క్రీస్తు పునరుత్థానంలో సాక్ష్యులుగా స్త్రీలే ఎందుకు?

“క్రీస్తు పునరుత్థానం”లో సాక్ష్యులుగా దేవుడు తన శిష్యులను కాకుండా స్త్రీలనే ఎందుకని అనుమతించాడు?

క్రీస్తు పునరుత్థానం” అనే ప్రత్యేకమైన ఆనాటి ఎడిషన్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను అను న్యూస్ రిపోర్టర్స్ యొక్క ప్రామాణికమైన ఒక సాక్ష్యాన్ని బట్టి దేవుడు స్త్రీలను యేసుని సమాధి దగ్గరకు మొదటిగా ఎందుకని అనుమతించాడు? అనే ప్రశ్నకు జవాబును తెలుసుకొందాం.

యేసు సిలువ వేయబడిన తరువాత, ఆయన శిష్యులు చాలా భయంతో ఉన్నారు. యూదా నాయకులు వారినీ అరెస్టు చేసి శిక్షించవచ్చని వారు భావించారు. అందువల్ల శిష్యులు దాక్కొని ఉండి, ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరకు మొదటగా రాలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు మూడవ రోజున లేస్తాడని శిష్యులు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు; స్త్రీలు కూడా ఆ విషయాన్ని ఊహించలేదు. అందుకే స్త్రీలు యేసు పునరుత్థానాన్ని చూడటానికి కాదు, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధికి వచ్చారు. కాబట్టి, శిష్యులు భయంతో దూరంగా ఉండగా, స్త్రీలు ప్రేమ, గౌరవం మరియు భక్తితో యేసు సమాధి వద్దకు వచ్చారని చెప్పొచ్చు.

ప్రధానయాజకులు మరియు పరిసయ్యులు యేసు “మూడవ దినాన లేస్తాను” అని చెప్పిన మాటను గుర్తుంచుకున్నారు. వారు యేసు నిజంగా లేస్తాడని నమ్మలేదు. కానీ ఆయన శిష్యులు యేసు దేహాన్ని తీసుకెళ్లి, “ఆయన లేచాడు” అని ప్రచారం చేస్తారేమో అని భయపడ్డారు. అందుకే వారు సమాధిని మూడు రోజుల పాటు కాపలాతో భద్రపరచించారు. తరువాత యూదా నాయకులు, “శిష్యులు యేసు దేహాన్ని దొంగిలించారు” అనే మాటను ప్రచారం చేశారు. ఆ రోజులలో ఈ అబద్ధాన్ని యూదా మతనాయకులు ఎంత వైరల్ చేసారంటే, మత్తయి తన సువార్తను వ్రాసిన టైంలో కూడా అంటే పునరుత్థానానికి 20 సంవత్సరాల తర్వాత కూడా ఇది ప్రచారంలో ఉంది అనే విషయాన్ని మత్తయి 28:15 వచనము ద్వారా మనం తెలుసుకోవచ్చు.

శిష్యులు యేసు సమాధికి మొదటగా వచ్చి ఉంటే, యూదా నాయకులు చెప్పిన “శిష్యులు యేసు దేహాన్ని దొంగిలించారు” అనే అబద్ధానికి మరింత బలం చేకూరేది. అందుకే శిష్యులు సమాధి వద్దకు వచ్చిన మొదటి వారిలో లేకపోవడం దేవుని ప్రణాళికలో భాగంగా ఉండి ఉండవచ్చని కొందరు భావిస్తారు.

అసలు పరిస్థితిని చూస్తే, యేసు మరణం శిష్యులను తీవ్రంగా కలవరపరిచింది. వారు భయంతో దాక్కొని ఉండి, యేసు గురించి దుఃఖిస్తున్నారు. ఆ సమయంలో వారు యేసు శరీరాన్ని దొంగిలించడానికి కావలసిన శారీరక ధైర్యాన్ని గానీ, మానసిక స్థైర్యాన్ని గానీ కలిగి లేరు.

అదే కాక, యేసు మూడవ దినాన లేస్తాడనే ఆయన బోధను శిష్యులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అందువల్ల ఆయన పునరుత్థానాన్ని వారు ముందుగానే ఊహించలేదు. లూకా 24:11 ప్రకారం, స్త్రీలు యేసు లేచాడని చెప్పినప్పుడు కూడా శిష్యులు వారి మాటలను మొదట నమ్మలేదు; అవి వారికి వెఱ్ఱిమాటలుగా అనిపించాయి.

కాబట్టి, శిష్యులు సమాధి వద్దకు స్త్రీలతో కలిసి రాకపోవడానికి ప్రధాన కారణాలు వారి భయం, దుఃఖం, మరియు యేసు పునరుత్థానం గురించి పూర్తి అవగాహన లేకపోవడమే.

స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున యేసు సమాధికి వెళ్లిన కారణం, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనే ప్రేమపూర్వకమైన ఉద్దేశం. మార్కు 16:1 మరియు లూకా 24:1 ప్రకారం, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమే, యోహన్న మరియు ఇతర స్త్రీలు విశ్రాంతిదినం ముగిసిన తరువాత సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకొని సమాధికి వచ్చారు. వారు యేసు లేచాడని ఆశించి రాలేదు; ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడని భావించి వచ్చారు.

యోహాను 19:39-40 ప్రకారం, యేసు సమాధి చేయబడినప్పుడు నీకొదేము బోళము మరియు అగరును తెచ్చి, యూదుల పాతిపెట్టే ఆచారం ప్రకారం యేసు శరీరానికి పూసి నారబట్టలతో చుట్టారు. మరి “అప్పటికే సుగంధ ద్రవ్యాలు ఉపయోగించబడితే, స్త్రీలు మళ్లీ ఎందుకు తీసుకొచ్చారు?” అనే ప్రశ్న రావచ్చు.

యేసుని బరియల్ చేసిన వాళ్లు యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు యేసుని శరీరానికి పూసారనే విషయం స్త్రీలకు తెలియదా అనుకొంటే, మత్తయి 27:61 ప్రకారం, మగ్దలేనే మరియ మరియు మరో మరియ యేసు సమాధి చేయబడినప్పుడు అక్కడే సమాధి ఎదురుగా కూర్చొని ఉన్నారు. కాబట్టి యేసు శరీరానికి ముందే సుగంధ ద్రవ్యాలు పూయబడ్డాయని స్త్రీలకు తెలుసు.

రోమన్ ఆచారం ప్రకారం, సిలువ వేయబడిన వారి మృతదేహాలను కొన్నిసార్లు రోజుల పాటు శిలువపైనే వదిలివేసేవారు. అయితే యూదుల ఆచారం ప్రకారం, మృతదేహాన్ని రాత్రివేళ శిలువపై ఉంచకూడదు. ద్వితీయోపదేశకాండము 21:22-23 ప్రకారం, ఆ దినమే మృతదేహాన్ని దింపి పాతిపెట్టాలి. అందువల్ల మరణించిన రోజునే యేసు శరీరాన్ని శిలువనుండి దించి, అదే రోజు రాత్రి కాకముందే యూదుల పాతిపెట్టే ఆచారం ప్రకారం ఆయనను సమాధి చేశారు.

సమాధి దగ్గర నీరు లేదా ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయా అనే విషయం స్పష్టంగా తెలియకపోయినా, యోసేపు మరియు నీకొదేము యూదుల అంత్యక్రియల ఆచారం ప్రకారం యేసు శరీరాన్ని శుభ్రపరిచి గౌరవంగా సిద్ధం చేసి ఉంటారు. యూదుల సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని శుభ్రమైన, కొత్త తెల్లని నారబట్టతో చుట్టేవారు; రాజులైనా సరే ఖరీదైన వస్త్రాలు ఉపయోగించరు. అలాగే మృతదేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సమాధి చేయడం కూడా యూదుల ఆచారం. నీకొదేము తెచ్చిన బోళము మరియు అగరు వంటి సుగంధ ద్రవ్యాలను నారబట్ట పొరల మధ్య ఉంచి యేసు శరీరాన్ని చుట్టినట్లు యోహాను సువార్త సూచిస్తుంది. తరువాత ఆయన తలను ప్రత్యేకమైన గుడ్డతో చుట్టారు.

యూదుల ఈ ఆచారం ప్రకారం వాళ్ళు యేసుని శరీరాన్ని శుభ్రముగా క్లీన్ చేసిన తరువాత శుభ్రమైన క్రొత్తదైన తెల్లని నారబట్టను ఉపయోగించారని ఆ శుభ్రమైన క్రొత్తదైన నారబట్టని యేసుని కాళ్ళు చేతులకు విడివిడిగా చుట్టి తరువాత ఆయన శరీరాన్ని మొత్తం కలిపి చుడుతూ శుభ్రమైన క్రొత్తదైన నారబట్ట యొక్క ప్రతి పొరలో నీకొదేము తెచ్చిన బోళముతో కలిపిన అగరును ఉంచుతూ యేసుని దేహమంతటికి నారబట్టలు చుట్టారు. తరువాత తల ప్రత్యేకముగా గుడ్డతో చుట్టబడింది. బోళముతో కలిపిన అగరు అంటే ఇవి డ్రై స్పైసెస్ అంటే ఇవి పొడిరూపంలో ఉన్న సుగంధద్రవ్యాలు. ఇవి గాయాలను ఎండిపోజేసి రక్తం ఆవిరయ్యేటట్లు చెయ్యడమే కాకుండా శరీరము నుండి స్రావాలు స్రవించకుండా కాపాడే నిమిత్తము వాళ్ళు బోళముతో కలిపిన అగరును శుభ్రమైన క్రొత్తదైన నారబట్ట యొక్క ప్రతిపొరలో పూశారు. ఆ విధముగా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యేసుని బరియల్ చేసారు. ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడని సమాధిలో యేసును ఉంచటం యేసుకు ఇవ్వబడిన మర్యాదను గౌరవాన్ని తెలియజేస్తుంది.

సమాధి చెయ్యడం యూదుల పద్ధతి. యేసు సమాధి తన సొంత ప్రజల పద్ధతిలో జరిగింది. అతని స్నేహితులు అదెట్లు జరిగిందో చూశారు. ఆవిధముగా యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యేసుని బరియల్ చేసారు.

క్రీస్తుకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్న యేసేపు నీకొదేములు ఖచ్చితంగా యేసుని శరీరానికి ది బెస్ట్ ఇచ్చే ఉంటారు. అట్లే ఆయన బరియల్ యెషయా 53:9 ప్రకారము అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను అను ప్రవచనము యొక్క నెరవేర్పని కూడా చెప్పొచ్చు.

మార్కు16:1-3; లూకా 24:1 వచనాలను బట్టి విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు, యోహన్నయు, వారితోకూడ ఉన్న యితర స్త్రీలును ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరని (ఆస్త్రీలు) ఆ సుగంధ ద్రవ్యములను సిద్ధపరచిరని వారు ఆదివారమున పెందలకడ లేచి తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని బయలుదేరి తెల్లవారుచుండగా సమాధి యొద్దకు వచ్చిరని అర్ధమవుతుంది. అట్లే మత్తయి 28:1వ వచనంలో (ఆ స్త్రీలు) సమాధిని చూడవచ్చిరి అని తెలియజేస్తున్నాడు.

ఆ కాలంలో యూదుల ఆచారం ప్రకారం, ఎవరైనా మరణిస్తే వారి శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించడం సాధారణంగా స్త్రీల బాధ్యతగా ఉండేది. పురుషులు మృతదేహాన్ని సమాధి చేసేవారు. యేసు విషయంలో సమాధి త్వరగా చేయబడింది, ఎందుకంటే విశ్రాంతిదినం ప్రారంభమయ్యే ముందు ఆయనను పాతిపెట్టాల్సి వచ్చింది. అందువల్ల స్త్రీలకు ఆయన శరీరానికి పూర్తిగా సుగంధ ద్రవ్యాలు పూయడానికి తగిన సమయం దొరకలేదు.

అందుకే విశ్రాంతిదినం ముగిసిన తరువాత స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేసి సిద్ధం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వాటిని తీసుకొని యేసు సమాధి వద్దకు వచ్చారు. వారు యేసు పునరుత్థానాన్ని ఆశించి రాలేదు; ఆయన పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, భక్తి మరియు మర్యాదను చూపించడానికి వచ్చారు.

మూడు రోజుల తరువాత సమాధిని తెరిచి మళ్లీ సుగంధ ద్రవ్యాలు పూయడం యూదుల సాధారణ ఆచారం అని స్పష్టంగా చెప్పలేం. అయితే బైబిల్ చూపించే భావం ఏమిటంటే, ఆ స్త్రీలు యేసుపై ఉన్న తమ ప్రేమను మరియు గౌరవాన్ని వ్యక్తపరచడానికి సమాధి వద్దకు వచ్చారు. ఈ రోజుల్లో మనం ప్రియమైన వారి సమాధి దగ్గరకు పూలు తీసుకెళ్లి గౌరవం చూపినట్లే, ఆ రోజుల్లో వారు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్లారు.

కాబట్టి స్త్రీలు సమాధికి రావడం అనాలోచిత చర్య కాదు. అది యేసుపై ఉన్న వారి ప్రేమ, భక్తి, గౌరవం మరియు మర్యాదకు ప్రతీకాత్మకమైన వ్యక్తీకరణ.

మార్కు 16:2,3 వచనాలు వాళ్ళు ఆదివారమున పెందలకడ (లేచి బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు ప్రశ్నించు కొనిరని చెప్తున్నాయి. సమాధి దగ్గర సైనికుల ఉనికి గురించి స్త్రీలకేమి తెలియదని వాళ్ళు ఆ సమాధి దగ్గరకు వచ్చే వరకు వాళ్ళకెలాంటి సమస్యలు ఎదురుకాలేదని తెలుస్తుంది. కాని వారికి ఆందోళన కలిగిస్తున్న విషయమేమిటంటే సమాధిని మూసిన రాయి, దీనిని దొర్లించాలంటే 3 లేక 4 పురుషులు అవసరం. స్త్రీలు దానిని దొర్లించటం అసాధ్యం. ఆ సమాధి ద్వారమును మూసిన ఆ పెద్ద రాయిని ఎలా దొర్లించాలో వారి కొరకు ఎవరు దానిని దొర్లిస్తారో వారికి తెలియకపోయినా, వారు సమాధి వద్దకు వెళ్లడంలో వెనుకడుగు వేయలేదు. ఇది వారి ధైర్యాన్ని, నిర్భయతను మరియు యేసుపై ఉన్న గాఢమైన ప్రేమను తెలియజేస్తుంది. యేసుతో కలిసి నడిచిన ఆ స్త్రీలకు, సమాధి రాయి ఆయనను చేరుకోవడంలో అడ్డంకిగా నిలవలేకపోయింది. వారి ఈ చర్య యేసుపై ఉన్న వారి భక్తిని మరియు అంకితభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

లూకా 24:2-6, స్త్రీలు అక్కడికి వెళ్ళేటప్పటికి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియు తోచక యుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి, వారు భయపడి ముఖములను నేలమోపి యుండగా వాళ్ళు ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడండి.

యేసు సిలువపై మరణించినట్లు రోమా అధికారులు నిర్ధారించారు. ఆయన శరీరాన్ని యూదుల పాతిపెట్టే ఆచారం ప్రకారం సమాధిలో ఉంచి, ఆ సమాధికి ప్రభుత్వ ముద్ర వేసి కావలి పెట్టారు. అలాంటి పరిస్థితిలో పరలోక దూతలు స్త్రీలకు, “ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూడండి” అని చెప్పడం వారికి ఇచ్చిన గొప్ప ధన్యత.

ఆ కాలంలో స్త్రీల సాక్ష్యాన్ని చట్టపరంగా పురుషుల సాక్ష్యంతో సమానంగా పరిగణించేవారు కాదు. కాబట్టి పునరుత్థాన కథను ఎవరైనా కల్పించి ఉంటే, మొదటి సాక్షులుగా పురుషులను చూపించే అవకాశం ఎక్కువగా ఉండేది. అయితే సువార్తలు స్త్రీలనే మొదటి సాక్షులుగా పేర్కొంటాయి. ఇది పునరుత్థాన కథ వాస్తవ సంఘటనల ఆధారంగా రాయబడిందని సూచిస్తుంది.

మగ్దలేనే మరియ మరియు ఇతర స్త్రీలకు యేసు లేచాడనే వార్త మొదటగా తెలియజేయబడింది. అంతేకాక, పునరుత్థానుడైన యేసు మొదటగా స్త్రీలకు దర్శనమిచ్చాడు. ఈ విధంగా దేవుడు స్త్రీలకు ప్రత్యేకమైన గౌరవం మరియు ధన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.

అందువల్ల కొందరు పండితులు, క్రీస్తు పునరుత్థాన విశ్వసనీయతను బలపరచడానికి దేవుడు స్త్రీలను మొదటి సాక్షులుగా ఎన్నుకున్నాడని భావిస్తారు. స్త్రీల సాక్ష్యం బైబిలులో ప్రత్యేక ప్రాముఖ్యతను పొందింది.

యేసు పునరుత్థానానికి మొదటి సాక్షులుగా స్త్రీలను దేవుడు అనుమతించడం ఉద్దేశపూర్వకం:

1. యేసు పునరుత్థానానికి మొదటి సాక్షులుగా స్త్రీలను దేవుడు అనుమతించడం ఒక ఉద్దేశపూర్వకమైన విషయం. ఇది దేవుడు స్త్రీలను గౌరవిస్తున్నాడని, తన కార్యాలలో వారిని కూడా ఉపయోగిస్తున్నాడని తెలియజేస్తుంది. యేసు కాలంలో స్త్రీల సాక్ష్యాన్ని సమాజం అంతగా విలువైనదిగా పరిగణించకపోయినా, దేవుడు వారినే మొదటి సాక్షులుగా ఎన్నుకోవడం ద్వారా వారి విలువను వెల్లడించాడు.

యేసు కాలంలో, చట్టపరమైన పరిస్థితులలో స్త్రీలను నమ్మకమైన సాక్షులుగా పరిగణించలేదు (ఈ విషయాన్ని యూదు చరిత్రకారుడైన జోసెఫస్ తన రచనలలో పేర్కొన్నాడు). పునరుత్థానమైన క్రీస్తును మొదటగా చూసి ప్రకటించడానికి దేవుడు స్త్రీలను ఎంచుకోవడం ద్వారా, దేవుడు సాంస్కృతిక నిబంధనలను తారుమారు చేసి, రక్షణ చరిత్రలో వారి పాత్రను ఉన్నతపరిచాడు.

దేవుడు తన రాజ్య పనిలో స్త్రీలను చూస్తాడని, గౌరవిస్తాడని మరియు ఉపయోగించుకొంటాడని ఇది ధృవీకరిస్తుంది. “ఇందులో యూదుడని గ్రీసుదేశస్థు డని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు” — గలతీయులు 3:28.

2. ఇది పునరుత్థాన కథ కల్పితం కాదని కూడా సూచిస్తుంది. ఆ కాలపు సామాజిక పరిస్థితుల ప్రకారం కథను కల్పించి ఉంటే, మొదటి సాక్షులుగా పురుషులను చూపించే అవకాశం ఎక్కువగా ఉండేది. కానీ సువార్తలు నిజంగా జరిగిన సంఘటనను నిజాయితీగా నమోదు చేశాయి. అందుకే స్త్రీల సాక్ష్యం ఈ కథ చారిత్రక విశ్వసనీయతను బలపరుస్తుంది.

అది కల్పితమైతే, అది స్త్రీలను హీరోలుగా చేసి ఉండేది కాదు. కాని సత్యం సాంస్కృతిక అంచనాలను పట్టించుకోదు.

3. యేసు సిలువ వేయబడినప్పుడు చాలామంది శిష్యులు భయంతో పారిపోయినప్పటికీ, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమే మరియు ఇతర స్త్రీలు యేసు మరణాన్ని చూశారు. ఆయన సమాధి చేయబడినప్పుడు కూడా వారు అక్కడే ఉన్నారు. మూడవ రోజు ఆయన శరీరాన్ని అభిషేకించడానికి వారు సమాధి వద్దకు వచ్చారు. వారి విశ్వాసపాత్రతకు గౌరవంగా, దేవుడు వారికి పునరుత్థానమైన యేసును మొదటగా చూడగల అవకాశాన్ని ఇచ్చాడు.

4. దేవుడు తరచుగా సమాజంలో నిర్లక్ష్యం చేయబడినవారిని, సాధారణంగా కనిపించే వారిని తన కార్యాల కోసం ఎంచుకుంటాడు. దావీదు, రూతు, మరియ, జాలర్లు, పన్ను వసూలు చేసే వారు వంటి వారిని దేవుడు ఉపయోగించినట్లే, మగ్దలేనే మరియను కూడా పునరుత్థాన వార్తను ప్రకటించే మొదటి సాక్షిగా ఉపయోగించాడు. ఇది దేవుని కృప మరియు ఎంపిక మానవ ప్రమాణాలపై ఆధారపడదని చూపిస్తుంది.

5. పునరుత్థానం సువార్తలోని ప్రధాన సందేశం — మరణంపై విజయం, పునరుద్ధరణ మరియు కొత్త జీవితం. ఈ శుభవార్తను మొదటగా స్త్రీల ద్వారా తెలియజేయడం, దేవుడు తన రక్షణ కార్యంలో వారిని గౌరవప్రదమైన పాత్రకు ఎన్నుకున్నాడని తెలియజేస్తుంది.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl