యేసు ఆ సంగతి విని అంటే ఏ సంగతి అని మీరు అనుకుంటున్నారు? యేసు బేత్సయిదా అను ఊరికి వెళ్లడంలో ప్రాధమిక ఉదేశ్యము ఏంటి? ప్రజలు యేసుని ఎందుకని వెంబడించారు? వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడటం అంటే ఏంటి? ఫిలిప్పు ద్వారా శిష్యుల ద్వారా ఆయన మనకు నేర్పిస్తూవున్న పాఠము ఏంటి? ఈ అద్భుతము కధా లేక వాస్తవ సంఘటనా?

మత్తయి 14: 13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6: 5-13

మత్తయి 14:13-21_ యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడ నుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆ సంగతి విని సకల పట్టణముల నుండి జనసమూహ ములు, కాలి నడకను పరుగెత్తి వారి కంటె ముందుగా వచ్చిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, ఆయన వారిని చేర్చుకొని వారు కాపరిలేని గొఱ్ఱెల వలె ఉన్నందున వారిమీద కనికరపడి, యేసు కొండయెక్కి అక్కడ తన శిష్యులతో కూడ కూర్చుండి దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను

యేసు కన్నులెత్తి జనులను చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పునడిగెను గాని ఆయన యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దు గుంకుచున్నది, ఈ జనులు గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా  మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి

అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పిరి.

అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టిరి. లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్న వారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించెను.  

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచు మించు అయిదు వేలమంది పురుషులు.

ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొన బోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లిపోయెను.

  1. యేసు ఆ సంగతి విని, అంటే ఏ సంగతి విని?
  2. దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా ఎందుకని వెళ్ళాడు?
  3. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకొని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా ఆయన వెళ్లిన చోటుకు చేరుకోవాల్సిన అవసమేముంది?
  4. వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, అను మాటలకు అర్ధమేమి?
  5. దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను?
  6. వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పునే యేసు ఎందుకని అడిగాడు?
  7. అందుకు ఫిలిప్పు ఇచ్చిన జవాబు ఏంటి?
  8. మీరే వారికి భోజనము పెట్టుడని ఆయన శిష్యులతో ఎందుకని చెప్పాడు? 
  9. మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని ఆయన వారితో ఎందుకని చెప్పాడు?
  10. పచ్చికమీద అందరిని పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని ఆయన ఎందుకని చెప్పాడు?
  11. ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను?
  12.  వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పటంలో ఆయన ఉద్దేశ్యము ఏంటి?

ఇది, ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేలమందికి యేసు అద్భుతకరమైన రీతిగా ఆహారం పెట్టడం అనే సూచక క్రియ. నాలుగు సువార్తలలో నమోదు చేయబడిన ఏకైక అద్భుతం, మత్తయి 14: 13-21; మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6: 5-13.

ఈ భాగము మత్తయి 14:13లో “యేసు ఆ సంగతి విని” అని ప్రారంభమవుతూ వుంది. ఏ సంగతి? ఈ భాగమునకు పైభాగము బాప్తిస్మమిచ్చు యోహాను మరణమును గురించి చెప్తూవుంది కాబట్టి యేసు బాప్తిస్మమిచ్చు యోహాను మరణ వార్త విని బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన హేరోదు ఆంటిపాస్ తనను కూడా ఎక్కడ చంపేస్తాడేమోనని అతడు పాలిస్తూ వున్న భూభాగాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రదేశానికి వెళ్లిపోయాడా? ఆయన భయపడ్డడా? బాప్తిస్మమిచ్చు యోహాను మరణానికి కొద్దీ రోజుల ముందే యేసు ఆ ప్రాంతము నుండి వెళ్ళి పోయివుండొచ్చు కదా? యోహాను శిష్యులు వచ్చి యోహాను చనిపోయాడని చెప్పే వరకు ఈ సంగతి యేసుకు తెలియదని అనుకుందామా? చనిపోయిన యోహాను పరలోకమందు తండ్రితో ఉండి యుండుటను ఎరిగియున్న యేసు యోహాను బరియల్ కి వెళ్లడం ఎందుకులే అనుకోని అక్కడి నుండి వెళ్లిపోయాడా? సమాధి కార్యక్రమానికి వెళ్తే ఏమి జరుగుతుంది? గొడవలు, యోహాను పక్షమున నిలబడాల్సి వస్తుంది. తిరుగుబాటు, అరెస్ట్ అవ్వడం, చెరలోనికి పోవడం ఇదంతా ఇబ్బందని యేసు అక్కడి నుండి వెళ్లిపోయాడా? లేదా చనిపోయిన యోహానును గురించి విలపించడానికి యేసు అక్కడి నుండి వెళ్లిపోయాడా? యేసు యోహాను మరణ వార్తను విని, వెంటనే దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు వెళ్లిపోయాడని తెలుసుకొని స్పందించకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు అని అడగడానికి సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను పరుగెత్తి వారి కంటె ముందుగా వచ్చారా? యేసూ, ప్రవక్తగా లేదా మెస్సయ్యా గా బాప్తిస్మమిచ్చు యోహాను మరణ విషయములో మీరెలా స్పందిస్తారు? మమ్మల్ని ఎలా స్పందించమంటారు అని తేల్చుకొని, యేసు సారధ్యములో ఉద్యమించడానికా?

మన పాఠానికి వధ్ధాం. హేరోదు ది గ్రేట్ తన రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులకు విడిచిపెట్టాడు. వీరిలో మన పాఠములోని ఈ “హేరోదు ఆంటిపాస్” ఒకరు. అతడు గలిలీ, పెరియాలను పరిపాలించాడు (మత్తయి 2:15). అతడు నైతికత లేని వ్యక్తి, ప్రజల వ్యవహారాలపై తక్కువ శ్రద్ధ చూపేవాడని గుర్తుంచుకోవాలి. వ్యభిచారమును బట్టి యోహానుచే మందలింపబడిన హేరోదు ఆంటిపాస్ బాప్తిస్మమిచ్చు యోహానును ఖైదు చేసి దుర్మార్గంగా చంపించాడు. మన పాఠములో, యేసు చేస్తూవున్న అద్భుతాలను గురించి హేరోదు ఆంటిపాస్ విని తాను చంపించిన బాప్తిస్మమిచ్చు యోహాను తప్ప మరెవరూ అలాంటి అద్భుతాలు చేయలేరని అనుకొని అతడు మళ్ళీ మృతులలో నుండి లేచియున్నాడనే నిర్ధారణకు వచ్చాడు. ఆ సందర్భ ములో, ఆ సమయములో, యేసుని కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని–బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు –ఈయన ఏలీయా అనియు, మరికొందరు–ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి, మార్కు 6:14-15. చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను, లూకా 9:7. అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా, లూకా 9:9; నేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచియున్నాడని అతడు తన సభికులకు చెప్పాడు, మార్కు 6:16 అనే మాటలు ఈ విషయాన్ని నిర్ధారిస్తువున్నాయి. యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను, లూకా 9:9.

ఈ సందర్భములో మత్తయి బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క విషాద మరణం అసలు ఎలా జరిగిందో ఇక్కడ కోట్ చేసివున్నాడు, మత్తయి 14:1-12; మార్కు 6:14-29. బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదును మందలించడానికి కారణం హేరోదు వ్యభిచారము. అనైతిక సంబంధాలను ధర్మశాస్త్రము నిషేధించియుండుటను బట్టి (లేవీయ 18:16) ఆ నిషేధించబడిన పాపములో కొనసాగుతూ దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఉండుటను బట్టి దేవుని ప్రవక్తయైన యోహాను హేరోదును మందలించాడు, మత్తయి 14:3,4.

హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానుకు భయపడ్డాడు. హేరోదు యొక్క భయం అతని స్వంత అపరాధ మనస్సాక్షి నుండి పెరిగి ఉండవచ్చు. సంపద లేదా భూసంబంధమైన విషయాలు మనస్సాక్షిని నిశ్శబ్దం చేయలేవు. అపరాధ మనస్సాక్షి నిజమైన, ఊహాత్మకమైన, సమస్యలతో మాత్రమే కలత చెందుతుంది. అపరాధ మనస్సాక్షి ఒక పాపిని తన సంశయవాదంతో బాధపెడుతుంది.

బైబిలేతర మూలంగా, యూదు చరిత్రకారుడైన జోసీఫస్ కూడా హేరోదు ఆంటిపాస్ యోహానును ఖైదు చేసి చంపాడని పేర్కొన్నాడు. హేరోదు అలా చేయడానికి అసలు కారణం యోహాను ప్రజలపై చూపిన గొప్ప ప్రభావం (తిరుగుబాటును లేవనెత్తడానికి యోహాను పిలుపునిస్తే చాలు ఏదైనా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న కారణాన్న) అని పేర్కొన్నాడు. కాబట్టే హేరోదు అతన్ని చంపడం ఉత్తమమని భావించాడు.

ఆ సంగతి విని, అంటే యేసు హేరోదు తనను గురించి కలవరపడుతున్నాడని విని ఆయన ఆ ప్రాంతము నుండి వెళ్ళి పోయాడు. అతడు యేసును బాప్తిస్మమిచ్చు యోహానుగా ఎంచి రెండవసారి చంపడానికి  ప్రయత్నించే అవకాశముంది. హేరోదు నుండి తనను తాను రక్షించుకునే దైవిక శక్తి యేసుకు ఉన్నప్పటికీ, ఆయన ఘడియ యింకను రాలేదు కాబట్టి యేసు అనవసరంగా తనను తాను ప్రమాదమునకు అప్పగించు కోదలచుకోలేదు, అనవసరంగా ఆయన తనను తాను ఎప్పుడూ ప్రమాదంలోకి నెట్టుకోలేదు. ఆయన చనిపోవడానికి నిర్ణీత సమయం వచ్చే వరకు తన జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడం సరైనది. కాబట్టే యేసు అక్కడి నుండి బయలు దేరి హేరోదు భూభాగాన్ని విడిచిపెట్టి, గలిలీ సముద్రానికి తూర్పు వైపుకు, హేరోదు ఫిలిప్ భూభాగంలోకి వెళ్లిపోయాడని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి. ఈ విషయాన్నే మత్తయి మనకు చెప్తూవున్నాడు. మత్తయిని బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను మరణించిన కొన్ని రోజులు తరువాత మన పాఠము ప్రారంభమవుతూవుంది.

మార్కు 6: 30; లూకా 9:10 అంతట అపొస్తలులు యేసునొద్దకు తిరిగి వచ్చి (తమ మొదటి మిషనరీ పర్యటన నుండి తిరిగి వచ్చి) తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియజేయగా, అంటే ఇక్కడ వారు తిరిగి రావడానికి యేసు ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించాడని ఆ సందర్భములోనే, ఆ సమయములోనే వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి వారి రిపోర్టును ఆయనకు నివేదించియున్నారు. అప్పుడాయన శిష్యులకు కొంత రిఫ్రెష్‌మెంట్ మరియు విశ్రాంతి పొందడం సరైనదని అనుకొని _మీరేకాంతముగా అరణ్యప్రదేశమునకు వచ్చి, రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. గలిలీ సముద్రం మీదుగా తూర్పు తీరానికి ప్రయాణించడంలో యేసుని ప్రాథమిక ఉద్దేశ్యం వారి మిషన్ నుండి తిరిగి వచ్చిన తన శిష్యులతో యేసు మాట్లాడాలనుకోవడం, వారికి కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడం, తాను రెస్ట్ తీసుకోవడం అని మార్కు, లూకా మనకు చెప్తూవున్నారు.

వారికి కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వడంలో యేసుని ఉద్దేశ్యము శిష్యులు యోహాను మరణాన్నిబట్టి నిరుత్సాహపడకుండా వారిని బలపర్చాల్సి ఉండటం అట్లే వారి భద్రత కోసం ఆయన వారిని వెంట బెట్టుకొని తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి  బేత్సయిదా అను ఊరికి వెళ్ళాడు.

యేసు వివిధ కారణాలను బట్టి అక్కడనుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ కష్ట సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు. యోహాను యేసుకు స్నేహితుడు, బంధువు కూడా కాబట్టి యోహాను మరణం ఆయనకు చాలా బాధ కలిగించి ఉండొచ్చు. ఆ భాధ కనికరాన్ని చూపేందుకు కారణమయ్యింది. ఆయన పరిచర్యను ఆయన కొనసాగించాల్సి ఉన్నాడు, తప్ప భాధపడుతూ ఆగిపోకూడదు. ఆయనను విశ్వసించే ప్రతి దుఃఖించే హృదయానికి చెయ్యడానికి పని వుంది, అందులో ఉపశమనం లభిస్తుంది.

యోహాను మరణం ప్రజలలో సంక్షోభాన్ని తీసుకువచ్చి ఉండొచ్చు. వారు వెళ్లుచుండగా జనులు చూచి, (ఆయన నిష్క్రమణ మరియు ఆయన పడవ యొక్క దిశ గమనించబడింది. వార్త వ్యాప్తి చెందింది) అనేకులాయనను గుర్తెరిగి, ఆ సంగతి విని సకల పట్టణముల నుండి జనసమూహములు, కాలినడకను గలిలయ సముద్రపు ఉత్తర తీరం చుట్టూ ఎనిమిది మైళ్లు లేదా అంతకంటే ఎక్కువ మైళ్లు నడిచి పరుగెత్తి వారికంటె ముందుగా బేత్సయిదాకు రావడమే కాకుండా (లూకా 9:10) తమతో పాటు వారు యేసు స్వస్థపరచడానికి అనేకమంది రోగులను తమ వెంట తీసుకురావడం ఆశ్చర్యం.

బేత్సయిదా అంటే “హౌస్ అఫ్ ఫిషింగ్” అని అర్ధం. ఇది గలిలీ సముద్రం యొక్క ఈశాన్య ఒడ్డున ఉంది. అపొస్తలులైన ఫిలిప్పు, పేతురు మరియు అంద్రెయ ఈ పట్టణం నుండే వచ్చారు (యోహాను 1:44). ఈ ప్రాంతాన్ని గూర్చిన యేసుని ప్రవచనము లూకా 10:13,14లో ఉంది – అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై యుండును.

ఆయనను వెంబడించి వచ్చిన ఆ గొప్ప జనసమూహము, స్త్రీలు పిల్లలు కాకుండా దాదాపు ఐదు వేల మంది పురుషులుతో ఉన్న ఒక పెద్ద జనసమూహము. ఇంతమంది ఆయనను వెంబడించడానికి కారణాన్ని యోహాను తెలియజేస్తూ, రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించారని, యోహాను 6:2 రక్షణ సువార్త కోసం మాత్రం కాదని చెప్తున్నాడు.

యేసు తన శిష్యులతో కలిసి దూర ప్రదేశానికి వెళ్లడం జనసమూహం నుండి తప్పించుకోవడానికి కాని ఇది జరగలేదు. యేసు ప్రజల ఉద్దేశ్యాన్ని యెరిగి యున్నప్పటికిని, వారు అనేకమంది రోగులను తమ వెంట తీసుకొని వచ్చి ఉండటం యేసు చూచి నిరాశ చెందలేదు లేదా చికాకుపడలేదు. ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను, లూకా 9:11. సహాయం కోసం వచ్చిన వారి నుండి తప్పించుకోకూడదనే పాఠాన్ని అపొస్తలులు నేర్చుకొన్నారు.

వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని తృణీకరింపక, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడ్డాడు అని మార్కు 6:34 చెప్తూ వుంది.

గొర్రెల కాపరి అంటే మందను చూసుకునేవాడు. దానిని పోషించడం అతని విధి. తోడేళ్ళు ఇతర క్రూరమృగాల నుండి వాటిని అతడు రక్షించవలసివున్నాడు. పిల్లలు, యవ్వనస్థులు, బలహీనుల పట్ల అతడు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి వున్నాడు. పచ్చని పచ్చిక బయళ్ళుకు శాంతికరమైన జలముల యొద్దకు అతడు వాటిని నడిపించవలసివున్నాడు, కీర్తన 23:1-6. గొర్రెలకు కాపరి లేకపోతే వాటికి సరైన మార్గదర్శకత్వం, సంరక్షణ ఉండదు, అవి మందనుండి తప్పిపోవొచ్చు, దూరముగా పోవచ్చు, మందను చేరుకొనుటకు మార్గాన్ని కనుగొనలేక నిస్సహాయ జీవులుగా గాయపడి రోగగ్రస్త మవ్వటమే కాకుండా పోషకాహార లోపంతో బలహీనపడి మరణించే ప్రమాదములో ఉంటాయి. అట్లే భద్రత లేని కారణముగా అవి క్రూర మృగాల బారిన పడి వాటికి వేటగా మారొచ్చు కూడా.

ప్రజలు కాపరి లేని గొఱ్ఱెలవలె ఉన్నందున అనే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకుడు అనే ఒక కాపరి వ్యవస్థే వుంది. మరి యేసు ఇలా ఎలా చెప్పగలడు? ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని క్రీస్తు చెప్పినప్పుడు, వారి గురువులు, మార్గదర్శకులు, వారిని పట్టించుకునేవారు వారికి బోధించడానికి శ్రమ పడుతున్నారని అర్థం. ఆ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందని ఈ మాటలు తెలియజేస్తూవున్నాయి – వారి కాపరులు ప్రజలను పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యం చేస్తూ వారి బోధల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా వారి స్వార్ధ ప్రయోజనాలను బట్టి పేదలకు సువార్తను దూరము చేసి ఉన్నారు. కాబట్టే బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది వెళ్లి బాప్తిస్మమిచ్చు యోహానుతో చెప్పుడి అని యోహాను శిష్యులతో యేసు చెప్పటం మనం లూకా 7:22లో చూడొచ్చు. తద్వారా ప్రజలు ఆత్మీయ పోషకాహార లోపంతో రోగగ్రస్తమవటమే కాకుండా బలహీనపడి మరణించే ప్రమాదములో ఉండి ఉండుటను బట్టి ఆయన వారి మీద కనికరపడ్డాడు.

వారి ప్రార్థనా మందిరాల్లో, వారికి అవసరమైన ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వబడలేదు. వాళ్ళు వాగ్దానం చేయబడిన మెస్సీయ వైపు మళ్ళించబడలేదు అంటే వారి సోకాల్డ్ కాపరులు, నాయకులు, ప్రజలను దేవుని వాక్యమనెడి  పచ్చిక బయళ్లకు నడిపించకుండా మనుష్య సిద్ధాంతాలు బోధల ద్వారా దేవుని వాక్యమనెడి పచ్చిక బయళ్లకు దూరం చేసేవారిగా ఉండి ఉండుటను బట్టి, ప్రజలు నిస్సహాయంగా దేవుని మందకు తిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొనలేని వారి దయనీయమైన పరిస్థితిని బట్టి ఆయన వారి మీద కనికరపడ్డాడు. వారికి కావాల్సిన వాటిని అందించుటకు వచ్చిన మంచి కాపరియైన క్రీస్తు, వారు ఎంతగానో కోరుకొంటున్న ఆహారాన్ని వారికి సమృద్ధిగా అందించుటకుగాను కనికరపడ్డాడు.

తప్పిపోయిన గొర్రెలు మందకు ఎలా తిరిగి రావాలో చెప్పడానికి ఆయనకు అక్కడ ఒక మంచి అవకాశము వుంది. అందుకే విశ్రాంతి తీసుకొందామనుకొన్న ఆయన ఆ విశ్రాంతిని ప్రక్కన పెట్టి ఆయన వారి మీద కనికరపడి, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, అంటే వారిని దేవుని రాజ్యములోనికి తిరిగి తెచ్చు మెస్సయ్యను గురించి వారికి తెలియజేస్తూ, వివరిస్తూ అనేక సంగతులను భోదించడమే కాకుండా వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడు.  

పరిచర్యలో భాగముగా సమయం వేగముగా అయిపోతూ ప్రొద్దు గుంకడం మొదలయ్యింది. యేసు కన్నులెత్తి జనులను చూచి వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలుకొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని ఆయన యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు–వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చు కొనుట కైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను, యోహాను 6:4-7

రెండువందల దేనారముల రొట్టెలు చాలవను మాటల ద్వారా ఫిలిప్పు వాస్తవాన్ని తెలియజేస్తూవున్నాడు తప్ప అవిశ్వాసిగా లేడు. ఇంతమందికి భోజనము ఎక్కడి నుండి సమకూర్చగలం అనే విషయాన్ని విస్మరించి, అది దొరికినను ఇంతమందికి దానిని వాళ్ళు కొనలేరని వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుట కైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని, వీరి ఆకలిని మనం తీర్చలేమని యేసుకు సలహా చెప్తున్నాడు.

యేసు ఫిలిప్పునే ఈ ప్రశ్న ఎందుకని అడిగాడు? ఆయన యేమి చేయనైయుండెనో తానే యెరిగియుండి అతనిని పరీక్షించుటకు ఆలాగడిగెనని మన పాఠము చెప్తూవుంది. ఇక్కడ ప్రభువు ఫిలిప్పుకు పరీక్ష పెట్టాడు. ఫిలిప్పును ప్రభువు యందలి విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో బలపర్చడానికే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మర్చిపోకండి. యేసు నందు అతనికున్న నమ్మకానికి, విశ్వాసానికి పరీక్ష.

ఆ పరీక్షలో ఫిలిప్పు ఆహారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ప్రభువా –వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పటం, అతడు ప్రతి దానిని ఈ లోక సంబంధమైన వాటితో ముడిపెట్టి లెక్కలు వేసుకొనే వాడని తెలియజేస్తూవుంది. ఈ లోక సంబంధమైన వాటికంటే సర్వ సమృద్ధి దేవునిలో వున్నదనే విషయాన్ని శిష్యునిగా అతడు తెలుసుకోవాలని సరిద్దుకోవాలనే యేసు ఫిలిప్పును ఈ ప్రశ్న అడిగాడు.

అపొస్తలులను పరిచర్యలోనికి పంపుతూ వున్నప్పుడు, వారి అవసరములు వారికే విధముగా సమకూర్చబడతాయో నిశ్చయతను ఆయన వారికి ఇచ్చి పంపించాడు లూకా 9:2-6, వారి మిషన్ టూర్‌లో ఆ విషయాన్ని వారు నేర్చుకున్నారో లేదో పరీక్షించడానికి ఆయన ఈ విధముగా అడిగాడు. ఫిలిప్పు దానిని అనుభవపూర్వకంగా రుచి చూచి యున్నప్పటికిని దానిని గురించి అతడు మర్చిపోయాడు. అట్లే అప్పటి వరకు ఎన్నో రోగాలను నోటి మాట చేత స్వస్థపరుస్తూ వున్న యేసును చూస్తూ ఉన్నా ఫిలిప్పు “తండ్రి ఏమి చెయ్యమంటారు చెప్పండి” అని అనాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదనే విషయం ఫిలిప్పుకు ఇంకా అర్ధం అయ్యినట్లు లేదు. ఈ పరీక్షలో ఫిలిప్పు ఫెయిల్ అయ్యాడు.

ఈ సంభాషణను ఫిలిప్పు ఇతర శిష్యులతో కూడా చెప్పాడు, వాళ్ళు ఒకరితో ఒకరు ఈ వింత ప్రశ్నను గురించి చర్చించుకొని ఉండొచ్చు. బోధకుడు ఇలా అన్నాడా? ఆయన ఉదేశ్యము అర్ధమవుతున్నట్లుగానే వుంది కాని ఇది ఎలా సాధ్యము? ఇంత గొప్ప సమూహమునకు భోజనమా? వాళ్ళు ఎన్నో మార్గాలను గురించి అలోచించి ఉండొచ్చు. ఒకవేళ బోధకుడు మనల్నే వెళ్లి ఇంతమందికి భోజనము కొనమంటే మనం ఎక్కడ కొందాం? ఇంతమందికి సరిపోయే భోజనం ఒక్క దగ్గరే దొరకదు. ఎలా కోఆర్డినేట్ చేధ్ధాం. ఈ నిర్జన్య ప్రాంతములో ఇంతమందికి భోజనము సిద్ధపర్చడం అందుకు కావలసిన వాటిని సమకూర్చడం సాధ్యం అయ్యే పని కాదు, ఏమి చేధ్ధాం. భోజనము కొనడానికి డబ్బు వారి దగ్గర ఉందొ లేదో మనకు తెలియదు. దానిని ఎలా సమకూర్చు కొంటారో చెప్పబడలేదు, శిష్యులు ఎంతో తర్జనభర్జన పడి ఉండొచ్చు. శిష్యులును, యేసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. వారు యేసును ఇతరులకు అందించువారిగా ఉండుటకుగాను పిలువబడి యున్నారనే విషయాన్ని మర్చిపోయి “అధిగమించలేని” అడ్డంకుల పై దృష్టి పెట్టారు. యేసును ఇతరులకు అందించే అవకాశాలు ఎన్నో ఉన్నా మనం కూడా శిష్యుల వలె అడ్డంకులను గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాం.

అట్లే ఈ పరీక్ష ఆయన చెయ్యబోయే అద్భుతం కోసం శిష్యులను సిద్ధం చేయడంలో సహాయపడింది. సాయంత్రమైపోతూ వుంది, వాళ్లకి ఒకటే సొల్యూషన్ కనిపించింది. ఏమయితే అయ్యింది మనం యేసు దగ్గరకు వెళ్లి మాట్లాడదాం అనుకొని పండ్రెండుగురు శిష్యులు యేసుని సమీపించి, –మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి, లూకా 9:12. అప్పుడు యేసు–వారు వెళ్లనక్కరలేదు, వెళ్లాల్సిన అవసరం లేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా;  అపొస్తలులు నిర్గాంతపోయివుండొచ్చు.

శరీరధారియైయున్న దేవుని సన్నిధానంలో ఉండి వాళ్ళ సజీవిమైన నేత్రాలతో అప్పటి వరకు యేసు చేసిన ప్రతి స్వస్థతకు సాక్షులై ఉంటూ కూడా, ప్రభువా ఏమి చెయ్యమంటారో చెప్పండి అని అనకుండా మేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడగటం ఆశ్చర్యం. వారి దగ్గర ప్రజలందరికి ఆహారము కొనేందుకు తగినంత డబ్బు లేదు అట్లే తగినంత ఆహారం కూడా వారికి అందుబాటులో లేదు. పరిస్థితి నిస్సహాయంగా కనిపిస్తూవుంది.

అందుకాయన–మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారి వద్ద ఉన్న వనరులు, దేవుడు వారికి ఏమి అందించాడో తెలుసుకొమ్మని ఆయన శిష్యులను ప్రజల మధ్యకు పంపించాడు. 5000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు లెక్కవెయ్యలేదు. అందరిని కలిపితే ఇంచుమించు 15000 మంది అని అంచనా. 14999 మంది దగ్గర తినడానికి ఏమీ లేదు. ఈ ఎంక్వయిరీలో శిష్యులు ప్రజల దృష్టిని ఆకర్షించారు. యేసు రొట్టెలడిగాడా? యేసుకా లేక ఆ రొట్టెలతో ఆయన ఏమైనా చెయ్యబోతూవున్నాడా? ఇప్పుడు యేసు ఏమి చేయబోతున్నాడని ప్రజలు శిష్యులను అడిగివుండొచ్చు. అందుకు శిష్యులు యేసుకు వారికి మధ్య జరిగిన సంభాషణను గురించి తెలియజేసి ఉండొచ్చు. ఏంటి? ఏమి జరగబోతూ ఉంది? ఏదో జరగబోతూ ఉంది ఏంటది? శిష్యులకు తెలియదు ప్రజలకును తెలియదు.

వారు చూచి తెలిసికొని ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ –ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలును తప్ప మరేమియు లేదని యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో చెప్పిరి.

యవల రొట్టెలు_ ఆనాటి కాలములో పేద వర్గాల ప్రజలు మాత్రమే బార్లీ రొట్టెలు పొగబెట్టి ఎండిపోజేసిన చేపలు తినేవాళ్లు. బాలుడి సమర్పణ పెద్దది కాదు. ఇద్దరు వ్యక్తులకు సరిపోనిది. ఇది పేదవాడైన ఒక చిన్న పిల్లవాని సంపూర్ణ సమర్పణ. కాని ఐదు వేల మంది పురుషులు మరియు అక్కడవున్న స్త్రీలకు పిల్లలకు అవి ఏమాత్రమును సరిపోవు.

అద్భుతానికై దేవుడు వారికి అందించినవి యింత మందికి ఇవి ఏమాత్రమని (శిష్యులు) ఆయనతో చెప్పిరి. అందుకాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండబెట్టిరి. లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి.

ద్రాక్షారసం కొరత ఉన్నప్పుడు కానాలో జరిగిన పెళ్లిలో చేసినట్లే యేసు ఇప్పుడు సమస్యను తన చేతులలోనికి తీసుకొన్నాడు. పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండ బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, ఆ చోట చాల పచ్చికయుండెను గనుక వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీర్చి అందరిని కూర్చుండ బెట్టిరి (మార్కు 6:40). వారు 5,000 మంది పురుషులను లెక్కించారు (స్త్రీలు మరియు పిల్లలుఎక్స్ట్రా), మత్తయి 14:21, అందరిని కలుపుకొంటే ఇంచుమించు 15,000 మంది భోజనము చేయుటకు పంక్తులలో కూర్చున్నారు.

కూర్చుండ బెట్టిరి – భోజనము కొరకు త్రొక్కిసలాట జరగకూడదని, ఏ ఒక్కరు ఈ సందర్భములో గాయపడకూడదని, బహుశా పంపిణీని మరింత క్రమబద్ధంగా చేయడానికి మరియు ఎవరూ తప్పిపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వాళ్ళు తిన్నంత భోజనము వాళ్లకు అందించుటకుగాను వారు క్రమములో అందరిని కూర్చుండబెట్టారు. ఆ జనసమూహము ఈ అభ్యర్థనకు విధేయత చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూవుంది. ప్రతి కన్ను ఆశ్చర్యంతో, ఆ క్షణాలను మిస్ కాకూడదని ఆశ్చర్యంగా యేసునే చూస్తూ ఉండొచ్చు.

అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి యేసు కూడా ఆ రొట్టెలు పట్టుకొని కూర్చున్నవారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారి కిష్టమైనంత మట్టుకు వడ్డించెను

ఆకాశమువైపు కన్నులెత్తి_ తండ్రితో సంబంధాన్ని తెలియజేస్తూవుంది. తండ్రి మద్దతును చూపిస్తూవుంది. కృతజ్ఞతాస్తుతులు _ అక్కడ కూడుకొనియున్న ప్రజల కొరకై తండ్రి ఏర్పాటుచేసిన బహుమానాన్ని బట్టి తండ్రికి ధన్యవాదాలు తెలియజేసి, ఆశీర్వదించి_ అందరికి సరిపోయేలా ఈ కొద్దిపాటిని దీవించియున్నాడు.

సమూహానికి గొప్ప ధైర్యం అవసరం. ఇదేమి మేజిక్ కాదు. ప్రజలు తినడానికి మొదట భయపడి ఉండొచ్చు. వారు వాటిని పట్టుకొన్నారు వాసన చూసారు రుచి చూసారు తిన్నారు. అందరికి ఆహారాన్ని అందిస్తున్న శిష్యులకు కూడా విశ్వాసం మరియు ధైర్యం అవసరం.

ప్రజలకు వడ్డించే పని శిష్యులది. గంపలో తరగని రొట్టెలు/ తరగని చేపలు, ప్రజలందరూ తినడానికి “వారికి కావలసినంత” వరకు సరఫరా ఆగిపోలేదు. వారు ఇతరులకు ఆహరం పంచిపెడుతూ ఉంటే ఆహరం ఇంకా ఎక్కువైన సంగతి గమనించండి. ప్రభువు ఆహారాన్ని ఇచ్చినపుడు శిష్యులు ప్రజలకు సులభముగా పంచిపెట్టగలిగారు, పంచిపెట్టారు.

మన శరీరానికి మరియు ఆత్మకు కావలసినదంతా దేవుని నుండి వచ్చినదని గుర్తించి, మనం కూడా మన జీవనాధారమైన ఆహారం తినడానికి కూర్చున్న ప్రతిసారీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి.  

కొందరు వాటిని తమ ఇండ్లకు తీసుకొని వెళ్లియుండొచ్చు. పరిసయ్యులు సద్దూకయ్యులు శాస్త్రులు మొదలైనవారు కూడా వీటిని చూసివుండొచ్చు తాకి ఉండొచ్చు, రుచి చూసి ఉండొచ్చు. రెండు మూడు రోజులైనను సాధారణ రొట్టెలువలే ఇవి ఉన్నాయి తప్ప మాయమై పోలేదు.

ఈ అద్భుతం క్రీస్తు గురించి మనకు ఏమి బోధిస్తుంది? ఆయన కేవలం మనిషి కంటే ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తుంది. నిజ దేవునిగా నిజ మానవునిగా ఆయన బల ప్రభావములే కాకుండా ఆయన కనికరము కూడా ఇక్కడ వెల్లడవుతూ ఉంది. ఆయన దేవుడు ఆయన ఇక్కడ చేసినది దైవికమైన కార్యము.

యేసు చేసిన అద్భుతం ప్రజలపై చూపిన ప్రభావాన్ని గురించి యోహాను 6:14, 15 తెలియజేస్తూ ఉంది. వారు ఆయన చర్యలో పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పును చూశారు. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి–నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అయితే, వారు తమ పాత నిబంధనను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ద్వితీ 18:16లో మోషే వాగ్దానం చేసిన ఆ గొప్ప ప్రవక్త తమ మధ్యకు వచ్చాడనడానికి ఇది సూచన అని ప్రజలు అనుకొన్నారు. ఇది నిజమే, యేసు ఆ ప్రవక్తే. అయితే ఆయన ఉద్దేశ్యము, నెరవేర్చవలసిన కార్యము గురించి వారికెలాంటి అవగాహనగాని గ్రహింపుగాని లేదు.

వెంటనే ఆయనను బలవంతంగా రాజుగా చేయాలని కోరుకున్నారు. తమ పూర్వీకులు అరణ్యంలో మోషే కింద నీరు, మన్నా మరియు పిట్టలను ఎలా పొందారో వారు గుర్తుచేసుకొని ఉండొచ్చు. మోషేలానే ఈ ప్రవక్త కూడా తమకు ఆహారం ఇవ్వాలని వారు కోరుకున్నారు. భూసంబంధమైన అధికారము అనే శోధనతో వాళ్ళు యేసును శోధించారు. సాతాను కూడా యేసుకు భూసంబంధమైన అధికారము ఇస్తానని శోధించాడు (మత్తయి 4:8, 9). వారికి దేవుని కుమారుడిగా ఆయనలో నమ్మకం లేదు. తమ దేశములో నుండి రోమ్ పరిపాలనను తొలగించి శాంతి సౌభాగ్యాలను తెచ్చే ఇహలోక రాజ్యం గురించే ఆలోచిస్తున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ ను జనసమూహము సాధారణమైనదిగా తీసుకోవడం దిగ్బ్రాంతి కలుగజేస్తూవుంది. వారంతా తిని, తృప్తి చెంది, తమ దారిన వెళ్లిపోయారు. అద్భుతం జరిగిందని ప్రేక్షకుల నుండి ఏమాత్రమును స్పందన లేదు, గుర్తింపు లేదు. కానాలోని పెళ్లిలో విందు యజమాని వలె, ఆహారం ఎక్కడ నుండి వచ్చిందో గుంపుకు తెలియదు. కానీ శిష్యులకు తెలుసు! ఇది శిష్యులకు ఒక అద్భుతం, దేవుని రాజ్య రహస్యాలలో ఒకటి (లూకా 8:10 ఆయన–దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి).

వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవలరొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి

12 గంపలు మిగిలాయి_ ఈ కథని నేను నా సండే స్కూల్లో చెప్పిన తరువాత 12 గంపలు మిగిలాయి కదా ఎందుకని అని అడిగితే, ఒక పిల్లోడు లేచి, పాస్టర్ గారు, 12 మంది శిష్యులు రొట్టెలు చేపలు అంతమందికి పంచి పెట్టారు కదండి, వారి సేవను బట్టి ఒక్కొక్క శిష్యునికి ఒక్కొక గంప చొప్పున వారి కొరకు మిగిలేలా యేసు చేసాడు అని చెప్పాడు, మీరేమంటారు?

పంపిణీతో అద్భుతం అయ్యిపోలేదు. అక్కడ మిగిలిపోయినవి, ప్రతి శిష్యుడికి ఒకటి చొప్పున జరిగిన అద్భుతానికి సాక్ష్యముగా 12 బుట్టలలో సరిపడా బార్లీ రొట్టె ముక్కలు, చేపలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన విషయాలలో కూడా శిష్యులు చేయగలిగినది ఇదే. లోకమంతటి అవసరాలను తీర్చేందుకు చాలినంత ఆహరం క్రీస్తు సువార్తలో ఉంది. దేవునికి పంచిపెట్టే వాళ్ళు కావాలి. ఇది వాళ్ళు జీవపు రొట్టెతో దేశాలను పోషించే ఆధిక్యత కలిగి ఉన్నారనడానికి సాదృశ్యముగా ఉంది, అలాగే వారికి అక్కడ ఉపయోగార్ధముగా కూడా ఉంది. అది సంతృప్తినిచ్చే ఆహరం, జీవాహారము కూడా. ప్రభువు అందజేసాడు.

ఇది యేసులో నిజ మానవుడు మరియు నిజ దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ ధ్రువీకరిస్తూ ఉంది. మన ప్రభువు శిష్యులను తన అనుగ్రహాన్ని పంచేవారుగా నియమించుకున్నాడు. యేసుక్రీస్తు ఆయనే నిజమైన రొట్టె. ఈ పంపిణీలో క్రైస్తవ పరిచారకుల కార్యాలయం గురించి మరియు వారి పనిని గురించి నేర్చుకోండి. అవిశ్వాస లోకానికి రక్షకుని పరిచయం చెయ్యండి. యేసు సర్వశక్తి మంతుడు. మన పేద వనరులను, సరిపోని వనరులను అనేకులకు దీవెనగాను మనకు ఆశీర్వాదకరముగాను ఉండులాగున క్రీస్తు వద్దకు తీసుకొని వెళ్దాము.

యేసు ఐదు రొట్టెలతో 12 బుట్టలను మాత్రమే నింపగలిగితే, ఆయన ఒక అద్భుతం చేశాడు, కానీ 15వేలమంది తిన్న తర్వాత మిగిలిపోయాయి మరి దీనిని ఏమందాం?

యేసు చేసిన అద్భుతంలోని నిజమైన సత్యాన్ని ప్రజలు అర్ధంచేసుకోలేకపోయారు. వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి దేవునిచే పంపబడిన వాగ్దానం చేయబడిన క్రీస్తు ఆయన. వాళ్ళు ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా అనుకొన్నారు తప్ప తమ మెస్సయ్యగా ఆయనను గుర్తించలేక పోయారు. వారి ఆలోచనలను తెలుసుకున్న యేసు, అక్కడినుండి వెళ్లిపోయాడు.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.