ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము

దేవుడు సృజించిన వాటిని బట్టి పకృతిలోగాని మానవ చరిత్రలోగాని ఆ దేవుని కంటిన్యూస్ ఆపరేషన్స్ బట్టి మనుష్యుల హృదయాలలో వ్రాయబడిన దైవికమైన చట్టాన్ని బట్టి ఈ సృష్టిలో ప్రతిదీ ఒక డిజైన్లో రూపింప బడి వ్యవస్థీకృతముగా ఉండటాన్ని బట్టి దేవుని ఉనికిని గురించి అయితే నిర్ధారణకు వచ్చాం. మనుష్యుల మైన మనకు దేవునిని గురించి ఏదన్నా తెలిసింది అంటే దేవుడే తన గురించి తానే స్వయముగా తెలియజేస్తే తప్ప మానవుడు దేవునిని గురించి ఎప్పటికి తెలుసుకోలేడు అనే విషయం ఈ ఆర్టికల్ యొక్క మొదటి భాగాన్ని రెండవ భాగాన్ని ఆలకించిన అందరికి అర్ధమయ్యి వుండాలి. సృష్టి ద్వారా గాని సైన్సుద్వారా గాని మన తర్కము ద్వారాగాని మానవ నిర్మిత భోధలద్వారా గాని నిజమైన ఆ దేవుడెవరో ఆయన పేరేమిటో ఆయన మన కొరకు ఏమి చేసియున్నాడో ఎప్పటికి తెలుసుకోలేము.

అప్పుడు, దేవుని సహజ జ్ఞానం యొక్క విలువ ఏమిటి? అనే ప్రశ్న మనకు రావొచ్చు. దేవుని సహజ జ్ఞానం దేవుడనే వాడు ఒకడున్నాడని ఆ దేవునికి మనుష్యులందరు జవాబుదారులుగా ఉన్నారని మాత్రమే చెప్తూ వుంది. అయితే,   

  1. ఎందుకని మనుష్యునిగా పుట్టిన ప్రతిఒక్కరు  ప్రతిరోజు పాపాన్ని, పాపపు స్వభావాన్ని ఎదిరించాల్సి ఉంది?
  2. అసలు పాపము అంటే ఏమిటి? అది మనుష్యులలోనికి ఎలా ప్రవేశించింది?
  3. పాపము మనుష్యులలోనికి రాకముందు అసలు వాళ్ళు ఎలావుండేవాళ్లు?
  4. అది మానవులను ఎలా పాడు చేసియున్నది?
  5. మరణం అసలు ఈ లోకములోనికి ఎలా వచ్చింది?
  6. మనచుట్టూ ఉన్న ప్రతిదాని అస్థిత్వము పాపమును బట్టే  టెంపరరీగా ఉందా?
  7. దేవుని ధర్మశాస్త్రము మన హృదయాల్లో వ్రాయబడకుంటే మనస్సాక్షి మనలను గద్దించే సమస్యే లేదు. మనస్సాక్షి ఒక స్వరములా మనుష్యులతో మాట్లాడుతూ ఉన్నదంటే ఒక ఉదేశ్యము కొరకు అది మనలో ఉంచబడింది అనేగా అర్ధం. ఆ ఉదేశ్యము ఏంటి?
  8. అంతిమ తీర్పును ఎలా తప్పించుకోగలం?
  9. స్వర్గాన్ని ఎలా పొందుకోగలం? అను వీటిని గురించి మనమెలా తెలుసుకోగలం.

తన ఉనికిని గురించి సాక్ష్యాలను మనకు అందించిన దేవుడు ప్రతిఒక్కరు ప్రాముఖ్యముగా తెలుసుకోవలసిన ఈ ప్రాధమిక ప్రశ్నలకు కూడా సాక్షాన్ని తప్పకుండా మనుష్యులకు ఇచ్చే ఉంటాడు. ఈ సాక్ష్యమే నిజ దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలియజేస్తూ వుంది.

మరి ఆ దేవుని కొరకు యెక్కడని వెదుకుదాం అనే ప్రశ్నకు మతాలలోనే. అవునండి మతాలలోనే ఆ దేవునిని గురించి వెతకవలసి వున్నాం. అందుకేనేమో ఆ నిజ దేవున్ని గురించి మనుష్యులు తెలుసుకోకుండా సాతాను వేలాది మతాలను తెరపైకి తెచ్చి మనలను మోసగించడానికి ప్రయత్నిస్తూ ఉందేమో, ఆలోచించండి.

సరే మన ప్రాధమిక ప్రశ్నలకు సరియైన జవాబును ఎక్కడ కనుక్కోగలమో చూధ్ధాం. మొట్టమొదటి మానవులను దేవుడు తన స్వరూపమందు సృజించియున్నాడని _ అంటే వాళ్ళు దేవుని జ్ఞానములో పరిపూర్ణమైన నీతిలో మరియు పరిశుద్ధతలో మరియు దేవుని స్వభావము యొక్క సహజ శాస్త్రీయ జ్ఞానముతో సృజింపబడియున్నారని మరణము లేనివారిగా వున్నారని ఈ స్థితిలో వాళ్ళు సాతానుచే శోధింపబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించారని; ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఇది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా బైబులు మాత్రమే చెప్తూవుంది (1 యోహాను 3:4) (ద్వితీయోపదేశ కాండము 9:7; జాషువా 1:18 చూడండి ).

దేవుని ఆజ్జ్యను అతిక్రమించడం అనే ఈ తిరుగుబాటు మొట్టమొదటి ఆదాముహవ్వలు అప్పటివరకు కలిగియున్న దేవుని జ్ఞానము పరిపూర్ణమైన నీతి మరియు పరిశుద్ధతను పోగొట్టుకొనేటట్లు చెయ్యడమే కాకుండా వారి ద్వారా పాపం వారి పిల్లలైన మనుష్యులందరిలోనికి వారసత్వముగా ప్రవేశించిందని, మానవులు స్వభావరీత్యా పాపులుగా మారారని, పాపమువలన వచ్చు జీతమైన మరణమును పొందుకొన్నారని బైబులు మాత్రమే తెలియజేస్తూ, రోమా ​​​​5:12 లో ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను అని చెప్తూవుంది. మరణము అంటే శారీరకమైన మరణము ఆత్మీయమైన మరణము, శాశ్వతముగా దేవుని ఉగ్రతక్రింద ఖండింపబడియుండుట అని బైబులు మాత్రమే చెప్తూవుంది. అలాగే పాపము దుర్నీతిని, ఆత్మీయమైన విషయములో అంధత్వమును, మరణమును కలుగ చేసింది. మనుష్యులను మర్త్యులుగా క్షయమైన వారిగా మార్చివేసింది, సృష్టి శపింపబడింది అని బైబులు మాత్రమే ఆదికాండము 3 వ అధ్యాయములో చెప్తూవుంది. .

మనం పాపం చేస్తుండుటను బట్టి పాపులం కామండి మనం పాపులం కాబట్టే పాపము చేస్తూ ఉన్నాం. దీనిని జన్మ పాపమని (కావున ఇకను దానిచేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు) అను మాటల ద్వారా రోమా 7:17 లో బైబులు మాత్రమే దీని గురించి చెప్తూవుంది. అలాగే చెడు పనులు చెడు ఆలోచనలు మరియు చెడు కోరికలు పాపాలని, వాటిని తెలిసి చేసినా తెలియకుండా చేసినా అవి పాపాలేనని బైబులు 2 సమూయేలు 12:13లో యాకోబు 1:15 లో మత్తయి 5:28లో చెప్తూవుంది. దీనిని కర్మ పాపమంటారని మనకందరికి తెలుసు.

మరి ఈ జన్మకర్మ పాపమునుండి మరణము నుండి అపవాదియొక్క అధికారమునుండి దేవునిశిక్షనుండి స్వభావ సిద్ధమైన ఒక పాపిగా ఎవరైనా తనకు తానుగా విడిపించుకోగలరా? దాని ఫలితాలనుండి తప్పించుకోగలరా? వారి శాపమును తొలగించు కోగలరా? మనుష్యులకు ఆ సామర్ధ్యము ఉందంటారా? ఆలోచించండి.

మొదటి మనుష్యులు శోధింపబడి పాపము చేసినప్పుడు వాళ్ళు ఆ పాపము యొక్క శాపము క్రిందికి వచ్చేసారు. వాళ్ళు ఆ పాపము తెచ్చిన శాపమును అనుభవించాల్సి ఉన్నారే తప్ప ఆ శాపవిముక్తిని గురించి వాళ్ళకేమి తెలియదు. ఆ శాపమునుండి దేవుడే మనలను విముక్తులుగా చెయ్యక పోతే మనకు మరొక మార్గముందంటారా? ఆ శాపవిముక్తిని గురించి బైబులు మాత్రమే ఆదికాండము 3:15లో చెప్తూవుంది.

అలాగే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, ఆ పాపాన్ని ఆతడు ఎలా ప్రక్షాళన చేసుకోగలడు? దేవుడు ఆ పాపాన్ని క్షమించాడనే నిశ్చయతను ఎలా పొందుకోగలడు? మన జన్మపాపము కర్మపాపము కొరకు మనమెలా ప్రాయచిత్తాన్ని చేసుకోగలం? మనం ఏర్పరచుకొన్న బోధలు ధర్మాలు కులాలు మతాలు సమాజాలు మనం ఈ లోకాన్ని వీడిన క్షణములో అక్కరకు వస్తాయని అనుకొంటున్నారా? వాటిని నమ్ముకొందామా? అవి ఒకవేళ తప్పు అయితే.

మనుష్యులముగా మనమెలా తప్పుగా ఆలోచిస్తూ వున్నామో తెలుసా? దేవుడు చాలా ప్రేమగలవాడని, మనం చేసే “చిన్నచిన్న తప్పులను,” “కొన్ని విషయాలలో తప్పిపోవుటను” “మన అజ్ఞానాన్ని””మన తప్పుడు నిర్ణయాలను” “poor judgementని” ఆయన పట్టించుకోడని ఇవి మరణానికి దేవుని శిక్షకు అర్హమైనవి కాదని మనమను కొంటున్నాం? మరికొందరు అన్ని మతాలు ఒక్కటేనని చెప్తూ వాళ్ళని వాళ్ళు సమర్ధించుకొంటూ వుంటారు. అన్ని మతాలు ఒక్కటి కాకపోతే? సమస్య ఏమిటంటే, పాపం పాపమే, దానిలో పెద్దది, చిన్నది కులాలు మతాలు సమాజాలు అనే వ్యతాసం ఏమి లేదు.  ప్రతి ఒక్కరి పాపము ప్రతి ఒక్కరిని పట్టుకొంటుంది అని తెలుసుకోండి. దానికి మినహాయింపులేవి లేవండి. దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా వుంది అనే విషయాన్ని మరచిపోకండి.

మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీ రేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయునని, గలతి 6:7,8 లో బైబులు మాత్రమే చెప్తూవుంది. అట్లే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించునని ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురని కూడా బైబులు మాత్రమే గలతి 5: 17లో చెప్తూవుంది. పదేపదే, బైబులు మాత్రమేనని నేను పలుమార్లు చెప్పటం మీరు ఆలకించే వుంటారు. ఎందుకంటే ఈ జన్మ కర్మ పాపమునుండి మరణము నుండి అపవాదియొక్క అధికారమునుండి దేవునిశిక్ష నుండి తప్పించుకొని స్వర్గాన్ని పొందడానికి దేవునితో ఒకటిగా ఉండటానికి అవసరమైన రక్షణార్ధమైన దేవుని జ్ఞానము బైబిలులో మాత్రమే బయలు పరచబడి ఉందనేది వాస్తవం. దేవుడు తనను గురించి తన చిత్తాన్ని గురించి సంపూర్తిగా అందులో తెలియజేసి యున్నాడు. బైబులు అంటే మరేమిటో కాదండి బయలుపరచబడియున్న నిజ దేవుని జ్ఞానము.

స్నేహితులారా, కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది మన శాపవిమోచన కొరకైన దేవుని ప్రకటనను నమ్మండి_ అందరికిని సృష్టికర్తయైయున్న యెహోవా లోకమును ఎంతో ప్రేమించుచున్నాడని ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవ జ్ఞానముగలవారై యుండ వలెనని యిచ్ఛయించుచున్నాడని కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన క్రీస్తు యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అందరికొరకైన విమోచకునిగా అనుగ్రహించెనని బైబులు మాత్రమే యోహాను సువార్త 3:16లో 1 తిమోతికి 2:4 లో చెప్తూవుందండి.

సమస్త మానవాళి పాపముల కొరకై మన అందరి శాపవిమోచకునిగా అర్పింపబడియున్న క్రీస్తును నమ్మండి. కావాలంటే అన్ని మతగ్రంధాలను చదవండి, వాస్తవాలను గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, శాపవిమోచనపు ప్రకటన యను వెఱ్ఱితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను అని బైబులు మాత్రమే 1 కొరింథీయులకు 1:21 లో చెప్తూవుందండి.

ఈ లోకములో నిజ దేవుడెవరో తెలుసుకోవడానికి ఆ దేవుని సహాయము లేకుంటే మనం ఆయనను ఎప్పటికీ తెలుసుకోలేము ఆయనని నమ్మలేము. పాపం వలన కలిగిన అంధత్వం అహేతుకత తొలగింపబడి మన మధ్యలో బయలు పరచబడియున్న ఈ సాక్ష్యాలను నమ్మి మనమందరం రక్షింపబడటానికి దేవుని ఆత్మయైన పరిశుధ్ధాత్మ దేవుడు తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఈ సువార్త ద్వారా మనందరిని పిలిచి తన వరముల చేత వెలిగించి నిజ విశ్వాసము నందు మనందరిని ప్రతిష్టించును గాక,  ఆమెన్.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతనివ్వండి – రెవ. కూరపాటి విజయ్ కుమార్.