అంశము: యాకోబు ఏశావుల కధలో వాళ్లిద్దరూ ఇస్సాకు రిబ్కాలు కూడా చెల్లించిన వెల ఎంతో మీకు తెలుసా?

ఏశావు జేష్ఠత్వమును అమ్ముకోవడం

ఆదికాండము 25:21-34_21ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. 22ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగులాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగవెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– 23రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. 24ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. 25మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. 26తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు. 27ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. 28ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను. 29ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి 30–నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. 31అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా 32ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను 33యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా 34యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అట్లే ఆదికాండము 27:1-46 వచనాలలో యాకోబు ఇస్సాకును దీవెనల విషయములో మోసగించడాన్ని ఎలా అర్ధం చేసుకొందాం?

  1. ఏశావు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూవున్నాయి?
  2. యాకోబు స్వభావము ప్రవుత్తి అతనిని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూవున్నాయి?
  3. ఇస్సాకుకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని? రిబ్కాకు ఏ కుమారుడంటే ఇష్టం ఎందుకని?
  4. వీరి ఇష్టాలు త్రీవ్రమైన ఒక సమస్యకు కారణమయ్యాయి. ఎలా?
  5. జేష్ఠత్వముతో ఏయే విషయాలు ముడిపడి వున్నాయి?
  6. ఏశావుకు తనకు ఇవ్వబడిన జేష్ఠత్వము దానితో ముడిపడియున్న విషయాలను గురించి తెలుసా?
  7. ఏశావు ఏ పరిస్థితులలో తన జేష్ఠత్వమును తృణీకరించాడు?
  8. ఏశావు బ్రష్టుడు వ్యభిచారి అని చెప్పబడింది కదా ఆ మాటలకు అర్ధమేమి?
  9. యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకన్నాడు గదా. ఏశావు ఇలా ఎందుకన్నాడు?
  10. ఏశావు దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను తెలిసే అమ్ముకొన్నాడని ఎలా చెప్పగలం?
  11. సహోదరుడు ఆకలిగొని ఆహారాన్ని అడిగితే ఆ ఆహారాన్ని యాకోబు అమ్మడం అనేది మెచ్చుకోదగిన విషయమా? ఆహారాన్ని అమ్ముటకు కారణాలు ఏమై ఉండొచ్చు?
  12. ఈ విషయములో యాకోబులో మెచ్చుకోదగిన అంశము ఏంటి?
  13. యాకోబు జ్యేష్ఠత్వాన్ని ఏశావు నుండి పొందుకొన్నాడు. దానిని ఎలా నిర్ధారించుకున్నాడు?  
  14. ఏశావు ఏ విధముగా తన స్వీయ చిత్తములో  దైవిక మార్గము నుండి తొలగిపోయి ఉన్నాడు?
  15. ఇస్సాకు నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం?
  16. ఇస్సాకు ఏశావును దీవించదలచానని అతనితో చెప్పడం రిబ్కా విని  ఆమె ఏమి చేసింది?
  17. ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనలు ఏంటి? ఈ దీవెనలు ఏశావుకు ఇస్సాకు ఇవ్వవలసినవా ?
  18. ఇస్సాకు ఎందుకని వణికాడు?
  19. జరిగిన దానిలో ఏశావు దేవుని హస్తాన్ని ఎందుకని చూడలేక పోయాడు?
  20. ఇస్సాకు కుటుంబంలోని నలుగురు అధర్మముగా ప్రవర్తించుటను బట్టి వాళ్ళు చెల్లించిన వెల ఏంటి?
  21. దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో నిత్యరక్షణకు కొందరు నిత్యత్వములో కృపలో ఏర్పరచబడి యున్నారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడియున్నారని చెప్పొచ్చు. అలాగే మఱొకప్రక్క కొందరు ఉగ్రతకొరకు ఏర్పరచబడ లేదని అంటే నరకమునకు ముందుగానే నిర్ణయింపబడలేదని మనం చెప్పొచ్చు. కరెక్ట్ ఆ తప్పా?    

25:27_ ఏశావు యాకోబులు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగానుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను అనే మాటలు ఇరువురు పెరిగి పెద్దయ్యాక, వాళ్ళ స్వభావాల్లో వచ్చిన స్పష్టమైన తేడాలను తెలియజేస్తూవున్నాయి. ఏశావు వేటాడుట యందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను అనే మాటలు ఏశావు వేటలో ఉన్న రిస్కుని భావోద్వేగమును వేటలో జంతువులను పట్టుకోవడంలో వేసే మోసపూరిత వ్యూహాలను ఇష్టపడుతూ ప్రమాదకరమైన జీవితాన్ని జీవించడంలో సంతోషించేవాడని అందుకోసం అడవులలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ అరణ్యవాసిగా ఉండేవాడని ఈమాటలు తెలియజేస్తూవున్నాయి. ఇస్సాకు తనలో లేని ప్రత్యేకతను తన కొడుకైన ఏశావులో చూసి ఏశావు పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏశావు తెచ్చిన వేట మాంసమును ఇష్టపడుచు తినుచుండెను గనుక ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను అనే మాటలు యాకోబు నెమ్మదస్తుడని ఏశావులా ప్రమాదకరమైన జీవితమతనిది కాదని తన తండ్రి తాతలాగే గొర్రెల కాపరిగా ఉండటాన్ని ఇష్టపడ్డాడని భక్తిపరుడై ఇంటి జీవితంలో చాలా ఆనందాన్ని పొందుటకు ఇష్టపడే నెమ్మదస్తుడైన యాకోబును తల్లియైన రిబ్కా సహజంగానే ప్రేమించింది.

ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహామును గురించి దేవునితో అబ్రాహాముకుగల సంబంధమును గురించి, చెయ్యబడిన వాగ్ధానాలను గురించి, తన గురించి, దేవునితో తనకుగల సంబంధమును గురించి తన కుటుంబముకున్న ప్రత్యేకతను గురించి తన పిల్లలకు చెప్పే ఉంటాడు. కవలలు పుట్టకముందే యెహోవా ఇచ్చిన వాగ్దానాన్ని రిబ్కా తన చిన్నకుమారునితో చెప్పి ఉండొచ్చు. తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డ ఉండటం ఇక్కడ సమస్యకు కారణం అయ్యింది. యాకోబు ద్వారా మెస్సయ్యను తేవాలనే దేవుని ఉద్దేశ్యములో జోక్యం చేసుకొనేంతగా, ప్రయత్నించేంత తీవ్రమైన సమస్యకు కారణమయ్యింది.  

జుడాయిజంలో జేష్టుడు చాల ప్రాముఖ్యమైన కాన్సెప్ట్. కాబట్టి జేష్టునిగా ఉండటం మూలాన్న వచ్చే దీవెనలను గురించి ఏశావుకు తెలుసు. ద్వితీయోపదేశకాండము 21:17 ప్రకారము జేష్టుడు వారసత్వములో రెట్టింపు భాగానికి అర్హుడు. ఆదికాండము 27:29 ప్రకారము తండ్రి తరువాత సర్వహక్కులు అధికారాలు మొదటి బిడ్డకే వస్తాయి, అతడు కుటుంబానికి ఏలికగా ఉంటాడు. తండ్రి తరువాత తండ్రి స్థానములోనికి వస్తాడు. యాజకత్వము కూడా జేష్ఠత్వముతో ముడిపడివుంది (ఆదికాండము 28:26-29; 28:4) కాబట్టి జేష్టుడు తన కుటుంబమును దేవుని భయభక్తులలో కూడా నడపవలిసి ఉన్నాడు. దేవుని వాగ్దానాలకు అతడు టైటిల్ గా ఉంటాడు. ఆ వాగ్ధానాలను ఆదికాండము 27:27-29 లో మనం చూడొచ్చు.

కాని ఇక్కడ ఈ విషయాలన్ని ఎరిగి జేష్టునిగా ఉన్న ఏశావు దేవుడు తనకు బహుమానంగా ఇచ్చిన తన జేష్ఠత్వపు హక్కుకు అంతగా విలువనివ్వక పోవటం విచారించదగిన విషయం. యాకోబుకు కూడా ఈ విషయాలన్ని తెలుసు, అవి దేవుని ఉద్దేశ్యాల నెరవేర్పు కొరకు ఎదురుచూసేలా యాకోబును నడిపించాయి.

ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను అని బైబులు చెప్తూవుంది. (ఈ రోజుకు కూడా సిరియా ఐగుప్తులో ఈ వంటకం వాళ్లకు ఫేవరెట్ డిష్).

యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకన్నాడు. ఇస్సాకు ధనవంతుడు ఇంట్లో చాలా మంది సేవకులు ఉన్నారు. కాబట్టి ఆహారము ఎల్లప్పుడు సమృద్ధిగానే  ఉంటుంది. ఏశావు ఆకలితో మరణించే సమస్యే లేదు. ఏశావు సేవకులతో యేసేపు తయారు చేసిన వంటకాన్ని తాయారు చేసి తెమ్మని చెప్పి ఉండొచ్చు లేదా ఏశావుకు యాకోబు వంటకాన్ని తినాలని అనిపిస్తే తన తల్లితోగాని తండ్రితోగాని చెప్పి యాకోబు దగ్గరనుండి కొంత తెప్పించుకొని తిని ఉండొచ్చు.

ఏశావు తెలిసే జేష్ఠత్వపు హక్కును వదులుకుంటున్నాడు. ఏశావుకు తన జేష్ఠత్వపు హక్కుతో పాటు దానితో ముడిపడివున్న ఆశీర్వాదాలను ఇచ్చి వేస్తున్నానని తెలుసు. ఎందుకంటే, ఆ ఆశీర్వాదములు ఆధ్యాత్మిక స్వభావం కలిగినవి, అతని దృష్టిలో వాటికి విలువ లేదు, కాబట్టే నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకు? అని అన్నాడు. ఇదిగో నా ఈ ప్రమాదకరమైన ప్రవృత్తిలో (ఈ వేటలో) నేను ఎప్పుడన్నా చనిపోవొచ్చు, అప్పుడు నా జేష్ఠత్వపు హక్కు వలన నాకు కలిగే ప్రయోజనమేంటి? (అంటే దేవుడు నా తాతతో నా తండ్రితో చేసిన వాగ్దానాలు నాకెలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు) అనే నిర్లక్ష్యపు జవాబు, అతనికి విలువైనది వర్తమాన ఇంద్రియ ఆనందమేనని తెలియజేస్తూ ఉంది. భవిష్యత్ యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను ఏశావు అంచనా వేయలేక పోయాడు. దేవుడు అబ్రాహాము ఇస్సాకులకు చేసిన వాగ్దానాలకు (వాగ్దాన దేశమును గూర్చి మరియు మెస్సయ్యనిక్ లైన్ ని గూర్చిన వాగ్దానాలకు) ఎలాంటి విలువను ఇవ్వక ఆ ఘడియలో తన అవసరం తీరితే చాలనుకొన్నాడు. దాని కోసం తనకు దేవునిచే ఇవ్వబడిన ఆధిక్యతను ఏశావు అమ్ముకొన్నాడు.

సహోదరుడు ఆకలిగొని ఆహారాన్ని అడిగితే ఆ ఆహారాన్ని యాకోబు అమ్మడం అనేది మెచ్చుకోదగిన విషయమా? యాకోబు ఏశావుకు ఆహారాన్ని అమ్ముటకుగల కారణాలు ఏమై ఉండొచ్చు? ఇస్సాకు తరువాత వాగ్ధానాలను యాకోబు ముందుకు తీసుకువెళ్తాడనేది, దేవుడు తన ముందస్తు జ్ఞానములో తెలియజేసిన మాట. కాని ఇది ఎలా జరుగుతుందో యాకోబుకు తెలియదు. జేష్టుని స్థానములో ఏశావు ఉన్నాడు. ఏశావు విషయములో దేవుడేమి చెయ్యబోతున్నాడో తన వాగ్దానాన్ని దేవుడు ఎలా నిలబెట్టుకుంటాడో అనే విషయములో యాకోబు ఎదురు చూడలేదు, నేనిలా చేస్తే బహుశా దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో నాకు సహాయపడగలడని అనుకున్నాడు. యాకోబు దేవుని సామర్థ్యంపై సంపూర్ణమైన నమ్మికను ఉంచకపోవడం మెచ్చుకోదగిన అంశము కాదు.

అయితే ఆత్మీయమైన విలువల పట్ల యాకోబుకున్న జాగరూకత నిజంగా మెచ్చుకోదగిన అంశం. ఏది విలువైనదో, దానిని కలిగియుండటం ఎంతటి విలువైనదో యాకోబు తెలుసుకొన్నాడు. కాబట్టే యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని అడిగాడు. పూటకూటి కోసం తన జేష్ఠత్వపు హక్కును అమ్ముకోవడానికి ఏశావు ఇష్టపడియున్నప్పటికిని, అతని కడుపు నిండిన తరువాత అతడు తన మనస్సు మార్చుకొంటాడేమో అని యాకోబు అనుకొన్నాడు కాబట్టే యాకోబు ఏశావును ఈ విషయములో ప్రమాణము చెయ్యమని అడిగాడు. ప్రమాణము చెయ్యడమంటే, ఏశావు దేవునిని సాక్షిగా పిలిచి ఆయన తనకు ఇచ్చిన జేష్ఠత్వపు హక్కులను ఆయన ఎదుటే యాకోబుకు బదిలీచేయ్యడం అన్న మాట. ఇది కూడా ఏశావును భయపెట్టలేదు. ఏశావు ఆలోచనలు పూర్తిగా “పూటకూటి” పైనే ఉన్నాయి అని స్పష్టంగా అర్ధమవుతూ ఉంది. అతడు తిని త్రాగి లేచిపోయెను, అనే మాటలు ఏశావు నిర్లక్ష్యపు ధోరణిని తెలియజేస్తూ ఉన్నాయి. ఏశావు నిర్లక్ష్యపు స్వభావము ఏశావును తీర్పులోనికి శిక్షావిధిలోనికి త్రోసివేశాయి. శరీరానుసారమైన ఏశావు స్వభావము అతనికి ఇవ్వబడిన వాగ్ధానాలను పోగొట్టుకొనేలా చేసింది.

కాబట్టే, ఏశావు దేవునిచే గొప్పగా ఆశీర్వదించబడియున్నప్పటికిని దేవునిని నిర్లక్ష్యము చేసి ఆ గొప్ప దీవెనలను పోగొట్టుకొనిన వ్యక్తిగా లేఖనాలలో ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు, హెబ్రీయులకు 12:16,17_ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడెనని తెలియజేస్తూ ఉంది.

ఈ లోకములో ఇప్పటివరకు ఎవరు చెల్లించనంత వెలను ఒక పూటకూటి కొరకు చెల్లించిన బుద్దిహీనుడు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఏశావు మాత్రమే. పూటకూటి కొరకు తన జన్మహక్కును విక్రయించాడు. దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వము అనే ఆధిక్యతను తృణీకరించిన, భ్రష్టుడు, వ్యభిచారి. భ్రష్టుడు అంటే మాటల ద్వారా కాని ప్రవర్తన ద్వారా కాని తాను నమ్ముతున్న దేవునిని అపహాస్యం చేయువాడని, నిర్లక్ష్యం చేయువాడని, రక్షణతో ముడిపడియున్న హక్కులను బహిరంగంగా త్యజించడం ద్వారా దేవునిని ధిక్కరించే వాడని, పరిశుద్ధమైన వాటి పట్ల గౌరవములేని వాడని అర్ధం. వ్యభిచారి అంటే ఒకచిన్న వస్తువు కొరకు ఒక కొడుకుగా దేవుని ద్వారా తనకు లభించిన జేష్ఠత్వము అనే అత్యున్నతమైన గౌరవాన్ని త్రోసిపుచ్చిన వాడు అనే అర్ధంలో ఇక్కడ ఈ మాట వాడబడింది. ఈ రెండు మాటలు ఏశావు స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే జేష్ఠత్వపు హక్కును అమ్మడం అమ్మకపోవడం అనేది ఏశావు స్వీయ చిత్తముపై ఆధారపడి ఉందనే విషయాన్ని మరచిపోకండి.

ఆదికాండము 26:34_ ఏశావు నలువది సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కా కును మనోవేదన కలుగజేసిరి. ఈ వచనము కూడా ఏశావు స్వభావాన్ని తెలియజేస్తూవుంది. ఏశావు తన తండ్రి ప్రత్యేక ప్రేమకు పాత్రుడైయున్నప్పటికి, ఏశావు అదే ప్రేమను తన తండ్రికి తిరిగి ఇవ్వలేక పోయాడు. తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా, అతడు హీత్తీయులైన ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. ఈ చర్యతో అతడు దేవునిని అగౌరపర్చాడు. తన తాత తన తండ్రికి దేవుడు చేసిన వాగ్దానాల పట్ల లెక్కలేనితనాన్ని ప్రదర్శించాడు. వాగ్దాన దేశంలో భాగం కావడంలో అలాగే తన వారసులు వాగ్దానం చెయ్యబడిన ఆశీర్వాదాలను పంచుకోవడంలో ఏశావుకు పెద్దగా ఆసక్తి లేదు అనే విషయం ఈ చర్య ద్వారా స్పష్టముగా అర్ధమవుతూ ఉంది. ఏశావు ఎంచుకున్నహీత్తీయ భార్యలు అవిశ్వాసులు, వారు తమ పిల్లలకు యెహోవాను ప్రేమించడంలో మరియు ఆయన వాగ్దానాలకు కట్టుబడి ఉండే విషయములో శిక్షణ ఇవ్వలేరు. వారు దేవుని తీర్పు క్రిందకు వచ్చే కనాను తెగకు చెందినవాళ్లు. ఏశావు తన స్వీయచిత్తములో దైవిక మార్గం నుండి పూర్తిగా తొలగిపోయాడు.

ఇప్పుడు ఆదికాండము 27:4_ఇస్సాకు నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచి గల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పెను అను మాటలను ఎలా అర్ధం చేసుకొందాం. యాకోబుకు దేవుడు దీవెనలను ఇచ్చియున్నాడని ఇస్సాకుకు ముందే తెలుసు. మరి ఇస్సాకు ఏశావును పిలిచి ఇలా ఎలా చెప్తాడు?

ఈ అధ్యాయం ఇస్సాకు కుటుంబం యొక్క ముఖచిత్రాన్ని చూపిస్తూవుంది, అది ప్రశంసించ తగినదిగా లేదు. బలహీనపడిన ఇస్సాకు పరిస్థితి అతడిక ఎక్కువ కాలం జీవించడనే విషయాన్ని అతనికి గుర్తుచేసి ఉండవచ్చు. కాబట్టే తాను చనిపోయే ముందే, ఇస్సాకు జేష్ఠకుమారుని హక్కులను తన అభిమాన కుమారుడైన ఏశావుకు బదిలీ చేయాలను కొని నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని ఏశావుకు చెప్పాడు. ఇస్సాకు ఈ చర్యను మెచ్చుకోలేము అలాగని డిఫెండ్ కూడా చెయ్యలేము.

తాను ఏశావుకు ఆశీర్వాదం ఇచ్చినా, దేవుని అసలు ఉద్దేశ్యమునకు ఎలాంటి విఘాతము కలుగదని ఇస్సాకు తనను తాను ఒప్పించుకొని ఉండొచ్చు. ఇంకా, ఏశావు తనకు అభిమాన కుమారుడు కాబట్టి, నిబంధనకు లింకుగా ఉండటానికి ఏశావు అనర్హుడైయున్నప్పటికిని ఇస్సాకు ఏశావులోని లోపాలను పట్టించుకోలేదు. ఇద్దరు అన్యజాతి స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా ఏశావు ప్రభువు వాగ్దానం పట్ల పూర్తి ఉదాసీనతను చూపించియున్నాడని మనకు అర్ధమయ్యింది. దేవుని శాసనాన్ని మార్చాలనుకొనే ఇస్సాకు ఉద్దేశ్యం పాపభరితమైనది.

ఏశావు ఆ పాపపు అపరాధంలో పాలుపంచుకున్నాడు. తన తండ్రి ప్రణాళికను అంగీకరించడమంటే, ఏశావు యాకోబుకు తన జేష్ఠత్వపు హక్కును విక్రయించిన సమయంలో చేసిన తన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.

ఇస్సాకు ఏశావును దీవించదలచానని అతనితో చెప్పడం రిబ్కా విని ఆమె ఎంతో నిరాశకు లోనయ్యింది. పితరులు దీవెనలను ఉచ్చరించేటప్పుడు దేవుని ప్రతినిధులుగా మాట్లాడతారని రిబ్కాకు తెలుసు. కాని ఇక్కడ ఇస్సాకు తన ఇష్టానికి అనుగుణముగా తాను ఏశావును దీవించదలచానని చెప్పడం విన్న రిబ్కా ఎంతగానో భయపడింది. తాను ఇప్పుడు ఏదో ఒకటి తొందరపడి చెయ్యకపోతే, అది కూడా ఏశావు వేట నుండి తిరిగి రాకముందే తొందరపడి చెయ్యకపోతే, తన ప్రియకుమారుడైన యాకోబు శాశ్వతముగా ఆశీర్వాదాన్ని కోల్పోతాడని ఆమె భయపడింది తప్ప ఇలా చెయ్యటం ధర్మమా అధర్మమా అని ఆలోచించలేదు.

ఒక వైపు, తన భర్త దేవుని సంకల్పంకు ఎదురు వెళ్తున్నాడని రిబ్కాకు తెలుసు. ఈ విషయములో రిబ్కా తన భర్తను హెచ్చరించి ఉండొచ్చు. కొందరేమో, రిబ్కా దేవుని వాగ్దానం మీద ఆధారపడి, ఇస్సాకు ఆశీర్వాదం యాకోబుకు మాత్రమే దక్కాలని, దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఆమె తన వంతు తాను చేయాలని భావించిందని; ఈ మేరకు ఆమె తాను ఏమి చేయగలదో అంతా చెయ్యాలని అనుకొని తన వ్యూహం విజయవంతం అవుతుందని శాపం సంభవించే అవకాశమే లేదని అనుకొందని కొందరు చెప్తుంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే క్రమములో ఆమె చేసిన ప్రశంసనీయమైన ప్రయత్నంలో ఆమె మోసానికి పాల్పడింది. ఆమె ప్రేరణ దేవునికి మహిమను తేవటం కాదు, తన అభిమాన కుమారుడి సంక్షేమం. తన భర్త తినే మేకమాంసాన్ని అతడు అడవి జంతువు మాంసముగా భావించేటట్లు అతనిని మోసగించడానికి ఆమె తన వంట సామర్ధ్యాన్ని ఉపయోగించడమే కాకుండా మందదృష్టి కలిగిన ఇస్సాకును మోసగించేటట్లు తన కుమారుడైన యాకోబును ఒప్పించింది.

అమ్మా, నాన్నకు ఈ విషయం తెలిసిపోతే నా మీదికి శాపమేగాని ఆశీర్వాదము తెచ్చుకొననని యాకోబు తల్లితో చెప్పడం సముచితం. కాని అతని తల్లి– వెంటనే నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చును గాక అని చెప్పి యాకోబును సంతృప్తిపరచింది. యాకోబు ఉద్దేశ్యపూర్వకముగానే తన తండ్రిని మోసం చేసాడు, ఏశావులా ప్రవర్తించాడు. ఒకవేళ ఇస్సాకు యాకోబు మోసాన్ని పసిగట్టి ఉంటే యాకోబు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి.

ఇస్సాకు తికమకపడినా తన కుటుంబసభ్యులు తనను మోసగిస్తారని అనుకోలేదు. ఏశావు అనుకోని యాకోబును దీవించాడు: ఆదికాండము 27;27-29_ ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక. ఈ మాటలలో మెస్సియానిక్ ఆశీర్వాదం గురించి ఏమీ లేదు కాని ఇస్సాకు ఏశావు అని ఊహించుకొంటున్న కొడుకుపై ప్రకటించిన భౌతికమైన ఆశీర్వాదాలను గురించి తెలియజేస్తూవుంది. ఈ దీవెన ఓకే. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు. నిన్ను దీవించు వారు దీవింపబడుదురు గాక. ఈ దీవెన ఇస్సాకు ఏశావుకు ఇవ్వకూడనిది. యాకోబుకు ఉద్దేశించబడినది. కాని ఇస్సాకు యాకోబుకోసం దేవుడు నియమించిన ఒక ఆశీర్వాదమును ఏశావుకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇస్సాకు తన అహంకారపూరితమైన స్వీయ-సంకల్పoలో యాకోబుకు ఇవ్వవలసిన దీవెనను ఏశావుకు ఇవ్వాలని అనుకొన్నను దేవుని చిత్తప్రకారముగా ఆ దీవెన యాకోబుకే దక్కింది. దేవుని చర్యను గమనించారా. రిబ్కా యాకోబుల మోసాన్ని బట్టి యాకోబుకు ఈ దీవెన లభించలేదు. ఇది రిబ్కా యాకోబుల మోసాన్ని క్షమించదు. పాపం పాపమే.

తరువాత ఏశావు ఇస్సాకు వద్దకు వచ్చి నా తండ్రి నన్ను దీవించుమని అడిగినప్పుడు, ఇస్సాకు నీవు ఎవరవని ఏశావును అడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకెను అని బైబులు చెప్తూవుంది. ఇస్సాకు ఎందుకని వణికాడు? ఇస్సాకు మోసపోయానని తెలుసుకొని నిశ్చేష్టుడై ఉండొచ్చు. అలాగే తాను దేవునికి వ్యతిరేకముగా యాకోబుకి ఇవ్వవలసిన దీవెనను ఏశావుకు ఇవ్వాలనుకొన్నను, అందులో దేవుడేలా జోక్యం చేసుకొని ఆ దీవెన చేరవలసిన వారికి చేరేటట్లు చేసియుండటాన్ని తలచుకొని గడగడా వణికి ఉండొచ్చు. దేవుని జోక్యం అంటే దేవుడు తనను మందలించడం అని ఇస్సాకు గ్రహించాడు. దీవెన విషయములో దేవుడు జోక్యం చేసుకున్నాడని దేవుడు చేసిన దాన్ని మార్చడానికి తాను నిస్సహాయుడనని దానిని మార్చలేననే విషయాన్ని ఇస్సాకు గుర్తించాడు. కాబట్టే ఇస్సాకు నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా అని బైబులు చెప్తూవుంది. ఇస్సాకు దేవుని ఆత్మ ద్వారా ఏశావుకు అతని వారసులకు ఏమి జరుగుతుందో దీవెనగా ప్రవచించాడు తప్ప ఇస్సాకు ఏశావుకు ఆశీర్వాదం ఇవ్వలేకపోయాడు.

జరిగిన దానిలో ఏశావు దేవుని హస్తాన్ని చూడలేకపోయాడు. కోపము అతనిని గ్రుడ్డివానిని చేసింది. ఏశావు యాకోబు మీద పగబట్టాడు. యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఏశావు హంతక పథకం గురించి రిబ్కా తెలుసుకొని, యాకోబును ఉత్తరాన ఐదు వందల మైళ్ల దూరంలో ఉన్న హారానులో ఉన్న తన సోదరుడి ఇంటికి పంపిస్తూ అక్కడ కొన్నాళ్లు ఉండుము. నేను నిన్ను మళ్ళీ పిలిపిస్తాను అని చెప్పి పంపింది.

రిబ్కా కుతంత్రాలు యాకోబు అబద్దాలు దేవునిని కొంచం కూడా మహిమపరచడం లేదు. దేవుని వాగ్ధానాలను ముందుకు తీసుకు వెళ్లే క్రమములో వాళ్ళు దేవునిపై నమ్మకాన్ని ఉంచియున్నారనే విషయాన్ని వాళ్ళ క్రియలు వెల్లడించడం లేదు. దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన దానిని యాకోబు తీసుకోవడం తప్పు కాదని అనేకులు వాదిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితులలోనైనా దేవుని ఉద్దేశ్యాలు తప్పకుండా నెరవేరుతాయి అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇస్సాకు కుటుంబంలోని నలుగురు సభ్యులు అధర్మముగా ప్రవర్తించారు, అందుకోసం ప్రతి ఒక్కరూ భయంకరమైన వెలను చెల్లించారు. రిబ్కా యాకోబులు ఈ ఎపిసోడ్లో చాల వెలను చెల్లించారు. కొన్నాళ్లు అని రిబ్కా అనుకొంది దేవుడు దానిని 20సంవత్సరాల వరకు పొడిగించాడు, ఆమె అభిమాన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, రిబ్కా చనిపోయింది. యాకోబు దీవింపబడినప్పటికి చేతికర్రతో మాత్రమే మిగిలాడు. 20సంవత్సరాలు దేవుని శిక్షణ తరగతిలో చేరాల్సి వచ్చింది. తాను ఎంతగానో ప్రేమించిన ఏశావు దేవుని దృష్టిలో భ్రష్టుడుగా వ్యభిచారిగా ఉండటం ఇస్సాకును ఎంతో కలవరానికి గురి చేసి ఉండొచ్చు. దేవుని దీవెనలను పోగొట్టుకొనియుండటం అనే అతని స్వీయ చిత్తాన్నిబట్టి ఏశావు ఎంతగానో కుమిలిపోయి ఉండొచ్చు. ఇస్సాకు తన ఇద్దరు కుమారులను దూరపరచుకొన్నాడు. ఆదికాండము 47:9లో_ యాకోబు ఫరోతో మాట్లాడుతూ_నేను యాత్రచేసిన సంవత్సరములు నూటముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అని చెప్పటం మనం వినొచ్చు. హెబ్రీయులకు 12:16,17_ ఒక పూటకూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారి యైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని చెప్తూవుంది.

దేవుని శాశ్వతమైన ముందస్తు జ్ఞానంలో నిత్యరక్షణకు కొందరు నిత్యత్వములో కృపలో ఏర్పరచబడయున్నారని లేక రక్షణకు ముందుగానే నిర్ణయింపబడియున్నారని చెప్పొచ్చు. అలాగే మఱొకప్రక్క కొందరు ఉగ్రత కొరకు ఏర్పరచబడ లేదని అంటే నరకమునకు ముందుగానే నిర్ణయింపబడ లేదని మనం చెప్పొచ్చు. దేవుడు నిత్యత్వములో ఏశావును ఖండించడానికి నరకానికి ఎంచుకున్నాడని ఏశావు యాకోబుల కధ చెప్తుందా? లేదు. దేవుడు “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీయెడల దీర్ఘశాంతము గలవాడై యున్నాడు” అని 2 పేతురు 3:9 చెప్తూవుంది. “ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” అని 1 తిమోతి 2: 4 తెలియజేస్తూవుంది. లోకములోని ప్రతిఒక్కరి పట్ల దేవునికున్న ప్రేమ సార్వత్రికమను సత్యాన్ని లేఖనాలు స్పష్టముగా బయలుపరుస్తూ ఉన్నాయి. దేవుని ప్రేమ ఎలాంటి మినహాయింపులు లేకుండా మానవులందరిని చేర్చుకొంటూ ఉంది. క్రీస్తు సంపూర్ణముగా మానవులందరిని దేవునితో సమాధానపరచియున్నాడు. మానవులందరు విశ్వాసమునకు తేబడాలని దానిలో వాళ్ళు సంరక్షింపబడాలని తద్వారా వారిని రక్షించాలని దేవుడు మనస్ఫూర్తిగా ఆశపడ్తువున్నాడు. ఏశావు రక్షించు విశ్వాసాన్ని కలిగి ఉంటే రక్షింపబడి ఉంటాడు. అందరి విషయములో అంతే. అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసిన యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు రక్షింపబడుదురు; నమ్మని వాళ్లకు శిక్ష విధింపబడును అని బైబులు చెప్తూవుంది. 

కృపలో ఏర్పరచబడటం మరియు కృపయొక్క సార్వత్రిక చిత్తము మధ్యనున్న తేడాను లేఖనాల ద్వారా పరిశీలించటానికి ఏశావు యాకోబుల కథను పరిశీలించటం ద్వారా మనం లేఖనాలను స్పష్టముగా అర్ధం చేసుకొని దేవుడు కృపలో ఏర్పరచుకొనుట అనే అంశాన్ని అర్ధం చేసుకొందాం.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.