దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు?

ఆదికాండము 6:1-2 వచనాలను చదువుకొందాం: నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి అను మాటలలో పేర్కొనబడిన “దేవుని కుమారులు” అంటే ఎవరు?

దేవుని కుమారులు ఎవరు అనే విషయమై ఎన్నో ప్రతిపాదనలైతే వున్నాయి 1) కొందరు పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులంటే అని అభిప్రాయపడుతున్నారు. 2) మరికొందరు వాళ్ళు శక్తివంతమైన మానవ పాలకులు అని అభిప్రాయ పడుతున్నారు 3) మరికొందరు వాళ్ళు దైవభక్తిగల షేతుయొక్క వారసులు అని అభిప్రాయపడుతున్నారు. 4) ప్రాచీనమైన కొన్ని మత పురాణాలలో కొందరు దేవుళ్ళు మానవ స్త్రీలతో సంభోగం చేయడం గురించి చెప్పుటను బట్టి కొందరు ఈ మాటలను మైథలాజికల్ వర్డ్స్ గా పరిగణిస్తూ కొట్టిపారేస్తూవున్నారు. ఇలా ఎన్నో ప్రతిపాదనలు వున్నాయి.

కొందరు పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులంటే అని ఎందుకని చెప్తూవున్నారంటే యోబు 1:6లో దేవదూతలు అనే మాటకు మూలభాషలో (ఫుట్ నోట్స్ లో) దేవునికుమారులు అని వుంది చూడండి; యోబు 38:7; కీర్తన 29:1 ప్రకారము పాతనిబంధనలో “దేవుని కుమారులు” అనే మాట దేవదూతలను సూచిస్తూ వుంది కదా అని చెప్తూ, మత్తయి 22:30వ వచనాన్ని కోట్ చేస్తూ, పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు అను మాటలను చూపిస్తూ, “దేవదూతలు వివాహం చేసుకోలేరు” అని ఈ వచనం చెప్పటంలేదు దేవదూతలు వివాహం చేసుకోరని మాత్రమే చెప్తూ వుంది. అదికూడా “పరలోకంలో ఉన్న దేవదూతలను” గురించి మాత్రమే ఈ వచనము మాట్లాడుతూ ఉంది. మరి భూమి మీదికి పడద్రోయబడిన సాతాను వాని దూతల సంగతేంటి? వీళ్ళు దేవుడు సృష్టించిన క్రమాన్ని పట్టించుకోకుండా దేవుని ప్రణాళికకు భంగం కలిగించే విధంగా నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొని ఉండొచ్చు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ పడిపోయిన దేవదూతలే దేవునికుమారులనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.  

పడిపోయిన దూతలు నరుల కన్యకలు వివాహమాడకూడదని బైబులు నిషేదించలేదు కదా అని తర్కిస్తూ వుంటారు.  పడిపోయిన దేవదూతలే దేవుని కుమారులని ఒప్పుకుంటే ఒక సమస్య ఉందండి. దేవదూతలకు లింగం ఉందని గాని పునరుత్పత్తి చేయగలరని గాని నమ్మడానికి బైబిల్ ఎటువంటి కారణాన్ని ఇవ్వటం లేదు. అంతేకాదండి మానవ స్త్రీలతో పడిపోయిన దేవదూతల వికృతమైన వివాహం మాత్రమే భూమిపైకి మహా జలప్రళయమును తెచ్చిందని వారి అభిప్రాయాన్ని వాళ్ళు సమర్ధించుకొంటూ ఉన్నారు.

దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి అను మాటలలో పడిపోయిన దేవదూతలు నరుల కుమార్తెలను వివాహము చేసికొనిరి అనే ఆలోచనను అంటే వీరిరువురి మధ్యన ఏర్పడిన లైంగిక సంబంధాన్ని గురించి ఈ వచనము మాట్లాడుతుందని నేను అనుకోవడం లేదు, నేను నమ్మను. ఎందుకనో నేను వివరిస్తాను.

కష్టమైన ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిధ్ధాం. “దేవుని కుమారులు” అనే మాట కొన్నిసార్లు దేవదూతలను సూచించడానికి ఉపయోగించబడిందని మనం ఆలకించియున్నాం. మరైతే మత్తయి 5:9లో సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు అని వుంది కదా మరి దీనిని ఎలా అర్ధం చేసుకొందాం. ఈ మాటల ద్వారా అర్ధంఔతున్న విషయమేమిటంటే, ది కాన్సెప్ట్ అఫ్ డివైన్ సన్ షిప్ అనేది ఎల్లప్పుడూ బయోలాజికల్ రిలేషన్షిప్ తో ముడిపడియుండదని బదులుగా ఇది ప్రధానంగా కొందరు దేవునితో వాళ్ళు కలిగియున్న రిలేషన్షిప్ ఆఫ్ ఒబిడియన్స్ గురించి తెలియజేస్తూ ఉందని అర్ధం ఔతూవుంది. అంటే ఆదికాండము 6 సింపుల్ గా విశ్వాసులైన దేవునికుమారులు అవిశ్వాసులైన నరుల కుమార్తెల మధ్య జరిగిన వివాహాలను గురించి మాట్లాడుతూవుంది. బైబులు కూడా ఈ విషయాన్నే సపోర్ట్ చేస్తూవుంది. వివరిస్తాను.

ఆదికాండము 3 తరువాత ఆదాము కుటుంబము కయీను షేతు అను రెండు ఫామిలీ లైన్స్ గా విడిపోయింది. ఆదికాండము 4 విస్తరిస్తున్న కయీను సంతానము యొక్క దుష్టత్వాన్ని గురించి తెలియజేస్తూ వుంది చూడండి.  ఆ లైన్లో కయీను తరువాత ప్రధానమైన మరొక వ్యక్తి లెమెకు. ఇతడు ఇద్దరు భార్యలను కలిగియున్న మొదటి వ్యక్తి, అట్లే ఇతడును నరహంతకుడు. 

దీనికి విరుద్ధంగా, ఆదికాండము 5 విస్తరిస్తున్న షేతు సంతానము యొక్క దేవునియందలి భయభక్తులను గురించి తెలియజేస్తూ వుంది చూడండి. ఈ లైన్లో షేతు తరువాత ప్రధానమైన మరొక వ్యక్తి హనోకు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను అని ఆదికాండము 5:24 చెప్తూవుంది. అట్లే షేతు వంశంలో నోవహు కూడా జన్మించాడు, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు అని ఆదికాండము 6:9 చెప్తూవుంది. ఈ రెండు వంశావళులను చూసినట్లయితే ఒకటి దేవునికి విధేయత చూపుతూ వుంది మరొకటి ఉద్దేశపూర్వకంగా దేవునికి అవిధేయతను చూపుతూవుంది.

దైవభక్తిగల షేతు వారసులు దైవభక్తిలేని కయీను వారసులు వివాహమాడకూడదని బైబులు ఏమి నిషేదించ లేదు కాబట్టి, చాలా మంది హీబ్రూ పండితులు ఆదికాండము 6:1-2 వచనాలు దేవదూతలు మరియు మానవ స్త్రీల వివాహాన్ని కాకుండా కయీను షేతు వారసుల మధ్యలో జరిగిన intermarriages గురించి చెప్తూవుందని నమ్ముతారు.

ఈ రెండు వంశావళులు కలిసినప్పుడు, అకస్మాత్తుగా, ప్రతి ఒక్కరూ చెడులో చిక్కుకున్నారు. కాబట్టే నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవాచూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఆదికాండము 6:5,6 వచనాలు తెలియజేస్తూ వున్నాయి. బైబులు ఇంత స్పష్టముగా ఉంటే దేవుని కుమారులంటే పడిపోయిన దేవదూతలే అని అభిప్రాయపడడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి.

“దేవుని కుమారులు” మరియు “నరుల కుమార్తెలు” అనే పదాలు పడిపోయిన దేవదూతలు  మరియు భూలోక జీవుల మధ్య ఏర్పడిన లైంగిక సంబంధము గురించి చెప్తూవున్నాయి అని ఊహించి చెప్పడానికి లేఖనాలు మనలను అనుమతిస్తున్నాయా? ఇలాంటి కష్టమైన వచనాన్ని అర్ధం చేసుకొనేటప్పుడు లేఖనము యొక్క విస్తృత పరిధిలో భాష ఎలా వాడబడిందో మనం మొదటిగా అర్ధం చేసుకోవలసి వున్నాం. లేఖనాల ద్వారా లేఖనాలు వివరించబడాలనే ప్రాముఖ్యమైన సూత్రాన్ని మరచిపోకండి.