హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని వుంది చూడండి. స్థితిని పునరుద్ధరించడానికి చేసే శుద్ధికరణ ములో విభిన్నమైన ప్రక్షాళనలు ఉండేవి అని ఈ వచనము తెలియజేస్తూవుంది.
ఈ విషయాన్నే మార్కు 7:1-4 చెప్తూవున్నాయి, చదువుకొందాం: 1యెరూషలేమునుండి వచ్చిన పరిసయ్యులును శాస్త్రులలో కొందరును ఆయనయొద్దకు కూడివచ్చి 2ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనము చేయుటచూచిరి. 3పరిసయ్యులును యూదులందరును పెద్దల పారంపర్యాచారమునుబట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. 4మరియు వారు సంతనుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకొంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలనుకుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేకాచారము లను వారనుసరిం చెడివారు. బైబిలులో ఇక్కడ బాప్టిజో అనే మాట వాడబడియున్నది. బాప్టిజో అనే మాటకు నీటితో కడుగుకోవడం నీటిని చల్లుకోవడం నీళ్లలో ముంచటం అని అర్ధమన్న మాట. బాప్తిస్మము అనే మాటకు గ్రీకు అర్ధము ఇదేనండి. (కడుగుట ముంచుట) అనే మాటకు (ఫుట్ నోట్స్ లో) ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని వుంది చూడండి.
ఉదాహరణకు, ఒకడు బహుగా పక్షవాతము వచ్చి భాదపడుతూవున్నాడనుకోండి. వాడు బాప్తిస్మము ఇమ్మని అడిగాడు. ఎలా ఇస్తాం. ముంచితే వాడు మరణించే ప్రమాదముంది. పొరపాటన మరణిస్తే వాన్ని హత్య చేసిన వారము అవుతాము. శిక్షార్హులం. ప్రతిసంవత్సరం, ఆఫ్రికన్ దేశాలలో చాలామంది ముంచుడు బాప్తిస్మములు మాత్రమే కరెక్ట్ అని వాదిస్తూ అనేకులకు బాప్తిస్మము ఇస్తూవున్నారు మంచిదే. కాని వారిలో అనేకులు తమ చేతులను కాళ్లను కోల్పోతున్నారు మరికొందరు మొసళ్ల బారిన పడి మరణిస్తూవున్నారు. ఏమందాము?
చాలామంది మీరు బాప్తిస్మము తీసుకున్నారా అని అడుగుతూవుంటారు? మీరు బాప్తిస్మము తీసుకున్నారా లేక బాప్తిస్మము పుచ్చుకొన్నారా? రెండింటికి చాలా తేడా ఉందండి. బాప్తిస్మము తీసుకోవడమంటే అది మన స్వంత ఆలోచన, నిర్ణయము, సామర్ధ్యమునుబట్టి మనకు మనముగా తీసుకోవడం. క్రీస్తును నమ్మని ప్రతి ఒక్కరు వారి పాపములను బట్టి అతిక్రమములను బట్టి చచ్చిన వారైయుండగా వాళ్ళు ఎలా నిర్ణయము తీసుకోగలరండి? తమకున్న సామర్ధ్యమును బట్టి బాప్తిస్మమును ఎవడన్నా తీసుకోగలడా? ఏ ఒక్కడు తన స్వంత నిర్ణయము వలన ఆలోచనవలన యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచలేడు ఆయన యొద్దకు రాలేడు. పరిశుధ్ధాత్ముడు సువార్త వలన మనలను పిలిచి తన వరములవలన మనలను వెలిగించి విశ్వాసమునందు వుంచుతూ వున్నాడు. ఇది దేవుని కృపావరమే. కాబట్టి మనము బాప్తిస్మమును పుచ్చుకొంటూ వున్నాము. పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని 1 కొరింథీయులకు 12:3 చెప్తూవుంది.
దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.