రెండవ భాగము
దేవుడు ఉన్నాడు? రుజువులివిగో. రెండవ భాగము
దేవుడు ఉన్నాడని తెలియజేసే అనేక సూచనలు మన చుట్టూ కనిపిస్తాయి. ప్రకృతిని పరిశీలించినా, మానవ చరిత్రను గమనించినా, మన హృదయాలలో ఉన్న మంచి-చెడు జ్ఞానాన్ని చూసినా, మన మనస్సాక్షిని పరిశీలించినా దేవుని ఉనికికి సాక్ష్యాలు కనిపిస్తాయి.
ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఒక నిర్దిష్టమైన రూపకల్పన (డిజైన్) ప్రకారం ఏర్పడింది. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది. ప్రకృతి నియమాలకు లోబడి, క్రమబద్ధంగా, ఆశ్చర్యకరమైన సమన్వయంతో ఈ విశ్వం నడుస్తోంది. ఇది యాదృచ్ఛికంగా ఏర్పడినది కాదని, జ్ఞానవంతుడైన సృష్టికర్త ఉన్నాడని సూచిస్తుంది.
ఏదైనా పని ఒక క్రమపద్ధతిలో జరగాలంటే దాని వెనుక ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన వ్యవస్థ, నియమాలు, మరియు వాటిని నడిపించే విధానం ఉండాలి. ఈ విశ్వంలో కూడా అలాంటి క్రమం మరియు నియమాలు కనిపిస్తున్నాయి. భౌతిక శాస్త్ర నియమాలు, ప్రకృతి చక్రాలు, జీవుల నిర్మాణం—ఇవన్నీ ఒక గొప్ప రూపకర్తను సూచిస్తున్నాయి.
అంతేకాదు, జీవుల నిర్మాణాన్ని, వాటి పనితీరును, పరస్పర సహకారాన్ని, సమతుల్యతను పరిశీలిస్తే అవి ఎంతో సంక్లిష్టంగా మరియు అద్భుతంగా రూపొందించబడ్డాయని తెలుస్తుంది. వాటి నాణ్యత, సామర్థ్యం, విలువ, మరియు వాటి ఉనికి వెనుక ఉన్న జ్ఞానం ఒక మహాజ్ఞానియైన సృష్టికర్తను గురించి తెలియజేస్తున్నాయి.
కాబట్టి సృష్టిని నిజాయితీగా పరిశీలించినవారు, దాని వెనుక ఉన్న దేవుని జ్ఞానాన్ని మరియు శక్తిని గుర్తించకుండా ఉండలేరు. సృష్టి స్వయంగా సృష్టికర్తను గురించి సాక్ష్యం చెబుతోంది.
ఉదాహరణకు, జీవుల పునరుత్పత్తి ప్రక్రియను పరిశీలించండి. ప్రతి జీవి తన జాతిని కొనసాగించే విధానం ఎంతో అద్భుతంగా మరియు సంక్లిష్టంగా రూపొందించబడింది. ఈ ప్రక్రియలో కనిపించే ఖచ్చితత్వం, క్రమం, మరియు ప్రణాళిక వాటి వెనుక ఒక జ్ఞానవంతమైన రూపకర్త ఉన్నాడని సూచిస్తున్నాయి.
అలాగే ఈ సృష్టిలో మన జీవితానికి అవసరమైన ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. కాలాలు, రుతువులు, సరైన ఉష్ణోగ్రతలు, భూమి తన అక్షంపై కొంత వంగి ఉండటం, ఓజోన్ పొర భూమిని రక్షించడం వంటి అనేక విషయాలు యాదృచ్ఛికంగా ఏర్పడినవి కావు. ఇవన్నీ ఒక గొప్ప ప్రణాళిక మరియు పరిపూర్ణ రూపకల్పనను సూచిస్తున్నాయి.
సృష్టిలోని ప్రతి వస్తువు మరియు ప్రతి జీవి తన భాగాలతో సమన్వయంగా పనిచేసేలా నిర్మించబడింది. శరీరంలోని అవయవాలు ఒకదానితో ఒకటి సహకరించడం, ప్రకృతిలోని వ్యవస్థలు పరస్పరం ఆధారపడటం చూస్తే, ఇవన్నీ ఒక సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తాయి.
ఈ విశ్వాన్ని ఒక పెద్ద వ్యవస్థగా (సిస్టమ్‌గా) భావిస్తే, దానిలో అనేక చిన్న చిన్న వ్యవస్థలు ఉన్నాయి. వాటి నిర్మాణం, నిర్వహణ, మరియు పనితీరు వెనుక ఒక గొప్ప మేధస్సు పనిచేసిందని చెప్పకుండా ఉండలేం.
ఇంకా జీవులలో ఉన్న జన్యు సమాచారం (DNA), శరీర రక్షణ వ్యవస్థలు, స్వీయ మరమ్మత్తు ప్రక్రియలు, మరియు ప్రకృతి సమతుల్యత ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇంత క్లిష్టమైన మరియు క్రమబద్ధమైన వ్యవస్థలు కేవలం ప్రమాదవశాత్తు (ఆక్సిడెంటల్‌గా) ఏర్పడ్డాయని చెప్పడం కంటే, వాటి వెనుక ఒక జ్ఞానవంతుడైన సృష్టికర్త ఉన్నాడని అంగీకరించడం మరింత సహజమైనది.
ఒక కంప్యూటర్ లేదా యంత్రంలో ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ పనిచేయకపోతే, దానిని సరిచేయడానికి మాన్యువల్ కాన్ఫిగరేషన్ అవసరం అవుతుంది. అలాగే ఈ సృష్టిలో కూడా అనేక రకాల వ్యవస్థలు, నిర్మాణాలు, మరియు నియమాలు ఉన్నాయి. మనుష్యులు వాటిని అధ్యయనం చేసి అర్థం చేసుకోవడం ద్వారా ఎన్నో శాస్త్రీయ విజయాలను సాధించారు.
ప్రకృతిలో ఇప్పటికే ఉన్న నియమాలను, నిర్మాణాలను, మరియు ప్రక్రియలను అర్థం చేసుకొని మన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నాము. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, జువాలజీ మరియు ఇతర శాస్త్రాలు కూడా సృష్టిలో ఇప్పటికే ఉన్న క్రమాన్ని, నియమాలను, మరియు రూపకల్పనను అధ్యయనం చేస్తున్నాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జీవులలో అనేక భిన్నత్వాలు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని ప్రాథమిక నిర్మాణాలు మరియు నియమాలు సామాన్యంగా కనిపిస్తాయి. ఈ సమన్వయం, క్రమం, మరియు ఏకరూపత యాదృచ్ఛికంగా ఏర్పడిందా? లేక ఇవన్నీ ఒక జ్ఞానవంతమైన ప్రణాళిక ఫలితమా?
సృష్టిలో కనిపించే క్రమబద్ధత, సమతుల్యత, మరియు అద్భుతమైన రూపకల్పనను చూస్తే, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా లేదా ప్రమాదవశాత్తు ఏర్పడ్డాయని చెప్పడం కష్టం. ఇవి ఒక తెలివైన మరియు శక్తివంతమైన సృష్టికర్తను సూచిస్తున్నాయని అనిపిస్తుంది.
చివరిగా ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ సృష్టి అంతటిమీద సృష్టికర్త తన “సంతకం”ను ఉంచినట్లుగా ఉంది. సృష్టిలో కనిపించే క్రమం, అందం, జ్ఞానం, ఉద్దేశ్యం అన్నీ సృష్టికర్త గురించి చెబుతున్నాయి. ఒక వస్తువుకు లేబుల్ ఉంటే దాన్ని ఎవరు తయారు చేశారో తెలుస్తుంది. అదే విధంగా సృష్టి కూడా తన సృష్టికర్తను సూచిస్తుంది. ఆ సృష్టికర్తకు సరైన పేరు “సృష్టికర్త“ లేదా “దేవుడు.”
ఇప్పుడు ఆ సృష్టికర్త యొక్క అస్తిత్వం గురించి చూద్దాం. కీర్తనలు 90:1-2 లో ఇలా వ్రాయబడింది:
“ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగముల నుండి యుగయుగముల వరకు నీవే దేవుడవు.” ఈ వచనాలు దేవుని గురించి ఎంతో గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాయి. దేవుడు సృష్టిలోని ఇతర వస్తువుల వలె ప్రారంభం కలిగినవాడు కాదు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. భూమి, ఆకాశం, పర్వతాలు, విశ్వం ఏర్పడకముందే ఆయన ఉన్నాడు. నిన్న, నేడు, ఎప్పటికీ అదే దేవుడు అంటే దేవుడు సృష్టించబడినవాడు కాదు; ఆయననే సమస్త సృష్టికి కారణమైన సృష్టికర్త. ఆయన నిత్యుడు, స్వయంభువు, ఎప్పటినుండో ఉన్నవాడు. దేవుని నిత్యత్వం మరియు అస్తిత్వం గురించి బైబిల్ ఇచ్చిన ఈ ప్రకటన చాలా స్పష్టమైనది, సంపూర్ణమైనది, నిస్సందేహమైనది.
ఆ సృష్టికర్త సృష్టింపబడిన వాడు కాదు కాబట్టే ఆయనను Supreme Being అని అంటే దేవుడని పిలుస్తున్నాం. బైబిలులోని మొదటి వచనం ఆదికాండము 1:1, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని తెలియజేస్తుంది. ఈ చిన్న వచనం దేవుని గురించి ఎన్నో గొప్ప సత్యాలను తెలియజేస్తుంది. 1. ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడని, (ఆయన ప్రమాదవశాత్తు ఉద్భవించిన వాడు కాడని; ఆయన ఉనికికి మరొక కారణం లేదని; ఆయన స్వయం అస్తిత్వం ఉన్నవాడని (Self-Existent); ఆయన సంపూర్ణ స్వయం సమృద్ధిగల వాడని; సంపూర్ణ స్థిరత్వం ఉన్నవాడని; ఆయనకు జీవించడానికి ఎవరి సహాయం అవసరం లేదని; ఆయన అదృశ్యుడని); 2. ఆయన పులింగమని త్రిత్వమని, (అవిభాజ్యుడని), దేవుడు వ్యక్తిత్వం కలిగినవాడని, బైబిల్ ఆయనను వ్యక్తిగత దేవునిగా పరిచయం చేస్తుంది. అంతేకాక, బైబిల్ మొత్తం ప్రకారం ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే త్రిత్వ దేవుడు, అయినప్పటికీ ఒకే దేవుడని; 3. ఆయన సర్వశక్తిమంతుడని, (ఒక ప్రదేశానికే పరిమితం కాకుండా ప్రతి ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉన్నవాడని; ఆయన అనంతుడని; ఆయన ఏ రూపాన్ని అయినా తీసుకోగలడని; ఆయన నిత్యుడని; ఆయనను సమయం లేదా స్థలం బంధించలేదని; ఆయనను కొలవలేమని; ఆయన సద్గుణాలలో, సమర్థతలో, దృష్టి జ్ఞానంలో మరియు శక్తిలో మాత్రమే కాకుండా, ఆయన తన దైవికమైన స్వభావంలో, వ్యక్తిగత స్వభావములో కూడా అనంతము; అపారము; మరియు పరిపూర్ణుడైయున్నాడని); ఆదికాండము 17:1; లూకా 1:37; మత్తయి 19:26 వచనాలు ఆయనకు ఏదియు అసాధ్యము కాదని సమస్తమును సాధ్యమని చెప్తున్నాయి. 4. శూన్యము నుండి ఇప్పుడు మనం చూస్తున్న సమస్తమును ఆయన సృజించాడని, (ఆయన సృష్టికర్తయైయున్నాడని), ఆయన లేకుండా ఏదీ ఉనికిలోకి రాలేదని; 5. సృష్టిలో కనిపించే అద్భుతమైన క్రమం, సంక్లిష్టత, సమన్వయం దేవుని అపార జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రతి జీవి, ప్రతి వ్యవస్థ, ప్రతి ప్రకృతి నియమం వెనుక మహాజ్ఞాని అయిన సృష్టికర్త ఉన్నాడని చూపుతున్నాయి.; 6. దేవుడే జీవానికి మూలం. జీవం ఆయన నుండే వచ్చింది. ప్రతి ప్రాణి ఆయనపై ఆధారపడి జీవిస్తుంది. ఈ సత్యాలన్నింటిని బట్టి దేవుడు సాధారణమైన వ్యక్తి కాదని, ఆయన అసాధారణమైనవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, నిత్యుడు, సమస్త సృష్టికి మూలకారణమైన సృష్టికర్త అని మనకు స్పష్టమవుతుంది.
ఇంత అసాధారణమైన దేవుడు ఎలా ఉంటాడు? ఆయన రూపం ఏమిటి? అనే ప్రశ్న మనకు సహజంగానే రావచ్చు.
బైబిల్ దీనికి స్పష్టమైన జవాబు ఇస్తుంది. యోహాను 4:24 లో, “దేవుడు ఆత్మయై యున్నాడు” అని చెప్పబడింది. అంటే దేవునికి మనుష్యుల వలె భౌతిక శరీరం లేదు. ఆయన పదార్థంతో తయారైనవాడు కాదు. ఆయన భాగాలతో కూడినవాడు కాదు. ఆయన సృష్టిలోని వస్తువుల వలె పరిమితమైనవాడు కాదు.
అదే సత్యాన్ని యిర్మీయా 23:24 కూడా తెలియజేస్తుంది: “నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగల వాడెవడైన కలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా?” అని యెహోవా సెలవిచ్చాడు. ఈ వచనం దేవుడు ఒకే చోట మాత్రమే ఉండేవాడు కాదని, ఆయన సమస్త స్థలాలలో ఉన్నాడని తెలియజేస్తుంది. ఆయన ఉనికి ఆకాశమంతా, భూమంతా వ్యాపించి ఉంది. అందువల్ల ఎవ్వరూ ఆయనకు దూరంగా ఉండలేరు లేదా ఆయన నుండి దాగలేరు.
అలాగే యోబు 12:13 ఇలా చెబుతుంది: “జ్ఞానశౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి; ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు“, అంటే దేవుడు అపారమైన జ్ఞానం, శక్తి, వివేకం కలిగినవాడు. ఆయన చేసే ప్రతి పని పరిపూర్ణ జ్ఞానంతో, ఉద్దేశ్యంతో ఉంటుంది.
కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడు ఆత్మస్వరూపి, సర్వవ్యాపి, సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు. ఆయన మన కంటికి కనిపించకపోయినా, ఆయన ఉనికి, జ్ఞానం, శక్తి ఈ సృష్టి అంతటా స్పష్టంగా కనిపిస్తాయి.
బైబిల్ దేవుని గురించి మరొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. మలాకీ 3:6 లో దేవుడు, “నేను యెహోవాను, నేను మార్పులేనివాడను” అని చెబుతున్నాడు. అంటే దేవుడు పరిపూర్ణుడు. ఆయన స్వభావంలో, జ్ఞానంలో, శక్తిలో లేదా గుణాలలో ఎలాంటి లోపం లేదు. అందువల్ల ఆయన మారవలసిన అవసరమే లేదు. సృష్టి జరిగినా, ప్రపంచం మారినా, దేవుడు మాత్రం ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాడు. ఆయన నిత్యుడు మరియు శాశ్వతుడు.
అలాగే దేవుడు సర్వజ్ఞుడు. యోహాను 21:17 ప్రకారం ఆయన సమస్తమును ఎరిగినవాడు. గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు దాగి ఉన్నది ఏదీ లేదు.
దేవుడు పరిశుద్ధుడు కూడా. లేవీయకాండము 19:2 లో, “నేను పరిశుద్ధుడను” అని ఆయన ప్రకటిస్తున్నాడు. అంటే ఆయనలో పాపం, చెడు, అన్యాయం ఏమాత్రం లేవు.
ద్వితీయోపదేశకాండము 32:4 ప్రకారం దేవుని కార్యాలన్నీ న్యాయమైనవి. ఆయన నిర్దోషి, నమ్మదగినవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన ఎప్పుడూ తప్పు చేయడు, అన్యాయం చేయడు.
అలాగే 2 తిమోతికి 2:13 మనకు దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేడని చెబుతుంది. ఆయన ఎల్లప్పుడూ విశ్వాసయోగ్యుడు. మనుష్యులు మారవచ్చు, కానీ దేవుడు తన వాగ్దానాలను ఎప్పుడూ మార్చడు.
కీర్తనలు 145:9 ప్రకారం దేవుడు అందరికీ ఉపకారి. ఆయన కనికరం తన సమస్త సృష్టిపై ఉంటుంది. ఆయన ప్రేమగలవాడు, దయగలవాడు, తన సృష్టి సంక్షేమాన్ని కోరుకునేవాడు.
నిర్గమకాండము 34:6-7 లో దేవుడు తనను తాను ఇలా పరిచయం చేసుకున్నాడు: “కనికరము గలవాడను, దయగలవాడను, దీర్ఘశాంతుడను, విస్తారమైన కృపాసత్యములు గలవాడను.” ఆయన పాపాలను, అపరాధాలను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే అదే సమయంలో ఆయన న్యాయవంతుడు కూడా. ఆయన పాపాన్ని నిర్లక్ష్యం చేయడు, దోషాన్ని దోషంగానే పరిగణిస్తాడు.
కాబట్టి బైబిల్ ప్రకారం దేవుడు మార్పులేనివాడు, సర్వజ్ఞుడు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, విశ్వాసయోగ్యుడు, దయగలవాడు, కనికరముగలవాడు మరియు కృపతో నిండినవాడు. ఈ గుణాలన్నీ ఆయనను పరిపూర్ణ దేవునిగా మనకు పరిచయం చేస్తున్నాయి.
మొదటి ఆర్టికల్‌లో మనం పరిశీలించిన అంశాలు ఈ రెండవ ఆర్టికల్‌లో పరిశీలించిన అంశాలను బట్టి దేవుని ఉనికిని గురించి ప్రతి ఒక్కరం నిర్ధారణకు వచ్చినట్లే కదండి. ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
“దేవుడు ఒక్కడే అయితే ప్రపంచంలో ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయి?” అనే ప్రశ్న చాలామందికి వస్తుంది.
బైబిల్ ప్రకారం, దేవుడు తన గురించి కొంత జ్ఞానాన్ని మనుష్యులకు తెలియజేశాడు. సృష్టి ద్వారా, మనస్సాక్షి ద్వారా, మరియు తన వాక్యం ద్వారా ఆయన తన ఉనికిని మరియు మహిమను వెల్లడించాడు. అయితే చాలామంది దేవుణ్ణి తెలుసుకునే అవకాశాన్ని పొందినా, ఆయనను దేవునిగా గౌరవించలేదు లేదా ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు.
రోమీయులు 1:21-23 ప్రకారం, మనుష్యులు తమ ఆలోచనలలో వ్యర్థులై, తమ హృదయాలను చీకటితో నింపుకున్నారు. తాము జ్ఞానులమని భావించినప్పటికీ, నిజానికి బుద్ధిహీనులయ్యారు. అక్షయుడైన దేవుని ఆరాధించడానికి బదులుగా, మనుష్యుల రూపాలు, జంతువులు, పక్షులు మరియు ఇతర సృష్టించబడిన వస్తువులను ఆరాధించడం ప్రారంభించారు.
దేవుడు వెల్లడించిన సత్యాన్ని అంగీకరించి దానికి లోబడటానికి బదులుగా, అనేక మంది తమ స్వంత ఆలోచనలతో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఫలితంగా అనేక రకాల విశ్వాసాలు, సిద్ధాంతాలు, మరియు మతాలు ఏర్పడ్డాయి. ఈ ప్రయత్నాలు దేవుని నిజమైన జ్ఞానానికి దారి తీయకుండా, చాలాసార్లు సత్యం నుండి దూరం చేస్తాయి.
ఇంకా మనుష్యుల ఆలోచనలు, అభిప్రాయాలు, సంస్కృతులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువల్ల దేవుని గురించి వారి అభిప్రాయాలు కూడా మారుతుంటాయి. ఈ మార్పులు కూడా వివిధ మతాలు మరియు భిన్నమైన బోధనలు ఏర్పడడానికి కారణమయ్యాయి.
మరికొందరు నిజమైన ఆనందం మరియు పరిపూర్ణ శ్రేయస్సు దేవునిలోనే దొరుకుతాయని నమ్ముతారు. కానీ వారు దేవుడు చూపించిన మార్గాన్ని అనుసరించకుండా, తమకు నచ్చిన ఆధ్యాత్మిక మార్గాల ద్వారా ఆయనను వెతుకుతారు. ఫలితంగా భిన్నమైన మతపరమైన ఆచారాలు మరియు నమ్మకాలు పుట్టుకొస్తాయి.
అలాగే కొందరికి మనుష్యులకంటే ముందే ఉన్న, నిత్యమైన, మార్పులేని దేవుడు ఉన్నాడనే ఆలోచనను అంగీకరించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల వారు దేవుని గురించి వేరే వివరణలను తయారు చేసుకుంటారు.
కాబట్టి ప్రపంచంలో ఇన్ని మతాలు ఉండటానికి ప్రధాన కారణం దేవుడు ఒక్కడే కాకపోవడం కాదు; మనుష్యులు దేవుని గురించి ఉన్న సత్యాన్ని భిన్నంగా అర్థం చేసుకోవడం, తిరస్కరించడం, లేదా తమ స్వంత మార్గాలను ఏర్పరచుకోవడం. బైబిల్ ప్రకారం, నిజమైన దేవుడు ఒక్కడే అయినప్పటికీ, మనుష్యుల వివిధ ఆలోచనలు మరియు ప్రతిస్పందనల వల్ల అనేక మతాలు ఏర్పడ్డాయి.
దేవుడు తన గురించి మనుష్యులకు తెలియజేసినప్పటికీ, కొందరు “దేవుడు లేడు” అని చెబుతారు. దీనిని నాస్తికత్వం (Atheism) అంటారు. బైబిల్ ప్రకారం ఇది విచారకరమైన విషయం, ఎందుకంటే దేవుని ఉనికి సృష్టి ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ చాలామంది దానిని తిరస్కరిస్తారు (రోమీయులు 1:19-20).
అలాగే కొందరు ఒకే నిజమైన దేవుణ్ణి అనేక దేవుళ్లుగా విభజించి ఆరాధిస్తారు. దీనిని బహుదేవతారాధన (Polytheism) అంటారు. బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే. అయినప్పటికీ మనుష్యులు తమ స్వంత ఆలోచనల ప్రకారం అనేక దేవతలను సృష్టించుకొని ఆరాధిస్తున్నారు.
మరికొందరు “సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడే” అని నమ్ముతారు. చెట్లు, పర్వతాలు, నదులు, జంతువులు, ప్రకృతి శక్తులు అన్నీ దేవుని భాగాలే లేదా దేవుడే అని భావిస్తారు. దీనిని సర్వదేవతావాదం (Pantheism) అంటారు. కానీ బైబిల్ దేవుణ్ణి సృష్టికర్తగా, సృష్టిని ఆయన సృష్టిగా వేరు చేస్తుంది.
ఇంకొందరు దేవుడు, ఆత్మ, నిత్యజీవం వంటి విషయాలను తిరస్కరిస్తారు. వారికి ఈ విశ్వంలో పదార్థం మరియు శక్తి మాత్రమే నిజమైనవిగా కనిపిస్తాయి. దీనిని భౌతికవాదం (Materialism) అంటారు. వారు భౌతిక సంపద, సుఖాలు, మరియు ఈ లోక జీవనానికే ప్రాముఖ్యత ఇస్తారు. అయితే బైబిల్ మనిషి కేవలం భౌతిక జీవి కాదని, ఆత్మీయ అవసరాలు కూడా ఉన్నాయని బోధిస్తుంది. Materialism అనేది విగ్రహారాధన. అది ఎప్పుడూ దైవభక్తికి మనుష్యులను నడుపదు. ఈ విషయాన్నే బైబిలు 1 తిమోతికి 6:9,10 నందు తెలియజేస్తూ ఉంది.
మరికొందరు జీవితంలో జరిగే ప్రతిదీ ముందే నిర్ణయించబడిందని నమ్ముతారు. మన ప్రయత్నాలు లేదా నిర్ణయాలకు విలువ లేదని, “జరగాల్సింది జరుగుతుంది” అని భావిస్తారు. దీనిని విధివాదం (Fatalism) అంటారు. కానీ బైబిల్ మనుష్యులను బాధ్యతగల వ్యక్తులుగా చూపిస్తుంది.
ఇంకొందరు దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడం అసాధ్యం అంటారు. దీనిని అజ్ఞేయవాదం (Agnosticism) అంటారు. వారు దేవుని గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేమని నమ్ముతారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రపంచంలో దేవుని గురించి అనేక రకాల బోధనలు, అభిప్రాయాలు, మరియు విశ్వాసాలు ఉన్నాయి. ప్రతి సంస్కృతి, ప్రతి సమాజం, ప్రతి కాలం తనదైన ఆలోచనలను అభివృద్ధి చేసుకుంది.
అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న: దేవుని గురించి మనకు నచ్చిన విధంగా అభిప్రాయాలను ఏర్పరచుకోవడం సరైనదేనా? సృష్టికర్త గురించి నిజం ఏమిటో తెలుసుకోకుండా కేవలం మన ఊహలు, సంప్రదాయాలు, లేదా వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడటం సరైనదేనా?
మరొక ప్రశ్న: ఈ విశ్వం యాదృచ్ఛికంగా ఉనికిలోకి వచ్చిందా? లేక దాని వెనుక జ్ఞానవంతుడైన సృష్టికర్త ఉన్నాడా? సృష్టిలో కనిపించే అద్భుతమైన క్రమం, సంక్లిష్టత, మరియు ఉద్దేశ్యం చూస్తే ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఆలోచించాలి.
చివరగా, మన సైన్స్, తర్కం, మరియు మానవ ఆలోచనలు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. కానీ అవి మాత్రమే దేవుని సంపూర్ణంగా తెలియజేయలేవు. బైబిల్ ప్రకారం నిజమైన దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి, ఆయన పేరు ఏమిటి, మరియు మన రక్షణ కోసం ఆయన ఏమి చేశాడు అనే విషయాలను దేవుడే తన వాక్యమైన పరిశుద్ధ గ్రంథం ద్వారా వెల్లడించాడు.
అందువల్ల నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలంటే మన ఊహలపై కాదు, దేవుడు తన గురించి ఇచ్చిన ప్రకటనపై ఆధారపడాలి. బైబిల్ అదే ప్రకటనను మనకు అందిస్తుంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో అందరికి (అన్ని భాషలలో ప్రపంచమంతటికి) అందించాలనే ఉద్దేశ్యంలో చేస్తున్న ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి, చేయూతనివ్వండి. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి నా ఈ పరిచర్యను గురించి ప్రార్ధించండి, దేవుడు మిమ్మును దీవించును గాక – రెవ. కూరపాటి విజయ్ కుమార్. ఫోన్ పే యూపీఐ ఐడి – 9848365150-2@ybl
KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl
