రెండవ భాగము

దేవుడు ఉన్నాడు? రుజువులివిగో. రెండవ భాగము

దేవుడు సృజించిన వాటిని బట్టి లేక పకృతిలోగాని మానవ చరిత్రలోగాని ఆ దేవుని కంటిన్యూస్ ఆపరేషన్ బట్టి లేక మనుష్యుల హృదయాలలో వ్రాయబడిన దైవికమైన చట్టాన్ని బట్టి లేక ఈ సృష్టిలో ప్రతిది ఒక డిజైన్లో రూపింపబడి ఉండటం విభిన్నమైన లేఔట్స్ వాటి ఉద్దేశ్యాలలో భౌతికనియమాలకు కట్టుబడి, లోబడి ఒక క్రమమైన పద్దతిలో, విశిష్టమైన రీతిలో, ఆశ్చర్యము గొల్పే విధానములో, వ్యవస్థీకృతముగా ఉండటం దేవుని ఉనికిని నిర్ధారిస్తూ ఉంది. ఇది తృణీకరించలేని వాస్తవం.

ఒక నిర్దిష్టమైన విధానములో ఏదైనా జరగాలంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. ఆ నిర్దిష్టమైన ప్రణాళికలో నిర్దిష్టమైన ప్రయోజనాల నిమిత్తము నిర్దిష్టమైన ఒక వ్యవస్థ, అందుకు అవసరమైన నిర్దిష్టమైన మూలకాలు, ఆ మూలకాల చర్యలు ప్రతిచర్యలు పొందుపరచబడియున్న ఒక నిర్దిష్టమైన మాన్యువల్ తప్పని సరిగా అవసరం. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త ఈ మాన్యువల్ను తన సృష్టిలో పొందుపరచి ఉండటం ఆశ్చర్యము కలిగించుట లేదా? దాని సహాయముతో మనం ఎన్నో విషయాలను కనుగొంటూ మన ఇతర ప్రయోజనాల కొరకు వాటిని వాడుకోవడం లేదా? అంతేనా సృష్టింపబడిన వాటి జీవన విధానం, వాటి సంస్థాగత సంక్లిష్టత మరియు వాటి పనితీరు, వాటి సమతుల్యత, సమన్వయ పరిస్థితులు, విభిన్న ప్రయోజనాల కోసం, ఆశ్చర్యము కలిగించుట లేదా? సృష్టింపబడిన వాటి నాణ్యత, వాటి స్థాయి, వాటి పరిమాణం, వాటి ప్రాముఖ్యత, వాటి పనితీరు, వాటి సామర్థ్యం, సంరక్షణను, విలువలను పరిగణనలోకి తీసుకుంటే, వాటి సంక్లిష్ట ఖనిజ నిర్మాణ ప్రక్రియ ఎంతో జ్ఞాని అయిన వాటి సృష్టికర్తను గురించి అవి చెప్పడం లేదంటారా?.

పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియలో అనేక సంస్థాగత కాన్ఫిగరేషన్‌లు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి వాటి ఉత్పత్తి ప్రక్రియను గమనిస్తే వాటిలోని సంక్లిష్టత, పర్ఫెక్ట్ ప్లానింగ్ వాటి వెనుక ఒక మాస్టర్ ప్లానింగ్ ఉందనే కదండి చెప్తుంటా! ప్రయోజనార్ధమై ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడిన ఎన్నో ఏర్పాట్లు (కాలాలు, రుతువులు, ఉష్ణోగ్రతలు, భూమి ఒక ప్రక్కకి ఒంగి ఉండటం, ఓజోన్ పొర, ఇలాంటివి ఎన్నో) పర్ఫెక్ట్ ప్లానింగ్ గురించి పర్ఫెక్ట్ ప్లానర్ గురించి తెలియజెయ్యడం లేదా? సృష్టింపబడిన ప్రతిది వాటి భాగాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండేలా నిర్మాణాత్మకంగా నిర్వహించబడే రీతిలో రూపింపబడియుండటం సృష్టికర్తను గురించి చెప్పడం లేదా? సృష్టింపబడిన ప్రతిదానిని ఒక సిస్టం అనుకుంటే ఈ సృష్టిలో ఎన్నో విభిన్నమైనవి ఉన్నాయి. వాటిని ప్లాన్ చేయడం వాటికి నిర్వచనాన్ని ఇవ్వడం వాటిని నిర్వహించడం అనే విషయాలు వాటి వెనుక ఉన్న ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పడం లేదా? ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాని యొక్క నిర్దిష్ట అమరిక అవి పనిచేయడానికి సెట్ చేయబడిన విధానం, ఆ సాఫ్ట్‌వేర్‌, యాంటి వైరస్ సిస్టం అద్వితీయం. ఈ సాఫ్ట్‌వేర్‌కి చిన్నచిన్న మార్పులు చేసే పరిస్థితి ఉండటం ఆక్సిడెంటల్ అంటారా?

Automatic configuration files ని automaticగా కాపీ చేస్తుంది. Automatic configuration ఫెయిల్ అనుకోండి manual configuration అవసరం కదా. సృష్టిలో విభిన్నమైన  కాన్ఫిగరేషన్‌లు ఎన్నో వున్నాయి. ఈ manual configurations అర్ధం చేసుకొని మనుష్యులమైన మనం ఎన్నో శాస్త్రీయమైన విజయాలను అందుకోవడం లేదా చెప్పండి. మన అవసరాలను తీర్చుకోవడానికి వివిధ మార్గాల్లో వీటిని అర్ధం చేసుకొని మన స్వలాభము కోసం వీటిని విభిన్నమైన రీతులలో వాడుకోవడం లేదా చెప్పండి. ఆయన శాస్త్రాలైన ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ మరియు జువాలజీ ఇలా మరెన్నింటినో అర్ధం చేసుకొంటూ ఉన్నామా లేదా?

అన్ని దృక్కోణాలను సంతృప్తిపరిచే ఒక కామన్ ప్లాట్‌ఫారమ్ ప్రతి జీవిలో ఉండటం యాదృచ్చికమా? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో. సృష్టి కోఇన్సిడెంట్ అందామా లేక అదృష్టవశాత్తు అన్ని కలసి వచ్చాయని అనుకొందామా లేక యాక్సిడెంటల్ అని చెప్దామా చెప్పండి?

చివరిగా ఒక్క విషయం ఈ సృష్టి అంతటిపై సృష్టికర్త తన డిజైనర్ లేబుల్ని ఉంచాడు, ఆ లేబుల్ ఆ సృష్టికర్త కార్యకలాపాలను గురించి ఆయన లక్షణాలను గురించి వివరిస్తూ సృష్టిని గురించి సమాచారాన్ని అందిస్తూ వుంది. లేబుల్ చేయడం అంటే సృష్టిని సృజించిన వ్యక్తి పాత్రకు పేరు పెట్టడం, ఆ పేరే “సృష్టికర్త ”.

ఇప్పుడు సృష్టికర్త అయిన వాని అస్థిత్వమును గురించి తెలుసుకొందాం: బైబులులోని కీర్తనలు 90: 1,2 వచనాలు, ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మాటలు  దేవుని అస్థిత్వమును గురించి చాల ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఆయన ఆదియు అంతము లేని వాడని_ అంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం ఉన్నవాడని, భూమ్యాకాశములు ఉనికిలో లేన్నప్పుడు అవి రూపింపబడుటకు ముందే ఆయన తన essential attributes తో ఉనికిలో ఉన్నాడని ఆయన ఎటర్నల్ అనే విషయాన్ని చెప్తూవున్నాయి. సృష్టికర్త అయిన వాని నిత్యత్వానికి అస్తిత్వానికి సంబంధించి ఇంతకంటే సంపూర్ణమైన మరియు నిస్సందేహమైన ప్రకటన ఏది లేదు. 

ఆ సృష్టికర్త సృష్టింపబడిన వాడు కాదు కాబట్టే ఆయనను Supreme Being అని అంటే దేవుడని పిలుస్తు ఉన్నాం. బైబిలులోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము 1:1, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని తెలియజేస్తూవుంది. ఇది దేవుని గురించి ఏయే విషయాలు చెప్తూవుందంటే, 1. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడని, (ఆయన ప్రమాదవశాత్తు ఉద్భవించినవాడు కాడని; ఆయన ఉనికికి మూలము లేదని; ఆయన స్వయం అస్తిత్వం ఉన్నవాడని; ఆయన సంపూర్ణ స్వయం సమృద్ధిగల వాడని; సంపూర్ణ స్థిరత్వం ఉన్నవాడని; ఆయనకి జీవనోపాధి అవసరం లేదని; ఆయన అదృశ్యుడని); 2. ఆయన పులింగమని త్రిత్వమని, (అవిభాజ్యుడని); 3. ఆయన సర్వశక్తిమంతుడని,(ఒక ప్రదేశానికే పరిమితం కాకుండా ప్రతి ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉన్నవాడని; ఆయన అనంతుడని; ఆయన ఏ రూపాన్ని అయినా తీసుకోగలడని; ఆయన నిత్యుడని; ఆయనను సమయం లేదా స్థలం బంధించలేదని; ఆయనను కొలవలేమని; ఆయన సద్గుణాలలో, సమర్థతలో, దృష్టి జ్ఞానంలో మరియు శక్తిలో మాత్రమే కాకుండా, ఆయన తన భగవద్ద్దతమైన అంతస్తత్త్వములో, వ్యక్తిగత స్వభావములో కూడా అనంతము; అపారము; మరియు పరిపూర్ణుడైయున్నాడని); ఆదికాండము 17:1; లూకా 1:37; మత్తయి 19:26 వచనాలు ఆయనకు ఏదియు అసాధ్యము కాదని సమస్త మును సాధ్యమని చెప్తూవున్నాయి. 4. శూన్యము నుండి ఇప్పుడు మనం చూస్తున్న సమస్తమును ఆయన సృజించియున్నాడని, (ఆయన సృష్టికర్తయైయున్నాడని); 5. ఆయన సృజించిన వాటిలో ఉన్న వాటి సంక్లిష్టతను బట్టి ఆయన మహాజ్ఞానుడని; 6. ఆయన జీవమునకు మూలమని చెప్తూవుంది; దేవుని ఈ గుణ గణాలను బట్టి ఆయన అసాధారణమైనవాడు అని అర్ధమవుతువుంది.

అసాధారణమైన ఆ దేవుని రూపమేలా ఉంటుంది అనే ప్రశ్న మనకు సహజముగా రావొచ్చు. దీనికి జవాబు, యోహాను 4:24 చెప్తూ, దేవుడు ఆత్మయై యున్నాడని తెలియజేస్తూవుంది. అంటే భగవంతునికి శరీరంలేదని ఆయన పదార్థం కాడని; పదార్ధ సమ్మిళితమైన వాడు కాడని; భాగాలతో కూడుకొన్న వాడు కాడని; ఈ విషయాన్నే యిర్మీయా 23:24 చెప్తూ, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా– నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగల వాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు అని తెలియజేస్తూవుంది. ఈ మాటలు ఆయన ఏక కాలములో అంతటను ఉండే దేవుడని ఆయనను గురించి చెప్తూవుంది. యోబు 12:13 జ్ఞానశౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి. ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అని చెప్తూవున్నాయి.

అంతేనా, ఆ దేవుడు మార్పులేనివాడని మలాకీ 3:6 చెప్తూవుంది. దేవుడు మార్పులేనివాడు అంటే ఆయన పరిపూర్ణుడని తన స్వభావంలోకాని లేదా తన పరిపూర్ణతలోగాని ఎటువంటి అసంపూర్ణత లేదని సృష్టి దాని విధ్వంసం ఆయనలో ఎటువంటి మార్పుచేయలేదని ఏ విషయంలోనూ ఆయనను భిన్నమైన వ్యక్తిగా చేయలేదని; ఆయన శాశ్వతుడనే విషయాన్ని చెప్తూవుంది. అట్లే యోహాను 21:17, దేవుడు సమస్తమును ఎరిగియున్న వాడని చెప్తూవుంది. ఆ దేవుడు పరిశుద్ధుడైయున్నాడని, లేవీయకాండము 19:2 చెప్తూవుంది. అట్లే ఆయన చర్యలన్నియు న్యాయములని ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడని ఆయన నీతిపరుడు యథార్థవంతుడని, ద్వితీయోపదేశకాండము 32:4 చెప్తూవుంది. ఆయన నమ్మదగినవాడని ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడని, 2 తిమోతికి 2:13 చెప్తూవుంది. అట్లే ఆ దేవుడు అందరికి ఉపకారియని ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవని, కీర్తనలు 145:9 చెప్తూవుంది. ఆ దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడని ఆయన వేయివేల మందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించువాడని, నిర్గమకాండము 34:6,7 వచనాలు చెప్తూవున్నాయి.

మొదటి ఆర్టికల్లో మనం పరిశీలించిన అంశములు ఈ రెండవ ఆర్టికల్లో పరిశీలించిన అంశములను బట్టి దేవుని ఉనికిని గురించి ప్రతి ఒక్కరం నిర్ధారణకు వచ్చినట్లే కదండి. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా?

మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకున్నాయి? అనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే, మనిషికి దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో దేవుడు దానిని మనుష్యులకు విశదపరచియున్నాడు. విశద పరచబడియున్నటు వంటి ఆ దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించి దానికి లోబడుటకు బదులుగా అనేకులు దానిని తిరస్కరిస్తూ ఆ దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి తమవైన స్వంత మార్గాలను వెతుకుతూ ఉన్నారు. దేవుని విషయములో ఇవి జ్ఞానోదయానికి దారితీయవు, కాని ఆలోచన యొక్క వ్యర్థతకు దారి తీస్తాయి. అట్లే దేవుని విషయములో మనుష్యుల సొంత విధానాలు అభిప్రాయాలు మారుతూ ఉన్నాయి. ఎందుకంటే మనుష్యులు మారుతూ ఉంటారు కాబట్టే ఈ లోకములో ఇన్ని మతాలు ఉన్నాయి.

మరికొందరు దేవుడు లేకుండా లేదా దేవునికి బయట ఎవరూ నిజమైన ఆనందాన్ని మరియు పరిపూర్ణమైన శ్రేయస్సును కనుగొనలేరని భావిస్తూ వారి ప్రత్యేక సామర్థ్యాలకు అనుగుణంగా వారివైన ఆధ్యాత్మిక మార్గాల్లో ఆయనను కనుగొనడానికి ప్రయత్నిస్తూవున్నారు. మరికొందరికి మనుష్యులకంటే ముందే శాశ్వతమైన మార్పులేని దైవత్వము ఒకటి ఉనికిలో ఉందన్న ఆలోచనను తీసుకోవడం కష్టముగా ఉంది. ఇన్ని మతాలకు భిన్నమైన బోధలకు ఇవే కారణాలు.

అందుకనే, మనిషికి దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో దేవుడు దానిని మనుష్యులకు విశదపరచియున్నప్పటికిని, దేవుడు లేడని కొందరు చెప్పటం విచారకరం, దీనినే మనం Atheism (నాస్తికత్వము) అని అంటున్నాం. బైబులు కూడా ఇది విచారకరమైన విషయమని  రోమా 1:19 నందు తెలియజేస్తూవుంది.

అట్లే ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నప్పటికిని కొందరు ఏక దేవునిని అనేకమైన దేవుళ్లుగా విభజించడం వారిని ఆరాధించడం బాధాకరం. దీనినే మనం Polytheism అని అంటున్నాం. బైబులు కూడా ఇది బాధాకరమైన విషయమని రోమా 1:20 నందు తెలియజేస్తూ, వీళ్ళలో కొందరు ఈ జీవితానికే ప్రాధాన్యతను ఇస్తూ దేవునిని తిరస్కరిస్తూ తమ జీవితాలను తమకు నచ్చినట్లుగా జీవించడమే కాకుండా వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు అని చెప్తూవుంది.

మరికొందరు దేవుడు అన్నిటిలో ఉన్నాడని, సృష్టిలో ప్రతిది  దేవుడే అని నమ్ముతూ సృష్టిలోని ప్రతిదానిని దేవుడే అని పూజిస్తూవుంటారు. దీనినే మనం Pantheism అని అంటున్నాం. అయితే, బైబిల్ స్పష్టంగా దేవుడు సమస్తమునకు సృష్టికర్తయని చెప్తూవుంది.

మరికొందరు ఆత్మ యొక్క వాస్తవికతను తిరస్కరిస్తూ పదార్థం మరియు మనస్సు మధ్య వ్యత్యాసాన్ని విస్మరిస్తూ  దేవుడు, మానవ ఆత్మ, మరియు నిత్యత్వం అనేవి లేనే లేవని ఈ సృష్టిలో పదార్థం, శక్తి మాత్రమే ఉన్నాయని వాటి ద్వారానే సమస్తము ఉనికిలోనికి వచ్చియున్నాయని, కొనసాగుతూ ఉన్నాయని చెప్తూ ఈ లోకసంబంధమైన భౌతిక విషయాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దీనినే మనం Materialism అని అంటున్నాం. Materialism అనేది విగ్రహారాధన. అది ఎప్పుడూ దైవభక్తికి మనుష్యులను నడుపదు. ఈ విషయాన్నే బైబిలు 1 తిమోతికి 6:9,10 నందు తెలియజేస్తూవుంది.

మరికొందరు మన జీవితములో గతము, వర్తమానము మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలన్ని “దేవుడు లేదా  అదృష్టము” వంటి మరొక సర్వశక్తిమంతమైన శక్తిచే ముందుగా నిర్ణయించబడినందున, “మన ప్రమేయము లేకుండానే జరగాల్సింది జరుగుతూ ఉంటుంది”  అని నమ్ముతూ ఉంటారు. దీనినే మనం Fatalism అని అంటున్నాం బైబిల్ ఫాటలిజాన్ని గురించి బోధించటం లేదు.

మరికొందరు దేవుడు ఉన్నాడో లేడో తెలుసుకోలేమని చెప్తూ ఉంటారు. దీనినే మనం Agnosticism అని అంటున్నాం.

మచ్ఛుకు కొన్నే చెప్తున్నాను, ఇలా చెప్పుకొంటూ పోతే దేవునిని గురించి ఎన్నో విభిన్నమైన భోదలు భిన్నమైన అభిప్రాయాలు ఈ లోకములో ఉన్నాయి. ఇన్ని విభిన్నమైన భోదలు, భిన్నమైన అభిప్రాయాలు ఎందుకని ఉన్నాయో చూచాయగా అందరికి ఇప్పటికే అర్ధమయ్యి ఉంటుందని నేను అనుకొంటున్నాను. 

ఇప్పుడు చెప్పండి విభిన్నమైన సంస్కృతులు విభిన్నమైన మెంటల్ maturities కలిగి జ్ఞానులమని చెప్పుకొంటున్న మనం ఎంతో ప్రాముఖ్యమైన దేవుని విషయములో భిన్నమైన బోధలను, మనకు నచ్చిన బోధలను మనకొరకు మనం ఏర్పరచుకోవడం కరెక్టేనంటారా?

అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చుకోవడం కరెక్టే నంటారా?

ఈ సృష్టి కోఇన్సిడెంట్ గా లేక అదృష్టవశాత్తు అన్ని కలసిరావటం మూలన్న అంటే అదృష్టవశాత్తు లక్షల కాన్ఫిగరేషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్కావటం మూలాన్న లేక యాక్సిడెంటల్గా ఉనికిలోనికి వచ్చియున్నది కాబట్టి మన జీవితాలను బట్టి మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదని అనుకొంటూ నిజ దేవుడెవరో తెలుసుకోకుండా నిర్బీతిగా బ్రతికేధ్ధామా?

మన సైన్సుతో, మన తర్కముతో, మన మానవ నిర్మిత భోధలతో నిజమైన ఆ దేవుడెవరో, ఆయన పేరేమిటో ఆయన మన కొరకు ఏమి చేసియున్నాడో తెలుసుకోగలమంటారా? నిజమైన ఆ దేవుడెవరో, ఆయన పేరేమిటో తెలుసుకోవడమెలా? నెక్స్ట్ ఆర్టికల్ లో చూడండి.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.