గ్లోసోలాలియా (భాషలతో మాటలాడటం)
క్రైస్తవ ప్రపంచంలో గ్లోసోలాలియా కొత్త ఆసక్తిని కలిగించే అంశంగా మారి ఒక దశాబ్దం గడిచింది. ఒకప్పుడు దాదాపుగా పెంటెకొస్టలిజంకే పరిమితం చేయబడినది ఇప్పుడు ప్రధాన వర్గాల క్రైస్తవులలో కూడా అంతులేని చర్చకు వివాదాలకు దారితీసింది. దీని ద్వారా రగిలిన వివాదం నిరంతరాయంగా కొనసాగుతోంది.
క్రీ.శ. 1900లో పెంటెకోస్టల్ ఉద్యమం పశ్చిమంలో ప్రారంభమై, తూర్పుకు వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. భాషలు మాట్లాడటం ద్వారా సంభవించిన ఈ విభజన చాలా స్పష్టంగా ఉంది. ప్రతిపాదకులు దీనిని ఆత్మ యొక్క బహుమతిగా సంఘ పునరుద్ధరణకు రుజువుగా భావిస్తారు. వారు దాని ప్రమోషన్‌ను ప్రోత్సహిస్తారు. వ్యతిరేకులు దీనిని క్రీస్తు శరీరంలో హాని కలిగించే విభజన ప్రభావంగా భావిస్తారు. వారు దానిని తగ్గించమని చెప్తారు. కొందరు, “ఇది చేసే ‘మంచి’ని చూడండి. ఇది దేవుడు చేసే పని అయి ఉండాలి” అని అంటారు. మరికొందరు, “ఇది కలిగించే హానిని చూడండి. ఇది అపవాది చేసే పని అయి ఉండాలి” అని అంటారు. ఒక విషయం యొక్క చెల్లుబాటును మనుష్యుల బోధలను బట్టి కాకుండా లేఖనాల ఆధారంగా నిర్ణయించడానికి లేఖనాలను పరిశీలిధ్ధాం.
I. వేదాంతపరంగా పరిశీలిధ్ధాం
ఎ. లేఖనాలలో ఇందుకు సంబంధించి వాడబడిన పదాలను మొదటిగా పరిగణలోనికి తీసుకొందాం
ఆదిమ సంఘములో గ్లోసోలాలియా (భాషలతో మాట్లాడటం) వాస్తవం. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అయితే, దాని స్వభావం, దాని పరిధి, దాని ప్రాముఖ్యతను గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అన్నింటికంటే మించి పెంతెకొస్తు రోజున యెరూషలేములో భాషలు మాట్లాడిన సందర్భానికి తరువాత కొరింథులో భాషలు మాట్లాడే ఆచారానికి మధ్య ఉన్న సంబంధంలో కొన్ని ప్రశ్నలున్నాయి.
ఆశ్చర్యకరంగా, పెంతెకొస్తు తర్వాత కొత్త నిబంధనలో గ్లోసోలాలియా గురించి కేవలం మూడు స్పష్టమైన సూచనలు మాత్రమే ఉన్నాయి. దాని ఇరవై ఏడు పుస్తకాలలో రెండు అపొస్తలుల కార్యములలో మరొకటి మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రికలో మాత్రమే పేర్కొనబడ్డాయి. అపొస్తలుల కార్యములలో పెంతెకొస్తు కథలో (2:4), కొర్నేలియస్ మతమార్పిడి కథలో (10:46), మరియు ఎఫెసులో యోహాను శిష్యుల బాప్టిజం కథలో (19:6) భాషలు ప్రస్తావించబడ్డాయి. మొదటి కొరింథీయులలో మూడు అధ్యాయాలు (12–14) కొరింథీ క్రైస్తవుల పక్షాన భాషల దుర్వినియోగ సమస్యను పరిష్కరిస్తున్నాయి. పవిత్ర రచయితలు ఉపయోగించిన పదాలు: “అన్యభాషలు” అపొ. కార్య. 2:4; 1 కొరింథీ 14:21; “భాషలు” అపొ. కార్య. 10 మరియు 19 మరియు 1 కొరింథీలో 17 చోట్ల వాడబడిన పదాలలో, “నానా భాషలు” 1 కొరింథీ 12:28; “భాషల అర్థము చెప్పు శక్తి” 1 కొరింథీ 12:10; అనేవి పరిశీలనకు ప్రాముఖ్యమైనవి.
మార్కు 16:17–18 లో యేసు చెప్పిన సందర్భాన్ని గురించి కూడా ప్రస్తావించాలి. యేసు తన శిష్యులతో, నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాడు. భాషలు మాట్లాడేవారు తమ నమ్మకానికి మద్దతుగా ఈ భాగాన్ని వాళ్ళు తరచుగా కీలకమైన లేఖనాత్మక ఆధారంగా అధికారిక మూలంగా ఉపయోగిస్తారు.
గ్లోసోలాలియా అనేది γλῶσσα మరియు λαλέω యొక్క మిశ్రమం. బాయర్ (అర్ండ్ట్-గింగ్రిచ్) మరియు కిట్టెల్ కొత్త నిబంధనలో γλῶσσα అనే పదం యొక్క మూడు ఉపయోగాలను ఉదహరించారు.
1. అక్షరాలా γλῶσσα అనేది శరీర అవయవమైన నాలుకను సూచిస్తుంది. చెవిటి మూగ వ్యక్తి స్వస్థత కధలో, మార్కు 7:33, అతని నాలుక నరము సడలి అనే సందర్భములో γλῶσσα వాడబడింది. పెంతెకొస్తు కథలో కనిపించిన అగ్ని జ్వాలలను “నాలుకలు” అని వర్ణించారు (అపొ. కార్య. 2:3), ఇది అలంకారిక భాష. అదే అధ్యాయంలో పేతురు దావీదు “నా నాలుక ఆనందించెను” అపొ. కార్య. 2:26, అని ఉపమానంగా చెప్పినట్లు ఉటంకించిన సందర్భములో కూడా γλῶσσα వాడబడింది. ఫిలిప్పీ 2:11లో, ప్రతి నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి అనే సందర్భములో పౌలు కూడా ఇదే పదాన్ని వాడాడు.
మార్కు 7:33, καὶ ἀπολαβόμενος αὐτὸν ἀπὸ τοῦ ὄχλου κατ’ ἰδίαν ἔβαλεν τοὺς δακτύλους αὐτοῦ εἰς τὰ ὦτα αὐτοῦ καὶ πτύσας ἥψατο τῆς γλώσσης αὐτοῦ, అపొ. కార్య. 2:3, καὶ ὤφθησαν αὐτοῖς διαμεριζόμεναι γλῶσσαι ὡσεὶ πυρός, καὶ ἐκάθισεν ἐφ’ ἕνα ἕκαστον αὐτῶν, అపొ. కార్య. 2:26, διὰ τοῦτο ηὐφράνθη ἡ καρδία μου καὶ ἠγαλλιάσατο ἡ γλῶσσά μου, ἔτι δὲ καὶ ἡ σάρξ μου κατασκηνώσει ἐπ’ ἐλπίδι· ఫిలిప్పీ 2:11, καὶ πᾶσα γλῶσσα ἐξομολογήσηται ὅτι κύριος Ἰησοῦς Χριστὸς εἰς δόξαν θεοῦ πατρός.
2. ఈ పదం యొక్క రెండవ ఉపయోగం అపొ. కార్య. 2:4,11లో కనిపిస్తుంది, అక్కడ శిష్యులు ἑτέραις γλώσσαις తో (అన్యభాషలతో) మాట్లాడటం ప్రారంభించారని లూకా నివేదించాడు. పెంతెకొస్తు సంఘటనకు ప్రతిస్పందిస్తూ శిష్యులు దేవుని అద్భుతమైన పనులను గూర్చి మాట్లాడటం ప్రజలు విన్నారని చెప్పాడు. ταῖς ἡμετέραις γλῶσσαις. ఇక్కడ γλῶσσαις అంటే భాషలు అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది 6, 8 వచనాలలోని διάλεκτος (భాష) యొక్క సూచన ద్వారా ధృవీకరించబడింది. పాత నిబంధన వినియోగానికి అనుగుణంగా, γλῶσσα కూడా φόλλή (అగ్నిజ్వాల, లూకా 16:24) కి పర్యాయపదంగా అలంకారికంగా ఉపయోగించబడింది.
3. మూడవ కోణంలో γλῶσσα అనేది అస్పష్టమైన ప్రసంగానికి పర్యాయ పదంగా ఉపయోగించబడింది. 1 కొరింథీ 12–14 మరియు అపొ. కార్య. 10:46 మరియు 19:6 లలో చూడండి. దీనిని మతపరమైన పారవశ్యంలో ఉన్న వ్యక్తుల నుండి వచ్చిన ప్రసంగం గా బాయర్ నిర్వచించాడు. మాటల్లో లేదా పద్ధతిలో వింతగా అస్పష్టంగా ఉండే వ్యక్తీకరణ అని కిట్టెల్‌లో బెహ్మ్ చెప్పాడు.
కొత్త నిబంధనలో γλῶσσα వాడకం దాని నేపధ్యాన్ని గూర్చిన తన చర్చలో, బెహ్మ్ దీనిని “ఒక అసాధారణమైన విషయంగా” మరియు “ఆధ్యాత్మికంగా ప్రభావితమైన ప్రసంగంగా” చెప్పాడు. ఇది మనుషులకు కాదు, దేవునికి, ప్రార్థన రూపంలో, బహుశా ప్రశంసలు కృతజ్ఞతలతో, పాడే విధంగా ఉద్దేశించబడింది. ఇది సమాజానికి కాకుండా వ్యక్తికి “విలువ” కలిగి ఉంటుంది. “ఈ ప్రేరేపిత ఉచ్చారణలో νοῦς అసలైన భావము ఉండదు. తద్వారా మాట్లాడేవారికి మరియు వినేవారికి అస్పష్టంగా ఉన్న మర్మమైన పదాలు శూన్యంలో మాట్లాడబడతాయి.” ఇది ఒక విదేశీ భాష అనే అభిప్రాయాన్ని ఇస్తుంది. దానిని అనియంత్రితంగా ఉపయోగించడం పిచ్చివాళ్ళు అనే ముద్రను ఇస్తుంది. అతడు హెలెనిస్టిక్ సమాంతరాలను (ఉదా. థ్రేసియన్ డయోనిసియస్ యొక్క ఉత్సాహభరితమైన ఆరాధన) ఉదహరించాడు. “చర్చి చరిత్రలో గ్లోసోలాలియా యొక్క ఏవైనా తదుపరి విషయాలు ఉన్నాయనుకొంటే అవి ఆత్మ యొక్క ఈ మొదటి వసంతకాలం యొక్క ఖాళీ అనుకరణలు మాత్రమే” అనే పరిశీలనతో అతడు ముగించాడు.
నేడు ప్రముఖంగా ఉన్న గ్లోసోలాలియా యొక్క రెండు వివరణల యొక్క సంక్షిప్త సారాంశాన్ని బాయర్ అందిస్తున్నారు. బ్లీక్ మరియు హెన్రిసి γλῶσσα అంటే పురాతనమైన, విదేశీయమైన, అర్థం కాని, మర్మమైన ఉచ్చారణలు అని అభిప్రాయపడ్డారు. అయితే రీట్జెన్ స్టెయిన్ మరియు బౌసెట్ గ్లోసోలాలియా అంటే అద్భుతమైన స్వర్గపు భాషలలో మాట్లాడటం అని అభిప్రాయపడ్డారు. రీట్జెన్ స్టెయిన్, బౌసెట్ దృక్పథాన్ని కలిగి ఉన్నవారు స్పష్టంగా వారి నమ్మకాన్ని ప్రధానంగా 1 కొరింథీ 13:1 పై ఆధారపరుస్తారు: మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. వారి అభిప్రాయం ప్రకారం “మనుష్యుల భాషలు” ప్రవచనాత్మక ప్రకటనను సూచిస్తాయి. “దేవదూతల భాషలు” దేవదూతలు దేవునితో వారి అనుబంధంలో ఉపయోగించే భాష గ్లోసోలాలియాను సూచిస్తాయి. ఈ సందర్భంలో “దేవదూతల భాషలు” అతిశయోక్తిగా చదవబడాలని మనకు కనిపిస్తుంది, ఉదాహరణకు: “సమస్త మర్మములు… సమస్త జ్ఞానము… సమస్త విశ్వాసము… పేదలను పోషించుటకు నా సమస్త వస్తువులు… నా శరీరము కాల్చబడుటకు” 1 కొరింథీ 13:2,3. “దేవదూతల భాషలు” మరియు కొరింథులో మాట్లాడబడిన భాషలు మధ్య సంబంధాన్ని స్థాపించడానికి ప్రయత్నించడం ఆసక్తికరమైన ఊహాగానాలకు బలహీనమైన వివరణకు దారితీస్తుంది.
పెంతెకొస్తు రోజున భాషలు మాట్లాడటం అనేది అర్ధంచేసుకోవడానికి కష్టమైన పారవశ్యమైన ఒక ఆనందకరమైన ప్రకటన అని, అయితే, తన సొంత ప్రయోజనాల కోసం, లూకా దానిని ఇతర భాషలలో మాట్లాడుతున్నట్లు నివేదించటం మూలాన్న, లూకా ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా ఇక్కడ విషయాన్ని అస్పష్టం చేశాడని అభిప్రాయపడుతూ కొందరు ఈ విషయాన్ని ఇంకా సంక్లిష్టం చేస్తున్నారు.
బి. వివరణాత్మక పరిశీలనలు
అపొస్తలుల కార్యములు మరియు కొరింథీయులలోని ప్రత్యేక గ్లోసోలాలిక్ ను సమగ్రంగా పరిశీలించే ముందు, Γλῶσσα ను గూర్చి కొందరి అభిప్రాయాలను తెలుసుకొందాం.
- కొందరికి Γλῶσσα అనేది ఎల్లప్పుడూ ఒక విదేశీ భాష, వక్తకు ఆ భాష తెలియకపోయినప్పటికీ దానిలో అద్భుతంగా మాట్లాడతాడు.
- కొందరికి Γλῶσσα అనేది కొన్నిసార్లు ఒక దేశీయ ప్రాంతీయ భాష; కొన్నిసార్లు పారవశ్య ప్రసంగం.
- కొందరికి Γλῶσσα అనేది ఆత్మ బహుమతిగా భూమిపై అద్భుతంగా మాట్లాడే స్వర్గపు భాష.
- కొందరికి Γλῶσσα అనేది భ్రమపర్చు నకిలీ భాషలు.
- కొందరికి Γλῶσσα అనేది కేవలం భక్తిని వివిధ రకాలుగా వ్యక్తపరచడం.
- కొందరికి Γλῶσσα అనేది అనేక భాషల శబ్దాల మిశ్రమం.
- కొందరికి Γλῶσσα అనేది “ఉచ్చరించలేని మూలుగులు” (రోమా 8:26) యొక్క వ్యక్తీకరణ.
- కొందరికి Γλῶσσα అనేది వినికిడి అద్భుతం. వక్త తన సొంత భాషలో మాట్లాడాడు, కానీ వినేవాడు దానిని తన మాతృభాషలో వింటాడు.
- కొందరికి Γλῶσσα అనేది జ్ఞాపకశక్తికి సంబంధించిన అద్భుతం. దాని యొక్క అతీంద్రియ ఔన్నత్యం ఒకప్పుడు విన్నాకాని నేర్చుకోని భాషలను మాట్లాడటానికి ఒక వక్తకు వీలు కల్పిస్తుంది.
- కొందరికి Γλῶσσα అనేది ఆరాధనలో దేవునితో మాట్లాడటానికి ఉపయోగించే భాష. ఇది మనుషులతో మాట్లాడటానికి ఉపయోగించే భాషకు భిన్నంగా ఉంటుంది. (Cf. 1 కొరింథీ 14:2)
కొంతమంది ఈ విషయాన్ని మానవ స్పృహ లేకుండా ఆత్మ యొక్క సాధనంగా నాలుకతో “భాష” మాట్లాడటంగా చూస్తారు. ప్రముఖ లూథరన్ కరిష్మాటిక్ అయిన లారెన్స్ క్రిస్టెన్సన్, యెరూషలేములోని విశ్వాసులు అర్ధమయ్యే భాషలలోనే మాట్లాడారని, కొరింథులోని విశ్వాసులు అర్థం కాని భాషలలో మాట్లాడారని చెప్పాడు. క్రిస్టెన్సన్ ప్రకారం, నేటి విశ్వాసులు ఇప్పటికీ కొరింథులోని విశ్వాసులు చేసినట్లే చేస్తున్నారు. అతడు గ్లోసోలాలియాను “పరిశుద్ధాత్మ యొక్క అతీంద్రియ అభివ్యక్తి”గా నిర్వచించాడు. నలుగురిలో విశ్వాసి తాను ఎప్పుడూ నేర్చుకోని అతనికే అర్ధం కాని భాషలో మాట్లాడితే అది అర్థరహితం. దానివలన ఎవరికి ప్రయోజనం? అది బైబిలుకు సంబంధించినది కాకపోతే, అది ఒక పారవశ్య ఉచ్చారణ మాత్రమే. క్రిస్టెన్సన్ ప్రకారం భాష అనేది భావన లేదా ఆలోచన పరంగా అర్థాన్ని వ్యక్తీకరించడం. కాబట్టి భాషలలో మాట్లాడటం అంటే ఒక్క భాషలో మాట్లాడటం. మాట్లాడేవారి లోతైన భావాలను ఆలోచనలను వ్యక్తపరిచే భాష, ఆ భాష ద్వారా అవతలి వ్యక్తి దేవునిని గురించి విని ఆయనను అర్థం చేసుకునే భాష. గ్లోసోలాలియా అంటే అది ఎల్లప్పుడూ ఒక భాషలోనే మాట్లాడుతుందని అర్థం. మరి లేఖనాలు దీనిని గురించి ఏం చెప్తున్నాయి?
అపొస్తలుల కార్యములు 2, పెంతెకొస్తు
పెంతెకొస్తు రోజున శిష్యులు అద్భుతంగా మాట్లాడిన భాషలు తెలిసిన భాషలు. ఈ విషయాన్ని ప్రశ్నించే కరిస్మాటిక్‌లు ఎవరో నిజంగా నాకు తెలియదు. నిజానికి, లూకా ఈ వృతాంతాన్ని ప్రశ్నించడానికి ఎవ్వరికీ ఎటువంటి అవకాశాన్ని ఇవ్వడంలేదు.
పెంతెకొస్తు దినం కొత్త నిబంధన సంఘ అనుభవంలో భాషలు మొదటిసారిగా కనిపించడాన్ని భాషలు మాట్లాడటం గురించి మొదటి వృత్తాంతాన్ని అందిస్తుంది. ఇది ఈ సంఘటన యొక్క అత్యంత స్పష్టమైన వర్ణనను కూడా అందిస్తుంది. లేఖనాలు లేఖనాన్ని వివరించాలి అనే సూత్రాన్ని అనుసరించి, ఈ ఎపిసోడ్ వెలుగులో మనం తరువాతి ఎపిసోడ్‌లను చదవాలి. అపొస్తలుల కార్యముల వెలుగులో కొరింథీయులను కూడా చదవాలి, దీనికి విరుద్ధంగా కాదు. కాబట్టి గ్లోసోలాలియాకు సంబంధించిన ప్రస్తావన తక్కువ స్పష్టంగా ఉన్న ఇతర భాగాల యొక్క సరైన అవగాహన కోసం ఈ భాగాన్ని ప్రామాణికంగా పరిగణించాలి.
అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో (ἑτέραις γλώσσαις) మాట్లాడటం ప్రారంభించారు, అపొ. కార్య. 2:4 అని ఈ వృత్తాంతం చెబుతోంది. γλῶσσα అనే అదే పదం 11వ వచనంలో మళ్ళీ కనిపిస్తుంది. దానిని ఇక్కడ ఒక భాషగా రూపకంగా అర్థం చేసుకోవాలి. “ప్రతి మనిషి స్వభాషతో శిష్యులు మాట్లాడుతుండగా విన్నారు, τῇ ἰκίᾳ διαλέκτῳ, (v. 6, v. 8 లో కూడా అదే). ఆ భాషలలో కొన్ని ఏమిటో కూడా ఈ వృత్తాంతం సూచిస్తుంది (vv 8–11), పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు, కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు అరబీయులు మొదలైన వారి భాషలు.
లూకా ἄλλος (భిన్నమైన) కంటే ἕτερος (మరొక) అనే పదాన్ని ఉపయోగించడం కూడా బోధనాత్మకమైనది. సాధారణంగా ἕτερος అనేది రకంలో తేడాను సూచిస్తుంది. అందువల్ల γλῶσσα తో ఇది శిష్యులు సాధారణంగా మాట్లాడే భాషలకు మరొక భాష అని సూచిస్తుంది.
కాబట్టి వారు పెంతెకొస్తు రోజున భాషలు మాట్లాడారని స్పష్టంగా తెలుస్తుంది. ఆ భాషలు వారి మాతృభాషలు కావు. వారు వాటిని అధ్యయనం చేసిన ఫలితంగా కాకుండా “ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది” మాట్లాడారు. వారు చెప్పినది కూడా స్పష్టంగా చెప్పబడింది, దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని ప్రజలు చెప్పుకొనిరి (వచనం 11).
అపొస్తలుల కార్యములు 10:44–47, కొర్నేలియస్ గృహం
ప్రభువు నుండి ఒక దర్శనం పేతురును అన్యుడైన కొర్నేలియస్ ఇంటికి వెళ్లి, అతనికి అతని ఇంటి సభ్యులకు సువార్తను ప్రకటించమని ఆదేశించింది. పేతురు మాట్లాడుతుండగా, “అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను” (10:44). పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు వారు చూసిన దానిని చూసి విభ్రాంతి నొందారు. “వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి” (10:46). ఇది పరిశుద్ధాత్మ యొక్క నిజమైన కుమ్మరింపు అని వారు నమ్మారు. పెంతెకొస్తు రోజున తాను మరియు తన తోటి శిష్యులు పొందిన విధంగానే కొర్నేలి మరియు అతని ఇంటివారు కూడా పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి పేతురు బాప్తిస్మం తీసుకోవాలని ప్రతిపాదించాడు. “మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు, ὡς καὶ ἡμεῖς,” (మనవలె) వచనం 47. Cf 11:17, τὴν ἴσην δωρεάν (సమాన వరము) —ఈ సంఘటనను యెరూషలేము సమావేశానికి వివరించడంలో పేతురు చెప్పిన మాటలు ఇవి.
ఈ సందర్భంలో γλῶσσαι మునుపటి సంఘటనలో ఉన్నట్లుగా διάλεκτοι అని ఈ సంఘటన ప్రత్యేకంగా చెప్పనప్పటికీ, లూకా ఉపయోగించిన ఈ పదం 2వ అధ్యాయంలో, γλῶσσα వలె ఉంది. ఇంకా, పేతురు రెండుసార్లు (10:47 మరియు 11:17) కొర్నేలియస్ ఇంట్లో జరిగిన సంఘటనను పెంతెకొస్తు రోజున శిష్యులు అనుభవించిన విషయముతో పోల్చాడు. కాబట్టి ఈ భాగంలో γλῶσσα ను విదేశీ భాషగా అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు.
అపొస్తలుల కార్యములు 19:1–7, ఎఫెసులోని బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు
ఈ వృత్తాంతం ఎఫెసులో పౌలు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పన్నెండు మంది శిష్యులతో సమావేశమైన వివరాలను అందిస్తుంది. వారు యూదు మతం మరియు క్రైస్తవ మతం మధ్య పరివర్తన కాలంలో ఉన్నారు. వాగ్దానం చేయబడిన రక్షకుడి గురించి వారికి తెలుసు. కాని ఆయన జననం, మరణం మరియు పునరుత్థానం గురించి వారికి స్పష్టంగా ఏమీ తెలియదు. పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం గురించి కూడా వారు ఏమీ వినలేదు. అప్పుడు పౌలు వారిని యేసుకు మరియు క్రైస్తవ బాప్తిసం యొక్క మతకర్మకు పరిచయం చేశాడు. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి, 6. ఈ వాక్యభాగంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, భాషల విషయంలో ఎటువంటి సమస్య లేదు.
మళ్ళీ, అపొస్తలుల కార్యములు 2 లో ఉన్నట్లుగా ఈ భాషలు మాండలికాలు లేదా ఇతర భాషలు అని ఇక్కడ స్పష్టమైన సూచనేమి లేదు. లూకా మునుపటి కథనంలో చెప్పినట్లుగా ఇక్కడ ఈ పన్నెండు మంది పెంతెకొస్తు శిష్యులు అనుభవించిన అదే (ἴσην, 11:17) విషయాన్ని అనుభవించారని చెప్పలేదు. ఈ సంఘటన మిగిలిన రెండింటి మధ్య తేడాను అతడు గుర్తించనందున, అతడు భాషలకు అదే పదాన్ని ఉపయోగిస్తున్నందున, (γλῶσσα), మరోసారి, నిశ్శబ్ద వాదన ఏమిటంటే, మనం ఇతర రెండు భాగాలలో చేసినట్లుగానే ఇక్కడ భాషలను అర్థం చేసుకోవాలి. లూకా ఇక్కడ వేరే విషయాన్ని ప్రస్తావిస్తుంటే, అతని మాటలు దీనిని సూచిస్తాయి. లూకా మూడవసారి అసాధారణ సంఘటనను ప్రస్తావించినప్పుడు, అదే అసాధారణ సంఘటనకు తన మునుపటి రెండు సూచనల వెలుగులో అతడు చెప్పేది తన పాఠకులు చదవాలని అతడు ఆశిస్తున్నాడనే విషయం స్పష్టంగా ఉంది.
ఈ మూడు భాగాల అధ్యయనంలో γλῶσσα పై ఉన్న ప్రాధాన్యత అంతా, లూకా అపొస్తలుల కార్యములలో మనకు అందిస్తున్న చిత్రాన్ని వక్రీకరించే అవకాశం ఉంది. భాషలపై కాదు, పరిశుద్ధాత్మపై ప్రాధాన్యత ఉండాలి. లూకా థియోఫిలస్‌ను ఉద్దేశించి యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి వ్రాసాడు (లూకా సువార్తను). అయితే ఈ పుస్తకాన్ని (అపొస్తలుల కార్యములు) యేసు ఏమి చేయడం కొనసాగించాడో దానిని ఉద్దేశిస్తూ ఆ తరువాత ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తాను ఎంచుకున్న అపొస్తలులకు ఆజ్ఞలను ఇచ్చాడు (1:2) అని వ్రాసాడు. యేసు “పరిశుద్ధాత్మ ద్వారా” ప్రపంచంలో తన పరిచర్యను కొనసాగిస్తున్నాడని లూకా మనకు స్పష్టం చేయాలనుకుంటున్నాడు. అపొస్తలుల కార్యములలోని ఈ మూడు ఎపిసోడ్‌లను ఆ వెలుగులో చదవాలి.
అందువల్ల ఈ మూడు సందర్భాలలోనూ మనం చూడవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వ్యక్తులు అతీంద్రియ రీతిలో భాషలలో మాట్లాడగల సామర్ధ్యాన్ని కాదు బదులుగా యేసు నామంలో అపొస్తలులు చేసిన పనిని అద్భుతాల ద్వారా పరిశుద్ధాత్మ ధృవీకరించడాన్ని చూడవల్సి ఉన్నాం. నేడు భాషలు మాట్లాడటానికి ప్రాముఖ్యతను ఇచ్చే వారు లూకా తనను చదవాలని ఉద్దేశించిన విధంగా అపొస్తలుల కార్యములను చదవడం లేదు.
1 కొరింథీయులు 12–14, భాషల దుర్వినియోగాన్ని పౌలు సరిదిద్దడం
పౌలు తన మూడవ మిషనరీ ప్రయాణంలో, బహుశా మూడు సంవత్సరాలు ఎఫెసులో ఉన్నాడు. అక్కడి నుండి పౌలు తన మొదటి కొరింథీ లేఖను రాశాడు. ఇది లూకా అపొస్తలుల కార్యములను వ్రాయడానికి ఐదు లేదా ఆరు సంవత్సరాల ముందు జరిగింది. అయితే, పౌలు గతంలో కొరింథులో భాషల గురించి వ్రాసిన దాని వెలుగులో లూకా భాషల గురించి ఏమి చెబుతున్నాడో చదవాలని ఇది ఏమాత్రమును సూచించదు. పెంతెకొస్తు కథ లూకా దాని గురించి వ్రాయక ముందే ప్రారంభ చర్చిలో నిస్సందేహంగా అందరికి బాగా తెలుసు. అపొస్తలుల కార్యములు మరియు మొదటి కొరింథీయులు వ్రాయబడటానికి ముందు, పౌలు మరియు లూకా మిషన్ సహ సహచరులు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. పెంతెకొస్తు మరియు భాషల గురించి ఒకరికి తెలిసినది మరొకరికి కూడా తెలుసు. కాబట్టి వారు భాషల గురించి వ్రాసినప్పుడు, ఇద్దరూ ఒకే రకమైన విషయాన్ని సూచిస్తూ ఒకే విధంగా పదాన్ని ఉపయోగించారని అనిపిస్తుంది. ఈ కారణంగా లెన్స్కి మరియు ఎస్. లూయిస్ జాన్సన్ వంటి పండితులు అపొస్తలుల కార్యములు మరియు మొదటి కొరింథీయుల భాషలు ఎల్లప్పుడూ అర్థమయ్యే భాషలు అని పట్టుబట్టారు. అయితే, కొరింథులో భాషలను సరిగ్గా ఉపయోగించడం గురించి పౌలు చెప్పిన కొన్ని విషయాలు, కొరింథులో పారవశ్య ఉచ్చారణ కూడా ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఈ అధ్యాయాలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ అధ్యాయాలలో పౌలు ఉద్దేశ్యం కొరింథులో ఆధ్యాత్మిక బహుమతుల దుర్వినియోగాన్ని సరిదిద్దడం. కొరింథు విపరీతమైన వ్యక్తిత్వ స్ఫూర్తితో పీడించబడింది. సంఘంలోని కొంతమంది సభ్యులు ఒక సమిష్టి సభ్యులుగా కాకుండా సోలో వాద్యకారులుగా మరియు నైపుణ్యవంతులుగా ఉండాలని కోరుకున్నారు. మార్టిన్ ఫ్రాంజ్‌మాన్ “కొరింథియన్ ప్రశంస సమాజం” అని పిలిచిన దాని సభ్యులుగా వారి స్వంత ఉన్నత స్థితికి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వారు ఆత్మ ఇచ్చిన బహుమతులను ఉపయోగించారు. అందుకు వారు దుర్వినియోగం చేస్తున్న వరాలలో ఒకటి భాషల వరం, దీనిని గురించి పౌలు 1 కొరింథీ 14వ అధ్యాయం అంతా మాట్లాడాడు.
ఈ మూడు అధ్యాయాలలో మొదటి అధ్యాయంలో, దేవుని ఆత్మ వారిని ప్రభువుగా యేసు యొక్క పాలక ప్రభావంలో ఉంచుతుందని పౌలు క్రైస్తవులకు గుర్తు చేస్తున్నాడు. ఆత్మ “ప్రతి మనిషికి తన ఇష్టానుసారంగా” ఇచ్చే వరాలు క్రీస్తు శరీరంలోని అన్ని సభ్యులను పెంపొందించడానికి పరస్పర సేవలో ఉపయోగించబడాలి. మానవ శరీరంలో వలె, క్రీస్తు శరీరంలో, ఏ అవయవం ఒంటరిగా లేదా స్వయం సమృద్ధిగా ఉండదు. అన్ని అవయవాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి మరియు సమకాలీన పద్ధతిలో కలిసి పనిచేయాలి.
తరువాత పౌలు ఆత్మ ఇవ్వగల గొప్ప బహుమతి ప్రేమ అనే వరాన్ని స్థాపించడానికి ముందుకు కొనసాగాడు. ప్రేమ అనేది వ్యక్తిని కాకుండా ప్రభువును మహిమపరిచే సేవా జీవితానికి అవసరమైన అనివార్యమైన ఒక బహుమతి. ఒక క్రైస్తవుడు దేవుని బహుమతులను ఉపయోగించడాన్ని తగ్గించినప్పుడు, బహుమతులు విలువలేనివి. అందువల్ల ప్రేమ లేకుండా గ్లోసోలాలియా అనేది “మ్రోగెడు కంచును గణగణలాడు తాళము” కంటే మరేమీ కాదు.
మూడవ అధ్యాయం ఆధ్యాత్మిక వరాలను, ముఖ్యంగా గ్లోసోలాలియాను దుర్వినియోగం చేయడానికి దిద్దుబాటును అందిస్తుంది. ఏ క్రైస్తవుడు కూడా తన వరాలను తనను తాను ప్రోత్సహించుకోవడానికి లేదా “మంచి క్రైస్తవుడు”గా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి, తన సొంత ఖ్యాతిని పెంచుకోవడానికి వాటిని ఉపయోగించినప్పుడు లేదా చర్చిలో గందరగోళం మరియు విభేదాలను సృష్టించే విధంగా తన వరాలను ఉపయోగించినప్పుడు మరియు తద్వారా క్రీస్తు శరీరం యొక్క పెరుగుదలకు ఆటంకం కలిగించినప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించడం లేదు. (అధ్యాయం అంతటా పౌలు οἰκοδομεῖν (యెదుటివాడు క్షేమాభివృద్ధి పొందటం 1 కొరింథీ 14:17, పై నొక్కిచెప్పడాన్ని గమనించండి.) కాబట్టి క్రైస్తవులు “అన్నీ మర్యాదగా క్రమంలో జరిగేలా” ఆత్మ యొక్క వరాలను ఉపయోగించాలి.
అధ్యాయం 12
స్పష్టంగా కొరింథీ సంఘంలోని కొందరు, ఆధ్యాత్మిక బహుమతుల గురించి, ముఖ్యంగా కొరింథీలోని ఆధ్యాత్మిక బహుమతులకు సంబంధించిన సమస్యను గురించి పౌలును ప్రశ్నించారు. అందుకు పౌలు మొదట ప్రతికూలంగా తరువాత సానుకూలంగా సమాధానం ఇచ్చాడు. ఆధ్యాత్మికత పారవశ్యంలో మతోన్మాద పద్ధతిలో మూగ విగ్రహాలను ఆరాధించడానికి వాళ్ళు ఎటుపడితే అటు నడిపింపబడ్డారు (1 కొరింథీ 12:2). అన్యమతవాదం నుండి క్రైస్తవ మతంలోకి మారడానికి ముందు, కొరింథీయులు అలాంటి పారవశ్యాన్ని మతపరమైన అనుభవంగా భావించారు. ఆ పారవశ్య అనుభవంలోని అంశాన్ని కొరింథీ సంఘం యొక్క ఆరాధనలో చేర్చాలని దానిని భాషలు మాట్లాడటంతో అనుసంధానించాలని కొందరు కోరుకొంటున్నట్లుగా కనిపిస్తుంది. కాబట్టే పౌలు ఎటుపడితే అటు నడిపింపబడటం ఆధ్యాత్మికత కాదని చెప్తున్నాడు.
అతడు తన ప్రతికూల ప్రతిస్పందనను సానుకూలంగా వివరిస్తూ, ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక వ్యక్తి “యేసు ప్రభువు” అని చాలా సరళంగా ఒప్పుకునేలా నడిపించబడినప్పుడు అది నిజంగా ఆత్మ యొక్క పని అవుతుంది (1 కొరింథీ 12:3). ఈ విధంగా పౌలు వారిని భాషల విషయంలో హెచ్చరించాడు. అందుకు తగిన వేదికను ఏర్పాటు చేసాడు. బ్రూనర్ ఈ వచనాలలోని పౌలు ఆలోచనను వివరిస్తూ : మీరు క్రైస్తవులు కానివారుగా ఉన్నప్పుడు, మీ ఉన్నత మతపరమైన అనుభవాల ద్వారా మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడితే అటు నడిపింపబడ్డారు. వాటి చుట్టూ ఏర్పరచబడిన ఆచారాలతో తీసుకెళ్లబడ్డారు. అయితే, ఇప్పుడు, మీరు పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నారు. యేసును అర్థమయ్యేలా సరళంగా దేవునిగా పేర్కొనడంలో గౌరవించాలనే మీ కోరికలో మీరు ఆయనను అత్యున్నతంగా అనుభవిస్తున్నారు అని చెప్పాడు.
పౌలు అజెండాలో తదుపరిది χαρίσματα (కృపా వరముల) ను గూర్చిన చర్చ. అతడు మొదటి వచనంలోని πνευματικά (ఆత్మసంబంధమైన వరముల) నుండి నాల్గవ వచనంలోని χαρίσματα (కృపా వరముల)కు మారాడు. బహుశా πνευματικά (ఆత్మసంబంధమైన వరములు) అనే పదాన్ని కొరింథీయులు పౌలును ప్రశ్నించడంలో ఉపయోగించారు. మరొక పదానికి మారడం ద్వారా పౌలు కొరింథీయులకు ఆధ్యాత్మిక విషయాలను కృపకు సంబంధించిన విషయాల కిందకు తీసుకురావడం నేర్చుకోవాలని సూక్ష్మంగా సూచిస్తున్నాడు. బ్రూనర్ చెప్పినట్లుగా, వారు “ఆత్మ పరిచర్యను సంఖ్యాపరమైన, అన్య ఆచారా ఆధ్యాత్మిక రీతులలో లేదా పనికిరాని మహిమలో కాకుండా, చారిత్రక వాస్తవమైన, సిలువ వేయబడి లేచిన ప్రభువు యొక్క ప్రకాశంలో చూడవల్సి ఉన్నారు. ఇక్కడ, ఇప్పుడు, కనిపించే చర్చిలో ఉచిత సేవా బహుమతుల నిరంతర వైవిధ్యమైన పంపిణీలో దానిని చూడటం నేర్చుకోవాలి.
పౌలు ఇచ్చిన అటువంటి కృపా వరముల జాబితా ఆసక్తికరంగాను బోధనాత్మకంగాను ఉంది. ఇది λόγος σοφίας జ్ఞానవాక్యం మరియు λόγος γνώσεως బుద్ధి వాక్యము (వచనం 8), తరువాత γένη γλωσσῶν (నానావిధ భాషలును) మరియు ἑρμηνεία γλωσσῶν (భాషల అర్థము చెప్పు శక్తియు) (వచనం 10) అనే మాటలతో ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది. పౌలు చాలా సరళంగా, “బుద్ధి వాక్యము” మరియు “జ్ఞాన వాక్యము” అని చెప్పాడు. కొరింథులోని సమస్య గురించి తెలిసిన ఎవరైనా పౌలు నొక్కిచెప్పిన విషయాన్ని కోల్పోరు. అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు బోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు (1 కొరింథీ 14:19). ఏ క్రైస్తవుడైనా చేయగలిగే గొప్ప పని ఏమిటంటే, యేసును గౌరవించడం, ముఖ్యంగా ఆయనను గురించి సాక్ష్యమిచ్చే మాటలతో.
ఆ విధంగా పౌలు అర్థమయ్యే ప్రసంగ వరాన్ని తన జాబితాలో అగ్రస్థానంలో ఉంచడం ద్వారా దానిని ప్రముఖమైనదిగా చేసాడు. భాషల వరాన్ని తన జాబితాలో దిగువన ఉంచడం ద్వారా దానిని దాని సముచిత స్థానానికి తగ్గించాడు. కొరింథీయులు మరియు నేటి గ్లోసోలలిస్ట్‌లు కూడా దీనిని గమనించాలి. పౌలు అర్థమయ్యే పదాలను మొదటగా అర్థం కాని పదాలను చివరిగా ఉంచడం, అలాగే సందర్భం సూచించినట్లుగా అలా చేయడానికి అతను కారణాన్ని ఉంచడం, పౌలు తన జాబితాలో దిగువన γένη γλωσσῶν ను (నానావిధ భాషలు) ఉంచినప్పుడు అతడు విదేశీ భాషల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు అని అనుకోవచ్చు.
కొరింథులోని క్రైస్తవ సమాజ విభజనకు కారణమైన సమస్యను పౌలు ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు (1 కొరింథీ 12:12-27). దేవుని వరాలు చర్చిని విభజించడానికి ఉద్దేశించినవి కాదని పౌలు నొక్కి చెప్తున్నాడు. దేవుడు ఇచ్చిన వరాలు అవి మొత్తం శరీర అవసరాలను తీరుస్తాయి మరియు దానిని ఏకం చేయడానికి ఉపయోగపడతాయి. మానవ శరీరంలో ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యునిపై ఆధారపడి ఉంటాడు (21). అలాగే చర్చిలో కూడా ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యునిపై ఆధారపడి ఉంటాడు. ఏ క్రైస్తవుడు ఒంటరి కాడు. ఏ వరము అనవసరమైనది కాదు. కాబట్టి సంఘంలోని ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యుని గురించి శ్రద్ధ వహించాలి. కృపా వరములు అందరి ప్రయోజనం కోసం ఉన్నాయి. వారి వరాలు పరస్పర ప్రయోజనం కోసం.
ఈ అంశాన్ని వదిలి వెళ్ళే ముందు పౌలు రెండవ జాబితాను (28) అందిస్తున్నాడు – మొదటి దానికంటే భిన్నంగా. కాని రెండు సందర్భాలలోనూ పౌలు భాషలను జాబితా చివరలో ఉంచాడు. τὰ χαρίσματα τὰ μείζονα కృపావరములలో శ్రేప్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడని వాటి కోసం తీవ్రంగా వెతకమని అందుకే దేవుడు ఒక క్రమాన్ని స్థాపించాడని పౌలు చెప్తూ, మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగల వారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారినిగాను, కొందరిని నానా భాషలు మాటలాడు వారినిగాను నియమించెను, అని చెప్పాడు (28). గొప్ప వాటికి తక్కువ వాటికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. భాషలు ప్రశ్నలు లేకుండా తక్కువ వాటికి చెందినవి.
13వ అధ్యాయం
కొంతమంది వ్యాఖ్యాతలు ఈ అధ్యాయం యాదృచ్ఛికమైనదని, పౌలు కృపావరముల చర్చ మధ్యలోకి చొప్పించబడిందని దాని ఆలోచనా సరళిలో అంతరాయం లేకుండా 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం చక్కగా సరిపోయిందని చెప్తుంటారు. ఈ విషయాన్ని నేను విభేదిస్తున్నాను. ఆధ్యాత్మిక బహుమతులకు సంబంధించిన ప్రశ్నకు పౌలు ఇచ్చిన సమాధానంలో ఈ అధ్యాయం ఒక అంతర్భాగం. అటువంటి బహుమతులు దేవుని నుండి దేవుని ప్రజలకు వచ్చిన కృపావరములు χαρίσματα అని పౌలు ఇప్పుడే పేర్కొన్నాడు. దేవుని ప్రజలు వాటిని ప్రేమ ద్వారా ప్రదర్శిస్తారు. ప్రేమ అనేది పారవశ్యం వలె శ్రద్ధను పొందడం కాకపోవచ్చు, కాని అది పూర్తిగా ప్రాథమికమైనది. అది లేకపోతే కృపా వరములు అవమానించబడతాయి.
ప్రేమపై తన ప్రసంగాన్ని పౌలు కొనసాగిస్తున్నప్పుడు, కొరింథీలోని సమస్య అతని మనసులో ముందంజలో ఉంది. అతడు చెప్పేది ముఖ్యంగా బహుమతులు మరియు వాటిని దుర్వినియోగం చేయడం, ముఖ్యంగా భాషలు అనే ప్రశ్నకు వర్తిస్తుంది. అందువల్ల పౌలు ప్రేమ దీర్ఘకాలము సహించును అనే వాదనతో ప్రేమ యొక్క నిర్వచనాన్ని ప్రారంభించాడు. μακροθυμεῖ ఇది ఒక్క క్షణం యొక్క భావోద్వేగం ద్వారా కాకుండా (μακρός) దీర్ఘ కాలము కొనసాగే ఉత్సాహభరితమైన భావోద్వేగం (θυμός) ద్వారా వర్గీకరించబడుతుంది.
ప్రేమ దయ చూపించును తప్ప గర్వించదు. అది “ఉప్పొంగదు” అని పౌలు చెప్పటం కొరింథులోని భాషలు మాట్లాడే వారికి ప్రాముఖ్యమైనదిగా ఉంది. భాషలు మాట్లాడేవారు చాలా సులభంగా తమ వైపు ఇతరుల దృష్టిని ఆకర్షించుకోగలరు. περπερεύεται డంబముగా ప్రవర్తింపదు. ఇది కొరింథీయులు ఇతర విశ్వాసులను ధిక్కరిస్తూ విస్మరిస్తూ వారి అనుభవాల కారణంగా వారు తమ స్వంత ఆధ్యాత్మిక స్థితి గురించి అతిశయోక్తి భావనను కలిగి ఉన్నారని సూచిస్తుంది. పౌలు ఆ విషయాన్నే అది “φυσιοῦται ఉప్పొంగదు” అని చెప్తున్నాడు. ప్రేమ ఎప్పుడు అలా చేయదు అని చెప్తూ, అది తన “స్వప్రయోజనమును విచారించుకొనదు” అని దానికి జతచేస్తున్నాడు. మునుపటి అధ్యాయంలో పౌలు వివరించినట్లుగా ప్రేమ διακονία నానావిధములైన పరిచర్యల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటుంది (12:5). అతని వివరణ తదుపరి అధ్యాయం వైపు కూడా చూస్తుంది. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొంటాడు (14:4). అయితే ప్రవచించేవాడు (యేసు ప్రభువు అని ప్రకటించేవాడు) సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు.
ఈ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన సమస్య కూడా ఉంది. పౌలు భాషలు నిలిచి పోతాయని, παύσονται (13:8), ప్రవచనములైనను జ్ఞానమైనను నిరర్థకమగుతుందని καταργηθήσεται పేర్కొన్నాడు. అపోస్టోలిక్ యుగంలో అవి లేఖనాల నియమావళి స్థాపించబడిన తర్వాత నిజంగా భాషలు ఆగిపోయాయని చరిత్ర వెల్లడిస్తుంది. కాబట్టి, నేడు పారవశ్య భాషలు మాట్లాడటం రెండు విధాలుగా లేఖనానుసారంగా విరుద్ధం.
స్పష్టంగా జ్ఞానం ఇంకా అదృశ్యం కాలేదు. ప్రవచనాలు, ప్రకటన లేదా సాక్ష్యం అనే అర్థంలో ఇవి కూడా ఆగిపోలేదు. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును, 13:9,10. కొంతమంది వ్యాఖ్యాతలు “పరిపూర్ణమైనది ఎప్పుడు వస్తుంది” అనే సమయాన్ని లేఖనాల నియమావళి స్థాపన సమయాన్ని సూచిస్తుందని భావిస్తారు. కానన్ స్థాపించబడినప్పుడు జ్ఞానం నిరుపయోగంగా మారలేదు. 10వ వచనాన్ని 12వ వచనం వెలుగులో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరోసియా (ఆయన రాకడ) గురించి స్పష్టంగా ప్రస్తావించబడింది. ప్రభువు తిరిగి రాక ముందే, భాషలు ఆగిపోతాయి. ఇక్కడ పౌలు ఉద్దేశ్యం అన్నింటికంటే ప్రేమ యొక్క ఆధిపత్యాన్ని స్థాపించడమే.
14వ అధ్యాయం
మూడు అధ్యాయాలలో మొదటిది కొరింథీయులకు “మరింత శ్రేష్ఠమైన మార్గాన్ని” చూపించే వాగ్దానంతో ముగిసింది. ప్రేమ మార్గం అంతకన్నా శ్రేష్ఠమైన మార్గం. ప్రేమకు ఒక లక్ష్యం ఉంది. దాని ఏకైక ఆసక్తి చర్చిని నిర్మించడం. అదే ఈ అధ్యాయం యొక్క ఇతివృత్తం, చర్చి యొక్క οἰκοδομή క్షేమాభివృద్ధి. వరము అనేది ఆత్మ యొక్క బహుమతి. అది చర్చిని మెరుగుపరచడానికి ఉపయోగపడితే సరిగ్గా ఉపయోగించబడుతుంది. కాబట్టి చర్చిలో ప్రధానమైనది, చర్చిని మెరుగుపరచడానికి, నిర్మించడానికి ఏది ఉత్తమంగా ఉపయోగపడుతుంది? అని పరిశీలించడమే.
ఈ అధ్యాయంలో పౌలు ఆ ప్రశ్నను ప్రవచనం మరియు భాషల పరిశీలనకు కుదించాడు. అలా చేయడంలో అతడు గ్లోసోలాలియా యొక్క పరిమితులను సంఘ మంచి కోసం ఉద్దేశిస్తూ అలాగే అది చేయగల హానిని గురించి కూడా వివరిస్తున్నాడు.
అపొస్తలుడు కొరింథీయులను ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి అని కోరుతున్నాడు. ఈ అధ్యాయంలో ఎక్కువ భాగాన్ని భాషల కంటే ప్రవచనం యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి అతడు కేటాయించాడు. ప్రవచనం సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుంది. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొంటాడు (4). భాషలు సంఘంలో విభేదాలు విభజనలకు కారణం కాకుండా ఉండటానికి, పౌలు చర్చిలో భాషల వాడకాన్ని నియంత్రించే స్పష్టమైన నిబంధనలను విధించాడు. ఆత్మను పరిమితం చేయకుండా అతను భాషలలో మాట్లాడటాన్ని నిషేదించలేదు కాని ఆ వరం దాని పరిమిత సామర్థ్యం ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉపయోగించమని చెప్పాడు.
భాషల విషయములో అతని ఆదేశాలు :
- భాషల కంటే ప్రవచనానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఒకటి ప్రజలకు అర్థమయ్యేది మరియు మరొకటి వ్యక్తిగతముగా భాష మాట్లాడే వారికి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది (1–3) గాని యెదుటివాడు క్షేమాభి వృద్ధి పొందడు (17).
- భాషలను మాట్లాడటం అనేది అనువాదకుడు లేకుండా బహిరంగంగా మాట్లాడకూడదు. భాషలలో భాష/లేదా పారవశ్య ఉచ్చారణనా అనే ప్రశ్న కూడా ఉంది. మరొక భాషలు మాట్లాడేవారు అనువాద వరం కోసం ప్రార్థించాలి (5,13). అలాకాకుండా పారవశ్య ప్రసంగం ఇందులో ఉంటే, అనువాదకుడు ఆ విషయం యొక్క వివరణను అందించే వ్యక్తి అవుతాడు. పెంతెకోస్టల్ వర్గాలలో, ముఖ్యంగా అనువాదకుడు చేసేది అదే.
- క్రైస్తవుల సమావేశంలో భాషలు మాట్లాడేటప్పుడు మంచి క్రమాన్ని పాటించాలి. దీని అర్థం అనువాదకుడు హాజరైనప్పుడు మాత్రమే ముగ్గురికి మించి మాట్లాడకూడదు (27).
- స్త్రీలకు భాషలలో మాట్లాడే లేదా బహిరంగ సభలో ప్రవచించే అధికారాన్ని విస్తరించకూడదు. వారు “సంఘములలో మౌనంగా ఉండాలి” (34) – ఈ రోజు కరిష్మాటిక్స్ దీనిని రద్దు చేసారు.
- చివరగా, పౌలు భాషలను నిషేదించలేదు (39). భాషలను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చిన ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, పౌలు దానిని ఆపమని మానేయమని పూర్తిగా ఆజ్ఞ జారీ చేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కాని అతడు పరిశుద్ధాత్మపై దాడి చేయడం లేదు. అతడు వాటిని నియంత్రించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఈ అధ్యాయంలో భాషలు అంటే ఏమిటో అని మనం మరోసారి ప్రశ్నించుకొందాం. మనం ఇంతకు ముందు గమనించినట్లుగా, కొందరు xenoglossia (విదేశీ భాషలు) మాత్రమే అని అంటున్నారు. ఈ భాషలు పారవశ్య ఉచ్ఛారణలు అని, బహుశా భూమిపై మాట్లాడని స్వర్గపు భాషలు అని మరికొందరు అంటున్నారు. మరికొందరు రెండూ సాధ్యమేనని అభిప్రాయపడుతున్నారు.
పౌలు ఈ భాషలను “తెలియని భాషలు”గా పరిగణించడు. ఈ భాషలు వివిధ దేశాల ప్రజలు ఉపయోగించే భాషలు. ఈ అధ్యాయంలో భాషలను పారవశ్య ఉచ్చారణలుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించే వారితో నేను ఏకీభవిస్తున్నాను. రెండవ వచనంలో పారవశ్య ప్రసంగానికి స్పష్టమైన సూచన ఉందని కొందరు గట్టిగా చెప్తుంటారు. కాని పౌలు ఇలా అంటున్నాడు, భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు (14:2). ఈ సందర్భంలో నాలుక వినేవారికి అర్థం కాని భాషను మాట్లాడొచ్చు. దేవుడు దానిని అర్థం చేసుకుంటాడు, కానీ అతని శ్రోతలు దానిని అర్థం చేసుకోరు.
నాలుగవ వచనంలో కూడా ఇదే విషయం చెప్పబడింది. భాషలు మాట్లాడే వ్యక్తి సంఘానికి కాదు, తనకు తాను క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు. చాలా మందికి చైనీస్ భాష ఎంత వింతగా ఉంటుందో తెలుసు ఒకడు భాషలో మాట్లాడినప్పుడు అతని శ్రోతలకు కూడా అంతే వింతగా ఉంటుంది. కాబట్టి ఎవరూ అతడు చెప్పే దాని ద్వారా క్షేమాభివృద్ధి చెందకపోవచ్చు. అతనికి కూడా తాను ఏమి చెప్తున్నాడో అర్థం కాకపోవచ్చు. అతనికి కలిగే క్షేమాభివృద్ధి అతని మాటల కంటెంట్ ద్వారా కాదు, దేవుడు దేవుని అద్భుతమైన పనులను తెలియజేయడానికి అతన్ని అద్భుతమైన రీతిలో ఉపయోగిస్తున్నాడనే వాస్తవం ద్వారా అతడు క్షేమాభివృద్ధి చెందుతాడు.
γλῶσσα అంటే విదేశీ భాష అనడానికి రుజువుగా తరచుగా ఉదహరించబడే వచనం 21. పౌలు యెషయా 28:11–12ను ఉటంకిస్తున్నాడు: అన్యభాషలు మాటలాడు జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను, ఈ జనులతో మాటలాడుదును. ఈ సందర్భంలో యెషయా, ఆమె మతభ్రష్టత్వం కారణంగా, దేవుడు తన ప్రజలను అష్షూరీయుల చేతుల్లో శిక్షిస్తాడని ఇశ్రాయేలును హెచ్చరించాడు. దేవుడు తన ప్రజలకు పాఠం నేర్పడానికి అష్షూరీయుల భాషను ఉపయోగించాలని అనుకున్నాడు. అందువల్ల యెషయా కాలంలో దేవుడు సూచనగా ఉపయోగించిన నాలుక విదేశీ భాష.
γλῶσσα ను అర్థమయ్యే విదేశీ భాషగా అర్థం చేసుకునే వారికి ఈ సాక్ష్యం అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది వివరణల ఆధారంగా వచ్చిన సహేతుకమైన ముగింపు. కొరింథీయుల భాషలు అపొస్తలుల కార్యముల భాషల నుండి భిన్నంగా ఉన్నాయని పరిగణించడానికి ఎటువంటి బలమైన కారణం లేదు. కొరింథులో భాషలలో పారవశ్య ఉచ్చారణను చేర్చే వారి పట్ల మనం సానుభూతి చూపనవసరం లేదు. పెంతెకొస్తులో సంభవించినది ఇప్పటి వరకు మళ్ళి జరగలేదు. భాషలు మాట్లాడే వ్యక్తి విదేశీ భాష మాట్లాడుతున్నాడా లేదా అనే దాని ఆధారంగా భాషల చట్టబద్ధతను నిర్ణయించగలిగితే దాని ప్రామాణికత ఖచ్చితంగా తెలిసిపోతుంది.
1 కొరింథీయులు 14 లోని పౌలు సలహాను పాటిస్తే, ఎటువంటి సమస్య ఉండదు. నేడు పెంతెకోస్తులు మరియు నియో-పెంతెకోస్తుల విషయంలో తరచుగా జరుగుతున్నట్లుగా దీనిని విస్మరిస్తే, కొరింథులోలా మన మధ్యలో కూడా సమస్య పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ సమస్య చాలా తీవ్రమైనదని ఆధారాలు సూచిస్తున్నాయి.
సి. భాషల ఉద్దేశ్యం
పెంతెకొస్తులు మరియు నియో -పెంతెకొస్తులు సాధారణంగా భాషల వరం “పరిశుద్ధాత్మలో బాప్తిసం” కి నిదర్శనమని అంగీకరిస్తున్నారు. ఆత్మ బాప్టిజం పవిత్రమైన రెండవ స్వీకరణ అని కరిస్మాటిక్స్ నమ్ముతున్నారని చెప్పడం సరిపోతుంది. క్రైస్తవ జీవితాన్ని పూర్తిగా జీవించడానికి విశ్వాసిని శక్తివంతం చేయడానికి పరిశుద్దాత్మ అవసరం. అటువంటి బాప్టిజం జరిగిందనడానికి ప్రాథమిక సాక్ష్యం భాషలలో మాట్లాడే సామర్థ్యం అని వాళ్ళ నమ్మకం. పెంతెకొస్తులకు భాషలు మాట్లాడటం యొక్క ఉద్దేశ్యం అదే. ఈ విషయానికి మద్దతు ప్రధానంగా అపొస్తలుల కార్యముల నుండి తీసుకోబడింది.
మరికొందరు భాషల వరము యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, ముఖ్యంగా నూతన నిబంధన యుగం ప్రారంభంలో, సువార్తను వ్యాప్తి చేయడమే అని నమ్ముతారు. ఈ బహుమతి భాషా అవరోధాన్ని తొలగించి, సువార్తను మరింత వేగంగా వ్యాప్తి చేయడానికి వీలు కల్పించింది. ఇది నిస్సందేహంగా సహేతుకమైన కారణం. అయితే ఈ వరాన్ని మంజూరు చేయడంలో దేవుని ఉద్దేశ్యం ఇదేనని లేఖనం ఎక్కడా సూచించలేదు. అది ఆయన ఉద్దేశాలలో ఒకటి అయితే, స్పష్టంగా అది ప్రాథమిక ఉద్దేశ్యం మాత్రం కాదు.
ఆ తీర్మానాన్ని సమర్థించే కొందరు తమ అభిప్రాయానికి మద్దతుగా అపొస్తలుల కార్యములు 2ని ఉదహరిస్తారు.పెంతెకొస్తు రోజున అక్కడ గుమిగూడిన ప్రజలందరూ శిష్యులను అర్థం చేసుకోగలరని వారందరు భూమి యొక్క అనేక మూలల నుండి వచ్చినప్పటికీ, వారందరూ అరామిక్ లేదా గ్రీకు లేదా రెండింటినీ అర్థం చేసుకోగలరనేది కూడా నిజం. పేతురు ఆ భాషలలో దేనిలోనైనా బోధించి ఉంటే, అందరూ అతన్ని అర్థం చేసుకునేవారు. సమరయులు (అధ్యాయం 8), కొర్నేలియస్ (అధ్యాయం 10) మరియు ఎఫెసు శిష్యులు (అధ్యాయం 19) పాల్గొన్న ఎపిసోడ్‌లు భాషల ఉద్దేశ్యం యొక్క ఈ దృక్పథానికి ఇంకా తక్కువ విశ్వసనీయతను అందిస్తాయి.
1 కొరింథీయులు 14:14–17 మరియు 28 ఆధారంగా కొంతమంది నియో-పెంతెకొస్తులు దేవుడు భక్తి ప్రయోజనం కోసం భాషల వరాన్ని ఇస్తాడని నమ్ముతారు. పౌలు 14వ వచనంలో “భాషలో” ప్రార్థన గురించి మాట్లాడుతాడు. అలాంటి ప్రార్థనలో πνεῦμα (ఆత్మ) ఉంటుంది కానీ νοῦς (సంపూర్ణ అర్ధం) ఉండదు. పౌలు అలాంటి ప్రార్థనను ఏకాంతంగా ఆమోదిస్తాడు. 16వ వచనంలో, “ఆత్మతో దీవించుట” కూడా ప్రార్థన యొక్క ఒక రూపం, ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు. అలాగే 28వ వచనంలో భాషలు మాట్లాడటం “దేవునితో మాట్లాడటం”గా గుర్తించబడింది. ఈ కొరింథీ వచనాలను కరిస్మాటిక్స్ రోమా 8:26కి, “ఉచ్చరింప శక్యముకాని మూలుగులను” (పారవశ్య ప్రసంగానికి ) మరియు ఎఫెసీయులు 5:18–20కి అనుసంధానించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ పౌలు “ఆత్మతో నిండి హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుటను” గురించి మాట్లాడుతున్నాడు. అయితే, రోమా పత్రికలో ప్రార్థన చేసే వ్యక్తిగా, మధ్యవర్తిగా ఆత్మ “ఉచ్చరింప శక్యముకాని మూలుగులను” ఉత్పత్తి చేస్తాడు. వాటిని ఉచ్చరించలేకపోతే, వాటిని మాట్లాడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, మనం పాడటం కీర్తించటం హృదయపూర్వకంగా ఉండాలని పౌలు భావించాడు.
గ్లోసోలాలియా అనేది ఆరాధన కోసం ఇవ్వబడిన ప్రత్యేక భాష అని కరిస్మాటిక్స్ ఎందుకు స్థాపించడానికి ప్రయత్నిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. కాని లేఖనాలు మనకు ఆ అభిప్రాయాన్ని ఇవ్వవు, ముఖ్యంగా అపొస్తలుల కార్యములు.
“భాషలు ఒక సూచన కోసం” అని పౌలు చెబుతున్నాడు (εἰς σημεῖον, వచనం 22) “నమ్మేవారికి కాదు, నమ్మని వారికి.” మరో మాటలో చెప్పాలంటే, భాషలు ఆత్మాశ్రయమైన దానికి కాకుండా, నిష్పాక్షికమైన దానికి రుజువు లేదా సంకేతాన్ని అందిస్తాయి. దేవుడు వ్యక్తులను ఆత్మతో నింపి, వారికి భాషల వరాన్ని ఇచ్చాడు, మాట్లాడే వ్యక్తికి ఒక సంకేతంగా కాదు, మాట్లాడేదాన్ని విన్న వారికి ఒక సంకేతంగా. అపొస్తలుల కార్యములలో మూడు సందర్భాలలో, అది అర్ధవంతమే.
పెంతెకొస్తు రోజున, పేతురు సువార్త సందేశం యొక్క వాదనలను 3000 మంది అవిశ్వాసులైన యూదులకు ధృవీకరించడానికి భాషల అద్భుతం ఉపయోగపడింది. కొర్నేలియస్ ఇంట్లో పరిస్థితి తారుమారైంది. మతమార్పిడి చెందిన వారు భాషలు మాట్లాడారు మరియు మతమార్పిడి చేసిన వారికి ఒక సంకేతం ఇవ్వబడింది – సువార్త యూదులకు మరియు అన్యులకు ఉద్దేశించబడిందని పేతురు మరియు అతని ఆశ్చర్యపోయిన సహచరులకు ఒక సంకేతం (10:45). కొర్నేలియస్ మరియు అతని కుటుంబం బాప్టిజం కోసం సరైన అభ్యర్థులు అని పేతురుకు కూడా ఇది ఒక సంకేతంగా పనిచేసింది (10:47). తరువాత యెరూషలేము సమావేశంలో, పేతురు భాషలు మాట్లాడే వరం గురించి ప్రస్తావించడం సున్నతి పార్టీలో వ్యతిరేకతను నిశ్శబ్దం చేసిన తిరుగులేని సాక్ష్యం (11:15–18). ఎఫెసులో, పౌలు బాప్తిసం తర్వాత యోహాను శిష్యులు భాషలలో మాట్లాడారు, పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు పని గురించి పౌలు వారికి ఇచ్చిన సాక్ష్యాన్ని ధృవీకరించే సంకేతం భాషలు.
అందువల్ల గ్లోసోలాలియా అనేది దేవుడు ఇచ్చిన బహుమతి, ప్రధానంగా ఆరాధన కోసం ఒక ప్రత్యేక భాషగా కాదు; ప్రధానంగా సువార్త వ్యాప్తిని సులభతరం చేయడానికి కాదు; మరియు ఖచ్చితంగా ఒక విశ్వాసి రెండవ “పరిశుద్ధాత్మలో బాప్టిజం” అనుభవించాడనే సంకేతంగా కాదు. దేవుని సత్యం యొక్క కొంత కోణాన్ని ప్రామాణీకరించడానికి మరియు నిరూపించడానికి ఇది ప్రధానంగా ఒక స్పష్టమైన ఉద్దేశ్యం కోసం ఇవ్వబడింది. ఈ ఉద్దేశ్యాన్ని ఎల్లప్పుడూ వాస్తవిక సంకేతం నుండి ఆత్మాశ్రయ అనుభవానికి మార్చే వారు వక్రీకరిస్తారు.
II. చారిత్రాత్మకంగా పరిశీలిధ్ధాం
క్రీ.శ. 100–1900 గ్లోసోలాలియా చరిత్ర బోధనాత్మకమైనది – దాని సమృద్ధి కంటే దాని అస్పష్టత కారణంగా. అపొస్తలుల కాలం నుండి ప్రస్తుత శతాబ్దం ప్రారంభం వరకు ఆ చరిత్రను క్లుప్తంగా సమీక్షిధ్ధాం.
అపొస్టోలిక్ అనంతరం, సంస్కరణకు ముందు శతాబ్దాలలో, మరియు సంస్కరణానంతర శతాబ్దాలలో, గ్లోసోలాలియా గురించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, దాని సంభవం చాలా తక్కువగా ఉండటం మరియు చర్చి యొక్క వేదాంతశాస్త్రం మరియు చరిత్ర రచయితలు దానిపై తక్కువగా శ్రద్ధ పెట్టడం.
పెంతెకోస్తలిజం మరియు నియో-పెంతెకోస్తలిజం రెండూ అపోస్టోలిక్ కాలంలోని భాషల కేంద్ర స్థానాన్ని పొందే భాషలకు ప్రాముఖ్యతను ఇస్తాయి. బైబిల్ దీనికి మద్దతు ఇవ్వదు. వేలాది మంది ప్రజలు అపొస్తలులచే బాప్తిస్మం తీసుకున్నారు, వీరి కోసం “పరిశుద్ధాత్మలో బాప్టిజం” భాషలలో మాట్లాడటం ద్వారా రుజువు కాలేదు. ఆ నమూనా 19 శతాబ్దాల పాటు కొనసాగిందని సంఘ చరిత్ర వెల్లడిస్తుంది. ఈ విషయాన్ని కరిస్మాటిక్స్ విస్మరించకూడదు.
దేవుడు తన ప్రజలకు తన ఆత్మ శక్తిని నిలిపివేయడం ద్వారా 1900 సంవత్సరాలుగా తన చర్చిని పేదరికం చేశాడనే ఆలోచనకు సంఘ చరిత్ర ఏమాత్రం మద్దతు ఇవ్వదు. ఆ ఊహ పూర్తిగా అవాస్తవంగా ఉంది.
పరిశుద్ధాత్మ యొక్క పూర్తి స్వీకరణకు ప్రారంభ సంకేతంగా భాషలు తప్పనిసరి అయితే, మరియు భాషలు ఆత్మతో నిండిన జీవితానికి ఆచరణాత్మకంగా ఒక అవసరం అయితే, ఆ శతాబ్దాల సాపేక్ష నిష్క్రియాత్మకతను ఆత్మ వైపు నుండి ఎలా వివరిస్తారు? చర్చి దాని చరిత్రలో మునుపటి కాలంలో భాషలు లేకుండా కొనసాగగలిగితే మరియు వృద్ధి చెందగలిగితే, అవి ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు అంత అవసరం? మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామనే సమాధానం ఆ ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం ఇవ్వదు. చారిత్రక ఆధారాలు కూడా దాని చట్టబద్ధతకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
భాషలు మాట్లాడేవారు అర్థం చేసుకున్నట్లుగా ఆత్మ బాప్టిజంలోకి లోతుగా వెళ్లడం ఈ అధ్యయనం యొక్క పరిధికి మించినది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl