ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము

సృష్టి, సైన్స్సృష్టి, సైన్స్, తర్కం, లేదా మానవ ఆలోచనలు దేవుడు ఉన్నాడని కొంతవరకు తెలియజేయగలవు. కానీ అవి నిజమైన దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన స్వభావం ఏమిటి, మరియు మనుష్యుల కోసం ఆయన ఏమి చేశాడు అనే విషయాలను పూర్తిగా తెలియజేయలేవు.

అయితే దేవుడు మనకు ఇచ్చిన సహజ జ్ఞానం వల్ల ఒక విషయం మాత్రం తెలుస్తుంది: దేవుడు ఉన్నాడు, మరియు మనుష్యులందరూ ఆయనకు జవాబుదారులు. 

ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మన ముందు నిలుస్తాయి:

  • ఎందుకు ప్రతి మనిషి పాపంతో మరియు చెడు ఆలోచనలతో పోరాడుతున్నాడు?
  • పాపం అంటే ఏమిటి?
  • పాపం మనుష్యులలోకి ఎలా వచ్చింది?
  • పాపం రాకముందు మనుష్యులు ఎలా ఉండేవారు?
  • పాపం మనుష్యులను ఎలా పాడుచేసింది?
  • మరణం ఈ లోకంలోకి ఎలా ప్రవేశించింది?
  • మన చుట్టూ ఉన్న ప్రతిదీ ఎందుకు తాత్కాలికంగా ఉంది?
  • మనస్సాక్షి ఎందుకు మనలను తప్పు చేసినప్పుడు గద్దిస్తుంది?
  • మన హృదయాలలో దేవుని ధర్మశాస్త్రం ఎందుకు వ్రాయబడింది?
  • అంతిమ తీర్పు నుండి ఎలా రక్షించబడగలం?
  • స్వర్గాన్ని ఎలా పొందగలం?

ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రకృతిలో గానీ, మానవ తర్కంలో గానీ పూర్తిగా దొరకవు. తన ఉనికిని గురించి సాక్ష్యాలను మనకు అందించిన దేవుడు ప్రతిఒక్కరు ప్రాముఖ్యముగా తెలుసుకోవలసిన ఈ ప్రాధమిక ప్రశ్నలకు కూడా సాక్షాన్ని తప్పకుండా మనుష్యులకు ఇచ్చే ఉంటాడు. వాటిని తెలుసుకోవడానికి దేవుడు తన వాక్యమైన బైబిల్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక ప్రకటన అవసరం. ఈ సాక్ష్యమే నిజ దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తుంది.

దేవుడు తన ఉనికిని సృష్టి ద్వారా మనకు తెలియజేశాడు. కానీ మనుష్యుల పాప సమస్యకు పరిష్కారం ఏమిటి? మరణం ఎందుకు వచ్చింది? మనం ఎలా రక్షింపబడగలం? దేవునితో ఎలా సమాధానపడగలం? అనే ప్రశ్నలకు సమాధానం సృష్టి ద్వారా కాదు, దేవుడు ప్రత్యేకంగా బయలుపరచిన తన వాక్యము ద్వారా మాత్రమే తెలుస్తుంది. అక్కడే నిజమైన దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి, మరియు మన కొరకు ఆయన ఏమి చేశాడో స్పష్టంగా తెలుస్తుంది.

మరి ఆ దేవుని కొరకు యెక్కడని వెదుకుదాం అనే ప్రశ్నకు, జవాబు మతాలలోనే. అవునండి మతాలలోనే ఆ దేవునిని గురించి వెతకవలసి ఉన్నాం. అందుకేనేమో ఆ నిజ దేవున్ని గురించి మనుష్యులు తెలుసుకోకుండా సాతాను వేలాది మతాలను తెరపైకి తెచ్చి మనలను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉందేమో?

సరే మన ప్రాధమిక ప్రశ్నలకు సరియైన జవాబును ఎక్కడ కనుక్కోగలమో చూధ్ధాం. మొట్టమొదటి మానవులను దేవుడు తన స్వరూపమందు సృజించాడు _ అంటే వాళ్ళు దేవుని జ్ఞానములో పరిపూర్ణమైన నీతిలో, పరిశుద్ధతలో, దేవుని స్వభావము యొక్క సహజ శాస్త్రీయ జ్ఞానముతో సృజింపబడ్డారు, మరణము లేనివారిగా ఉన్నారు, దేవునితో సమాధాన సంబంధం కలిగినవారు, ఈ స్థితిలో వాళ్ళు సాతానుచే శోధింపబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు మానవ జీవితంలో ప్రవేశించింది. (1 యోహాను 3:4, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము)

దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనే ఈ తిరుగుబాటు మొట్టమొదటి ఆదాము హవ్వలు అప్పటివరకు కలిగియున్న దేవుని జ్ఞానాన్ని, పరిపూర్ణమైన నీతిని, పరిశుద్ధతను పోగొట్టుకొనేటట్లు చెయ్యడమే కాకుండా వారి ద్వారా పాపం వారి పిల్లలైన మనుష్యులందరి లోనికి వారసత్వముగా ప్రవేశించింది. మానవులు స్వభావరీత్యా పాపులుగా మారారు. పాపము వలన వచ్చు జీతమైన మరణమును పొందుకొన్నారు, (రోమా ​​​​5:12 లో ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను). పాపము వలన వచ్చు జీతము మరణము అంటే శారీరకమైన మరణము (రోమా 6:23), ఆత్మీయమైన మరణము (మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయున్నారు, ఎఫెసీ 2:1), శాశ్వతముగా దేవుని ఉగ్రత క్రింద ఖండింపబడియున్నాము (మత్తయి 25:46). అలాగే పాపము దుర్నీతిని, ఆత్మీయమైన విషయములో అంధత్వమును (2 కొరింథీయులకు 4:4), మరణమును కలుగ చేసింది. మనుష్యులను మర్త్యులుగా, క్షయమైన వారిగా మార్చివేసింది, సృష్టి శపింపబడింది (ఆదికాండము 3:17-19; రోమా 8:20-22).

ఆదాము ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. పాపంతో పాటు మరణం కూడా వచ్చింది. అందువల్ల ప్రతి మనిషి పాప స్వభావంతో జన్మిస్తాడు. మనం పాపాలు చేస్తున్నందున పాపులం కాదు; మనం పాపులం కాబట్టే పాపాలు చేస్తున్నాం. ఇదే జన్మపాపం (రోమా 7:17). మన చెడు ఆలోచనలు, చెడు కోరికలు, చెడు మాటలు, చెడు పనులు కర్మపాపాలు (2 సమూయేలు 12:13, యాకోబు 1:15, మత్తయి 5:28).

పాపం ఫలితం కేవలం శారీరక మరణం మాత్రమే కాదు. అది దేవునితో విడిపోవడం, ఆత్మీయ మరణం, చివరకు నిత్య శిక్షకు దారి తీస్తుంది. పాపం కారణంగా మనిషి మాత్రమే కాదు, సృష్టి అంతా శాప ప్రభావంలోకి వచ్చింది.

మరి ఈ జన్మ, కర్మ పాపము నుండి, మరణము నుండి, అపవాది యొక్క అధికారము నుండి, దేవునిశిక్ష నుండి, స్వభావసిద్ధమైన ఒక పాపిగా ఎవరైనా తనకు తానుగా విడిపించుకోగలరా? దాని ఫలితాల నుండి తప్పించు కోగలరా? వారి శాపమును తొలగించుకోగలరా? మనుష్యులకు ఆ సామర్ధ్యము ఉందా? బైబిల్ సమాధానం — లేదు. ఏ మనిషికీ తన పాపాన్ని తానే తొలగించుకునే శక్తి లేదు. దేవుడే రక్షణ మార్గాన్ని ఏర్పరచాలి.

మొదటి మనుష్యులు శోధింపబడి పాపము చేసినప్పుడు వాళ్ళు ఆ పాపము యొక్క శాపము క్రిందికి వచ్చేసారు. వాళ్ళు ఆ పాపము తెచ్చిన శాపమును అనుభవించాల్సి ఉన్నారే తప్ప ఆ శాపవిముక్తిని గురించి వాళ్ళకేమి తెలియదు. ఆ శాపము నుండి దేవుడే మనుష్యులను విముక్తులుగా చెయ్యకపోతే మనుష్యులకు మరొక మార్గము లేదు. అందుకే దేవుడు ఆదికాండము 3:15లోనే రక్షకుని వాగ్దానం చేశాడు. పాపం వల్ల వచ్చిన శాపాన్ని తొలగించడానికి, మనలను విమోచించడానికి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును పంపించాడు.

మనుష్యులు తరచుగా ఒక పెద్ద తప్పు చేస్తారు. “నేను పెద్ద పాపాలు చేయలేదు”, “దేవుడు ప్రేమగలవాడు కాబట్టి క్షమిస్తాడు”, “అన్ని మతాలు ఒకటే” అని అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో పాపం పాపమే. చిన్నదైనా, పెద్దదైనా అది దేవుని పరిశుద్ధతకు విరోధమే. ప్రతి మనిషి తన పాపాలకు దేవునికి జవాబు చెప్పాల్సిందే.

అలాగే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, ఆ పాపాన్ని ఆతడు ఎలా ప్రక్షాళన చేసుకోగలడు? దేవుడు ఆ పాపాన్ని క్షమించాడనే నిశ్చయతను ఎలా పొందుకోగలడు? మన జన్మ పాపము, కర్మ పాపము కొరకు మనమెలా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోగలం? మనం ఏర్పరచుకొన్న బోధలు, ధర్మాలు, కులాలు, మతాలు, సమాజాలు మనం ఈ లోకాన్ని వీడిన క్షణములో అక్కరకు వస్తాయని అనుకొంటున్నారా? వాటిని నమ్ముకొందామా? అవి ఒకవేళ తప్పైతే. అన్ని మతాలు ఒక్కటి కాకపోతే? సమస్య ఏమిటంటే, పాపం పాపమే, దానిలో పెద్దది, చిన్నది, కులాలు, మతాలు, సమాజాలు అనే వ్యతాసం ఏమి లేదు.  ప్రతి ఒక్కరి పాపము ప్రతి ఒక్కరిని పట్టుకొంటుంది అని తెలుసుకోండి. దానికి మినహాయింపులేవి లేవండి. దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది అనే విషయాన్ని మరచిపోకండి.

అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునని బైబిల్ మనలను హెచ్చరిస్తుంది. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోస్తాడు, గలతి 6:7,8. అట్లే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునని ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్ఛయింతురో వాటిని చేయకుందురని కూడా గలతి 5:17లో చెప్తూవుంది. పాప సమస్యకు నిజమైన పరిష్కారం మానవ జ్ఞానం, తర్కం, మతాచారాలు లేదా మంచి పనులలో లేదు.

రక్షణకు అవసరమైన దేవుని జ్ఞానం బైబిల్‌లో మాత్రమే స్పష్టంగా బయలుపరచబడింది. బైబిల్ దేవుని గురించి, మన పాప స్థితి గురించి, మరియు రక్షణ మార్గం గురించి మనకు తెలియజేస్తుంది.

దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు ఇచ్చాడు. యేసు క్రీస్తు మన పాపాల కొరకు సిలువపై మరణించి, మృతులలోనుండి లేచాడు. ఆయనను విశ్వసించే ప్రతి ఒక్కరికీ పాపక్షమాపణ, నిత్యజీవం, మరియు దేవునితో సమాధానం లభిస్తాయి.

కాబట్టి స్నేహితులారా, మానవ ఆలోచనలపై కాకుండా దేవుని వాక్యంపై విశ్వాసం ఉంచండి. యేసు క్రీస్తును నమ్మండి. ఆయనలోనే నిజమైన రక్షణ, క్షమాపణ, మరియు నిత్యజీవం ఉన్నాయి. దేవుని సత్యాన్ని తెలుసుకొని, ఆయన కృపలో నడుస్తూ నిత్యజీవం పొందండి.

ఈ లోకములో నిజ దేవుడెవరో తెలుసుకోవడానికి ఆ దేవుని సహాయము లేకుంటే మనం ఆయనను ఎప్పటికీ తెలుసుకోలేము, ఆయనని నమ్మలేము. పాపం వలన కలిగిన అంధత్వం, అహేతుకత తొలగింపబడి మన మధ్యలో బయలు పరచబడియున్న ఈ సాక్ష్యాలను నమ్మి మనమందరం రక్షింపబడటానికి దేవుని ఆత్మయైన పరిశుధ్ధాత్మ దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఈ సువార్త ద్వారా మనందరిని పిలిచి తన వరముల చేత వెలిగించి నిజ విశ్వాసము నందు మనందరిని ప్రతిష్టించును గాక,  ఆమెన్.

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్.  ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl