలో దేవుని ప్రజలు సంపూర్ణ ఆదరణను, ఆనందాన్ని పొందుతారని తెలియజేస్తున్నాయి.

పరలోకంలో ఉన్నవారు భూమిపై జరిగే ప్రతి బాధాకరమైన సంఘటనను చూస్తూ ఉంటే, ఆ సంపూర్ణ సంతోషాన్ని ఎలా అనుభవిస్తారనే ప్రశ్న రావచ్చు. దీనికి బైబిలు పూర్తి వివరణ ఇవ్వదు. పరలోకంలో ఉన్నవారికి భూమిపై జరిగే విషయాలన్నీ తెలుసని బైబిలు చెప్పదు. అలాగే, వారికి భూమిపై జరిగే విషయాలేవీ తెలియవని కూడా స్పష్టంగా చెప్పదు. కీర్తనలు 88:10–12 మరియు ప్రసంగి 9:10 వంటి వచనాలను కొందరు మరణించిన వారికి భూలోక విషయాలు తెలియవనే అభిప్రాయానికి ఆధారంగా చూపుతారు. కీర్తన 88 లో కీర్తనకర్త మరణం, సమాధి, చీకటి గురించి ప్రశ్నిస్తూ తన బాధను దేవుని ఎదుట వ్యక్తం చేసాడు. ప్రసంగి 9:10 లో, మరణించిన తరువాత మనుషులు ఈ లోకంలో చేసినట్లుగా పనులు చేయడం, ఆలోచించడం, ప్రణాళికలు వేయడం సాధ్యం కాదని చెప్పబడింది. ఈ వచనాలు ప్రధానంగా భూసంబంధమైన జీవితపు పరిమితిని, మరణం యొక్క గంభీరతను తెలియజేస్తాయి. అయితే, ఈ వాక్యాలను ఆధారంగా చేసుకొని మరణించిన ఆత్మలకు ఎలాంటి అవగాహన ఉండదని నిశ్చయంగా చెప్పలేము. ఎందుకంటే, ఇతర బైబిలు భాగాలు మరణించిన విశ్వాసులు క్రీస్తుతో ఉంటారని, దేవుని సన్నిధిలో ఉంటారని తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి వచనాన్ని దాని సందర్భంలో అర్థం చేసుకోవాలి. ఇవి ఒక్కటే ఆధారంగా తీసుకొని మరణించిన ఆత్మలన్నింటికీ ఏమీ తెలియదని నిర్ణయించడం సరైనది కాదు. కాబట్టి ఈ విషయంలో మనం ఊహాగానాలు చేయకుండా, దేవుడు వెల్లడించిన సత్యాలపై ఆధారపడదాం.

ధనవంతుడు మరియు లాజరు కథ మనకు ఏమి నేర్పుతుంది?
లూకా 16:19–31 లో యేసు ధనవంతుడు మరియు లాజరు గురించి చెప్పాడు. ధనవంతుడు భూలోకంలో సుఖంగా జీవించాడు; లాజరు పేదరికంలో బాధలు అనుభవించాడు. వారు మరణించిన తరువాత వారి పరిస్థితులు మారాయి. లాజరు ఆదరణ పొందగా, ధనవంతుడు బాధను అనుభవించాడు.

ధనవంతుడు తన సహోదరులను గుర్తుచేసుకొని, వారు కూడా ఆ బాధాస్థలానికి రాకుండా హెచ్చరించాలని కోరాడు. ఈ వృత్తాంతం మరణం తరువాతి స్థితి, దేవుని తీర్పు, దేవుని వాక్యాన్ని జీవించి ఉన్నప్పుడే వినవలసిన అవసరం గురించి బోధిస్తుంది.

ఈ కథను కొందరు నిజమైన సంఘటనగా అర్థం చేసుకుంటారు; మరికొందరు ఉపమానంగా భావిస్తారు. ఇది ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ, మరణించిన వారికి భూమిపై జరిగే ప్రతి విషయం తెలుస్తుందని ఈ వృత్తాంతం నిరూపించదు. ధనవంతుడు తన సహోదరులను గుర్తుచేసుకున్నాడనే విషయం మన కుటుంబాల్లో జరిగే ప్రతి సంఘటన మరణించిన వారికి తెలుస్తుందని చెప్పడానికి సరిపోదు. అయితే, ఈ ఒక్క వివరాన్ని ఆధారంగా చేసుకొని మరణించిన ప్రతి వ్యక్తి తన కుటుంబంలో జరుగుతున్న అన్ని విషయాలను తెలుసుకుంటాడని నిర్ణయించలేము. ఈ కథలో ధనవంతుడు తన సహోదరుల గురించి మాట్లాడాడు; కానీ వారు ప్రతిరోజూ ఏమి చేస్తున్నారో చూస్తున్నట్లు చెప్పబడలేదు. అందువల్ల, మరణించిన మన ప్రియమైన వారు మనలను చూస్తున్నారని లేదా మన జీవితంలోని ప్రతి సంఘటనను తెలుసుకుంటున్నారని నిశ్చయంగా చెప్పడం కంటే, దేవుడు మనకు వెల్లడించిన వాగ్దానాలపై ఆధారపడటం మంచిది.

లూకా 16 లో ధనవంతుడు తన నాలుక చల్లబడాలని కోరుకోవడం వంటి వివరాలు కనిపిస్తాయి. అయితే, మరణించిన తరువాత ఆత్మకు శరీరం లేకుండా ఈ అనుభవాలు ఎలా సాధ్యమవుతాయో మనకు పూర్తిగా తెలియదు. ఈ కథలోని శారీరక వర్ణనలను మరణానంతర స్థితి యొక్క ప్రతి అంశానికి అక్షరార్థ వివరణగా తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. బైబిలు వెల్లడించిన విషయాలను నమ్మాలి; వెల్లడించని విషయాల గురించి మన ఊహలను సిద్ధాంతాలుగా మార్చకూడదు. అంత్యదినాన మృతుల పునరుత్థానం జరుగుతుందని, దేవుడు తన ప్రజలకు నూతన జీవాన్ని ఇస్తాడని క్రైస్తవునిగా విశ్వసిధ్ధాం.

మరణించిన మన కుటుంబ సభ్యులు మనలను చూడగలరా?
మన కుటుంబ సభ్యులు మరణించిన తరువాత వారు మనలను చూస్తున్నారా, మన బాధలను తెలుసుకుంటున్నారా అనే ప్రశ్నలకు బైబిలు స్పష్టమైన సమాధానం ఇవ్వదు. అందువల్ల వారు మనలను ఎల్లప్పుడూ చూస్తున్నారని లేదా మన జీవితంలోని ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారని బోధించడం సరికాదు.

అయితే, మనలను ప్రేమించే దేవుడు మన పరిస్థితులన్నింటినీ తెలుసుకుంటాడు. మనకు ఓదార్పు, సహాయం, నిరీక్షణ ఆయన నుండే లభిస్తాయి. మరణించినవారితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించడం కంటే, దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని అనుసరించడం ముఖ్యం.

నరకంలో ఉన్నవారి బాధలను పరలోకంలో ఉన్నవారు చూస్తారా?
ఈ ప్రశ్నకు కూడా బైబిలు ప్రత్యక్షమైన సమాధానం ఇవ్వదు. ప్రకటన 21:4 లో దేవుడు తన ప్రజల కన్నీళ్లను తుడిచివేసి, దుఃఖం మరియు వేదన లేని స్థితిని అనుగ్రహిస్తాడని చెప్పబడింది. కాబట్టి పరలోకంలో ఉన్నవారు నరకంలోని బాధలను చూస్తూ ఉంటారని మనం నిర్ధారించలేము. అలాంటి వివరాలను ఊహించుకోవడం కంటే, దేవుని న్యాయం, పరిశుద్ధత, కృపలపై విశ్వాసం ఉంచుదాం.

మనం ఇప్పుడు ఎలా జీవించాలి?
ఈ భూలోక జీవితం శాశ్వతమైనది కాదు చాలా స్వల్పమైనది. యాకోబు 4:14 ప్రకారం, మన జీవితం కొంతసేపు కనిపించి తరువాత మాయమయ్యే ఆవిరితో పోల్చబడింది. కాబట్టి మన సమయాన్ని జ్ఞానంతో ఉపయోగించాలి. కీర్తనలు 90:12 లో మన దినాలను లెక్కించుకోవడం నేర్పించమని దేవునిని ప్రార్థించమని చెప్పబడింది. ఎఫెసీయులకు 5:15–17 కూడా జ్ఞానంతో నడుచుకుంటూ, ప్రభువు చిత్తాన్ని గ్రహించుకోవాలని బోధిస్తుంది.

యేసు మత్తయి 16:26 లో, ఒక మనిషి లోకమంతటినీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమని ప్రశ్నించాడు. ఈ లోక సంపద కంటే నిత్యజీవం ఎంతో విలువైనది. అందువల్ల, మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది యేసుక్రీస్తుతో మనకున్న సంబంధం. 1 యోహాను 5:11–12 ప్రకారం, నిత్యజీవం దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఉంది. ఆయనను విశ్వసించేవారికి జీవం ఉంది.

కాబట్టి మనం మన జీవితాన్ని క్రీస్తులో విశ్వాసంతో గడపాలి. మన కుటుంబ సభ్యులకు కూడా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ, క్రీస్తు ప్రేమను చూపిస్తూ, ఆయన కృపలో జీవించడానికి సహాయపడాలి. ఇది మరణానంతర జీవితం గురించి అనవసరమైన భయాలకు లోనుకాకుండా, దేవుడు మనకు ఇచ్చిన జీవితాన్ని విశ్వాసంతో ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది.

ముగింపు
పరలోకంలో ఉన్న ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూడగలవా అనే ప్రశ్నకు బైబిలు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. విశ్వాసులు మరణించిన తరువాత క్రీస్తుతో ఉంటారని, దేవుని సన్నిధిలో ఆదరణ పొందుతారని బైబిలు బోధిస్తుంది. కానీ వారు తమ కుటుంబ సభ్యుల జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని చూస్తున్నారని లేదా భూమిపై జరిగే అన్ని సంఘటనలను తెలుసుకుంటున్నారని చెప్పడానికి తగిన స్పష్టమైన ఆధారం లేదు.

కాబట్టి మనం తెలియని విషయాల గురించి ఊహించకుండా, క్రీస్తు మరణం మరియు పునరుత్థానంపై ఆధారపడదాం. మన నిరీక్షణ మరణించిన వారికి మన గురించి ఎంతవరకు తెలుసనే విషయంలో కాదు; యేసుక్రీస్తు తిరిగి వచ్చి మృతులను లేపి, తన ప్రజలను తనతో నిత్యము ఉంచుతాడనే వాగ్దానంలో ఉంది. ఇదే క్రైస్తవ విశ్వాసానికి నిజమైన ఆదరణ, నిరీక్షణ.

చిన్న ప్రశ్న, నరకంలో ఉన్న మన వారిని వారి బాధను మనం చూడగలిగితే? ఇక్కడ యేసుకు దూరంగా జీవించాలనుకుని, అవిశ్వాసం అనే రైలు ఎక్కితే, మిమ్మల్ని అది నరకమనే గమ్యస్థానానికి తీసుకువెళ్తుందని గుర్తుంచుకోండి. అక్కడనుండి తప్పించుకొనే అవకాశాలేమి ఉండవు. అది వన్ వే టికెట్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl