నీకోదేము అంటే ఎవరు? @Kurapati Vijay Kumar – A voice of a shepherd
description
నీకొదేము ఎవరు?
- నీకొదేము రిలీజియస్ ప్రొఫెషన్ ఏంటి?
- ఆనాటి సమాజములో నీకొదేము అఫిషియల్ పోసిషన్ ఏంటి?
- సన్హెడ్రిన్ లో ఒక సభ్యునిగా ఉండాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటి?
- టాల్ముడిస్ట్‌లు నీకొదేమును గురించి యేమని చెప్పారు?
- యోహాను నీకొదేమును గురించి ఎందుకని తన సువార్తలో పేర్కొన్నాడు?
- నీకొదేము యేసు దగ్గరకు రాత్రిపూట రహస్యంగా ఎందుకని వచ్చివుంటాడు?
- యేసుపట్ల నీకొదేముకు ఉన్న అభిప్రాయము ఏంటి?
- నీకొదేము ఒంటరిగా యేసుని యొద్దకు వచ్చాడా లేదా అతనితో పాటు ఎవరన్నా వచ్చారా?
- నీకొదేము రాకడ వెనుక ఉన్న ఉదేశ్యము ఏమైవుండొచ్చు?
- బోధకుడా అనే సంబోధన వెనుక నీకొదేము ఉదేశ్యము ఏమైవుండొచ్చు?
- ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని చెప్పడంలో యేసుని ఉదేశ్యము ఏంటి?
- వారి సంభాషణలో ఉన్న ప్రాముఖ్యమైన సిద్ధాంతములు ఏంటి?
- యోహాను 7:45-53లో నీకొదేము యేసు కొరకు బహిరంగముగా ఏం చేసాడు?
- యోహాను 19:39లో నీకొదేము యేసు కొరకు బహిరంగముగా ఏం చేసాడు?
యోహాను3:1,2 యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను.
ఈ వచనాలనుబట్టి నీకొదేము సాధారణమైన వ్యక్తి కాదని యూదులలో అత్యంత కఠినమైన శాఖ అయిన పరిసయ్యుల శాఖకు చెందినవాడని వీళ్ళు యేసుకు శత్రువులని లేఖనాలు చెప్తూవున్నాయి.
నీకొదేము పరిసయ్యుడు. అతని అధికారిక స్థానం యూదుల అధికారి, యెరూషలేములో అధికారంలో ఉన్న వ్యక్తి. క్రీస్తు కాలంలో, యెరూషలేములోని సన్హెడ్రిన్ ఇశ్రాయేలీయులకు సుప్రీమ్ కోర్ట్ లాంటిది. ఆ గ్రేట్ సన్హెడ్రిన్ సభలో నీకొదేము ఒక సభ్యుడని తెలుస్తోంది. సన్హెడ్రిన్ లో ఒక సభ్యునిగా ఉండాలంటే ఒకడు ధనవంతుడై ఉండాలి, విద్యావంతునిగా ఉండాలి, న్యాయ పరిపాలనలో శిక్షణ తీసుకొనిన వానిగా, బాగా అభివృద్ధిచెంది, పరిణితి కలిగిన వ్యక్తిగా, అన్ని విభాగాలలో పరిపూర్ణంగా, పాత నిబంధన లేఖనాలను బాగా ఎరిగిన ఒక పండితునిగా ఉండాలి.
నీకొదేము సహోదరుడైన జోసెఫ్ బెన్ గురియన్ రోమన్ జ్యూయిష్ హిస్టోరియాన్ మరియు పేరెన్నికగన్న మిలట్రీ లీడర్. నీకొదేము కుటుంబము సమాజములో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రభావవంతమైన ధనికమైన కుటుంబము అని చెప్పొచ్చు.
టాల్ముడిస్ట్‌లు జెరూసలేంలోని ముగ్గురు ధనవంతులలో నీకొదేము ఒకరు అని చెప్తారు. నీకొదేము యేసు శరీరాన్ని ఖననానికి సిద్ధం చెయ్యడానికి యోహాను19:39-40 తెచ్చిన సుగంధద్రవ్యములు (డ్రై స్పైసెస్) చాలాచాలా ఖరీదైనవి. అవి అతడు చాలాచాలా ధనవంతుడనే విషయాన్ని తెలియజేస్తూవున్నాయి. టాల్ముడిస్ట్‌ల ప్రకారము నీకొదేము ఎంతటి ధనవంతుడంటే, అతడు తన కుమార్తెకు కట్నం క్రింద వెయ్యి వేల బంగారు దేనారాలు ఇచ్చాడట. ఆమె మంచం ఖరీదు పన్నెండు వేల బంగారు దీనారాలట; ప్రతివారం ఒక టైరియన్ గోల్డెన్ దీనారులు ఆమెకు ఇష్టమైన ఒక నిర్దిష్ట రకమైన సూప్ కోసం ఖర్చు చేయబడేవట; ఆమెకు ప్రతిరోజు సుగంధ ద్రవ్యాల కోసం నాలుగు వందల బంగారు దీనారాలు ఖర్చయ్యేవట. వీటిని బట్టి నీకొదేము ఎంతటి ధనవంతుడో ఆలోచించండి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి యేసుని వద్దకు వచ్చి ఆయనతో సంభాషణను కోరుకోవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ వుంది. యేసుని సందర్శించిన వారిలో అత్యుత్తమ సందర్శకుడు ఇతడేనని మనం చెప్పొచ్చు.
యోహాను నీకొదేమును గురించి ఎందుకని తన సువార్తలో పేర్కొన్నాడు? అనే ప్రశ్నకు యేసే మెస్సయ్య అని యేసుని పరిచర్య ప్రారంభములోనే ఆయన చేసిన సూచకక్రియలను బట్టి నమ్మి ఆ విశ్వాసమును అంతమువరకు నిలుపుకొన్న యూదుల అధికారి యెరూషలేములోని గ్రేట్ సన్హెడ్రిన్ సభలో సభ్యుడైన ఒకనిని గురించి యోహాను తన సువార్తలో పేర్కొంటూ, క్రీస్తు అనుచరులందరూ పామరులని అజ్ఞానులని అనుకోకండి, వారిలో ఉన్నత విద్యావంతులు, జ్ఞానులు, ధనవంతులు సమాజములోని అన్నితరగతుల వాళ్ళు ఉన్నారని, క్రీస్తును ఎంతగానో ద్వేషించిన పరిసయ్యులలో నుండి కూడా కొందరు యేసే మెస్సయ్య అని నమ్మిన విషయాన్ని చెప్పడానికే నీకొదేమును గురించి యోహాను తన సువార్తలో పేర్కొన్నాడు.
నీకొదేము యేసు దగ్గరకు రాత్రిపూట రహస్యంగా ఎందుకని వచ్చివుంటాడు? యేసుని కాలములో మెస్సయ్య రాకడ కొరకు యూదులు ఎదురు చూస్తూ వున్నారు, అలాంటి పరిస్థితులలో యేసు అద్భుతాలను చేస్తూవుంటే, యూదుల అధికారులు వాటిని గమనిస్తున్నట్లుగా నీకొదేము మాటలను బట్టి మనకు అర్ధంఔతూవుంది.
సన్హెడ్రిన్ తరపున ప్రతినిధిగా నీకొదేము నియమింపబడి ఉండొచ్చని యేసు చెప్పేది వినడానికి బహిరంగంగా ఆయనను ఆహ్వానించడానికి బదులుగా పరిసయ్యులు ఆయనపట్ల తమకుగల అభిప్రాయాలను రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకొని రాత్రిపూట తమ అధిపతుల్లో ఒకరిని యేసుని భోధలలో ఉన్న పరమార్ధాన్ని ప్రశ్న జవాబుల రూపములో తెలుసుకోవడానికి యేసువద్దకు రహస్యముగా పంపించి ఉండొచ్చని కొందరి అభిప్రాయము.
నిజానికి నీకొదేము మాటలను బట్టి, యేసు బోధలు సూచకక్రియలు నీకొదేమును ఎంతగానో ఆకట్టుకొనుటను బట్టి అతడు సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో పరిసయ్యులకు భయపడి రాత్రిపూట రహస్యంగా వచ్చాడని చెప్పొచ్చు.
సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో అంటే,
- వారి పాఠశాలల్లో చదువు కోని, వారి అధికారంతో పంపబడని, వడ్రంగి మూలం ఉన్న ఒక వ్యక్తి, వారి వ్యవస్థల్లో చేర్చని సిద్ధాంతాలను బోధిస్తూ, వారిని వారి వ్యవస్థలను సవాలు చేస్తూ చేస్తూవున్న అద్భుతాలను బట్టి సత్యమును తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో, అతడు యేసుతో స్వేచ్ఛగా ఒంటరిగా మాట్లాడటానికి వచ్చాడు.
- మనుష్యులు కొత్త మతాన్ని సులభముగా స్వీకరించడం మనలను ఆశ్చర్యపరచదు. ఎందుకంటే కొంతమంది వచ్చిన ప్రతి భోదకుని వెంట పోతూవుంటారు కాబట్టి. నీకొదేము అలా కాదు. జుడాయిజం దేవునికి చెందినదని, జుడాయిజం మెస్సీయను ప్రవచించిందని అతనికి తెలుసు, దానితో క్రీస్తు సరిపోలటం లేదు. కాని యేసు చేసే అద్భుతాలు ఆయన మిషన్‌ను ప్రమాణీకరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనను అంగీకరించే ముందు సత్యమేంటో ఆయన ద్వారానే తెలుసుకోవాలనే ఉద్దేశ్యముతో, అతడు యేసుతో స్వేచ్ఛగా ఒంటరిగా మాట్లాడటానికి వచ్చాడు.
- పాత నిబంధన యొక్క వాస్తవికతలో దాని పరిపూర్ణతను నెరవేర్పును యేసు దేవునియొద్ద నుండి వచ్చిన బోధకుడని ఎన్నోవిశిష్టమైన రుజువులతో నిరూపిస్తూ ఉండుటను బట్టి ఆయన నుండే సత్యాన్ని వ్యక్తిగతముగా తెలుసుకోవాలను కొంటున్నాడు.
నీకొదేము యేసుని వద్దకు రాత్రిపూట రావడానికి ఇంకా ఏవన్నా కారణాలు ఉండొచ్చా:
- యేసు రోజంతా ప్రజా సేవలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి పగటి పూట జరిగే ఆయన పరిచర్యకు అంతరాయం కలిగించటం అతనికి ఇష్టం లేకపోవచ్చు. నీకొదేము కూడా పగలంతా తన పనిలో బిజీనే. కాబట్టే అతడు రాత్రిని ఎన్నుకొని ఉండొచ్చు.
- అలాగే తన రాకడవల్ల మాటలవల్ల యేసుకు ప్రధాన యాజకులనుండి పరిసయ్యులనుండి ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉదేశ్యముతో ఎవ్వరికి తెలియకుండా అతడు యేసుని దగ్గరకు వచ్చి ఉండొచ్చు.
- మరికొందరు ఇతడు బహిరంగముగా యేసుని అనుచరునిగా ఉండటానికి భయపడ్డాడని సిగ్గుపడ్డాడని కాబట్టే రాత్రిపూట రహస్యంగా యేసుని దగ్గరకు వచ్చియుండొచ్చు అని చెప్తారు.
అట్లే దేవుడు నీకు తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పడం దేవునినుండి వచ్చిన ఈ బోధకుడు మెస్సయ్య అను తన నమ్మికను ధృవీకరించు కోవడానికే నీకొదేము యేసు దగ్గరకు రాత్రిపూట రహస్యంగా వచ్చాడని స్పష్టముగా తెలియజేస్తూవుంది.
నీకొదేము ఒంటరిగా యేసుని యొద్దకు వచ్చాడా లేదా అతనితో పాటు ఎవరన్నా వచ్చారా అనే ప్రశ్నకు యూదుల నియమావళి ప్రకారం ఈ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లడమంటే అది ఎన్నో అనుమానాలకు తావిస్తోంది కాబట్టి నీకొదేము ఒంటరిగా యేసుని దగ్గరకు వచ్చి ఉండడు.
నీకొదేము రాకడ వెనుక ఉన్న ఉదేశ్యము
- యూదుల అధికారిగా ఇతడు రాజకీయాలు రాజ్య వ్యవహారాల గురించి యేసుతో మాట్లాడటానికి రాలేదు తన స్వంత ఆత్మ దాని మోక్షం గురించి మాట్లాడటానికి తనకు అనుకూలమైన సమయాన్ని ఎన్నుకొని యేసుని యొద్దకు వచ్చియున్నాడని చెప్పొచ్చు.
- అంతేనా యేసుని రాకడ యొక్క ఉదేశ్యము గురించి తెలుసుకోవడమే కాకుండా ఆయన బోధలేమిటో తెలుసుకోవడం నీకొదేము యొక్క ఉదేశ్యము అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే యేసు నీకొదేముల మధ్యన జరిగిన సంభాషణ ఇదే విషయాన్ని యోహాను 3:3-21 వచనాలలో తెలియజేస్తూవుంది.
- ఇతడు ఒక సత్యాన్వేషి వలె తెగువను చూపుతూ యేసుని యొద్దకు వచ్చాడు. ఇతడు భయపడి క్రీస్తు దగ్గరకు వచ్చి ఉంటే యేసు ఇతనిని మందలించి వుండేవాడు. సమస్తము తెలిసిన యేసుకు నీకొదేము హృదయములో ఏ ఆలోచన ఉందొ తెలియదా?
- నీకొదేము మెస్సయ్య విషయములో అతనికున్న కన్ఫ్యూషన్ తొలగించుకోవడానికి వచ్చాడు. యేసే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్న రాజా? ఆయనే ఆ రాజైతే ఆ దేవుని రాజ్యములోనికి ఎలా ప్రవేశించగలం అనేది అతని హృదయములో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్న ఎంతో లోతైనది.
ఆ క్రమములోనే నీకొదేము ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము; అంటే (నేనును నాతో పాటు వచ్చిన వీళ్ళు కూడా నమ్ముతున్నారు అని చెప్పడం కావొచ్చు). పరిసయ్యులలో అధికభాగం యేసును ద్వేషిస్తూ ఉన్నారు. వారిలో కొందరు యేసే మెస్సయ్య అని నమ్ముతున్నప్పటికిని వాళ్ళు వారికున్న కొన్ని కారణాలను బట్టి వాళ్ళు వాళ్ళ విధులలో కంటిన్యూ అవుతు వుండటాన్ని ఈ మాటలలో మనం చూడొచ్చు.
బోధకుడా అనే సంబోధన ప్రముఖంగా యూదుల మత పెద్దలను పిలిచే గౌరవప్రదమైన పిలుపు. యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని ఎన్నో విశిష్టమైన రుజువులతో నిరూపించుకొనియుండుటను బట్టి యూదుల అధికారిగా యూదుల సన్హెడ్రిన్ సభలో సభ్యునిగా యూదులకు భోధకుడైన నీకొదేము యేసును బోధకుడా అని గౌరవముతో సంబోధించడం అతడు యేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తూవుంది.
నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవనే మాటల ద్వారా నీకొదేము మాకు జీవన విధానాన్ని బోధించడానికి అర్హత అధికారంతో వచ్చినవాడా అని చెప్తూ ఒప్పుకొంటూ ఆయన మాటలను వినుటకు తన సంసిద్ధతను తెలియజేస్తూ ఆ బోధల ద్వారా తాను నిర్దేశించబడాలనే తన ఆశను వ్యక్తపరుస్తూవున్నాడు.
దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పడం అంటే దేవుడు ఒక మనిషికి అద్భుతం చేసే శక్తిని ఇస్తే, ఆ వ్యక్తి యొక్క బోధను దేవుడు ఆమోదించాడనడానికి అది రుజువు, ఆ అద్భుతం అతడు దేవుని నుండి వచ్చాడనుటకు రుజువు. కాబట్టే, నీవు చేసే సూచక క్రియలు దేవుడు మాత్రమే చెయ్యగలడు. కాబట్టే, నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము అని నీకొదేము ఆయనతో చెప్తూ వున్నాడు.
యేసు నీకొదేముతో రిడిల్స్ రూపములో సంభాషణను ప్రారంభించి సంక్షిప్తముగా మారుమనస్సు నొంది బాప్తిస్మము పుచ్చుకొనుము, దేవునిరాజ్యము సమీపించియున్నది అందుకై ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అలా చెప్పడానికి కారణమేమిటంటే, యూదులు మెస్సయ్య ఆయన రాజ్యం యొక్క ప్రత్యక్షతను ఆశించారు. యూదులలో ఆల్మోస్ట్ అందరూ వచ్చే మెస్సయ్య వారి రాజకీయ సామజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారిని ఇనుమడింపజేసేలా స్వర్ణయుగాన్ని తెస్తాడని ఆశించారు, ఎదురుచూస్తూ ఉన్నారే తప్ప అంతరంగములో దేవుని నీతి మరియు ఆయన కృపను గురించి ఏ ఒక్కరు ఆలోచించడం లేదు. ఈ స్వర్ణయుగం అనెడి కల వారిని వారి ఆత్మీయ జీవితాలలో గ్రుడ్డివారినిగా చేసింది. వాళ్ళు దేవుని కుమారుడు కృపాసత్య సంపూర్ణునిగా వారి మధ్యలోనికి వచ్చియున్నను వాళ్ళు గుర్తించలేని దౌర్భాగ్యమైన స్థితిలో వున్నారు. సిమియోను వంటి కొందరు మాత్రమే తమ పాపాల నుండి తమను రక్షించేవాని కోసం ఎదురుచూశారు.
కాబట్టే నీకొదేము క్రీస్తు వద్దకు వచ్చినప్పుడు, వారి సంభాషణలో, యేసు యూదుల ప్రాపంచికతను ప్రస్తావిస్తూ, మీరు మీ ప్రస్తుత నైతిక స్థితిలో దేవుని రాజ్యమును గురించి దాని విశిష్టతను గురించి ఆలోచించలేరు. మీరు అంతర్గతంగా మారితే తప్ప మీరు ఎప్పటికి దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. మీరు కొత్తగా జీవించడం ప్రారంభించాలి అంటే మీ నైతిక హృదయంలో మార్పు అవసరం. అంతరంగములో ప్రక్షాళన దైవిక ప్రభావంయొక్క అంతర్గత అనుభవం లేకుండా ఒకడు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం అసాధ్యం అని చెప్పాడు.
దేవుని రాజ్యం అంటే దేవుని పాలన. అందులో ప్రవేశించడం అంటే ఆయనకు లోబడి ఉండడం. క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ పాలన సార్వత్రికమైనది. అందరూ దానికి లోబడి ఉండాలి. ఈ రాజ్యంలో నీతిమంతుడు దయగల దేవుడు తన వ్యక్తిగత ప్రేమ సంకల్పంను బట్టి ఆయన తన ప్రజలను పాలిస్తూ వుంటాడు. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే కొత్త జన్మ ఉండాలి. అందుకు వారి మూలాల్లో మార్పు మాత్రమే చాలదు అందుకు క్రొత్త పునాది అవసరం. అందుకు రూపములో మార్పు చాలదు ఆత్మలో కూడా మార్పు అవసరం.
వారి సంభాషణలో ఉన్న ప్రాముఖ్యమైన సిద్ధాంతములు: మానవుని రక్షణ విషయములో త్రీయేక దేవుని చర్య, ఆత్మ పునరుజ్జీవింపజేయడం, కుమారుడు ప్రాయశ్చిత్తం చెయ్యడం, తండ్రి ప్రేమతో లోకాన్ని తిరిగి తనతో సమాధాన పర్చుకోవడం, దానిలో మనుష్యుని పాత్ర ఏమిలేకపోవడం, క్రొత్త జీవితం (మారుమనస్సు పశ్చత్తాపము), కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడని, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండుననేడివి.
నీకొదేమును గురించి యోహాను 7వ అధ్యాయము కూడా కొన్ని విషయాలను తెలియజేస్తూవుంది, చూడండి. యేసు గురించి ఏమి చెయ్యాలి అని సన్హెడ్రిన్ సభవారు ఆలోచిస్తు యేసుని బంధించి తెమ్మని ప్రధానయాజకులు పరిసయ్యులు బంట్రౌతులను పంపగా, ఆ బంట్రౌతులు ప్రధానయాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు –ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా ఆ బంట్రౌతులు–ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు–మీరు కూడ మోసపోతిరా? అధికారులలోగాని పరిసయ్యులలో గాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రమెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకుమునుపు ఆయనయొద్దకు వచ్చిన నీకొదేమువారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాటవినక మునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు–నీవును గలిలయుడవా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి అని యోహాను 7:45-53లో ఉంది చూడండి. నీకొదేము యేసు తరపున లేఖనానుసారముగా నిర్గమకాండము 23, ద్వితీయోపదేశకాండం 1:16 ఉపయోగించి స్టాండ్ తీసుకోవడం కౌన్సిల్‌లోని మిగిలినవారు నీకొదేము మాటలను నిర్మొహమాటంగా తోసిపుచ్చటం తద్వారా నీకొదేము శిష్యత్వపు నిందను భరించడం మనం చూడొచ్చు.
తర్వాత నీకొదేమును గురించి యోహాను 19:39లో ఉంది చూడండి. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను అని చెప్తూ వుంది.
నీకొదేము యేసేపులు ఒకరేమో యేసు బరియల్ కోసం పర్మిషన్ తెచ్చారు మరొకరు యేసు దేహాన్ని బరియల్ చెయ్యడానికి అవసరమైన సుగంధ ద్రవ్యములను తెచ్చారు.
యోహాను నీకొదేమును గురించి పరిమితముగా తెలియజేయటం మూలన్న అతనిని గురించి మనకు పరిమితముగానే తెలుసు. ఇతడు యేసును దేవుని యొద్ద నుండి వచ్చిన వానిగా విశ్వసించాడని రాత్రిపూట రహస్యంగా యేసు దగ్గరకు వచ్చి యేసుని పట్ల తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరచియున్నాడని యేసు పక్షముగా సన్హెడ్రిన్ సభలో మాట్లాడి యున్నాడని యేసుని బరియల్ లో యేసుకు సుగంధ ద్రవ్యములు పూయడానికి తెచ్చాడని తప్పితే యేసు సమాధి తర్వాత నీకొదేమును గురించి బైబిల్ మౌనంగా ఉంది, కాబట్టి అతనిని గురించి ఏమి తెలియదు.
అన్వయింపుగా, క్రీస్తును గౌరవించడం గొప్ప విషయమే, కానీ క్రీస్తును ఒప్పుకోవడం మాత్రమే సరిపోదని ఒకడు రక్షింపబడాలంటే ఆధ్యాత్మిక మార్పులేకుండా ఆత్మమూలముగా జన్మించకుండా ఒకడు రక్షింపబడలేడని ఒక వ్యక్తి యేసును ఒప్పుకోవడానికి రావడమంటే అతడి ఒప్పుకోలును తెలియజేయడమంటే అందుకు తెగువ ధైర్యం కావాల్సి ఉంది త్యాగం చెయ్యాల్సి ఉంటుంది. వెలను చెల్లించాల్సి ఉంటుంది, strugglesని పేస్ చెయ్యాల్సి ఉంటుంది అన్నింటికీ మించి కిరీటాన్ని గెల్చుకోవాల్సి ఉంటుంది. ఆ కిరీటాన్ని గెల్చుకొనేందుకు దేవుడు మిమ్మును బలపరచును గాక.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.