దశమ భాగం
అవుట్ లైన్ :
- సీనాయికి ముందు
- సీనాయి వద్ద
- సీనాయి తర్వాత (క్రొత్త నిబంధనతో సహా ప్రస్తుత కాలము వరకు)
అసలు ప్రశ్న: పాత నిబంధన ఆజ్ఞయైన దశమ భాగాన్ని క్రొత్త నిబంధనలో కాలంలో ఎలా పరిగణించాలి? అది ఈ రోజుకు అమలులో ఉందా?
నేడు మనం దశమభాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది దేవుని నైతిక ధర్మశాస్త్రం యొక్క అవసరమా? (ఈ రోజుకి కట్టుబడి ఉన్నామా) లేదా ఇది పాత నిబంధన యొక్క శుద్ధికారణాచార సంబంధమైన ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞా (అందువల్ల నేడు దీనికి కట్టుబడి లేమా)? దశమభాగం అనేది కానుకల ద్వారా విశ్వాసులు దేవుని పట్ల వారి కృతజ్ఞతను వ్యక్తం చేసేందుకు ఇవ్వబడిన “ఒక ఆజ్ఞా”? దశమభాగం యొక్క అర్థం సంవత్సరాలుగా మారిందా? లేదా దాని ప్రాముఖ్యత గతంలో విశ్వాసులకు ఉన్నట్లే నేటికిని ఉందా? పాత నిబంధన యొక్క దశమభాగం అంటే నిజంగా ఏంటి? అది నేటి క్రైస్తవ జీవనానికి ఎలా సరిపోతుంది?
ప్రభువు సంఘంలో మన ముందు ఉంచే అవకాశాలు సవాళ్లు రోజురోజుకి పెరుగుతున్నాయి. అలాగే సంఘంలో దశమ భాగం అనేది ‘డబ్బు’పై కేంద్రీకృతమై ఉంది కాబట్టి, ఈ విషయంపై సంవత్సరాలుగా గందరగోళం మరియు తికమక ఉండటం సహజం. అది ఆశ్చర్యాన్ని కలిగించకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎంత ఎక్కువగా ఉంటే, ఆ ఆశీర్వాదాన్ని నిష్ఫలం చేయడానికి అపవాది అంత ఎక్కువగా ప్రయత్నిస్తాడు, దానికి మనం అధిక ప్రాముఖ్యతనిచ్చేటట్లు చేస్తాడు. మనకందరికీ తెలిసిందే, ఈ లోకంలో డబ్బు “విలువని” సూచిస్తుంది. మన జీవితాలలో ప్రథమస్థానంలో ఉండాలని దేవుడు చెప్పిన దాని మార్పిడికి ప్రత్యామ్యాయంగా దాని స్థానములో డబ్బు వచ్చి చేరింది. కాబట్టే పౌలు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని హెచ్చరిస్తున్నాడు (1 తిమోతికి 6:10). డబ్బు కాదు కాని ధనాపేక్ష దేవుని ప్రేమ నుండి దేవుని మార్గాల నుండి దృష్టిని మళ్లిస్తుంది. డబ్బు నిజానికి దేవుడు మనకు చాలా ఉదారంగా ఇచ్చిన ఆశీర్వాదాలను సూచిస్తుంది. కాని దురాశ మరియు కామం చిత్రంలోకి ప్రవేశించినప్పుడు, ఒక క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. అది మనిషి హృదయాన్ని ఎంతగా తినేస్తుందంటే అతడు తన వద్ద ఉన్నదానితో ఎప్పుడూ సంతృప్తి చెందడు. కాని ఎల్లప్పుడూ దానిని ఎక్కువగా కోరుకొంటూ ఉంటాడు. అలా జరిగినప్పుడు, హృదయానికి ఏది అత్యంత విలువైనదో దానిపై అది దృష్టి పెడుతుంది. దేవుని ప్రేమ దేవుని మార్గాలు వెన్నక్కి నెట్టివేయబడతాయి. మొదటి ఆజ్ఞలో, దేవుడు అన్నింటికంటే ఎక్కువగా తనను ప్రేమించమని మనకు సూచించాడు. ఏదెను తోటకు తిరిగి వెళ్తే, ఈ ఆజ్ఞ ఆదాము హవ్వలకు నేరుగా తెలియజేయబడటం మనకు కనిపించదు. కాని దేవుడు మాట్లాడిన ప్రతి పదం వెనుక, ఆ తరువాత, ఆయన ఆజ్ఞలో చెప్పిన అధికారం మరియు మహిమను మనం అనుభవిస్తాము. ఆయన అన్నింటినీ సృష్టించిన దేవుడు మరియు అన్నింటికంటే పైవాడు. అన్నీ ఆయనకు చెందియున్నవి.
దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను, ఆదికాండము 2:15. ఏదెను తోటలో దేవుడు సృష్టించిన వాటిని మానవుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఎలా నిర్వహించాలో లేదా దేవుడు మనిషి నుండి ఏమి ఆశించాడో మనకు తెలియదు. అలాగే “ఆరాధన” లేదా “దేవుడు చేసిన ప్రతి దానికీ కృతజ్ఞతతో దేవునికి ఏదైనా తిరిగి ఇవ్వడం” గురించి ఏదెను తోటలో ఎటువంటి ప్రస్తావన లేదు. ఆదికాండము 3:8లో ఆదాము హవ్వలు, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విన్నారు అని మనం చదువుతాం. దేవుడు స్పష్టంగా చాలా విలక్షణమైనవాడు ఆయన అప్పుడు, అక్కడ, ఆదాము హవ్వలకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన అన్నింటికీ పైగానున్న దేవుడు అయినప్పటికీ, ఆయన ఏదెను తోట దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన నడుస్తున్నట్లు వినొచ్చు. ఆయన మర్మము కాదు. ఆయన తెలిసినవాడు మరియు అర్థం చేసుకోగలిగిన వాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, ఆదికాండము 1:27, తత్ఫలితంగా మనిషి దేవుని సారాంశానికి ప్రతిబింబం. మానవుడు కలిగి ఉన్న సహజ జ్ఞానం దేవుని సంకల్పం మరియు మార్గాల ప్రతిబింబం. దేవుని ప్రేమ మరియు మార్గాలను తెలుసుకోవడానికి ఆదాము హవ్వలకు ‘బైబిల్’ (లేదా రాతి పలకలు) అవసరం లేదు. అవి వారి హృదయాలలో బాగా పాతుకుపోయాయి.
మానవుడు పాపంలో పడిపోయిన తర్వాత, ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి తరిమివేయబడ్డారు. పాపం ఇప్పుడు వారిని దేవునితో ఒకప్పుడు ఉన్న సాన్నిహిత్యం నుండి వేరు చేసింది. దేవుడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. కాని తన స్వార్థానికి ఓడిపోయిన మనిషి, ఇప్పుడు దేవుడు తనపై ఉంచిన ‘శాపం’ను గ్రహించాడు. సృష్టి సమయంలో ఆదాము హవ్వలు తమ వద్ద ఉన్న ప్రతిదాన్ని ‘మర్చిపోయారని’ (లేదా కోల్పోయారని) బైబిల్ ఎక్కడా సూచించలేదు (ఇప్పుడు భూమిమీద వాళ్ళు “సున్నా” నుండి మళ్ళీ ప్రారంభించారు). బదులుగా మనిషి దేవుని నుండి వేరు చేయబడ్డాడు, తన ముఖపు చెమట కార్చి తిరిగి నేలకు వచ్చే వరకు తన ఆహారాన్ని తిన్నాడు (ఆదికాండము 3:19). దేవుడు భూమి యాజమాన్యాన్ని వదులుకోలేదు దానిని మనిషికి అప్పగించాడు. ఆయన భూమిని మరియు దానిలోని మనిషిని విడిచిపెట్టలేదు. బదులుగా అన్నింటికీ దేవుడుగా, సృష్టికర్తగా, సంరక్షకుడిగా ఉండిపోయాడు. ఆయనను మానవుడు సేవించవల్సి ఉన్నాడు.
కాలక్రమేణా, మనిషి తన గర్వం మరియు దురాశలో అభివృద్ధి చెంది సంఘర్షిస్తూ, తనకు తాను దేవుడిగా ఉంటూ, దేవునికి చెందిన వాటిని తీసుకోవడానికి ప్రయత్నించడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు అన్నింటికంటే పైగా ఉన్నవాడు మానవుడు ఉనికిలో ఉన్నది దేవుని కోసమే అని గుర్తించటానికి బదులుగా, జీవితాన్ని నడిపించడానికి మనిషి తన స్వంత ప్రమాణాలను ఏర్పరచుకోవడం ప్రారంభించాడు. అతని హృదయంలో లోతుగా, దేవుడు స్థాపించిన ప్రమాణాలు అతనిలో ఇంకా మిగిలే ఉన్నాయి. కాని మనిషి హృదయాన్ని గర్వం, స్వార్థం ఆక్రమించడంతో క్రమంగా ఆ ప్రమాణాలు వక్రీకరించబడ్డాయి (లేదా వాటిని మర్చిపోయాడు) మరియు మనిషి తనను తాను ఎక్కువగా నిర్వహించుకొంటున్నాడు.
ఆదికాండము 4లో దేవునికి అర్పించబడిన మొదటి అర్పణను జ్ఞాపకం చేసుకొందాం. అది ఆదాము హవ్వల నుండి కాదు, వారి మొదటి పిల్లలైన కయీను హేబెలు నుండి వచ్చింది. ఆదికాండము 4:3-7, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను; కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో–నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.
కాలక్రమేణా మానవుడు (కయీను హేబెలు) ప్రభువుకు ఒక అర్పణను తెచ్చాడు. అర్పణను అర్పించమని దేవుడు వారికి ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ అర్పణ దేవునికి ఎలా ఇవ్వబడిందో కూడా మనకు ఎటువంటి సూచన లేదు. కయీను అర్పణను దేవుడు తిరస్కరించాడు. హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఒకరు నేల ఫలాలను తెచ్చారు మరొకరు తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని (ఉత్తమమైనవి) తెచ్చారు. (ఇక్కడ మనం గుర్తుంచుకోవల్సిన విషయం, దేవుడు తాను అర్పణగా ఏమి ఆశిస్తున్నాడో ఆయన వ్రాతపూర్వకంగా ఏమి చెప్పలేదు). కయీను హేబెలు ఇద్దరూ తమ స్వంత మనస్సాక్షి యొక్క ప్రేరేపణలను అనుసరించి దేవునికి వారి “అర్పణలను” అర్పించినట్లుగా కనిపిస్తుంది. వారి చర్యల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటో మనకు తెలియదు. దేవుడు కయీనుతో ఏమి చెప్పాడో మాత్రమే మనకు తెలుసు: నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.
తొలి గ్రీకు అనువాదం అయిన సెప్టువాజింట్ (ఇది దాదాపు క్రీ.పూ. 285 నాటిది) ఈ మాటలను ఎలా అనువదించిందో చదవడం ఆసక్తికరంగా ఉంది: 7Hast thou not sinned if thou hast brought it rightly, but not rightly divided it? be still, to thee shall be his submission, and thou shalt rule over him. నీవు దానిని సరిగ్గా తెచ్చినా, దానిని సరిగ్గా విభజించక నీవు పాపం చేయలేదా? మౌనంగా ఉండు, నీవు దానికి లోబడి ఉన్నావు మరియు నీవు దానిని ఏలుదువు. కయీను తెచ్చిన అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు అనే దానికి సంబంధించి అతని పాపం ఏమిటో చాలా సూచనలు చేయబడ్డాయి. అయితే, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటె శ్రేప్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు, అని హెబ్రీ. 11:4 చెప్తూవుంది.
దేవుడు అందరికంటే పైనున్నవాడని మానవ హృదయం నుండి ప్రతిస్పందన వచ్చినప్పటికీ, ఇక్కడ అర్పణ యొక్క ప్రధాన అంశం విశ్వాసం. కయీను హేబెలు తమ బలులను ఆజ్ఞాపింపబడకుండానే అర్పించారని లేదా ఏదో ఒక విధంగా వారి మనస్సాక్షిని తేలికపరచి, వారు చేసిన కొన్ని పాపాలకు ‘ప్రాయశ్చిత్తం’ చేసుకోవాలనే ఆలోచనతో అర్పణలను తెచ్చారని చెప్పడానికి బైబిలులో ఎలాంటి సూచనలు లేవు. కాని, వారు తమ హృదయంలో లోతుగా పాతుకుపోయిన దానికి ప్రతిస్పందనగా అర్పణలను అర్పించారని భావించడం చాలా సహజంగా ఉంటుంది. విశ్వాసం ఎల్లప్పుడూ కనిపించని దానితో సంబంధం కలిగి ఉంటుంది కాని అది ఇప్పటికే అక్కడ ఉన్న దానిని నమ్ముతూ దానికి తనను తాను అంకితం చేసుకొనే చర్యగా భావించబడుతుంది. విశ్వాసం అనేది “ఏదో విధంగా దేవుడు సంతోషిస్తాడు” అనుకొనే ఊహాజనితమైన చర్య కాదు, కాని తెలిసిన భావనకు నమ్మకంగా ప్రతిస్పందించడం. దేవుడు ప్రమాణాన్ని స్థాపించాడు. విశ్వాసంతో, హేబెలు ఆ ప్రమాణాన్ని చేరుకున్నాడు.
ఆ ప్రమాణం ఏమిటి? సెప్టువాజింట్ ఆదికాండము 4:7, “నీవు సరిగ్గా అర్పించి, సరిగ్గా విభజించక, నీవు పాపం చేయలేదా?” ఈ “సరిగ్గా విభజించు” అంటే ఏమిటో బైబిల్లో మనకు తెలియదు. 3వ శతాబ్దంలో టెర్టులియన్, దేవుడు కయీను బలిని తిరస్కరించాడని రాశాడు ఎందుకంటే అతడు అర్పించిన దానిని అతడు సరిగ్గా విభజించలేదు…దీనిని దశమ భాగం అనే భావనతో అతడు అనుసంధానించాడు. రోమ్ యొక్క క్లెమెంట్ (1వ శతాబ్దం) మరియు ఇరేనియస్ (2వ శతాబ్దం) కూడా ఈ సెప్టువాజింట్ పఠనం నుండి ఆదికాండము 4:7ని కోట్ చేస్తూ, .“సరిగ్గా విభజించలేదు” అను మాటలను వక్కాణించారు. కాని ఇప్పటివరకు, దశమభాగాలు లేదా ప్రథమఫలాలకు సంబంధించిన ఆదేశం బైబిల్లో ప్రస్తావించబడలేదు. అయితే, ఈజిప్టులోని చిత్రలేఖనాల నుండి, పురాతన కాలం నుండి మనం తెలుసుకున్నది ఏమిటంటే, అన్యమతస్థులు కూడా తమ దేవుని భాగం మిగిలిన వాటి నుండి విభజించబడే వరకు కొత్త ఫలాన్ని తినడం చట్టవిరుద్ధమని భావించారు.
బైబిల్లో బలుల గురించి మనకు తదుపరి ప్రస్తావన 1,660 సంవత్సరాల తరువాత నోవహు ఓడ నుండి బయటకు వచ్చి యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను, ఆదికాండము 8:20. ఇక్కడ ఒక బలిపీఠం నిర్మించడం, పవిత్రమైన జంతువులను మరియు పవిత్రమైన పక్షులను అర్పించడం గురించి మొదటి ప్రస్తావన ఉంది. (“బలిపీఠం” అనే పదానికి హీబ్రూ పదం “మిజ్ బీచ్”, అంటే “వధ స్థలం”). మళ్ళీ మనకు దేవుని నుండి ఎటువంటి వ్రాతపూర్వక ఆజ్ఞ కనిపించదు. ఇది నీతిమంతుడిగా దేవునితో నడిచిన వ్యక్తి హృదయ స్పందన (ఆదికాండము 6:9). నోవహు అద్భుతమైన కృతజ్ఞతతో, ఓడ నుండి బయటకు అడుగు పెట్టినప్పుడు అతడు చేసిన మొదటి పని సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పతనాన్ని గుర్తించడం. అతడు దానిని వ్యక్తీకరించిన విధానం ఏమిటంటే, పవిత్రమైన జంతువులు పవిత్రమైన పక్షులలో కొన్నింటిని (10% అని చెప్పడం లేదు) బలిగా అర్పించడం ద్వారా అప్పుడు యెహోవా ఇంపయిన సువాసన నాఘ్రాణించి సంతోషించాడని మనకు చెప్పబడింది, ఆదికాండము 8:21.
తరువాత మనం “బలి” గురించి తదుపరి ప్రస్తావనను కనుగొనడానికి సుమారు 300 సంవత్సరాలు ముందుకు వెళదాం. అబ్రాము బలిపీఠాలను (షెకెమునందలి మోరే వద్ద ఒకటి మరియు బేతేలుకు తూర్పున మరొకటి) నిర్మించి, యెహోవా నామమున ప్రార్థన చేసాడు (ఆదికాండము 12:7-8). ఈ బలిపీఠాల నుండి ఎలాంటి బలి అర్పించబడిందో మనకు తెలియదు. కాని అవి కృతజ్ఞతగల హృదయం నుండి వచ్చాయని మనకు తెలుసు (దేవుని కృప మరియు వాగ్దానాలకు ప్రతిస్పందించడం). అబ్రహం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు అనేక బలిపీఠాలను నిర్మించాడు కాని వాటి మీద అతడు ఖచ్చితంగా ఏం అర్పించాడో మనకు తెలియదు.
బైబిల్లో “పదియవ వంతు” అనే పదం యొక్క మొదటి ప్రస్తావన అబ్రహం నుండే మనకు కనిపిస్తుంది (ఆదికాండము 14:20) [సుమారు క్రీ.పూ. 1900]. ‘బలిపీఠం నిర్మించడం’ అనే భావనతో పాటు… ఆ తర్వాత ఆ బలిపీఠంపై ఏమి అర్పింపబడింది… అలాగే పదియవవంతు విషయంలో కూడా… మనకు దేవుని నుండి ఎటువంటి ఆజ్ఞ కనిపించదు. అయితే, అబ్రహం మరియు అతని బలుల గురించి మనకు చెప్పబడిన దానిలో గుర్తించదగిన అంశం, అబ్రహం పదియవ వంతు. ఎల్లప్పుడూ దేవుడు అబ్రహంపై కుమ్మరించిన కృప మరియు వాగ్దానాలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా అతడు బలిపీఠాలను నిర్మించాడు. అయితే పదియవవంతు ఇవ్వడం గురించి ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది. అది షాలేము రాజైన మెల్కీసెదెకుకు ఇచ్చాడు. అబ్రాము చుట్టుపక్కల శత్రువులపై గొప్ప విజయం సాధించిన తర్వాత అతడు తిరిగి వచ్చుచుండగా మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసంతో అబ్రహాముకు ఎదురు వచ్చాడు, వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. దీనికి ప్రతిస్పందనగా, అబ్రాము అతనికి పదియవ వంతు ఇచ్చాడు, ఆదికాండము 14:18-20.
“పదవ వంతుకి” ఉపయోగించిన హీబ్రూ పదం “మాసేర్”, అంటే “పదవ వంతు” లేదా 10%. అబ్రాము మెల్కీసెదెకుకు యుద్ధ దోపిడీలో 10వ భాగం ఇచ్చాడు. అతడు 10వ వంతు ఇవ్వాలని ఎందుకు ఎంచుకున్నాడు అనేది బైబిల్ చెప్పడం లేదు. అది మెల్కీసెదెకు అబ్రహంకు ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత జరిగిందనే వాస్తవం తప్ప అతడు దానిని మెల్కీసెదెకుకు ఎందుకని ఇచ్చాడో మనకు తెలియదు. మెల్కీసెదెకు ఎవరు అనేది కూడా ఒక రహస్యం, అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మరియు షాలేము రాజు (యెరూషలేము యొక్క సంక్షిప్త రూపంగా భావించబడుతుంది) అని మనకు చెప్పబడింది. మెల్కీసెదెకు ఏ కుటుంబం నుండి వచ్చాడో మనకు తెలియదు. దేవుడు అతన్ని తన యాజకుడిగా పిలిచినట్లు మనకు రికార్డులు లేవు. అబ్రాము మెల్కీసెదెకుకు (లేదా మరెవరికైనా) దీనికి ముందుగాని లేదా తరువాతగాని 10వ వంతు ఇచ్చాడని మనకు ఎటువంటి సూచనలు లేవు. అతడు నిజంగా ఏమి ఇచ్చాడనే ప్రశ్న కూడా ఉంది. అది అతడు తీసుకున్న ప్రతి దానిలో 10వ వంతునా లేదా అతను కలిగి ఉన్న దానిలో 10వ వంతునా? అతడు తన ఆస్తులు మొదలైన వాటితో సహా తిరిగి వచ్చిన తర్వాత మిగిలి ఉన్న దానిలో 10వ వంతునా, లేదా కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో 10వ వంతునా” హెబ్రీ. 7:4b. గ్రీకు పదం “అక్రోథినియన్” (అక్-రోత్-ఇన్-ఈ-ఆన్) అంటే “దోపిడిలో ఉత్తమమైనది”. అతడు కొల్లగొన్న శ్రేప్ఠమైన వస్తువులలో దశమవంతు ఇచ్చాడని హెబ్రీ. 7:4b చెప్తూవుంది తప్ప మొత్తంలో పదవ వంతు కాదు.
మెసొపొటేమియా, బాబిలోనియా క్యూనిఫాం సాహిత్యంలో ఆనాటి ఆరాధనలోని ఆచారాల గురించి లభించే సమాచారాన్ని పరిశీలిధ్ధాం. అబ్రహం కల్దీయుల ఊరు నుండి వచ్చాడని మనకు తెలుసు. అక్కడ చంద్రదేవుడైన సిన్ కి అంకితం చేయబడిన గొప్ప దేవాలయం యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు అబ్రహం కాలం నాటివి. అబ్రహం వివాహం చేసుకున్నాడు, తరువాత తన తండ్రితో కలిసి కొత్త ఇంటికి వెళ్ళాడు. వారి మొదటి గమ్యస్థానం మెసొపొటేమియాలోని హారాను. అక్కడ, అనేక యుగాలుగా, బాబిలోనియా సైన్యాలు మరియు వ్యాపారులు మధ్యధరా వైపు ప్రయాణించేటప్పుడు ఆగివెళ్లే వాళ్ళు. ఇక్కడ, కూడా ఊరులో వలె, చంద్రదేవుడైన సిన్ కి అంకితం చేయబడిన ఆలయం కనుగొనబడింది. బాబిలోనియన్ ప్రభావం మధ్యధరా తీరం అంతటా వ్యాపించిందని మనకు తెలుసు. ఈ ప్రభావంతో పాటు, చంద్రదేవుడైన సిన్ ఆరాధన కూడా ఉంది. అందువల్ల, అబ్రహంకు అన్య ఆరాధనలను గురించి బాగా తెలుసు, బహుశా అందరికీలాగే. బాబిలోనియాలోని కొన్ని క్యూనిఫాం శాసనాలు (కల్దీయ పూర్వ-సెమిటిక్ యుగానికి చెందినవి) భారీ, అందమైన దేవాలయాలకు ప్రధాన మద్దతుగా ‘పదవవంతు’ గురించి చాలాసార్లు సూచిస్తున్నాయి. ధనవంతులు మరియు పేదలు, రాజులు మరియు రైతుల నుండి పదవవంతు ఆశించబడింది. పదవవంతు అడగడం ఎక్కువగా అడగడంగా పరిగణించబడలేదు. అన్ని మంచి విషయాలను ఇచ్చే దేవుడు ప్రతిఫలంగా పదవ వంతు పొందడం న్యాయంగా మరియు సరైనదిగా పరిగణించబడింది. బ్రిటిష్ మ్యూజియంలో అనేక పలకలు ఉన్నాయి, అవి నెబుకద్నెజరు మరియు అతని వారసుల కాలం నాటి సిప్పారాలోని సూర్యదేవుని గొప్ప ఆలయానికి పదవ వంతు చెల్లించిన రశీదులు. వాటిలో ఒకదాని నుండి, బెల్షస్సర్, తన తండ్రి చేతుల నుండి బాబిలోనియన్ సామ్రాజ్యం పడిపోతున్న సమయంలో కూడా, తన సోదరి నుండి పదవ వంతును స్వీకరించాడని ఉంది. గ్రీకులు తమ యుద్ధ దోపిడీపై అపోలోకు పదవ వంతులు చెల్లించారు. రోమన్లు హెర్క్యులస్‌కు కూడా పదవ వంతులు చెల్లించారు. అబ్రహం అన్యుల నుండి దశమభాగ భావనను నేర్చుకున్నాడని (మరియు ఆచరించాడని) నేను చెప్పడం లేదు. కాని బైబిల్లో దాని ప్రస్తావన రాకముందే ఆ ఆచారం ఉనికిలో ఉందని మరియు అబ్రహం (మరియు మెల్కీసెదెకు) ఇక్కడ ‘కొత్తగా దీనిని ప్రారంభించలేదని’ లేదని మాత్రమే తెలియజేస్తున్నాను. బాబిలోనియాలో (లేదా ఎక్కడైనా) దేవుళ్లకు దశమభాగం ఇచ్చే ఆచారం హెబ్రీయుల నుండి వచ్చిందని అనుకోవడం సరి అయినది కాదు. వక్రీకరించబడిన హృదయం తన దేవుడిని కనుగొనడానికి (సంతోషపెట్టడానికి) ప్రయత్నించినప్పుడు కలిగే దాని యొక్క సహజ ప్రతిస్పందనే ‘పదవ వంతు’ కావచ్చు.
దేవుడు మనం పదవ వంతు ఇవ్వాలని కోరుకుంటున్నాడని కొందరు చెప్తారు. పదవ వంతు అనేది సహజంగా ఒకని మనస్సాక్షిలో పాతుకుపోయింది. కాలం ప్రారంభం నుండి, మనిషికి తాను దేవుణ్ణి ఆరాధించాలని సహజంగానే తెలుసు. దానిని బలిపీఠాలపై లేదా దేవాలయాలలో చేయాలని అతనికి తెలుసు. దేవుడిని మరియు మనిషిని ఎలాగైనా కలిపే పూజారులు మరియు రాజులు అతనికి ఉండాలి. మొదటి నుండి, మనిషికి మరొక మనిషిని చంపకూడదని తెలుసు. అలాగే పదవ వంతుతో, దేవుడు తనకు ఇచ్చిన దానిలో 10% దేవునికి తిరిగి ఇవ్వాలని మనిషికి సహజంగా తెలుసు.
బైబిల్ లో ఇంకాస్త ముందుకు వెళ్తే, పదియవ వంతుకు సంబంధించిన తదుపరి ప్రస్తావన అబ్రహం మనవడు యాకోబు నుండి వచ్చింది. అప్పుడు యాకోబు–నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను, ఆదికాండము 28:20-22. దేవుడు యాకోబుకు క్రొత్త కాదు. యాకోబు తన తాత అబ్రహం విశ్వాసంలో పెరిగాడు (యాకోబు బాలుడిగా ఉన్నప్పుడు అబ్రహం మరణించాడు). బేతేలులో దేవుడు యాకోబుకు అతని కుటుంబానికి అబ్రహంకు చేసిన అన్ని వాగ్దానాలను ధృవీకరించాడు (ఆదికాండము 28:13ff). దీనికి ప్రతిస్పందనగా, యాకోబు ఇప్పుడు దేవుడు తనను సురక్షితంగా ఉంచి ఇంటికి తిరిగి తీసుకువస్తే, దేవుడు తనకు ఇచ్చిన అన్నింటిలో పదవ వంతు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాడు. గమనించండి, దేవుడు పదియవ వంతు అడగలేదు. దేవుని కృపకు యాకోబు ప్రతిస్పందన ఇది. దేవుడు ఇలా చేస్తే… నేను దేవునికి పదవ వంతు ఇస్తాను అంటున్నాడు. ఈ మాటల్ని బట్టి యాకోబు ‘దేవునితో బేరసారాలు’ చేస్తున్నట్లు కొందరు భావించొచ్చు. యాకోబు జీవితకాలంలో, ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకొన్నట్లు మనకు ఎటువంటి రికార్డు లేదు. అతడు అలా చేయలేదని దీని అర్థం కాదు. కాని యాకోబు దేవునికి పదవ వంతును ఎలా ఇచ్చాడు (ఆచరణాత్మకంగా)? అతడు దానిని బలిపీఠాలపై బలిగా ఇచ్చాడా? లేదా మెల్కీసెదెకులా (ఎవరికైనా) ఇచ్చాడా? మనకు తెలియదు, బైబులు చెప్పటం లేదు.
దీని తర్వాత దాదాపు 110 సంవత్సరాల తర్వాత మనం మోషే కాలానికి వెళదాం. మోషేకు ధర్మశాస్త్రం దాని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో బైబిల్లో అనేక బలిపీఠాలు నిర్మించబడ్డాయి. అనేక బలులు అర్పించబడ్డాయి. అన్నీ విధేయత కృతజ్ఞత గల హృదయాల నుండి, దేవుని గొప్పతనాన్ని గుర్తిస్తూ వచ్చాయి. అబ్రహం ఇస్సాకు విషయంలో మాత్రమే దేవుడు బలిని నిర్దేశించాడు. తర్వాత సీనాయి పర్వతం వరకు దేవుడు వాస్తవానికి బలిపీఠాలు నిర్మించి బలులు అర్పించమని ఆజ్ఞాపించలేదు. నిర్గమకాండము 20:24: మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహనబలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ మనకు దేవుడు స్వయంగా ఇచ్చిన ‘లిఖిత’ వాక్యం యొక్క ప్రారంభం (ఆజ్ఞ) ఉంది. నిర్గమకాండము 20-31 అధ్యాయాలను మనం చదువుతున్నప్పుడు, దేవుడు తన ప్రజల కోసం ఇచ్చిన వివరాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. కాని దశమ భాగం యొక్క భావనను లేదా మనిషి తనకు కొంత మొత్తాన్ని ఇవ్వాలనే దేవుని ఆజ్ఞను మనం ఇక్కడ చూడం. నిర్గమకాండము 22:29,30లో, నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవుచేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవ దినమున దానిని నాకియ్యవలెను. కాని ‘ఇంత’ అని చెప్పలేదు. నిర్గమకాండము 23:14-19లో దేవుడు మూడు వార్షిక పండుగ దినాలను స్థాపించాడు: 1) పులియని రొట్టెల పండుగ (పులియని రొట్టెలు తినాలి), 2) కోత పండుగ (పొలాల నుండి తెచ్చిన మొదటి ఫలాలను తినాలి), మరియు 3) సంవత్సరం చివరిలో, ఫలసంగ్రహపు పండుగ/ పర్ణశాలల పండుగ. ఆయన తన పవిత్ర స్థలం కోసం సూచనలను కూడా ఇచ్చాడు (మరియు పవిత్ర స్థలం నిర్మించడానికి ఉపయోగించాల్సిన పదార్థాలు). ఆ సామాగ్రిని ఎలా సేకరించాలో ఆయన చెప్పాడు. ఆయన –నాకు ప్రతిష్ఠార్పణ తీసికొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను, నిర్గమకాండము 25:2 అని చెప్పాడు. నిర్గమకాండము 35:5,21; 36:5-7, వారు ఇష్టపూర్వకంగా చాలా ఇచ్చారు, వారు ఉపయోగించగల దానికంటే ఎక్కువగా ఇచ్చారు. అందువల్ల ప్రజలకు ఇంకేమీ తీసుకురావద్దని చెప్పవలసి వచ్చింది.
దేవుని కొరకు పవిత్ర స్థలాన్ని నిర్మించడానికి అవసరమైన భౌతిక వస్తువులతో పాటు, పవిత్ర స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది ‘ఎవరో’ కూడా దేవుడు ఆదేశించాడు, (అహరోను మరియు అతని కుమారులు నిర్గమకాండము 28:1). వారు యాజకులుగా మరియు సహాయకులుగా సేవ చేయాలి. దేవుని మందిరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వారి బాధ్యత. ప్రజలు దేవునికి తమ అర్పణలను తీసుకువచ్చినప్పుడు, వారు వాటిని తీసుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేయాలి. దేవుడు కొన్ని నైవేద్యాలను కాల్చడానికి నియమించాడు. అయితే, ఇతర నైవేద్యాలలో కొన్ని భాగాలను అహరోను మరియు అతని కుటుంబం తినాలి. (నిర్గమకాండము 29:27ff). అలాగే నిర్గమకాండము 30:11-16లో, జనగణన తీసుకున్నప్పుడు ప్రతి మనిషి ప్రభువుకు ఇవ్వాల్సిన ప్రాణపరిక్రయ ధనము మొత్తాన్ని కూడా దేవుడు ప్రత్యేకంగా నిర్ణయించాడు (అరతులము, అర్ధ-షెకెల్ వచనం 13). ఇక్కడ ధనవంతులు లేదా పేదలకు ఎటువంటి మినహాయింపు ఇవ్వబడలేదు. ప్రతి మనిషి దేవునికి అర్ధ-షెకెల్ బాకీ ఉన్నాడు. మళ్ళీ మనం సీనాయి పర్వతం వద్ద దేవుని వాక్యాన్ని అధ్యాయనం చేస్తున్నప్పుడు, మనకు కానుకలు మరియు బాకీ ఉన్నవి కనిపిస్తాయి తప్ప పదవ వంతును గురించి ప్రస్తావించబడలేదు.
లేవీయకాండములో (సీనాయి పర్వతం నుండి) దేవుడు తన ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నాడో మనకు ఒక చిత్రం ఉంది. లేవీయకాండములో ప్రజలు తీసుకు రావాల్సిన కానుకల గురించి మరియు వాటిని ఎలా అర్పించాలో అను దానిని గురించి; తన ప్రజలు ఎలా జీవించాలో, వారు ఏ పండుగలను ఆచరించాలో మరియు వారు ఏమి చేయాలో అను దానిని గురించి; పేదల గురించి మరియు వారిని ఎలా చూసుకోవాలో అను దానిని గురించి ఆయన స్పష్టముగా తెలియజేసాడు. 27వ అధ్యాయంలో ఆయన ‘ప్రజలను’ మరియు దేవునికి అంకితం చేయబడిన ‘ఆస్తిని’ విమోచించడం గురించి; అలాగే భూమిని అసలు యజమానికి తిరిగి ఇవ్వాల్సిన జూబ్లీ సంవత్సరం గురించి కూడా చెప్పాడు. ఆయన, లేవీయకాండము 27:30-33 వచనాలలో, భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరిన యెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను. గోవులలోనేగాని గొఱ్ఱెమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చిన యెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టి దాని విడిపింప కూడదని చెప్పుము, అని చెప్పాడు. దశమభాగము అని ఇక్కడ మొదటిసారి ప్రస్తావించబడింది. సూత్రం చాలా స్పష్టంగా ఉంది: పంటలలో 10వ వంతు (విత్తనం లేదా పండు) ప్రభువుకు చెందినది. (అయితే, మార్కెట్ విలువను ఐదవ వంతు (20%) చెల్లించడం ద్వారా మనిషి “విమోచించడానికి” (లేదా దీన్ని తిరిగి కొనడానికి) దేవుడు స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే పశువులు, గొర్రెలు మరియు మేకలను ‘విమోచించలేము’. గొర్రెల కాపరి దండం కిందకు వెళ్ళే ప్రతి 10వ జంతువు దేవునికి చెందినది. అది మగదైనా ఆడదైనా, మంచిదైనా చెడ్డదైనా. దానిని మార్పిడి చేయకూడదు లేదా భర్తీ చేయకూడదు. ఎవరైనా 10వ జంతువుకు బదులుగా మరొక జంతువును ఉపయోగిస్తే, ఆ జంతువు మరియు అతను మార్పిడి చేసిన జంతువు రెండూ ప్రభువుకు చెందుతాయి.
సంఖ్యాకాండములో ఇప్పుడు దేవుని క్రమం మరియు ఆయన ఎదురుచూస్తున్న వాటిని గురించి మరింత వివరణాత్మక వివరణ మనకు ఉంది. సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము. ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు, నిర్గమకాండము13:2; సంఖ్యాకాండము 3:11-13. నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను. ఇశ్రాయేలీయుల మొదటి సంతాన పురుషుల సంఖ్య లేవీయుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నందున (273 మంది), దేవుడు వారిని 5 షెకెల్‌లతో (అయిదేసి తులముల వెండితో) విమోచించాలని నిర్దేశించాడు. ఆ డబ్బును అహరోను మరియు అతని కుమారులకు (యాజకులకు) ఇవ్వమని చెప్పాడు, (సంఖ్యాకాండము 3:40-48). ఈ కాలం వరకు, ఇశ్రాయేలీయులలో ‘మొదటి సంతాన పురుషులందరు’ దేవునికి చెందినవారు. వారు దేవుని ప్రతినిధులు, కాని వారు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు.
నిర్గమకాండము 32లో ప్రజలు దేవునిని విగ్రహరూపముగా చేసుకొనుటకు (‘దృశ్య’ భావనను) ఎలా డిమాండ్ చేశారో మనం చూస్తాం. వారు అడగడానికి ముందే సీనాయి పర్వతముపై ఇది జరిగే మార్గాలను దేవుడు నిర్దేశించాడు (అంటే: నైతిక ధర్మశాస్త్రం, 3 వార్షిక-విందులు, ప్రత్యక్షగుడారం, నిర్గమకాండము 20-31). కాని ఇప్పుడు విషయాలు మరింత నిర్మాణాత్మకంగా మారడంతో, అవసరాలు మరియు డిమాండ్లు కూడా పెరిగాయి. దేవుడు క్రమపద్ధతిలో ఉన్న దేవుడు (ఇది సృష్టి నుండి స్పష్టంగా తెలుస్తుంది). కాబట్టి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగాలి, 1 కొరింథీయులకు 14:40. దేవుడు ఇప్పుడు మనిషి చెల్లించాల్సిన ధరను వివరిస్తున్నాడు [దేవుడు ప్రతిదీ ఉచితంగా ఇస్తాడని చెప్పబడింది కాని అది ఖర్చు అయ్యేది పరిపాలనకే]. “ప్రత్యక్ష గుడారము” ద్వారా దేవుని సన్నిధి (మరియు సంకల్పం) తెలుస్తుంది. రక్తం మరియు విమోచన మనిషి రక్షణకు కీలకం. దేవుడు తన ప్రజలతో ఉంటాడు. కాని వారు ఆ వాస్తవం యొక్క దృశ్య జ్ఞాపకాన్ని అందించాలి. (ముందు చెప్పినట్లుగా, వారు సామాగ్రిని, అలాగే ‘మానవశక్తిని’ అందించాలి… దేవుడు వాటన్నిటినీ వారికి ఉచితంగా ఇస్తాడు. ప్రేమ మరియు కృతజ్ఞతతో, వారు దేవుని ‘ఇంటి’ కోసం ఇష్టపూర్వకంగా అందించాలి. బాధ్యతతో, వారు మానవశక్తిని అందించాలి. మొదటి సంతానం విమోచించబడింది. లేవీయులు వారి స్థానాన్ని తీసుకున్నారు. వారు చెల్లించాల్సిన ‘ధర’ దేవుడు ఇప్పుడు చెప్పిన దశమ భాగం.)
ఇశ్రాయేలు పిల్లలు వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు, మోషే దేవుని ఎక్సపెక్టషన్స్ ని మరియు వాగ్దానాలను మరింత వివరంగా వివరించాడు (సంఖ్యాకాండము 15-19; 28-36; ద్వితీయోపదేశకాండము 1-30). ఇశ్రాయేలీయులలోని ప్రతి గోత్రానికి కొన్ని భూభాగాలు వారికి స్వాస్థ్యముగా ఇవ్వాలి. కాని లేవీ గోత్రానికి కాదు. దేవుని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం వారి బాధ్యత. దేవుడు ప్రత్యేకంగా ఆ గోత్రానికి దశమ భాగం ద్వారా అందించాడు (సంఖ్యాకాండము 18:21-24, ఇదిగో లేవీయులుచేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమభాగము లన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లువారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని). ఇశ్రాయేలులోని మిగిలిన గోత్రాలకు ఖచ్చితమైన సరిహద్దులు స్థాపించబడినట్లే ఒక నిర్దిష్ట మొత్తం లేవి గోత్రానికి నిర్ధేశించబడింది. (దశమభాగం ‘లాభంలో 10వ వంతు’… భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; గోవులలోనేగాని గొఱ్ఱెమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును, (లేవీయ కాండము 27:30-33). యజమానికి దశమభాగం పై ఎటువంటి హక్కు లేదు. అది ప్రభువుకు చెందినది—మరియు దేవుడు ఇప్పుడు దానితో ఆయన కోరుకున్న విధంగా చేయగలడు. ‘దశమభాగం ఇచ్చేవాడు’ ఏమీ తిరిగి పొందడు… ఇదంతా లేవీయులకు వెళ్ళాలి, సంఖ్యాకాండము 18:21. ఈ కారణంగానే, “ప్రభువు దశమ భాగాన్ని” “లేవీయుల దశమ భాగం” అని కూడా పిలుస్తారు.
సంఖ్యాకాండము 18:26-28లో, లేవీయులలో 10% దశమభాగాన్ని యాజకుడైన అహరోనుకు చెల్లించాలని మనం తెలుసుకున్నాం. నూర్చిన కళ్లంలోని ధాన్యంలో 10వ వంతు, ద్రాక్ష తొట్టిలో 10వ వంతు… నూనెలో 10వ వంతు… అలాగే ఇశ్రాయేలు పిల్లల నుండి స్వీకరించబడిన మిగతా వాటిలో 10వ వంతు. యాజకులకు ఇవ్వబడినది ఉత్తమమైనదిగా ఉండాలి (సంఖ్యాకాండము 18:29). (యాజకులు లేవీయులు కాబట్టి, వారు కూడా తమ జీవన భత్యం కోసం 10% పొందారని నేను అనుకుంటాను… కానీ ఈ దశమభాగాన్ని దేవుని మందిరం యొక్క ప్రత్యక్ష నిర్వహణ కోసం ఉపయోగించారు… ఇందులో బలులు, దీపాలకు నూనె మొదలైనవి ఉంటాయి… కాబట్టి ఇది “ఉత్తమమైనది”… దేవుని సన్నిధిలో ఉపయోగించబడింది). ఇతర ‘స్వేచ్ఛార్పణలు’ (ఈ దశమభాగానికి అదనంగా) కూడా బలులు మొదలైన వాటి కోసం నియమించబడ్డాయి.
ఇప్పటివరకు, దేవుడు తన గుడారంలో తన సాన్నిధ్యం యొక్క దృశ్య జ్ఞాపకాన్ని ఎలా ప్లాన్ చేశాడో, ఏర్పాటు చేశాడో మనం చూసాం. ‘పరిపాలనా ఖర్చు’ దేవుడు ఇచ్చిన భౌతిక ఆశీర్వాదాలలో 10%. ప్రజలు దేవుని సన్నిధానం యొక్క దృశ్య జ్ఞాపకాన్ని అడిగారు (మరియు పొందారు). వారు దశమ భాగం యొక్క భావన ద్వారా ఆ ‘జ్ఞాపకాన్ని’ వారి ముందు ఉంచుకోవడంలో వారు దానిలో పాల్గొన్నారు.
దేవుడు తన ప్రజలకు తన ఉనికిని గుర్తు చేస్తానని చెప్పిన రెండవ మార్గం పండుగలు, 1) వార్షిక పులియని రొట్టెల పండుగ [పస్కా], 2) కోత పండుగ [పెంతెకొస్తు, వారాల పండుగ, గోధుమ పంట పండుగ లేదా ప్రథమ ఫలాల పండుగ], మరియు 3) ఫలసంగ్రహపు పండుగ [లేదా పర్ణశాలల పండుగ]). ఈ సందర్భాలలో ప్రతి పురుషుడు ఆనందంగా “మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను” అని ఆజ్ఞాపించబడ్డారు, ద్వితీయోపదేశకాండము 16:16,17; నెహెమ్యా 8:9-12. ముఖ్యంగా సంవత్సరానికి మూడు సార్లు ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక సన్నిధిలో సమావేశమై ఆయనను గుర్తు చేసుకోవాలి. వారి వద్ద ఉన్నదంతా సమకూర్చినది దేవుడే మరియు ఆ పండుగల కోసం అవసరమైన వాటిని సమకూర్చినది కూడా దేవుడే. ద్వితీయోపదేశకాండము 14:22-26లో ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనునట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలోగాని నీ ద్రాక్షారసములోగాని నీ నూనెలోగాని పదియవ వంతును, నీ పశువులలోగాని గొఱ్ఱె మేకలలోగాని తొలిచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున, నీవు వాటిని మోయలేని యెడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని, నీ దేవుడైన యెహోవా యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరుదేనికైనను ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను, అని ఆజ్ఞాపింపబడ్డారు. లేవీయకాండము 23లో ప్రతి సబ్బాతు దేవుడు తన ప్రజల పట్ల చూపించిన విశ్వాసాన్ని గుర్తుచేసేదిగా ఉండాలని మనకు చెప్పబడింది; పండుగలు ప్రత్యేకమైన జ్ఞాపికలు.
కొందరు దీనిని ‘రెండవ దశమభాగం’ అని పిలుస్తారు. మొదటి దశమభాగం దేవుడు లేవీయుల మద్దతు కోసం నియమించినది. రెండవ దశమభాగం ఇశ్రాయేలీయులందరూ తినడానికి (మరియు ఆస్వాదించడానికి) నియమించబడింది. ఇది దేవుడు ఇచ్చిన ప్రతి దాని యొక్క సేకరణ కాబట్టి, ఈ దశమభాగం వాస్తవానికి చాలా వ్యక్తిగత అర్థంలోనికి మారింది. ఇది పండించిన ‘మొదటి ఫలాల’ నుండి ఉద్భవించింది, ద్వితీయోపదేశ కాండము 26:1-11. బలి ఇవ్వవలసిన ‘ఒక సంవత్సరం వయస్సు గల’ జంతువు మొదలుకొని … తీసుకు వచ్చిన మొత్తం పంట వరకు… అన్నీ దేవుడు మొదటివాడని… మరియు అందరికీ ఇచ్చేవాడని వారికి గుర్తు చేస్తాయి. “వారు చేయగలిగినంత” (ద్వితీయోపదేశ కాండము 16:17), కాబట్టి వారు తమ ‘జ్ఞాపికలను’ తీసుకువచ్చారు. ఇది సంవత్సరం చివరి నాటికి (3వ విందు సమయం), దేవుడు వారికి ఇచ్చిన దానిలో మరో 1/10వ వంతుకు జోడించబడుతుంది. పండుగలలో ఉపయోగించనిది తరువాత దేవుని “ఆలయ ఖజానాలో” నిల్వ చేయబడుతుంది, నెహెమ్యా 10:38; మలాకీ 3:10.
ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక ‘మూడవ దశమ భాగం’ ఇవ్వవలసి ఉన్నారు. ఈ దశమ భాగాన్ని లేవీయుల జీతం లేదా గృహ భత్యంగా నియమించలేదు. పండుగలలో ప్రజలు దీనిని తినడానికి కాదు. దీనిని నీమధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులును, నీ యింటనున్న పరదేశులును, తండ్రిలేనివారును, విధవరాండ్రుకు ఒక ప్రత్యేక బహుమతిగా ఉపయోగించాలి. ద్వితీయోపదేశ కాండము 14:28,29; 26:12ff, దేవుడైన యెహోవా నీవుచేయు నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను, ద్వితీయోపదేశ కాండము 14:28, “స్టోర్‌హౌస్” భావన దృష్టికి వస్తుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఆ సంవత్సరం ప్రతి వ్యక్తి ‘ఉత్పత్తి’లో 10వ వంతు సంక్షేమం కోసం నిల్వ చేయాలి లేదా వారి కంటే తక్కువ ఉన్నవారి సంరక్షణ కోసం ఉపయోగించాలి. దీని నాణ్యత “దశమ భాగం” ప్రస్తావించబడ లేదు కాని దీని ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇశ్రాయేలీయులు తాము ఒకప్పుడు పేదవాళ్ళమని, అవసరంలో ఉన్నామని మర్చిపోకూడదు. దేవుడు వారిని చాలా అద్భుతంగా చూసుకున్నాడు. కాబట్టి వారు తమంతగా ఆశీర్వదించబడని వారికి సహాయం చేయడానికి ఈ దశమభాగాన్ని ఇచ్చినప్పుడు, వారు దేవుని గొప్పతనం విశ్వాస్యతను గుర్తు చేసుకోవడానికి ఇది ఉద్దేశించబడింది.
దేవుడు తన పిల్లలు తమ ఉత్పత్తిలో సగటున 23 1/3% ఇవ్వాలని నిజంగా ఆశించాడా అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. కాని ఆ సమయంలో ఆ ప్రజలకు వేరే ‘పన్నులు’ ఏవి లేవనే విషయాన్ని గుర్తుంచుకోండి. సంవత్సరాలుగా, 25% పన్ను సాధారణం. బైబులు ఒక్క దశమభాగం గురించే మాట్లాడుతుంది అని మరికొందరు అనుకోవచ్చు. ఒక నిర్దిష్ట కార్యక్రమానికి మద్దతుగా “10వ భాగం” మరియు మరొక కార్యక్రమానికి మద్దతుగా మరొక “10వ భాగం”… ఆపై ప్రతి 3 సంవత్సరాలకు, మరొక కార్యక్రమానికి మరొక 10వ భాగం గురించి ఆలోచించడం కంటే, ఈ దశమ భాగాలన్నిటిని ఒకటిగా సమన్వయం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. బహుశా సంవత్సరాలుగా ఈ దశమభాగాలన్నిటిని సమన్వయం చేయడానికి జరిగిన ప్రయత్నాలను బట్టి, ఈ విషయంపై గందరగోళం ఏర్పడింది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా, 2వ దశమభాగం మరియు 3వ దశమభాగం మధ్య చాలా గందరగోళం ఉన్నట్లు అనిపిస్తుంది… నిజానికి, 3వ సంవత్సరంలో ఒకే ఒక “దశమ భాగం” చెల్లింపు జరిగేది… మరియు దీనిని ‘స్థానిక’ పేదల మద్దతు కోసం ‘ఇంట్లో’ ఉంచేవారు. మిగిలిన రెండు సంవత్సరాలలో, “దశమ భాగం” యెరూషలేములోని ఆలయానికి ఇవ్వబడిందని కొందరు వాదిస్తారు. ఏడవ సంవత్సరం భూమిని సాగు చేయకూడదు… అన్ని అప్పులు క్షమించబడాలి (ద్వితీయోపదేశకాండము 15:1-5). వాస్తవానికి దేవుడు చెప్పేదేమిటంటే, ప్రతి 3వ సంవత్సరం (3 మరియు 6 సంవత్సరాలు), దశమ భాగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి (బ్యాంకులో వేసినట్లుగా) ఎందుకంటే, 7వ సంవత్సరంలో వాటిని వాడుకోవడానికి అని కొందరు వాదిస్తారు. బహుశా ద్వితీయోపదేశకాండము 14:28, “మూడేసి సంవత్సరముల కొకసారి, ఆయేట నీకు కలిగిన పంటలో పదియవ వంతంతయు బయటికి తెచ్చి నీ యింట ఉంచవలెను” అను మాటలను బట్టి ఈ గందరగోళం ఏర్పడి ఉండొచ్చు. మూడవ దశమభాగాన్ని రెండవ దానికి బదులుగా మార్చాలని హీబ్రూ బైబిల్లో ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు. బదులుగా ప్రతి సంవత్సరం పండుగలకు ఖాళీ చేతులతో వెళ్లకూడదనేది ప్రతి పురుషుడి బాధ్యత అని చాలా స్పష్టంగా చెప్పబడింది, ద్వితీయోపదేశకాండము 16:16,17.
ఈ విషయమై వివిధ చరిత్రకారుల వ్రాతలను మనం మనం పరిశీలించినట్లయితే, మూడు దశమ భాగాలకు మద్దతును అందు కనుగొనొచ్చు. టోబిట్ పుస్తకం, ఇది క్రీస్తుపూర్వం 3వ లేదా 7వ శతాబ్దం ప్రారంభంలో ఎక్కడో వ్రాయబడిన డ్యూటెరోకానానికల్ పూర్వ-క్రైస్తవ రచన. నఫ్తాలి తెగకు చెందిన తోబిత్ కథ ఇది. ఇది దేవుడు విశ్వాసులను ఎలా పరీక్షిస్తాడు, ప్రార్థనలకు ఆయనెలా ప్రతిస్పందిస్తాడు మరియు ఒడంబడిక పూర్వ సమాజాన్ని ఎలా రక్షిస్తాడు అనే దాని గురించి వివరిస్తుంది. ఇది యూదాలోని రెండు కుటుంబాలకు సంబంధించిన కథ. ఈ పుస్తకం కాథలిక్ మరియు తూర్పు ఆర్థోడాక్స్ కానన్లలో మరియు డెడ్ సీ స్క్రోల్స్‌లో డ్యూటెరోకానానికల్‌గా చేర్చబడింది . ప్రొటెస్టంట్ సంప్రదాయం దీనిని అపోక్రిఫాలో ఉంచింది. టోబిట్ “సత్యం మరియు నీతిలో” తన తండ్రి కుటుంబ మార్గాల్లో ఎలా నడిచాడో చెప్తూ, అతడు, “నేను ఒంటరిగా తరచుగా పండుగల సమయంలో యెరూషలేముకు వెళ్ళాను, ఎందుకంటే ఇది ఇశ్రాయేలీయులందరికీ శాశ్వత ఆజ్ఞ ద్వారా నియమించబడింది, మొదటి ఫలాలను మరియు నా ఆదాయంలో పదవ వంతును పొందాను… నా ఆదాయంలో పదవ భాగాన్ని యెరూషలేములో సేవ చేసిన లేవీ కుమారులకు ఇచ్చాను మరియు రెండవ దశమ భాగాన్ని నేను అమ్మివేసి, వెళ్లి, ప్రతి సంవత్సరం యెరూషలేములో ఖర్చు చేశాను మరియు మూడవ భాగాన్ని నా తండ్రి తల్లి దెబోరా నాకు ఆజ్ఞాపించినట్లు అది ఎవరికి తగినదో వారికి ఇచ్చాను” అని వ్రాసాడు (టోబిట్ 1:6-8).
క్రీ.శ. 37-100 మధ్యన జీవించిన యూదు చరిత్రకారుడు జోసెఫస్ ఇలా వ్రాశాడు: “నేను ఇప్పటికే చెప్పిన రెండు దశమ భాగాలను మీరు ప్రతి సంవత్సరం చెల్లించాలి, ఒకటి లేవీయులకు, మరొకటి పండుగలకు, ప్రతి మూడవ సంవత్సరానికి మరొక దశమభాగాన్ని తీసుకురావాలి, అది విధవరాండ్రైన స్త్రీలకు మరియు అనాథలైన పిల్లలకు అది కావలసిన వారికి పంపిణీ చేయబడుతుంది” (జోసెఫస్, యాంటిక్విటీస్, bk.4). జోసెఫస్ తర్వాత దాదాపు 300 సంవత్సరాల తర్వాత జీవించిన జెరోమ్ లేవీయులకు వెళ్ళే ఒక దశమ భాగాన్ని గురించి కూడా మాట్లాడాడు, (దానిలో వారు పదోవంతు యాజకులకు ఇచ్చారు), రెండవ దశమ భాగాన్ని పండుగ ప్రయోజనాల కోసం ఉపయోగించారు మరియు మూడవ వంతు పేదలకు ఇవ్వబడిందని వ్రాసాడు.
మనం పాత నిబంధనను అధ్యాయనం చేస్తున్నప్పుడు, నమ్మకమైన యూదుడు తాను పెంచిన వాటి నుండి వాస్తవానికి ఎంత ఇవ్వాలో ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటివరకు మనం దశమభాగాలలో 23 1/3% గురించి ప్రస్తావించాము… దీనికి అదనంగా ఆజ్ఞాపించబడిన కానుకల విషయానికి వస్తే, స్వేచ్ఛా అర్పణలు/ కానుకలు, అలాగే ఆలయ పన్ను, మరియు కోత సమయంలో పొలం మూలల్లో వదిలివేయబడిన వాటి విలువ (లేవీయకాండము 19:9-10; ద్వితీయోపదేశకాండము 24:19-21); ఇవన్నీ… ప్రభువుకు… మరియు పేదలకు ‘ఇవ్వాలి’. “మూలలు” మరియు ‘తొలగింపులలో’ ఎంత మిగల్చాలో బైబిల్ చెప్పలేదు… కానీ మిష్నా (ది టాల్ముడ్)లో మొత్తం పొలంలో 1/60 అని చెబుతుంది మరియు “ప్రథమ ఫలాలు” ఉత్పత్తిలో 1/50వ వంతు అని చెప్పబడింది. అయితే అది దాతృత్వం మరియు పొలం పరిమాణాన్ని బట్టి ఎక్కువగా ఉండవచ్చు. భూమి నుండి పండించిన మరియు పెరిగిన ఆహారం కోసం ఉపయోగించే ప్రతిదీ దశమభాగానికి లోబడి ఉంటుందని మిష్నా కూడా నిర్దేశించింది. ఇది ఎంత కఠినంగా పాటించబడిందో చెప్పడానికి పరిసయ్యులే ఉదాహరణ. వాళ్ళు చిన్న విషయాలలో కూడా దశమ భాగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, దేవునికి విధేయత చూపడాన్ని విస్మరించారని యేసు వారిని ఖండించడంలో తెలుస్తుంది. శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులారా! మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని … ధర్మశాస్త్రములోని ప్రధానమైన అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి (మత్తయి 23:23, లూకా 11:42).
లేఖనాలలో, దావీదు కాలం నాటికీ, ఆలయాన్ని నిర్మించాలనే అతని గొప్ప కోరిక నాటికీ మనం వెళదాం. 1 దినవృత్తాంతములు 29:9-16లో, ఆలయ నిర్మాణం కోసం ప్రజలు పూర్ణమనస్సుతో యెహోవాకు మనః పూర్వకముగా ఇచ్చియుండిరి. ఇవ్వబడిన ప్రతి దానిని బట్టి దావీదు యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను – మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన యీ వస్తుసముదాయమును నీవలన కలిగినదే, అంతయు నీదియై యున్నది (16). దశమ భాగం ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించబడలేదు, బదులుగా, అది కృతజ్ఞతగల ప్రజల ఇష్టపూర్వక కానుకల ద్వారా నిర్మించబడింది! (మొదటి గుడారం “ఇష్టపూర్వకంగా అర్పించబడిన కానుకల” ద్వారా నిర్మించబడింది.) 1 రాజులు 8:63,65లో సొలొమోను (మరియు ప్రజలు) ఆలయ ప్రతిష్ఠ సమయంలో ప్రభువుకు 22,000 ఎద్దులు మరియు 120,000 గొర్రెలు అర్పించారు. ఇది ఏ విధంగానూ దశమభాగాలను సూచించదు, బదులుగా చాలా ఉదారమైన కృతజ్ఞతా అర్పణ ఇది. తరువాత ఆసా యూదా రాజుగా ఉన్నప్పుడు, వారు 700 ఎద్దులను మరియు 7,000 గొర్రెలను అర్పించారు అలాగే వెండి, బంగారం మరియు పాత్రలను (ఆసా మరియు అతని తండ్రి అంకితం చేసినవి) దేవుని మందిరమందుంచారు, 2 దినవృత్తాంతములు 15:11,18. (మళ్ళీ ఇది కృతజ్ఞత మరియు స్వేచ్ఛార్పణను సూచిస్తుంది.) హిజ్కియా 14 రోజులు పస్కా పండుగను ఆచరించి, 1,000 ఎద్దులను మరియు 7,000 గొర్రెలను ఇచ్చాడు… అతని అధిపతులు 1,000 ఎద్దులను మరియు 10,000 గొర్రెలను జోడించారు, 2 దినవృత్తాంతములు 30:23. దశమ భాగం యొక్క ఆజ్ఞ ఇప్పటికీ అమలులో ఉన్నప్పటికీ, దేవునికి స్తుతి మరియు కృతజ్ఞతను వ్యక్తపరచడానికి దశమ భాగంతో పాటు స్వేచ్ఛార్పణలు ఇవ్వబడుతున్నట్లు మనం చూస్తాం.
మనం పాత నిబంధన న్యాయాధిపతులు మరియు రాజులను గురించి అధ్యాయనం చేస్తున్నప్పుడు, దశమ భాగం గురించి చాలా సంవత్సరాలు అవి చాలా సైలెంట్ గా ఉండటాన్ని మనం చూస్తాం. ఆ కాలాల్లో కనీసం లేవీ దశమ భాగం గౌరవించబడిందని మనం అనుకుంటాము… ప్రజలపై దశమ భాగం యొక్క ఒత్తిడి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. వివిధ సంస్కరణలు మరియు ‘పాత మతాన్ని’ పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాల గురించి మనకు చెప్పబడింది… ఉదాహరణకు, హిజ్కియా కాలంలో (సుమారు క్రీ.పూ. 700లో [ఉత్తర రాజ్యం చెరలోనికి పోయిన తర్వాత]), హిజ్కియా రాజు ఆలయాన్ని శుభ్రపరిచి, మళ్ళీ ఆరాధనపై ప్రాధాన్యతను పునరుద్ధరించాడు. 2 దినవృత్తాంతములు 31:5-12లో హిజ్కియా రాజు, ప్రజలు ధాన్యం, ద్రాక్షారసం, నూనె, తేనె మరియు పొలంలోని అన్ని పంటల యొక్క ప్రథమ ఫలాలను తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. 9హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజకుడునగు అజర్యా – యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులు చున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞాపించాడు. ఈ వచనాలను బట్టి (ప్రవక్తల హెచ్చరికల నుండి) దేవుని పట్ల ప్రజల విశ్వాసం గణనీయంగా పడిపోయిందని మనకు అర్ధమవుతుంది. దశమభాగాలు తీసుకురావడం లేదు కాబట్టి ఇప్పుడు రాజు ఇలా చేయాలని ‘ఆజ్ఞాపించాడు’. ఉదాసీనత మరియు అవిశ్వాసం కారణంగా, దేవుని ప్రజలు తమ బాధ్యత నుండి ఎంతగా తప్పించుకున్నారంటే, దేవుని ఆజ్ఞలు ఇప్పుడు రాజుచే అమలు చేయబడిన చట్టబద్ధమైన చట్టంగా మారింది.
బబులోను చెర తర్వాత, దేవుని పట్ల మరియు ఆయన వాక్యం పట్ల దేవుని ప్రజల వైఖరి మరియు విశ్వాసంలో మనం మళ్ళీ కొన్ని ప్రకాశవంతమైన స్పాట్స్ ని చూస్తాం. ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఇవ్వబడినవన్నీ ఎజ్రాలో చదవడం ఆసక్తికరంగా ఉంది: రాజులు మరియు పాలకులు బంగారం, రాగి మరియు వెండితో కూడిన పెద్ద కానుకలను ఇచ్చారు. సామాన్య ప్రజలు వారి సమయం, ప్రతిభ మరియు జంతువులను ఇవ్వడంలో వారితో చేరారు… మరియు ఇదంతా వారి హృదయాల సంకల్పం నుండి వచ్చిందని బైబిల్ నొక్కి చెబుతుంది!
తరువాత, నెహెమ్యా గవర్నర్‌గా నియమించబడినప్పుడు, శాస్త్రియైన ఎజ్రా ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తిరిగి చదివి వినిపింపగా ప్రజలందరూ దానిని విన్నారు, నెహెమ్యా 8:1-3. ఇక్కడ దశమభాగం పునరుజ్జీవింప బడటాన్ని మనం చూస్తాం. దేవుని మందిరపు సేవనిమిత్తము మళ్ళీ పనిచేస్తున్న యాజకులు మరియు లేవీయులు గురించి మనం చదువుతాం. నెహెమ్యా 10:35-37, కుమారులలో జ్యేష్ఠపుత్రులు మరియు పశువులలో తొలిచూలులను, మందలలో తొలిచూలులను దేవుని మందిరానికి తీసికొని వచ్చునట్లుగా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మన దేవుని మందిరపు గదుల లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను; పంటలో పదియవ వంతును లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడు వారితో కూడ ఉండవలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల లోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి, అనే విషయాన్ని నెహెమ్యా 10:38 తెలియజేస్తూ ఉంది. నెహెమ్యా చివరి అధ్యాయంలో, యాజకులకు ఆ నిల్వ గదులను పర్యవేక్షించే బాధ్యత ఇవ్వబడింది. వాటిలో నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులు మొదలైనవి నిల్వ చేయబడ్డాయి, నెహెమ్యా 13:5,12. కాని మలాకీ 3:8,10లో హెచ్చరించినట్లుగా, ఇశ్రాయేలు పిల్లలు దేవుని పట్ల తమ వైఖరిలో ఇబ్బందిని ఎదుర్కొంటూనే ఉన్నారు… దశమభాగం ఇవ్వడానికి వారు ఇష్టపడకపోవడంలో ఇది కనిపిస్తుంది (నిజంగా అది దేవునిదే!).
నెహెమ్యా 8:17లో, నూను కుమారుడైన యెహోషువ కాలం నుండి ప్రజలు పర్ణశాలల పండుగ (కోత పండుగ) ఆచరించలేదని మనకు చెప్పబడింది. దీని అర్థం రాజుల కాలంలో, దేవుడు తన ప్రజలను దగ్గరగా ఉంచాలని ఉద్దేశించిన ఈ ప్రత్యేక జ్ఞాపికను నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలు రాజు కావాలని కోరినప్పుడు, 1 సమూయేలు 8:15,17లో, దేవుడు వారిని ఈ విధముగా హెచ్చరించాడు: రాజు మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవభాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. అతడు మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు. విందులకు ఇచ్చిన దశమ భాగం… అలాగే ప్రతి 3వ సంవత్సరం పేదలకు ఇచ్చే దశమ భాగం… ఇప్పుడు రాజుకు మద్దతు ఇవ్వడానికి వదులుకున్నట్లు అనిపిస్తుంది – చివరికి ఇశ్రాయేలు ఒక దేశంగా పతనానికి దారితీసిన శాపంగా మారింది ఎందుకంటే దేవుని గొప్పతనాన్ని దృష్టిలో ఉంచుకునే బదులు, రాజు వైపు దృష్టి మళ్లించబడింది.
యేసు కాలంలో పరిసయ్యులు మోషే ఆజ్ఞల గురించి చాలా స్పృహ కలిగి ఉన్నారు. ఇది వారి ‘నైపుణ్యం’! పరిసయ్యులు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉద్భవించినట్లు అనిపిస్తుంది. మక్కబీయన్ యుద్ధాల రోజులకు ముందు, గ్రీకు సంస్కృతిని (దాని అన్యమత మతపరమైన ఆచారాలతో) యూదు మతంలోకి చొప్పించడానికి ప్రయత్నం జరిగినప్పుడు దానిని అడ్డుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం జరిగింది. ‘విశ్వాసుల’ (పరిసయ్యులు) యొక్క వ్యవస్థీకృత సమూహం అప్పుడు ‘ఆజ్ఞలను’ స్థాపించింది. ఇది మోషే ఆజ్ఞలను మరింత స్పష్టంగా మరింత ఖచ్చితంగా చేస్తుందని వారు భావించారు. దీన్ని చేయడానికి, ‘తండ్రుల’ ఆచారాలు (సంప్రదాయాలు) అనుసరించాల్సిన ప్రమాణంగా నొక్కి చెప్పబడ్డాయి. క్రీస్తు కాలం నాటికి, పరిసయ్యులు ‘ఏమి చేయాలో’ చెప్పే 248 కంటే ఎక్కువ ఆజ్ఞలను కలిగి ఉన్నారు మరియు ‘ఏమి చేయకూడదో’ చెప్పే 365 ఆజ్ఞలను కలిగి ఉన్నారు. అన్నీ టాల్ముడ్‌లో వ్యక్తీకరించబడ్డాయి. సీనాయి పర్వతంపై దేవుడు వ్రాతపూర్వక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే ఆయన మోషేకు అనేక వివరణలను కూడా ఇచ్చాడు, అవి వ్రాయబడలేదు. కాని యెహోషువ ద్వారా, తరువాత 70 మంది పెద్దల ద్వారా, తరువాత ఆలయ ప్రధాన యాజకుల ద్వారా మరియు గొప్ప రబ్బీల ద్వారా, నోటి మాట ద్వారా అందించబడ్డాయి. ఇవి అప్పుడు టాల్ముడ్‌లో వ్రాయబడ్డాయి (మిష్నా అని పిలువబడే పుస్తకంలో గెమారా అని పిలువబడే భాగములో వ్యాఖ్యానాలను కలిగి ఉంది.)
క్రీస్తు కాలానికి, పరిసయ్యుల సంఖ్య దాదాపు 6,000. వారు ‘అందరినీ క్రమంలో ఉంచే’ ప్రయత్నాలలో చాలా చురుగ్గా ఉన్నారు. దశమభాగాలు చెల్లించడంలో మరియు మతపరమైన విధులను లేదా గతంలోని సంప్రదాయాలు, ఆజ్ఞలను పాటించేవాళ్ళు. పరిసయ్యులతో పాటు, సద్దూకయ్యులు కూడా ఉన్నారు, వారు పెంటాట్యూక్ యొక్క అధికారాన్ని నొక్కిచెప్పారు (కానీ సంప్రదాయాలను మరియు పరిసయ్యుల అలిఖిత మతపరమైన విధులను లేదా గతంలోని సంప్రదాయాలు, ఆజ్ఞలను తిరస్కరించారు). ఈ రెండు పార్టీల మధ్య, క్రీస్తు కాలంలో అతి సున్నితమైన ‘మతపరమైన అవగాహన’ ఉన్నట్లు అనిపిస్తుంది. సువార్తలలో చాలాసార్లు యేసు రెండు పార్టీలను గద్ధించడం చూస్తాం. పరిసయ్యులను ప్రత్యక్షంగా సూచిస్తూ యేసు “వారు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని భోదిస్తూ దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తారు” అని ఎత్తి చూపాడు (మత్తయి 15:2-6).
దశమ భాగానికి సంబంధించి యేసు జీవితాన్ని మరియు ఆ కాలాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, సువార్తలు ఈ విషయంపై ఏమి చెప్తున్నాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంది. సద్దూకయ్యులు మరియు పరిసయ్యులు ఆజ్ఞలను పాటించడం గురించి ఎంత చట్టబద్ధంగా ఉన్నప్పటికీ వారు యేసు దశమ భాగాన్ని చెల్లించలేదని ఎప్పుడూ ఆరోపించలేదు. దశమ భాగాన్ని చెల్లించడం ఆ రోజుల్లో ఒక సాధారణ ఆచారం. ఇది దేవుని ఆజ్ఞ, మరియు ఇది లేవీయుల మద్దతు (లేదా జీవనోపాధి)! (ఇదిక్రీ.శ. 70లో యెరూషలేము నాశనం వరకు కొనసాగింది). ప్రతి ఇశ్రాయేలీయుడు ఏదైనా తినడానికి ముందు దశమ భాగం చెల్లించబడిందని నిర్ధారించుకోవాలని మిష్నా వక్కాణించింది. ఒక భార్య తన భర్త ముందు దశమ భాగాన్ని చెల్లించని ఆహారాన్ని ఉంచితే (అది ఎంత చిన్నదైనా), అది విడాకులకు కారణం అవుతుంది. ప్రజలు ఏ తరగతికి చెందినవారైనా, వారికి ‘శుభ్రమైన’ మరియు ‘అపరిశుభ్రమైన ఆహారం’ (దశమ భాగము చెల్లించింది లేదా దశమ భాగము చెల్లించనిది) గురించి నిరంతరం అవగాహన ఉండేది. కాబట్టి ‘దశమ భాగం చెల్లించడం’ రైతుల మనస్సులలో మాత్రమే కాదు ఆహరం తింటున్న ప్రతి ఒక్కరి మనస్సులలో కూడా ఉండేది!
మరియ యోసేపులు చాలా భక్తిగల వ్యక్తులు, దేవుని ఆజ్ఞలు శాసనాలను పాటించారని సువార్తలు మనకు చెబుతున్నాయి (లూకా. 2:39-42). యేసు తన కాలంలోని ఒక భక్తుడిగా పెరిగాడని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అది 3 దశమభాగాల గురించి మరియు చెల్లించాల్సిన అన్ని ఇతర ‘అదనపు’ విషయాల గురించి చాలా మనస్సాక్షిగా ఉండేవాడని మనం చెప్పొచ్చు. ‘ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడిగా’, యేసు లేవీయుల ఆజ్ఞను గౌరవించాడు. వారి పాదాల వద్ద నేర్చుకోవడమే కాకుండా, సమాజ మందిరంలో, ఆలయంలో ఆరాధనలో వారితో చేరాడు. కుష్ఠురోగిని స్వస్థపరిచినప్పుడు, నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాడు (మత్తయి 8:4); అలాగే ఆయన 10 మంది కుష్ఠురోగులతో, మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పాడు (లూకా 17:14). యాజకులు కలిగి ఉన్న ముఖ్యమైన స్థానాన్ని యేసు గుర్తించాడు మరియు ఆయన వారికి మద్దతు ఇచ్చాడు.
పరిసయ్యులు యేసును చాలా నిశితంగా గమనించేవారు. వారు తమ ఆజ్ఞలను పాటించలేదని ఆయనను నిందించినప్పటికీ ఒక్కసారి కూడా ఆయన దశమభాగాన్ని పాటించనందుకు దోషిగా వారు భావించలేదు. వారు ఆ విషయంలో మాట్లాడకపోవడం: 1) యేసు దశమభాగాన్ని పాటించాడని చెప్తుంది మరియు 2) ఆయన ఎప్పుడూ దశమభాగాన్ని ప్రోత్సహించలేదనే విషయాన్ని కూడా చెప్తుంది. యేసు దశమభాగాన్ని గురించి ప్రస్తావించిన ఏకైక సమయం, మత్తయి 23:23 & లూకా 11:42లో ఉంది. అక్కడ ఆయన “ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు దశమభాగానికి వారి సంకుచిత మనస్తత్వం కోసం ఖండించబడ్డారు. లూకా 18:12లో యేసు పరిసయ్యుడు మరియు సుంకరిని గూర్చిన ఉపమానాన్ని చెప్తూ, పరిసయ్యుడు – దేవా, నేను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను అని చెప్పాడు. యేసు దశమభాగాన్ని ఖండించలేదు. దశమభాగం చెల్లించే ఎవరినీ ఖండించలేదు. దేవుని పట్ల ప్రజలకు ఉన్న తప్పుడు వైఖరిని మాత్రమే ఆయన ఖండించాడు. మత్తయి 23:2,3లో యేసు జనసమూహాలతో, శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండు వారు గనుక– వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు అని చెప్పాడు. కపెర్నహూములో, ఆలయ పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి యేసు పన్ను చెల్లిస్తాడా అని అడిగినప్పుడు యేసు అతన్ని చేపలు పట్టి పన్ను చెల్లించమని పంపాడు. (అయినప్పటికీ ఆయన నిజంగా దానికి బాకీ లేడని కూడా ఎత్తి చూపాడు) (మత్తయి 17:26,27)
సువార్తలలో, యేసు ఇవ్వడం గురించి చాలా చెప్పాడు. దేవుని పట్ల నమ్మకం మరియు నిబద్ధత యొక్క విస్తృత మరియు లోతైన సూత్రాలను ఆయన నిర్దేశించాడు. వీటిని బహుశా ఇలా సంగ్రహించవచ్చు: మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, లూకా 12:31 మరియు ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పాడు, లూకా 6:38. ఎంత ఇవ్వాలో యేసు యౌవనునికి చెప్తూ, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, మత్తయి 19:16-21 అని చెప్పాడు. అలాగే ఆయన, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెనని చెప్పాడు, మత్తయి 16:24. శిష్యులు యేసును అనుసరించడానికి ‘సమస్తమూ వదులుకున్నారని’ మనకు చెప్పబడింది. జక్కయ్య, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవనియొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనినయెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు–ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది అని చెప్పాడు, లూకా 19:8,9. జక్కయ్య దశమభాగాన్ని ఇవ్వలేదు, కాని 50% ఇచ్చాడు! మరియు యేసు అతనికి అలా చేయమని చెప్పలేదు. అది అతని స్వంత విశ్వాసం యొక్క ప్రతిస్పందన. వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు అని యేసు చెప్పాడు, మత్తయి 7:16. ‘ఎంత’ ఇవ్వాలి… లేదా ‘దేనికి ఇవ్వాలి’ అనేది కాదు కాని ‘ఎందుకు’ ఇవ్వబడింది అనేది ముఖ్యం. కాబట్టే ఆయన, కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని చెప్పాడు, మత్తయి 22:21. ఆయన లూకా 16:10లో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, అని చెప్పాడు. మళ్ళీ ప్రశ్న ‘ఎంతని’ కాదు, ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది ప్రాముఖ్యం. అందుకనే ఆయన, నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. మీరు దేవున్ని మరియు సిరిని [గ్రీకు: మమ్మోనాస్ = సంపదను] సేవించలేరు, అని చెప్పాడు, మత్తయి 6:21,24.
ఆదిమ సంఘములో (అపొస్తలుల కార్యములులో) మనం యేసు బోధనలకు అన్వయింపును చూస్తాం. మిషన్ పనిలో ఎక్కువ భాగం మొదట సినగోగ్ మెట్ల నుండి జరిగినప్పటికీ దశమభాగం గురించి మనం ఎప్పుడూ విభేదాలు లేదా గందరగోళం గురించి వినము. పౌలు నేపథ్యం పరిసయ్యుడని మనకు తెలుసు. ఇది ఒక సమస్య అయితే పౌలు దీనిని గురించి ఏమీ ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం. కానీ దశమభాగం ఒక సమస్య కాదు. దశమభాగం యొక్క ఉద్దేశ్యం: 1) లేవీయులకు మద్దతు ఇవ్వడం, 2) పండుగలకు మద్దతు ఇవ్వడం మరియు 3) పేదవారికి మద్దతు ఇవ్వడం. అన్నీ దేవుని ప్రజలకు ఆయన ఉనికిని మరియు విశ్వాసాన్ని గుర్తు చేయడం. దశమభాగాన్ని ఎప్పుడూ “ఆజ్ఞ”గా చేయలేదు… బదులుగా (ప్రారంభం నుండి) “అన్నీ” దేవునికి చెందినవనేదే సూత్రం. (ఆయన మొదట ఇచ్చిన మొత్తంలో 10వ వంతు) ఇవ్వడం అనేది ‘ఒక కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి’ (లేవీయులకు) దేవుడు నిర్ణయించిన ధర.